Home ఇంద్రధనుస్సు నా డైరీ లో ఓ పేజీ…..

నా డైరీ లో ఓ పేజీ…..

by రూపాదేవి

తన పేరు…..

మా ఇల్లు టౌన్ అయిపోయాక వెలుపల టౌన్ బయట ఉంటుందీ. ఆఫీస్ టైమ్ కి వెళ్ళే బస్ లో అందరి కంటే చివ్వరగా ఎక్కేది నేనే ఊరి చివ్వర ఉంటాను గదా అందుకని.
బయట ఎవరు ఉన్నారో తెలియనంత రష్ ఉన్నాగానీ అక్కడ బస్ ఆగింది అంటే, అపుడు బస్ ఎక్కేది నేనే అనీ చూడకుండానే రోజూ వచ్చే వారికి తెలిసి పోతుంది. ఆఫీస్ లకు వెళ్ళే టైమ్ కావడం వల్ల, బస్ ఊరంతా దాటినంక నా ప్లేసుకు వచ్చే సరికే బస్ పూర్తీగా నిండి వస్తుంది. నాకు దాదాపు సీటు దొరకదు. ఎక్కడో ఓ చోట సర్దుకొని కుచోవాలి, వద్దు అనుకుంటే నిల్చోవాలి. అలా ఉంటుంది రోజూ.
అదే బస్ లో ఓ పది మంది దాక రెగ్యులర్ గా ఎక్కుతుంటాం. డైలీ ఎక్కే వాళ్ళు అంత మంది ఉన్నా… నేనంటే ఎందుకో తనకు ప్రత్యేకత.
తను మిగితా వారితో మాట్లాడినట్టు కూడా నేను ఎప్పుడూ చూడలేదు. కానీ మేము మాత్రం రోజూ కళ్ళతోనే పకరించుకుంటాం.
నన్ను తన మనిషిలా ఫీల్ అవుతుంది.
నా కంటే ముందే టౌన్ లోనే ఎక్కడో బస్ ఎక్కి ఉంటుంది. నేను ఎక్కీ ఎక్కగానే నాకోసం సీటు సర్దుబాటు చేస్తుందీ. తను కూచున్న సీట్లో ముగ్గురూ నిండి ఉంటే ఇంకెక్కడైనా ఖాళీ ఉందేమో చూస్తుంది. ఉంటే అందులో ఉన్న వాళ్ళను సర్ధుకోమని చెప్పి, ‘ఆడ కుచో మేడం’ అని నాకు పురమాయిస్తుంది. అక్కడ కుచోడానికి ఒకవేళ నేను ఇబ్బంది పడుతుంటే.. “నేను ఆడికి పోతా నీవు ఈడ కూసో మేడం” అని అంటుంది. నేను “పరవాలేదు నేను నిల్చుంటా అని వారిస్తే”, తాను ముందుకి జరిగి నాకూ కాస్త చోటు ఇస్తుంది.
ఇవ్వాళ బస్ లో ఉన్నంత సేపూ మళ్ళా మళ్ళా అనిపించింది ‘ఎందుకు తనకు నేనంటే ఆపెచ్చా…!?’

వయసు దాదాపు 55 వుంటుంది కావచ్చు, మనిషి సన్నగా ఉంటుంది, అంత వయసు లో కూడా జుట్టు మాత్రం నల్లగా ఉంటుంది. ఏదో ఫార్మాలిటీ కోసం అన్నట్టుగా ఆడోటి ఆడోటి తెల్ల వెంట్రుకలు ఉంటాయనుకోండి. సన్నని ఓ అర మూరెడు జడ వేసుకుంటుది. జీవితంలో ఎన్ని భాద్యతలు మోసిందో మరి అవి తెలియజేయడానికా అన్నట్టు మోహం మీద వయసుకు మించిన ముడతలు. పల్చటి చర్మం చూడ్డానికి కాస్త రంగు తక్కువ గానే అనిపిస్తుంది గానీ యవ్వనంలో ఉన్నపుడు ఎరుపు రంగులోనే ఉండి ఉంటుంది. భర్త పోయినట్టుంది. చేతులకు చెరో వైపు రెన్రెండు వన్ గ్రామ్ గోల్డ్ గాజులు వేసుకుంటుది, చిన్న నల్ల టికిలీ బొట్టు పెట్టుకుంటుంది. కళ్ళు పెద్దవే.. కానీ గుంతలు పడి కాస్త ఎర్రగా ఉంటాయి. మామూలు రేటు లో జార్జెట్ చీరలు కట్టుకుంటుంది. బహుశా మోకాలి నొప్పులేమో కాళ్ళు కాస్త వంచి నడుస్తుంది బస్ దిగేటప్పుడు వేసే ఆ రెండు అడుగులు కూడా నెమ్మదిగా వేస్తుంది.*
నేను దిగే స్టాప్ కంటే ముందే తాను దిగి పోతుంది. ఆ ఊర్లో అటెండర్ గా చేస్తోంది అనుకుంటా… బహుశా భర్త చనిపోతే తనకు ఈ జబ్ వచ్చినట్టుంది. సాయంత్రం రిటన్ లో నాకంటే ముందుగాలనే వెళ్ళిపోతుంది.
పక్క పక్కనే కూర్చున్నా నా మటుకు నేను చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటుంటా, తను కూడా మౌనంగా ఏమీ మాట్లాడదు.
మరి ఎందుకు నా పట్ల తనకు ఇంత అపేక్ష, ఆదరం.
నాకూ తనంటే అభిమానం, తను బస్ లో కనబడితే సంతోషంగుంటది.
ఇలా దాదాపు మూడేళ్లుగా సాగుతోంది.
విచిత్రమైన విషయం ఏంటంటే నాకు ఎపుడైనా బస్ మిస్ అయ్యి వెనక బస్ లో ఎక్కితే.. తను కూడా ఆ బస్ లోనే వుంటుంది. కోఇన్సిడెన్స్ గా తనకూ ఆరోజే లేటైయ్యింటది.
నిజంగా విడ్డూరం అనిపించడం లేదూ…?!
ఇక ఇప్పుడు ట్విస్ట్ చెప్పనా… తన పేరేమిటో నాకు ఇప్పటికీ తెలియదు.
భలే ట్విస్ట్ కదా…?!

చాలా సార్లు అనుకుంటా పేరు అడగాలని. కానీ తను ఫీలవుతుందేమో నని అడగలేక పోతున్నా… ఇన్నాళ్ళుగా నా పేరే తెలియదా… అనుకుంటుందేమో నని…
ఇది నా మొహమాటమో.. లేక తను బాధ పడకూడదనో మరి..
చాలా సార్లు అలా జరుగుతుంది కదా…చేయాలనుకుంటున్నా చెయ్యలేము.

ఇంతకీ ఆవిడ పేరు ఏమిటో..
మా మధ్య ఉన్నది స్నేహ భావనా లేక మమకారమా…?
స్నేహ భావన అనుకుందామంటే సమ వయస్కులం కామూ…
మమకారం అనుకుందాం మంటే ఏ సంబంధమూ లేదు.

స్నేహానికి వయసుతో సంబంధం లేదు, స్థాయితో పని లేదు, మమకారానికి రక్త సంబంధము ఉండాలని లేదు, చదువు, హోదా దిగదూడుపు కదా… మనల్ని అన్ కండీషనల్ గా అభిమానించే వారే మనవారు…అలా ఒక్కరిని కలిగి ఉన్నా అది అదృష్టం.

ఇంతకీ ఆ పెద్దావిడ పేరు నాకు ఎప్పటికి తెలిసేనో….?!?

-రూప
22.10.21

You may also like

1 comment

కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి October 29, 2021 - 5:14 am

శ్రీమతి రూపాదేవి గారి రచన మానవీయచిత్రం. అభినందనలు.

Reply

Leave a Comment