Home ధారావాహిక నవల బంగారు కల

బంగారు కల

by Chillara Bhavanidevi

8
కాషాయాంబరాల స్వామి మౌనంగా ధ్యానంలో ఉన్నాడు. దూరంనించి వేణుగానం విన్పిస్తోంది. స్వామి అలాగే వింటూ కూర్చుండిపోయాడు. ఆ గానంలోని ఆర్తి స్వామి మనస్సును ఆకట్టుకుంటున్నది.
కొంతసేపటికి చంద్రప్ప అక్కడికి వచ్చాడు. అతని చేతిలో వేణువు చూశాడు స్వామి. ఇప్పటిదాకా సంగీత తరంగాలలో నిమగ్నమైన వ్యక్తి ఇతనే అని గ్రహించాడు. చంద్రప్ప స్వామికి నమస్కరించాడు.
‘‘ఎవరు నాయనా నీవు? వికల మనస్కుడిగా వున్నావు?’’
‘‘అవును స్వామీ! దారి తోచక అల్లాడుతున్నాను’’ నిట్టూర్చాడు చంద్రప్ప.
‘‘నీ ఆవేదన అర్థమయింది నాయనా! నీవు వలచిన కన్యకూ నీకూ వివాహయోగం లేదు’’ నిట్టూర్చాడు.
‘‘ఎందుకు లేదు స్వామి? త్వరలోనే మా వివాహం జరుగుతుందనే నమ్మకంతోనే బతుకుతున్నాను.’’
‘‘అనుకుంటున్నావు. కానీ గండముంది. ఓర్మి వహించు. దేశానికి యుద్ధసమయం వచ్చింది’’ అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు స్వామి.
చంద్రప్ప కలవరపడ్డాడు. శాంతియుతమైన వాతావరణం నెలకొన్నది అనే పరిస్థితిలో యుద్ధమేమిటి? బహ్మనీలు మళ్ళీ దండెత్తుతున్నారా ఏమిటి? ఆలోచిస్తూనే మంజరి మందిరంకేసి నడిచాడు.
* * *
నిండు పున్నమి వేళ. సుధాకరుడు అమృత కిరణాలతో ప్రకృతిని తన్మయ మొనర్చుతున్నాడు. చలిగాలి మెత్తని సూదుల్లా తాకుతున్నది. అలసిపోయిన రాయల సైన్యంకూడా ప్రశాంతంగా సేదతీరినిద్రపోతున్నది. అద్భుత కళాసౌధంలో కృష్ణరాయ ప్రభువు ప్రకాశిస్తున్నారు. ఎదుట ఆసీనులైన అప్పాజీకేసి ప్రసన్నంగా చూస్తూ చిరునవ్వులు చిందించారు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన వైఖరి చూస్తే ఆ రోజేదో ప్రత్యేక నిర్ణయాన్ని తీసుకోదల్చినట్లే కన్పిస్తున్నది.
చిన్నతనం నుంచి రాయల మనసెరిగిన మహామాత్యులు రాయలకేసి ప్రేమతో చూస్తూ వింటున్నారు.
రాయలు మేఘగంభీర స్వరంతో ఇలా అన్నారు. ‘‘అప్పాజీ! మీరు గమనిస్తున్నారు గదా! నా ధైర్యసాహసాలు మీ బుద్ధిబలంతోనే ఈ విజయనగర మహాసామ్రాజ్యం ఈ విధంగా కుదురుకుంది. ఈ రెండు కలబోసుకున్న సాహస ప్రజ్ఞావంతుడైన ఆ యువకుడు పదే పదే నా స్మృతిపధంలో మెదులుతున్నాడు. అతని ధైర్యసాహసాల వల్లనే మనం ఉదయగిరి దుర్గంపై విజయం సాధించగలిగాం’’
అప్పాజీకి రాయల మాటలు చెవిలో అమృతము నింపినట్లున్నాయి. ఆ యువకుని పట్ల అప్పాజీకి కూడా అంతటి మెప్పుదల భావం కలిగింది.
‘‘రాయా! మీరన్నది ముమ్మాటికి నిజం. నా మనస్సుకు కూడా తోచని అనేక విషయాలలో అతడు నిష్ణాతుడనటంలో సందేహం లేదు. శత్రువ్యూహాలకు సరిjైున ప్రతివ్యూహాలు పన్నగల దక్షుడతను, అతనికి….’’
‘‘అతనికి గొప్ప బహుమానమివ్వాలి’’ మంత్రిగారి మాట పూర్తికాకముందే రాయలు వాక్యాన్ని పూర్తి చేశారు.
‘‘నా అభిప్రాయమూ అదే! మీరూ అలాగే అనుకుంటున్నారంటే అంతకంటే
ఉత్తమం ఏముంటుంది! ప్రభువిచ్చే బహుమానం గొప్పగా ఉండాలి’’ తిమ్మరుసు సాభిప్రాయంగా అన్నారు.
‘‘గొప్పది అంటే?’’ రెట్టించారు రాయలు.
‘‘మీ మనసులో ఉన్నదే’’ చిరునవ్వుతో అన్నారు తిమ్మరుసు.
‘‘అది గొప్పదవుతుందా! అందరూ ఆలోచించే పద్ధతే కదా!’’
‘‘కాదు ప్రభూ! రాజాధిరాజ రాజపరమేశ శ్రీకృష్ణదేవరాయ ప్రభువుల పుత్రికారత్నం తిరుమలాంబికను బహుమానంగా పొందటమంటే సామాన్యుల కలవిగాని పని.’’
రాయలు మందహాసం చేశాడు. ఆలోచన అంతర్ముఖం అయింది. తిరుమలాంబికనే కాదు, రాజ్యాన్ని యావత్తూ ఆ వీరునికిచ్చినా తక్కువే! ఎంతటి ప్రతాపవంతుడు! ప్రచండులైన వైరివీరులకు భయంకర చండమార్తాండు డయ్యాడు.
అరివీర హరిణ సముదాయానికి అతడు సింహమయ్యాడు. దుర్భేద్యమైన
ఉదయగిరి మాత్రమే కాదు, గోల్కొండ ప్రభువు కందవోలును ముట్టడిరచినపుడు కూడా అతడు తండ్రి అయిన శ్రీరంగ దేవరాయల ఆజ్ఞతో కందవోలుకు వెళ్ళి దానిని శత్రువుల చేతుల్లో పడకుండా కాపాడాడు.
ఆలోచనలోంచి రాయలు తిమ్మరుసుకేసి చూసి ‘‘అతని వంశచరిత్ర ఏమిటి అప్పాజీ’’ అని అడిగారు.
తిమ్మరుసు ఆ యువకుని వంశచరిత్రను ఇలా చెప్పారు.
‘‘రాయా! తురుష్కులు దక్షిణభారతదేశంపైకి దండయాత్రలు విరివిగా చేస్తున్నప్పుడు విశిష్ట హిందూసామ్రాజ్యమైన కాకతీయ సామ్రాజ్యం చిన్నాభిన్నమైన సంగతి మీకు తెలిసినదే! హిందువులను ఏకీకృతం చేయటానికి చేసిన ప్రయత్నమే మన విజయనగర సామ్రాజ్య స్థాపన.
అలాగే ప్రసిద్ధి పొందిన మరో హిందూ రాజ్యం ఉంది. వారి ముఖ్యపట్టణం కళ్యాణి నగరం. దీనిని అనాదిగా చంద్రవంశ రాజులు పాలిస్తున్నారు. వీరు అత్యంత పరాక్రవంతులై పొరుగున ఉన్న హోయసల రాజ్యానికి, కంపిలి రాజ్యానికి పక్కలో బల్లాలుగా ఉన్నారు. వీరి మూల పురుషుడు ‘వీరహమ్మాళిరాయుడు’. ఇతనికి ‘బొమ్మరాజు’ అనే మరొక పేరున్నది. ఇతని మనుమడు రాఘవరాజు కంపిలిరాయ సైన్యాన్ని గెల్చి ‘గండరగూళి’ బిరుదు పొందాడు. మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ సామంతరాజ్యమైన మాళవ రాజ్యాన్ని ఓడిరచి ‘మాళవ రాజేంద్రమస్తకశూల’ బిరుదుపొంది చాళుక్యరాజ్య స్థాపనకు ప్రయత్నించాడు. తుంగభద్రకు ఉత్తరానగల రాజ్యాన్నంతా జయించి సప్తదుర్గాధిపతి అయ్యాడు. రాఘవరాజు మరణించాక పిన్నభూపాలుడు ఆరవీడు రాజధానిగా దేవరాయ మహారాయలకు సామంతుడయ్యాడు. ఇతని కుమారుడు బుక్కభూపాల చంద్రుడు. చంద్రగిరి ప్రభువైన సాళువ నరసింహరాయలకు పరమమిత్రుడు. అత్యంత పరాక్రమవంతుడైన ఆరవీటి బుక్కరాజు కుమారుడు రామరాజు. ఇతని కడపటి కుమారుడు శ్రీరంగరాజు. మొదటి కుమారుడైన తిమ్మరాజు నలభై సంవత్సరాలు విజయనగర రాజులపక్షాన యుద్ధంలో పాల్గొన్న గొప్ప రాజభక్తుడు.
‘‘అతని గురించి మేమొక ఉదంతం విన్నాము’’ ఆసక్తిగా చెప్పారు రాయలు.
‘‘అవును రాయా! ఒకప్పుడు తిరుపతి వేంకటేశ్వరస్వామి ఒక అంధగోపకుని కరుణించి ఒక కన్ను మాత్రమే ఇచ్చి తిమ్మరాజు కలలో కన్పించి మిగిలిన రెండవకన్ను ఈయమని ఆజ్ఞాపించాడట! అప్పుడు తిమ్మరాజు ఆ గోపబాలునికి రెండవ కంటిచూపు ఇచ్చాడట. మరోసారి సైన్యంతో మండు వేసవికాలంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సైన్యానికి చాలా దాహం వేసిందట. తిమ్మరాజు ఎంతో భక్తిగా విష్ణువును ప్రార్ధించాడట. ఆశ్చర్యంగా వాళ్ళున్న ఆ ఎత్తైన కొండమీద నీటిబుగ్గ పుట్టిందట. అంతా దాహం తీర్చుకోగానే అది మాయమైందట. ఇంతటి వీరుడు, భక్తుడైన తిమ్మరాజు మహమ్మదీయులతో పోరాడి జయము పొందాడు. కళింగాధీశుడైన ఒడ్డెరాయని జయించాడు. శ్రీవారి పట్టాభిషేకోత్సవంలో పాల్గొన్నాడు. శ్రీవారి జైత్రయాత్రలన్నింటిలో పాల్గొన్న ముఖ్యడు’’ అప్పాజీ వివరించారు.
‘‘చాలా బాగున్నది అప్పాజీ! అయితే ఈ వీర యువకుడు ఎవరి సంతానం?’’ రాయలు ప్రశ్నించాడు.
‘‘ఆరవీటి బుక్కరాయవంశం వారు మొదటినుంచి విజయనగర రాజుకండగా ఉన్నారు. నంద్యాల, కందవోలు, ఆదవని, అవుకు, గుత్తి, గండికోట మొదలైన ప్రాంతాలీవంశం వారివే! తిమ్మరాయుని చివరి తమ్ముడు శ్రీరంగదేవరాయలు మీకు బహుప్రీతిపాత్రుడని ఎరుగుదును. ఈయనకు కోనరాజు, తిమ్మరాజు, రామరాజు, తిరుమలరాజు, వెంకటపతిరాజు అను ఐదుగురు కుమారులున్నారు. వీరిలో మూడవ కుమారుడైన రామరాజే మీ వాత్సల్యానికి పాత్రుడైన అదృష్టవంతుడు. అతనే రామరాయలు’’ తిమ్మరుసు ముగించాడు.
రాయల వదనం సంతోష తరంగితంగా ఉంది. తన కుమార్తెకు నచ్చిన వరుని అన్వేషించే తండ్రికి సరిjైున గమ్యం దొరికినట్లయింది.
రాయల చిరునవ్వులో తిమ్మరుసుకు కృతనిశ్చయం కనిపించింది. ఆయన సంతుష్టుడై ఆనాటికి సెలవు తీసుకున్నారు.
* * *
అన్నపూర్ణాదేవి జగన్నాథస్వామికి పూజ ముగించి హారతిని వీరేంద్రుని కందించింది.
‘‘పూజలకేమిగాని అసలు విషయం ఆలోచించావా?’’ నిష్టూరం అతని గొంతునిండా వినిపిస్తున్నది.
‘‘ఏమిటది వీరేంద్రా?’’ చిరునవ్వుతో అడిగిందామె.
‘‘జగన్నాథ! నీ కుమారుని గురించి’’
‘‘కుమారుని గురించి ఏముంటుంది? వాడిరకా పసివాడు. విద్యలు నేరుస్తున్నాడు’’ తల్లిప్రేమ తొణికిసలాడుతూ అంది.
‘‘నా బాధ అదేనమ్మా! నువ్విలా పూజలు వ్రతాలు చేసుకుంటూ కూచుంటావు. ఆ తిమ్మరుసు ఏం కుట్రలు పన్నుతాడో అని నా భయం.’’
‘‘అప్పాజీవారలాంటివారు కాదు వీరేంద్రా! వారి కృషివల్లనే ఈ విజయనగర సామ్రాజ్యలక్ష్మి ఇంతగా కళకళలాడుతోంది’’ నమ్మకంగా అంది.
‘‘సైన్యాధికారులు, సైన్యం, రాజ్యంలోని ఈగ, దోమ కూడా తిమ్మరుసు మాట జవదాటదు. జగన్నాధ! దీపం ఉండగానే ఉల్లు చక్కబెట్టుకోమనే నేను చెప్పేది’’ వీరేంద్రుడు వల విసిరాడు.
‘‘మీ మాటలు నాకు రుచించటం లేదు. ఈ సువిశాల విజయనగర సామ్రాజ్యంలో మంచిచెడ్డలు నాకన్నా నీకన్నా అప్పాజీవారికి బాగా తెలుసు. నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు’’ తీవ్రంగా హెచ్చరించిందామె. వల జారిపోయింది.
వీరేంద్రుడు దెబ్బతిన్న పులిలా చూశాడు. అతని మొహం కోపంతో జేవురించింది.
‘‘జగన్నాథ! నువ్వింత అమాయకురాలివి కాబట్టే రాజుగారు ఆడిరది ఆట, పాడిరది పాట అయింది. ఆ దేవదాసీని గజపతుల ఇంటి ఆడపడుచుతో సమానంగా కూచోపెట్టాడు. రేపు నీ కుమారుని పట్టాభిషేకం ఏం జరుగుతుందో! దానిని కళ్ళార చూడాలనే నా తాపత్రయం. నీ పుట్టింటి బంధువును కదా! శ్రేయస్సు కోరి చెప్పాను. నీ ఇష్టం తల్లీ’’ వీరేంద్రుడు విసవిసా వెళ్ళిపోయాడు.
చాటునుంచి అంతా వింటున్న మంజరి వ్యధ చెందింది.
వీరేంద్రుడు వెళ్ళిపోయాక అన్నపూర్ణాదేవి సుదీర్ఘమైన ఆలోచనలో పడటం మంజరి గ్రహించింది. ఆ సమయంలో తాను తెచ్చిన విషాద వార్తను వినిపించటం ఎలా?
చీకటిపడినా ఎవరూ దీపాలు వెలిగించలేదు. అన్నపూర్ణాదేవి చుట్టూ చూసింది. కటిక చీకటి. దూరాన హజరారామ దేవాలయంలోంచి చిరువెలుగు కన్పిస్తున్నది. ధ్వజస్తంభం గంటల చప్పుడు మనస్సుకు ప్రశాంతతను ప్రసాదిస్తోంది.
‘‘ఎవరక్కడ’’ అన్నపూర్ణాదేవి పిలిచింది. ఎవరూ పలకలేదు. మరోసారి పిలిచింది. పరిచారిక వచ్చింది చిన్నదీపంతో.
‘‘దీపాలు వెలిగించలేదు. ఇదేమిటీ దివ్వె?’’ తీవ్రంగా అడిగింది అన్నపూర్ణాదేవి.
‘‘దేవీ! ఒక సంతాపవార్త. చిన్నాదేవిగారు అస్తమించారు. రాజమందిరా లన్నింటిలో దీపాల ఉజ్వలత తగ్గించమని తిమ్మరుసుగారు సెలవిచ్చారు’’ మెల్లగా చెప్పి దీపం ఉంచి పరిచారిక వెళ్ళిపోయింది.
ఈ వార్తకు అన్నపూర్ణాదేవి మ్రాన్పడిపోయింది.
చిన్నాదేవి ఎంతటి కళాసౌందర్యగని! ఆమెను అంతా దేవదాసి అంటారు. ఆమె ఎవరికి ఎక్కడ పుట్టిందో తెలీదు. ఆమె నాట్యం, సంస్కారం, రాజసం వెలయాలనిపించవు. పెంచిన తల్లి నేర్పిన విద్యగాక జన్మతః అబ్బిన సంస్కారాలు ఆమెకు వన్నెతెచ్చాయి. స్త్రీలయిన తామే ఆమెపట్ల ఆకర్షితులయితే కళాపిపాసి అయిన ప్రభువు ఆమెను వలచుటలో వింతలేదు. తామందరికన్నా ముందు రాయల మనసు దోచిన అదృష్టవంతురాలు. కొన్నిదినాలుగా అస్వస్థురాలుగా ఉన్నదామె. తాను ఒకసారి చూడబోతే!
‘‘సోదరీ! నాకిక సెలవు’’ అని కన్నీరు నింపుకుంది.
తన మనస్సెంత కలవరపడిరది! ఆమెనెంతో ఓదార్చింది. రాజవైద్యులను ఆమె అనారోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నది. ఈనాటికీ విషాదాన్ని ప్రభువు ఓర్వగలడా! ‘చిన్నాజీ’ అని ఆప్యాయంగా ఆమెని ఒడిచేర్చే ప్రభువు దుఃఖాన్ని తామెందరు రాణులున్నా తీర్చలేరు. శ్రీకృష్ణదేవరాయల వారి జీవితంలో చిన్నాదేవి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆలోచిస్తుండగానే పరిచారిక వచ్చింది.
‘‘అమ్మా! మేనా సిద్ధం!’’
అన్నపూర్ణాదేవి మేలిముసుగు సవరించుకుని జగన్నాధునికోసారి నమస్కరించి మేనా ఎక్కింది. స్వంత సోదరి మరణవార్త విన్నంతగా ఆమె మనస్సు తల్లడిల్లిపోతున్నది. చిన్నాదేవి మందిరం ముందు మేనా ఆగింది. మూర్తీభవించిన విషాద దేవాలయంలా ఉన్న ఆ మందిరంలోకి అన్నపూర్ణాదేవి దుఃఖితjైు అడుగుపెట్టింది.
విచలితుడైన ప్రభువుని చూసి మరింతగా కన్నీరు పెట్టిందామె. శ్రీవారిని పలకరించే సాహసం ఎవరికీ లేదు. శ్రీకృష్ణదేవరాయ ప్రభువు అనుంగు దేవేరి చిన్నాదేవిని సాగనంపటానికి అంతిమ ఏర్పాట్లు అప్పటికే మొదలైనాయి.
* * *
చిన్నాదేవి మరణించిన దుఃఖం నుంచి రాయలు ఇంకా కోలుకోలేదు. వీరేంద్రునికిది మహదవకాశం. రాజ్యాధికారానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ తిమ్మరుసుకు అతడు అవరోధాలు కల్పిస్తున్నాడు. రామలింగేశ్వర నాయకుడు, గండపనాయకుడు మొదలైనసేనానాయకులతో వారి ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా మంతనాలు చేయాలని ప్రయత్నిస్తున్నాడు వీరేంద్రుడు.
తిమ్మరుసు మంత్రి తీవ్ర దుఃఖాంధకారంలో మునిగిపోయిన రాజును చైతన్యవంతుడ్ని చేయటానికి చాలా ప్రయత్నిస్తున్నారు.
శని వీరేంద్రుని రూపంలో విజయనగరంలో తిరుగుతున్నది. అతడు అనుక్షణం రాజ్యాన్ని ఏవిధంగా అల్లకల్లోలం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. కానీ అడుగడుగునా మహామంత్రే అతనికి అడ్డంకిగా మారాడు. అంతకుమించి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉండే సైన్యాధిపతులు, సహోద్యోగులు కూడా కంటకప్రాయంగా ఉన్నారు. వీరేంద్రుడేది మాట్లాడినా రాజ్యక్షేమం గురించే అన్నట్లు ప్రవర్తించేవాడు. అన్నిటా తానే ఉండేవాడు. అయినా అతనిమీద ఎవరికీ సదభిప్రాయం కలుగలేదు. తిమ్మరుసుకు మాత్రం వీరేంద్రుడేదో దురాలోచనలో ఉన్నాడని అర్థమవుతున్నది.
* * *
మంజరి చంద్రప్పలు సుదీర్ఘాలోచనలో విచారంగా ఉన్నారు.
‘‘నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. వీరేంద్రుడు కాలసర్పం. నేను రాయలవారి అంగరక్షకుడిగా ఉన్నాను కదా! నిరంతరం ప్రభువుచెంత ఉండడం వల్ల వాడు ప్రభువులవార్కి తిమ్మరుసు మహామంత్రి గురించి విషం ఎక్కించే ప్రయత్నం చేయటం చూస్తున్నాను. ప్రభువు వీరేంద్రుని మాటలు నమ్మినట్లు కనపడరు. కానీ చెప్పగా చెప్పగా ఎవరికైనా చెడుతలపులు వస్తాయని నా భయం’’ చంద్రప్ప మంజరికి చెప్పాడు.
‘‘రాయలవార్కి తిమ్మరుసులవారు తండ్రితో సమానం. అంతకంటే ఎక్కువే! అయినా ఆలోచించాల్సిందే! ఈ వీరేంద్రుడు అన్నపూర్ణాదేవిగారు పద్మమహల్‌లో విడిది చేసినపుడు కూడా వదిలిపెట్టలేదు. రాజబంధువుగా హంపీలో అతడు సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తున్నాడు. అందులోనూ అన్నపూర్ణాదేవి బంధువు కాబట్టి ఆమె ఎక్కడ ఉన్నా స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నాడు’’ మంజరి వీరేంద్రుని కుబుద్ధిని అసహ్యించుకుంది.
‘‘పద్మమహల్‌ అంటేనే ప్రశాంత సరోవరం వంటిది. రాణివాసం స్త్రీలు చల్లదనానికి ఆ సుందర ప్రదేశంలో విడిది చేస్తారు. వీరేంద్రుని పాదస్పర్శతో అక్కడ తాపమే పెరుగుతుంది’’ చంద్రప్ప కోపంగా అన్నాడు.
‘‘అంతే జరిగింది. ఆనాడు కూడా వీరేంద్రుడు అన్నపూర్ణాదేవితో ‘రాయలు తిమ్మరుసుకు బానిస’ అన్నాడు వ్యంగ్యంగా’’ మంజరి చెప్పింది.
‘‘ఆ! అంతమాట మన దేవేరిగారు సహించారా’’ చంద్రప్ప సందేహం.
‘‘ఆమె అసహనాన్ని ఇతడు గణించడు.’’
‘‘రాయలవారిని కళ్ళుపీకించి చంపమని రాజాజ్ఞ అయినా తిమ్మరుసువారు ఒక ఆడమేక కళ్ళు రాజుగారికి చూపించి రాయలవారిని రక్షించి తమ ఇంట రహస్యంగా దాచి, విద్యలు నేర్పి ఉపాయంతో ఈ విజయనగరాధీశుని చేశారు. తన శక్తియుక్తులన్నీ వెచ్చించి ఈ విశాల సామ్రాజ్యాన్ని సువర్ణమయం చేశారు. మనం ఇంత ఐశ్వరాలతో తులతూగుతున్నామంటే అప్పాజీవారి దయకదా’’ చంద్రప్ప వేదన చెందాడు.
‘‘అవును. రాయలవారికీ సంగతి తెలుసుగానీ నిన్నమొన్న వచ్చిన అన్నపూర్ణాదేవికేం తెలుసు’’ మంజరి విచారించింది.
‘‘ఎందుకు తెలియదు? ఆమె పతిననుసరించి నడుచుకునే సాధ్వి’’ నమ్మకంగా అన్నాడు చంద్రప్ప.
‘‘నిజమే! ఈ వీరేంద్రుడు ఎంతటివారినైనా పడగొట్టగలడు. ఇప్పటికే అంతఃపురంలో వాడంటే అందరికీ భయమే! అన్నపూర్ణాదేవిగారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు’’ మంజరి గొంతులో బాధ ధ్వనించింది.
‘‘రాయలవారి మనసును కూడా విరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. తిమ్మరుసుల వారు ఏదో ఒకటి చేసి వాడినీ రాజ్యంనుంచి వెళ్ళగొడితే బావుండు’’ చంద్రప్ప ఆశ.
‘‘రేపటి సాయంత్రం తులామానం జరుగుతుంది. ప్రభువులవారు విజయయాత్ర ముగించిన ఉత్సవంలో భాగంగా ఈ తులామానం జరగటం నీకూ తెల్సు. ప్రభువు వదాన్యులై అందరికీ తులలేని రత్నమాణిక్యాలు తమ ఎత్తు తూచి పంచుతారట’’ మంజరి సంతోషంగా అంది.
‘‘అదే ప్రభువు గొప్పతనం. దీనికి తిమ్మరుసులవారి ఆశీస్సులు మెండుగా
ఉన్నాయి. వీరేంద్రుడేమిటి ఇటువంటివారెందరైనా తిమ్మరుసులవారి బుద్ధిబలానికి తలొంచవలసిందే’’ చంద్రప్ప సవాలుగా అన్నాడు.
‘‘పద! వీరేంద్రుడు ఇటుకేసే వస్తున్నాడు. వాడి ఆలోచన దురాలోచన కాకుండుగాక’’
ఇద్దరూ పూలపొదల మాటునుంచి వడివడిగా నిష్క్రమించారు.
* * *
రాయలవారి తులామానం జరుగుతోంది. ఒకవైపు రాయలవారు త్రాసులో ఆసీనులైనారు. రెండు ఏనుగుల నిలువుల ఎత్తున్న ఆ తులాదండం రెండోవైపు త్రాసులో నవరత్నాలు రాశులుగా పోశారు. రాయలవారి చిరునవ్వు చంద్రికల సాక్షిగా ఆ రత్నాలు, ముత్యాలు, పగడాలు, విలువైన మాణిక్యాలు బ్రాహ్మణులకు, బారులు తీరిన పౌరులకు దేవేరుల చేతులమీదుగా పంచిపెడుతున్నారు.
వందిమాగధులు రాయలవారి వితరణను వేనోళ్ళ కొనియాడారు. కవి సత్తములలో ఒకరీవిధంగా రాయల తులామానాన్ని శ్లాఘించారు.
ప్రథిత విద్యానగర ప్రాజసామ్రాజ్య
శౌర్యలక్ష్మికి జిత్తశాంతి గాగ
సకలార్త పోషణోత్పుక విరూపాక్షుని
ధన్యకీర్తికి దోహదంబుగా
మజ్జనమాత్ర సమస్తాఘ భంజక
భద్రాంబు చయము సాఫల్యమంద
గజపతీంద్రోగ్ర సంగర జయోపార్జిత
ధనమహాలక్ష్మి సార్ధక్యమంద
ఘటిత విత్తము రాజ్యోపకారి తనువు
సమత దాల్పగ శ్రీకృష్ణ జనవరుండు
తగదులామానమున నంచితమ్ము సేసి
జనుల కిప్పించె సతుల హస్తముల చేత
మహారాజు తెల్లని వస్త్రాలు ధరించారు. ఈ వస్త్రాలపై బంగారు గులాబీల అల్లిక ఉంది. విశేషంగా నగలు అలంకరించుకున్నారు. రాజలాంఛనాలతో నిలిచిన ఆయన ఇరుపక్కలా దేవేరులున్నారు. అప్పాజీ, రామలింగనాయకుడు
ఉచితాసనాలపై ఉన్నారు. కొంచెం వెనుకగా ఇద్దరు సేవకులు బంగారురేకు తాపడం చేసిన చామరలతో వీస్తున్నారు. ప్రత్యేక సింహాసనం మీద ఆసీనుడైన శ్రీకృష్ణదేవరాయలు తులామాన ఉత్సవాన్ని సంతృప్తిగా చూస్తున్నారు. తులాదండంపై రాజు ఇద్దరు దేవేరుల శిలారూపాలు భవిష్యత్‌ తరాలవారికి రాయల వదాన్యత తెలిపే సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.
రాజ ప్రముఖుడు కృష్ణదేవరాయలకు అభివందనం చేశాడు.
‘‘గోవా గవర్నరు ఏమన్నారు’’ మంత్రి ప్రశ్నించాడు.
‘‘ఒక గొప్ప మేస్త్రీని పంపారు అమాత్యా! కానీ ఆ రెండు కొండల మధ్య సరస్సు కోసం గోడను నిర్మించటానికి సున్నం సిద్ధంచేయమని చెప్పాడు’’ రాజప్రముఖుడు చెప్పాడు.
తిమ్మరుసు మంత్రి నవ్వారు.
‘‘సున్నమా! అది మనం ఎరుగనిది. సరే! మనమే పెద్దపెద్ద శిలలు తెప్పించి లోయలో గోడను నిర్మింపచేస్తాం. రెండు కొండల మధ్య ఆ సరస్సు వల్ల ప్రజలకి భూసాగుకు వీలవుతుంది. ఆ గోడ నిర్మాణానికి ఏర్పాట్లు చూడండి’’ రాయలు తిమ్మరుసుకు కనుసైగ చేశారు.
ఆ రాజప్రముఖుడు అంగీకారసూచనగా రాజుకు అభివాదం చేసి వెళ్ళిపోయాడు.
‘‘అప్పాజీ! మన రైతులు గోధుమ, వరి, జొన్నగాక ఇంకేం పండిస్తున్నారు?’’ రాయలు ఆరా తీశారు.
‘‘రాయా! నిరంతరం తాంబూల సేవనభోగం కోరే విజయనగర ప్రజలు తమలపాకు పంటవేస్తారు’’ తిమ్మరుసు సమాధానానికి రాయలు చిరునవ్వుతో తల పంకించారు.

You may also like

Leave a Comment