“తొమ్మిది దాటుతోంది ప్రణూ! భోజనానికి రామ్మా! నాన్న, తమ్ముడూ ఎదురుచూస్తున్నారు” కూతురి గదిలోకి వచ్చిన రాధిక, తదేకంగా మొబైల్ ఫోను చూసుకుంటూ, కళ్ళు తుడుచుకుంటున్న ప్రణతిని చూసి గతుక్కుమంది.
తల్లి మాటను వినిపించుకోలేదు ప్రణతి, వాట్సాప్ లో వచ్చిన వీడియో చూడడంలో మునిగిపోయి ఉంది. ఏం చూస్తోందో అనుకుంటూ కూతురి వెనుక నుంచీ చూసింది రాధిక.
ఎవరో పెద్దాయన. ఎనభై దాకా ఉంటుంది వయసు. ఏదో చెప్తున్నారు. కూతురి చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉండడం వలన ఆయనేం చెప్తున్నాడో తెలియలేదు. అందుకే, కూతురి భుజం మీద తట్టింది.
ఉలిక్కిపడింది ప్రణతి. మొబైల్ ఆఫ్ చేసి తల్లిని కౌగలించుకుని వెక్కివెక్కిఏడవసాగింది.
ఆకలితో బల్ల ముందు కూర్చున్న మురళి, వంశీ ఇద్దరూ, ఎంతకీ లోపల్నించీ ఊడిపడని తల్లీ కూతుళ్ళ కోసం గది లోకొచ్చి, ఆ దృశ్యం చూసి కంగారు పడిపోయారు.
“ఏమైంది రాధీ? ప్రణూ! ఎందుకలా ఏడుస్తున్నావ్? ఎవరేమన్నారమ్మా? కాలేజ్ లో ఏమైనా జరిగిందా?” అడిగాడు మోహన్.
“కాలేజీలెక్కడున్నాయి నాన్నా? ఆన్ లైనే గా అంతా? ఏమైందేప్రణూ?” అక్కని తల్లి భుజం మీది నుంచి విడదీశాడు వంశీ.
“నువ్వే చూడు నాన్నా!” కళ్ళు తుడుచుకుని, తన మొబైల్ ఫోనుని తండ్రికిచ్చింది ప్రణతి.
“అయ్యా! ఈ వీడియో చూస్తున్న పెద్దా చిన్నా, ఆడా మగా అందరికీ ఈ ముసలి చేతుల నమస్కారాలు. మీ అందరితో నాలుగు ముక్కలు చెప్పాలన్న కోరికతో మీ ముందుకొచ్చాను.
నా పేరు సిరిపురపు సుబ్బరాజు. వయసు ఎనభై రెండు. ఉన్నత స్థాయి ప్రభుత్వోద్యోగం చేసి రిటైరయ్యి ఇరవై రెండేళ్ళు దాటింది. నా బ్రతుకు ప్రయాణంలో ఎన్నో కష్ట నష్టాలకోర్చాను. నా బిడ్డలిద్దరినీ శక్తికి మించిన చదువులు చదివించాను. బంధు మిత్రులందరికీ నా తాహతుకు మించి సహాయాలు చేశాను. బాధ్యతల బరువుతో, నా ఆరోగ్యం క్షీణిస్తున్నా అహరహం కష్టించి బాధ్యతలన్నీ తీర్చాను. బ్రహ్మాండమైన ఇల్లు కట్టాను. ఏ లోటూ లేకుండా పిల్లలకి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళూ చేశాను. నా కొడుకు అమెరికాలో పెద్ద ఉద్యోగం లో ఉన్నాడు. అక్కడ ఏ స్టేట్ లో ఉన్నాడో మాత్రం నాకు తెలియదు. నా కుమార్తె ప్రస్తుతం దేశంలో ఉందో, విదేశాల్లో ఉందో కూడా తెలియదు. వారు నాతో ఫోన్లో మాట్లాడి అయిదేళ్ళు. వాళ్ళు నాకిచ్చిన ఆ పాత నంబర్లకే పదే పదేఫోన్లు చేసి చేసి, నా ఈ వేళ్ళు వంకర్లు పోతున్నాయి. వాళ్ళతో మాట్లాడి, ఒక్క సారైనా నా మనుమలను చూసి ప్రాణం వదలాలన్న నా ఆఖరి కోరిక ఎవరైనా తీరుస్తారా? వాళ్ళతో ఈ తండ్రి గురించి చెప్పి పంపిస్తారా? వాళ్ళ సొమ్ము నాకక్కర్లేదు. వాళ్ళు నా కంటికి కనిపిస్తే చాలు. కనీసం ఫోన్లో అయినా మాట్లాడితే చాలు. అయ్యలారా, అమ్మలారా! నన్ను మీ తండ్రి గా భావించండి. రక్త పోటూ, మధు మేహం మాత్రమే కాక, ఇటీవల నాకు మూత్ర పిండాల సమస్య సైతం వచ్చింది. మనశ్శాంతి కరువై, నిద్ర కూడా దూరమైంది. నా భార్య చాలా కాలం క్రితం కాలం చేసింది. సరైన తిండి లేక, ఇల్లూ వాకిలి ఉన్నా, పట్టించుకునే వాళ్ళు లేక ఇదిగో, ఈ వృద్ధాశ్రమం లో ఉంటున్నాను. ఎన్నాళ్ళుఉంటానో? ఎప్పుడు పోతానో?
నా వాళ్లకి నా గురించి తెలియడం కోసం, రేపు నేను పోతే, అనాధ శవం గా కాక, నా కన్నబిడ్డ చేత తల కొరివిపెట్టించుకోవాలనే ఆశతో ఈ వీడియో పంపుతున్నాను. దయామయులైన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను.”
అక్కడక్కడా ఉద్వేగంతో తడబడుతూ, కన్నీళ్ళతో చెప్తున్న ఆ పెద్దాయన మాటలు నిజంగానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వృద్హాశ్రమం పేరున్న బోర్డు, భవనం, ఫోన్ నంబరు కూడా వీడియో లో చూపారు.
“మనుషులింత క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తారమ్మా? కని పెంచిన అమ్మానాన్నల్ని ఎలా వదిలేస్తారు? ఆ తాతగారు అచ్చం మన తాతయ్యలాగేఉన్నారమ్మా!” కళ్ళు తుడుచుకుంటూ అంది ప్రణతి.
కూతుర్ని ఓదార్చి, భోజనం బల్ల దగ్గరకి తీసుకొచ్చారు మోహన్ దంపతులు. హృదయం బరువుగా అయిపోయింది అందరికీ. రెండు నెలల క్రితం చనిపోయిన తండ్రి గుర్తొచ్చాడు మోహన్ కి. ప్రణతిది చాలా సున్నితమైన మనసు. అన్నింటికీ త్వరగా స్పందిస్తుంది. పైగా తాతయ్యతో అనుబంధం ఎక్కువ. ఆయననితలచుకున్నప్పుడల్లా దిగులే.
“వంశీ…అమ్మా…నాన్నా… అందరికీ ఈ వీడియో ని పంపిస్తున్నా… మీరూ సాధ్యమైనంత ఎక్కువ మందికి పంపాలి. ఆ తాతగారి కొడుకూ కూతుళ్ళకి బుద్ధి రావాలి. ఎలా అయినా సరే, వాళ్ళు వచ్చి ఆయననితీసుకెళ్ళాలి. ఆయన చివరి కోరిక తీర్చాలి.” పడుకోవడానికి గది లోకెళ్తూ ఆజ్ఞాపించింది ప్రణతి.
“నా మీద పెట్టేయవే భారం ప్రణూ! నువ్వు హాయిగా నిద్రపో!” చెప్పాడు వంశీ.
“అవునే! రేపేదో ఆన్ లైన్ టెస్ట్ అన్నావు. చదువుకో!” తండ్రి మాటలకి తలూపింది ప్రణతి.
ఆ రాత్రీ, మర్నాడూ కూడా నలుగురూ ఆ వీడియో ని తమ ఫోన్లలోఉన్న అన్ని కాంటాక్ట్స్ కీ పంపే పనిలో పడ్డారు.
***
సాయంత్రం ఇంటికి వస్తూనే నవ్వుతూ వచ్చాడు ఆఫీస్ నుంచి మోహన్.
యధాప్రకారం లంచ్ బాగ్ వాకిట్లోనే పెట్టి, బయట బాత్ రూమ్ లోనే చేతులు శానిటైజ్ చేసుకుని, కాళ్లు, ముఖం కడుక్కుని, ముక్కున ఉన్న మాస్క్ తీసి సబ్బుతో రుద్ది జాడించి ఆరేసి ఇంట్లోకి వస్తూనే, ‘ప్రణూ……శుభవార్త’ అంటూ గట్టిగా పిలిచేసరికి ముగ్గురూ పరిగెత్తుకు వచ్చారు .
“యురేకా…..ఒరేయ్ ప్రణూ! శుభవార్త స్పెషల్ గా నీ కోసం…!”
“ ఏంటి నాన్నా…దానికొక్కదానికే అంటే…ఆ….అర్థమైంది, మైక్రోస్కోప్ ఆర్డర్ చేశావా?” వంశీ అడిగాడు. ప్రణతికి అంతరిక్ష విజ్ఞానం అంటే ఇష్టం. చాలా రోజుల్నించి దాని కోసం అడుగుతోంది తండ్రిని.
“కాదురా! కనుక్కున్నా ఆ పెద్దాయన ఎవరో ఏంటో!”
“ఆ విషయం ఆయనే చెప్పాడుగా నాన్నా! మనకితెలియాల్సింది ఆయన పిల్లల గురించి” చెప్పింది ప్రణతి.
“అదేలే…. ఆయన వివరాలే ఇంకొంచెం ఎక్కువగా తెలిశాయి. నా ఫ్రెండ్ చలం లేడూ, సర్వీస్ లో ఉన్నప్పుడు వాడి నాన్నకి ఈయన కొలీగ్ ట.. చలం ఇలా ఆ వీడియోని చూపించాడో లేదో, గుర్తు పట్టేశాడట. సో…. మన పని…. అదే శ్రీమాన్ సుబ్బరాజుగారి పని అయిపోయినట్లే!”
“భలే చెప్తావు నాన్నా! ఆయనని పిల్లల దగ్గర చేర్చితే కదా, మనం సాయం చేసినట్లు.” నిష్టూరంగా అంది ప్రణతి.
“అవును. అంతేగా….!” వంత పాడింది రాధిక.
“మనకెందుకే తల్లీ ఇవన్నీ…?కాగల కార్యాలన్నీ వాట్సాప్ లూ, ఫేసుబుక్కులూ చూసుకుంటాయి. వదిలేయి.” చెప్పాడు మోహన్.
“ఏంటి నాన్నా నువ్వూ…మరీ దయా, జాలి లేకుండా మాట్లాడ్తావు? ఎలా అయినా ఆ కొడుకూ కూతుళ్ళ ఆచూకీ తీయకుండా ఊరుకోను. పెట్టాల్సిన గడ్డి పెట్టి, వాళ్ళని ఆ తాతగారి దగ్గరికితీసుకెళ్ళకపోతే నా పేరు ప్రణతి కాదు.” సీరియస్ గా అంది.
ప్రణతి పట్టిన మంకుపట్టుకు తలవంచక తప్పలేదు మోహన్ కి. ఆ రాత్రికే, తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్ళాడామెని.
“తాతగారూ…మీకాయన క్లోజ్ కాకపోవచ్చు. కానీ, అప్పట్లో ఆయనతో సన్నిహితంగా ఉండే వాళ్లకి, సుబ్బరాజుగారి కుటుంబంతో పరిచయాలుండొచ్చుగా….ప్రయత్నిద్దాం ” మోహన్ స్నేహితుడు చలపతి తండ్రి రామదాసుగారిని అడిగింది ప్రణతి.
“ఏమోనమ్మా….ఎప్పుడో పాతికేళ్ళ నాటి సంగతి. అప్పట్లో మాకు సుబ్బరాజుగారు ఆఫీసర్. గడగడ లాడించే వాడు. మహా గట్టి పిండం. ఆయన దగ్గరికి వెళ్ళిన ఒక్క ఫైలు కూడా కొర్రీ లేకుండా బయట పడేది కాదు. ఆయనతో నా అనుభవం ఒకటి విను. ఓ సారి బస్సుల సమ్మె. నా చేతక్ స్కూటర్ మీద ఆఫీసుకి వెళ్తూంటే, ఈయన బస్టాప్ లో కనిపించాడు. ఎంతయినా మనాఫీసేగాఅని ఆయన్ని ఎక్కించుకుని ఆఫీసుకి తీసుకొచ్చాను. మహానుభావుడు, నేను బండి పార్కింగ్ చేసి వచ్చేసరికి నాకు లేట్ మార్క్ వేసేశాడు. అదేంటి సార్ అంటే, రూలు రూలే అన్నాడు.” అంటూనవ్వేశాడాయన.
“వాళ్ళ కుటుంబం వివరాలు తెలుసా తాతగారూ?” అడిగింది ప్రణతి.
“ఆయనకి ఇద్దరు పిల్లలనీ, భార్య జబ్బు మనిషనీ తెలుసు మాకు. పని రాక్షసుడు. ఏకో నారాయణ. ఎవరితోనూ కలిసే మనిషి కాదు. ఎవరినయినాకనుక్కుందామన్నా,నా దగ్గర చాలా మంది ఫోన్ నంబర్లు లేవమ్మా. అప్పట్లో అన్నీ ల్యాండ్ లైన్లేగా…పైగా ఎంత మంది ఇంకా బ్రతికి ఉన్నారో తెలీదు. ఆయన ఎదురు పడితే తప్పుకు తిరిగేవాళ్ళం. గాడిద వెనక్కి, బాసు ముందుకి వెళ్ళకూడదన్నది తెలుసుగా …”
“ఎందుకెళ్ళకూడదు?”
అమాయకంగా అడిగింది ప్రణతి.
“ఎప్పుడు లాగి పెట్టి ఈడ్చి తంతారో తెలీదు కాబట్టి” ఆయన మాటలకి ఫక్కున నవ్వారందరూ.
“బాగా స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్ మనిషి అన్నమాట. పోన్లెండి తాతగారూ…ఒక పని చేయండి. మీ మీ దగ్గరున్న నంబర్లు నాకివ్వండి. ప్రయత్నిస్తాను. నాన్నా! మనం సుబ్బరాజుగారిని కలవాలి ”
అసహనాన్ని కనిపించకుండా దాచుకున్నాడు మోహన్. ఫోన్ నంబర్లు రాసుకుంది ప్రణతి.
“చూడు ప్రణూ! మన పన్లుమనకున్నాయి. సోషల్ మీడియా వల్ల ఈ సరికి విషయం ఆయన పిల్లలకి చేరే ఉంటుంది. ఈ కోవిడ్ కాలంలో ఎందుకొచ్చిన గొడవ? ఇంకఊరుకో!” ఇంటికొచ్చే దార్లో అన్నాడు మోహన్.
వినలేదు ప్రణతి.
“ఏంటి నాన్నా? రేపు మేం మిమ్మల్ని వదిలేస్తే…మీకూ ఇదే పరిస్థితి వస్తే…? చదివించి ప్రయోజకుల్ని చేసిన తండ్రిని నిర్లక్ష్యం చేసే ఇలాంటి పిల్లల గురించి అందరికీ తెలియాలి. అందుకే మరిన్ని వివరాలు సంపాదిద్దాం. కాదనద్దు. రేపే నేను విజయవాడ వెళ్తున్నా…కావాలంటే, నువ్వూ రా…” పట్టుబట్టింది. తండ్రి తనకి కుదరదనడంతో, తెల్లారగానే తనే కారు డ్రైవ్ చేసుకుంటూ విజయవాడ దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళింది.
సుబ్బరాజుగారు పెద్దవారే కానీ, ఆయనకి జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా ఉంది. వీడియో లో చూసినట్లుగా కాక, మాట స్పష్టంగా ఉంది. ధారాళమయిన ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. తన పిల్లల గురించి, బంధువుల గురించి చాలా విషయాలు చెప్పారు. ఇంటిపేర్లతో సహా అందరి పేర్లూ చెప్పి, వాళ్ళందరినీ కలవాలని ఉన్నదనీ, తన ఇంట్లో తానుండాలనుకుంటున్నానని చెప్పారు. ఎంత మందికో సహాయం అందించినందుకు తనకు జరిగిన ఈ అన్యాయం తల్చుకుని బాధపడ్డారు.
“మీకేం కాదు తాతగారూ…తప్పకుండా మీ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. మన సంభాషణ మొత్తం వీడియో రికార్డు చేశాను. ఇందులో నా ఫోన్ నంబర్, మీ ఫోన్ నంబర్ రెండూ ఇస్తాను.ఇప్పుడే దీన్ని వైరల్ చేస్తాను. దిగులు పడకండి.” ధైర్యం చెప్పింది ప్రణతి.
వృద్ధాశ్రమంలో సుబ్బరాజుగారిదిఏ.సి గది. ప్రత్యేకంగా ఉంది. భోజనం, ఉపాహారం వగైరాలన్నీ ఆయన గదికే తెచ్చిస్తున్నారు. అప్పుడు సాయంత్రం అయిదవుతోంది. ఆశ్రమ నివాసితులు కొంతమంది పురాణ పఠనం, కొంత మంది తోటపని, మరి కొంతమంది వాకింగ్ లాంటివి చేస్తున్నారు.
“నా వలన మీ రోజువారీ షెడ్యూల్ దెబ్బతిన్నట్లుంది కదూ!“ వీడ్కోలు తీసుకుంటూ అడిగింది ప్రణతి.
“నాటెటాల్! వాళ్ళందరూ గదుల్లోకి వెళ్ళిపోయాక నేను వాకింగ్ కి వెళ్తాను. వాళ్ళ రేంజ్ వేరు. నా హోదా వేరు కదా…ఓకే అమ్మా…వెళ్లి రా….”
‘రామదాసు తాతగారు చెప్పినట్లు ఈయన త్వరగా కలవరెవరితోనూ’ అనుకుని అక్కడి నుంచీ బయల్దేరింది ప్రణతి.
****
“హలో…. ఎవరండీ?” మొబైల్ ఫోన్ లో ఎవరిదో అపరిచిత నెంబర్.
“ప్రణతి గారే కదా?”
“అవును. మీరు?”
“హాయ్ ప్రణతి గారూ…నా పేరు శ్రీవత్స. సిరిపురపు సుబ్బరాజుగారి అబ్బాయిని. టెక్సాస్ నుంచి మాట్లాడుతున్నాను. మా నాన్నగారి వీడియో చూసి చేస్తున్నాను. మీతో మాట్లాడొచ్చా?”
ఎగిరి గంతేయాలనిపించింది ప్రణతికి.
“ తప్పకుండా….చాలా సంతోషంగా ఉంది. మీ నాన్నగారితో మాట్లాడారా? పాపం! ఆయన ఎంత బెంగ పడుతున్నారో! అనాధ లా బ్రతుకుతున్నారండీ! మీ కోసం కలవరిస్తున్నారు. మీ అక్క గారిని చూడాలని పలవరిస్తున్నారు. ఈ చివరి దశలో ఆయన్నలాఒంటరిని చేయడం న్యాయమేనా? డబ్బే సర్వస్వం కాదండీ.. కన్నవాళ్ళ కన్నా ఏదీ ఎక్కువ కాదు. చెప్పండి. ఎప్పుడొస్తున్నారు?” ఆవేశంగా అడిగింది ప్రణతి .
“ మిస్ ప్రణతీ….చిన్నవారయినా చక్కగా చెప్పారు. చూడండి.మా అక్క పేరు సుభద్ర. తనూ మీతో మాట్లాడాలనుకుంటోంది. మీకు అభ్యంతరం లేకపోతే అక్క, మీరు, నేను కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడుకుందామా?”
ప్రణతి సరే అన్న తర్వాత, జూమ్ కాల్ చేశాడు శ్రీ వత్స. అతని సోదరి, ప్రణతి కూడా వీడియోలో ఒకరికొకరు కనిపించారు. పరస్పర పరిచయాలయ్యాయి. ప్రణతి ప్రక్కనే కూర్చున్నారు మోహన్, రాధిక కూడా.
“చెప్పండి. మీరిద్దరూఎప్పుడొస్తున్నారు? సుభద్ర గారూ! మీరుండేది భిలాయ్ లోనేగా! రెండు గంటల్లో రావచ్చు విజయవాడకి. ప్లీజ్ సుబ్బరాజు తాతగారిని ఈ వయసులో బాధ పెట్టొద్దు.”
“చూడమ్మా ప్రణతీ….నాకన్నా చాలా చిన్నదానివి కానీ పెద్ద మనసు నీది. థాంక్సేలాట్. పరుల గురించి ఆలోచించేలా పెంచిన నీ తలిదండ్రులకి నా నమస్కారం.” సుభద్ర అంది.
“సుభద్రగారూ… థాంక్స్. మన ఈ కాల్ లో మీ నాన్నగారినీకలుపుకుందాం. ఆయనెంతసంతోషిస్తారో….”
“తప్పకుండా…కానీ, ముందు, మనం మాట్లాడుకుందాం.” చెప్పాడు శ్రీ వత్స.
వీళ్ళకి తనతో ఏం పని? వాళ్ళూవాళ్ళూ కలవడం కావాలి. అది జరిగేందుకు మార్గం దొరికింది కదా? అర్థం కాలేదు ప్రణతి కి.
“మా నాన్న ప్రపంచానికి పంపిన సమాచారం, ఆయన అనుకున్నట్లుగానే అందరికీ చేరింది. మీ అందరి దృష్టిలో మేమిద్దరం విజయవంతంగా కృతఘ్నలంఅయ్యాం. అంతవరకూ ఆయన మిషన్ సక్సెస్. మా ఇద్దరికీ ఖర్చు లేకుండా పబ్లిసిటీ దొరికింది.” నవ్వాడు శ్రీవత్స.
“ఆయనను అన్యాయంగా, ఈ ఎనభై ఏళ్ల వయసులో, భార్య కూడా లేని ఆయన్ని ఒంటరిని చేయడమే కాక , పాపం, మీ మీదనే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతూంటే, ఇదా మీరనేది?” కోపంగా అంది ప్రణతి. ఇంకా ఏదేదో అనబోయిన కూతుర్నాపాడు మోహన్.
“అననీయండి సర్….మా నాన్నకి కావాల్సింది అదే!” చెప్పింది సుభద్ర.
విడ్డూరంగా చూసారు ప్రణతి వాళ్ళు.
“అవును. నాన్న. ఆ మాటకి ఉన్న విలువను తీసేశాడాయన. వయసుని, అనారోగ్యాన్ని, ప్రస్తుత పరిస్థితినీ ఉపయోగించుకుని ఇన్నాళ్ళకివలెనే ఇప్పుడు కూడా మమ్మల్ని వేధిస్తున్నాడు. అందరి ముందూ మమ్మల్ని దోషులుగా నిల్చోబెట్టాడు.” బాధ, శ్రీవత్స కంఠం లో.
“క్షమించండి…మాకేం అర్థం కావడం లేదు.” చెప్పాడు మోహన్.
“ ఇప్పుడు అమ్మే ఉండి ఉంటే, ఏమనేదోకదక్కా?” కన్నీళ్లు తుడుచుకున్నాడు శ్రీవత్స.
“ ఏమనేదిరా? అన్నం తినడానికి తప్ప అమ్మ నోరు తెరిచిందెప్పుడు కనుక? మా అమ్మ పోయిందని మేం విచారించడం లేదండీ…ఆవిడకి విముక్తి కలిగిందని ఆనందిస్తున్నాం. మోహన్ గారూ, నలభై సంవత్సరాల సాహచర్యంలో మా అమ్మ ఏడవని రోజు లేదంటే మీరు నమ్ముతారా? పాతికేళ్ళ వయసు దాకా ఆ ఇంట్లో ఆయన దగ్గర మేం నరకం అనుభవించాం. అందరూ ఆయనది క్రమశిక్షణ అనుకుంటారు. కాదు, శిక్ష అది. అమ్మ గడప దాటితే అనుమానం. పుట్టింటికి వెళ్తే అనుమానం. అన్నదమ్ములతో మాట్లాడినా అనుమానం. ఆయన ముందు గొంతెత్తి మాట్లాడితే తప్పు. కట్టు బానిసలా పడి ఉండేది. వెట్టిచాకిరి చేసి, చావు దెబ్బలు తినేది మా అమ్మ. ఆయన ఇచ్చిన కాస్త డబ్బుతో ఇల్లు గడపాలి. చిల్లర పైసలు కూడా లెక్క చెప్పాలి. అమ్మ పుట్టింటి వాళ్ళెవరూ రాకూడదు. పలకరించకుండా కట్టడి. ఆఖరికి అమ్మకి, తనకి వచ్చిన గర్భాశయ కాన్సర్ గురించి కూడా భర్తకి చెప్పుకోలేని అసహాయత. అప్పటికే పెళ్ళయి వెళ్ళిపోయిన నాకు తెలియలేదు. తమ్ముడికి తెలిసి, వాడు నాన్నకి ఎదురు తిరిగి అమ్మని చికిత్స కోసం తీసుకెళ్తే, అప్పటికే చేయి దాటి పోయింది. అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిందన్న బాధ కన్నా, ఈ రాక్షసుడి బారి నుంచి తప్పించుకుందని ఆనందించాను.” వెక్కివెక్కి ఏడుస్తోంది సుభద్ర.
నిశ్శబ్దం. ఎవరూ ఏమీ అనలేదు. శ్రీ వత్స అందుకున్నాడు.
“ప్రణతీ…ఒక్క రోజు కూడా మమ్మల్ని ఆయన దగ్గరకి తీసుకున్న పాపాన పోలేదు తెలుసా! క్రమశిక్షణ పేరుతో ఆయన పెట్టే హింసకి వణికి పోయింది మా బాల్యం. ఆట, పాట , సినిమా, షికారు ఏవీ లేవు. ఆయన చెప్పిన చదువు చదువుకోవాలి. ఇష్టం లేకపోయినా తినాలి, త్రాగాలి. ఆయన కొనుక్కొచ్చిన బట్టలే కట్టాలి. పరీక్షల్లో ఆయన అనుకున్నన్ని మార్కులే రావాలి. ఒక్క మార్క్ తక్కువొస్తే, మాతో పాటు అమ్మకి కూడా బెల్టు దెబ్బలు. నా ఇంజినీరింగ్ లో కూడా ఆయన చేతి దెబ్బలు తిన్నానంటే మీరు నమ్ముతారా? అంతెందుకు? మా అమ్మతో మేం ప్రేమగా మాట్లాడకూడదు. ఆవిడ మమ్మల్నిదగ్గరకి తీసుకుని ముద్దివ్వకూడదు. ఇప్పుడు నా కూతుర్నిచూసినప్పుడంతా, నాకు మా అమ్మే గుర్తొస్తుంది. ఆ దుర్మార్గుడిని అవతలకిత్రోసయినా మా అమ్మని నేను నాతో తీసుకెళ్ళి ఉంటే బ్రతికి ఉండేదన్న నిజం నా మనసుని చిద్రం చేస్తోంది ప్రణతీ! ” పసివాడిలాగా రోదిస్తున్నాడు శ్రీవత్స.
వాళ్ళతో పాటు ప్రణతీ, వంశీ కూడా ఏడుస్తూనే ఉన్నారు. ఎలాగో తేరుకున్న రాధిక కల్పించుకుంది.
“మగాడి ఇగో అది. మా బంధువుల్లోనూ ఇలాంటి వాళ్ళ గురించి విన్నాను. కానీ, వయసుని మన్నించి, ఆయనని క్షమించండి. ఎంతైనా మీకు జన్మనిచ్చిన తండ్రి కదా! ఒకసారి కలిసి వెళ్ళండి. మీ కోసం ఆయన ఆర్జించి పెట్టిన ఆస్తి కోసమైనా, పశ్చాత్తాప పడుతున్న ఆయనని మన్నించండి.”
“హు…ఆయన…పశ్చాత్తాపం? అసంభవం. మేమెక్కడున్నామో ఆయనకి తెలుసు. మా ఫోన్ నంబర్లూ తెలుసు. కానీ, తనంతట తాను మమ్మల్ని అడగడం ఆయనకు నామర్దా. మేమెటూ ఆయనకు సాదరంగా స్వాగతం పలకం అని తెలుసు. అందుకే, మీడియాని ఉపయోగించుకున్నాడాయన. ప్రపంచం ముందు మమ్మల్ని నమ్మక ద్రోహులుగా, విశ్వాస ఘాతుకులుగా ప్రెజెంట్ చేశాడు.
చూడండి సర్…మాకేమీ ఆయన ఆస్తి అక్కర్లేదు. ఆయన అంతకన్నా అక్కర్లేదు. ఎప్పుడయినా, ఎక్కడయినా, పెట్టుబడి మీదే కదా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఆయనే కనుక మా మీద, మా అమ్మ మీద ప్రేమ, ఆప్యాయత అనే పెట్టుబడి పెట్టి ఉంటే, ఈ రోజున మాతో మాత్రమే కాదు మా పిల్లలతో కూడా మమతానుబంధమనే రిటర్న్స్ వచ్చి ఉండేవి. వస్తూనే ఉండేవి.” చెప్పింది సుభద్ర.
వాళ్ళిద్దరి మాటల్నీ ఖండించేందుకు ప్రణతి వద్ద మాటలూ లేవు. వయసూ లేదు.
“ఒక నాన్న ఎలా ఉండకూడదో చెప్పారు సుబ్బరాజు గారు. కదు నాన్నా!” తండ్రి భుజం మీద వాలింది ప్రణతి .
“ గుడ్ బై. నీ మంచి మనసును అలాగే కాపాడుకుంటూ జీవితంలో ముందుకు సాగు చెల్లాయ్!” నిష్క్రమించింది సుభద్ర. శ్రీ వత్స కూడా వీడ్కోలు పలికి మీటింగ్ నుండి వెళ్ళిపోయాడు.
*****
“ డియర్ ప్రణతి… నువ్వన్నట్లే, మేం మా నాన్నలా ఉండకూడదని అనుకున్నాం. అందుకే, అక్కా, నేనూ మా నాన్నతో మాట్లాడాం. త్వరలో వస్తామని చెప్పాం. మా అమ్మే నీ రూపంలో వచ్చి నాన్ననుమన్నించమందేమోఅనిపిస్తోందమ్మా! గాడ్ బ్లెస్ యు!” నిద్ర లేస్తూనే, శ్రీవత్స పంపిన మెసేజ్ చూసిన ప్రణతి కళ్ళు చిప్పిల్లాయి. మనస్పూర్తిగా నిట్టూర్చింది.
***