Home ధారావాహిక నవల బంగారు కల

బంగారు కల

by Chillara Bhavanidevi

6
మనస్సు శాంతపరుచుకోవడానికి మంజరికి ఒకే ఒక మార్గం మిగిలింది. అది వివిధ శిల్ప సుందర దృశ్యాలను చూసి సమ్మోహనంగా నర్తించటం. ఆ రోజు ఉదయమే మంజరి భూగర్భ ప్రసన్నవిరూపాక్ష దేవాలయానికి బయలుదేరింది.
దేవాలయప్రాంగణం చేరి నిరంతరం నీటిలో నిమగ్నమై ఉండే విరూపాక్షుని సందర్శించింది. ఈ స్వామిని కొలిచినవారి మనస్సు పరమ ప్రసన్నమౌతుందిట. మంజరికీనాడు స్వామి దర్శనం పరమానందాన్ని కల్గించింది.
భూగర్భ ప్రసన్న విరూపాక్ష మందిరం కృష్ణరాయలు పట్టాభిషిక్తుడైన సందర్భంగా పునరుద్ధరణకు నోచుకున్నది. భూమట్టానికి దిగువగా ఉన్న ఈ దేవాలయం తూర్పు అభిముఖంగా రెండు పెద్ద గోపురాలతో గంభీరతను ప్రసాదిస్తోంది.ధ్వజస్తంభం,మహామండపం, గగన దీపస్తంభం, పలుమండపాలతో శోభాయమానంగా అలరారుతున్న ప్రసన్న విరూపాక్ష దేవాలయానికి ఉత్తర దక్షిణ దిక్కుల్లో చతురస్రాకారపు బలమైన స్తంభాలతో విశాలమైన మండపాలనేక మున్నాయి. మహామండపం నుంచి అర్థమండపం, షట్కోణాకారంతో ఉన్న మండపం నీటిలోనే ఉంది.
తీక్షణకుంభంగల పెద్ద విగ్రహం. కళ్యాణమండపాలను దాటింది మంజరి. ఆ దేవాలయ శిల్పకళా వైభవం ఆమెలో పరమ భక్తిభావాన్ని మేల్కొలిపింది. ప్రసన్న విరూపాక్షుని ఎదుట మహామండపంలో ముద్రపట్టి నృత్యరీతిలో శివారాధన చేస్తున్నది మంజరి.
పరమేశ్వరా దేవా జగదీశ్వరా!
దయాగుణశేఖరా, స్వామి పంపాపతీ!
నిను మనసార కొలిచేను మహేశ్వరా
మమ్ము కృప జూపి కాపాడు శివశంకరా!
ఆడేనురా పాట పాడేనురా!
ఎన్ని జన్మలకైనా పూజింతురా
నీచరణాలె శరణంటి నటధీవరా
మమ్ము కృప జూపి కాపాడు శివశంకరా!
గిరజావరా స్వామి వరసుందరా
భవములు బాపేటి ముల్లోక దీనబంధుడా!
మూడు కన్నుల కాచేటి మునివంద్యుడా
మమ్ముకృప జూపి కాపాడు శివశంకరా!
ఆమె పరవశంతో భక్తిభావంతో నర్తిస్తున్నది. శివకైంకర్యమైన ఆ నృత్య సమారాధనకు పరమశివుడు కూడా పరమానందంతో నర్తిస్తుంటే స్వామి జటాజూటం నుంచి గంగ తొణికిసలాడిరదేమోనన్నట్లు చిరుజల్లు ప్రారంభమైంది. గుడిప్రాంగణంలో జల్లుల స్వర విన్యాసంతోబాటు వీరేంద్రుని అట్టహాసానికి ఆమె ఒళ్లు జలదరించింది. చుట్టూ పరికించి చూసింది.
సిల్కుధోవతి, ఆపైన జరీ అంగరఖా, పట్టుకండువా, ముత్యాలపేర్లు ధరించి కన్నుల్లో కుటిలత్వం నింపుకున్న వీరేంద్రుడు ఆమె ఎదుట నిలిచాడు.
‘‘అమ్మాయీ… బాగు బాగు’’ మరోసారి విచిత్రంగా నవ్వాడు.
‘‘మీరా’’ ఆమె భయాందోళనతో ఒకడుగు వెనక్కి వేసింది.
‘‘జగన్నాథ! అంత భయమెందుకు? నీ నృత్యకౌశలం గురించి విన్నామేగానీ చూసింది లేదు. చిన్నాదేవి నృత్యంలో శృంగారం పాలు ఎక్కువట గదా! ఆమె నృత్యాన్ని చూసే అవకాశాన్ని రాయలు మాకివ్వలేదు. ప్చ్‌! ఏం చేద్దాం! జగన్నాథ!’’
‘‘ఏమిటీ మాటలు? వారిప్పుడు దేవేరులు. అలా మాట్లాడరాదు.’’
‘‘హు! ఏం దేవేరి? ఒక దేవదాసి ఎన్నటికీ దేవేరి కాలేదు. ఆ దాసీపుత్రుడు కృష్ణదేవరాయలకు ఆమె తగిన దేవేరియే! దేవేరి అంటే మా గజపతులపుత్రి అన్నపూర్ణాదేవే!’’
‘‘విూరిట్లా మాట్లాడటం తగదు. రాయలవారి తల్లిగారు వీరనరసింహ రాయలవారికి చాలాకాలంగా పుత్రసంతతి లేదు. నరసప్ప నాయకుని ముగ్గురు భార్యలలో నాగలాంబిక కుమారుడు రాయలవారు. అందరికీ తెల్సిన విషయమే గదా!’’ మంజరి వీరేంద్రుని అపోహను ఖండిరచింది.
అతడు వికటంగా నవ్వాడు.
‘‘ఇదంతా మీరనుకుంటున్నది. కానీ అది నిజం కాదు. మీలాంటి వారిని మభ్యపెట్టడానికి. అసలు సంగతి చెబుతాను విను జగన్నాథ!
రాయలు సత్కుల సంజాతుడు కానేకాదు. రాయల తండ్రి నరసనాయకుని చేతిలోని నీటిపాత్రలో ఓ సాయంత్రం ప్రకాశవంతమైన చుక్క రాలింది. ఆయన ఆ పాత్రమూసి మంత్రిగారికి ఈ విషయం కబురు చేశాడు. మంత్రిగారు ఆ నీటిని తాగమని రాజుకు వర్తమానం పంపాడు. రాజు నీటిని తాగి ఆ రాత్రి పట్టపుదేవి అంతఃపురానికి వెళ్ళాడు. కానీ ఆమెను కలవలేని సందర్భంలో ఆమె పరిచారికతో కలిశాడు. కృష్ణరాయని జన్మ ఆమెవల్ల జరిగింది’’ వీరేంద్రుడు గొప్ప రహస్యం కనిపెట్టినవాడిలా నవ్వాడు.
‘‘అంటే మీ వుద్దేశం రాయలవారి తల్లి కులీన కాదనేగా’’
‘‘జగన్నాథ! అందుకే ఆయన బుద్ధి కూడా అలాగే పెడతోవబట్టింది. భోగకాంతయిన చిన్నాదేవిని చేరదీశాడు కదా!’’
‘‘ఛీ! మీకీ విషం ఎవరు పెట్టారు? మీరు కులీన స్త్రీకి జనించలేదా?’’ మంజరి బుసకొట్టింది.
ఆ క్షణంలో ఆమె పరమశివుని కంఠాభరణమైన నాగినిలా ఉంది.
‘‘ఏం కూశావ్‌! మా గజపతుల వీరపరాక్రమం గురించి నీకు తెలీదు! కొన్నాళ్ళు ఆగు. నువ్వూ, నీ రాయలు ఈ విజయనగరం మట్టిలో కలవకపోతే నా పేరు వీరేంద్రుడు కాదు’’ హుంకరించాడు.
మంజరి వెంటనే తేరుకుంది. యుక్తివంతంగా వ్యవహరించాలనుకుంది.
‘‘మీరన్నదే నిజమైతే ఇంతటి దాసీపుత్రునికి అన్నపూర్ణాదేవినిచ్చి ఎలా వివాహం చేశారు’’ ఆరా తీసింది.
‘‘అదా! గ్రహచారం జగన్నాథా! ఇస్తే ఇల్లలకగానే పండగయిందా? గజపతుల కృష్ణసర్పం పడగనీడలో రాయలున్నాడని మర్చిపోతున్నాడు. చూస్తావుగా ఇకనించి అంతా మా కాళ్ళకింద మట్టిగానే మిగుల్తుంది’’ వీరేంద్రుడు కాలితో నేలను తన్ని విసవిసా వెళ్ళిపోయాడు.
అతని నిజస్వరూపం తెలుసుకున్న మంజరి తుఫాను ఎదుర్కొనే ఆకులా అల్లాడిపోయింది. అతనితో మాట్లాడటం మేలుకే అయింది. ఇతగాడి విషబుద్ధి మహామంత్రికి సెలవీయాలి. విజయనగర సామ్రాజ్య పరిరక్షణ కోసం తన ఆఖరిశ్వాస దాకా అంకితమౌతుంది.
తిమ్మరుసువారికీ విషకీటకం బుసలు విన్పించకుండా ఉంటాయా! చంద్రప్ప రాగానే చర్చించాక అసలు విషయం బయటపెట్టాలి. పాపం అన్నపూర్ణాదేవి మహాసాధ్వి. గంధపుచెట్టును సర్పాలు చుట్టుకున్నట్లు ఇటువంటి నాగులెన్ని కదిలినా రాయలవారి ఖడ్గానికి బలికాక తప్పదు. ఏది ఏమైనా వీరేంద్రుని కదలికలని కొంత కనిపెట్టి ఉండాల్సిన అవసరమేర్పడుతున్నది.
ఆముక్త మాల్యదలో ప్రభువు రాసిన పద్యం గుర్తొస్తున్నది.
రాష్ట్రమెరియంపకొనుము దుర్గములు తదవ
రోధ మగవడ్డ బుట్టించి రూఢ నడపు
పరుషములు తద్రిపుల రాయబారు లెదుట
బలుకకుము సంధి యొకవేళ వలసియుండు (4)
శత్రుదేశాన్ని తగులబెట్టు. శత్రురాజుల కోటలను ఆక్రమించు. కానీ బందీలుగా ఉన్న శత్రువుల స్త్రీలను పుట్టింటి తోబుట్టువులుగా భావించి మర్యాదతో ప్రవర్తించు. రాయబారులతో పరుషవాక్యాలు మాట్లాడకూడదు. ఎందుకంటే సంధి చేసుకోవాల్సి రావచ్చు.
ఇటువంటి ఉన్నతాశయాలు కలవాడు కనుకనే రాయల సంస్కారం అదే తీరులో ఉంది. కానీ తమ ఇంటి ఆడబడుచు బంధువుగా వచ్చిన వీరేంద్రుడు ఇలా ప్రవర్తించటం అతని నీచత్వానికి నిదర్శనం. ప్రతాపరుద్ర గజపతిని ఓడిరచిన తర్వాత అతని కొడుకైన వీరభద్ర గజపతికి రాయలవారు ప్రాణభిక్ష పెట్టకపోతే గజపతులకు వారసుడెవరుంటారు? మరుక్షణంలోనే అన్నపూర్ణాదేవి కుమారుడు తిరుమలరాయలు స్ఫురణకొచ్చాడు. అంతకుముందు రాయల వారికి పుత్రులు పుట్టినా దక్కలేదు. తిరుమలరాయడే భావి విజయనగర సామ్రాజ్యాధినేత గదా! అని మంజరి తనలో తాను వితర్కించుకుంటూ మరోమారు ప్రసన్న విరూపాక్షునికి నమస్కరించి బయలుదేరింది. మెట్లెక్కి ప్రాకారం దాటి బయటికి రాగానే వెనుకనే రామేశ్వర శాస్త్రి బయటికి రావడం గమనించిన మంజరి ఆశ్చర్యచకితురాలయింది.
బ్రహ్మతేజస్సుతో అలరారే ముఖవర్చస్సు, స్ఫురద్రూపం, కాలికి కడియం, నుదుట విభూతిరేఖలు, దీటైన వస్త్రధారణతో పాతికేళ్ళ ఆ యువకుడు మంజరి కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆమెపట్ల అతని ఆరాధనభావమంతా ఆ కన్నులలో తొణికిసలాడిరది.మంజరికి ఈ యువకుని గురించి పూర్తిగా తెలియదు. చాలాసార్లు ఇతనిని శిల్పారామంలో చూసింది. యువశిల్పిగా భావించింది. కానీ శాస్త్రి మంజరి సౌందర్యాన్ని ఆమె నృత్యశోభను ఆరాధిస్తున్నాడని ఆమెకు తెలిసే అవకాశం లేదు.
తనకీ వీరేంద్రునికి మధ్య జరిగిన సంవాదానికి సాక్షి పరమేశ్వరశాస్త్రి అనే విషయం మంజరికి అర్థమయింది. ఆమె అతనికేదో చెప్పాలనుకొంది.
అతను మాత్రం ఆమెకా అవకాశం ఈయకుండానే మరోదోవలో చకచకా ముందుకు సాగిపోయాడు. వెళ్తున్న అతనికేసి చూస్తూండిపోయింది మంజరి.
పరమేశ్వరశాస్త్రి పరమ శివభక్తుడు. ప్రశాంతంగా ఉండే భూగర్భ ప్రసన్న విరూపాక్ష మందిరంలో రోజూ కొన్నిగంటలు యోగసాధన చేస్తుంటాడు. అతనెవ్వరివాడో ఎక్కడివాడో ఏ వివరాలు ఎవరికీ పూర్తిగా తెలియవు.
పరమేశ్వరశాస్త్రి తిమ్మరుసు స్నేహితుని కుమారుడని మాత్రం అంతా చెప్పుకుంటారు. కళగల మొహంతో అందంగా బలంగా కన్పించే శాస్త్రి అప్పుడప్పుడు రాతిరథం దగ్గర కూచుని ఎలుగెత్తి శ్రావ్యమైన స్వరంతో పాటలు పాడుతుంటాడని అందరికీ తెలుసు.
ఆరోజు కూడా విరూపాక్ష దేవాలయం నుంచి శాస్త్రి నేరుగా రాతిరథం దగ్గరికి వచ్చాడు. రెండు చక్రాల మధ్యస్థలంలో బాసీపట్టి వేసుకుని కూచున్నాడు. శివయోగం సాధన చేశాడు. మనసుకు శాంతి లభించటం లేదు. మంజరిని చూసినప్పుడల్లా తెలియని అశాంతికి లోనవుతున్నాడు.
నిలువ నీడలేని తనకు ఆశ్రయమిచ్చి సర్వశాస్త్రాలలోముఖ్యంగా శిల్పశాస్త్రంలో మెళకువలు అవగతం చేసిన గురువును స్మరించాడు. తనలోని సంగీతతృష్ణని పెంచి గంధర్వగానాన్ని నేర్పిన రెండవ గురువు అమ్మకి నమస్కరించాడు.
శిల్పాచార్యులవారి దగ్గరికి వెళ్ళి శిల్పిగా ఉద్యోగం అర్థిస్తే పాటలుపాడే శిల్పి మా కక్కర్లేదన్నాడు.
సంగీతాచార్యుడుగా మారుదామంటే రాళ్ళమధ్య బతికేవాడు సంగీతానికి పనికిరాడన్నారు.
ఎందుకిలా? ఎన్నాళ్ళిలా? నేనెవరిని? నా జీవితం ఎందుకిలా…. నా జీవితమే ఎందుకిలా? స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఇంత బలమైనదా!
విజయనగర సామ్రాజ్యంలో స్త్రీలకి ఎంత మర్యాద ఈయాలో తెలుసు. అందుకే మంజరితో ఏనాడూ పల్లెత్తి మాట్లాడలేకపోయాడు. కన్నెత్తి పూర్తిగా చూడలేకపోయాడు. ఆమె అప్పుడప్పుడు ఆ చంద్రప్పతో కల్సి కనిపిస్తుంటుంది. అతడు సంగీతకారుడే కాదు రాజుగారి వేగు అని అనుమానం. వారిద్దరూ అనురాగబద్ధులైతే…
అతని మనసు చిగురుటాకులా కంపించింది.
‘‘ఎవరు నాయనా నీవు? ఏమిటీ ధ్యానం?’’
ఎవరో కాషాయాంబరధారి అపరశివునిలా ఎదుట నిలిచి ప్రశ్నిస్తున్నాడు.
‘‘నేనెవర్ని స్వామి? నా మనసులో ఈ అశాంతి ఏమిటి?’’ శాస్త్రి ప్రశ్నించాడు.
స్వాములవారు శ్రద్ధగా అతన్ని చూశారు. దగ్గరకు రమ్మని పిలిచి తనతో మఠానికి తీసుకువెళ్ళారు. శాస్త్రి నమస్కరించి స్వాముల వారి ఎదుట కూర్చున్నాడు.
స్వాములవారి సైగతో శిష్యులొక రుద్రాక్షమాలనూ, శాలువాను స్వాములవారికి అందించారు. స్వాములవారు స్వయంగా శాలువాను శాస్త్రికి కప్పి, మెడలో రుద్రాక్షమాల వేశారు. తలపైన అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
‘‘నాయనా! నీది సన్యసించే జాతకం కాదు. అందుకే కాషాయ వస్త్రాలందించలేదు. కానీ నీకు ఎటువంటి భవబంధాలు వద్దు. నీకు మరుజన్మ లేదు. అంటే పూర్వజన్మ పరిహారం చేసుకో. నువ్వు కావాలనుకుంటున్న వ్యక్తి నిన్ను కోరుకోదు. నీమీద గౌరవం మాత్రమే ఉంది.’’
‘‘నామీద ఎవ్వరికీ ప్రేమ ఉండదా’’ రామేశ్వరిశాస్త్రి గొంతులో బాధ ధ్వనించింది.
‘‘నిస్సంగుల్ని లోకం గౌరవిస్తుంది. పూజిస్తుంది. కానీ ప్రేమించదు. నీ విషయంలో కూడా అదే జరుగుతుంది. నిన్ను గౌరవించినవాళ్ళు ప్రేమించాలని కోరుకుంటే మిగిలేది దుఃఖమే గదా’’ స్వాములవారు అంతరార్థం చెప్పారు.
రామేశ్వరశాస్త్రి మనసు తేలికపడిరది. అతని దుఃఖం దూరమైంది. మనస్సులో చిత్రించుకున్న మంజరి బొమ్మను మనస్సే చెరిపేసుకుంది. ఇప్పుడు అపరిమితమైన ఆనందమంటే ఏమిటో తెలుస్తున్నది.
‘‘స్వామీ! నా జీవిత పరమార్థం ఏమిటి? ఇలా గమ్యంలేని ప్రయాణం ఎటు వెళ్తుంది?’’ అడిగాడు.
స్వాములవారు అతని శిరస్సున హస్తముంచారు. రెండు నిమిషాలు
కళ్ళు మూసుకుని తీవ్రంగా ధ్యానం చేశారు.
‘‘నీకు విముక్తి మార్గం లభిస్తుంది నాయన! అశాశ్వతమైన బంధాల నుంచి శాశ్వతమైనదానిని సాధించు. నీలోని శక్తిని మేల్కొలుపు. నీవు చేసిన సృష్టి శాశ్వతంగా ఉంటుంది. ముందుతరాలవారు నిన్ను చిరయశస్విగా గుర్తిస్తారు. నీకు ఆత్మసంతృప్త్తి కూడా అందులోనే కలుగుతుంది. నువ్వు చిన్నతనంలో దీక్ష పొందిన మంత్రం గుర్తుందా కుమారా!’’ ప్రశ్నించారు స్వాములవారు.
రామేశ్వరశాస్త్రికి వెంటనే స్ఫురించలేదు. రెండు క్షణాలు ఆలోచించాక ఓ మెరుపు మెరిసింది. చిన్నతనంలో తండ్రి వెంట ఓ యోగిని దర్శించినపుడు ‘‘రూపధ్యాన గానావళీ’’మంత్రాన్ని ఉపదేశం పొందాడు. కానీ దానిని ఇంతదాకా ఉపాసన చేయలేదు.
‘‘అవును స్వామి. ఓ మంత్రం నాతో ఉంది’’ వినయంగా చెప్పాడు.
‘‘ఆ రూపధ్యాన గానావళీ మంత్రాన్ని సాధన చేయి. అది నిన్ను కటాక్షిస్తుంది. నువ్వు శిల్పగాయకుడివి. నువ్వు చెక్కిన దేవతామూర్తుల్ని చూస్తుంటే ఆ మూర్తులే మైమరిచిపోయేంతగా గానం విన్పిస్తుంది. నువ్వు ఆలపించే గానంతో దేవతామూర్తుల దివ్యరూపం కనిపిస్తుంది. ఇలా శిల్పంలో గానాన్ని, గానంలో శిల్పాన్ని సృష్టించు నాయనా!’’ స్వాములవారు ఆదేశించారు.
‘‘నేను విశ్వకర్మని కాను సాధారణ మానవుణ్ణి. స్వామీ! నాకిది సాధ్యమవుతుందా?’’
‘‘నీ శక్తి తెలీక అలా మాట్లాడుతున్నావు. నువ్వు మామూలు మనిషివి కావు.’’
‘‘అయితే నేను ఎవరిని స్వామీ?’’
‘‘తత్త్వమసి’’ అన్నారు స్వాములవారు నీలిగగనంలోకి చూస్తూ చేతులు జోడిస్తూ.
ఇపుడు రామేశ్వరశాస్త్రి మనసులో ఎటువంటి అనుమానాలు, భయాలు లేవు. అతని హృదయంలో వేయిరాగాలు వీణ మీటుతున్నాయి. కళ్ళముందు అనేక శిల్పకళామూర్తులు, కళారూపాలు ప్రత్యక్షమౌతున్నాయి.
అప్పటిదాకా ఈ సంఘటనకు ప్రత్యక్షసాక్షిగా ఉన్న ప్రధాన శిల్పాచార్యుడు ముందుకు వచ్చి స్వాములవారికి నమస్కరించాడు. రామేశ్వరశాస్త్రి చేయి పట్టుకున్నాడు.
‘‘పద నాయనా! విజయవిఠల దేవాలయ సప్తస్వర మండప వైభవం కోసమే నువ్వు పుట్టావు. ఎంత ప్రయత్నిస్తున్నా ఆ శిల్ప స్వర స్థానాలు పూర్తి స్థాయిలో కుదరటంలేదు. నాతో రా! నీ వల్ల నా జన్మ కూడా తరిస్తుంది’’ ప్రేమగా అన్నాడు ప్రధాన శిల్పాచార్యుడు.
‘‘సెలవు స్వామీ’’ రామేశ్వరశాస్త్రి సంతోషంగా స్వాములవారికి నమస్కరించి సెలవు తీసుకున్నాడు.
ప్రధాన శిల్పాచార్యులతో బాటు వెళ్తున్న రామేశ్వరశాస్త్రిని చూసి స్వాములవారి గుబురుమీసాల మాటున తెల్లని చిరునవ్వు తొణికిసలాడిరది. విఠల మండపం తుదిరూపురేఖలు పూర్తవుతాయనే విశ్వాసం కలిగింది. పైనుండి దేవతలు కూడా ‘తధాస్తు’ అని ఉంటారు. అందుకే రాయల విజయయాత్ర విహారం తర్వాత విజయనగరంలో శిల్పకళాశక్తి ఆత్మశక్తితో రూపుదిద్దుకున్నది.
విజయ నగరమునన్‌ విఠ్ఠలాలయమున
బ్రథిత శిల్పము జక్కపరుప జేసె
మాన్య హజారు రామస్వామి కోవెలన్‌
దగు చెక్కడమ్ముల తావు జేసె
దివ్య పంపావతీ దేవాలయమునకు
స్థాపించె శిల్పాల గోపురమ్ము
ధీరోగ్ర నరసింహదేవు విగ్రహమును
బ్రౌఢ శిల్పంబు తావలయుజేసె
మంజులారామముల సభామంటపముల
హర్మ్యారాజీ విరాజి రత్నాపణముల
జాల దీర్పించి శిల్పకళాలయముగ
రాయలలరించె దన దివ్యరాజధాని
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
‘‘శ్రీవేంకటేశ్వర పాదపద్మావేశిత సదయహృదయ! తిరుమల దేవీవల్లభా! రాజకంఠీరవా! ఈశ్వర నరసింహ భూఫురంధర! చిన్నమదేవీ జీవిత నాయకా! కవితా సామ్రాజ్య ఫణీశ! శ్రీకృష్ణదేవరాయ బహుపరాక్‌! బహుపరాక్‌!’’ వందిమాగధుల కైవారాలు మిన్నుముట్టాయి.
శ్రీకృష్ణదేవరాయలు, అప్పాజీ వచ్చారు. సభలోని కవిగాయక సేనానులు, పండితులు అందరూలేచి అభివాదం చేశారు. రాయలు అప్పాజీకి, అందరికీ అభివాదం జేసి సింహాసనం అధిష్టించాడు. రాయల దేవేరులు కూడా
ఉచితాసనాన్ని అలంకరించారు.
పెద్దనామాత్యుడు రాయల కీర్తిని నుతిస్తూ…
‘‘ఉదయాచలేంద్రంబు మొదల నెవ్వని కుమా
రతకు గ్రౌంచాచల రాజమయ్యె
నావాడ పతి శకంధర సింధురాధ్యక్షు
లరికాపుల నెవ్వాని ఖరత రాసి
కాపంచగౌడ ధాత్రీ పధంబెటవ్వాని
కసివాడగ నేగునట్టి బయలు
సకల యాచక జనాపూర్తి కెవ్వాని
ఘన భుజాదండంబు కల్పశాఖి
ప్రబల రాజాధిరాజ వీర ప్రతాప
రాజ పరమేశ బిరుద విభ్రాజి యెవ్వ
డట్టి శ్రీకృష్ణదేవరాయాగ్రగణ్యు’’
అని ఆశీర్వదించాడు. రాయలు చిరునవ్వుతో నమస్కరించాడు. నందితిమ్మనగారు రాయలను వినుతిస్తూ…
‘‘ఉదయావేగత్యుయద్ధతి సాధించె
వినుకొండ మాటమాత్రాన హరించె
గూటము ల్సెదరంగ కొండవీడగవించె
బెల్లమకొండ యచ్చల్లజెరిచె
దేవరకొండ యుద్వృత్తి భంగముసేసె
జల్లిపల్లె సమగ్రశక్తిడులిచె
గినుకవిూర ననంతిగిరి క్రిందపడజేసె
గంబంబు మెట్టు గ్రక్కున గదల్చె
బలనికాయము కాలిమట్టులక నెక్కునయడచు
గటకమును నింక ననుచు నుత్కలమహీశు
డనుదినమ్మున వెరచు నెవ్వనికి నతడు
రాజమాత్రుండె శ్రీకృష్ణరాయవిభుడు’’
రాయలు అంజలిఘటించి కృతజ్ఞతలు తెలిపాడు. సంగీత సాహిత్య కోవిదులున్న ఆ సభలో ఒకే ఒక వ్యక్తి రాయలకేసి కార్పణ్య దృష్టితో చూస్తున్నాడు. వీరేంద్రునికీ వైభోగం ఆనందం కల్గించటం లేదు.
విజయయాత్రలకు కారకులైన సేనానాయకులందరినీ ప్రభువు ఘనంగా సత్కరించాడు. అప్పాజీ సభనుద్దేశించి ప్రసగించారు.
‘‘దక్షిణాన విలసిల్లుతున్న ఈ సువిశాల హైందవ స్రామాజ్యం విద్యారణ్యుల వారి ఆశీఃబలంతో ఏర్పడిరది. మనవారి అనైక్యత, ఈర్ష్యాసూయలు, స్వార్థంవల్ల ఇంకా పరదేశీయులను ఆపలేకున్నాము. రాయలవారి గురించి నా కలలు నెరవేరాయి. ప్రభువు పరాక్రమశౌర్యులు, వినయశీలురు, ఆదర్శనీయులు, యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు, వికలాంగులైనవారికి తగిన పరిహారం, పారితోషికాలు ఇస్తున్నాం. నిద్రాహారాలుమాని విజయనగరం కోసం శ్రమిస్తున్న మన వీరులందరికీ అభినందనలు. విజయనగర కేతనం చిరకాలం వినువీధిలో రెపరెపలాడాలని అభిలషిస్తున్నాం’’ అని ముగించారు.
‘‘నా జీవనదాత, రాజ్యానికి మూలశక్తి, మాకిన్ని విజయాల నందించి మమ్మల్నీ సింహాసనంపైన నిలిపిన మా అప్పాజీవారిని ఎలా గౌరవించినా తక్కువే అవుతుంది. అందుకే వారిని మా గౌరవప్రదమైన అభిమాన కౌగిలిలో బంధింప దలిచాము’’ రాయల గంభీరవచనాలతో అప్పాజీని మనసార కౌగిలించుకున్నారు.
శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీల మధ్య అతులితమైన ఆ ప్రేమానుబంధాన్ని చూసి సభ పులకించింది. కాని ఆ దృశ్యాన్ని చూసి కళ్ళనిప్పులు రాలుస్తున్నది వీరేంద్రుడొక్కడే.
‘ఈ మైత్రి ఇంకెన్నాళ్ళులే’ అనుకున్నాడు. అప్పటికే అతని మనసులో ఒక విషపన్నాగం రూపుదిద్దుకుంది. రాజు అంగరక్షకుడిగా వీరేంద్రుని ముఖకవళికలు చురుగ్గా గమనిస్తున్నాడు చంద్రప్ప.
నాటి సభ కవిపండిత సత్కారంతో ముగిసింది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
తిమ్మరుసు మహామంత్రి ఆస్థాన జ్యోతిష్యులతో సమావేశమయ్యారు.
‘‘ఈ పరిస్థితుల్లో రాయలవారి జన్మకుండలి విశేషాలు సెలవీయండి జ్యోతిష్యవర్యా’’ తిమ్మరుసు గూఢంగా అడిగారు.
‘‘చిత్తం మహామంత్రీ’’ జ్యోతిష్యవేత్త తాళపత్రాలు చూసి రాయల జాతకం గణన చేసి నిట్టూర్చాడు.
‘‘ఏమయింది? రాయలవారి గ్రహస్థానాలు ఎలా ఉన్నాయి?’’ ఆందోళనగా అడిగాడు తిమ్మరుసు. ఆ వృద్ధుని వదనంలో రాయలపైన ప్రేమ పొంగి పొర్లుతోంది. రాజ్యభద్రత గురించిన బాధ్యత ప్రస్ఫుటంగా కన్పిస్తున్నది. జ్యోతిష్యవేత్త మంద్రస్వరంతో చెప్తున్నాడు.
‘‘చక్రవర్తి జన్మకుండలి ప్రకారం శని, సూర్య, మంగళ గ్రహాల కలయికవల్ల హాని జరిగే సూచనలున్నాయి.’’
‘‘దీనికి శాంతి లేదా?’’
మనసులోని ఆందోళన బయటపడనీయని ధీరుడు తిమ్మరుసు మంత్రి.
‘‘ఉంది మంత్రివర్యా! రాయలవారి రాజయోగానికి విఘాతం కలుగుతుంది. కాబట్టి ఆ దోషం తొలిగేదాకా సింహాసనంపై కూర్చోరాదు’’
‘‘సరే. మీరు వెళ్ళొచ్చు’’ జ్యోతిష్యవేత్తను పంపివేసి తిమ్మరుసు ఆలోచనలో పడ్డారు. కాస్సేపట్లోనే ‘‘రాయవారి మందిరానికి పల్లకీ సిద్ధంచేయండి’’ సేవకుల్ని ఆజ్ఞాపించారు.
తిమ్మరుసు అనుకోకుండా తమ మందిరానికి రావటం రాయలకు ఆశ్చర్యం కలిగించింది. అప్పాజీ వివిరించిన విషయాలు సావధానంగా విన్నారు రాయలు. ఇద్దరూ గురుదేవులయిన వ్యాసరాయలవారి కుటీరానికి ప్రయాణమయ్యారు.
వ్యాసరాయలవారి కుటీర ప్రాంగణం మునివాటికలా ప్రశాంతంగా ఉంది. ఎత్తైన వృక్షాలు, పూలచెట్లు, లేళ్లు, నెమళ్ళు, ఆ ఆశ్రమ వాతావరణంలోకి అడుగుపెడితేనే ఎవరికైనా వేదనలు, బాధలు తీరిపోతాయి. ఆవరణంతా
శుభ్రంగా అలికి ముగ్గులు తీర్చి ఉంది.
విజయనగర మహాసామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరుసు మహామంత్రితో వచ్చి వ్యాసరాయల ముంగిట యాచకుడై నిలిచారు.
గురుదేవులైన వ్యాసరాయలు పరమ ఆదరంతో రాయలకు ఎదురేగి లోపలికి తోడితెచ్చాడు. భద్రాసనాలను అలంకరింపజేశారు.
‘‘రాయా! ఏమిటీ ఆకస్మికాగమనం?’’ వ్యాసరాయలి ప్రశ్నకు రాయలు తిమ్మరుసువైపు అర్థవంతంగా చూశారు.
‘‘గురువర్యా! కృష్ణరాయలి జన్మకుండలిరీత్యా యోగభంగం వుంది’’ తిమ్మరుసులవారు వ్యాసరాయలితో చెప్పారు. వ్యాసరాయలు కలవరంగా చూశారు.
‘‘దీనికి ఎన్ని జపహోమాలు చేయించినా ఉపశాంతి లేదన్నారు’’ తిమ్మరుసు తానే మళ్ళీ చెప్పారు.
‘‘అయితే?’’ వ్యాసరాయలు ఆలోచనగా అన్నాడు.
‘‘అందుకే అర్థులమై వచ్చాము. కృష్ణరాయలకీ యోగభంగం కొద్దిరోజులు మాత్రమే ఉంది. మీరీ దోషకాలం రాయల సింహాసనం అధిష్టిస్తే ఆ దోష నివారణ జరుగుతుంది’’ అభ్యర్థనలోనే అధికారాన్ని మేళవించారు తిమ్మరుసు.
‘‘కానీ…’’ వ్యాసరాయలు సంకోచం వెలిబుచ్చారు.
‘‘కాదనకండి గురుదేవా! మీరు తప్ప దోషహరణం చేయగల సమర్థులు మరొకరు లేరు. నా ప్రార్థన మన్నించి విజయనగర సింహాసనంపై చక్రవర్తిగా కొన్నిదినాలు రాజ్యపాలన చేయండి. మేమంతా మీవెంట దోయిలొగ్గి ఉండగలం’’ కృష్ణరాయలు అంజలి ఘటించారు.
విశాలమైన కనుదోయి. నిలువునామం. రాచఠీవి, జ్ఞానతేజస్సుతో, భుకపరాక్రమంతో వెలుగొందే కృష్ణరాయలు తన ఎదుట అలా కైమోడ్చి ప్రార్థిస్తుంటే వ్యాసరాయల మనసు శిష్యవాత్సల్యంతో కరిగిపోయింది.
‘‘రాయా! నీవు నామీద ఉంచిన నమ్మకానికి నీ గురుభక్తికి నాకెంతో ఆనందంగా ఉంది. నా మఠదైవం గోపాలకృష్ణునికి అంకితంగా నేనీ బాధ్యత స్వీకరిస్తున్నాను’’ అన్నారు వ్యాసరాయలు.
కృష్ణరాయలు, తిమ్మరుసుమంత్రి, వ్యాసరాయలకు ధన్యవాదాలు తెలిపారు.
మరునాడు సభలో ఈ విషయం ప్రకటించబడిరది. మొదలు సామంత దండనాథులకేమీ అర్థం కాలేదు. ఇది ఏ విపరీతానికి దారితీస్తుందోనని వాళ్ళు భయపడ్డారు. తిమ్మరుసు మంత్రి కృష్ణరాయని జన్మకుండలిలోని దోషం గురించి ఇతర వివరాలను సభాసదులకు తెలియజేశారు.సభ ఆమోదం పొందింది.
ఒక శుభదినాన నిండుసభలో మంత్రయుక్తంగా శ్రీకృష్ణదేవరాయలు తమ భుజబల సముపార్జితం, తిమ్మరుసు ధీశక్తితో విలసితం అయిన విజయనగర మహాసామ్రాజ్యాన్ని వ్యాసరాయ గురుదేవులకు అప్పగించారు.
వ్యాసరాయలవారిని భద్రాసనంపై సగౌరవంగా కూర్చుండబెట్టి నవరత్నాలతో అభిషేకించారు. వినమిత శిరస్కుడై రాయలు నమస్కరించారు.
వ్యాసరాయలు శిష్యునికి తనపట్ల గౌరవాభిమానాలకు చాలా సంతోషించాడు. ప్రేమార శిష్యుని కౌగలించుకున్నాడు.
‘‘నాయనా! యీ రాజ్యప్రేమ, నిర్మలహృదయం వల్ల నీ కీర్తి ఆచంద్ర తారార్కం నిలువగలదు’’ అని ఆశీర్వదించాడు.
తనను అభిషేకించిన నవరత్నాలను కులమతభేదం లేకుండా బీదలకు పంచిపెట్టాడు వ్యాసరాయలు.
జన్మకుండలిలోని దోషకాలం పూర్తయ్యేవరకు సింహాసనాన్ని వ్యాసరాయలవారే అధిష్టించారు. అది తొలగిపోగానే మరలా శాస్త్రోక్తంగా రాయలు సింహాసనాన్ని అధిష్టించారు. ఇపుడు రాయలు మబ్బువిడిచిన సూర్యుడిలా మరింత వీరప్రతాపాలతో వెలుగొందుతున్నారు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
రామేశ్వరశాస్త్రి అన్నం తిని మూడుదినాలయింది. నిరంతరం విఠలమందిరంలోనే ఉంటున్నాడు. తాను తీర్చిదిద్దిన సంగీత స్తంభాలను స్పర్శించి ఆ స్వరమాధురుని ఆనందిస్తూ కొసమెరుగులు దిద్దుతున్నాడు.
ఏదో లోకంలో ఉన్నట్లున్నాడు. గడ్డం పెరిగి మాసిన వస్త్రాలతో మారువేషంలో ఉన్న విశ్వకర్మలా ఉన్నాడు శాస్త్రి.
మంజరి రోజూ భోజనం తనే తీసుకువస్తున్నది. కానీ అతను దానికేసి చూడటం కూడా లేదు. ఆమెనా పనికి ఎవరూ నియోగించలేదు. ఆమె కళాసక్తి అలాంటిది.
ఆ రోజుకూడా మంజరి భోజనం తెచ్చింది. కాని ఎప్పటిలా అక్కడ వుంచి వెళ్ళలేదు.
‘‘అయ్యా!’’ పిలిచింది. అతను ఆమెకేసి చూడలేదు. ‘నవమోహిని’ విగ్రహాన్ని తదేకంగా చూస్తూ తుదిమెరుగులు గురించి ఆలోచిస్తున్నాడు.
‘‘అయ్యా! నేను మంజరిని.’’
అతను ఆమెకేసి చూశాడు. అతని కళ్ళలో లిప్తపాటు మెరుపు. మళ్ళీ అంతలోనే ప్రశాంత కాంతి.
‘‘అక్కడ వుంచివెళ్ళు మంజరీ’’
‘‘లేదు స్వామి! మూడురోజులుగా మీరు తినటం లేదు. నేనుండగానే తినండి.’’
‘‘ఫర్వాలేదు. అక్కడ ఉంచి వెళ్ళు’’ అతని చూపులు మాత్రం ఆ శిల్పం మీదే! ఏదో లోకంలోంచి మాట్లాడుతున్నట్లు కన్పిస్తున్నాడు.
‘‘స్వామీ! మీరు ఇంతలా శ్రమపడితే ఆరోగ్యం పాడయిపోతుంది. కొంచెం విశ్రాంతి కూడా అవసరం’’ మంజరి మెల్లగా చెప్పి భోజనపాత్ర అక్కడ
ఉంచింది.
రెండు ఘడియల పాటు తదేకంగా అతను చెక్కే ‘నవమోహిని’ విగ్రహాన్ని చూసింది. ఆ విగ్రహంలో కుదురుకున్న స్త్రీమూర్తిని ఎక్కడో చూసినట్లుంది. ఎక్కడ? ఎక్కడ? తటాలున విద్యుల్లతలాంటి స్ఫురణ! అది అద్దంలో తన ప్రతిబింబమే! అంటే తనలాంటి విగ్రహాన్ని ఈ రామేశ్వరశాస్త్రి చెక్కడం ఎంత ఆశ్చర్యమో అంతే ఆనందం!
ఆ స్త్రీమూర్తిని మరింతగా చూడాలనిపించింది. నాట్యభంగిమలో వయ్యారంగా నిలబడి ఉంది. సర్వాభరణ భూషితురాలై ప్రేమగా చూస్తున్నది. ఆ చూపులో పారవశ్యం, తాదాత్మ్యం మమేకమైనాయి. ఆమె శిరస్సుపై నుండి ఇరుపక్కలకి జాలువారుతున్న పుష్పతోరణం మరింత అందాన్ని ప్రసాదిస్తున్నది. స్త్రీమూర్తి విగ్రహం కొలత దాదాపు మానవ సహజమైన ఎత్తుతో నల్లశిలలో ఉంది. రామేశ్వరశాస్త్రి చేతిలో ‘నల్లనిరాయి వెన్న, మైనంలా’ మారిందా అనిపిస్తుంది. వంపుసొంపులు, ఇంపులు, వస్త్రాలు, నగలు నఖశిఖ పర్యంతం ప్రతి అంశంలో తెలుగుదనం ఉట్టిపడుతూ చూసేవారికి పవిత్రభావాన్ని ప్రసాదిస్తున్నది. శాస్త్రి ఉలివిన్యాసం, హృదయఔన్నత్యం ఆ శిల్పంలో ప్రతిఫలిస్తున్నది.
మంజరి కళ్ళనిండుగా నీళ్ళు. రామేశ్వరశాస్త్రి ఆరాధన తనకి తెలియంది కాదు. తన నాట్యం ఒక శిల్పికి స్ఫూర్తినీయటం తనకీ ఆనందమే! కానీ తనదైన లోకంలో బతికే ఈ యువశిల్పి భవిష్యత్‌ ఏం కానున్నది? విజయనగర సామ్రాజ్య కళాజగత్‌లో ఈతని స్థానం ఏమిటి? దీనిని కాలమే నిర్ణయిస్తుంది. నిట్టూర్చి కర్తవ్య స్ఫురణతో కదిలింది.
రామేశ్వర శాస్త్రి విఠలమండప నిర్మాణంలో సప్తస్వర స్తంభాలను పూర్తి చేయటంలో ప్రధాన పాత్ర వహించాడు. దాని నిర్మాణం పూర్తి అయింది కాబట్టి ప్రధాన శిల్పాచార్యుడు శాస్త్రిని తిరుపతిలో నిర్మిస్తున్న వేయిస్తంభాల మండప నిర్మాణంలోతోడ్పడమని కోరాడు. శాస్త్రి మరునాడే తిరుపతికి ప్రయాణమయ్యాడు. బయలుదేరినప్పుడు శాస్త్రికే తెలియదు తాను మళ్ళీ ఎప్పుడీ కళానగరానికి రాగలడో! ఎప్పుడీ మంజరిని మళ్ళీ చూడగలడో! మంజరికి శాస్త్రి తిరుమల ప్రయాణం గురించిన సమాచారం మర్నాడు అతను వెళ్ళిపోయాక గానీ తెలియలేదు.

You may also like

Leave a Comment