ప్రజా వాగ్గేయకారుడు,
తెలంగాణా రైతాంగ పోరాటయోధుడు,
ప్రేమాస్పదవ్యక్తి
సుద్దాల హనుమంతు వర్ధంతి( అక్టోబరు 10) సందర్భంగా….
ఒక్క ‘పల్లెటూరి పిల్లగాడా’ పాటతోని తెలంగాణే కాదు తెలుగువారందరి నోటిపాటయినవాడు సుద్దాల హనుమంతు. జానపద, నాగరిక కళాకారులైన కుటుంబం నుంచి వచ్చిన హనుమంతు పాటలు పాడేవాడు. తన తండ్రితో 5గురు సోదరులు 30యేండ్లపాటు వీధినాటకాలు ప్రదర్శించిన వాళ్ళే. తాను కూడా యక్షగానాలు, పద్యనాటకాలు వేసిన రంగస్థల కళాకారుడే. తాత నుంచి వారసత్వంగా వచ్చిన ఆడి, పాడి అలరించే హరికథ తెలిసినవాడే. తను పుట్టి పెరిగిన పాలడుగు గ్రామానికి వచ్చిన హరికథ కళాకారుడు, ఆధ్యాత్మికవేత్త అయిన అంజన్ దాసు శిష్యుడై, రంగస్థల కళేకాదు, ఆధ్యాత్మిక విద్య కూడా గురుముఖాన నేర్చుకున్నడు సుద్దాల. గురువు డ్రామాకంపెనీ సభ్యుడిగా రెండేండ్లు ఎన్నో గ్రామాలలో ప్రదర్శనలిచ్చిండు. అద్భుతమైన గాత్రం, సాటిలేని నటనా వైదుష్యం అబ్బినయి. అంతేకాదు స్వయంగా పాటలు కూడా రాసేవాడు.
సుద్దాల హనుమంతు తల్లిదండ్రులు లక్ష్మీనర్సమ్మ, బుచ్చిరాములు. 70 ఊర్లు తిరిగి ఆయుర్వేద వైద్యం చేసేవాడు బుచ్చిరాములు. హనుమంతు తోడబుట్టినవారు ఒక అన్న, ఇద్దరు అక్కలు. చిన్నపుడు తన చదువు కానిగిబడిలో సాగింది. అక్కడ పంతులు వేసే శిక్షలకు భయపడి చదువే వద్దనుకున్నడు. గుర్రం స్వారీ, ఈతలంటే ఇష్టం. ఆ రోజుల్లో దొరల దౌర్జన్యాలకు అంతులేకుండేది. పల్లికాయ దొంగతనానికి కూడా పిల్లల ప్రాణం దీసేటోల్లు. నిజాం ప్రభుత్వం మీద, దొరల మీద తనకు కసి, కోపం కలిగేవి. వాళ్ళ గ్రామానికి టీచరుగా వచ్చిన లక్ష్మీనారాయణ సార్ గురించి గొప్పగా విని మళ్ళీ చదువుకోవడానికి బడికి పోయిండు సుద్దాల హనుమంతు. రెండో తరగతి సగం వరకు చదివేలోపల్నే లక్ష్మీనారాయణ సార్ కు తబాదిలైంది. మరోసార్ వచ్చిండు. పాత శిక్షలు చూసి మొత్తానికే బడి మానిండు. ఆ తర్వాత పాలడుగులో హరికథ చెప్పడానికి వచ్చిన ఆత్మకూరు అంజయ్యగారి డ్రామా కంపెనీలో చేరిండు. తన చదువు నాటకాలతోనే సాగిపోయింది.
ఊరిలో దొరతనాల హుకుంలు చూసి రగిలిపోతుండే హనుమంతు ఊరిలో ఉండలేక, హైద్రాబాద్ చేరి వ్యవసాయశాఖలో గుమస్తాగ చేరిండు. నిజాం మీద తిరుగుబాటు చేస్తున్న సంస్థగా భావించి తాను ఆర్యసమాజంలో కార్యకర్తగ వున్నడు. ఈ సంగతి తెలిసిన ఆఫీసర్ తనను దూషించడంతో, ఉద్యోగానికి రాజీనామా చేసిండు. బతుకుతెరువు కోసం దర్జీపని నేర్చుకున్నడు.
1944లో భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్రమహాసభలో రావి నారాయణరెడ్డి ఉపన్యాసం విన్న హనుమంతు కమ్యూనిస్టయ్యిండు. ఈ సమయంలో తాను వర్ణాంతర వివాహం చేసుకున్నడు. తాను కమ్యూనిస్టుగా మారడం, తన తీవ్రతలు ఆమెకు నచ్చలేదు. తను వెళ్ళిపోయింది. దానితో తన ఆదర్శవివాహం విఫలమైందని చెప్పుకున్నడు సుద్దాల. తాను సుద్దాలగ్రామం చేరి, అక్కడే స్థిరపడిపోవడంతో తన ఇంటిపేరు గుర్రం బదులు సుద్దాలగా మారిపోయింది. అపుడే జానకమ్మను పెండ్లి చేసుకున్నడు. ఆమె హనుమంతుతో సమవుజ్జీగా కమ్యూనిస్టు ఉద్యమాలన్నింటిలో పాల్గొన్నది. సుద్దాల హన్మంతు తెలంగాణా సాయుధపోరాటంలో సాంస్కృతిక ఉద్యమాన్ని బాధ్యతగా స్వీకరించిండు.
ఉద్యమం నిలిచిపోయింది. అమరవీరుల త్యాగాలు వృధా అయిపోయినయి. ఆశించిన ప్రజారాజ్యం రాలేదు. విముక్తి చేసిన ప్రాంతాలన్నీ మళ్ళీ పాత అధికారాల కిందికే పోయినయి. నిజాం పాలన మాత్రం పోయింది.
తాను తండ్రిలెక్కనె వైద్యం చేసిండు. ఆర్.ఎం.పి. పరీక్ష పాసైండు. సీపీఐపార్టీ కార్యకర్తగా సుద్దాలలో గ్రామకమిటీ కార్యదర్శిగా పనిచేసిండు. పాటలు రాసిండు. 1982 అక్టోబర్ 10వ తేదీన మరణించిండు హనుమంతు.
హైద్రాబాద్ లో ఉద్యోగం చేస్తున్నపుడు సుద్దాల హనుమంతు ఆధ్యాత్మిక భావజాలంతో ‘యథార్థ భజనమాల’ అనే భజన కీర్తనల పుస్తకం రాసిండు. బంగారానికి తావి అబ్బినట్లు పాటలు పాడే సుద్దాల హనుమంతుకు పాటలు రాయడం కూడా వచ్చింది. ఆర్ద్రంగా గీతాలు పాడేవాడు. మనిషి మనసు కూడా ఆర్ద్రమే. సుకుమారమైన భావాలకు కరిగిపోయేటోడు. హృదయోద్వేగం ఆపుకోలేక జల,జలా కన్నీరు కార్చేటోడు. కరుణాకాతరుడు సుద్దాల హనుమంతు. ఆ కరుణాతత్వమే, ఆ ప్రేమగుణమే హనుమంతు పాటల్లో వుంది. తాను ప్రేమించే తన సాటిమనుషులపై దౌర్జన్యాలను చూసి, తట్టుకోలేకనే ఆనాటి తెలంగాణా సాయుధపోరాటంలో కార్యకర్తగా చేరిన హనుమంతు సాయుధదళంలో తుపాకీ ధరించి తిరిగిండు. ఉద్యమంలో సాంస్కృతిక సేనానిగా ఎన్నో కళాప్రదర్శనలు ఇచ్చిండు. ప్రదర్శనల కొరకు స్వయంగా తాను రచించిన కళారూపాలెన్నో వున్నయి. బుర్రకథ, గొల్లసుద్దులు, పిట్టలదొర, సాధు వేషం,అల్లాకేనాం వంటి వెన్నో తన రచనలు.
సుద్దాల హనుమంతు పాటలు కవితాత్మకంగా వుంటయి. అద్భుతమైన ఊహతో పాట రాయడంలో మొనగాడు సుద్దాల.
‘పల్లెటూరి పిల్లగాడా, పసులగాచే మొనగాడా
పాలుమరిచి ఎన్నాళ్ళయిందో
ఓ పాలబుగ్గల జీతగాడా
కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో…’ ఈ పాటలో సుద్దాల హనుమంతు వాయించే హార్మోనియం నిర్భర శ్రుతి వుంది. రాగ, లయలున్నాయి. In this song we could find, a Harmonious Rhythm, a True life is documented, filmed in words. పల్లెటూరి పిల్లగాడు సాధారణ పదమే, పసులగాచే ‘మొనగాడు’ విశేషణం…దానిని వేయింతలు చేసే మాట ‘పాలుమరిచి ఎన్నాళ్ళయింద’నేది. వాడు ‘పాలబుగ్గల జీతగాడు’. ఈ సమాసమే ఒక అద్భుత కవిత. పిల్లగాడే మొనగాడు కాని, పాలుమరువని జీతగాడు… ఒక వీరుని గురించి రాస్తే రాసే విశేషణాల కన్నా ఈ ఆలంకారిక రచన గొప్పది. పాటలో అంత్యప్రాసలున్నాయి. యతి, ప్రాసలుండే పద్యంవంటి పాట. అలతి పదాలతో అనల్పభావసాధన సుద్దాల హనుమంతు ప్రతిభ. పాట విన్నా, చదువుకున్నా దృశ్యం సాక్షాత్కరిస్తుంది.
పాటను సమీక్షిస్తే చాలు ఈ గేయంలో ఎంత కవిత్వం వుందో…
చాలీచాలని చింపులంగి, సగము ఖాళీ, చల్లగాలి… పసులగాచే పోరగాడు వేసుకున్నది వంటికి చాలని చింపులంగి, అది వేసుకుంటే సగం దేహం ఖాళీ…దాని మీద చల్లగాలి.. ఒక గోనె చింపే కొప్పెర పెట్టుకున్నడు. దానికి కూడా చిల్లులే. ఒక నిరుపేద సహజజీవితాన్ని కలంతో చిత్రించిండు కవి సుద్దాల. పిల్లవాడి పేదరికాన్ని చూపించడానికి ఏ కవితావస్తువులు కావాలి? వాడు కాళ్ళకు తొడిగింది తాటిజెగ్గలకు తాళ్ళు కట్టి కాళ్ళకు కట్టుకున్న జోడు. తాటిజెగ్గల కాలిజోడు. ‘పసుల గుంపు తరలిపోయే వంపు పక్కన గుండు మీద కాపలా’. అందుల దొంగగొడ్లతో గోస. ఈ చాకిరికి నెలకు జీతం కుంచెడు ధాన్యం, తాలు, వొల్పిడిలున్న ఆ గ్రాసం కొలువంగ శేరు తక్కువ.. ఎంత అద్భుత చిత్రణ. వాస్తవ జీవితకథనే…హనుమంతు పాటలో వరుస కట్టుకున్న ముచ్చట్లు.
1946 ప్రాంతంలో ప్రతిరోజు సుద్దాల నుంచి తాను తేరాలకు పోయి, వచ్చే దారిలో గుండుమీద కూసుని ఏడుస్తు కనిపించిన బత్తుల అబ్బయ్య అనే పసులకాడి పోరని నిజమైన, దుఃఖభర జీవితాన్నే పాటను చేసి విశ్వజనీనం చేసిండు సుద్దాలకవి.
ఈ పాట తర్వాత అంతే దయార్ద్రమైన పాట ‘వెట్టి చాకిరి విధానమో రైతన్న, ఎంత చెప్పిన తీరదో కూలన్న’. ఈ పాటలో నాటి దొరలు గ్రామప్రజలు, వృత్తికులాల వారితో చేయించుకునే వెట్టిచాకిరి గురించి రాసిండు సుద్దాల హనుమంతు. దొరలున్న వూరిలో ప్రతి కులవృత్తివారి నెవరినైనా వెట్టిచాకిరికి వాడుకోవచ్చు. ఎదురుచేప్పేదే లేదు. దినాం దొర పనులకు వంతులేసుకుని అందరు గడికి పోయి పనిచేయాల్సిందే. వెట్టిచేసే ప్రజల లిస్టు పెద్దదే.
‘మాదిగన్న, మంగలన్న, మాలన్న, చాకలన్న
వడ్రంగి, వడ్డెరన్న, వసిమాలిన బేగరన్న
కుమ్మరన్న కమ్మరన్న కూలన్న రైతన్న
అన్నిపనులు వాళ్ళతొ దొరలందరు చేయించుకునెడి… ‘వెట్టి చాకిరి విధానమో రైతన్న, ఎంత చెప్పిన తీరదో కూలన్న’ అని రాసిండు సుద్దాల కవి.
‘చాకలన్న వెట్టి చేత(చాకిరి) చాలగలదురోరన్న…వేకువనే(మబ్బుల) లేవాలె, దొరగడీల వాకిలి ఊడ్చి, (సానుపు) చల్లాలి, మేడ అంతా కడగాలె, తడినంతా తుడువాలె, పిండి, పసుపు విసిరి వరుగులు పొడిగొట్టి పెట్టాలె, కోళ్ళు,గొర్రెలు కోసి (ప్రతి)దినం కూరతరిగి పెట్టాలె, గిన్నెలు తోమాలె, వలువలు ఉతుకాలె, కల్లు, ఎన్నె మోసుకుని తేవాలె.. చిట్టి(ఉత్తరాలు) ప్రయాణాలు, ఇంకా చిల్లర పనులు చెయ్యాలె…
మంగలన్న వెట్టిచేతలో దున్నలకు, బర్రెలకు క్షౌరం, దొరలకు తల, మొలక్షౌరం చెయ్యాలె. తలకంటి స్నానం చేయించాలె. మునిమాపుల దీపాలు పెట్టి, దొరలకు పడకలు పరువాలె, కాళ్ళు పిసికి, ఏ రాత్రికో ఇంటికి పోవాలె.
కుమ్మరన్న వెట్టిచేతలో వందలకొద్ది కుండలు చేసియ్యాలె, గడిలో వాళ్ళకు కావలసినన్ని నీళ్ళు బావుల నుంచి చేది పెట్టాలె, వచ్చిపోయేటోల్లకు వండిపెటాలె.
మాదిగన్న వెట్టిచేత మరపురాని ఘట్టమట. గుండె తల్లడిల్లిపోతుందట తలచుకుంటేనే. కావలి మాదిగతనం దొర ఇంటి ముంగల రాత్రింబగలు కాపలా కాయాలె. పుట్లకు పుట్లు ధాన్యం దంచి ‘పోటు తెల్లగెయ్యా’ల్నట. వంటకు కట్టెలు గుట్టలకొద్ది కొట్టిపెట్టాలె. అడివి తిరిగి విస్తరాకులు ఏరుక రావాలె. దొరల బండ్ల ముందర ఉరుకాలె. పొద్దీకితె దినాం దొరకు డప్పు మీద ‘దివిటీసలాం’ లియ్యాలె. పరాయి ఊర్లకు వంతులవారి బరువులు మొయ్యాలె.
ఇదంతా పాటలోనే చెప్పిండు సుద్దాల హనుమంతు. ఒకనాటి నిజాం కాలంలోని దేశ్ ముఖ్ లు. దేశ్ పాండ్యాలు, జమీందార్లు, జాగీర్దార్లు, భూస్వాములు దొరలని పిలిపించుకునేవాండ్లు. వాళ్ళ దొరతనాలు సాగడానికి వాళ్ళ ఏలుబడిల వున్న పనోల్లందరు దొర హుకుం చేసినట్టు ‘వెట్టిచాకిరి’ చేసి తీరాల్సిందే.
తన చిన్ననాడు… జ్వరంతో నడువలేకున్న బరువొంతుల వీరయ్య తనవంతు బరువులు మోసే పని చేయలేనని అన్నందుకు వచ్చిన అధికారి బూట్లతో తన్ని కొరడా కొట్టి హింసించడం చూసిన హనుమంతు మనసులోని బాధే ఈ పాటైంది. నిజజీవితంలోని సంఘటనలను పాటలుగా రాసుకున్నడు సుద్దాల. ఆయన పాటలో చెప్పిన వెట్టిచాకిరుల వరుస, ఆ వెట్టిలోని వెతలు, కులాలవారీగా దొరలకు ఎట్లాంటెట్లాంటి పనులు చేయవలసి వచ్చేదో అవన్నీ పదాలైనవి. దొరలకు తల క్షౌరం, మొలక్షౌరం ఎంత జులుం? దొరల కచ్చురాల ముందర పసురాల కంటె ముందు ఉరుకుడు ఏం గోస? ఇవన్నీ ఆ దొరతనాల అమానుష, పెత్తందారీతనాల సంస్కృతి. ఈ దుర్మార్గాలను తన పాటలో రికార్డు చేసిండు హనుమంతు.
ఈ పాట విన్న వారి గుండె తడిసిపోతుంది. కరుణాగ్ని రగులుతుంది. అదే పోరాటానికి ప్రేరణ.
తన తండ్రి ‘ప్రజాకవి సుద్దాల హనుమంతు చేసిన చారిత్రక రచన ఉపరితల వర్గాలకు సంబంధించింది కాదు. పేదల, ఉత్పత్తి వర్గాలకు చెందిన ప్రజల చారిత్రక రచన………నాన్న కూడా అణగారిన, అణచివేయబడిన సబ్బండ జాతుల, కులాల, మతాల, వర్గాల ప్రజల దృక్కోణం నుంచి పాడుకునే రూపంలో ఆ కాలపు చరిత్రను రికార్డు చేసిండు.’ అంటడు సుద్దాల అశోక్ తేజ.
మరొకపాట ‘అమరవీరులకు జోహార్లు’.
ఈ పాటలో సుద్దాల హనుమంతు తెలంగాణా సాయుధపోరాటంలో అమరులైన వీరులకు జోహార్లర్పించిన విధం నూతనం. ఈ పాటలో బుర్రకథ దరువును మేళవించాడు. పదాలను గుర్రాలలెక్క పరుగెత్తించిండు.
‘‘ స్వాతంత్ర్య రథమ్మునెక్కి
సమరవీధులందు దోలి
అతివాద శరముల గురిపి
అసువులపై నాస వదలి
సై సై రా భళి సై’’…… తెలంగాణా సాయుధపోరాటం ఒక స్వాతంత్ర్య సమరం. నిజాం నిరంకుశ రాజ్యం నుంచి విముక్తాన్ని కోరి చేసిన ప్రజాయుద్ధం. అందుకే కవి సుద్దాల ఆ పోరులో నిలువడం అంటే స్వాతంత్ర్యరథం ఎక్కడమని భావించిండు. ఆ పోరాటంలో సమరవీధుల్లో వీరులు రథమెక్కి రణరంగంలో అతివాద శరములు కురిపించిండ్రట. ఈ బాణాలు కమ్యూనిస్టుపార్టీ చేసిన సాయుధ పోరాట తీర్మానాలే. అవి అతివాదశరాలే. యుద్ధంలో ప్రాణాలపై ఆశ కల్ల.
నాటి సాయుధపోరాటవీరులు చేసిన పోరును హనుమంతు గొప్పపాటగా మలిచిండు. పాడితే ఉద్రేకం, చదువుకుంటే ఉద్వేగం కలుగుతయి. రూపకాలంకారాలు ఈ గేయకవిత నిండా.
‘‘పగతుర శిరములను తమకు
పక్కదిండ్లుగా జేసుక
దీర్ఘనిద్ర చెందినట్టి
తెలంగాణ బిడ్డలకు’’… ఎంత ఆవేశం.. సాయుధపోరాటంలో దీర్ఘనిద్ర, మరణం పొందిన వీరులు శత్రువుల శిరస్సుల్ని తలదిండులు చేసుకుని నిద్రపోతున్నారనడం…ఇది యుద్ధకవిత్వం.
‘‘ముగింపకుడి విప్లవమని
మిగిలిన పని మీ వంతని
అంతిమ విజయం మనదని
అమరవీరులైనోల్లకు’’…. అమరులతోనే విప్లవించడం ఆగిపోవద్దని, పోరాటయోధులు తమ వారసత్వాన్ని మనకు అందించిపోయిండ్రని…ఆఖరున గెలుపు మనదేనని భరోసాయిస్తున్నరని…వారికి జోహార్లర్పించిన తీరు అనుపమానం.
ఎందరో త్యాగపురుషులు దేశస్వాతంత్ర్యం కోసం బలిదానాలు చేసిండ్రు. కాని, ఏమైంది.
‘ఆంగ్రేజు పాలనను అంతమొందించగా
కాంగ్రేసు పెద్దలే కామందులయ్యారు’,
‘అసమర్థపాలకుల వశమయ్యి దినదినం
అవినీతికే నిలయమయ్యిందయా’,
‘కోట్లాది ప్రజల నోట్లో మన్నుపోశారు
గొప్ప కోటీశ్వరుల కొమ్ముగాస్తున్నారు’,
‘పండించినా రైతు ఎండిపోతున్నాడు
బేరగాళ్ళంత కుబేరులౌతున్నారు’,
‘బలహీనవర్గాల ప్రజలకు మహిళలకు
ప్రాణ,ధన,మానాల పరిరక్షణే లేదు’,…ఈ పాట సుద్దాల హనుమంతు రాసుకున్న ‘సాధువేషం’ లోనిది. ‘శివగోవింద గోవింద బ్రహ్మం, భజగోవింద,గోవింద అనే పల్లవితో మొదలౌతుంది. ఈ పాట వర్తమానానికి వర్తించే గీతం. ఇందిరా గాంధీ ‘గరీబీ హఠావో’ నినాదమిచ్చిన నాటి చారిత్రక సందర్భం ఈ పాటది. ఈ పాటలోని అంశాలు ఇప్పుడున్నవే. ప్రభుత్వాలు అవినీతికి పట్టం కట్టినయి, కోటీశ్వరుల కొమ్ముకాయడం జరుగుతున్నదే, రైతు దళారుల చేతిలో ఉరిపోసుకుంటున్నది కరెక్టే, దళితులకు, మహిళలకు నేటికీ రక్షణే లేనిది సత్యమే… కవి సుద్దాల హనుమంతు రాసిన ఈ గీతం ‘కాలజ్ఞానం’ లెక్కనే వినిపిస్తున్నది. తన కవిత్వంలో రాగ, తాళ, భావాలు ఎక్కడా జారిపోవు. వాడిన మాటలు, ఎన్నుకున్న సందర్భాలను ఉద్దీపింపజేసేవే. కాన్షియస్ గా రాసిండు హనుమంతు.
సుద్దాల హనుమంతు రాసిన వందకు పైగా వున్న పాటల్లో సేకరించబడినవి కొన్నే. అందులో వివిధ కళారూపాల రచనలు. తన రచనలను సేకరించిన సమగ్ర సంపుటం సుద్దాల అశోక్ తేజ సంకలించిన ‘పల్లెటూరి పిల్లగాడా’ అనే పుస్తకం. దీనిలో సుద్దాల హనుమంతు రాసిన పాటలు, భజన కీర్తనలు, గొల్లసుద్దులు, సాధువేషం, యక్షగానం వున్నాయి. ఒక్క భజన కీర్తనలలో తప్ప మిగతా అన్నీ ప్రజలకోసం కైగట్టిన పాటలే, ప్రజాజీవితం వస్తువుగా రచించినవే.
సుద్దాల హనుమంతుకు ఇష్టమైన పాటలలో ‘ఆకలి మంటలు’ ఒకటి. ‘మంటలు, మంటలు, మంటలు… దేశమంతట ఆకలి మంటలు’ అని మొదలైతుంది.
‘‘నిజమాడితె బందీఖానాలు
అన్నమడిగితె తుపాకి కాల్పులు
పాలకవర్గము కివి లీలలు, ప్రజ
లాకలి బాధలు, చావులు…
మాకడుపుల పేగుల అరుపులు
వెలువడి రూపొందెను సమ్మెలు
చెలరేగిన యవి నలుమూలలు
కొనసాగును విప్లవజ్వాలలు’’… ఇవన్నీ అక్షరసత్యాలు. ప్రభుత్వాలు మారినా రాజ్యస్వభావం మారలేదు. ప్రజలు ఆకలితో చస్తుంటే, గోదాములలో తిండి గింజలు ముక్కిపోతుంటయి. అడుగడుగునా ప్రజలకు అన్యాయమే జరుగుతున్నపుడు, తిరుగబడే గొంతులుంటయి. జైలయినా, కాల్పులైనా ఉద్యమిస్తునే వుంటరు. ఇంకా ఈ స్థితి మారనే లేదు. దేశం మారనే లేదు.
‘‘లేరా జాగేలా’’ అనే పాటలో సుద్దాల హనుమంతు తన సదాశయాన్ని ప్రకటించిండు. ‘సకల జనులందరిలో సద్విద్యలెల్ల, సామ్యభావమున పెంపొంది శోభిల్ల, నీ ప్రతిభ నీ పురోగమనంబులెల్ల, నిఖిల ప్రపంచంబు గని సంతసిల్ల’ అంటడు. దేశప్రజలంతా చదువుకుని, సర్వసమానత్వాన్ని సాధించి, ప్రతి ఒక్కరి ప్రతిభ ప్రపంచం సంతోషించే టట్లుండాలని కోరుతున్నడు.
మరొక పాట ‘ఎందుకు భయం’లో…‘‘ధనస్వామ్యము, భూస్వామ్యవిధానము, ధ్వంసీకృతమై పోవునులే, దోపిడి, దొరతనముండదులె, దొంగల అంగడి సాగదులే’’ అని ఆశంసిస్తడు కవి సుద్దాల.
ఈ పాటలను చదివినపుడు
‘Let America be the dream the dreamers dreamed—
Let it be that great strong land of love
Where never kings connive nor tyrants scheme
That any man be crushed by one above.
O, let my land be a land where Liberty
Is crowned with no false patriotic wreath,
But opportunity is real, and life is free,
Equality is in the air we breathe.’ –Langston Hughes రాసిన కవిత స్మరణకు వస్తుంది. టాగోర్ ‘వేరీజ్ ది మైండ్ వితౌట్ ఫియర్’ గుర్తుకొస్తుంది.
సుద్దాల హనుమంతు ‘వీర తెలంగాణ’ అనే యక్షగానం రాయడం మొదలు పెట్టిండు కాని, అనారోగ్యం వల్ల పూర్తి చెయ్య లేకపోయిండు. హనుమంతు కుమారుడు సుద్దాల అశోక తేజ తండ్రి శైలిలో 54 సన్నివేశాలు చేర్చి ఆ యక్షగానాన్ని పూర్తిచేసిండు.
ఆ యక్షగానంలో… సూత్రధారి అన్నపూర్ణ అనే పాత్ర పరిచయం..
‘‘రైతువనిత వచ్చెను తెరలోపలికి
రైతువనిత వచ్చెను
అతులిత సౌందర్యవతి, సత్త్వగుణశీల
హితగాత్రి, సుచరిత్రి, ఇందీవర నేత్రి… రైతు వనిత వచ్చెను…
తలకంటి స్నానమాడి, మేన పసుపు
కలయబూసియు స్వదేశి
చలువ వలువను గట్టి, జరి రవికయును తొడిగి
అలరారు ఇల్లాలు ఆదర్శమున వేగ….రైతు వనిత వచ్చెను…’’
తానెన్నుకున్న రచనాప్రక్రియ ఏదైనా దానికి సముచితమైన రచనావిధానాన్ని ఎన్నుకుని రాసిండు. యక్షగానాలలో తనకున్న నటనానుభవం ఈ రచనకు తోడ్పడింది. పాత్ర ప్రవేశపెట్టిన తీరు, పాత్రను చిత్రించిన వైనం, పదాల కూర్పు, అర్థసాధన సాధారణమనిపించే అసాధారణ రచన. తన రచనలలోని పాత్రలు, స్వభావాలు, ఆహార్యాలు అన్నీ ప్రజల నుంచి గ్రహించినవే. ఎక్కడ కృతకత్వముండదు. స్వభావోక్తులతో రచిస్తడు. రూపకాలంకారాలతో పాత్రలను అలంకరిస్తడు. కవిత్వమంటే శుద్ధవచనకవితే కాదు. ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్న సూత్రమే గీటురాయి. అది ఎన్ని రూపాలలో వున్న కవి ప్రతిభ, ఊహావైభవానికి కట్టిన అక్షరాల మిద్దె. సుద్దాల హనుమంతును లొల్లాయి పాటల రచయితగా అనుకుంటే పొరపాటు. ఒక దార్శనికతతో జీవితానుభవసారాన్ని అక్షరాలలో పండించిన కవి సుద్దాల. అనంతమైన ప్రేమతో మనుషుల్ని ప్రేమించిన కవి సుద్దాల హనుమంతు.
ప్రజావాగ్గేయకారుడు హనుమంతు జీవితం ఎటువంటిది. ‘‘ఆ ముంగిటి రాగాలు శ్రమక్షేత్రపు రక్తనాళాలు. ఆ వాకిట్లో పాడిన పాట ప్రతిసారి కొత్తబాణీయై పల్లవిస్తుంది. పొయిలో కాలే కర్రలు చిటపటల సంగీతధ్వనులవుతాయి. లయబద్ధంగా పొంగే ఎసరు టుమ్రీలై వినబడుతాయి. ఆ ఇంట గంజివార్చని రోజు పాటలే వాళ్ళకు పండుగ తిండ్లు. చిన్నబుచ్చుకు ముడుచుకుపోతుంది పేదరికం అక్కడ. ఐనా సమాజం సమంగా ఉండాలనే సంస్కృతి సజీవంగా తాండవిస్తుంది.’’ అంటాడు జయధీర్ తిరుమలరావు ‘సుద్దాల శతపుష్ప జీవితం’ అనే వ్యాసంలో.
హనుమంతు జీవితంలో పెద్దవంతు తెలంగాణా సాయుధపోరాటంతోనే గడిచిపోయింది. పోరాటకాలంలో పోరాటవీరులకు స్ఫూర్తినిచ్చిన పాటలనదిగా వారి మధ్య ప్రవహించిండు. బాంచెన్ నీ కాల్మొక్త అన్న బడుగుప్రజలతో బడితెలు, తుపాకులు పట్టించి పోరుబాట నడిపించిన గీతాలల్లిన పాటలనేత సుద్దాల హనుమంతు. పెన్నూ, గన్నూ ధరించిన ప్రజోద్యమ గీతకారుడు, సమసమాజాన్ని స్వప్నిస్తూ, జీవితాంతం పోరాటస్ఫూర్తిని వదలని అగ్నిధార హనుమంతు. ఆయన పాటల్లో ప్రజాజీవితం ప్రతిబింబిస్తుంది. పోరాటమార్గం దర్శనమిస్తుంది. కొత్త ప్రపంచం దార్శనికత వినిపిస్తుంది. ప్రజల భాషలో, ప్రజల శైలిలో, ప్రజల రాగ,లయల్లో సుద్దాల హనుమంతు చిరస్థాయిగా నిలిచిపోయిండు.