పవన్ కుమార్ గారు..నమస్తే…ఈరోజు మిమ్మల్ని ఇలా
కలుసుకొని మా పాఠకులకు పరిచయం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను…
చెప్పండి….
1. మీరు ఎక్కడ జన్మించారు? మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? మీ తల్లిదండ్రుల వివరాలు చెప్పండి..
జ: అందరికీ నమస్కారాలు. ముందుగా పాఠకులందరికీ కళాభివందనాలు. నేను పుట్టింది హైదరాబాద్ లో కానీ మా నాన్నగారి స్వస్థలం ప్రస్తుత యాదాద్రి జిల్లా రామన్నపేట గ్రామం. నేను 1వ తరగతి నుండి 3వ తరగతి వరకు అక్కడే చదివాను. తర్వాత నాట్యం నేర్చుకోవడానికి హైదరాబాద్ కి వచ్చాను.ఇక మిగిలిన విద్యాభ్యాసం అంతా ఇక్కడే కొనసాగింది.మా నాన్నగారి పేరు చేగొమ్మ రమేశ్ శర్మ. మా అమ్మగారి పేరు సుభద్ర. మా నాన్నగారు రామన్నపేట మండలంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చకులుగా పని చేసారు. సుమారు 4,5 గ్రామాల్లో పౌరోహిత్యం చేసేవారు.
2. అసలు మీరు ఈ నాట్య రంగాన్ని ఎంచుకోవడానికి మీ పూర్వీకుల సంస్కారం ఏమైనా ఉందా? నాట్యం నేర్చుకోవాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది?
జ: మా ఇంట్లో ఎవరు కూడా నాట్యం నేర్చుకున్నవాళ్ళు
లేరు. పూర్వీకుల నుండి వచ్చింది కూడా కాదు. కానీ మా కుటుంబమంతా కళాభిమానులు. ముఖ్యంగా నేను ఈ నాట్యరంగానికి రావడానికి కారణం సాగర సంగమం చిత్రం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చినటువంటి సాగర సంగమం చిత్రం లోని కమలహాసన్ డాన్స్ చూసి ప్రభావితుడినై నాట్యం నేర్చుకోవడం మొదలు పెట్టాను. నా మూడవ ఏటనే ఆ చిత్రంలోని ఓం నమశ్శివాయ పాటకు అనుగుణంగా అడుగులు వేస్తుంటే మా తాతగారు (మా అమ్మగారి నాన్నగారు) మధ్వాచారి శ్యామ్ సుందరశాస్త్రి గారు, ధర్మపురి వాస్తవ్యులు, ఆయన ధర్మపురి సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసారు. ఆయన నన్ను ఎలాగైనా కళాకారునిగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో నన్ను హైదరాబాద్ తీసుకువచ్చారు. నాట్య శిక్షణ ఇప్పించారు.
3. మీరే కాకుండా మీ కుటుంబంలో ఇంకెవరైనా ఈ కళను నేర్చుకున్నారా?
జ: నేను కాకుండా మా ఇంట్లో మా పెదనాన్నగారి కూతురు కూడా కూచిపూడి నృత్యంలో డిప్లొమా చేసింది. కాకపోతే తనద్వారా అని చెప్పలేను. ఎవరి తోవ వారిదే. నేను నేర్చుకున్న పద్ధతికి, తన పద్ధతికి వ్యత్యాసం ఉంటుంది. ఇంక ఎవరూ లేరు.
4. ప్రముఖ నాట్యకారులు, భరత నాట్యానికే మకుటాయమానమైన నటరాజ రామకృష్ణ గారు మీ గురువులని విన్నాం…ఆ దిశగా మీ ప్రయాణం ఎలా జరిగింది?
జ : ముందు చెప్పినట్టుగా మా తాతగారు శ్యామ్ సుందర్ గారు 15, 20 రోజులు కారణ రీత్యా మా ఊరిలో ఉండవలసి వచ్చింది. అదే సమయంలో గ్రామస్తులు నా ప్రదర్శన ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని చూసిన మా తాతగారు ఏ శిక్షణ లేకుండానే నా మనవడు ఇంత బాగా
చేయగలుగుతున్నాడు. ఇక శిక్షణ ఇప్పిస్తే ఒక మంచి కళాకారుడిగా ఉన్నత స్థానాన్ని పొందుతాడని, ఎలాగైనా నాట్యకళను అభ్యసింప చేయాలనే ఉద్దేశ్యంతో తన స్నేహితులైనటువంటి ప్రముఖ నటి జమున గారిని సంప్రదించడం, ఆమె సలహా మేరకు, ఆమె సహకారంతో వారి కుతురైన స్రవంతి, నేను ఒకేసారి నటరాజ రామకృష్ణ గారి వద్ద నాట్య శిక్షణ ప్రారంభించడం జరిగింది. 1986 లో ఆ మహనీయుని వద్ద తొలిపూజ జరిపించుకొని ప్రదర్శన ఆరంభించాను.
5. మీరు ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు? విదేశాల్లో కూడా ఏమైనా ప్రదర్శించారా?
జ: ఇప్పటి వరకు సుమారుగా దేశ విదేశాల్లో కలిపి ఆంధ్రనాట్యం, పేరిణి, అర్ధనారీశ్వర రూపాలలో 1000కి పైగా ప్రదర్శనలు ఇచ్చి ఉంటాను. విదేశాలలో అయితే అమెరికా, మలేషియా, దుబాయ్, శ్రీలంక, జపాన్ లలో అనేక ప్రదర్శనలు ఇచ్చాను. ఇక జపాన్ లో 15రోజులు కళాకృష్ణ గారి ఆధ్వర్యంలో సంగీత నాటక అకాడెమీ ద్వారా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది.
6.మీ నాట్య కళాభిమానాన్ని మీ భార్య, కూతురు కూడా వారసత్వంగా తీసుకున్నారని తెలిసింది…ఆ ఆసక్తి వాళ్ళల్లో ఎలా కలిగింది?
జ: నా వారసత్వంగా నా కూతురు నాట్యం నేర్చుకుంది. నా శ్రీమతి కాదు. ఆమె తన చిన్నప్పటి నుంచీ అంటే మూడేళ్ళ వయసు నుండే నాట్యాన్ని నేర్చుకుంది. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నేను డాన్సర్ ని కావడం, తను కూడా అప్పటికే ప్రముఖ నర్తకి అయి ఉండడం వల్ల జీవిత భాగస్వామి డాన్సర్ అయితే బాగుంటుందనే ఇద్దరి అభిప్రాయాలతో మాకు పెళ్లి నిశ్చయం జరిగింది. మా వారసత్వంగా మా అమ్మాయి కూడా నాట్యం నేర్చుకొని మాతో పాటు ఇప్పుడు ప్రదర్శనలు ఇస్తోంది.
7. పేరిణి శివతాండవంతో పాటు అర్ధనారీశ్వర రూపాన్ని అభినయించడం మీ ప్రత్యేకత. దీన్ని గురించి పూర్తిగా అర్థమయ్యేట్లు చెప్పండి…అది మీకు ఎలా సాధ్యమైంది?
జ: నేను ఆంధ్ర, పేరిణి ఈ రెండు నృత్యాలు నటరాజ రామకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నాను. అలాగే కళాకృష్ణ గారి శిక్షణ కూడా పొందాను. ఇవే కాకుండా కొంతకాలం కథక్, కూచిపూడి నేర్చుకున్నాను. అంతగా కాదు కానీ అవగాహన కోసం కొంత కొంత నేర్చుకున్నా. అయితే కళాకృష్ణ గారు ‘సప్త తాండవాలు’ అని తన ఆధ్వర్యంలో కొత్తగా ప్రదర్శించాలి అనుకొని ఆ కాన్సెప్ట్ డిజైన్ చేశారు. అందులో ఈ అర్ధనారీశ్వరం ఒకటి. దీన్ని ప్రదర్శించడానికి నన్ను ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే చిన్నప్పటినుండీ నాట్యం – లాస్యం, పేరిణి- తాండవం రెండూ చేయడం అలవాటు నాకు. అంటే అటు నవ జనార్దన పారిజాతం, ఇటు భామా కలాపం రెండింటిలో ఆడవేషం వేసేవాన్ని. రెండూ సమానంగా ప్రదర్శిస్తూ ఉండడం, నాకు ఆయన అర్ధనారీశ్వర నృత్యం నేర్పించడానికి ముఖ్య కారణం. ఆయన నన్ను ఎంచుకున్నందుకు, ఇప్పుడు నేను దాన్ని ప్రచారం చేస్తూ ప్రదర్శిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.
అందరికీ తెలిసిన అర్ధనారీశ్వర ప్రదర్శన అంత సులువైంది కాదు. ఒకవైపు లాస్యం, మరోవైపు తాండవం రెండింటినీ ఏక కాలంలో, క్షణాల వ్యవధిలో అభినయం మారుస్తూ, ఇటు పార్వతి, అటు శివుని అనుకరిస్తూ వారి తత్వాన్ని చూపిస్తుండాలి. మొదటి నుండీ స్త్రీలను గౌరవించడం నా లక్షణం. ముఖ్యంగా ప్రేరణ కలిగించింది ఏంటంటే శివుని తత్వం. ఎందుకంటే స్త్రీ సమానత్వాన్ని చాటుతూ తన శరీరంలోని అర్ధ భాగాన్ని భార్యకిచ్చి ఋజువు చేయడం జరిగింది. ఇది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అటువంటి అద్భుతమైన తత్వాన్ని ప్రదర్శించడం నాకు ఎంతో ఇష్టం. అదే దిశగా వీలైనంత ఎక్కువగా దీన్ని ప్రదర్శించ డానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాను. భగవంతుని దయ వలన నా ప్రదర్శనకు ప్రేక్షకుల నుండి అంతటి స్పందన రావడం, ఆప్రదర్శనలకే ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతోంది. ప్రత్యేకంగా ఒక అర్ధనారీశ్వర కళాకారునిగా గుర్తింపు తెచ్చుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తోంది.
8. మీరు కాక ఈ నృత్యాన్ని ప్రదర్శించేవాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా?
జ: అర్ధనారీశ్వర నృత్యాన్ని ప్రదర్శించేవాళ్ళు వున్నారు. లేరని కాదు. కానీ వేళ్లల్లో లెక్క బెట్టగలిగేంత మంది మాత్రమే వున్నారు. అందులో నాకు బాగా తెలిసినంతవరకు అర్ధనారీశ్వరం వెంకట్ మరియు వెంపటి చినసత్యం గారి అబ్బాయి వాళ్ళిద్దరి అర్ధ నారీశ్వర నృత్యం చూడడం జరిగింది. అయితే వారిద్దరూ కూచిపూడి సాంప్రదాయంలో ప్రదర్శిస్తారు. నాది నటరాజ రామకృష్ణ గారి పద్ధతి. అలా ఎందుకంటున్నానంటే ఇందులో సాహిత్యం గానీ జతులు గానీ ఆయన రూపకల్పన చేసినటువంటిది. ఆయన రచించిన ‘ పేరిణి శివతాండవం’ లో ఈ జతులు, సాహిత్యం మనం చూడొచ్చు. ఆయన శిష్యుడిగా ఇదే నేను చేసేది. కాబట్టి ఈ పద్ధతిలో చేసే వాణ్ణి నేనొక్కడినే అని చెప్పడంలో సందేహం లేదు. ఇంకా ఉన్నారా అంటే ఉండొచ్చు. కానీ మంచి గుర్తింపు తెచ్చుకున్న వాణ్ణి మాత్రం నేనే. కళాకృష్ణ గారు 20 సంవత్సరాల క్రింద ఈ అర్ధ నారీశ్వర నృత్యాన్ని (ఇప్పుడు నేను ప్రదర్శిస్తున్న పద్ధతిలో) లండన్ టెలివిజన్ కోసం రికార్డింగ్ చేయించడం జరిగింది. దాన్నిఆయన లండన్ టెలివిజన్ కోసం ప్రదర్శించి, ఆ రికార్డింగ్ ని, ఆ కాస్ట్యూమ్స్ ని నాకు ఇవ్వడం జరిగింది.అప్పటినుండీ దాన్ని కొనసాగిస్తూ వాటిని ఆయన వారసత్వంగా ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాను.
9. నాట్య శాస్త్రాన్ని అభ్యసించేటప్పుడు మీకు కలిగిన అనుభవాలు ఎలాంటివి?
జ: నాట్యం నేర్చుకోవడంతో అనుభవమంటే అదొక ప్రత్యేకమైన మార్గం. మిగిలిన విద్యలు అంటే ఉ:- సంగీతం. దీనికి గొంతు బాగా ఉండి, రాగాలు, తాళాలు, శ్రుతుల పైన పట్టు ఉంటే అద్భుతమైన కళాకారులు అవ్వొచ్చు. కాకపోతే నాట్యానికి అవన్నీ ఉండడంతో పాటుగా ఇటు శరీరాన్ని కూడా సరియైన పద్ధతిలో కదిలిస్తూ ఉండగలగడం, ముద్రలు, అభినయాలు ప్రదర్శించడం చాలా అవసరం. చతుర్విధ అభినయాల్లో ఏ ఒక్కటీ సరిగ్గా లేకున్నా ఆ ప్రదర్శన రక్తి కట్టదు. అందువల్ల ఆ చతుర్విధ అభినయాలు నేర్చుకోవడం వల్ల నాట్యం రాణించడమే కాక మన జీవితంలో ఎన్నింటికో కూడా అది ఉపయోగపడుతుంది. సమాజంలో ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందడం సాధ్యమవుతుంది. మనం వేసుకునే దుస్తులు మన వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తాయి. ముఖ్యంగా నాట్యంలో ఆహార్యానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. దీనివల్ల మనం ఎక్కడ ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎక్కడ, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా తయారవ్వాలి అన్నది తెలుస్తుంది. ఇంకొకటి సంస్కారం మెరుగు పడుతుంది. ఒక నాట్యమే కాదు. భారతీయ శాస్త్ర కళలు ఏవైనా అవి సంస్కారాన్ని పెంచుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు.లలితకళలే కావొచ్చు, వాయిద్య పరికరాలే కావొచ్చు..ఏదైనా భారతీయ శాస్త్ర కళలు నేర్చుకున్నవారిలో అద్భుతమైన సంస్కారం కనిపిస్తుంది. అది మన భారత శాస్త్రీయ కళల గొప్పదనం. ఇది అభ్యసించేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులను నేను కూడా ఎదుర్కొన్నాను. ప్రతీ రంగంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అలాగే నేనూ శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. శరీరం ఒక్కొక్కసారి అనుకూలించకపోవడం అంటే నాట్యంలో తల నుండి పాదాలదాకా అనుకూలంగా ఉండాలి. అయితేనే మనం ఈ నాట్యాన్ని చక్కగా ప్రదర్శించగలుగుతాం. ఒక్కొక్కసారి కాళ్లు గాని, చేతులు గాని సరిగా పనిచేయకపోవటం ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు. అన్నింటినీ తట్టుకోగలగాలి. మన బాధలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మర్చిపోయి వేదిక మీద ప్రదర్శించే ముందు ప్రేక్షకుల ముందు వాళ్ళని మెప్పించగలిగేలా, వాళ్లకు సంతోషం కలిగించేలాగా మనం మారి ప్రదర్శించాలని నా ఉద్దేశం. మన వ్యక్తిగత సమస్యలు వేదిక మీద చూపించకూడదు. ఒక్కసారి వేదిక మీదకు ఎక్కామంటే కళాకారునిగా మారిపోవాలి. ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగలగాలి. అప్పుడే ప్రేక్షకులను రక్తి కట్టించగలుగుతాము. అలా చేయడం కోసం ఎన్నోసార్లు చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. కాకపోతే అన్నింటిని అధిగమించి ప్రదర్శిస్తూ వస్తున్నాను. ఇంకా అధిగమించాల్సింది చాలా ఉంది ప్రస్తుతం ఈ స్థాయికి రావడం ఆ భగవంతుని అనుగ్రహంగా భావిస్తున్నాను.
10. సహజంగా ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో నాట్యం నేర్చుకోవాలంటే ఎలాంటి సాధన అవసరం? పరిపూర్ణ నాట్య కళాకారులు అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది?
జ: పరిపూర్ణమైన నృత్యకారుడవడం అనడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం. వాళ్ళు నేర్చుకునే నృత్యాన్ని బట్టి, వాళ్ళ గురువులను బట్టి, వారి శరీర అనుకూలతలను బట్టి అంటే అన్నింటిని ఆధారంగా చేసుకుని ఉంటుంది. కొందరు రెండేళ్లలోనే మంచి కళాకారులుగా ప్రదర్శనలు ఇస్తుంటారు. మరి కొంతమంది అయిదు, పదిహేను సంవత్సరాలు నేర్చుకున్నా కూడా ఏదో ప్రదర్శిస్తారు. కానీ వాళ్ళ ప్రదర్శన అంత రక్తి కట్టించేలాగా ఉండదు. మరి కొంతమంది నేర్చుకోకుండా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చే వాళ్లయి ఉంటారు. అంటే ఇది ఒక సమయం అంటూ చెప్పలేము. కాకపోతే మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా. ఇప్పుడు విద్యారంగంలో మన ఈ కళలు కూడా చేర్చడం వల్ల ఏదైతే మనకు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలలో కోర్సులు పెట్టడం జరిగిందో, ఆ కోర్సుల్లో సర్టిఫికెట్ కోర్సు చేయడానికి నాలుగు సంవత్సరాలు, డిప్లొమా కోర్సుకి మరి రెండు సంవత్సరాలు కలిపి మొత్తం ఆరు సంవత్సరాలు సర్టిఫికెట్ మరియు డిప్లొమా కోర్సులు సాధించడానికి టైం పడుతుంది. కనుక ఆ ఆరు సంవత్సరాలు శ్రద్ధగా నేర్చుకున్నట్టయితే ఒక మంచి కళాకారుడు అవడంలో ఎలాంటి ఆశ్చర్యం ఉండదు.
10. వాగ్దేవి ఆర్ట్స్ అకాడెమీ ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఎలా రూపుదిద్దుకొంది?
జ: నేను సుమారుగా 10 ఏళ్లకు పైగా నాట్యం నేర్చుకున్న తర్వాత చిన్న చిన్న స్కూల్స్ లో, ఊర్లో కొంతమందికి నాట్యం నేర్పించడం ప్రారంభించాను. నాకు వచ్చినటువంటి విద్యను వాళ్లకు నేర్పించేవాడిని. ముఖ్యంగా వేసవి సెలవుల్లో ‘కళాపరిచయం’ అని అప్పట్లో ప్రభుత్వం ప్రారంభించినప్పుడు నేను ప్రతీ సంవత్సరం అందులో ఎంతో మంది విద్యార్థులకు నృత్యాన్ని పరిచయం చేయడం జరిగింది. అలా అలా స్కూల్స్ లో వార్షికోత్సవాలకు పిల్లల చేత నాట్య ప్రదర్శనలు చేయించేవాడిని. పెళ్లయిన తర్వాత ఆ భగవంతుని దయవలన నా జీవితంలో ప్రవేశించిన నా భార్య కూడా నర్తకి అవ్వడం వలన ఇద్దరము కలిసి వాగ్దేవి అకాడమీ స్థాపించాము. దీని ద్వారా మాకు తెలిసిన ఈ నృత్య కళను పదిమందికీ పంచాలని, అలా ఈ కళను తర్వాతి తరాల వారికి నిలబెట్టాలనే సదాశయంతో దీన్ని స్థాపించి సంతృప్తులమయ్యాము. వాగ్దేవి అని ఎందుకు పెట్టుకున్నాను అంటే ఆ పేరు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం కావడం, విద్యా దేవత అయిన సరస్వతి పేరు పెట్టుకోవడం వలన ఆ తల్లి అనుగ్రహం మామీద పరిపూర్ణంగా ఉండాలని అకాడె మీకి ఆ పేరు పెట్టడం జరిగింది.
11. ప్రస్తుతం ఈ అకాడెమీలో ఎంతమంది నాట్యకళను అభ్యసిస్తున్నారు? తల్లిదండ్రుల ప్రోత్సాహం ఏ రకంగా ఉంది? దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు?
జ: ఈ అకాడెమీ ద్వారా సుమారుగా 200 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. కాకపోతే మనందరికీ తెలుసు కరోనా మహమ్మారి అన్ని రంగాలతో పాటు కళా రంగంలో ఉన్న వారిని కూడా చాలా దెబ్బతీసింది. ప్రదర్శనలకు సరైన అవకాశాలు రాకపోవడం, విద్యార్థులు భయపడి క్లాసులకు రాకపోవడం… ఇప్పటికీ కూడా కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించడానికి భయపడుతున్నారు. ఇప్పుడిప్పుడే అటువంటి పరిస్థితులు మెరుగు పడుతున్నాయి. కరోనాకి ముందు సుమారు మా దగ్గర 30 నుండి 40 మంది విద్యార్థులు నిరంతరం నేర్చుకుంటూ ఉండేవారు. కరోనా తర్వాత ఆ సంఖ్య బాగా తగ్గిపోయింది. పదుల సంఖ్యలో ఇప్పుడు విద్యార్థులు రావడం జరుగుతుంది. అది కూడా అతి కష్టం మీద. ఎందుకంటే కరోనా పరిస్థితులు మెరుగైన తర్వాత విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అకడమిక్స్ లో ఇంతకుముందు విద్యార్థులపై ఇంత ఒత్తిడి ఉండేది కాదు. రెండు సంవత్సరాల అకడమిక్స్ దెబ్బ తినడం వలన చిన్న చిన్న స్కూల్స్ నుంచి పేరుపొందిన స్కూల్స్ వరకు చదువు పైన బాగా కాన్సన్ట్రేషన్ చేయించడం, దాని కోసం పిల్లలను ఎక్కువ సమయం స్కూల్స్ లో ఉండేలా చేయడం, హోంవర్క్ ఎక్కువగా ఇవ్వడం, ఇలాంటి వాటివల్ల ఆక్టివిటీస్ కి సమయం ఎక్కువ కేటాయించలేకపోవడం వల్ల ఇలాంటి అకాడెమీలకు రావడం తగ్గింది. రాను రాను పరిస్థితులు మెరుగు పడతాయని అనుకుంటున్నాం. కాకపోతే ఇంకా మార్పు రావాలి. ఎవరికైతే వీటిపట్ల అవగాహన ఉందో వారే తమ పిల్లల్ని శిక్షణ కోసం పంపిస్తున్నారు.మేము ప్రైవేట్ గా కూడా సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను ఆంధ్రనాట్యం, పేరిణి, కూచిపూడి ఈ మూడు నృత్యాలలో చేయించడం జరుగుతోంది. నేను ప్రస్తుతం శ్రీ భక్త రామదాస ప్రభుత్వ నృత్య కళాశాలలో గత ఆరు సంవత్సరాలుగా పేరిణి అధ్యాపకునిగా పని చేస్తున్నాను. అక్కడ పేరిణి నృత్యానికి సంబంధించిన విద్యార్థులకు సర్టిఫికెట్ కోర్సుల్లో ఉత్తీర్ణులు అవ్వడానికి శిక్షణ ఇస్తున్నాను. కళాశాల విద్యార్థులే కావచ్చు అకాడెమీ విద్యార్థులే కావచ్చు. అందరూ కూడా నా ప్రతి ప్రదర్శనలో పాల్గొంటూ మా అకాడెమీ ద్వారా ఇచ్చే ప్రదర్శనలన్నింటిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే వాగ్దేవి ఆర్ట్స్ కేవలం నాట్యం నేర్పించడమే కాక కళా రంగంలో మన సంస్కృతి సంప్రదాయాన్ని ముందు తరాల వారికి నేర్పించే ఉద్దేశంతో స్థాపించినటువంటిది కాబట్టి మా వంతుగా మా శక్తికి మించి ఒక చిత్రాన్ని నిర్మించడం జరిగింది.2019వ సంవత్సరంలో మా సంస్థ తరఫున ‘నర్తన’ అనే చిత్రాన్ని నిర్మించాము. ఆ చిత్రంలో..ఒక నాట్యమే ఆధారంగా జీవిస్తున్న కుటుంబంలో ఉండే ఎమోషన్స్ అంటే ఒక గురువుకి ఉండాల్సిన లక్షణాలు, ఉండకూడనివి ఏమిటి? నాట్యం నేర్చుకోవాలనుకునే విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? అనే ముఖ్యమైన అంశాలే కాకుండా ఒక కుటుంబంలో ఉండే సంబంధ బాంధవ్యాలను చూపిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించాం. దీనికి ఎంతో గొప్ప గుర్తింపు వచ్చింది ఎవరైతే కొంతమంది గొప్ప పేరు గడించిన నాట్య కళాకారులు ఉన్నారో వారు ఈ చిత్రాన్ని చూసి విశ్వనాథ గారి జోనల్లో చేయడం జరిగిందని మెచ్చుకున్నారు. మీరు అందరూ కూడా తప్పకుండా ఈ చిత్రాన్ని చూసి మీ యొక్క అభిమానాన్ని తెలుపుతారని అనుకుంటున్నాను. ఇది యూట్యూబ్ ఛానల్ లో అందుబాటులో ఉంది. మా శక్తికి మించి ఈ చిత్రాన్ని నిర్మించాము. ‘నర్తన ఇండిపెండెంట్’ అనే చిత్రం మీరందరూ చూడాలని కోరుకుంటున్నాను. నేను, నా భార్య, నా కూతురు నటించిన ఈ చిత్రంలో నా కూతురుకు తాతగా కళా కృష్ణ గారు నటించడం గొప్ప విషయం.
12. భవిష్యత్తులో ఈ అకాడెమీని ఇతర ప్రాంతాల్లో కూడా వ్యాప్తిలోకి తేవాలనుకుంటున్నారా?
జ: మా అకాడెమీ ఒక ప్రాంతానికి పరిమితం కాదు. అలా పరిమితం చేయాలని కూడా అనుకోవడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం మేము కొత్తపేటలో నివాసం ఉంటున్నాము. ఇక్కడ, అలాగే అంబర్ పేటలో నా శ్రీమతి సంధ్య వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ బ్రాంచ్ లో క్లాసులు తీసుకుంటుంది. అలాగే నా శిష్యురాలు ఒకరు అమెరికాలో కూడా ఈ అకాడెమీ పేరు మీద నృత్య శిక్షణ ఇస్తున్నారు. ఇంకా మా శక్తిని బట్టి వీలైనంత మేరకు బ్రాంచ్ లు ఓపెన్ చేసి విస్తృత పరచాలని అనుకుంటున్నాము.
13. నాట్య కళా ప్రావీణ్యత పొందిన మీకు ఎటువంటి సత్కారాలు లభించాయి? పొందిన పురస్కారాలు ఏవి?
జ: నాకు ఇప్పటివరకు మంచి గుర్తింపు, గౌరవం నాట్యకుల ద్వారా లభించింది. ‘నాట్య కుమార’ అనే బిరుదు ‘పేరిణి నాట్య రత్నాకర’, ‘యువ కళా రత్న’ మరియు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతిభా పురస్కారం నేను పొందడం జరిగింది. ఇంకా అనేక ఇతర సంస్థల నుండి ప్రశంసలు, సన్మానాలు పొందడం జరిగింది. అలాగే నా శ్రీమతి కూడా ‘నాట్య శిరోమణి’, ‘యువ కళారత్న’ వంటి అనేక అవార్డులను సన్మానాలను పొందడం జరిగింది. నా కూతురు శ్రీ నర్తన సి.సి.ఆర్.టి స్కాలర్ షిప్ ను పొందింది. ప్రస్తుతం తాను ఇంటర్మీడియట్ చదువుతోంది.
14.రామప్ప దేవాలయం ముందు 1985 ,86 లలో అనుకుంటా… వందమంది కళాకారులు ఒకే వేదికపై ఒక్కసారి పెద్ద నాట్య ప్రదర్శన చేసారు. అప్పుడు మీరు పాల్గొన్నారా? ఆ విశేషాలు ఈనాటి తరానికి తెలియచెప్పండి.
జ. అవును జరిగింది. అప్పుడప్పుడే నేను నటరాజ రామకృష్ణ గారి దగ్గర నృత్య శిక్షణ ప్రారంభించి ఉన్నాను. అప్పుడు కేవలం నా వయసు ఐదు సంవత్సరాలు ఉండడం వలన వారు నన్ను రామప్పలో జరిగిన ఆ కార్యక్రమానికి తీసుకెళ్లారు. ఆ ప్రదర్శన చూడడం మాత్రమే జరిగింది. అలాగని అవగాహన లేదు అనలేను. కాకపోతే లీలగా కాస్త గుర్తుంది. ఒక జాతర లాగా వేల మంది ప్రజలు అక్కడికి రావడం, ఆ వేదిక పైన 100 మంది ఒకేసారిగా అద్భుతమైన నాట్యాన్ని ప్రదర్శించడం, ఒక ముగ్గురు, నలుగురు మార్దంగీకులు మృదంగాన్ని వాయిస్తూ ఉంటే అద్భుతమైన ధ్వని రావడం.. ప్రజలందరిలో ఒక వైబ్రేషన్ కలిగించడం.. ఆ కళాకారులు ప్రదర్శిస్తూ ఉంటే ప్రకృతి అంతా పులకించి పోవడం.నిజంగా ఆ వయసులో అంతకుమించి అనుభవం కూడా ఉండదు. కానీ ఇవన్నీ లీలగా నాకు గుర్తున్న విషయాలు. అప్పటికే ప్రసిద్ధి పొందిన పేరిణి నాట్యకళాకారులు విఠల్ గారు ఆ ప్రదర్శనలో పాల్గొనడం గుర్తుంది. అప్పుడు నటరాజ రామకృష్ణ గారి వద్ద ఉన్న శిష్యుల్లో నేను చిన్నవాడిని కనుక అందరూ నన్ను ఆత్మీయంగా చూసేవారు.
15. భరత నాట్య రీతుల్లో ఏవి ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి?
జ: భారత శాస్త్రీయ నృత్యాల్లో అంటే క్లాసికల్ డాన్స్ అనగానే మన భారత దేశంలో భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సి, కథాకళి, మోహినీ ఆట్టం ముందుగా గుర్తొస్తాయి. అయితే ఇవే కాకుండా ఇంకా ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఇంకా గుర్తింపు లోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. వాటిలో పేరిణి ఒకటి, ఆంధ్రనాట్యం కూడా ఒకటి. గుర్తింపు ఉన్నప్పటికీ సంగీత నాటక అకాడెమీ గుర్తింపు కోసం మేము మా శాయ శక్తులా కృషి చేస్తున్నాము. అలాగే పేరిణి నాట్యానికి కూడా మంచి గుర్తింపు వచ్చి సంగీత నాటక అకాడెమీల ద్వారా గుర్తింపు పొంది భావితరాల వారికి భారత శాస్త్రీయ నృత్యాల్లో ఇవి కూడా చేర్పించి మంచి స్థానాన్ని పొందే విధంగా ఉంటాయని ఆశిస్తున్నాను. ఒక శుభకరమైన విషయం ఏంటంటే ఇటీవల సంగీత నాటక అకాడమీ ఇచ్చేటువంటి యువపురస్కారాలు ఏవైతే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పేరు మీద ఇస్తున్నారో, తొలిసారిగా పేరిణి నాట్యానికి గాను రాజ్ కుమార్ గారికి ఆ పురస్కారం రావడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. ఒకసారి ఇచ్చారంటే దానిని గుర్తించారనే కదా! అలాగే ఇంకా ఎన్నో పురస్కారాలు పేరిణి కళాకారులకు రావాలని ఆశిస్తూ అలాగే కళాకారులతో పాటుగా నాట్యానికి మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నాను.
16. మీరు ప్రదర్శించే నాట్యంలో కొత్త విధానాలను ఏమైనా ప్రవేశపెట్టాలనుకుంటున్నారా ?
జ: పేరిణి నృత్యం లో మూడు నూతన అంశాలను గురువు కళా కృష్ణ గారి నేతృత్వంలో నేను, నా శ్రీమతి కలిసి రూపకల్పన చేయడం జరిగింది. వాటిలో సప్త తాళ రాగ స్వర నర్తన ఒకటి. అలాగే హంసగతి రెండవది. మూడవది సూర్య నమస్కారాలు. ఈ మూడు అంశాలని మేము కొత్త రీతులుగా మా విద్యార్థులకు నేర్పించి, ప్రదర్శిస్తున్నాం. ఇవి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కి అంటే పిల్లలకు ఇతరములైన వాటి పట్ల సమయం చాలా తక్కువ అయింది. అకడమిక్స్ వైపు ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల వేరే శిక్షణకు సమయం లేకుండా పోయింది. కాబట్టి మానసికంగా శారీరకంగా దృఢత్వాన్ని పొందే విధంగా, యోగాభ్యాసం ముందు తరాలకు తెలిసే విధంగా, నాట్య రూపంలో మేము యోగాలో ఉపయోగించే సూర్యనమస్కారాలను నృత్య సంప్రదాయాల్లో చేయాలనుకున్నాం. సహజంగా యోగాలో సూర్య నమస్కారాలకి రాగం,తాళం,లయ ఉపయోగించరు. మేము అలా కాకుండా ఐదు గతులలో,జతులతో సహితంగా ఈ సూర్య నమస్కారాలను మిళితం చేసి ఈ అంశాన్ని రూపకల్పన చేశాము. అలాగే సంగీతంలో గాని, నాట్యంలో గాని ఒకే అంశంలో లేదా ఒక కీర్తనలో లేదా ఒక జావళిలో గాని ఏడు తాళాలను ఉపయోగించడం చాలా అరుదు. అలా మేము ఒకే అంశంలో సప్తతాళాలని ఉపయోగించి, వాటికి అనుకూలమైన ఏడు రాగాలని తీసుకొని వాటికి సంబంధించిన స్వరాలు, ఆ తాళాలకు సంబంధించిన జతులను రూపకల్పన చేసి దానిని ప్రదర్శించడం జరిగింది. ఇక మూడవ అంశం హంసగతి .దీనిలో పేరిణి పంచాంగాలుగా ప్రదర్శించడం జరుగుతుంది. ఇందులో భావాశ్రయమంటే అనుకరణ. మనుషుల లాగా కాకుండా జంతువులుగా పక్షులుగా అనుకరించడం అనేది భావాశ్రయం ప్రత్యేకత. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక హంస బ్రహ్మ లోకంలో సరస్వతి అమ్మవారు అద్భుతంగా వీణను వాయిస్తూ ఉంటే ఆ వచ్చే నాదాన్ని విని మైమరచి ఒక నర్తకి గా మారి ఆ వీణా నాదానికి అనుగుణంగా నృత్యం చేస్తే ఎలా ఉంటుందన్న ఒక కాన్సెప్ట్ తీసుకొని హంసగతి అన్న అంశాన్ని రూపొందించడం జరిగింది. ఈ మూడు నృత్యంశాలు కూడా మాకు మంచి గుర్తింపును తెచ్చాయి. దీనిని తిలకించిన కళాకారులందరూ ఎంతగానో మెచ్చుకోవడం జరిగింది ఇంకా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం.
17. ఆరోగ్య పరమైన విధానంలో ఈ నాట్యకళ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏ వయసు నుండి ఈ కళను అభ్యసిస్తే బాగుంటుందో చెప్పండి.?
జ: మంచి ప్రశ్న అడిగారు. ఈ రోజుల్లో ఎంతోమంది ఆరోగ్యం కోసమని జిమ్ అని, యోగా అని, మెడిటేషన్ అని రకరకాల వ్యాయామ శాలలకు, ధ్యాన కేంద్రాలకు వెళ్తున్నారు. అంటే మనం మన ఆరోగ్యం కోసం మనకు మనం చేసుకునే వాటిని కాకుండా ఇతరులపై ఆధారపడుతున్నాం. ఇక నాట్యం విషయానికొస్తే అది ఏదో చూసి ఆనందించే కళ కాదు. దీని ద్వారా శరీరమే కాకుండా మానసిక దృఢత్వం కలుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అన్నిరకాల వయస్సుల వారికి మానసిక ఒత్తిడులు దూరమవుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. ఎలాగంటే క్షణాల్లో హావభావాలను ఒలికించడానికి, కళ్ళు, చేతులు, తిప్పడం, అనుగుణంగా అడుగులను వేయడం.. వీటివల్ల ధ్యాస అంతా అక్కడే ఉంచాల్సి ఉంటుంది. ఇది వారికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఒక కళను నేర్చుకున్నవారికి,
లేనివారికి జీవన విధాన శైలిలో చాలా తేడా మనం గమనించవచ్చు. సభ్యత, సంస్కారం, వినయం, మాటతీరు, అణకువ ఇవన్నీ కళతోటే కళాకారునికిఅబ్బుతాయి. అది ఒక అదృష్టంగా భావించవచ్చు. ఇక వయసు అంటారా! ఐదేళ్ళ వయసు నుండి నేర్పడం మొదలు పెడితే బాగుంటుంది. ఎందుకంటే
ఆ వయసులో మనం చెప్పే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకునే వీలు ఉంటుంది.
18. ప్రస్తుత సమాజంలో లలితకళల పట్ల ఉన్న ఆదరణ ఎలాంటిది?
జ: ప్రస్తుత సమాజంలో లలిత కళల పట్ల ఆదరణ బాగానే ఉంది అని చెప్పొచ్చు. అంటే ఇది ఒక కాలచక్రం అంతే. కొంతకాలం కొన్ని నడుస్తాయి. అవి పోయి మళ్ళీ పాతవి ముందుకు వస్తాయి. తిరుగుతూనే ఉంటుంది కాలచక్రం. మొన్నటిదాకా మనం చూసాము విదేశీ సంస్కృతికి బాగా అలవాటు పడి మళ్ళీ మన శాస్త్రీయ కళల పట్ల ,మొగ్గు చూపిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే శాస్త్రీయ కళా ప్రదర్శనలు పెరుగుతూ వస్తున్నాయి. పిల్లలకి తల్లిదండ్రులు వాటిలో శిక్షణ ఇప్పించడానికి ముందుకు వస్తూనే ఉన్నారు. పిల్లలు కూడా శాస్త్రీయ నృత్యాలలో శాస్త్రీయ సంగీతాన్ని, శాస్త్రీయ కళలను నేర్చుకునే దిశగా ముందుకు వస్తున్నారు మనదేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా భారత దేశ శాస్త్రీయ నృత్య సంగీత సంప్రదాయాలకి ఆదరణ చాలా ఉంది. మనం దాని నిలబెట్టుకొని ఇంకా ముందుకు వెళ్లాలి. నేను తల్లిదండ్రులందరినీ కోరుకునేది ఒక్కటే. మీ ఇంట్లో ఉన్న ప్రతి చిన్నారికి ఏదో ఒకటి.. సంగీతమైనా, నృత్యమైనా ఏదో ఒక భారత శాస్త్రీయ కళని నేర్పించి, ముందు తరాల వారు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసే విధంగా వారిని ప్రోత్సహిస్తారు అని ఆశిస్తున్నాను
19. ఇప్పుడున్న పరిస్థితుల్లో కళలు నేర్చుకునేవారికి భవిష్యత్తు వుందంటారా?
జ: తప్పకుండా ఉందని చెప్పగలను. ప్రభుత్వం కూడా శాస్త్రీయ కళల అభివృద్ధికి దోహదం చేస్తోంది. కాకపోతే వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు చేస్తున్నారు. ఇటు స్వచ్ఛంద సంస్థలు కూడా కళాకారులను ప్రోత్సహిస్తూ ఎన్నో ప్రదర్శనలు ఇప్పించడం, అవార్డులను ఇప్పించడం, గుర్తింపు తేవడం, ఆర్థికంగా సహాయం చేయడం, తెలుగు యూనివర్సిటీ నుండి కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, అనేక సంస్థల నుండి కావచ్చు,కళాశాలల్లో కోర్సుల రూపంలో పి. హెచ్.డి ల వరకు పరీక్షలు నిర్వహిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళుతున్నాయి. వీటి ద్వారా భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు లభించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వీటిని నేర్చుకుంటున్న ప్రతి విద్యార్థి దానిని నమ్ముకుని ముందుకు వెళ్తే గనుక భవిష్యత్తులో మంచి స్థానానికి వెళ్తారని ఆశిస్తున్నాను. అవకాశాలు కచ్చితంగా లభిస్తాయి. ఎంతోమంది కళాకారులు అదే ఉపాధిగా మంచి స్థాయిలో జీవితాలను గడుపుతున్నారు. దానికి నేను కూడా ఒక సరియైన ఉదాహరణగా చెప్పవచ్చు. నేను నా శ్రీమతి కేవలం నాట్యాన్నే ఆధారంగా చేసుకుని జీవిస్తున్నటువంటి వాళ్ళం. నేను ఆంధ్ర నాట్యంలో డిప్లొమా పూర్తి చేయడం జరిగింది. అలాగే నా శ్రీమతి కూడా కూచిపూడిలో డిప్లొమా పూర్తి చేసింది. ఆమె ప్రస్తుతం శ్రీ సత్య సాయి విద్యా విహార్ డి.డి కాలనీలో ఉన్న స్కూల్లో గత 15 సంవత్సరాలుగా నాట్యం నేర్పిస్తూ డాన్స్ టీచరుగా ఉద్యోగం చేస్తోంది. ఇప్పుడు ఒక మంచి స్థానాన్నిచ్చి పర్మినెంట్ చేయడం జరిగింది. స్కూల్లో మంచి గుర్తింపు లభించింది. నేను కూడా ఒక నర్తకుడిగా, గురువుగా మంచి గుర్తింపు పొందాను మా కుటుంబం అంతా ఆ కళామతల్లి సేవలో ముందుకెళ్తున్నాం. ఆ తల్లి అనుగ్రహంతో ఇక ముందు కళాకారులు, కళాభిమానులు కూడా మమ్మల్ని ఇంకా బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
20. మీరు ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు మీ కాస్ట్యూమ్స్ మీరే తయారుచేసుకుంటారని, మేకప్ కూడా మీరే వేసుకుంటారని విన్నాం… నిజమేనా? దానికి సమయం కుదురుతుందా?
జ: (నవ్వుతూ) అవునండీ.. మీరు విన్నది నిజమే.. నేను నాట్యంలోనే కాక, ఫ్యాషన్ డిజైనింగ్ లో లకోటియా సంస్థ నుండి పి.జి.డిప్లొమా చేసాను. అందువల్ల నా ప్రదర్శనలకు మొత్తం నేనే డిజైన్ చేసి, తయారుచేసుకుంటా..ప్రస్తుతం దుస్తుల మీద వేసే అనేకరకాల డిజైన్ లను నేను వేయగలుగుతాను. సమయం అంటారా…తప్పదు..వీలు చేసుకుంటా.. మేకప్ కూడా మా టీమ్ లో నాతో సహా దాదాపుగా అందరికీ నేనే వేస్తా..ఇతరులతో చేయించడం ఎప్పుడో తప్పనిసరి అయినప్పుడు అంతే…
21. చివరగా మీరు సమాజానికి చెప్పదలచుకొన్న సందేశం ఏమిటి?
జ: సమాజానికి నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. ప్రపంచమంతా ఎంతో గౌరవించే మన భారత శాస్త్రీయ కళలని మనం చిన్న చూపు చూడకుండా మన చిన్నారులందరికీ నేర్పిస్తూ, దాన్ని గౌరవిస్తూ మనం ఎంత గొప్ప స్థానానికి తీసుకెళ్తే ప్రపంచంలో అంత గొప్ప స్థాయిలో ఉండగలుగుతాం. దయచేసి దీనిని అందరూ గమనించి కళల యొక్క అభివృద్ధికి మీరందరూ దోహదపడతారని, కళాకారులను ఆదరిస్తారని, అభిమానిస్తారని ఆశిస్తున్నాను. ప్రభుత్వం నుండే కావచ్చు ప్రైవేట్ సంస్థల నుండి కావచ్చు. అటు అభిమానులు, కళా పోషకులు,కళారాధకులు ఇటువంటి నృత్య ప్రదర్శనలను, కళాకారులను ప్రోత్సహించడానికి ఇంకా ముందుకు రావాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు..
ధన్యవాదాలు పవన్ కుమార్ గారు..మీ నాట్యప్రస్థానం గురించి, మీ గురించి ఎన్నో విషయాలను ఓపికగా మాతో పంచుకున్నందుకు మా తరఫున, మా పాఠకుల తరఫున మీకు కృతజ్ఞతలు తెల్పుకుంటున్నాము…నమస్కారాలు.
1 comment
ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏