Home ధారావాహిక నవల బంగారు కల

బంగారు కల

by Chillara Bhavanidevi

ధారావాహికం – 10వ భాగం


శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరుసుమంత్రి,పెమ్మసాని రామలింగ నాయకుడితో సుదీర్ఘసమాలోచనలు జరుపుతున్నారు.
‘‘రాయా! మనం అనుకున్నట్లుగానే కర్ణాటక, తమిళ ప్రాంతాలు దక్కనులో మలబారు ప్రాంతమేగాక సింహాళంలోని కొంతభాగం కూడా మన వశమైంది’’ తిమ్మరుసు గంభీర ఉత్సాహంతో చెప్పాడు.
‘‘దక్షిణ సముద్రాధీశ్వర అనే బిరుదు ప్రభువులవారి కీర్తిని మరింత ఇనుమడిరపజేస్తున్నది మహామంత్రి!’’ రామలింగనాయకుడు సంతృప్తిగా అన్నాడు.
శ్రీకృష్ణదేవరాయలు ఆనందాన్ని చిరునవ్వుతో వ్యక్తం చేశారు. తర్వాత తిమ్మరుసు తను వ్యూహరచనను వెల్లడిరచాడు.
‘‘ఇప్పటివరకు మనం జయించిన దక్షిణ ప్రాంతాలు గాక ముఖ్యమైన శత్రువుల గురించి ఆలోచించాలి ప్రభూ!’’
తిమ్మరుసు మాటలకు అవునన్నట్లు తల పంకించారు రాయలు. తిమ్మరుసు ఇలా చెప్పారు ‘‘మన శత్రువులలో అతి బలవంతులు బహ్మనీలు. బహ్మనీ ప్రభువు మామూద్‌ షాయే గాక బహ్మనీ రాజ్యంలో బీజాపూర్‌, గోల్కొండ, అహ్మద్‌నగర్‌ రాష్ట్రపాలకులు సుల్తాన్‌ అధికారాన్ని ధిక్కరించి స్వతంత్రంగా ప్రవర్తిస్తున్నారు.’’ ‘‘అది వారి సమస్య కదా అప్పాజీ?’’ రాయలు ప్రశ్నించాడు. ‘‘కానేకాదు. ఇది మన సమస్య కూడా! ఎందుకంటే వారిలో వారికి ఎంత విద్వేషమున్నా ఒక్కవిషయంలో వారికి ఐక్యత ఉంది. అదే విజయనగర సామ్రాజ్యం పట్ల ద్వేషం. మన సిరిసంపదలు, వైభవం చూసి అసూయ పొందటమే గాక ఈ ఐశ్వర్యాన్ని కొల్లగొట్టటం లక్ష్యంగా భావించి అదను దొరికినప్పుడల్లా మన రాజ్యంపై దురాక్రమణ జరపటం వారికి పరిపాటి అయింది’’ తిమ్మరుసు విశదీకరించాడు. ‘‘మరి మన కర్తవ్యం?’’ రాయలు సూటిగా కర్తవ్యోన్ముఖుడయ్యాడు. ‘‘బహ్మనీసుల్తాన్‌ మహ్మద్‌ షా విజయనగరంపై ‘జీహాదు’ ప్రకటించినా బీజాపూర్‌ సుల్తాన్‌ ఆదిల్‌షా యుద్ధం చేసినా బహమనులతో మన యుద్ధాలు ముగియలేదు ప్రభూ’’ ‘‘గతంలో మీరు బీజాపుర్‌ జయించి బీదర్‌ను వశం చేసుకుని బందీగా ఉన్న బీదర్‌ సుల్తాన్‌ను తిరిగి బహ్మనీ సింహాసనంపై ప్రతిష్టించి ‘యవనరాజ్య స్థాపకాచార్య’ అనే కీర్తి పొందినాక బహమనీ సుల్తానులకు మీ కీర్తి ప్రతిష్టల మీద కన్నెర్ర అయింది రాయా.’’ తిమ్మరుసు ప్రశంసకు రాయలు చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఆత్మవిశ్వాస సాహసాలు తొంగిచూశాయి. ష్ట్ర ష్ట్ర ష్ట్ర చంద్రప్ప ఈ మధ్య బాగా గమనిస్తున్నాడు. మంజరి తనని తప్పించుకు తిరుగుతోందని. కారణం బోధపడటం లేదు. క్షమాభిక్ష పొంది కారాగారం నుంచి విడుదల అయిన కంటకునితో రెండు మూడుసార్లు కన్పించింది కూడా! చంద్రప్పకి తీరని వేదనగా ఉంది. మంజరి ప్రవర్తనలోని మార్పు అతడిని వేధిస్తున్నది. బాధ్యతా నిర్వహణ కూడా సరిగా చేయలేకపోతున్నాడు. పిచ్చివాడిలా విఠల దేవాలయం, రాతిరథం చుట్టూ తిరుగుతూ మంజరి కోసం పరితపిస్తున్నాడు. అన్నపూర్ణాదేవి మందిరంలో ఉంటున్న మంజరి అతనికి పంజరంలో చిలకలా కన్పిస్తోంది. ఆమె సాన్నిహిత్యం కోసం అతని మనస్సు పరితపిస్తున్నది. మంజరికి కూడా అలాగే ఉన్నా చంద్రప్ప మేలుకోరింది కనుక దూరంగా ఉండదలిచింది. ఈ మధ్య ఎవరో ఆమెకి చెప్పారు. అతను నవమోహిని విగ్రహం దగ్గరే సొమ్మసిల్లి పడి ఉన్నాడట. ఎవరు కన్పించినా ‘‘మంజూని చూశారా?’’ అని అడుగుతున్నాడట. ఇవన్నీ వింటుంటే మంజరికి కన్నీళ్ళాగటం లేదు. ‘‘చంద్రా! నీవు లేని నా జీవితం తావిలేని పూవే కదా! ఏం చేయను? మనిద్దరికీ ఆ బ్రహ్మ రాయలేదు’’ అనుకుంటూ దుఃఖిస్తున్నది. మరోపక్క కంటకుని చొరవ ఆమెకు చీదరగా ఉంది. ‘‘శిలలో దాగిన శిల్పాలను కనులముందు నిలుపుతావనీ శ్రుతి చేసిన వలపు వీణను బ్రతుకంతా పలికించేవనీ తలచినదంతా కల్లలాయెనా వలపు వల్లరులే వాడిపోవునా ॥ ఆమె మనసు విషాదగీతికలా ఉంది. ష్ట్ర ష్ట్ర ష్ట్ర రాయలు బహమనీలను అదుపుచేయగలిగానని తలిచాడు. విజయోత్సవాలు జరిగాయి. తిరుమల వేంకటేశుని దర్శనానికి వెళ్ళి వచ్చారు. ‘‘రాయా! నామమాత్రంగా మనం బహ్మనీ సుల్తాన్‌ను సింహాసనంపై నిలిపాం. వారిలో వారు అంతఃకలహాలలో మునిగిఉంటారనీ, విజయనగర సామ్రాజ్యం వైపు కన్నెత్తి చూడరనీ భావించాం’’ తిమ్మరుసు విశ్లేషించారు. ‘‘అవును అప్పాజీ! మరి ఈ పెనుమార్పేమిటి?’’ రాయలు అసహనంగా అడిగారు. ‘‘బీజాపూర్‌, గోల్కొండ, అహ్మద్‌నగర్‌, బీదర్‌, బీరారు సంపూర్ణ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నా వారిని చూస్తూ ఉండిపోయాం. కానీ గోల్కొండ రాజ్యం నుండి కులీకుతుబ్‌షా మన కొండవీడుపై దాడికి సిద్ధమయ్యాడు.’’ ‘‘ఫర్వాలేదు అప్పాజీ! మన పాండురంగ సేనాపతి ఆ సంగతి చూడగలరని భావిస్తున్నాం.’’ ‘‘రాయా! అదే నా యోచన కూడా’’ ఇరువురు ప్రశాంత మనస్కులై సమావేశ మందిరం నుండి బయటికి వస్తుంటే చాటుగా స్తంభం మాటున జరిగిన ఓ నీడ తిమ్మరుసుమంత్రి దృష్టిలో పడకపోలేదు. ఆయన కళ్ళు ఎరుపెక్కాయి. నొసలు ముడిపడిరది. ష్ట్ర ష్ట్ర ష్ట్ర వీరేంద్రుడు, కంటకుడు మదిరాపానం చేస్తూ ఒళ్ళు తెలియని ప్రేలాపన స్థితిలో ఉన్నారు. ‘రాళ్ళన్నీ ఒకచోట, రత్నాలన్నీ ఒకచోట’ అన్నట్లుగా వీళ్ళిద్దరిదీ ఒకే ఆలోచన. విజయనగర సామ్రాజ్యాన్ని అంతం చేయాలని. ఒకే స్నేహం, కుటిలబుద్ధితో లాభం పొందటానికి. ‘‘ఆ ముసలినక్కను తప్పిస్తేగానీ మన పాచిక పారదు’’ వీరేంద్రుని మాటలు ముద్దముద్దగా ఉన్నాయి. ‘‘అది అంత సులభంకాదు వీరేంద్రా! తిమ్మరుసుమంత్రి రాయలవారికంటే రాజనీతి చతురుడు. ఆయనని తప్పించటమంటే రాయలవారినే’’ ‘‘హుష్‌’’ నోటిమీద వేలుంచి ఆపాడు వీరేంద్రుడు. ‘‘జగన్నాథ! ఆ పని మనమెందుకు చేస్తాం? రాయలతోనే చేయిద్దాం’’ వీరేంద్రుడు కుటిలంగా అన్నాడు. ‘‘అసాధ్యం. తన బొందిలో ప్రాణమున్నంతవరకూ రాయలు తిమ్మరుసును వదులుకోడు’’ కంటకుని నిరాశాస్వరం. ‘‘జగన్నాథ! అసాధ్యాన్ని సుసాధ్యం చేయటానికే గదా ఈ వీరేంద్రుడున్నది’’ మరోసారి మదిర సేవించాడు వీరేంద్రుడు. ‘‘మీ మాటలు నాకు బోధపడటం లేదు. వారిద్దరూ ఒకరికొకరు బహిర్‌ ప్రాణాలు.’’ ‘‘జగన్నాథ! బహిర్‌ప్రాణాలు. హ్హాహ్హాహ్హా! ఆ ప్రాణాలు పోతే పోలా’’ ‘‘ఆఁ!’’ నిర్ఘాంతపోయాడు కంటకుడు. భయపడ్డాడు కూడా! ‘‘మా నాయన గండమనాయకుడు వంటి నమ్మకమైన సేనాధికారులున్నంత వరకూ అది కుదరని పని’’ కంటకుడు పళ్ళు కొరికాడు. తనని కారాగారంలో వేసినప్పుడు ఏ సహాయం చేయని తండ్రి అంటే అతనికి చాలా కోపంగా ఉంది. ‘‘జగన్నాథ! నేను ఎన్నిసార్లు మహారాజుకు ఆ ముసలి మంత్రి మీద ఆరోపణలు చెప్పాను! ఉహు వింటేనా? కానీ నా దగ్గర మరో బ్రహ్మాస్త్రం ఉంది’’ వీరేంద్రుడు కళ్ళు పెద్దవి చేశాడు. బ్రహ్మాస్త్రం పేరు వింటూనే కంటకునిలో ఆసక్తి పెరిగింది. ‘‘ఏమిటది వీరేంద్రా!నీవు చాలా తెలివైనవాడివి.చెప్పు చెప్పు’’ ఆరాటపడ్డాడు. ‘‘ఆఁ! అది చెప్పేది కాదు జగన్నాథ! చేసి చూపించేది. ఆ బ్రహ్మాస్త్రాన్ని మా గజపతుల వంశంలోంచే తెచ్చాము. మా దుర్గాలన్నీ స్వాధీనపర్చుకొని మాకింత బిచ్చం వేస్తాడా ఆ రాయలు’’ వీరేంద్రుని కళ్ళు ఇంకా ఎరుపెక్కాయి. కంటకునికేదో అర్థం అయీ కానట్లుంది. ఆరేళ్ళ తిరుమలరాయుడు పరుగుపరుగున వచ్చాడు. ‘‘మామయ్యా! మీరు నాకు కత్తియుద్ధం ఇంకా ఎప్పుడు నేర్పిస్తారు?’’ ‘‘కాలం వచ్చేసింది నాయనా! జగన్నాథ! నేర్పిస్తాను. నువ్వు వెళ్ళి ఆడుకో’’ వీరేంద్రుడు తిరుమలరాయని బుజ్జగించి పంపేశాడు. ‘‘చాలా పొద్దుపోయింది వీరేంద్రా! మేము వెళ్తాం’’ ‘‘జగన్నాథ’’ కంటకునికి వీడ్కోలిచ్చి పంపేశాడు వీరేంద్రుడు. తూలుతూ ఇటు తిరిగిన వీరేంద్రునికి కాళికలా నిప్పులు చెరిగే కళ్ళతో అన్నపూర్ణాదేవి కన్పించింది. ‘‘ఏమిటిది వీరేంద్రా! నీ ప్రవర్తన నాకేం నచ్చటం లేదు. చుట్టమై వచ్చి దయ్యమై పట్టినట్లు.’’ నిందావాక్యాలకు అతడేమీ చలించలేదు. వీరేంద్రునికి కార్యసాధనే ముఖ్యం. ‘‘జగన్నాథ! చుట్టాన్ని కాబట్టే నీ గురించే నా ఆరాటమంతా’’ లేని ప్రేమ ఒలకబోశాడు. ‘‘నా గురించి నువ్వేం ఆరాటపడనక్కర్లేదు. నా పుట్టింటి చుట్టానివని ప్రభువు ఆదరిస్తుంటే ఇంకా ఎన్నాళ్ళిక్కడ?’’ అన్నపూర్ణాదేవికి చాలా కోపంగా ఉంది. ‘‘జగన్నాథ! అంత కోపం వద్దమ్మా! మహారాజుకు ఎందరో భార్యలుండటం మామూలే! కానీ వీరగజపతి వంశంలో పుట్టిన నిన్ను అందరిలో కలపటమే’’ నసిగాడు. ‘‘అది మా స్వవిషయం. ఇందులో నీ ప్రమేయమవసరం లేదు’’ గిరుక్కున వెనుదిగిరింది అన్నపుర్ణాదేవి. ‘‘జగన్నాథ! నీ స్వవిషయమే! మా ఇంటి ఆడపడుచువైన నీ గురించి నీ కొడుకు గురించి నువ్వు వద్దన్నా మాకు తాపత్రయమే!’’ నచ్చజెప్తూ రెచ్చగొడుతున్నాడు. ‘‘ఇప్పుడు నాకు, యువరాజుకి వచ్చిన లోటేం లేదు. ఇక్కడ నువ్వు ఉన్నంత కాలం నాకు మనశ్శాంతి ఉండేట్లు లేదు’’ కుపిత స్వరంతో అంది అన్నపూర్ణాదేవి. ‘‘జగన్నాథ! మన యువరాజే రాజు కావాలని నా ఆశ.’’ ‘‘నీ ఆశ అనకు. అది విజయనగర ప్రజల ఆశ. ప్రభువు కోరిక కూడా.’’ ‘‘జగన్నాథ! కోరితే తీరుతుందా! విజయనగర సింహాసనం మీద ఏ రాజైనా సరి అయిన పద్ధతిలో కూర్చున్నాడా!అంతదాకా ఎందుకు?నీ భర్త.. అదే శ్రీకృష్ణదేవరాయ ప్రభువు సోదరులను, వారి కుమారుడ్ని చంద్రగిరిలో బందీగా చేసేగా రాజయ్యాడు! పైగా ఈ ముసలిమంత్రేగా తంత్రమంతా నడిపింది’’ ఆలోచింపజేస్తున్నాడు. ‘‘అయితే’’ అన్నపూర్ణాదేవి అతనికేసి తిరిగింది. ‘‘జగన్నాథ! అయితే అంటావేమిటి తల్లీ! ఈ రాజ్యంలో తిమ్మిని బమ్మి చేయాలన్న బమ్మిని తిమ్మి చేయాలన్నా తిమ్మరుసు మంత్రికి నల్లేరు మీద బండి నడకే!’’ రహస్యం చెబుతున్నట్లు అన్నాడు. మళ్ళీ తన బోధ కొనసాగించాడు. ఆమె ముఖ కవళికలు మారుతున్నాయి. ‘‘ఈ మహామంత్రి మనసులో ఏముందో తెలుసా! నేను బాగా కనిపెట్టాను. రాయలు తన చేతిలో కీలుబొమ్మ. కాలం కలిసిరాగానే రాయల్ని అడ్డు తొలగించి తన కొడుకు గోవిందరాయలకి పట్టం గట్టాలని.’’ ‘‘స్వామీ జగన్నాథ! ఎంత మాట విన్నాను! తిమ్మరుసు మహామంత్రి కృష్ణరాయల కెగ్గు తలపెట్టటమా! కలలోనైనా ఊహించలేమే’’ ఆవేదనగా అంది అన్నపూర్ణాదేవి. ‘‘ఆ కలలో కూడా ఊహించనిది చేయటమే తిమ్మరుసు తెలివి’’ ‘‘నువ్వు చెప్పేది వింటుంటే నా తల తిరిగిపోతున్నది. నేనిప్పుడేం చేయాలి? నా ప్రభువునెలా రక్షించుకోవాలి’’ ఆసనంపై కూలబడిరదామె. ‘‘నీ ప్రభువును రక్షించుకోవాలంటే నీ కుమారుడు తిరుమలరాయని ఈ విశాల విజయనగరానికి సామ్రాట్టుని చేయాలంటే ముందు రాయలవారు తిమ్మరుసును గుడ్డిగా నమ్మరాదు. బానిసలా బతకరాదు. స్వంతబుద్ధితో ఆలోచించాలి. జగన్నాథ!’’ ‘‘అదెలా సాధ్యం! వారు ప్రభువుకు తండ్రిలాంటివారు. ఏ పనిచేసినా తిమ్మరుసులవారిని సంప్రదించనిదే జరుగదు.ఆఖరికి మా వివాహ విషయంలో కుడా తిమ్మరుసువారి పట్టుదలే కారణం’’ అన్నపూర్ణాదేవి గతంలోకి చూసింది. ‘‘ఆ! అక్కడే ఉంది కుట్ర. గజపతులు చాలా పరాక్రమవంతులు. వారింటి ఆడబిడ్డను వివాహమాడితే బంధుత్వరీత్యా ఆ ముప్పు తొలగిందిగా!’’ ‘‘వారు నన్ను వీరభోజ్యంగా గ్రహించారు వీరేంద్రా! ఇంతకాలంలో ఏనాడూ నాపట్ల ఇసుమంతైనా చిన్నచూపు చూసింది లేదు. పైగా తిరుమల రాయలు మా విజయనగర సామ్రాజ్యానికి ఏకైక వారసుడు. ఇక ముప్పేముంది?’’ ‘‘అని నువ్వనుకుంటే సరిపోయిందా పిచ్చితల్లీ! నేనిందాకే చెప్పాను. ఈ సింహాసనానికి వారసత్వశక్తి లేదు.’’ ‘‘మరి ఏం చేద్దాం’’ ప్రశ్నించింది ఆరాటంగా రాణి. అన్నపూర్ణ తన దారిలోకి రావటం వీరేంద్రునికి పరమానందంగా ఉంది. ‘‘జగన్నాథ! ఇప్పటికి నేను చెప్పేది నీకు అర్థమైంది. ఇన్నాళ్ళు నీకు అరణపుచుట్టంగా ఇక్కడ పడిఉన్నందుకు ఫలితం దక్కుతున్నది.’’ గొంతు తగ్గించాడు. అటూ ఇటూ చూశాడు. చాటున ఉండి రహస్యంగా వింటున్న మంజరి కొద్దిగా నీడలోకి జరిగింది కనపడకుండా. ఆమె మొహం విషాదంలో ముడుచుకుపోయింది. వీరేంద్రుడు అన్నపూర్ణాదేవి దగ్గరికి వచ్చి రహస్యం చెప్తున్నట్లు చెప్పాడు
‘‘చూడమ్మా! మన గజపతుల వంశాంకురమే విజయనగర సింహాసనం అధిష్టించాలని నా ప్రాణం కొట్టుకుంటున్నది. పుట్టింటి మీద నీకుమాత్రం ప్రేమలేదా ఏంటి? కృష్ణరాయల్ని, కుమారుడిని రక్షించుకోవాలంటే మనపని నెరవేరాలంటే… రాయలను నువ్వో కోరిక కోరాలి.’’
‘‘కోరికా! ఏమని?’’
‘‘నీ కుమారుడికి పట్టాభిషేకం చెయ్యమని’’
‘‘అందుకు ప్రభువు అంగీకరిస్తారా! తిరుమలరాయలింకా పసివాడే గదా!’’ అన్నపూర్ణాదేవి సందేహం.
‘‘జగన్నాథ! అక్కడే ఉంది కిటుకు. రాయలు నీ ముచ్చట తీర్చటానికైనా అంగీకరిస్తాడు.కానీ ఆ తిమ్మరుసు ఒప్పుకోవటమే అనుమానం. దీనిలో అతని కుటిలత్వం ప్రభువుకు కూడా తెలుస్తుంది’’గుట్టు విప్పినట్లు నవ్వాడు వీరేంద్రుడు.
ఇప్పుడు అన్నపూర్ణాదేవి పూర్తిగా వీరేంద్రుని మాయాజాలంలో పడిపోయింది. పుత్రప్రేమ ఆమె కళ్ళు కప్పేసింది.
‘‘నువ్వు చెప్పినట్లే నేను ప్రభువును ఆ కోరిక కోరతాను’’ ఆమె నిర్ణయించుకుంది.
వీరేంద్రుని ఆనందానికి అవధులు లేవు. తన మొదటి పాచిక పారుతోంది. సరిగ్గా గురిచూసి తగిలితే తిమ్మరుసుకూ, రాయలకూ మధ్య మొదటి విభేదం తలెత్తుతుంది. పసివాడికి పట్టం గట్టటానికి తిమ్మరుసు ఎటూ ఒప్పుకోడు. దాంతో రాయలు రాణికిచ్చిన మాటకోసం తిమ్మరుసును కాదనవలసి వస్తుంది. రాణి కోరిక రాయలు ఒప్పుకుంటాడా? ఒకవేళ తిమ్మరుసు రాయల మాటకు ఒప్పుకుంటే?’’ వీరేంద్రుడు ఉత్కంఠభరితంగా నవ్వుకున్నాడు.
మంజరి మనసు కలతపడుతున్నది. సాధ్వి అన్నపూర్ణాదేవి మనసులో విషబీజం నాటుతున్నాడీ దుర్మార్గుడు. తిమ్మరుసులవారికి రాయలవారికి తగవు తేవాలనే ఈ ప్రయత్నాన్ని వమ్ముచేయి స్వామీ విరూపాక్షా! అనుకుంటూ బయలుదేరిన మంజరి తిమ్మరుసు మహామంత్రికీ వార్తను అతి రహస్యంగా చేరవేయటంలో సఫలురాలయింది.
* * *
తిమ్మరుసు, రామలింగనాయకుడు వ్యాసరాయలు ఆశ్రమంలో సమావేశమైనారు.
‘‘ఏదో బురదపామనుకున్నాం గానీ తాచులా బుసలుకొడుతోంది’’ రామలింగనాయకుడు కోపంతో ఆవిర్లు కక్కుతున్నాడు.
‘‘ఆ తాచుపాము మెడపట్టి పడగ దింపాలి రామలింగ నాయకా! ఇక
ఉపేక్ష పనికిరాదు’’ తిమ్మరుసు నెమ్మదిగా చెప్పినా నిర్ణయం దృఢంగా ఉంది.
‘‘కాగల కార్యమేమిటి మహామంత్రీ!’’ వ్యాసరాయలు శాంతంగా అడిగారు.
‘‘ఏముందీ! వీరేంద్రుడిని తన్ని తగలేయటమే’’ ఆవేశంగా బుసలుకొట్టాడు రామలింగనాయకుడు.
‘‘ఆ…ఆ…! అలా చేస్తే రాయలవారి దృష్టిలో నిజంగానే మనం దుర్మార్గులమైపోతాం. ఆ వీరేంద్రుని పాచికకు ఎదురు పాచిక వేయటమే మనం చేయాల్సిన పని’’ తిమ్మరుసు సాలోచనగా అన్నారు.
‘‘ఏమిటది మహామంత్రీ’’ వ్యాసరాయలి ప్రశ్నకు తిమ్మరుసు ఇలా వివరించారు`
‘‘మనకి అందిన వార్త ప్రకారం అన్నపూర్ణాదేవి మహారాజును ఓ కోరిక కోరతారు.’’
‘‘ఏమని?’’ వ్యాసరాయలు అడిగారు.తిమ్మరుసు తన వివరణ కొనసాగించారు.
‘‘అదేమంటే యువరాజు తిరుమలరాయలకు పట్టాభిషేకం చేయమని.’’
‘‘ఆఁ! అంత పసివాడికి పట్టాభిషేకమా’’ రామలింగనాయకుడు నిర్ఘాంతపోయాడు.
‘‘అవును. దీనికి నేను ఒప్పుకోననీ, తద్వారా రాయలవారికి నాకూ విభేదాలు పెంచాలని వీరేంద్రుని పాచిక’’ తిమ్మరుసు విడమరిచారు.
‘‘మరి మనం అవునంటే?’’ వ్యాసరాయలు సందిగ్ధంగా చూశాడు.
‘‘అవునంటే పట్టాభిషేకం చేయాలి’’ తేల్చి చెప్పారు మహామంత్రి.
‘‘కాదంటే’’ రామలింగనాయకుడి ఆవేశం.
‘‘రాయలకూ, మాకూ విభేదం’’ స్థిరంగా ఉంది తిమ్మరుసు స్వరం.
‘‘రాయలవారికి ఇంతటిస్థానం సంపాదించి ఇచ్చింది మీరు. మీతోనే విభేదిస్తారా?’’ రామలింగనాయకుడు కలవరపడ్డాడు.
‘‘రామలింగనాయకా! అధికారం విచక్షణ కళ్ళుమూస్తుంది. అది ఎవరికైనా ఒకటే! ఇన్నాళ్ళకి రాయలకూ నాకూ ఒక విషమపరీక్ష ఎదురైంది. చూద్దాం! నా రాయలు దీనిని ఎలా ఎదుర్కొంటాడో!’’ తిమ్మరుసు మంత్రి కంఠంలో సన్నని వణుకు మొదటిసారిగా ధ్వనించింది.
‘‘మన కర్తవ్యం?’’ వ్యాసరాయలు వాతావరణాన్ని తేలిక చేశారు.
‘‘గురువర్యా! గతంలో రాయలవారి జన్మకుండలి ప్రకారం యోగం తప్పినప్పుడు మీరే విజయనగర సామ్రాజ్యమధిష్టించి సహాయం చేశారు. మరోసారి రాయలవారి జాతకాన్ని పరిశీలించండి. మనమేం చేయాలో దానిననుసరించి నిర్ణయిద్దాం.’’
తిమ్మరుసు మాట ప్రకారం వ్యాసరాయలు శ్రీకృష్ణదేవరాయల జన్మకుండలి పరిశీలించారు. ఆయన వదనం వివర్ణమయింది.
‘‘మహామంత్రీ! రాయలవారి రోజులు అంతగా బాగాలేవు. కొంత గ్రహశాంతి చేయాలి. యువరాజుగారి జాతకం కూడా ఆపద సూచిస్తున్నది.’’
‘‘దీని పరిహారం?’’ తిమ్మరుసు మంత్రి ఆందోళనగా చూశారు.
‘‘యువరాజు పట్టాభిషేకం ఇప్పట్లో జరగరాదు’’ వ్యాసరాయలు తేల్చి చెప్పారు.
‘‘అదెలా సాధ్యం? రాయలవారు జరపదలుస్తారు కదా!’’ రామలింగ నాయకుని సందేహం.
జరుపదలుస్తారు. అంతే! అన్నపూర్ణాదేవి మందిరానికి వెళ్ళకుండా
కొన్నాళ్ళు రాయలవారిని ఆపగలిగితే… తిమ్మరుసు ఆలోచనలో పడ్డాడు.
‘‘గురుదేవా! మేమిక వెళ్ళివస్తాం. ప్రణామాలు! మేమీ చర్చ చేసిన విషయం కడు రహస్యం. మీకు తెలుసుగదా!’’ నర్మగర్భంగా నవ్వారు తిమ్మరుసు.
‘‘మంచిది మహామంత్రీ! నిశ్చింతగా వెళ్ళిరండి. శుభం’’
వ్యాసరాయలు ఆశీస్సులు తీసుకొని తిమ్మరుసు, రామలింగ నాయకుడు వెళ్ళిపోయారు. విజయనగర సామ్రాజ్య రక్షణకు కట్టుబడి ఉన్న ఆ ఇద్దరు దేశభక్తులను చూస్తూండిపోయారు వ్యాసరాయలు.
* * *
‘‘మంజూ! ఆగు’’
ఒంటరిగా ఇన్నాళ్ళ తరువాత కలిసింది తన ప్రేయసి. చంద్రప్ప ఆమె చేతిని బిగించి పట్టుకున్నాడు.
అది వాళ్ళు తరచుగా కలుగుకునే ఉద్యానవనం. అయితే చాలారోజులుగా ఆ తోట చిన్నబోయింది. ఈ ప్రేమికుల సందడి లేక వెలవెలబోత్నుది. ఆమె ఆగింది. పెడమోమై నిల్చున్నది.
‘‘మంజూ! నీకిది న్యాయంగా ఉందా! ఎందుకు నన్ను దూరం చేస్తున్నావు?’’ దీనంగా అడిగాడు.
తన కన్నీళ్ళు అతనికి కన్పించనీయలేదామె.
‘‘నావల్ల ఏదైనా పొరపాటు జరిగితే నన్ను శిక్షించు. అంతేగానీ ఇలా దూరం చేస్తే చచ్చిపోతాను.’’
చటుక్కున వెనుదిరిగి చేత్తో అతని నోరు మూసేసింది. ‘‘చంద్రా!’’ అంటూ అరచేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది.
‘‘మంజూ!’’ ఆమెని దగ్గరికి తీసుకున్నాడతను.
‘‘జాతకం నమ్మి నన్ను దూరం చేస్తావా! చావైనా బతుకైనా ఇద్దరికీ ఒకసారే అనుకున్నాం కదా! ఆ కంటకునితో కలిసి ఎందుకు నా కంటబడుతున్నావో తెలుసుకోలేని బుద్ధిహీనుడ్ని కాను’’ కోపంగా అన్నాడు.
‘‘నువ్వు గ్రహించగలవని నాకు తెలుసు చంద్రా! నిన్ను నొప్పించాను. మన్నించు’’ దీనంగా అంది.
‘‘అలా అడిగితే సరిపోదు.శిక్ష వేయాల్సిందే’’ అల్లరిగా అన్నాడు.
‘‘ఏం శిక్ష వేస్తావ్‌?’’ నడుం మీద చేతులుంచుకొని మంజరి అడిగిన తీరుకు నవ్వేశాడు.
‘‘శిక్షా! మూడుముళ్లే…’’
ఆమె మొహం వివర్ణమయిందా ప్రస్తావనతో. పైకి బింకంగా మాట్లాడుతోందే గానీ తనవల్ల చంద్రప్పకి ఎటువంటి ఆపదయినా, అదీ పెళ్ళి రూపంలోనైనా రాకూడదని ఆమె ఆలోచన.
‘‘సర్లేగానీ ఇలా రా కూర్చో. నీతో చాలా సంగతులు చెప్పాలి. మనం కలిసి చాలా రోజులైంది కదా!’’ చంద్రప్ప ఆమె చేయిపట్టి పూపొదరింట కూర్చోబెట్టుకున్నాడు.
‘‘మన పెళ్ళి ఎల్లుండి పున్నమిరోజు విఠల మందిరంలో. ఇంకేం మాట్లాడకు సరేనా?’’
ఆమె అంగీకరసూచకంగా తలూపింది. అతని ఆనందానికి అవధులు లేవు. వాళ్ళిద్దరి మధ్య కాలం మరపురాని మధురగీతంలా జాలువారింది.
ఆమె : తొలగించవే తెరలు తారకా
పులకింపనీ వలపు మల్లికా
అతడు : సద్దు దేయని రేయి జారిపోనీక
ముగ్ధమోహనగీతి పాడనీ ఇంక ॥
ఆమె : ఆనాటి నా కలలు నెరవేరు వేళ
అందాల జాబిల్లి అందేటి వేళ
అతడు : కొమ్మ కొమ్మన చివురు పులకరించింది
పూవుపూవున తావి పొంగిపోయింది ॥
ఆమె : కొండకోనల గాలి కునికేటి వేళ
కోటితలపులు ఎదను కొలువైన వేళ
అతడు : అల్లనల్లన పదము పాట పాడిరది
జల్లుజల్లుగ మనసు కరిగిపోయింది ॥
చాలాసేపు మైమరచి అలాగే ఉండిపోయారా ప్రేమికులు.
దూరంగా నగారా మోగింది. చంద్రప్ప ఈ లోకంలోకి వచ్చాడు ఏదో గుర్తొచ్చినట్లుగా.
‘‘మంజూ! రామేశ్వరశాస్త్రి సన్యసించాడు. తెల్సుగదా!’’
‘‘అవును చంద్రా! అతను మహాశిల్ప గాయకుడు. ఉపాసకుడు. నిజానికి విఠల దేవాలయ సప్తస్వర స్తంభాల పూర్ణాకృతి అతనివల్లనే సిద్ధించింది.’’ గౌరవం ధ్వనించిందామె స్వరంలో.
‘‘శాస్త్రి విజయనగరం వీడి వెళ్ళిపోయాడట మంజూ!’’
ఆమె ఆశ్చర్యపోలేదు. శాస్త్రి గురించి అప్పటికే చాలా కథనాలు విన్నది. అతను అడుగుపెట్టిన చోట శుభప్రదంగా ఉంటుందనీ, ఏదైనా అశుభాలు జరుగబోతుంటే అతనా స్థలంలో ఉండడనీ.
‘‘నాకు అదే కలవరంగా ఉంది చంద్రా!శాస్త్రి విజయనగర విశిష్టశిల్పుల్లో ఒకడు. అలాంటిది ఈ నగరాన్ని వీడిపోయాడంటే అదీ ఎక్కడికో తెలీదంటే’’ అర్థోక్తిలో ఆగింది.
‘‘కాశీలో ఎవరికో కన్పించాడట. వెళ్ళేముందు ఆశ్రమవాసులతో ఇక విజయనగర వైభవం కనుమరుగవుతుందని అన్నాడట’’ బాధగా చెప్పాడు.
ఆ విషయం నేనూ విన్నాను. అతను సన్యాసం తీసుకున్న తర్వాత పెనుమార్పు జరిగింది. కుండలిని సాధనతో భవిష్యత్‌ చెప్పగల శక్తి వచ్చిందట. ఏది ఏమైనా గొప్ప సంగీత శిల్పి’’ నిట్టూర్చిందామె.
‘‘నిజమే! ఇప్పుడు విజయనగర పరిస్థితులు ఆ సూచన చేస్తున్నాయి కూడా… ఆ వీరేంద్రుడు’’ కోపంగా ఏదో చెప్పబోయాడు. ఆమె మధ్యలోనే ఆపింది.
‘‘చంద్రా! నీకు మరో ముఖ్యవిషయం చెప్పాలి. ఆ వీరేంద్రుడు ప్రభువుకూ మహామంత్రికీ వివాదం రేపాలని కుట్రపన్నుతున్నాడు.’’
‘‘అలాచేస్తే గానీ వాడి ఆటలు సాగవని పన్నాగం కాబోలు’’ చంద్రప్ప దవడ ఎముకలు బిగిసాయి.
‘‘ఆ వివాదం యువరాజు పట్టాభిషేకరూపంలో వస్తున్నది’’ మంజరి వివరించింది.
‘‘అయితే మనమేం చేయాలి’’ చంద్రప్ప ఆలోచించాడు.
‘‘మనం చేయగలిగేది మహామంత్రి చెప్తారు. ఆ కంటకుడితో నేను మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది. ఆ ద్రోహి కూడా వీరేంద్రునితో చేతులు కలిపాడు. వాడేమన్నాడంటే’’ అతని చెవిలో రహస్యంగా ఏదో చెప్పింది.
‘‘ఆఁ! దుర్మార్గుడు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెడతాడా!’’ పళ్ళు కొరికాడు చంద్రప్ప.
‘‘మనం మహామంత్రి చెప్పినట్లే చేయాలి. తెలిసిందా! ఆవేశపడి రహస్యాన్ని బట్టబయలు చేయకు.’’
అతను కొంత తగ్గాడు. ఆమె అతనికి దగ్గరగా జరిగింది.
‘‘ఈ ప్రశాంతమైన రాత్రి ఓ పాట పాడు చంద్రా! విని చాలానాళ్ళయింది’’ బతిమలాటగా అంది. మనసులో మాత్రం చంద్రప్పను మళ్ళీ ఎప్పుడు కలుస్తానో అని బెంగగా ఉందామెకు.
‘‘ఈ చల్లని రేయిలో
నా ఉల్లము రంజిలగా
పాట పాడనా చెలీ
పరవశించనా’’
అతనలా పాడుతూనే ఉన్నాడు. ఆమె అతని భుజంమీద తలవాల్చి వింటున్నది.
‘‘బాగు బాగు’’ చప్పట్లు విన్పించటంతో ఇద్దరూ దిగ్గున లేచి నిలిచారు. ఎదురుగా రామకృష్ణ కవీంద్రులు.
మంజరి అనవతంగా నిలబడిరది. చంద్రప్ప రామకృష్ణునికి నమస్కరించాడు.
‘‘కవీశ్వరులకు అభివాదం’’
‘‘చిరంజీవ. విజయనగర సామ్రాజ్యంలో కళారాధనకు వెన్నెల కూడా వికసిస్తుందని ఇవాళే తెలిసింది’’ కొంటెగా నవ్వాడు రామకృష్ణుడు.
‘‘క్షమించాలి స్వామీ! మంజరి, నేను…’’ తడబడ్డాడు చంద్రప్ప.
‘‘నాకు తెల్సుగానీ మీరు నిర్వహించవలసిన రాచకార్యమొకటున్నది. ఇది అతి రహస్యము. మహామాత్యులు సెలవిచ్చారు’’ అంటూ రామకృష్ణకవి చంద్రప్ప, మంజరిలని దగ్గరిగా పిలిచి కొన్నిమాటలు చెప్పారు.
‘‘అర్థమైందికదా! ఎలాగైనా సరే ప్రభువు పదిహేను దినాలు అన్నపూర్ణాదేవి మందిరానికి వెళ్ళకూడదు. అంతే! అన్నపూర్ణాదేవి మందిరంలో చక్కబెట్టే పని మంజరిది. మిగతా పని నీది చంద్రప్పా! ఆపైన అంతా విరూపాక్షునిది’’ రామకృష్ణుని దగ్గర సెలవు తీసుకుని కార్యభారంతో ఇద్దరూ బయలుదేరారు.

You may also like

Leave a Comment