“సైన్స్”ను విశ్లేషణాత్మకంగా ప్రయోగాత్మకంగా వివరిస్తే శాస్త్ర వ్యాసాలు/ శాస్త్ర గ్రంథాలు. లోకం పోకడను, మనసు సవ్వడిని పాత్రల ముఖతః సంఘటనా శ్రయంగా వివరిస్తే కథలు, నవలలు. ఈ రెండు భిన్నమైన రంగాలు. సైన్స్ విషయాలను ఆధారభూమికగా చేసుకొని కొన్ని సామాజిక సంఘటనలకు సైన్సును అనువర్తించి పాత్రల ముఖతః సృజనాత్మకంగా వర్ణిస్తే ‘సైన్స్ ఫిక్షన్’. అంటే శాస్త్రబద్ధమైన, ఆలోచనాత్మకమైన ‘సైన్స్’కు ఊహాత్మకమైన సృజనాత్మకమైన సాహిత్యానికి పెళ్ళి చేస్తే పుట్టే బిడ్డ సైన్స్ ఫిక్షన్ అన్నమాట.
ఈ ‘సైన్స్ ఫిక్షన్’ మీద డా. ఎన్. సుధాకర్ నాయుడు చేసిన పరిశోధన గ్రంథం ఇది. ఈ రోజుల్లో మంచి పరిశోధనాంశం దొరకడం పరిశోధకులకు అదృష్టమే. సరిగ్గా చేయగలిగిన మంచి పరిశోధకుడు దొరకడం మంచి పరిశోధనాంశానికి అదృష్టమే. ఈ రెండు ఒకే చోట కలవడం పాఠకుల అదృష్టం. సుధాకర్ నాయుడు చేతిలో ఈ పరిశోధనాంశం సమాచార పౌష్కల్యంతో విషయ నిర్భరంగా రూపుదాల్చడం ఆనందాన్ని కలిగించే అంశం. ఈ విషయంలో ఇదే ఏకైక ఆకర (reference) గ్రంథం.
సుధాకర్నాయుడు తెలుగు విశ్వవిద్యాలయంలో ముగ్గురు వైస్ ఛాన్స్లర్స్ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా ఎంతో నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి. పని పట్ల నిబద్ధత, వ్యక్తుల పట్ల ఆత్మీయత సుధాకర్నాయుడు నైజగుణం.
ఈ సిద్ధాంత గ్రంథం ఒక ప్రక్రియా వికాస చరిత్ర. ప్రక్రియా వికాసం చరిత్రలన్నింటికి ప్రధానంగా కావలసింది విస్తృత సమాచార సేకరణ. ప్రాథమ్యాల, వైవిధ్యాల, ప్రయోగాల పరిశీలనం. (అవకాశం ఉంటే) అన్యభాషల్లో ఆ ప్రక్రియా వికాస స్థూల పరిచయం. ఆ తర్వాత ఆ ప్రక్రియలోని రచనల విశ్లేషణ. ఇలాగే వెనుకటి పెద్దలు తమ డాక్టరేటు గ్రంథాలలో పరిశోధించి ఒక ఒరవడి నిర్దేశించారు. సి. నారాయణరెడ్డి (ఆధునికాంధ్ర కవిత్వం బి.వి. కుటుంబరావు (ఆంధ్ర నవలా పరిణామం), పోరంకి దక్షిణామూర్తి (తెలుగుకథ), సంప్రదాయాలు, ప్రయోగాలు), మద్దూరి సుబ్బారెడ్డి (దేశభక్తి కవిత్వం), జి.వి. సుబ్రహ్మణ్యం (ప్రథమాంధ్ర పురాణం). ఎస్.వి. రామారావు (సాహిత్య విమర్శ) లాంటి సిద్ధాంత గ్రంథాల ధోరణిలో సుధాకర్ నాయుడు సిద్ధాంత గ్రంథ రచన సాగడం అభినందనీయమైన అంశం.
చారిత్రక వైజ్ఞానిక నేపథ్యం పేరిట కూర్చిన ప్రథమాధ్యాయంలో పరిశోధకులు పాలిటి గని అంతే గాక పరిశోధకుని దృష్టి కోణాన్ని శ్రమశీలాన్ని తెల్పుతుంది. ఆచంట సాంఖ్యాయన శర్మ భూతత్త్వ శాస్త్ర, ఖనిజశాస్త్ర, క్రిమికీటక శాస్త్రాలలో పాండిత్యం సంపాదించినవారు. వారు నిర్వహించిన కల్పలత పత్రికలో ‘విజ్ఞాన వల్లిక’ అనే శీర్షిక కింద ఎన్నో ఆధునిక భౌతిక శాస్త్రాంశాలు రాసే వారట. శ్రీ శర్మగారు రహస్య దర్పణం పేరుతో 1892లో రాసిన గ్రంథంలో మనుష్యేతర జీవాల జీవన రహస్యాల గురించి చర్చించారట. భూతత్త్వశాస్త్రం అని ఓ గ్రంథాన్ని రాశారు. డార్విన్ సిద్ధాంతాన్ని తెలుగులో చెప్పారు. కొమర్రాజు లక్ష్మణరావు లాంటివారు సాంఖ్యాయన శర్మను విజ్ఞాన సర్వస్వంగా ప్రశంసించారు. మరి అలాంటి ఆచంట సాంఖ్యాయన శర్మ జీవన, రచనల వివరాల మీద ఎవరైనా డాక్టరేటుకు పూనుకొంటే ఎంత బాగుంటుందోనని నాలాంటివాడికి అనిపించడంలో ఆశ్చర్యం లేదు. అట్లాగే టేకుమళ్ళ అచ్యుతరావు, టేకుమళ్ళ రాజగోపాలరావు ప్రభృతుల వైజ్ఞానిక రచనలను సుధాకర్నాయుడు ప్రస్తావించారు. వీరిని గురించి మన పరిశోధకులకు తట్టడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే స్వాతంత్య్ర పూర్వం భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న కాంక్ష ఉవ్వెత్తున చెలరేగింది. ఆ ప్రభావంతో సైన్స్ రచనలు కూడా ఎన్నో వచ్చాయి. ఆ తర్వాత సైన్స్ రచనలు బాల సాహిత్య విభాగంలో, లేదా
సైన్స్ ఫిక్షన్గానో, పాపులర్ మార్గంలో వచ్చాయేమోననిపిస్తుంది. ‘సీరియస్’ శాస్త్ర వాఙ్మయ రచనం – పఠనం పట్ల ఆసక్తి తగ్గడానికి నానాటికీ విస్తరిస్తున్న ఆంగ్ల భాషా ప్రభావం కావచ్చు.
స్వయంకృషితో బహుభాషలు నేర్చుకొన్న ఒద్దిరాజు సోదరులు తెలంగాణాలో మారుమూల వైజ్ఞానిక శాస్త్ర వ్యాసంగం నెరపిన వివరాలు ఈ గ్రంథంలో చోటుచేసుకోవడం గమనార్హం. ఆయుర్వేద గ్రంథాలు, చరకం, శుశ్రుతం, బాహాటం, మాధవ నిదానం, బసవరాజీయం లాంటి గ్రంథాలను క్షుణ్ణంగా అభ్యసించిన ఒద్దిరాజు సోదరులు (ఒద్దిరాజు సీతారామచంద్రరావు (2.4.1887; 28.1.1956) ఒద్దిరాజు రాఘవ రంగారావు (4.4, 1894 – 17.5.1973) మలేరియా నివారణకు ‘తిక్త’ అనే ఆయుర్వేద ఔషధాన్ని తయారుచేసి వేలాది మందిని కాపాడారట. హోమియో వైద్య గ్రంథాలు కలకత్తా నుండి తెప్పించుకొని అధ్యయనం చేసి హోమియోలో ఎం.డి. పట్టా పొందారట. ‘విజ్ఞాన ప్రచారిణి గ్రంథమాల’ను స్థాపించినవారు. ఫోటోగ్రఫీ నేర్చుకొని ‘ఛాయాగ్రహణ తంత్రం’ చేతి పనులు, బాల విజ్ఞాన మంజూష విద్యుద్విజ్ఞానం లాంటి గ్రంథాలు రాశారు. సాహిత్య సంబంధ రచనలు సరేసరి. వైజ్ఞానిక సంబంధమైన వ్యాసాలను, పుస్తకాలను, విజ్ఞాన సర్వస్వాలను ప్రచురణ సంస్థలను, సంస్థానాలను, విశ్వవిద్యాలయాలు చేసిన కృషిని పత్రికలను, పత్రికల్లోని సైన్స్ కాలమ్స్న కొండ అద్దమందు చూపినట్లుగా సుధాకర్నాయుడు ఈ ప్రథమాధ్యాయంలో ప్రదర్శించారు. దీని ఆధారంగా మరికొన్ని పరిశోధనాంశాలను దొరికించుకోవచ్చు.
సైన్స్ ఫిక్షన్కు వివిధ పండితులు, విజ్ఞాన సర్వస్వాలు, నిఘంటువులు ఇచ్చిన నిర్వచనాలను, లక్షణాలను రెండవ అధ్యాయంలో పేర్కొన్నారు. రేడియో టెలివిజన్ ఛానల్స్లోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ కార్యక్రమాల, సినిమాల వివరాలు సాధారణంగా లభించవు. వాటిని పేర్కొనడం సుధాకర్నాయుడు శ్రమశీలానికి, వెచ్చించిన సమయానికి దర్పణం పడుతోంది. వర్తమాన పరిశోధక విద్యార్థులు ప్రత్యేకించి గుర్తించాల్సిన ఆధునిక సాహిత్యంలో మొదటి సైన్స్ ఫిక్షన్ గ్రంథం మేరీ షేల్లి 1818లో రాసిన ప్రాంపెయిన్ స్టయిన్ అనే పేరున్నది మొడరన్ ప్రొమిధస్. సుధాకర్ నాయుడు దానితో మొదలుపెట్టి అడ్గర్ ఆలెన్పో, ఆల్డస్ హక్స్ లీ, జార్జి ఆర్వెల్, సి.యస్. లెవిన్లను మొదలుకొని అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇటలీ, కెనడా, న్యూజిలాండ్ లాంటి దేశాల రచనల వివిధ భారతీయ భాషల్లోని సైన్స్ ఫిక్షన్ రచనలను ఆంగ్లాది ఇతర భాషల నుండి చేసిన ఈ అనువాదాలను సుధాకర్ నాయుడు పేర్కొనడం గమనించినపుడు నాకు పాతకాలం సిద్ధాంత గ్రంథాలు (పైన పేర్లు పేర్కొన్నాను) మదిలో మెదిలాయి.
సుధాకర్నాయుడు తొలి తెలుగు సైన్స్ కథలు తెలంగాణా నుండి వచ్చాయని నిర్ధారించడం గమనార్హం. సింగూరి జయరావు (పరమాణువులో మేజువాణి, డిసెంబర్, 1927) ఎల్. శంకరనారాయణ (చంద్రమండలపు చోద్యములు – మార్చి, ఏప్రిల్ 1928), ఒద్దిరాజు సీతారామచంద్రరావు (అదృశ్యవ్యక్తి, అక్టోబర్ 1928 గారలు రాసిన ఈ మూడు కథలు తెలంగాణా నుండి వచ్చిన సుజాత పత్రికలో వచ్చాయి. కొడవటిగంటి, కె.ఆర్.కె. మోహన్, ఎన్.ఆర్. నంది, పురాణపండ రంగనాథ్, మైనంపాటి భాస్కర్ లాంటి వారి సైన్స్ ఫిక్షన్ కథలన్నింటినీ సుధాకర్నాయుడు చర్చించారు.
టేకుమళ్ళ రాజగోపాలరావు 1934లో రాసిన ‘విహంగయానం’ తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ నవల. అప్పటికి సైన్స్ ఫిక్షన్ అనే పదబంధం వాడుకలోకి రానందున ‘ప్రకృతి శాస్త్ర సంబంధ నవల’ గా పిలిచారు. 22.1.1934 తేదీతో పీఠిక రాస్తూ రచయితనే స్వయంగా ‘విహంగ యానము తెలుగులోని ప్రకృతి శాస్త్ర సంబంధమైన నవలలో మొట్టమొదటిది. స్వతంత్రముగా రచింపబడినది. కాని ఇందలి ప్రకృతి శాస్త్ర విషయాలు జనసామాన్యమున కందుబాటులో నుండు రీతిని కూర్చబడినది. వాయు, విమాన నిర్మాణ పద్ధతులు 18,20 ప్రకరణములలో దెలుపబడినది. శాస్త్ర నవలారచనకు, మన భాషకు నాకును గూడ నిదియే ప్రధమము’ అని స్వయంగా పేర్కొన్నారు. ‘ఇది మనకు కొత్తది. మన భాషకు కొత్తది. ప్రకృతి శాస్త్ర సంబంధమగు మొట్టమొదటి నవల. స్వతంత్రంగా వ్రాయబడినది. ప్రకృతి శాస్త్ర జ్ఞానమును సామాన్య జనుల హృదయమున కెక్కించునుత్తమ నవలలు ఫ్రెంచి, జర్మను భాషలలో మాత్రమే కలవు అంటూ కపిస్థలం శ్రీరంగాచారి భారతి డిసెంబర్ 1934 సంచికలో విహంగయానాన్ని సమీక్షిస్తూ అభిప్రాయపడ్డారు. ప్రక్రియ వికాసాల మీద పరిశోధించే ప్రతి పరిశోధకుడు ముందుగా నిర్ధారించవలసింది ఏది తొలి రచన ఎప్పుడు తొలి రచన వచ్చింది. సుధాకర్ నాయుడు తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ లేదా తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ నవల అన్న విషయంలో ఆధార సమన్వితం పరిశోధన తత్పరతతో చూశారు. భవిష్యత్తులో దీనిని ఎవరైనా కాదంటే సుధాకర్నాయుడు పేర్కొన్న కాలాలకు చెందిన కథ / నవలలకన్నా ముందువి దొరికి వాటి చరిత్ర, మరికాస్త వెనక్కి వెళ్ళిందని సంతోషించవచ్చు.
సైన్స్ఫక్షన్కు కుహనా సైన్స్ ఫిక్షన్కు అంతరం ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం ద్వారా సంభవమయ్యే అవకాశమున్న మేరకు రక్తి కట్టించే కల్పనను జోడించి రాయడం సైన్స్ ఫిక్షన్ అవుతుంది. అంతేగాని సైన్స్ ఏమాత్రం అంగీకరించని దాన్ని ఏదో వింత పేర్లు కల్పించి రాసేవి కుహనా సైన్స్ ఫిక్షన్ (సోషియో ఫాంటసీ) కథలు / నవలలు అవుతాయి. సుధాకర్నాయుడు ఏది సైన్స్ ఫిక్షన్? ఏది సోషియో ఫాంటసీ అని గుర్తించి పేర్కొనడం పరిశోధకునిగా ఆయన అప్రమత్తతను తెలుపుతుంది. 1934 నుంచి 1970 వరకు 37 ఏళ్ళ కాలంలో సైన్స్ ఫిక్షన్ నవలలు పదికి మించి లేవని పరిశోధకుడు అభిప్రాయపడ్డారు. (పుట. ) సోషియోఫాంటసీ, సైన్స్ ఫిక్షన్కు రెండు విభాగాలుగా చెప్పుకొన్నా ఎక్కడో ఒకచోట ఈ రెండు కొంతమేరకు కలగలిసిపోతాయేమో! కాకుంటే పాళ్ళల్లో ఎక్కువ తక్కువ లను బట్టి వర్గీకరించుకోవలసి రావచ్చు.
మొత్తమీద తెలుగులో ఇప్పటిదాకా 89 డైరెక్ట్ కథలు, 17 అనువాద కథలు 503 పైగా నవలలు సైన్స్ ఫిక్షన్కు సంబంధించి వచ్చాయని పరిశోధకుడు అంచనాకు వచ్చారు. ఒకటి రెండు జారిపోయినా నష్టం లేదు. 1987 జూన్ నుంచి 1996 సెప్టెంబర్ 67 సిద్ధాంత గ్రంథాలు ఆంగ్లంలో సైన్స్ ఫిక్షన్ మీద వచ్చాయని సుధాకర్నాయుడు ఉపసంహారంలో పేర్కొన్నారు. తెలుగులో మాత్రం ఇంతదాకా ఇదొకటే. సాహిత్యం విస్తృతంగా వస్తే పరిశోధనలు విస్తృతంగా జరుగుతాయి. సైన్స్ ఫిక్షన్ రాయడమే తక్కువ. పాఠకుల్లో విపరీతాసక్తి ఉంటే రచయితలు బాగా రాస్తారు. రచయితలు బాగా రాస్తే పరిశోధకులు ఆకర్షిస్తారు. రచయితలు బాగా రాస్తే పరిశోధకులు ఆకర్షితులు – ఇదంతా ఒకదానికి ఒకటి సంబంధించిన (Interlinked) వ్యవహారం.
తెలుగు సాహిత్యంలో ‘సైన్స్ ఫిక్షన్’పై విషయ నిర్భరమైన సమాచార పౌష్కల్యంతో కూడిన ఏకైక ఆకర (రిఫరెన్స్) గ్రంథంగా మలచిన సన్మిత్రులు డా. ఎన్. సుధాకర్ నాయుడు గారికి మనసారా అభినందనలు. నాకీ నాలుగు మాటలు రాసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు.