Home వ్యాసాలు “పరిశోధన కెత్తిన జయకేతనం”-

“పరిశోధన కెత్తిన జయకేతనం”-

by B. Anjaneyulu

ఆచార్య వెలుదండ  నిత్యానందరావు

   “ లోకంలో ఎంతో మంచితనం ఉంది. ఎందరెందరో ఎన్నో తీరులుగా వారి వారి స్థాయిలో మంచి పనులు చేస్తున్నారు. ఎదుటివారి పట్ల ప్రేమాభిమానాలు పంచడం మంచిని పెంచడం కృతజ్ఞతా శీలాన్ని, పరోపకార స్వభావాన్ని కలిగి ఉండడం లాంటి సల్లక్షణాలను అనుభవంలోకి తెస్తున్న పెద్దలందరికీ నమస్కరిస్తున్నాను”…అని షష్టిపూర్తివేళ నిత్యానందరావుసారు చెప్పు(రాసు)కొన్న ఈ వాక్యాలను  గుంటూరులోని అన్నమయ్య గ్రంథాలయంలో పెద్దగా టైప్ చేసి అతికించారు. ఇది నిత్యానందరావుకు లభించిన ఘన సత్కారమే అని చెప్పవచ్చు.

సాహిత్య రంగంలోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరూ తమకంటూ ప్రత్యేక స్థానం ఉండాలని ఆరాటపడతారు . రచనా పాటవం చేత, కవితాసృజనం చేత, వక్తృత్వకళచేత, పరిశోధనతత్పరతచేత, సంస్థాగతగత నిర్వహణంచేత, భావజాలాలచేత, ఆకర్షణీయపాఠ ప్రవచనం చేత, సహాయ సహకారాల నందించడంచేత  ఉస్మానియా తెలుగు శాఖ ఆచార్యులైన ఆనాటి రాయప్రోలు నుంచి ఈనాటి ఎస్.రఘు దాక ఒక్కొక్కరిది ఒక్కొక్క పంథా, ఒక్కో విలక్షణశైలి .   

గత 40 సంవత్సరాలుగా నిత్యసాహిత్య కృషీవలుడనీ, నిత్యవిద్యార్థిఅనీ, నిత్యపరిశోధకుడనీ, పరిశోధకరాక్షసుడనీ, పరిశోధకపరమేశ్వరుడనీ సర్వుల చేత కీర్తింపబడుతూ పరిశోధకరంగంలో  తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకొన్నవారు   ఆచార్య వెలుదండ నిత్యానంద రావు.

“సాధుసంగంబు సకలార్ధ సాధనంబు” అంటాడు భర్తృహరి. నిరంతరం సజ్జన సాంగత్యం చేత వివేకం ఉదయిస్తుంది. నిత్యానందరావు గారి జీవితంలో అది అక్షర సత్యం. డిగ్రీ చదివే రోజుల్లో శ్రీ రంగాచార్యులు కపిలవాయి లింగమూర్తి, మామిడన్న సత్యనారాయణ మూర్తి ; విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించిన తర్వాత బిరుదు రాజు రామరాజు, నాయని కృష్ణకుమారి, సినారె వంటి ఉద్దండ పండితుల వద్ద శిష్యరికం కొనసాగింది.  ఇలా వారి ప్రయాణమంతా తెలుగు సాహిత్యం చుట్టే పరిభ్రమించింది. అందుచేతనే సాహిత్యంలోని అనేక విషయాలను పరిశోధనాత్మక కోణంలో శోధించి గొప్ప సాహిత్య రాశిని పోగు చేసి పరిశోధనా రంగానికి దివిటీగా నిలిచారు. సాహిత్య చరిత్ర ఒక్కటి సూటిగా రాయలేదు గాని, అంతకుమించి చర్చ, సమీక్ష చేశారు.

పాండిత్య వారసత్వం గల శ్రీ వెలుదండ రామేశ్వరరావు లక్ష్మమ్మ దంపతులకు 1962 ఆగస్టు 9వ తేదీన నాగర్ కర్నూల్ జిల్లా మంగనూరులో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం మంగనూరులోనూ తదుపరి  డిగ్రీ విద్యాభ్యాసం శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల పాలెంలో జరిగినది. ఉన్నత విద్య ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో కొనసాగినది. పీజీ చదివే రోజుల్లోనే యుజిసి వారు నిర్వహించే NET పరీక్షలో JRF అర్హతసాధించారు.” చంద్రరేఖా విలాపం -తొలి వికట ప్రబంధం” అను అంశంపై ఎంఫిల్,“తెలుగు సాహిత్యంలో పేరడీ”అను అంశాల మీద ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పూర్తి చేశారు. 1988 లో తెలుగు శాఖలో పార్ట్ టైం లెక్చరర్ గా మొదలుపెట్టి  అదే శాఖలో ఆచార్యులుగాను పాఠ్యప్రణాళికా సంఘం అధ్యక్షులుగా, తెలుగు శాఖ అధ్యక్షునిగా. వివిధ హోదాల్లో పేరు ప్రఖ్యాతులు పొందారు.  పదవీ విరమణ పొందే వరకు గొప్ప పరిశోధకుడిగా, సమీక్షకుడిగా, విమర్శకునిగా, కథకునిగా, సంపాదకుడిగా విశేషమైన సేవ చేశారు. ఎంతటి వివాదాస్పదాంశం పట్లనైన నొప్పించక తానొవ్వక అను చందంబున విమర్శించగలిగే ప్రతిభాశాలి.

చిన్నతనంలోనే పుస్తక పఠనం అలవడి, పాఠశాల స్థాయిలోనే రచన వ్యాసంగానికి శ్రీకారం చుట్టారు.  18 వ ఏటనుంచి వివిధ పత్రికల్లో వారి రచనలు రావడం ప్రారంభమైంది.  “వాగ్దేవి” శీర్షికన మొదటి పద్య రచన 1979 లో సమాలోచన పత్రిక ప్రచురించినది. 1982లో డిగ్రీ ద్వితీయ సంవత్సరంలోనే “పరిశీలన” పత్రికలో వారి అష్టవిధ శృంగార నాయికలను గూర్చి రాసిన పద్యం ఎంతో విశిష్టమైనది. విద్యార్థులకు ఉపయోగకరమైనది. ఆ వయసులోనే ఛందో వ్యాకరణ అలంకారాది విషయాలను ఒంట పట్టించుకొన్నారు.  

భర్తను స్వాధీనపరచుక సుఖియించు

పద్మాక్షి స్వాధీనపతిక యగును

పతివచ్చుసమయాన వాసమ్ము సరిజేయు

జలజాక్షి వాసకసజ్జిక యగు

విభుడు జాగు సలుప విరహార్త యగునట్టి

తరళేక్షణ విరహోత్కంఠిత యగు

విభుడు రాకుంటచే విరహమే మిగిలిన

లలితలోచన విప్రలబ్ద యగును

పరకాంతతో గూడి పతిరాగ దూషించు

కంజాయతేక్షణ ఖండిత యగు

పతితోడ పోట్లాడి పరితాపమును చెందు

నళిననేత్ర కలహాంతరిత యగును

భర్త దూరదేశమ్మున బరుగునట్టి

వనజలోచన ప్రోషితభర్తృక యగు

విరహమును సైపజాలక విభుని కడకు

చనెడు చారులోచన యభిసారిక యగు

  1980 లో తన పాఠ్యభాగంగా ఉన్న కుమార సంభవ పంచమసర్గ లో కొంత భాగాన్ని సంస్కృతం నుండి తెలుగు చేశారు. మొదట పద్యం, వచనకవిత్వం, సమస్య పూరణలు, నాటికలు, అనువాదాలు చేసినా  తర్వాతి కాలాల్లో పరిశోధన వ్యాసరచనల్లో రాటుదేలారు. 20 ఏళ్ల ప్రాయంలోనే రాజకీయాలపై అవగాహనతో ప్రజా సమస్యల పై పత్రికల్లో వ్యాసాలు రాయడం, పేరడీ పద్యాలు రాయడం రాజకీయ విశ్లేషణ చేయడం కనిపిస్తాయి.

 పదవీ విరమణ చేసే నాటికే వారి  సాహిత్యాన్నంతా దాదాపు నాలుగువేల పుటల్లో   7 సంపుటాలుగా తీసుకువచ్చారు. ఈ సంపుటాల్లోనే కొన్ని రచనలు అంతకు పూర్వమే ముద్రణ పొంది  ఉన్నాయి. వారి ఏడు సంపుటాలు వరుసగా

  1. అనుభూతి అన్వేషణ    2. అక్షరమాల         3. వాగ్దేవి వరివస్య                   4. పరిశోధక ప్రభ

         5. వ్యాస శేముషి            6. సృజనానందం     7. ఆదర్శ పథం

  1. అనుభూతిఅన్వేషణ:

సమగ్ర సాహిత్యం ప్రచురణ పరంగా మొదటి సంపుటం. 9-8-2022  మూసి సాహిత్య ధార ఆధ్వర్యంలో 60 పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కృతమైనది. నిత్యానందరావు గారు1982 లో మొట్టమొదట రాసిన గ్రంథ సమీక్ష మోపిదేవి కృష్ణస్వామి గారి అన్వేషణఅనుభూతి. ఈ సంపుటానికి కూడా ఆ గ్రంథ సమీక్ష పేరే పెట్టారు. కాకపోతే అన్వేషణఅనుభూతి కాస్త అనుభూతిఅన్వేషణగా మార్చారు. 147 గ్రంథ సమీక్షలు,  82 పీఠికలు గల గొప్ప పుస్తకం ఇది. ఏ పుస్తకాన్ని సమీక్షించినా దాన్ని నిశితంగా విశ్లేషిస్తూ , గ్రంథ సారం, శైలి, గుణదోష చర్చ చేశారు.“ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి సిద్ధాంత గ్రంథాన్ని చూస్తే వచన రామాయణాల వివరాలు తెలుస్తాయి, వాటి ఆధారంగా వచన రామాయణాలపై డాక్టరేటు చేయవచ్చు అని చెప్పారు. పుస్తక ప్రాముఖ్యతను, దాని పీఠికను చూసి తెలుసుకోవచ్చు.  పీఠిక రాసే వ్యక్తి కూడా సాహిత్యం పైన అంతే సాధికారత కలిగిన వాడై ఉండాలి. వ్యక్తిపూజ కన్నా విషయ నిష్ఠంగాను, రచయిత శక్తిని సామర్ధ్యాన్ని కచ్చితంగా అంచనా వేయగలగాలి. పుస్తకం ఏ ప్రక్రియలో ఉంటే ఆ ప్రక్రియలో లీనమై, విషయ వైవిధ్యాన్ని, రచయిత హృదయాన్ని, భావుకతను, బేరీజు వేయగల సమర్థులు నిత్యానందరావు. జంగాహనుమంతరాయచౌదరి, తూమురామదాసు లాంటివారి రచనల మీద,  మిత్రుల, విద్యార్థుల రచనల మీద ఆత్మీయమైన విషయనిర్భరమైన, సాధికారికమైన పీఠికలు రాశారు నిత్యానందరావు.

  • అక్షరమాల:

 ఇందులో చాలా వ్యాసాలు వారి చిన్నతనంలోనే రాసినవి. దీనిలో వ్యక్తిత్వ సౌరభం, సాహిత్య సౌరభం అనే రెండు విభాగాలుగా చేశారు. వ్యాసాల్లో రాసే ప్రతి అంశం విషయ ప్రాధాన్యత,  పరిశోధనతత్పరతతో కూడుకున్నవై ఉంటాయి. చదివిన పనిచేసిన కళాశాలకు లేదా సంస్థకు ఏ రూపంగా నైనా రుణం తీర్చుకోవాలి అంటారు వారు.ఈ సంపుటిలో ఎక్కువ వ్యాసాలు ఉస్మానియా తెలుగు శాఖ ఆచార్యుల సాహిత్య సేవకు సంబంధించినవి. తెలుగు శాఖ మీద వారికున్న అపార అభిమానం, గురువుల మీద అచంచలమైన  అనురాగాన్ని రెండు వ్యాసాల్లో వివరించారు. పనిచేసిన మూడు కళాశాలలకు సంబంధించి ఎవరు ఇంతవరకు చెప్పనటువంటి కొత్త విషయాలను వారు వెలుగులోకి తీసుకువచ్చారు. విశ్వనాథసత్యనారాయణగురించి రాస్తూ ఆయన చదివిన ఆంగ్లగ్రంథాలను పేర్కొన్నారు. ఆంధ్ర యునివర్సిటీ బి.ఏ మొదటి బ్యాచ్ విద్యార్థి  ఆండ్రశేషగిరిరావు నిర్వహించిన ఆంధ్రభూమి మాసపత్రిక విశేషాలను సోదాహరణంగా వివరించారు. భారతదేశంలో తొలి ఎం.ఎ పట్టభద్రురాలు  బెంగాల్ కు చెందిన చంద్రముఖిబోస్, బంకించంద్రచటర్జి, శరత్ బాబు లాంటి బంగాలీయుల గురించి; దుబ్బాక రాజశేఖరశతావధాని, పుట్టపర్తి నారాయణాచార్య, కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై, భూతపురి సుబ్రహ్మణ్యశాస్త్రి, విద్వాన్ విశ్వం లాంటి రాయలసీమకవులగురించి. కోవెల సంపత్కుమార, సుప్రసన్నాచార్య, చేకూరిరామారావు, . ఆదిరాజు వీరభద్రరావు, జే. బాపురెడ్డి, కాళోజి, దాశరథి లాంటివారిమీద, బోయిభీమన్న, జి. వి.సుబ్రహ్మణ్యం మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, గరిమెళ్ళసత్యనారాయణ లాంటి దిగ్దంతులమీద విలక్షణమైన వ్యాసాలున్నాయి

3.వాగ్దేవి వరివస్య:

ఈ సంపుటిని గూర్చిడాక్టర్ సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి వెలుదండ వారి వెలుగుదండ అని ముందుమాటలో అభివర్ణించారు. నిజంగానే ఈ సంపుటి వారికి వెలుగులదండే. అన్నింటినీ మించి ఈ పుస్తకానికి ఒక విశేషం ఉన్నది. ఇందులో చాలా వ్యాసాలు వారి డిగ్రీ కాలానికి మునుపే వచ్చాయి. ఇంటర్మీడియెట్(నిత్యానందరావు చదివింది ఇంటర్మీడియెట్ అనకుండా డిప్లొమా ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్ అంటారు.  ) విద్యార్థిగా ఉన్నప్పుడే తెలుగు రాజులు సంస్కృత భాషా సేవ అనే వ్యాసం సమాలోచన సాహిత్య పత్రికలో 1979లో ప్రచురితమైనది. ఆనాటికి  సరిగ్గా వారికి 17 సంవత్సరాల వయసు. బి ఏ చదువుతున్న కాలానికే ఈ పుస్తకం లోని ఆరు వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి అంటే ఆశ్చర్యకరమే. తెలుగువారు ప్రాకృత, హిందీ, తమిళ, ఉర్దూ, ఒరియా, కన్నడ, భాషలకు చేసిన సేవను, మరాఠీ తెలుగు భాషల బాంధవ్యాలను వివరించారు. ఇవన్నీ పెంచుకొని రాసుకొంటే ప్రత్యేక పరిశోధనాంశాలవుతాయి. కానీ ఇంతవరకు అలా ఎన్ని జరిగాయో ఆలోచించాలి.   తెలుగు ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశాలు చేసిన భాషా సేవను, శాతవాహన కాలం నాటి ప్రాకృత భాషా ప్రక్రియ అయిన గాథను, గాథలోని రకాలను, గాథల్లో చిత్రించబడిన సాంఘిక జీవిత విశేషాలను, గాథాసప్తశతికి వచ్చిన అనువాదాలను సమగ్రంగా వివరించారు. 11 భారతీయ భాషా సాహిత్యాల ప్రగతికి పాశ్చాత్యుల దోహదాన్ని సమగ్రంగా వివరించారు. వీటిల్లో ఏనాడు మనకు వినడానికి అవకాశం లేని ఎన్నో కొత్త అంశాలు ప్రస్తావింపబడి ఆశ్చర్యం కొలుపుతాయి.   అనువాదాలను ప్రత్యేకించి పరిశీలిస్తూ అనువాద కృషికి ప్రత్యేకంగా ఒక అకాడమీ ఉండాలని ప్రతిపాదించారు, తెలుగు కవిత్వం ఆంగ్లంలోకి అనువాదం చేయబడ్డ విధానాన్ని ఆంగ్లంలో ఆంధ్ర కవిత అనే వ్యాసంలో వివరించారు. వి.వి.బి.రామారావు అనువాద కృషిని, తిక్కన భారతాన్ని ఇంగ్లీషులోకి అనువదించిన గుర్రం వెంకట సుబ్బరామయ్య ప్రతిభను తెలుగు పాఠకలోకంలోకి తీసుకువచ్చారు.“మంగనూరు ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థుల తెలుగు భాషమాండలిక ధోరణిపరిశీలనభాషాశాస్త్ర విద్యార్థిగా పీ.జీ డిప్లొమా చేస్తున్నపుడు  రాసిన వ్యాసం. కొందరు బెంగాలీ కవులు రచయితలు పరిచయం కింద 65 మంది బెంగాలీ కవుల సాహిత్యాన్ని పరిచయం చేశారు. ఇంటర్నెట్ ఇంకా అందుబాటులోకి రాని ఆ కాలంలోనే ఇంత సమాచారం సేకరించారంటే దానికి వారు ఎంత పరిశోధన చేశారో గమనించవచ్చు. సాహిత్య వరివస్య అను విభాగం కింద 27 వ్యాసాలు ఉన్నాయి. ఇవన్నీ వివిధ ప్రక్రియల పైన రాసినవే. ఇందులోని విశ్వనాథ- తెలుగు సినిమావ్యాసంలో విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేయవలసినంత విషయం ఉన్నది. “కృష్ణా కవిత్వ తరంగ శీకరాలు”,“గోదావరి గలగలలుఆ నదుల నేపథ్యంగా వచ్చిన కవిత్వాన్నంతా క్రోడీకరించాయి. అభ్యుదయ, దేశభక్తి, జాతీయోద్యమ కవిత్వాన్ని మూడు వ్యాసాల్లో సమగ్రంగా రాశారు. “తెలంగాణ కథానికా క్రమం బెట్టిదనిన”, “నిజాం పాలనలో వెలవెలబోయిన తెలుగు వెలుగు”, “తెలంగాణలో విజ్ఞాన సర్వస్వాలు -సూచీ గ్రంథాలు- నిఘంటువులు అన్నవి తెలంగాణ సాహిత్య కేంద్రంగా సాగినవి. “కల్వకుర్తి కవుల కవన కుతూహలరాగం అను వ్యాసం  ఆ ప్రాంత కవుల సాహితీ సేవను ప్రకటించినది. ఏ విషయాన్ని తీసుకున్న సమగ్రంగా ఉంటుందని చెప్పడానికి ఇదో నిదర్శనం.“తెలుగు పరిశోధన వర్తమాన స్థితిగతులు అన్న వ్యాసంలో నేడు పరిశోధనలు సాగుతున్న తీరును, ప్రభుత్వ విధానాలను, యూనివర్సిటీల పనితీరును, ఆవేదనాత్మకంగా చెప్పారు. ఏ సందర్భం వచ్చినా, ఏ వ్యాసం రాసినా ప్రతిచోట పరిశోధన దృక్పథం తొంగి చూడడం వారికే దక్కినది.

4. పరిశోధక ప్రభ:

విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన:

సాధారణంగా పీజీ విద్యానంతరం ప్రతివిద్యార్థి లక్ష్యం ఎంఫిల్ చేయడం,  పిహెచ్డి చేయడం. దానికి సంబంధించిన పరిశోధనాంశం గూర్చి తర్జనభర్జన పడి చివరికి ఓ విషయాన్ని నిశ్చయించుకొని, ఆ అంశం పైపూర్వ పరిశోధనలు సమాచారం తెలియక చాలాసార్లు పరిశోధనాంశాన్నే మార్చుకున్న పరిస్థితులు కనిపిస్తాయి. కానీ దానికి వెలుదండ నిత్యానందరావు గారు విరుద్ధం. ఆ సమస్యను గమనించి ఒక సంస్థ, ఒక యూనివర్సిటీ, ఒక పరిశోధనా స్థానం చేయవలసిన పనినంతా అన్నీ తానై మోసి మూడు ముద్రణలు పొందిన విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన అనే గ్రంథానికి రూపశిల్పి అయ్యారు. కవిత్రయం నుండి ప్రారంభిస్తే సాహిత్య రంగంలో పరిశోధన సాగిన అనేక విషయాలను సమగ్రంగా వర్గీకరించి 5225 పరిశోధనాంశాలను 61 శీర్షికలతో విభజించి ఆయా విభాగాల క్రింద జరిగిన పరిశోధనలన్నింటినీ ఒకచోట చేర్చారు. పరిశోధనాంతరంగం అనే పేరుతో రాసిన పీఠికలో పరిశోధనాంశ నిర్ణయం నుండి పట్టా పొందు వరకు గల సమస్యలను,  చూపవలసిన జాగరుకతను, వదులుకోవలసిన జాడ్యాలు, పరీక్షకుల పరిశోధకులకు సంబంధించిన సూచనలు చేస్తూ అనేక అపూర్వ విషయాలను చర్చించారు. జరుగవలసిన ఎన్నో పరిశోధనాంశాలను సూచించారు.  ఈనాడు తెలుగులో పరిశోధన చేయాలనుకుంటున్న ప్రతి విద్యార్థి మొట్టమొదట చూసే పుస్తకం ఇదేనంటే ఆ పుస్తక ప్రామాణికత ఏమిటో చెప్పనవసరం లేదు. ఎంఫిల్ చేయక మునుపే అనధికారికంగా ప్రకటించుకున్న పీహెచ్డీ గ్రంథం ఇది.

చంద్ర రేఖ విలాపం-తొలి వికటప్రబంధం:

నిత్యానంద రావు గారి M.Phil సిద్ధాంత వ్యాసం చంద్ర రేఖ విలాపం. పేరుకు M.Phil పరిశోధనా గ్రంథం అయిన పీహెచ్డీకి తక్కువేమీ కాదు. కూచిమంచి జగ్గకవి రచించిన చంద్రరేఖ విలాపం ఆనాటి సమాజంలో బూతుల బుంగగా, నీచకావ్యంగా నిందను మూట కట్టుకుని, ఆనాటి సాహిత్యకారులు ఈ కావ్యం గూర్చి నోరు మెదపకుండా ఉండి, సాహిత్య చరిత్రలో దానికి స్థానం కల్పించలేదు. ప్రభుత్వమే ఆ కావ్యాన్ని నిషేధించిందంటే మామూలు విషయం కాదు. అట్లాంటి కావ్యం పైన ఎవరైనా పరిశోధన చేయాలనుకుంటారా? ఒకవేళ చేద్దామనుకొన్నా ఆచార్యులు ఒప్పుకుంటారా? కానీ నిత్యానందరావు గారు అందరినీ ఒప్పించి  ఆ పని చేసి విజయవంతంగా పూర్తి చేశారు. గైనకాలజిస్టు తన కళ్ళ ముందు ఉన్న సుందరిని రోగిగానే చూస్తాడు మరో విధంగా చూడడు. అలాగే చంద్రరేఖా విలాపం పైన చేసే పరిశోధన ఆ పరిశోధకుని సంస్కార రాహిత్యానికి గాని, మూర్ఖత్వానికి గాని నిదర్శనంగా తలపోయనవసరం లేదు. ఈ పరిశోధనలో విజయం పొందకపోతే క్షమించవలసిన అవసరం అంతకంటే లేదు అంటూ అందరిని మెప్పించగలగడం పరిశోధన పట్ల ఆయన ధైర్యప్రపత్తు లెలాంటివో   నిరూపిస్తాయి. బ్రౌన్ రాయించిన మద్రాసు ప్రాచ్య లిఖిత భాండాగారంలో ఉన్నటువంటి చంద్రరేఖావిలాపం అముద్రిత వ్యాఖ్యానాన్ని వెలుగులోకి తెచ్చి ఒక అధ్యాయంగా ఈ పుస్తకంలో రాశారు. విజయనగర సంస్థాన రాజకీయాల్లో నీలాద్రి రాజు పోషించిన పాత్రను- సాహిత్య పరిశోధకులు ఆయనను విస్మరించిన విధానాన్ని ,  జగ్గకవి కావ్యరచన మూలాన కలిగిన అవమానంతో మరణించలేదు అని, ఆయన పద్మనాభ యుద్ధం లో చనిపోయాడని చారిత్రక ఆధారాలతో నిరూపించాడు.

తెలుగు సాహిత్యంలో పేరడీ:

            పీహెచ్డీ పరిశోధనా గ్రంథం తెలుగు సాహిత్యంలో పేరడీ. ఇది1990 లో పట్టా పొంది 1994లో ముద్రితమైనది.  ప్రాచీన తెలుగు కావ్యాల నుండి మొదలుకుంటే ఆధునిక కావ్యాలు , నవల కథానికాది ప్రక్రియలు, జానపద సాహిత్య గేయాలు, వివిధపుస్తకాలపై రాసిన పేరడీసాహిత్యాన్నంతా తవ్విపోసిన పరిశోధన గ్రంథమిది. ఇప్పటివరకు తెలుగు సాహిత్యంలో పేరడీ పై వచ్చిన సమగ్రమైన పరిశోధన. మొదటి అధ్యాయంలో పేరడీ స్వరూప స్వభావాల లక్షణ చర్చ చేస్తూ ఒక మాతృకకు అధిక్షేపాత్మకమైన హేళనాత్మకమైన హాస్యాత్మకమైన విషయాంతరంతో కూడిన అనుకరణే పేరడీ అని నిర్వచించారు. పేరడీ సాహిత్యం పైన పరిశోధన తపన డిగ్రీ స్థాయిలోనే ఉదయించినది. 1983లో ఆంధ్రప్రభ పత్రికలో రాజకీయ భాగోతంఅన్న పేర భాగవత పద్యాలకు రాసిన కార్టూన్ పేరడీలు ఎందరో ప్రశంసలను పొంది ఈ పరిశోధనకు మరింత ఉద్దీపనను చేకూర్చింది. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి పేరడీకవిగా తెనాలి రామకృష్ణుని నిరూపించి, క్రీడాభిరామకర్త వినుకొండ వల్లభ రాయుడు, కూచిమంచి జగ్గకవి ఆధునికుల్లో జలసూత్రం రుక్మిణీ నాథశాస్త్రి, మాచిరాజు దేవి ప్రసాద్, శ్రీ శ్రీ , జొన్నవిత్తుల వంటి వారి పేరడీ విన్యాసాన్ని సముచితంగా వివరించి ఎట్లాంటి అనుకరణలు పేరడీలు కావో నిస్సంకోచంగా తూచిన గ్రంథం ఇది. జర్మన్ విశ్వవిద్యాలయంలో వచ్చిన  పేరడీ-ఎ మెటఫిక్షన్ అనే సిద్ధాంతగ్రంథాన్ని సైతం  చదివి  తెలుగు పేరడీలకు అన్వయిస్తూ  పేరడీ లక్షణ చర్చ చేయడం గమనిస్తే నిత్యానందరావు ఎంత మారుమూలల్లో ఉన్న సమాచారాన్నయినా ఎంత ఒడుపుగా సేకరించి వాడుకొంటారో అర్థమవుతుంది.

5. వ్యాస శేముషి.

 వ్యాసశేముషి అనే ఐదవసంపుటంలో  సాంప్రదాయ సాహిత్యానుశీలనం, హాసవిలాసం అను రెండు విభాగాలుగా చేయబడినది. వివిధ సాహిత్య సదస్సులలో సమర్పించిన పరిశోధనాత్మక వ్యాస సంపుటి ఈ గ్రంథం. ఏ కార్యం చేసినా గణపతి స్తుతితో ప్రారంభించడం అనాది సంప్రదాయం. మంగళకరం. ఇందులోని మొదటి వ్యాసం కూడా గణపతి స్తుతితోనే ప్రారంభమైనది. కర్త ఎవరో తెలియని ఒక పద్యాన్ని   విమర్శనాత్మక దృష్టితో విశ్లేషించిన వ్యాసం అది. అందునా ఆ పద్యాన్ని వారికి ఎరుకపరచిన గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ కోదండరామ శర్మగారికి కృతజ్ఞతలు తెలిపిన విధం వారి ఔన్నత్యానికి తార్కాణం. ప్రతి వ్యాసంలోను తనకు తోడ్పడినవారిని స్మరించుకొని, కృతజ్ఞతలు తెలుపుకోవడం నిత్యానందరావు నిజాయితీ (Academic Honesty)కి నిదర్శనం.    కవిసార్వభౌముడు శ్రీనాథుని పై చేసిన సాహితీ చర్చ రెండు వ్యాసాలలో కనిపిస్తుంది. శ్రీనాథునిపై వెలువడిన పూర్వపు పరిశోధనలన్నింటినీ సమీక్షిస్తూ అదనపు సమాచారాన్ని పొందుపరచారు. పాల్కురికి సోమన, పోతన, రామదాసు అన్నమయ్య, కృష్ణదేవరాయలు మొదలగు కవులు, తెలంగాణ ప్రాచీన సాహిత్యం పైన చేసిన సవిస్తరమైన చర్చ వారి వ్యాసాలలో కనబడుతుంది.

హాసవిలాసం:

హాసవిలాసం  హాస్య విశ్లేషణాత్మక వ్యాసావళి.  హాస్యపు తీరుతెన్నులు హాస్య ప్రత్యేకతను వివరిస్తూ వేరువేరు సందర్భాలలో ప్రచురించబడిన 14వ్యాసాలు ఉన్నవి. హాస్యాన్నిగూర్చి చర్చించే రచయితకు సహజంగా చమత్కారశీలియై, హాస్యకారియై, హాస్యాన్ని పండించే జిజ్ఞాస, మనస్తత్వం ఉండాలి. నిత్యానందరావు ఎంత సీరియస్ గా వ్యాసాలు రాస్తారో మిత్రులవద్ద, విద్యార్థులవద్ద చమత్కారభరితంగా నవ్విస్తూ సంభాషిస్తూ అంత సరదాగా గడుపుతారు.   వారిలో దాగి ఉన్న  ఈ హాస్యపార్శ్వమే హాసవిలాసం లోని వ్యాసాల రచనకు, రాజకీయభాగోతం పేరడీ కార్టూన్లకు, పేరడీ పై పరిశోధనకు ప్రేరేపించాయేమో! తెలుగువారి హాస్యం, హాస్య తత్వ విచారం అనే వ్యాసాలలో హాస్యాన్ని గూర్చిన చర్చ, కందుకూరి గురజాడ, చిలకమర్తి, పానుగంటి, ముణిమాణిక్యం,  శ్రీ శ్రీ, కృష్ణశాస్త్రి వంటి వారి సాహిత్యంలోని హాస్యాన్ని గూర్చి చర్చించారు. కవన శర్మ, శ్రీరమణల వంటి ఆధునికులను గూర్చి కూడా పేర్కొన్నారు. కవనశర్మ రచించిన వ్యంగ్య కవనాలుఅన్న కథా సంకలనం గురించి చెబుతూమనలో జీర్ణించుకుని పోయిన హిపోక్రసీని దగుల్బాజీ తనాలను వేలెత్తి చూపుతూ భుజాలు తడుముకునేలా చేస్తాయి ఈ కథలు అంటారు. విశ్వనాథహాస్యం మీద ప్రణాళికాబద్ధంగా అధ్యాయవిభజనతో  రాసిన వ్యాసం నిత్యానందరావు విషయసేకరణ కోసం పడే తపన, ఓపిక, శ్రమశీలానికి నిదర్శనం.  విశ్వనాథసాహిత్యసాగరాన్ని ఈది ఎన్నెన్నో అపూర్వ హాస్య, చమత్కార రత్నాలను వెలుగులోకి తెచ్చి పాఠకులను, పండితులను ఆశ్చర్యానందమగ్నులను చేశారు.     

6. సృజనానందం:

నిత్యానందరావు సాహిత్యంలో పదును దేలుతున్న క్రమంలో అక్షరబద్ధం చేసిన అనేక లఘు రచనలు, అనుభవాలసమ్మేళనం ఈ సంపుటి. కృతిస్వీకృతి, జంబుమాలి, మార్గదర్శి వివేకానందుడు, వంశాంకురం వంటి నాటికలు, చమత్కారభరితమైన చెవిలో పువ్వు వంటి కథలు, సన్మాన పత్రాలు, రాజకీయ, ఆధ్యాత్మిక, సాంస్కృతికఅంశాలకు సంబంధించిన కొన్ని లేఖలు, నివేదికలు, పీఠికలు, సాహిత్య వ్యాసాలు, కళాశాల, పాఠశాలజీవితానికి సంబంధించిన కొన్ని వ్యాసాలు ఉన్నాయి.

7. ఆదర్శపథం:

భారతీయ జ్వలిత చేతన బంకించంద్ర

ఈ గ్రంథాన్ని వందేమాతరం శతజయంతి ఉత్సవాల కానుకగా ప్రచురించారు. బంకించంద్రుని గురించి మునుపు ప్రసాద రాయకులపతి, దేవులపల్లి రామానుజరావు వంటి వారు రచనలు చేసినా తెలుగులో సమగ్రమైన విస్తృతమైన బహుముఖీనమైన పుస్తకం వెలుదండవారు రచించినదే. “నాకు విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన తో చాలా పేరు వచ్చిన మాట నిజమే, ఆ రచన వల్ల అవతలి వ్యక్తి పొందిన ప్రయోజనం, ఉపకారం రీత్యా వచ్చిందే తప్ప, నా ప్రతిభా సామర్థ్యాలకు, ఆలోచనల తీరుతెన్నలకు వచ్చిన పేరు కాదు, శ్రీనాథుని జీవిత పర్యంతం నైషధ కావ్య స్మరణం చేశాడు. అలాగే నా చిరకాల రచన బంకించంద్ర నా కృతుల్లో శిఖరప్రాయమైనది, సంతృప్తి దాయకమైంది. భాషా భావనల జోడు గుర్రాల మీద స్వారీ చేసినట్లైంది”. ఆ పుస్తకం ప్రాధాన్యం గురించి వారు రాసుకున్న మాటలు ఇవి. శ్రీ నాథునికి నైషధకావ్యం ఎంతటి గౌరవాన్ని, కీర్తిని కలిగించాయో వారికిని బంకించంద్ర కావ్యం అంతే కీర్తిని సముపార్జించాయి. ముదిగొండ శివప్రసాద్, ద్వానాశాస్త్రి, వకుళాభరణం శివరామకృష్ణ వంటి సాహితీ ఉద్దండులు ఈ పుస్తకంపై వివిధ పత్రికల్లో సుమారు 11 పైచిలుకు సమీక్షలు ప్రచురించారు. తెలుగులో సాహితీ సామాగ్రి అంతగా దొరకని మహాత్ముని చరిత్రను పాటక లోకంలోకి తీసుకురావడం అంత ఆషామాషి విషయం కాదు. బంకించంద్రుడు జన్మించేనాటికి  నాటి భారతదేశంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ సాంఘిక ఆర్థిక రాజకీయ వైజ్ఞానికపరంగా వినూత్నకాంతులు ప్రసరింపజేస్తూ సంచలనభరితమైన కాలంలో బంకించంద్రుడు జన్మించారుఅంటారు. అట్లాంటి వాక్యం రాయాలంటే ఆనాటి కాలంలోకి ప్రయాణం చేసి, ఆ పరిస్థితులను ఆకళింపు చేసుకుంటే తప్ప రాయలేరు. అలాంటి భావుకత వందేమాతర గీత వైశిష్ఠ్యాన్ని, బంకించంద్రుని దేశభక్తిని వర్ణించే సందర్భంలో ఉద్వేగపూరిత వాక్యాలు రాశారు. సార్ధకజీవుడు అన్న శీర్షికతో రెండవ అధ్యాయాన్ని ప్రారంభించి బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబ పరిస్థితులు, సమకాలికులు, ఉద్యోగ జీవితం ఇత్యాది విషయాలు చెప్పారు. భారతదేశంలో మొదటి నవలాకారునిగా ఆయనను సప్రమాణంగా నిరూపించారు. ఆనందమఠం లాంటి లక్ష్యాత్మక నవలలను, కపాలకుండల లాంటి కాల్పనిక నవలలను, కవితలను, కథలను, హాస్య వ్యంగ్య రచనలను, ధార్మిక రచనలను కూలంకషంగా విశ్లేషించారు.  బంకించంద్ర చటర్జీ పైన వచ్చిన తెలుగు రచనలను, ఆయన సాహిత్య ప్రభావంతో వచ్చిన రచనలను,   ఇతర భాషల్లోని విషయాలను, అరుదైన ఛాయాచిత్రాలను, చేతిరాతను, వందేమాతరగీతం చుట్టూ అల్లుకొన్న చారిత్రక రాజకీయకోణాలను పలు ఆంగ్ల గ్రంథాలు, కన్నడ గ్రంథం నుండి సేకరించి సమగ్రపుస్తకం గా తీసుకువచ్చి కొత్తతరానికి అందించారు.

రాజనీతిజ్ఞుడు బూర్గుల రామకృష్ణారావు:

బంకించంద్రుని గురించి రాసిన పుస్తకం ఆనాటి వందేమాతరోద్యమ కాలం నాటి భారతదేశ సామాజిక పరిస్థితులను రాజకీయ వాతావరణాన్ని కళ్ళకు కడితే బూర్గుల రామకృష్ణారావు పైన రాసిన ఈ పుస్తకం ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను, సమైక్య ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులకు దర్పణం  పడతుంది. “ఈ పుస్తకం జీవిత చరిత్ర రచనల్లో  సాంప్రదాయ రచన పద్ధతికి విరుద్ధంగా ఆరంభం అవుతుందిఅని రాశారు. అన్నట్టుగానే ఈ పుస్తకం ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన పరిస్థితుల నుండి మొదలవుతుంది. ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను, విద్యావ్యవస్థ స్థితిని చక్క పెట్టడానికి, ప్రాథమిక స్థాయిలో మాతృభాషా మాధ్యమంలో విద్యాబోధన చేసే ఖాన్గీ పాఠశాలలను తెరిపించడానికి ఆంధ్ర మహాసభ ద్వారా బూర్గుల చేసిన కృషిని సమగ్రంగా వివరించారు. హైదరాబాద్ రాష్ట్ర ఏర్పాటు, నాటకీయ పరిణామాల మధ్య బూర్గుల ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన విధం, తదనంతర కాలంలో విశాలాంధ్ర ఏర్పాటు ఆ ఏర్పాటులో భాగంగా బూర్గుల తొలి సమిధగా తనను తాను అర్పించుకున్న విషయాలు ఎన్నింటినో చర్చించారు. ఆదర్శ ముఖ్యమంత్రిగా, విశాలాంధ్ర నిర్మాతగా, ప్రజల న్యాయవాదిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా, సాహిత్య బంధువుగా, విశిష్ట వ్యక్తిత్వ సంపన్నునిగా, వారి జీవితవిశేషాలను వ్యక్తిత్వాన్ని, రాజకీయనీతిజ్ఞతను, అకుంఠితదీక్షను స్ఫూర్తిప్రదంగా విశ్లేషించారు.   “రాజకీయవేత్తలు ఎందరో ఉంటారు. రాజకీయవేత్తల్లో దార్శనికులు తక్కువమంది, పాలన రహస్యాలు తెలిసిన దార్శనికుడు బూర్గుల అన్న ఒక్క వాక్యంతో వారి చరిత్రను సార్ధకం చేశారు.

విశాలాంధ్ర ఏర్పాటు సమయంలో ముఖ్యమంత్రి  స్థానంలో ఉన్న బూర్గుల నిర్మమత్వంతో తాము చేయవలసిన పని తాము చేశారు. ఎంతో చిత్తశుద్ధితో, ఎంతో ఆదర్శంతో ఆనాటి పెద్ద మనుషులు చేసిన ప్రయోగం స్వార్థ రాజకీయ నాయకుల వికృతచేష్టకు బలి అయిపోయింది. విద్య, ఉపాధి, సంస్కృతి, సాహిత్యం, రాజకీయాలలో, వనరులు- అవకాశాల పంపిణీలో సమ భాగస్వామ్యం లేకుండా దగాపడడానికి రాజకీయ నాయకుల దూరదృష్టి లేమి, నిజాయితీలేమి, స్వార్థం కారణమే తప్ప ఆనాటి పెద్దల చిత్తశుద్ధి, ఆదర్శాలలో లోపం కాదు. అడ్డుగోడలు కూలిపోవచ్చు. కొత్త గోడలు మొలవవచ్చు. రాజ్యాల భౌగోళిక సరిహద్దులు ఎన్నోసార్లు మారుతుంటాయి. ప్రాంతాలు విడిపోవడం కలవడం- అనేది చారిత్రక పరిణామంలో భాగమే. ఈ విశ్లేషణాత్మక ప్రవృత్తి, విజ్ఞత సమకాలీన ఆవేశకావేశాలకు బలి కాకూడదు. మంచితనం, మనిషితనం ఎప్పటికీ వసివాడనివన్న సంగతి విస్మరించకూడదు అన్న భావనతో నిత్యానందరావు గారు ఈ రచన చేశారు.

ఆటుపోట్ల కావేరి:

ఈ పుస్తకం ద్వారా వారు అనువాదకుడిగా మారారు. కావేరి చటోపాధ్యాయ అనే బెంగాలీ రచయిత్రి రచించిన “Peeping through my window”  ఆంగ్ల జీవిత చరిత్రకు తెలుగు రూపమే ఆటుపోట్ల కావేరి”. ఆ పుస్తకాన్ని చదివి ఆమె జీవితంలోని విషాదానుభవాలకు హృదయం ద్రవించి,   తెలుగువారికి  పరిచయం చేశారు. అంతటితో ఆగలేదు.   కావేరి చటోపాధ్యాయ గారిని తన తోబుట్టువుగా భావించి హైదరాబాదుకు రప్పించి పుస్తకావిష్కరణ చేయించి ఇంట్లో పండుగలా ఘనసన్మానం చేయడం విశేషం. అందులో మాకందరికీ భాగస్వామ్యం కల్పించడం ఆనందదాయకం.

తెలుగు శాఖకు చేసిన సేవ:

నిత్యానందరావు రాసిన ఎన్నో వ్యాసాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం, -తెలుగుశాఖకు సంబంధించినవాటిని ప్రత్యేకంగా వర్గీకరించుకోవచ్చు. తాను పని చేసిన మహిళాకళాశాల, నిజాంకళాశాల, ఆర్ట్స్ కాలేజ్   మూడింటిపట్ల మూడు వినూతన చారిత్రకవ్యాసాలు రాసి ఋణం తీర్చుకున్నానని నిత్యానందరావు సంతోషంగా చెప్తారు.   అందులో ఆర్ట్స్ కళాశాల మొదటి ప్రిన్సిపాల్ సర్ సయ్యద్ రాస్ మసూద్, (ఆయన నియమించిన మొదటి తరం అధ్యాపకుల వివరాలు) ;   కోఠీ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ అమీనాపోప్, నిజాం కళాశాల మొదటి సంస్కృతాంధ్ర అధ్యాపకులు రాయప్రోలు వెంకట సోమయాజులు, పాలనాదక్షుడైన విద్యావేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం  ఉపాధ్యక్షులు  ఎం.ఎస్ దొరై స్వామి జీవనవివరాలు –వారి వైశిష్ట్యం గూర్చి తొలిసారిగా అధికార పత్రాల ఆలంబనగా పరిశోధనాత్మకంగా రాసే అవకాశం భగవంతుడు నాకు ప్రసాదించాడంటారు నిత్యానందరావు..

బిరుదురాజు రామరాజుగారు ఒక వ్యాసంలో  రాయప్రోలు వెంకట రామ సోమయాజులు అని నిజాంకళాశాలలో పనిచేశారు.  1947 నాటికే వారు లేరు. వారి గురించి చెప్పేవారెవ్వరూ ఇప్పుడు లేరు– అని రాశారు.   వారు  గురించి నిత్యానందరావు సేకరించిన సమాచారం ఎంతో విలువైనది. పాఠక లోకానికి ఏమాత్రం పరిచయం లేని వ్యక్తిని వారు నిజాం రాష్ట్రంలో తొలి సంస్కృతాంధ్ర ఆచార్యునిగా పనిచేశారని,  1910 లోనే అంటే రాయప్రోలు సుబ్బారావు తెలుగుశాఖలో చేరక ముందే వారు  నిజాం కళాశాలలో చేరి ఉన్నారనీ, ఫస్లీ తేదీలతోఉన్న సమాచారాన్ని ఆంగ్లశకంలోకి మార్చి నిరూపించడమే కాకుండా, వారి రచనలను సైతం సేకరించి ఎవరయినా డాక్టరేట్ పరిశోధనకు పూనుకోవాలని ప్రబోధించారు.  1976లో కాకతీయ విశ్వవిద్యాలయం స్వయంప్రతిపత్తి పొందే వరకు అక్కడ తెలుగుశాఖకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారానే నియామకాలు జరిగాయి. కావున కాకతీయ విశ్వవిద్యాలయం తొలితరం ఆచార్యుల నుండి 2017 వరకు ఉస్మానియా తెలుగుశాఖకు సేవలందించిన 62 మంది ఆచార్యుల సమగ్ర సమాచారాన్ని వారు అందించారు. 1919 తెలుగు శాఖ ఆవిర్భావ వసంతం నుండి ఆ శాఖలో జరిగిన అభివృద్ధిని, అధ్యక్షులుగా సేవలందించిన పండితుల సాహిత్య కృషిని సమగ్రంగా అక్షరబద్ధం చేశారు. తెలుగుశాఖ మొదటి విద్యార్థి పల్లా దుర్గయ్య, రెండవ విద్యార్థి ఈటూరి లక్ష్మణరావు,  తొలి విద్యార్థిని ఇల్లిందల సుజాత, తొలి దివ్యాంగ పట్టభద్రుడు డి.వి కృష్ణారావు, మూడవ విద్యార్థి కే గోపాలకృష్ణారావు, బి.రామరాజు, ఎం.కులశేఖరరావు, సి.నారాయణరెడ్డి   గారి సమాచారాన్ని సేకరించారు. రెండేళ్ళే తెలుగుశాఖలో పని చేసిన వెల్లలూరి వెంకటరాఘవశర్మ, కుమారి ఇందిరావందనం గార్ల వివరాలు నిత్యానందరావు తొలిసారిగా బయటపెట్టారు.  ఎన్నో వ్యయప్రయాసలకు నోర్చి  ఎం.ఎ తెలుగు శాఖ విద్యార్థుల పూర్తి సమాచారాన్ని, వారు ఉత్తీర్ణులైన సంవత్సరాలను, మార్కులను సైతం సేకరించారు.

 ఆధునిక కవిత్వ సంబంధమైన మొదటిరచన డా. పాటిబండ మాధవ శర్మగారి  ఆధునికాంధ్ర భావ కవిత్వం”. (2012, పొ.శ్రీ. తెలుగు విశ్వవిద్యాలయం.), జనగామజిల్లా బచ్చన్నపేటకు చెందిన చెన్నమాధవుని వెంకటరామరాజ కవి రచించిన రామకృష్ణ యుధిష్టర చరితమ్”  (మూడర్థాల సంస్కృత చంపూ కావ్యం 2020, తెలంగాణ సాహిత్య అకాడమీ) లను ప్రప్రథమంగావెలుగు లోకి తెచ్చారు   తూము రామదాస కవి రచించిన నిఘంటుకావ్యం ఆంధ్ర పద నిధానము”  (2019, తెలంగాణ సాహిత్య అకాడమీ)నకు సంపాదకత్వం వహించారు.  సిద్ధాంత గ్రంథాల సార సంగ్రహాల సంకలనం పరిశోధన వ్యాసమంజరి రెండు సంపుటాలను వీరి సంపాదకత్వంలో బ్రౌన్ అకాడమీ (2009,2010) వెలువరించింది.  

ఓయూ నూరేళ్ల పండగ చేసుకున్న సందర్భంలో వచ్చిన శతవాసంతిక అను సంచిక వెలువడడంలో విశేషమైన కృషి చేశారు. తెలుగు శాఖకు సంబంధించిన మరింత సమాచారాన్ని శతవాసంతికలో పొందుపరిచారు. ఇటువంటి కృషి ఇప్పటివరకు ఏ తెలుగు శాఖలోనూ, మరే ఇతరశాఖల్లోనూ  జరగ లేదు. ఉస్మానియా, ఆంధ్ర , తెలుగు, సార్వత్రిక విశ్వవిద్యాలయాలకు పాఠ్యభాగరచయితగా వ్యవహరించారు.

పురస్కారాలు:

ఎం ఏ తెలుగులో సర్వోత్తమ స్థానం పొందినందుకు గురజాడ అప్పారావు స్వర్ణ పతక పురస్కారం-1985  .  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంచే ఉత్తమ సాహితీవేత్త పురస్కారం-2017

బోయి భీమన్న సాహితీ నిధివారి  భీమన్నపురస్కారం2019; తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహిత్య విమర్శలో ధర్మనిధి పురస్కారం(2007);- ప్రతిభా పురస్కారం -2021; సాహితీ పురస్కారం-2023 . లభించాయి. ఇంకా

 తెలంగాణ సారస్వత పరిషత్ వారి సాహిత్య విమర్శ రంగంలో ఉత్తమ గ్రంథ పురస్కారం -2022; ఆచార్య జి చెన్నకేశవరెడ్డి పురస్కారం2022;  పీచరసునీతారావు స్మారకపురస్కారం- 2023; మొదలైనవి నిత్యానందరావును వరించాయి.  మరింత ఉన్నతమైన, జాతీయస్థాయి పురస్కారాలకు అన్నవిధాలా అర్హులు మాగురువుగారు.

ముగింపు:

ఆచార్య వెలుదండ నిత్యానందరావు  “భగవంతుడు ఈ జన్మకు రాతపనే నా నొసట రాశా”డని బలంగా విశ్వసించి సుమారు 45 సంవత్సరాలుగా సాహిత్యమే జీవితంగా, జీవితమే సాహిత్యంగా నడుస్తున్నవారు. ఏదైనా రాయడానికి పూనుకుంటే ఆ పనికి అలాగే అతుక్కుపోతారు, వారి దృష్టి అంతా అది పూర్తయ్యే వరకు దాని చుట్టే తిరుగుతుంది. అగ్రశ్రేణి ఆచార్యుల వద్ద శిష్యునిగా, సమకాలికులలో ఉన్నతంగా, ఎందరో విద్యార్థులకు ప్రియమైన గురువుగా మెలిగారు. ఇన్నాళ్ళ ఈ ప్రయాణంలో అవసరమైన చోట ఔచితీమంతంగా ఎంతటి వారినైనా మరొక్కసారి పరిశీలించండి అని సున్నితంగా చురకలు అంటించారే తప్ప, ఏనాడు వ్యక్తిగతంగా విమర్శించినది లేదు. విషయార్థియై వచ్చిన ఏ విద్యార్థిని వట్టి చేతులతో పంపలేదు, భోజనపు వేళ వచ్చినవాడు ఆకలితో వెళ్లలేదు. పలానా పుస్తకం అని వెళితే, అది వారి వద్ద లేకుంటే, దానికి సంబంధించి ఎక్కడ దొరుకుతుంది, ఎవరి వద్ద దొరుకుతుంది, ఎలా సేకరించాలో పూర్తి సమాచారాన్ని ఇచ్చి పంపిస్తారు. ఏది రాసినా, ఏది చదివినా ఓ కొత్త కోణంలో చూడడం వారి అలవాటు. చదివిన, చూసిన విషయాన్ని అలాగే గుర్తుంచుకొనే ఏకసంథాగ్రాహిత్వం, అలసట లేకుండా భిన్నభిన్న అంశాలమీద రచనలు చేసే ఉత్సాహశీలం,  రాసిన ప్రతి అక్షరాన్ని భద్రపరచుకునే తత్వం అన్నీ కలిసి సప్తగిరులలాగా సప్త బృహత్సంపుటాల ప్రచురణతో నిత్యానందరావుకు సాహిత్యలోకంలో శాశ్వతస్థానం సముపార్జించి పెట్టాయి.    

ఏనాడూ వ్యక్తిగత గుర్తింపు హంగులు ఆర్భాటాల జోలికి పోలేదు. అందరిలో ఒకరిగా నవ్వుతూ, నవ్విస్తూ కలిసిపోతారు. కుట్రకు, కూహకాలకు, ముఠా రాజకీయాలకు, ఆమడ దూరంలో ఉన్నారు. చేయగలిగితే మేలు చేయాలి  లేకపోతే నోరు మూసికొని కూర్చోవాలంటారు. చైతన్యమహాప్రభు సాంప్రదాయం చేత ప్రభావితుడైన వారి తండ్రి తన కుమారునకు “నిత్యానందరావు” అని పేరు పెట్టారు. ఆ మహానుభావుడు ఏమి ఆశించి ఆ పేరు పెట్టారోగాని, ఎప్పుడూ నిష్కల్మషంగా, చిరునవ్వు నలంకరించుకొని కనిపిస్తారు. తండ్రిగారి చివరి అంకంలో వారి సేవ చేసి పునీతులయ్యారు. గృహస్థ ధర్మాన్ని, అటు ఉద్యోగ ధర్మాన్ని సమానంగా పోషించారు.

“అహంకార ద్వేషాలు, ఈర్ష్య అసూయలు స్వాభావిక ప్రకృతులే అయినా వాటి ప్రవాహంలో కొట్టుకొని పోయే స్థితి రాలేదు. ప్రశాంతంగా హాయిగా సంతృప్తిగా జీవితాన్ని గడిపాను. సంతృప్తిని మించిన సంపద మరేముంటుంది” అని జీవిత పరమార్ధాన్ని దర్శించిన సార్ధక జీవి.

“ ఇంత సాహిత్య వ్యాసంగాన్ని నేను జరిపానని ఆనందంగా చెప్పుకోవడానికి మూలం నా నిరంతర సాధన ఒకటైతే, సజ్జనులతో సద్గురువులతో నా సహవాసం మరో ప్రధాన అంశం.  ఓ పది, ఇరవై దొరకకపోయినా అన్నీ భద్రంగా ఉండడం మరో ముఖ్య విశేషం. నా ఉన్నత పాఠశాల, నా ప్రాచ్య కళాశాల అధ్యాపకుల గురించి రాయడంలో, నా విశ్వవిద్యాలయ అధ్యాపకుల గురించి (అక్షరమాల రెండవ సంపుటంలో) రాయడంలో నాకు ఉన్నది  వినయం, కృతజ్ఞతాభావం, అభిమానం, ఆర్ద్రత. నా జీవితాన్ని ఇంతవరకు ముందుకు నడిపించినవి ఈ నాలుగు అంశాలే……… ఎందరెందరో ఎన్నో విధాలుగా తమ సహాయ సహకారాలను అందించి తోడ్పడ్డారు. ఇది ఎవరి కోసమో, దేనికోసమో, ఏదో ఆశించి కాక, నాకోసం, నా ఆనందం కోసం ప్రచురిస్తున్నది ‘నాలోన గల వెల్గు నా పరిసరముల వారి రూపమున కన్పట్టుగాక’ అన్న ఎక్కిరాల కృష్ణమాచార్యుల వాక్కులకు అనుగుణంగా ఒక చారిత్రకమైన బాధ్యతగా భావించి నిర్వహిస్తున్నది. ఉపదేశాలు, బోధలు చేయడం కోసం కాదు. పుస్తక పఠనం పూర్తిగా పోయింది. తెలుగు భాష మాట్లాడడమే తప్ప రాయలేని తరం తయారయింది. వైయక్తికమైన క్షణికానందాల కోసం వాట్సాప్ లో తలదూర్చి బతుకుతున్న ఉష్ట్ర పక్షుల సంఖ్య  పెరిగిపోతుంది. సాధికారికంగా ప్రసంగించే వక్తలు, రాసే రచయితలు తగ్గుతున్నారు. క్రమేపి పాలన విద్యాది వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయి. ఇవన్నీ నిజమే కావచ్చు గాక! సమాజానికి నా రచనలు హితకరమైనవి, ప్రామాణికమైనవి అని నమ్ముతున్నాను. అందుకే సాహసంతో, శ్రమతో, ఆర్థికభారాన్ని లెక్కచేయకుండా నూతనతరం మీద విశ్వాసంతో సంపుటాలు తెస్తున్నాను….. ఇన్నాళ్లు “ప్రవృత్తి” మార్గంలో రచనావ్యసనిగా జీవించాను. చాలా కొత్త విషయాలు చెప్పాను. ఎన్నెన్నో సేకరించాను -అని ప్రశంసలు పొందాను. ఇకముందు “నివృత్తి” మార్గంలో ముందుకు సాగుతాను.  ప్రదర్శన కళ అయిన రచన కన్నా దర్శన కళ అయిన అంతర్దృష్టి కి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నాను.

అధ్యాపకునిగా, పరిశోధకునిగా, పర్యవేక్షకునిగా, రచయితగా, గృహస్థుగా, లౌకికమైన నా పాత్ర సక్రమంగా నిర్వహించానన్న సంతృప్తి ఉంది. ఇది చాలు అందరికీ మరోసారి వినయంగా, ప్రేమ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను”  ఆరవసంపుటమైన సృజనానందం పీఠిక ముగిస్తూ అంటారు.  ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారి జీవనసారాన్ని, దృక్పథాన్ని ఈ మాటలు వెల్లడిస్తున్నాయనడం నిర్వివాదాంశం.

నిత్యానందరావుగారివద్ద నేను నేరుగా చదువుకోకపోయినా వారు నాకు గురువులే.  నా పరిశోధనాంశ విషయమై వారిని మొదటిసారి కలిశాను. అనుకోకుండా వారి ఇంటికి దగ్గరలోనే నేను ఉండటం వల్ల వారితో సాన్నిహిత్యం పెరిగింది.  నా పరిశోధనకు సంబంధించిన ఎన్నో పుస్తకాలను, ఇతర సాహిత్యసమాచారాన్ని అందించి ప్రోత్సహిస్తున్నారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన మాలాంటి  శిష్యులను  ఇంటికి  ఆహ్వానించి సత్కరించి ఆశీర్వదించారు.  జీవితంలో నేను మర్చిపోలేని అనుభూతి. ఇది నాకు కలిగిన తొలి సత్కారం. తండ్రి బిడ్డల మీద చూపే మమకారాన్ని మా మీద కురిపిస్తారు. వారితో మాట్లాడుతున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు  వివిధ సాహిత్య అంశాలను బోధిస్తూనే ఉంటారు. సరదాగా నవ్విస్తూనే ఉంటారు. ఛలోక్తులు విసురుతారు. పదాలతో ఆడుకుంటారు. అవి కూడా సాహిత్య సంబంధం కావడం విశేషం.  విస్తార సాహిత్య కృషి సల్పిన ఆచార్య వెలుదండ నిత్యానందరావు గురించి ఈ వ్యాసం రాసే అవకాశాన్ని నాకు ప్రసాదించిన మా గురువుగారు తెలుగు శాఖ అద్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ  ముగిస్తున్నాను.

-****-

You may also like

Leave a Comment