(ధారావాహిక నవల) by డా. చిల్లర భవానీదేవి
‘అహో! ఆంధ్రభోజా! శ్రీకృష్ణదేవరాయా!
విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా!!…’’
ఘంటసాల గళంలోంచి ఉత్తేజకరంగా అద్భుతగీతం ఆడియో మంద్రస్థాయిలో విన్పిస్తోంది.
తెల్లారితే బస్ హంపీనగరాన్ని చేరుతుందంటే అమృతకి చాలా ఎక్సయిటింగ్‌గా ఉంది. బస్ అంతా నిద్రమూడ్‌లోకి జారుకుంటున్నారు. అభిషేక్ కూడా హంపీ గురించే ఆలోచిస్తున్నాడని అమృతకి తెలుసు. రాత్రి పదవుతోంది. దాదాపు నలభైమంది ప్రయాణిస్తున్న ఆ టూరిస్ట్ బస్ తెల్లవారితే ఒక అద్భుత ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నదని వాళ్ళిద్దరికీ అన్పిస్తున్నదంటే ఆ స్థలం వాళ్ళకి ఎంత ప్రీతిపాత్రమైందో మరి!
‘‘అభీ!’’ మెల్లగా పిల్చింది అమృత.
‘‘ఊ…’’ అభిషేక్ బదులిచ్చింది ఒక్క అక్షరమే అయినా అమృత మీద ప్రేమంతా రంగరించి అన్నట్లుంది.
‘‘ఇప్పుడు నీకేమన్పిస్తుంది’’ అతని భుజమ్మీద వాలి కళ్ళు మూసుకుంది.
‘‘మనం మనదైన లోకంలోని కాలానికి వెళ్ళిపోతున్నాం అమ్మూ’’ ట్రాన్స్‌లో
ఉన్నట్లు అన్నాడు.
‘‘నిజంగా అప్పుడు ఉండేఉంటాం అభీ!’’ అమృత రెప్పల కింద సినిమా రీళ్ళలాగా… అనేక దృశ్యాలు కన్పిస్తున్నాయి.
‘‘అమ్మూ!’’ మంద్రంగా హస్కీ వాయిస్‌తో పిలిచాడు అభిషేక్.
అలా పిలిస్తే అమృతకెంత ఇష్టమో అతనికి తెలుసు. నాగస్వరానికి ఆడే నాగినిలా అయిపోయింది అమృత.
‘‘చెప్పు అభీ!’’
‘‘రేపట్నుంచి మన జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని నాకన్పిస్తుంది.’’
‘‘అవును అభీ… నాక్కూడా’’
‘‘మనం ఇన్నాళ్ళుగా కన్న కలలు నిజం కాబోతున్నాయంటే… ఓప్‌ా నమ్మలేకుండా ఉన్నాను’’ ఉద్వేగంగా అన్నాడు అభిషేక్.
‘‘అవును అభీ! మనం యూనివర్శిటీ స్టూడెంట్స్‌గా ఏ క్షణంలో కలిశామో… ఆ ఘడియ అద్భుతమైంది అభీ. ఎందరో అక్కడ చదువుకుంటారు. కాని మనలాగా చరిత్రలోకి ప్రయాణించేవాళ్ళుంటారా! అనిపిస్తుంది.’’
‘‘అవును అమ్మూ! నీకు చెప్పాను గుర్తుందా! మొదటిసారి ఫీల్డ్‌వర్క్ కోసం నేను హంపీ వచ్చినప్పుడు ఎంత ఆశ్చర్యపోయానో!క్లాసులో ప్రొఫెసర్ విజయనగర సామ్రాజ్యం గురించి చెప్తున్నప్పుడు అవన్నీ నేను చూసినవే అన్పించింది.’’
‘‘అవును అభీ! మనం ఈ సామ్రాజ్యంలో పుట్టామనే నా నమ్మకం.’’
‘‘ఏదో పరీక్షల కోసం చదివాను, రాశాను గానీ ఇద్దరం కల్సి హంపీ ఎప్పుడు వస్తామా అని నా మనస్సు వేగిరపడుతోంది.’’
‘‘అవును అభీ! పెళ్ళయితేగానీ ఇలా కల్సి రాలేం కదా!’’
‘‘కళాకారులుగా కల్సి మనం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. కానీ ఈ అనుభవం వేరు. చదువుకన్నా నీ నాట్యమే నన్ను నీ దగ్గరికి చేర్చింది అమ్మూ.’’
‘‘నీ పాటకోసమే నా పాదాలు ఎప్పుడూ ఎదురుచూస్తాయి అభీ!’’
‘‘రేపటి నుంచి మనం మనదైన అద్భుత ప్రపంచంలో విహరిద్దాం’’
అభిషేక్ ఆమె నడుం చుట్టూ చేయి వేశాడు.
‘‘అందుకే గదా! హనీమూన్‌కి ఎక్కడికెళ్తారు? అని నాన్న అడిగితే ‘హంపీ’ పేరు చెప్పాను’’ కొంచెం సిగ్గుపడిరది అమృత.
‘‘అంతా నవ్వారు తెలుసా! శిథిలాల్లో హనీమూనా అని’’ అభిషేక్ అల్లరిగా చూశాడు.
‘‘నువ్వెక్కడుంటే అదే నా స్వర్గం అభీ! మనం కలలు కన్న కళాప్రపంచం కన్నా మనకింకేం కావాలి చెప్పు’’ తన్మయంగా అంటున్న అమృత భుజంచుట్టూ చేయివేసి దగ్గరగా తీసుకున్నాడు అభిషేక్.
నవదంపతుల మనసులు పరస్పరం ఊసులాడుకుంటుంటే నిద్రలోకి జారుకున్నారు.
బస్ రాత్రి చీకటిని లైట్ల కత్తులతో చీలుస్తూ పరిగెడుతోంది. రాబోయే రోజు వాళ్ళ జీవితాలనే మార్చేస్తుందని తెలీని ఆ యువజంట ఆదమరిచి నిద్రపోతున్నది.
తెలతెలవారుతోంది. సూరీడు కూడా బద్ధకిస్తున్నట్లు ఇంకా పూర్తిగా పక్కమీంచి లేవలేదు. బస్‌లో లైట్లేసి హారన్ కొట్టాడు డ్రైవర్. అంతా నిద్రలేచి గమ్యం చేరినట్లు గుర్తించారు.
‘‘అభీ!.. హంపీ అదే హాస్పేట్ వచ్చేశాం’’ అమృత అతన్ని నిద్రలేపింది ఆనందంగా.
అభిషేక్ కళ్ళు నులుముకుని చుట్టూ చూశాడు. అంతా దిగుతున్నారు. పెద్ద లగేజీలన్నీ బస్ డిక్కీలోంచి తీస్తున్నారు.
అమృత, అభిషేక్‌లు బస్ దిగారు.
ఎదురుగా హోటల్ ప్రియదర్శిని. టూరిజం ప్యాకేజీ సభ్యులుగా అందరికీ డబుల్ బెడ్ ఎ.సి రూంలు కేటాయించారు. అంతా వెళ్ళాక రిసెప్షన్‌లో కొంచెంసేపు ఆగి అభిషేక్ తనకి కావాల్సిన సమాచారాన్ని తీసుకున్నాడు. రూంకి వచ్చి ఇద్దరూ రిఫ్రెష్ అయ్యారు. రూంకే బ్రేక్‌ఫాస్ట్ తెప్పించుకుని తిన్నారు.
‘‘అభీ! మనం అడిగినట్లు విడిగా ఒక కారు ఏర్పాటయిందా?’’
‘‘ఆ! ఒక గైడ్ కూడా’’
‘‘మనకి గైడ్ ఎందుకు అభీ! నువ్వున్నావుగా’’
‘‘అలా అనకు అమ్మూ! మనతో వచ్చేది డ్రైవర్ కం గైడ్. నేను ఆర్కియాలజీ విద్యార్థినే! అయినా మనం చదువుకోని ఎన్నో విషయాలు స్థానికులకు తెలుస్తాయి…’’ నవ్వాడు.
‘‘వాటికి ఆధారాలుంటాయా?’’ అనుమానంగా అడిగింది.
‘‘ఉండకపోవచ్చు… కానీ జనశ్రుతిలో పుట్టిన కథలుండొచ్చు…’’
‘‘అసలు భారతదేశ చరిత్రే సరిగ్గా రికార్డుకాలేదంటారు. పోర్చుగీసు యాత్రికులు, బ్రిటీష్ చరిత్రకారులు, శిలాశాసనాలు, సాహితీ గ్రంథాలు ఇవేకదా మన చరిత్రకు ఆధారాలు.’’
‘‘నిజమే!’’ ఒప్పుకున్నాడు అభిషేక్.
‘‘మనవాళ్ళు సరిగ్గా అన్నీ రికార్డు చేసివుంటే మనకి ఇంకెంత విలువైన సమాచారం తెలిసేదో! నాకు మాత్రం విజయనగర సామ్రాజ్యం గురించి ఇంత అభిమానం పెరగటానికి కారణం నువ్వే అభీ! నేను తెలుగు లిటరేచర్ విద్యార్థిగా శ్రీకృష్ణదేవరాయల సాహితీ ప్రియత్వం, కవిపోషణ, ఆ కవుల గురించి వాళ్ళ కావ్యాల గురించి చదువుకున్నాను. కానీ నీలా విజయనగర సామ్రాజ్య శిథిలాల వెనుగ దాగిన చరిత్ర పునాదుల నుంచి తెలియదు.నీ మాటల్లో నేను ఆ స్వర్ణయుగం మళ్ళీ చూశాను. ఆ హంపీ గురించి మనిద్దరికీ ఎందుకింత ప్రేమ అభీ!’’
అతని చేయి తన చేతిలోకి తీసుకొని అడిగింది అమృత.
‘‘తెలీదు అమ్మూ! కారణం ఇదని చెప్పలేను. మేం ఈ ప్రాంతం వాళ్ళమేననీ, మా పూర్వీకులు తెలుగునాడుకు వలస వెళ్ళారనీ అమ్మ చెప్పేది. అయినా రాయల పాలనలో తెలుగు, తమిళ, కన్నడ ప్రాంతాలున్నాయని అందరికీ తెలుసు.’’
‘‘మరి అలా ఎందరో ఉంటారు. నీకు మాత్రం ఎందుకింత ఇది.’’
‘‘ఏమో! చిన్నప్పట్నుంచీ శ్రీకృష్ణదేవరాయల పేరు వింటే నా మనసు పులకరించేది. హంపీ విజయనగర సామ్రాజ్యం నేపథ్యం గల సినిమాలు గానీ పాటలు గానీ చాలా ఇష్టం అన్పించేవి. శ్రీకృష్ణదేవరాయల అసలు చిత్రపటం లభ్యంకాలేదుగానీ లేకపోతే రాయల చిత్రం చూస్తే అది ఏ జన్మలోనైనా గుర్తించగలను.’’ అభిషేక్ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాడు.
‘‘నాక్కూడా అంతే అభీ! విచిత్రంగా లేదూ! మనిద్దరి అభిరుచి ఒకటే కావటం’’ నమ్మలేనట్టు చూసిందామె.
‘‘అవును. కొన్నిసార్లు జన్మాంతర సంస్కారాలు వెంటవస్తాయి. అందుకే నర్తకిగా నువ్వు, గాయకుడిగా నేను కళ పట్ల సహజాభిమానంతో ఉన్నాం. ఇది మన జన్మాంతర హృదయధర్మంగా ఉంది.’’
‘‘కారు వచ్చేలోపు మనం ఈ హంపీ విజయనగర సామ్రాజ్య ఆత్మని పూర్తిగా స్పర్శించేలోపు ఇన్నాళ్ళూ నాకు చూపించాలని నువ్వు కలలుగన్న ఈ పుణ్యస్థలం గురించి కొంచెం చెప్పు అభీ!’’
‘‘అలా అయితే ప్రస్తుతానికి నేనే నీ గైడ్‌ని. విను’’ అంటూ అభిషేక్ ఏదో ప్రపంచంలో ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. ఆర్కియాలజీ స్టూడెంట్‌గానే కాదు, ఈ మట్టి గురించిన జ్ఞాపకాలతో అతని మాటల్లో ఆ మట్టిబంధం పరిమళిస్తూంది.
‘‘నీకు తెలుసా అమ్మూ! ఇందాక మనం అనుకున్నట్లు మనవాళ్ళు రాసిన ఆధారాలే కాదు… ‘రాబర్ట్ సీవెల్’ అనే ఆంగ్ల ప్రభుత్వాధికారి ‘ద ఫర్‌గాటన్ ఎంపైర్’ పేరుతో ఈ మట్టిలో కలిసిన విజయనగర సామ్రాజ్యం అనే మాణిక్యాన్ని వెలికితీసేదాకా మనకెవ్వరికీ దీన్ని గురించి తెలియలేదు.’’
‘‘అయ్యో! ఇప్పటికీ పూర్తిగా తెలీదని నువ్వే అన్నావోసారి.’’
‘‘అవును. శ్రీకృష్ణదేవరాయల పూర్వీకులు బళ్ళారివారంటారు. ఈ రాజ్యాన్ని సంగమ, సాళువ, తుళువ, ఆరవీటి వంశాలు పాలించారు. రాయలు తుళువ వంశీకుడు. రాయల తాత ఈశ్వర నాయకుడు, తల్లిదండ్రులు నాగాంబ నరసరాయలు. నరసనాయకుని పెద్దకొడుకు వీరనరసింహరాయలు ‘సాళువ’ వంశాన్ని కూలదోసి రాజై తుళువ వంశాన్ని ప్రతిష్టించాడు. అతని మరణం తర్వాత తిమ్మరుసు సహాయంతో శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటక సింహాసనానికి క్రీ.శ 1509లో అధిపతి అయ్యాడు.
‘‘ఈ తిమ్మరుసుకేగా తర్వాతి కాలంలో రాయలు కళ్ళు పీకించింది’’ అమృత
ఉద్విగ్నంగా అడిగింది.
‘‘అవును!’’ విచారంగా చెప్పాడు అభిషేక్.
‘‘మరి కుందేళ్ళు వేటకుక్కల్ని తరమటం, హరిహరరాయలు బుక్కరాయలు విద్యారణ్యస్వామి కథ!’’ అర్థంగానట్లు చూసింది.
‘‘నువ్వు విన్నది సరైన ఐతిహ్యమే! దక్షిణాపథంలో తెలుగుల కాకతీయ సామ్రాజ్యం పతనమయ్యాక అక్కడ్నుంచి పారిపోయి హరిహర, బుక్కరాయలనే అన్నదమ్ములు విద్యారణ్యస్వామి ఆశీస్సులతో ఈ స్థలప్రభావం గుర్తించి ఇక్కడ సామ్రాజ్య స్థాపన చేశారని ప్రతీతి. కొందరైతే ఆ కాలానికి విద్యారణ్యస్వామి లేరనీ, విజయనగర రాజగురువు క్రియాశక్తియోగి అనీ అంటారు. ఏదైతేనేం ఇంతటి కళావైభవాన్ని సంతరించిన ఆ పాలన మరపురానిది… మహనీయమైనది కదా!’’ అభిషేక్ మాట పూర్తి అవుతూనే రూం అటెండర్ కాలింగ్ బెల్ కొట్టాడు.
అమృత తలుపు తీసింది.
‘‘వెహికల్ రెడీ మేడమ్!’’ చెప్పేసి వెళ్ళిపోయాడతడు.
అమృత, అభిషేక్‌లు కార్లో కూర్చున్నారు. అమృత బ్యాగ్‌లో కెమెరా, బైనాక్యులర్స్, సెల్, వాటర్ బాటిల్ అన్నీ సరిగ్గా ఉన్నాయో, లేవో సరిచూసుకుంది.
కొత్త మోడల్ ఎ.సి కారు. కొత్తగా పెళ్ళయిన జంట. పాత వైభవాన్ని చూడటానికి బయలుదేరారు. దోవలో పడిపోయిన ప్రాకారాలు శిధిలమైన కట్టడాలు కన్పిస్తున్నాయి. అభిషేక్ వాటి దగ్గర రెండు నిమిషాలు కారాపి ఫోటోలు తీసుకుంటున్నాడు. ఆ మొండిగోడలను ఆత్మీయంగా తడుముతున్న అభిషేక్‌ని చూస్తుంటే అమృతకి విచిత్రంగా అన్పించింది. మనిషి హృదయం ఎంత గొప్పది! ఎంతగా స్పందిస్తుంది! ఒక్కొక్క మనిషి జీవమున్నా రాయిలాగే ప్రవర్తిస్తుంటాడు. కొందరు సున్నిత మనస్కులు రాళ్ళలో కూడా ప్రాణాన్ని చూస్తారు.
అమృతకి ఒక తెలుగుకవి పాట గుర్తొచ్చింది.
‘‘రాలలోపల పూలు పూచిన రామమందిరలీల
ఆరామ సుందర హేల
రాలలో హృదయాలు మ్రోగిన రాచకేళీశాల
ఆరామమందిర లీల
నిన్నటిదా మరి మొన్నటిదా ఇది
ఎన్ని జన్మల గాథ!…’’
పాటని హమ్ చేస్తూ అభిషేక్ చేయి పట్టుకొని ఆ ప్రాచీన శిథిలాల్లో తిరుగుతుంటే అమృతకి గమ్మత్తుగా అనిపించింది. హంపీ శిథిలాల విూంచి గెంతుకుంటూ వెళ్తున్నాయి కోతుల గుంపులు. కొన్ని పిల్లకోతులు ఆగి వీళ్ళ చేతుల్లో ఏమైనా తినే వస్తువులున్నాయేమో లాక్కునిపోదామని చూస్తున్నాయి. అభిషేక్ గాగుల్స్ చూసి వెక్కిరించిందో పిల్లకోతి. మళ్ళీ ఇంతలోనే తల్లిపొట్ట కరుచుకొని వెళ్ళిపోయింది. సృష్టిలో ఏ ప్రాణికైనా మాతృత్వం అనే వరాన్ని భగవంతుడు ఇవ్వకపోతే ఈ కాస్త ప్రేమ, కరుణ కూడా మాయమైపోయేవేమో!
‘‘అమ్మూ! ఇటు చూడు. గతవైభవదీప్తికి చిహ్నాలుగా ఈ ప్రాకారం మీద అద్భుత శిల్పాలు. ఇది రాయల రాజముద్ర. ఈ అందమైన స్త్రీమూర్తి మొహాన్ని ఇలా చెక్కేయటానికి దాడిచేసి ఆక్రమించిన ఆ దురాత్ములకి మనసెలా ఒప్పిందో! ఏ శిల్పి కలగని ఈ శిల్పాన్ని చెక్కాడో! ఇప్పుడీ శిల్పాన్ని చూస్తే ఆ శిల్పికి గుండె ముక్కలవదూ…’’
అమ్మూ! ఇటుచూడు. కొండకు కొండ కొక్కేలు వేసినట్లు బారులు తీరి ఇంత పటిష్టంగా ఉన్న ప్రాంతం కాబట్టే విజయనగర రాజులు దీనిని రాజధానిగా కోట కట్టారు. ఇప్పుడు బీటలువారిన వీటిని చూస్తుంటే కొడాలి సుబ్బారావుగారి ‘హంపీక్షేత్రం’లో ఆ పద్యమే గుర్తొస్తున్నది.
‘‘శిలలు ద్రవించి యేడ్చినవి జీర్ణములైనవి తుంగభద్ర లో
పల, గుడిగోపురంబులు సభాస్థలులైనవి కొండముచ్చు గుం
పులకు చరిత్రలో మునిగిపోయిన దాంద్ర వసుంధరాధి పో
జ్జ్వల విజయప్రతాప రభసంబొక స్వప్నకథా విశేషమై’’`
అంటూ మధురంగా అభిషేక్ పాడిన ఆ పద్యానికి అమృత పరవశించి పోయింది. అతని కంఠం అచ్చంగా ఘంటసాల గళమే! అదే భావోద్దీపన. అందుకే ఆ పాట వినేవాళ్ళ హృదయాలలో తిష్టవేసుకుంటుంది. అమృత కళాహృదయం దోచుకున్న గాయకుడు అభిషేక్. ఆమెకి ఎన్నిసార్లు విన్నా తనివితీరదు అతని పాట.
‘‘అమృతా! కొడాలివారు ఈ హంపీ చూసే అంత గొప్పకావ్యం రాశారు! మరి నువ్వేం రాస్తావు!’’ అభిషేక్ కవ్వించాడు.
‘‘నేను హంపీలో మన ప్రేమకావ్యానికి మారాకు తొడిగిస్తాను’’ అమృత గుసగుసలాడిరది.
విజయనగర సామ్రాజ్య వైభవ ద్వారంలో అడుగుపెట్టిన ఆ దంపతులకి కళ్ళముందున్న శిథిల కట్టడాల నుండి నాటి విజయ నగరశోభ మనోహర కథన దృశ్యంగా సాక్షాత్కరించింది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
సప్తప్రాకార పరివేష్టితమై ఆదర్శప్రావీణ్యంతో కట్టబడిన అరవైమైళ్ళ చుట్టుకొలత ఉన్న ఆ పట్టణం మొదటి కోటగోడ వరస హాస్పేటకి ఆగ్నేయంగా రెండు కొండలు కలిసేచోట ఉంది. మొదటి ప్రాకారం నుంచి మూడో ప్రాకారం వరకు పొలాలు, తోటలు. రెండవది హాస్పేటలో ఉంది. దానికి ఉత్తరంగా మూడోది, మలపనహోగుడి గ్రామానికి దక్షిణాన నాల్గోది. దానికి ఉత్తరంగా కన్పించేది ఐదోది. కమలాపురం చెరువుకు దక్షిణాన ఆరోది. నిలిచి ఉన్నది ఏడోది. ఇదే అంతర్భాగ ప్రాకారం. నిరంతరం కట్టుదిట్టమైన పహారాలతో ‘మూరురాయలగండ’ శ్రీకృష్ణదేవరాయలు అమిత ధీశక్తిశాలి తిమ్మరుసు మహామంత్రి చల్లని నీడలో విలసిల్లుతోంది. ఆ ప్రాకారాల లోపలే నగరానికి కావలసిన సర్వసంపదలు నెలకొని ఉన్నాయి. అందుచేత కోటతలుపులు మూసివేసినా ఎవరికీ ఎటువంటి కష్టం కలుగదు.
రాజభవనానికి దగ్గరలో ఎదురుగా నాల్గు విపణి వీధులున్నాయి. ఆ వీధులలో పురుషులంతా సమస్త వస్త్రాలంకార భూషితులయి కన్పిస్తున్నారు. వీధుల్లో రత్నాలు, వజ్రాలు రాసులుగా పోసి అమ్ముతున్నారు.
రక్షక భటులు గుర్రాలపై హడావుడిచేస్తూ వచ్చారు. ‘‘తొలగండి.. తొలగండి..’’
ప్రజల మధ్యనించి మార్గం ఏర్పడిరది.
గుర్రాలు ఆగాయి. రాజోద్యోగి దిగటంతో అంతా భయభక్తులతో లేచి నిలిచారు. ఆయన ఒక వర్తకుని వద్దకు వెళ్ళి ‘‘మీ వర్తకం బాగా జరుగుతోందా!’’ గంభీరంగా అడిగాడు.
‘‘చిత్తం’’ వర్తకుడు గౌరవంగా బదులిచ్చాడు.
‘‘బీజాపూర్ యుద్ధం ముగిసింది. తెలుసుకదా! మన సైన్యం కుటుంబాలకు ఆర్థిక సాయానికి’’ అర్థోక్తిలో ఆగాడు.
‘‘చిత్తం!’’
‘‘మహామంత్రులవారు రేపు సాయంత్రం ఒక సమావేశం ఏర్పాటు చేశారు. మీరంతా.’’
‘‘చిత్తం!… ఏలిన వారి కృప.’’
వర్తకుల రాజభక్తి ఆ సమావేశంలో మణి మాణిక్యాల రూపంలో ప్రతిఫలించింది.
విజయనగర సామ్రాజ్యంలో రాయలపాలన వచ్చాక ముందు అంతశ్శత్రువుల్ని సరిచేయటం జరిగింది. మహామంత్రి ఏర్పాటుచేసిన సమావేశంలో తిమ్మరుసు ఇలా చెప్పాడు.
‘‘అధికారులు సత్యాహింసలు, నీతిసూత్రాలకు కట్టుబడి ఉండాలి. మనం పోర్చుగీసువారితో స్నేహం చేసి వారివద్ద గుర్రాలు, తుపాకులు, ఆయుధాలు కొంటున్నాం. సైన్యానికి వివిధ భాగాల్లో శిక్షణ ఇచ్చాం. అశ్వారోహకులు, గజారోహకులు, విలుకాండ్రు, సైనికులు అంతా ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. మన ప్రభువు కూడా యుద్ధవిద్యలో అసమానులే!
ఆయన జగజ్జెట్టి, వీరుడు. తాను స్వయంగా సైన్యం ముందుండి నడిపిస్తారు. మన ప్రభువు ప్రతి విజయానికి మనవంతు కర్తవ్యం నెరవేర్చాలి.’’
కాదంటే బతకలేరు అనే కఠోర హెచ్చరిక అందరికీ తెలుసు. తిమ్మరుసు మహామంత్రి మేథోకుశలత ఆ ప్రముఖులకి తెలియందికాదు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
దృశ్యాన్ని కళ్ళకి కట్టించిన ఆ శిథిల వైభవాన్ని చూస్తూ కారులో ముందుకు కదిలారు అభిషేక్, అమృతలు. అభిషేక్ కళ్ళతో చూసినట్లుగా అమృతకు చెప్తున్నాడు.
‘‘అమృతా! అటుచూడు! అక్కడ రాయలవారి అంతఃపురం ఉండేది. దానిచుట్టూ ఇది విశిష్టమైన మహానగరంగా నిర్మితమైంది. సుమారు ఏడుమైళ్ళ చుట్టుకొలత కలిగి బలిష్టంగా యాభై అడుగుల ఎత్తు, పది అడుగుల వెడల్పు గల ప్రాకారం ఉండేది. దీని ప్రధాన ద్వారాన్ని ఇరవై వేలమంది అశ్వికులు రాత్రింబవళ్ళు కాపలా కాసేవారు.
‘‘అభీ! కృష్ణదేవరాయల కాలం స్వర్ణయుగం అని ప్రసిద్ధికెక్కిందిగదా!’’
‘‘అవును అమ్మూ! రాయల కాలంలో విజయనగర సామ్రాజ్యం అద్భుతమైన సంపదలతో వెలలేని అమూల్య అరుదైన వస్తువులతో దేవలోకంలా ఉండేది. దేనికీ లోటులేక శాంతి సౌభాగ్యాలతో తులతూగేది. ఇదంతా కేవలం రాయల ప్రతిభ మాత్రమే కాదు. అప్పాజీ మేధస్సు కూడా! వివిధ కార్యక్రమాలతో కృష్ణదేవరాయలు నిమగ్నమై ఉంటే తిమ్మరుసు మహామంత్రి తన అసాధారణ ప్రజ్ఞాపాటవాలతో రాజ్యపాలనను నిర్వర్తిస్తూ రాయలను, రాజ్యాన్ని రెండు
కళ్ళుగా చూసుకున్నాడు. విజయనగర సామ్రాజ్య చరిత్ర గురించి చెప్పేటప్పుడు తిమ్మరుసు గురించి చెప్పకపోతే అది అసంపూర్ణమే!’’
కారు మళ్ళీ ఆగింది.
అభిషేక్ ఆ ప్రాంతమంతా చిరపరిచితమైనట్లు సొంతింట్లో నడుస్తున్నట్లు అనుభూతి చెందటం అతనికే విచిత్రంగా అన్పిస్తుంది. అతను వరుసగా ఒక్కొక్క స్థలాన్ని చూపిస్తూ రాయల స్వర్ణయుగాన్ని మళ్ళీ అమృత కనుల ముందు ఆవిష్కరించాడు.
‘‘శ్రీమద్రామాయణంలో వాల్మీకి వర్ణించిన కిష్కింధ ఈ హంపీయే. తుంగభద్రా నదీతీరంలో కిష్కింధ ముఖ్యపట్టణంగా ఆనెగొంది కలిపి ‘వానరధ్వజ’మనే పేరుతో విలసిల్లాయి. నగరాన్ని భద్రంగా కాపాడే ఐదు పర్వతాలు మాతంగం, మాల్యవంతం, హేమకూటం, బసవశృంగం, కిష్కింధ. వీటిలో మాతంగం సుగ్రీవుడెక్కటానికి సాధ్యమైంది. వాలి దీనిని ఎక్కలేక పోయాడని రామాయణ శృతి. వాలి, దుందుభుల గుహ ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తుంది.
రావణాసురుడు సీతని చెరపట్టి ఆకాశ మార్గాన తీసికెళ్ళినప్పుడు ఆమె నగలు మూటగట్టి ఇక్కడి పంపా సరోవరం ఒడ్డున పడేసింది. శ్రీ విరూపాక్ష దేవాలయం ఉన్న ఈ ప్రాంతాన్ని దక్షిణకాశిగా వర్ణిస్తారు. కన్నడంలో ‘పాలు’ అనే పదాన్ని ‘హాలు’ అంటారు. ‘పంపా’ అనే పదం ‘హంపా’, ‘హంపీ’గా రూపాంతరం చెందింది. హనుమంతుడు పుట్టిన హనుమత్పర్వతం కన్పిస్తుంది. వాలిని శ్రీరాముడు దహనం చేసిన ‘వాలికాష్టం’ ఇక్కడ ఉంది.
ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో హంపీ రథోత్సవం జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి లక్షమంది ప్రజలు ఈ ఉత్సవానికి వస్తారు.
శిథిల కట్టడాలు, రాతిగుళ్ళు, శిలాకనుమలు, కరకులోయలు, నిర్జన వీధులు, శిథిల దేవాలయాలు, నదిలోంచి వచ్చే కాలువలు, చెరుకు, అరటి తోటలతో కన్పించే ఈ హంపీ పట్టణంలో నాటి రాయల ప్రాభవం ఈ శిథిలాల నేపథ్యం లోంచి చూస్తేనే ఇంత అద్భుతంగా అన్పిస్తుంది. ఇక నిజంగా ఈ కాలంలో ఈ పట్టణం ఎంత ఉజ్వలంగా వెలిగిందో కదా’’ తన్మయంగా చెప్పాడు అభిషేక్.
‘‘అవును అభీ! ఈ దేవాలయం పేరేంటి? ఇంతటి శిల్పకళతో చాలా సంపన్నంగా ఉంది’’ అమృత ఒక పెద్ద దేవాలయం గోడలమీది శిల్పకళను తనివితీరా చూస్తూ అడిగింది.
‘‘ఇది పట్టాభిరామ దేవాలయం. ఇక్కడ నుంచి కమలాపురం దాదాపు ఒక కిలోమీటరుంటుంది. ఇది అచ్యుతరాయల నిర్మితం. దీనికి దగ్గరే తుంగభద్రా ప్రాజెక్టు పెద్దకాలువ ఉంది. ఇక్కడ ఇలాంటి దేవాలయాలన్నీ దీర్ఘచతురస్రంగా గానీ సమచతురస్రంగా గానీ ఉన్నాయి. ఐదు కక్ష్యాంతరాలుగా బహిర్‌ద్వారం, రంగమండపం, అర్థమండపం, అంతరాళ మండపం, గర్భగృహం అనే పేర్లతో కన్పిస్తాయి. బహిర్‌ద్వారం ఉపరితలంలో గోపురం ఉంటుంది. దీనినే ‘రాయల గోపురం’ అంటారు. ద్వారానికి రెండువైపులా శిల్పాకృతులు, ధ్వజస్తంభం, బలిపీఠం, ముఖమండపం సమ చతురస్ర స్తంభాల మండపాలు కన్పిస్తాయి. దేవతా శిల్పాలంకరణలు సర్వసామాన్యం. గర్భగుహలో ఏ అలంకరణా ఉండదు. పై భాగంలో పరిణతి పొందిన తల విమానం ఉంటుంది. అధిష్టానం, పట్టిక, తలం, శిల్పం, పట్టిన పైన కలశం… ప్రతిభావంతమైన
శిల్పాచార్యుల పర్యవేక్షణలో రాయల కాలంలో కట్టబడిన అనేక దేవాలయాలున్నాయి. పెనుగొండ, లేపాక్షి, కంబ, కదిరి, మధుర, తంజావూరుమొదలైనచోట్ల విజయనగర శైలికి సంబంధించిన వాస్తుకన్పిస్తుంది.
ఈ దేవాలయమే కాదు హంపీలో పంపాపతిస్వామి, చక్రతీర్థంలో కోదండ రామస్వామి, విఠలస్వామి దేవాలయాలు ఇలాంటివే!
‘‘అభీ! ఇవన్నీ ఎప్పుడో చూసినట్లన్పిస్తుంది. నేను మొదటిసారి ఇప్పుడేగా వచ్చానిక్కడికి’’ ఆశ్చర్యంగా అడిగింది అమృత.
ఆమె చేతిని సున్నితంగా ప్రేమగా పట్టుకున్నాడు అభిషేక్.
‘‘అమృతా! పద! ఆ మండపంలో విశ్రాంతిగా కూర్చో… ఆ… ఈ నీళ్ళు తాగు. కళ్ళకి కన్పించినంత మేరా సువిశాలంగా కన్పించే ఈ హంపీ విజయనగర పట్టణంలో మనం ఉండేవాళ్ళమని నాకు చాలాసార్లు అన్పించింది. గతజన్మలు నమ్ముతావో లేదోనని నీతో అనలేదు. ఇప్పుడు నీక్కూడా అలాగే అన్పిస్తుందంటే మనకి ఈ హంపీకి ఏదో ఆత్మబంధం ఉంది. అమ్మూ! ఇది మనకి చిరపరచితమైన నగరమే! ఈ వీధులు మనం తిరిగినవే! నీకు ఒక్కొక్కటి గుర్తుచేస్తూ రాయలవారి కాలంలోకి తీసుకెళ్తాను. ఇలా నా హృదయానికి నీ అరచేతిని ఉంచు’’ వివశంగా కళ్ళు మూసుకున్నాడు.
ఆమె అలాగే చేసింది.
ఇద్దరూ విజయనగర సామ్రాజ్య వైభవోన్నతికి కారకుడైన ప్రభువు శ్రీకృష్ణదేవరాయల పాలనలో పౌరులుగా రాయల ఆదరణ చూరగొన్న కళాకారులుగా, శ్రీకృష్ణదేవరాయల స్వర్ణయుగ అనుభవాలనూ, గతజన్మ జ్ఞాపకాలనూ నిశ్శబ్దంగా మననం చేసుకుంటున్నారు.
అదొక విచిత్ర కాలసంయోగం.
(సశేషం)