4
శ్రీకృష్ణదేవరాయలవారు చాలాకాలం తర్వాత భువనవిజయ సభా మండపాన్ని అలంకరించబోతున్నారన్న వార్తతోబాటు ఆహ్వానాలు అందుకున్న కవి పండితులంతా ఆనందాతిరేకంతో విచ్చేశారు.
అప్పాజీ అత్యున్నతంగా ఏర్పాట్లు చేయించాడు. కవులతో పాటు సామంతులు, దండనాయకులు, నగర ప్రముఖులు ఆసీనులైనారు. అంతఃపుర స్త్రీలు ఆ ప్రతిష్టాత్మక దృశ్యాన్ని చూడటానికి ఏర్పాట్లు చేశారు.
శ్రీకృష్ణదేవరాయ ప్రభువు అప్పాజీతో కలిసి సభాప్రాంగణానికి విచ్చేశారు. వారిరువురు కృష్ణార్జునుల్లా తేజరిల్లుతున్నారు.
సభయావత్తూ లేచి నిలబడి వారికి స్వాగత వచనాలు, జయజయధ్వానాలు పలికింది.
కృష్ణరాయలు అందరికీ ముకుళితహస్తాలతో వందనమాచరించి సింహాసనమలంకరించారు. రాయలవారి వామపక్షాన కూర్చున్న తిమ్మరుసు మంత్రివర్యులు నిలబడి సభనుద్దేశించారు.
‘‘ఈ విజయనగర సామ్రాజ్యం వైభవోపేతమైన హిందూరాజ్యంగా మీ అందరి ఆదరాభిమానాలను చూరగొని విలసిల్లుతున్నది. పరస్పర కలహాల కారణంగా కల్లోలపడిన హిందూజాతి విద్యారణ్యులవారి ఆశీస్సులతో సామ్రాజ్యరూపంలో స్థిరపడిరది.
శ్రీ కృష్ణదేవరాయలవారి బాహుపరాక్రమంతో అవిచ్ఛిన్నంగా దక్షిణాపథానికి కూడా విస్తరించిన విజయనగర సామ్రాజ్యం నేడు కటకం దాకా ఏలుబడి సాధించింది. గజపతుల కుమార్తె విజయనగర ప్రభువుకు రాణిగా ఆహ్వానించ బడిరది. ఈ శుభసందర్భంగా ప్రభువులు తిరుమల వేంకటేశుని దర్శనానికి వెళ్ళి స్వామిదర్శనం చేసుకుని రాజ్యక్షేమానికి ప్రార్ధించి వచ్చారు. తిరుమలేశుని కృపవలన విజయనగర రాజ్యం సుస్థిరమైంది. అవకాశం కోసం పొంచివున్న శత్రువులెందరున్నా మసి చేయగల శక్తిని సముపార్జించింది.
ఈ సభలో ఆసీనులైన అందరికీ స్వాగతిస్తున్నాను. మన భువన విజయంలో కొలువుదీరిన అష్టదిగ్గజ కవుల గురించి ఎంత చెప్పినా తక్కువే.
‘‘స్తవ్యాంధ్ర కవితాపితామహ బిరుదాంకు
డలసాని వంశ పెద్దన మనీషి
మంజులశయ్యా సమంచిత కవితాభి
వినుతుండు నందితిమ్మన విభుండు
అతులిత మధురవాగ్ వ్యాపార ధీరతా
కలితుండు ధూర్జటి కవివరుండు
నవభావ కల్పన స్తవనీయ పింగళి
సూరనాభిఖ్య యశోధరుండు
అంత మాదయగారి మల్లనయు రామ
రాజభూషణు డయ్యలరాజు రామ
భద్రుడున్ రామకృష్ణ ధీవరుడునైరి
రాయలకు నష్టదిగ్గజ ప్రథితకవులు’’
ఈ సరస్వతీసభలో రాయలవారిని ఆశీర్వదించి ఆనందింపచేస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ ముగించారు తిమ్మరుసు మంత్రి.
‘‘శ్రీ విద్యారణ్యస్వామి ఆశీఃప్రభావంతో తేజరిల్లుతున్న విజయనగర సామ్రాజ్యం ధర్మరక్షణకు, హిందూధర్మ పరిరక్షణకు సాహితీ, సాంస్కృతిక వికాసానికి, సకల కళాభివృద్ధికి కంకణం కట్టుకుంది. మమ్మల్ని పరిరక్షకులుగా ఎంచుకుంది. నిరంతర యుద్ధ వ్యూహాలతో అలసి వేసారిన మాకు నేడీ భువనవిజయ సభ ప్రసన్నతను ప్రసాదించగలదని నమ్ముతున్నాను.’’
సభలోని పండితులు హర్షాన్ని కరతాళధ్వనులతో ప్రకటించారు. మంజరి రసరమ్యంగా నాట్యప్రదర్శన చేసింది. ఆమె ఆలపించిన వీరగీతం రాయలనుత్తేజితుడ్ని చేసింది.
శ్రీ విజయ నగర పరిపాలకా
దివిజన దివ్యార్జిత ఏలికా
శ్రీకృష్ణరాయ నృపా! నరాధిపా
జయీభవ! విజయీభవ!
కుందేళ్ళు శునకాల తరిమికొట్టిన నేల
ఎదురులేని పోతుగడ్డకు ప్రభువా
తెలుగు భాషకు తేనెల్లు పూసి
తెలుగు లెస్సని బల్కు మా తెలుగురాయా!
జయీభవ! విజయీభవ!
పసిడి రూకలు కవులకిచ్చేటి రేడా
భువన విజయాలతో మురిసేటి వాడా
కననమ్మునందైన కదనమ్ములోనైనా
నీకు నీవే సాటి మా దైవరాయా!
జయీభవ! విజయీభవ!
ఆంధ్ర మహావిష్ణువే ఆనతియ్యంగ
ఆముక్తమాల్యద నందించినావూ
బంగారు కాలమని అందరూ మెచ్చంగ
తుంగాతరంగాలు నీ చరితపాడంగ
జయీభవ! విజయీభవ!
శ్రీ విజయనగర పరిపాలకా!
దివిజన దివ్యార్చిత ఏలికా!
జయీభవా! విజయీభవా!
నాట్యం ముగిసింది. అవనతశిరస్కురాలై నమస్కరించింది మంజరి.
ఆమె నాట్యానికి విజయనగర వైభవ ప్రశంసకు ప్రభువు ప్రసన్నుడయ్యారు.
‘‘బాగు బాగు! నర్తకీమణీ! నీ నాట్యం, గానం మమ్మల్ని ముగ్ధుల్ని చేసింది. అందుకో ఈ సత్కారం’’ అంటూ అంగుళీయాన్ని బహుకరిస్తున్న ప్రభువుకేసి కృతజ్ఞతతో చూసింది మంజరి.
తిమ్మరుసు మహామంత్రి సాలోచనగా చూశాడు.
కంటకుడు పళ్ళు నూరుకుంటున్నాడు.
మంజరి వినయంగా ప్రభువుకు నమస్కరించి తిమ్మరుసు మంత్రికేసి ఓసారి అర్థవంతంగా చూసి నిష్క్రమించింది.
శ్రీకృష్ణదేవరాయలు కవులనుద్దేశించి ఇలా ప్రశంసించాడు.
‘‘మా అభ్యుదయం ధ్యేయంగా విజయ నిధులుగా భాసించే కవికదంబం మేము జైత్రయాత్ర సాగించినప్పుడు కూడా మాకు స్ఫూర్తినందించి వెంట నడిచారు’’ అంటూ అప్పాజీ కేసి చిరునవ్వుతో చూశాడు.
సేవకులు బంగారు పళ్ళెంతో గండపెండేరం తెచ్చి సభలో ఉంచారు.
‘‘సంస్కృతాంధ్రాలలో సమానంగా కవిత్వం చెప్పినవారి పాదానికి ఈ గండపెండేరాన్ని స్వయంగా నేనే తొడుగుతాను. వారే దీనికి అర్హులు’’ అన్నాడు రాయలు.
ఎవ్వరూ ముందుకు రాలేదు. రాయలు విచారించాడు.
‘‘ముద్దుగ గండ పెండియరమున్
గొనుడంచు బహుకరింప
నొద్దిక నాకొసంగుమని
యొక్కరు గోరగ లేరు లేరొకో’’ అని ప్రశ్నించారు. ఇంతలో పెద్దన కవీంద్రుడు తన ఆసనముపైనుండి లేచి
‘‘పెద్దన బోలు పండితులు
పృధ్విని లేరని నీ వెరుంగవే
పెద్దన కీదలంచినను పేరిమి
నాకిడు కృష్ణరానృపా’’అన్నాడు... ‘‘ఆంధ్ర కవితాపితామహా! మీరు అంతటి ఘనులే! పూర్వతరాల సంస్కృతాంధ్ర కవుల స్ఫూర్తిని గ్రహించి తెలుగు సంస్కృత సాహితీ మాలికను విన్పించండి కవిశేఖరా’’ కోరారు శ్రీకృష్ణదేవరాయ ప్రభువు. పెద్దన అపర సరస్వతి రూపుదాల్చినట్లు గళం విప్పాడు. ‘‘పూతమెఱుంగులుం బసరు పూపబెడంగులు జూపునట్టి వా కైతలు జగ్గునిగ్గు నెన గావలె గమ్మున గమ్మనన్ వలెన్ రాతిరియుం బవల్ మఱపు రాని హోయల్ చెలి, యార జంపుని ద్దాతరితీపులంబలెను దారసిలన్‌వలె లో దలంచించిన్ బాతిగ బైకొనన్ వలెను బైదలికుత్తుకలోనిపల్లటీ కూత లనన్వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్ డాతొడ నున్న మిన్నుల మిటారపు ముద్దుల గమ్మకమ్మనౌ వా తెఱదొండ పండువలె వాచవి గావలె పంట నూదినన్ గాతల దమ్మిచూలిదొర కైవసపుం జవరాలి సిబ్బెపు న్మే తెలియబ్బురంపు జిగి నిబ్బరపుబ్బగు గబ్బిగుబ్బపొం బూతల నున్న కాయసరి పోడిమి కిన్నెరమెట్ల బంతి సం గాత పుసన్నతంతిబయ కారపుగన్నడి గౌళపంతు కా సాతతతాన తానలపసందివుటాడెడు గోట మీటుబల్ మ్రోతలునుంబలెన్ హరుపు మొల్లముగావలె నచ్చతెన్గు లీ రీతిగ సంస్కృతంబు పచరించిన పట్టున భారతీవధూ టి తపనీయ గర్భ నికటీభవదాననపర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభా శీతనగాత్మజాగిరీశ శేఖర శీతమయూఖ రేఖికా పాత సుధాప్రపూర బహుభంగ ఘుమంఘుమఘుంఘుమార్భటీ జాతక తాళ యుగ్మలయ సంచిత చుంచు విపంచికా మృదం గాతతదేహితత్తహిత హాదితదంధణుధాణుదింధిమి వ్రాత నయనానుకూల పద వారకుహూద్వహహారికింకిణీ నూతన ఘల్గలాచరణ నూపుర రaూళరaళీమరంద సం ఘాత వియద్ధునీచకచకచద్వికచోత్పలసారసంగ్రహా యాతకుమారగంధవహ హారి సుగంధవిలాసయుక్తమై చేతము చల్లజేయవలె జిల్లున జల్లవలెన్ మనోహర ద్యోతక గోస్తనీఫలమధుద్రవ గోఘృత పాయస ప్రసా రాతిరస ప్రసార రుచిర ప్రతిమంబుగ సారెసారెకున్’’ భువనవిజయ సభాప్రాంగణం రసహృదయుల కరతాళధ్వనులతో మారు మ్రోగింది. రాయలు పులకాంకితుడయ్యారు. ‘‘సంస్కృతాంధ్ర కవితా విశారదా! మీరు నిజంగా పెద్దనే! ఈ గౌరవాసనం అలంకరించండి. ఇదిగో! ఈ గండపెండేరాన్ని స్వయంగా మేమే మీ పాదానికి అలంకరిస్తాము. నేటినుండి మీరు ‘ఆంధ్ర కవితా పితామహు’లన్న కీర్తిని గడిరచారు’’ అన్నారు రాయలు. ‘‘ఈ గౌరవం సంస్కృతాంధ్ర సరస్వతికి ప్రభూ!’’ పెద్దన కవీంద్రుడు ప్రభువుకు నమస్కరించాడు. ఈ సందర్భంగా ఒక కృతిని రచించి అంకితమిస్తానని పెద్దన సభాముఖంగా రాయలకు వాగ్దానం చేశారు. సింహాసనాసీనులైన రాయలు ఆ విద్వత్సభలో తన సాహిత్యాభిమానాన్ని నిరూపిస్తూ తాను పూనుకున్న కావ్యరచన గురించి ఇలా వెల్లడి చేశారు. ‘‘మేము కళింగ దండయాత్రకు వెడలినప్పుడు కృష్ణాతీరంలో ఇంద్రకీలాద్రిని దర్శించి కానుకలర్పించి ముందుకుసాగాము. కృష్ణాతీరంలోనే శ్రీకాకుళంలో ఆ రాత్రి సైన్యంతో విడిదిచేశాము. ఆనాడు వైకుంఠ ఏకాదశి. మేము నిర్జలోపవాసంలో ఉన్నాము. సమీపంలో ఏదైనా వైష్ణవదేవాలయం ఉందా అని అన్వేషించగా ఆంధ్రనాయకుడైన శ్రీకాకుళాంధ్ర దేవుని ఆలయం ఉందని తెలిసింది. ఆ రాత్రి ఆలయంలో విడిదిచేసి కవిగోష్ఠి జరిపాము. మన ఆస్థానంలోని మహాకవులు తమ కావ్యాల నుండి రసగుళికల వంటి పద్యాలు వినిపించారు. రాత్రి అక్కడే నిద్రించాము. జాగరణరాత్రి నిద్రలో అపూర్వ దివ్యస్వప్నంలో ఆంధ్రనాయకుడు సాక్షాత్కరించాడు’’ రాయల వాక్కు వింటూ సభ ఆశ్చర్యపడిరది. రాయలు ఉద్వేగంగా వెల్లడిస్తున్నాడు. ‘‘ఆ కలలో ఆంధ్రమహావిష్ణువు విష్ణుభక్తుల చరిత్రను తెలుగులో కావ్యంగా రాసి వేంకటేశునికి అంకితమీయమని నన్ను ఆదేశించాడు’’ రాయలు చెప్పాడు. ‘‘సాధు సాధు’’ అని సభ ఆమోదం ప్రకటించింది. ‘‘తెలుగులోనే కావ్యరచన ఎందుకంటే... ‘‘తెలుగదేల యన్న దేశంబు దెలుగేను తెలుగు వల్లభుండ, తెలుగొకండ ఎల్ల నృఫులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స’’
అన్న రాయల భావానికి మంత్రముగ్ధులైనారంతా!
‘‘మేము రచిస్తున్న ‘ఆముక్త మాల్యద’ ప్రబంధంనుండి ఒకటి రెండు పద్యాలు విన్పించగలము. అవధరించండి’ విష్ణుచిత్తుని భక్తితత్పరత ఎట్టిదనగా`
‘‘అం దుండుం ద్వయపద్మపద్మవదనుం డద్వంద్వు డశ్రాంతయో
గాందూబద్ధ మధుద్విషద్ద్విరదు డన్వర్ధాభిధానుండురు
చ్ఛందోబృంద తదంతవాగపఠనా సంజాతతజ్జన్యని
ష్బందద్వైత సుసంవిదాలయుడు నిష్ట న్విష్ణుచుత్తుం డనన్’’
రాయల కవితాప్రవాహంలో నాటిసభ సరస్వతీనదిలా ప్రవహించింది.
పెద్దన ఆముక్తమాల్యద కథాంశాన్ని మిగుల శ్లాఘించారు.
అష్టదిగ్గజ కవుల కావ్యాలనుండి రసబంధురమైన కొన్ని పద్యాలనువిని సభ సాహితీ డోలికల్లో ఓలలాడిరది.
భువనవిజయం సాహితీవిజయంగా భాసించింది. అప్పాజీ వదనంలో రాయలపట్ల అవ్యాజ్యమైన ప్రేమ, తృప్తి తొణికిసలాడిరది.
‘‘శ్రీకృష్ణదేవరాయలవారికి జయము జయము’’ అనే హర్వధ్వానాలతో నాటిసభ ముగిసింది.
‘‘ప్రభూ! మేముకూడా మీ వెంట తిరుమలకు వస్తాము. వేంకటేశుని కనులారా దర్శించి తరిస్తాము’’ తిరుమలాంబ మాటలకు రాయలు ఆమోదించాడు. ముచ్చటపడిన రాయలు ముగ్గురు దేవేరుల కోరిక ప్రకారం వారితో కాలినడకన సకలసన్నాహాలతో తిరుమలయాత్ర చేశాడు. పండితులు, కవులు,గురువులతో గోవిందనామ స్మరణతో శ్రీవేంకటాచలం చేరాడు రాయలు.
రాయలు తిరుమలక్షేత్ర మహాత్మ్యమును దేవేరులకు వివరించాడు.
‘‘ఇది మేరుపర్వతభాగం. వేంకట అంటే ‘ఇహపరాలు ఇచ్చేవాడని’ అర్థం. ఏడుకొండల వేంకటనాయకుడు కలియుగంలో భక్తులపాలిట కొంగుబంగారమై వెలిశాడు.’’
సకలతీర్థములున్న స్వామిపుష్కరిణిలో దేవేరులతో స్నానంచేసి వరాహ స్వామిని దర్శించి, శ్రీవేంకటేశుని దర్శించి ఆముక్తమాల్యద అంకిత పద్యాన్ని స్వామికి విన్పించాడు రాయలు. తిరుమల దేవాలయ శిల్పసంపద అందరినీ అబ్బురపరిచింది. రాయలు దేవేరులతో శిల్పరూపంలో వేంకటేశుని ముంగిట కొలువుతీరటం చూసి అందరూ ఆనందపడ్డారు.
విజయనగర సామ్రాజ్య రక్షణ చేయమని స్వామినికోరి రాయలు తిరిగి ప్రయాణమయ్యాడు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
విజయనగరంలోని కారాగార ప్రధాన అధికారికి రాజాంగుళీకాన్ని చూపించింది మంజరి.
‘‘ఏమి ఆజ్ఞ?’’
‘‘చంద్రప్పను చూడాలి’’
భటులు ఆమెను చంద్రప్ప ఉన్న కారాగార విభాగానికి తీసుకెళ్ళారు. ఆమెని చూసి చంద్రప్పకు ఆశ్చర్యం, ఆనందం, భయం కలిగాయి.
‘‘మంజూ! ఎందుకింత దుస్సాహసం? ప్రభువుల ఆగ్రహానికి గురికావలసి వస్తుందని తెలియదా?’’
‘‘ప్రభువులు అనుగ్రహించారు చంద్రా! అందుకే ఇలా రాగలిగాను. దేవేరులతో రాయలవారు శ్రీ వేంకటాచలానికి వెళ్ళారు. ఆ తిరుమలేశ్వరుని దయవలన నీపై వచ్చిన నిందకూడా త్వరలోనే తొలగిపోతుంది. నేను తిమ్మరుసు మహామాత్యునికి అన్నీ విన్నవిస్తాను.’’
‘‘వారు నమ్ముతారా!’’ చంద్రప్ప నిరాశగా అన్నాడు.
‘‘వారు విజ్ఞులు. నువ్వు ధైర్యంగా ఉండు. నాడు ఏంజరిగిందీ చెప్పటానికి సాక్షి ఉన్నాడు.’’
‘‘సాక్షా!’’ ఆశ్చర్యపోయాడు చంద్రప్ప.
‘‘అవును. నేనిక వెళ్ళివస్తాను’’ కన్నీరు దాచుకుంటూ వెళ్ళిపోయింది మంజరి.
మంజరి మర్నాడు తిమ్మరుసును కలిసి చంద్రప్ప తన ఇంటిలో రహస్య పత్రాలను దాచిన విషయం, అవి దొంగిలింపబడిన తీరు వివరించింది. తన కుమారుడే సాక్ష్యం చెప్పటం తిమ్మరుసును ఆశ్చర్యానికి లోను చేసింది.
గండమనాయకుడు విశ్వాసపాత్రుడే! అయితే అతని కుమారుడు కంటకుడు వీరేంద్రుడితో కలిసి రాజ్యానికే ముప్పుతెచ్చే పనిలోఉన్నాడని తిమ్మరుసు గ్రహించాడు. వెంటనే గండమనాయకుని పిలిపించాడు.
‘‘అమాత్యవర్యా! ఏమిటి ఆజ్ఞ!’’ గండమనాయకుడు తిమ్మరుసు ఎదుట వినయంగా నిలిచాడు.
‘‘గండమనాయకా! రాజు కొలువులో విధినిర్వాహణ కత్తిమీద సాము గదా!’’
సేనానాయకుడు ప్రశ్నార్థకంగా చూశాడు.
‘‘నీ స్వామిభక్తి నిరూపించుకొనే సమయం ఆసన్నమైంది’’ తిమ్మరుసు మళ్ళీ అన్నాడు.
‘‘చెప్పండి అమాత్యా! నా శిరస్సు ఒక్క వేటుతో తెగవేసుకోనా?’’
‘‘అంతకంటే కఠినమైన త్యాగం. నీ కుమారుడు కంటకుడు రహస్య రాజపత్రాలను శత్రువుకు చేరవేశాడని మనకి విశ్వసనీయ సమాచారం అందింది. అతను స్త్రీ లోలత్వంతో కాముకుడై మంజరిని చెరపడుతున్నాడని అభియోగాలున్నాయి’’ తీవ్రంగా ఉంది తిమ్మరుసు స్వరం.
గండమనాయకుడు అవమానభారంతో తలదించుకున్నాడు. అతనికి తెలుసు కుమారుని నిర్వాకాలు.
‘‘మన శిక్ష్మాస్మృతి ప్రకారం కంటకుడ్ని ముందు బందీని చేయండి. తర్వాత విచారణ జరిపిద్దాం. చంద్రప్పను విడుదల చేయండి. రాయచూర్‌ను ఆదిల్‌ఖాన్ వశం చేసుకొన్నాడు. మనం వెంటనే రాయచూర్ ముట్టడికి సిద్ధంకావాలి.’’
‘‘అలాగే మంత్రివర్యా! కంటకుడు నా కుమారుడని అనుకోవటానికే అవమానంగా ఉంది. అతన్ని బందీ చేయకపోతే విజయనగరానికే చాలా ప్రమాదం. నాకిక సెలవు.’’
గండమనాయకుడి నాయకత్వంలో రాయచూర్ ముట్టడికి ఏర్పాట్లు తీవ్రస్థాయిలో మొదలైనాయి.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
చంద్రప్ప కారాగారం నుండి విముక్తుడైనాడన్న వార్త తెలిసి మంజరి సంతోషంతో ఆంజనేయుని గుడికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పింది. రామాయణ కాలంలో సీతారాముల్ని కలిపిన ఆంజనేయుడే తమని కలిపాడని ఆమె విశ్వాసం. చంద్రప్ప ఆమె చెంత వాలాడు సంతోషంగా.
‘‘మంజూ! నీ తెలివితేటలవల్ల బతికి బయటపడ్డాను’’ ఆమెను హృదయానికి హత్తుకున్నాడు.
‘‘మన అదృష్టంతో బాటు తిమ్మరుసుగారి ఔదార్యం’’ మంజరి ప్రశంసగా అంది.
‘‘ఈరోజు కృష్ణరాయలవారు తిరుమలనుంచి విచ్చేస్తారు. వెంటనే రాయచూర్ ముట్టడికి బయలుదేరుతారట’’ చంద్రప్ప చెప్పాడు.
‘‘నువ్వు కూడానా’’ దిగులుగా అంది.
‘‘రాయచూర్‌లో ఇస్మాయిల్ ఆదిల్‌ఖాన్ కార్యకలాపాలు కనిపెట్టి రమ్మని మంత్రివర్యుల ఆజ్ఞ’’
‘‘బాగుంది. ఇక మన పెళ్ళెప్పుడు?’’ మంజరి అలిగినట్లు అంది.
‘‘ఈ యుద్ధం పూర్తికానీ చేసుకొందాం. సరేనా!’’ బతిమాలాడు.
చంద్రప్ప మాటలకు మంజరి మొహం వికసించింది.
ఇద్దరూ యోగనరసింహస్వామికి కూడా వందనాలు సమర్పించి తిమ్మరుసు భవనంవైపు సాగిపోయారు.
అస్తమిస్తున్న సూర్యకిరణాలు తిమ్మరుసు సౌధం మీద రుధిరవర్ణంతో ప్రతిఫలిస్తున్నాయి.
హిందూసామ్రాజ్య శత్రువులపై తిమ్మరుసు ఆగ్రహాన్ని ప్రకటిస్తున్నట్లుందా సౌధం.
‘‘చంద్రప్పా! నువ్వు కారాగారం నుండి బయటికి వచ్చిన వార్త రహస్యం సుమా! మనమధ్యనే ఉండాలి. ఇకపై మారువేషంలో సంచరించి శత్రురాజుల వ్యూహాలను తెలుసుకోవాలి.’’
‘‘అలాగే మంత్రివర్యా!’’
‘‘మంజరీ! ఈ రాయచూర్ ముట్టడి అయ్యేదాకా నువ్వు కూడా జాగ్రత్త. మనం పోగొట్టుకున్న రహస్యపత్రాలు రాయచూర్ వారికి అందాయి. అయినా మరేం భయంలేదు. ఎత్తుకు పైఎత్తు మన దగ్గర సిద్ధంగానే ఉంది. మీరిక వెళ్ళిరండి’’ తిమ్మరుసు అనుజ్ఞ ఇచ్చాడు.
ఇద్దరూ సంతృప్తిగా ఆ భవనం నుండి బయటకు వచ్చారు.
బంగారు కల
previous post