Home ఇంట‌ర్వ్యూలు బహుముఖ ప్రజ్ఞావంతులైన అవధాని మలుగు అంజయ్యగారితో ముఖాముఖీ

బహుముఖ ప్రజ్ఞావంతులైన అవధాని మలుగు అంజయ్యగారితో ముఖాముఖీ

            అవధానం అంత సామాన్య విషయం ఏమీ కాదు! దానికి ఏకాగ్రత ఉండాలి! ఆశువుగా పద్యం చెప్పే నేర్పు అదీ కూడా ఛందస్సులో కూర్చి తక్కువ సమయంలో పూరణల చేయడం మొదలైన ఎన్నో నేర్పులు ఉండాలి !
అంతేకాదు అవధానం చేసేటప్పుడు ఏకాగ్రత భగ్నం చేయడానికి ఇతర అవరోధాలే  కాకుండా అప్రస్తుత ప్రసంగ పృచ్ఛకులు…
       అవధాని గారూ! అంటూ ఏదో ఒక కొంటె ప్రశ్న వేయడం… సభలోని వారంతా నవ్వుతూ ఏకాగ్రతను చెదరగొడుతుంది.  అయినా అలా వేసిన ప్రశ్నకు ఏమాత్రం తడుము కోకుండా చక్కటి హాస్యపూరిత సమాధానమిచ్చి అందరినీ నవ్విస్తారు అవధాని.
    ఇలా ఎన్నో సభలలో ఆకట్టుకున్నారు మన నేటి అవధాన మలుగు అంజయ్య గారు. ఇదొక పెద్ద కసరత్తే!
          అయితే జన్మతః కవితాత్మకత ఉండటం, గ్రంథాలను నిరంతరం అధ్యయనం చేయడం, ముఖ్యంగా పురాణ వాజ్ఞ్మయంతో  పరిచయం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు!
       తన ఇంట్లో చదువు వాతావరణం లేకపోయినా, పాండిత్యం- కవిత్వం  అనువంశికంగా సంక్రమించకపోయినా… ఎన్నో అష్టావధానాలు, రెండు మూడు శతావధానాలు జనరంజకంగా చేసి పండిత పామరుల చేత మన్ననలు పొందిన మలుగు అంజయ్యగారితో ఈనాటి మన మయూఖ ద్వైమాసిక పత్రిక ద్వారా ముఖాముఖిలో మరెన్నో విషయాలు తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు ఈనాటి అతిథి మలుగు అంజయ్యగారితో ఈ పరిపృచ్ఛ చేద్దాం!

పద్మజ:– అంజయ్య గారు నమస్కారాలండీ!
అంజయ్య:- మీకు మరియు పత్రికా యాజమాన్యానికి ముందుగా వందన మందారాలు!
  మారుమూల గ్రామంలో జన్మించి, అవధానిగా ఎదిగి, యావత్ భారత దేశంలో ఎన్నో అవధానాలు చేసినటువంటి నన్ను సమాజానికి అందించాలనే సత్సంకల్పంతో మయూఖ పత్రిక ద్వారా పరిచయం చేస్తున్నందుకు ముందుగా నా నమస్సుమాంజలి!

పద్మజ:– మా పాఠకుల కోసం మీ కుటుంబ నేపథ్యం చెప్తారా?
అంజయ్య:- నేను వికారాబాద్ జిల్లాలో కోడూరు మండలంలోని అంగడి చిట్టంపల్లి అనే గ్రామంలో యాదవ వంశంలో జన్మించాను. మా తల్లిదండ్రులకు మా కుటుంబములో ఎవరికీ అక్షర జ్ఞానం లేదు. గొర్రెలకు కాపరులుగా ఉంటూ, మా కుటుంబాన్ని పోషించేవారు. ఆయా సందర్భాల్లో నేను కూడా వారితో పాటు గొర్రెల కాపలాకు వెళ్ళేవాడిని. ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందపడే వాడిని. అదేవిధంగా మా బంధువుల ఇళ్లల్లో కానీ, మా ఇళ్ళల్లో కానీ శుభకార్యాలు జరిగినప్పుడు ఒగ్గు కథ బీరప్ప కథలు చెప్పించే వాళ్ళం.    ఆ కథను చెప్పేవాళ్లు….
శరణు! శరణు! మాయమ్మా! రాణీ!  అమ్మా! భవాని! గంగాభవానీ! అంటూ పాడడం ప్రారంభించి, అతివేగంగా సందర్భానుకూలంగా గీతాలను పాడుకుంటూ కథలు చెప్పేవారు. అక్షర జ్ఞానం లేని వాళ్ళు ఇంత వేగంగా పాటలు పాడుతూ, కథ చెప్తూ ఉంటే చిన్నప్పటినుండి తన్మయత్వంగా వినేవాడిని. ఆ కారణంగానే నాకు సాహిత్యం వైపు మొగ్గు చూపేందుకు  పునాది పడింది తల్లీ!

పద్మజ:– మీరు ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేసుకున్న తర్వాత ( O L; BOL ; MOL ) ఓ యల్, బి ఒ యల్, ఎమ్ ఓ యెల్ చేసారు కదా! ఇలా తెలుగు సబ్జెక్టును ప్రత్యేకంగా ఎన్నుకోవడానికి కారణం ఏమైనా ఉందా?
అంజయ్య:– పెద్ద కారణమే ఉందమ్మా! నేను తాళ్లూరు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివినప్పుడు ఫెయిల్ అయినాను. అలా ఫెయిల్ కావడానికి కారణము మాకు గణితం, ఇంగ్లీషు, సైన్సు చెప్పే ఉపాధ్యాయులు లేకపోవడంతో ఆ సబ్జెక్ట్ లు నాకు రాకపోయేవి. తెలుగు, సోషల్ మాత్రమే ఉపాధ్యాయులు ఉండి చక్కగా పాఠాలు  చెప్పేవారు. అందుకే నేను పదవ తరగతి పరీక్షలో తప్పాను… ఆ తర్వాత నేను ఊర్లో ఉండిపోయాను. ఓరియంటల్ కాలేజీలో ఎంట్రెన్స్ రాసి, దాని  ద్వారా కాలేజీలో సీటు సంపాదించి, చదువు చదవ వచ్చని ఎవరో చెప్పారు …
         అలా చదవాలని ఓరియంటల్ కాలేజీకి వెళ్లాను. ఆ క్లాసులోకి వెళ్ళగానే సిలబస్ లో శ్లోకాలు, పాటలే ఉన్నవి. నాకు చాలా సంతోషం వేసింది. నిజంగా అంత వరకు నేను చేప పిల్ల చెరువులో నుండి బయటపడితే గిలగిలలా కొట్టుకున్నట్టు నేనుండేవాడిని. అక్కడ ఇటువంటి విద్యా విధానం చూడగానే మళ్లీ చేప నీళ్లలో పడినప్పుడు పడిన ఆనందం పొందాను. కారణమేమంటే  అక్కడ ఒక్క తెలుగు మాత్రమే  ఉండడం విశేషం.
   కాలేజీలో గట్టు గణపతి గారని అధ్యాపకులు ఉండేవారు. తెలుగు పద్యాన్ని ఎంత బాగా చెప్పేవారంటే మాటలలో చెప్పలేము! రామాయణ, మహాభారతాలలో ఉన్న పద్యాలను విడమర్చి చెపుతుంటే.. ఒక పద్యాన్ని ఇంత విశ్లేషించవచ్చా? ఒక పద్యంలో ఇంత మాధుర్యం ఉంటుందా? ఇలా పద్యాన్ని విడదీసి చదివితే ఎంత అర్థవంతంగా ఉందో కదా! అని అనుకునేవాడిని.   శ్రీనివాసాచార్యులనే సంస్కృత అధ్యాపకులుండేవారు. వారు సంస్కృతంలో ఉన్న రఘువంశము, కిరాతార్జనీయము, పంచతంత్రము పాఠాలు చెప్తుంటే ఎంతో బాగుండేది.
       వ్యాకరణాంశాలు కూడా అన్నీ చెప్పేవారు. నాకు ఏదైతే ఇష్టమో? ఆ తెలుగే  అక్కడ లభించడంతో నా ఆనందానికి హద్దే లేదు! ఎందుకంటే నాకు ఇష్టమైన సబ్జెక్టు కావడంతో చక్కగా చదవగలిగాను. తరువాత ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరిన తరవాత నేను చెప్పే సబ్జెక్టు కూడా అదే కావడంతో నా బోధన మా విద్యార్థులు ఎంతో ఇష్టపడేవారు. ఒక పద్యమో, ఒక పాటనో  ఇలా ఏదో ఒకటి రాసి, పాఠశాలలో జరిగే స్వాతంత్ర దినోత్సవానికి గాని గణతంత్ర దినోత్సవానికి గాని పాడేవాణ్ణి.
    మా ప్రధానోపాధ్యాయులు నన్ను పాట రాయమని, పిల్లలకు నేర్పించమని అనేవారు. నేను పాట రాసి పిల్లలకు నేర్పించి, ప్రభాత భేరిలోనో, లేక ఏదేని కార్యక్రమంలో వేదిక పైననో ప్రారంభ సమయంలో పాడించేవాడిని. అలా పిల్లలతో పాటు, నాకూ ఎంతో సంతృప్తి, సంతోషం కలిగేది. అదంతా తెలుగు భాష కున్న మాధుర్యం అదే కాకుండా అప్పటికప్పుడు చిన్న చిన్న రూపకాలు రాసి, విద్యార్థుల చేత ప్రదర్శనలు చేయించేవాడ్ని.
           ఇవన్నీ కూడా చిన్నప్పటినుండీ ఇష్టమవడంతో… ఉద్యోగ బాధ్యతల్లో చేయమన్నప్పుడు మనస్ఫూర్తిగానే చేసేవాడిని.
     నేను శ్రద్ధగా పాఠాలు చెప్పడం వల్ల మా పాఠశాల విద్యార్థులందరికీ తెలుగంటే ఎంతో ఇష్టం ఏర్పడింది. అందువల్ల నేను ఎక్కడ ఉంటే అక్కడ కోడి చుట్టూ కోడి పిల్లలు మూగినట్టు నా చుట్టూ మా విద్యార్థులు మూగేవారు.
   ఒక పాట చెప్పండి సార్ అనో;  లేకపోతే ఒక పద్యం చెప్పండి సార్ అని అడిగే వారు.   తర్వాత అమ్మా!  నేను ఉపాధ్యాయుడుగా ఉన్నప్పుడు డీఈఓ గానీ ఎవరైనా మంత్రులు గాని ఆ ప్రాంతానికి వస్తే, తప్పనిసరిగా నన్ను వేదిక మీదకు  పిలిచేవారు హెడ్మాస్టర్ గారు. వేదిక మీద పాడడం కోసం నేను వారి మీద అప్పటికప్పుడు ఆశువుగా పద్యాలు చెప్పినా, అభినందన పద్యాలు వినిపించినా వాళ్లకు ఎంతో ఆనందం కలిగేది. వారితో పాటు నాకు ఆనందమే! అటు సమాజము,ఇటు పాఠశాల నాకు ఎంతో తృప్తినిచ్చింది. 
మొట్టమొదట స్పెషల్ టీచర్ గా ఉద్యోగంలో 398 రూపాయల జీతంతో చేరాను. ఆ కొద్ది మొత్తం కూడా ఒక సంవత్సరం పాటు నా చేతికి జీతం అందలేదు. అయినా కూడా నా దృష్టి జీతం  మీదకు పోకుండా… పిల్లలకు పాఠాలు చెప్పడం మీదనే ఉండేది.    పాట మనుసును మురిపిస్తుంది. పాటకు ఉన్న శక్తి అటువంటిది. తెలుగు భాషకు ఆకర్షణ అటువంటిది. నేను వృత్తి నిర్వహణలో చాలా తృప్తి పొందాను. ఒకవేళ మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు టీచర్ గానే జన్మించాలని ఉంది.

పద్మజ:– తప్పక మీరు కోరుకున్నట్టు మరో జన్మలోను తెలుగు ఉపాధ్యాయులుగా ఉండే అవకాశం ఆ భగవంతుడు మీకు కల్పించాలని కోరుకుంటూ….        మీకు ఇష్టమైన గురువు ఎవరు?
అంజయ్య:– బృహత్ ద్వి సహస్రావధాని డా॥ మాడుగుల నాగపణి శర్మ గారు. ఎందుకంటే పద్య మాధుర్యాన్ని ప్రపంచానికి అందించిన వ్యక్తి. వారి యొక్క పద్య పఠనంగానీ, పద్యాన్ని పూరించే విధానంగానీ, పద్యాన్ని వర్ణించి చెప్పే విధానంగానీ  మరొకరు అలా చేయలేరని నా విశ్వాసం.
     ఈనాడు ఎంతో మంది తెలుగు భాష వైపుకు ఆకర్షింప బడటానిక, ఎందరో అవధానాలు చేయడానికి కారణం మా గురువుగారు నాగఫణి శర్మ గారే. వారికి ఏకలవ్య శిష్యుడుగా ఉండి నేను చాలా నేర్చుకున్నాను. వారు కూడా తన ప్రియ శిష్యుడని  సంబోధిస్తారు. అది నా భాగ్యంగా భావిస్తాను.

పద్మజ:- నేటి విద్యా విధానానికి నాటి విద్యా విధానానికి ఏమైనా తేడాలు ఉన్నట్టు మీరు గమనించారా? నాటి విద్యార్థుల నేటి విద్యార్థుల ఆలోచనలెలా ఉన్నాయి?
అంజయ్య:– నాటి విద్యా విధానానికి ఈనాటి విద్యా విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆనాటి విద్యా విధానం విద్యార్థిని సమగ్ర అభివృద్ధికి తోడ్పడేలా ఉండేది. విద్యార్థి తన నిజ జీవితంలో ఏ ఒడిదుడుకులున్నా తట్టుకొని జీవించే శక్తిని నేర్పించేది. ఉద్యోగం అంటే ప్రభుత్వం ఇచ్చేజీతం కోసమే బతకడం కాకుండా… తాను స్వయం ఉపాధితో జీవించడానికి తగిన విధంగా ఉండేది. ఆనాటి విద్య తల్లిదండ్రులన్నా, గురువులన్నా, పాఠశాల అన్నా  ఒక మంచి గౌరవముండేలా విద్యార్థులకు నేర్పించేలా ఉండేది.
        ఈనాడు అంతా యాంత్రికం అయింది లోకమంతా డబ్బువైపు పరిగెత్తుతున్నది కోట్ల రూపాయలు సంపాదించినా కూడా ప్రపంచమంతా నా స్వంతం కావాలనే అత్యాశ లేదా దురాశతో పరిగెత్తుతున్నారు తప్ప ఏ చదువులో ఆనందంగా ఉందామనే ఆలోచన విద్యార్థులకు రావడం లేదు. ఈనాటి విద్యా విధానం కానీ విద్యార్థులు కానీ లేదా తల్లిదండ్రులు గానీ డబ్బు మాత్రమే కోరుకుంటున్నారు. విద్యార్థులు గానీ తల్లిదండ్రులు గానీ ఇంజనీరింగ్ లేదా వైద్య వృత్తులనుకోరుకుంటున్నారమ్మా! ఇతర వృత్తుల చదువులకు సంబంధించిన చదువులు అంతగా ఇష్టపడటం లేదు. నిరాడంబర జీవితం గడిపాలని కానీ సమాజానికి సేవలు చేయాలనిగానీ ఉండడంలేదు. సమాజపరంగా ఏదైనా ఒత్తిడి  ఉంటే వాటిని పరిష్కరించుకోవాలని కానీ ధైర్యంగా ప్రతిదాన్ని ఎదుర్కోవాలనే స్థిరచిత్తం కాని బోధనలో నేర్చుకోవడం లేదు. చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి విద్యార్థుల్లో కనపడటం లేదు. హృదయం కోమలంగా పవిత్రంగా ఉండాలి. అంటే పురాణ వాజ్మయ పరిచయం ఉండాలి.

పద్మజ:– మీరు ఇలా కాకుండా ఉండేందుకు మార్పులు ఏమైనా చెప్తారా?
అంజయ్య:– ఆలోచనలో మార్పు రావాలి. పైన చెప్పిన రెండే వృత్తులు ముఖ్యం కాదనీ, సమాజం మనుగడ  కోసం అన్ని వృత్తులు అవసరమని, తల్లిదండ్రులలో అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ఆ రెండే వృత్తులు  గౌరవం, డబ్బు ఇస్తాయని అనుకోవద్దు. ఏ చదువు అయినా సమాజంలోని అన్ని రకాల  ప్రజలకు అవసరమని గుర్తించినప్పుడు ఈ ధోరణి మారుతుంది. అంతేకాదు మనిషికి ఓదార్పు ఇచ్చేది సాహిత్యం. శాంతినిచ్చేది పురాణ వాజ్ఞ్మయం. కాబట్టి ఏనాటికైనా అందరి దృష్టి అటు తిరగవలసిందే! పోతే ఇప్పటికే ఆ కృషి కొంత ప్రారంభమైంది. పాఠశాలల ద్వారా చెప్పేది ఏమీ లేదు. ఎందుకంటే విద్యార్థులు వినే దశలో  లేరు. తెలుగు నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందా? జీవితానికి భద్రత ఉంటుందా? సంఘంలో గౌరవం ఉంటుందా? కేవలం టైం పాస్ కోసం అంటే కాలక్షేపానికి మాత్రమే తెలుగు పనికొస్తుందని కొట్టి పారేస్తారు, తప్ప వినిపించుకోరు కానీ మాతృభాషలో ఎవరైతే క్షుణ్ణంగా చదువుతారో మిగతా సబ్జెక్టులన్నీ చాలా సులువు అయ్యి, అన్ని సబ్జెక్ట్ లు చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు సాంప్రదాయ విద్యలే శాంతిని ఆనందాన్నిస్థాయాని విద్యార్థులు తెలుసుకోవాలి!

పద్మజ:- మీకు అవధానం ఎప్పుడు చేయాలనిపించింది? దానికి ప్రేరణ ఏమిటి?
అంజయ్య:– అమ్మా! తెలంగాణ ప్రభుత్వం నాగఫణిశర్మ గారి చేత లలిత కళాతోరణంలో  ద్విసహస్రావధానం తలపెట్టి, ఔత్సాహికులైనటువంటి  తెలుగు ఉపాధ్యాయులను పృచ్ఛకులుగా పంపించారు. నలబై రోజులు ఓ డి ఇచ్చి పంపారు. నేను ఆ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే తలంపుతో మా ప్రధానోపాధ్యాయుడు గారి సలహాతో నేను వెళ్లడం జరిగింది. వెళ్లిన తర్వాత ఆ నలభై రోజులు ఆవధానంలో ఉండడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నాగఫణిశర్మ గారు చెప్పే పద్యం రాగం ద్వారా పద్యాన్ని ఎలా మనం రాయవచ్చు? అని ఒక లయ, ఒక శైలి ద్వారా పద్యాన్ని నిర్మించుకోవచ్చు అనేది నేను గమనించి, నేను వారు చెప్పినట్టే పద్యం చెప్పడం ప్రారంభించాను. నాకు ముందే పద్యం ఆశువుగా  చెప్పడం వచ్చినా… అంత మాధుర్యంగా వచ్చేది కాదు! నాగఫణిశర్మ గారు చెప్పినట్టు వికారాబాద్ ప్రాంతంలో ఏదైనా వేదిక మీద పద్యం చెప్తుంటే కాలేజీ ప్రిన్సిపాల్ గారు తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ అయిన “ముళ్ళపూడి సూర్యనారాయణ మూర్తిగారు “అంజయ్య గారూ! మీరు అవధానం చేస్తారా? “అని అంటే ప్రయత్నం చేస్తాను అని అన్నాను.
   మొదట డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ అందరూ పృచ్ఛకులుగా నా చేత అవధానం చేయించారు. ఆశువుగా నేను పద్యాలు చెబుతుంటే వాళ్లంతా ఆశ్చర్యపోయి, బాగుందని మెచ్చుకోవడమే కాకుండా దీని మీద ఇంకా పట్టు సాధించాలని అవధానానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు తెచ్చి ఇచ్చి చదవమన్నారు. ఆ గ్రంథాలన్నీ చదవడం వారు చెప్పినట్టుగా కొన్ని సూచనలు అనుసరించడంతో వారే పెద్ద ఎత్తున ఒక వెయ్యి మంది సమక్షంలో పెద్ద వేముల పట్టణంలో ( తాండూరుకు దగ్గరగా ఉంటుంది) అవధానం ఏర్పాటు చేశారు.
         వెయ్యి మంది శ్రోతలు ఉన్న సభ అది! అంతమంది సమక్షంలో అవధానం చేసి, వారి మెప్పులు పొందాను. అప్పుడు గురువుగారు ఏమన్నారంటే ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత! నువ్వు ఇంట్లో గెలిచావు! నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ అవధానం తప్పనిసరిగా ప్రశంసలు అందుకుంటుంది నాయనా! అని ఆశీర్వదించారు సూర్యనారాయణ మూర్తి గారు.   ఆ తర్వాత అంచలంచలుగా అనేక అవధానాలు చేస్తూ చేస్తూ, భారతదేశంలోని మహానగరాలన్నింటా  అవధానాలు చేశాను. ఢిల్లీ నగరంలో ఐదు సార్లు, మద్రాసులో ఒకసారి, లక్నోలో ఒకసారి ,తెలంగాణ ప్రభుత్వమే అవధానాల కోసం నన్ను పంపించింది. తర్వాత అహ్మదాబాద్ లో( గుజరాత్ )లోను, హైదరాబాద్ లో ఎన్నో వేదికల మీద అవధానం చేశాను. రవీంద్ర భారతిలోను, సారస్వత పరిషత్తులోనూ, శ్రీధర్ ఫంక్షన్ హాల్ లోను ,శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలోనూ, వేదికలన్నింటిమీద అవధానాలు చేశాను. 200 పైగా అష్టావధానాలు, మూడు శతావధానాలు చేశాను. తాండూర్ లో ప్రాజ్ఞ కళాసమితి వారు అవధానం  ఏర్పాటు చేశారు. మా ఆధ్యాత్మిక గురుదేవులు వైరాగ్య శిఖామణి గిరి  మహారాజ్ జహీరాబాద్ దగ్గర ఆశ్రమంలో ఉంటారు. అక్కడ శతావధానం చేయించారు. అది జయప్రదంగా ముగిసిన తర్వాత, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంగీత విద్వాంసులు అనూప్ ఝలోఠా గారిని బాంబే నుండి పిలిపించి నాకు స్వర్ణకంకణ ధారణ చేయించారు. ఆ విధంగా నా అవధాన ప్రస్థానం కొనసాగుతున్నది. మీ అందరి ఆశీస్సులతో నిరంతరం కొనసాగుతున్నది.

పద్మజ :-మీకు అవధానంలో ఇష్టమైన ప్రక్రియ ఏది?
అంజయ్య:- నా అవధానం లోపల ఎనిమిది ప్రక్రియలు ఉంటాయి. వాటిలో దత్తపది, సమస్యాపూరణం, వర్ణన, ఆశువు, ఛందో భాషణం, నిషిద్ధాక్షరి, వార గణనము, గంటికా గణనము ముఖ్యమైనవి. వీటి అన్నింటిలో  నాకు ఆనందాన్ని ఇచ్చేది సమస్యాపూరణం. ఇది అవధానికి ఆనందం ఇవ్వడమే గాక పండితులకు కూడా ఆనందిన్నిస్తుంది. దత్తపది కూడా అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

పద్మజ:- మీకు ఆశ్చర్యం కలిగించిన సమస్యా పూరణం గురించి మా  మయూఖ పాఠకులకు ఒకటి, రెండు చెప్పగలరా?
అంజయ్య:- అలాగే అమ్మా! మాకు అవధానంలో ఇచ్చిన ఒక సమస్య.
 “రోకలికి కాలు జారె తేయాకు మందు.”
 రోకలికి కాలు జారడం తేయాకును మందుగా పూయడం ఇది సమస్య. ఇది జరగదు కదా! దీన్ని మనం సమస్యా పూరణ చేసి ఈ సమస్యను అర్ధవంతంగా పూరించాలి. నేను ఇలా తేటగీతి పద్యంలో పూరించాను.
గొప్ప అవధాన సభయందు మెప్పుపొంది
తిరిగి వచ్చేటి వేళలో యెవరొ గాని
తోసి వేసిరి కలిసియు చూసి యెవ్వ
రో కలికి కాలు జారే తే యాకుమందు
      ఇది మహబూబు నగర్ లో చేసిన అవధానంలో పూరించిన సమస్య. ఆ సభలో కపిలవాయి లింగమూర్తిగారు కూడా ఉన్నారమ్మా!
        ఒక దత్తపది గురించి చెబుతాను. మంచాల ప్రాంతంలో ఒక అవధానం చేశాను. తొమ్మిది ,పది తరగతులు చదివే విద్యార్థులు నన్ను అవధానానికి ఆహ్వానించారు. అందులో ఒక విద్యార్థి ఇచ్చిన దత్తపది ఇది.  
మంచాల, జాపాల, వెలిచాల, యాంజాల అనే నాలుగు ఊర్ల పేర్లు ఇచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితులే అప్పుడు కూడా ఉన్నాయి . ఎలక్షన్ లు జరుగుతున్నాయి. ఎలక్షన్ లో నిలబడిన అభ్యర్థి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పమన్నాడు ఈ పదాలను ఉపయోగించి.
పట్టె మంచాలపై నిదుర పట్టదాయె,
వేలు వెలిచాల ఖర్చయి వేద మిగిలె
తెల్లవారగ భయాం జాలా వెల్లువాయె
ముద్దు ఓటు రాజా! పాల ముంచవోయి
ఇందులో నాలుగు ఊర్ల పేర్లు వచ్చాయి వెతుక్కుంటేనే దొరుకుతాయమ్మా!

పద్మజ:- చాలా బాగుందండీ! ఒకవైపు పాఠశాలలో పిల్లలకు బోధన, మరొకవైపు కుటుంబ బాధ్యత, ఇంకొకవైపు అవధానాలు చేయడం , ఇలా చేస్తూనే మీరు ఎన్నో రచనలు చేశారు కదా! ఎలా సాధ్యమైంది మీకు?
అంజయ్య:- అవధానంలో వందమంది పృచ్ఛకులు ఉంటారు. వందమంది పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలను మనసులో పెట్టుకొని తిరిగి చెప్పడమే అవధానం. అది ఒక క్రీడగా భావించినప్పుడు శ్రమ అనిపించదు. ఏ పనైనా కూడా ఇది చేస్తున్నాను అనే భావన కలిగినప్పుడు పది నిమిషాల్లో శరీరం అలిసిపోతుంది. మనసు అలసిపోతుంది. దాంతో నీవు పని చేయలేవు. ఎలా అంటే ఒక క్రికెటర్ ఉదయం నుండి సాయంత్రం వరకు ఆడుతుంటే అతనికి శ్రమ తెలియదు, శరీరము అలసిపోదు. మనసు అలిసిపోదు. చేయవలసిన గోల్ మీద రన్స్ మీదే ధ్యాస ఉంటుంది. మనిషి ఎన్నుకునే అంశంపైన తాను నిరంతరం ఇది పని కాదు, ఇది ఆట అని ఆనందపడుతూ దానిలో లీనమైపోతూ పనిచేస్తూ రాత్రి, పగలు అనకుండా నిరంతరం పని చేస్తుంటే ఆనందాన్నిస్తూనే ఉంటుంది. దానిలో నీవు ప్రావీణ్యం పొందుతూ ఉంటావే తప్ప ఇది నేను చేయాలి, దీన్ని నాచేత చేయిస్తున్నారు దీనివలన నాకు ఏం లాభం? అని ఆలోచిస్తే నీకు అది సంతోషాన్ని ఇవ్వదు. దాంట్లో ప్రావీణ్యం పొందడం కూడా ఉండదు కదా! అదే దృక్పథం నాకు చిన్నప్పటినుండి ఉంది.
        నాకు ఆనందాన్ని ఇచ్చే ప్రక్రియ ఈ సాహిత్య ప్రక్రియ, రచనా ప్రక్రియ కనుక నిరంతరంగా నేను పద్యాలు రాస్తూ, పాడుతూ, పాటలు రాస్తూ, కథలు రాస్తూ సుమారు అరవై పుస్తకాలు పైగా ప్రచురణ చేయించడం జరిగింది. అందులో నలబై పుస్తకాలు పద్య పుస్తకాలు ఉన్నాయి. ఎన్నో పుస్తకాలు నేను సమాజానికి అందించి సరస్వతి మాత గళ సీమలో వెలుగులీనేటట్లు నేను అలంకరించాను. ఎంతోమంది విద్యార్థులు నా పుస్తకాలోని ఆ పద్యాలను, పాటలను పాడుతూ ఆనందిస్తున్నారు. అది నాకు ఆనందాన్నిస్తుంది. తత్కారణంగా నేను ఉద్యోగంలో ఉన్నా, కుటుంబం ఉన్నా ,సమాజంలో ఉన్నా ఇంకా ఎన్ని పనులు ఉన్నా ఇది పూలలో దారం లాగా అంతర్లీనంగా నా వెంటే ఉండేది. అందుకోసమే ఇన్ని సాధించగలిగాను.

పద్మజ:- అయ్యా! మీరు ఇంతవరకు ఎన్ని రచనలు చేసారు?
అంజయ్య:- అమ్మా! నేను చాలా రచనలే చేసాను. వాటి గురించి చెబుతాను.
 1.శతకాలు :-
1. ధామగుండ శతకం (ఆటవెలది)
2.సాయి శతక సంకీర్తనావళి (కందాలు)
3. చేవెళ్ల చరిత్ర శతకం (చంపకోత్పలాలు)
4. జగదంబ శతకం (సీసాలు)
5.బాకవరాంజేయ శతకం (ఏకప్రాస వృత్తాలు)
6. సత్యసాయి శతక మందారాలు (తేటగీతి)
7 అయ్యప్ప మధ్యాకరులు (మధ్యక్కర)
8.అమ్మ (తేటగీతి)
9. ప్రభుదాసు ప్రబోధం (సీసం)
10. దత్తగిరి బోధమృతం (సీసం)
11. శివానంద శతకం (తేటగీతి)
12. రామలింగేశ్వర శతకం (మత్తేభశార్ధూలాలు)
13. శ్రీధామ గుండ క్షేత్రం (మత్తేభశార్ధూలాలు)

2. గేయాలు
1.పాటల పల్లకి
2.బాలానందం
3.రసరంజని
4. గోరుముద్దలు
5. బర్దిపూర్ భజన కీర్తనలు
6. మారిన మనిషి (బుర్రకథ)
7. స్వాతంత్ర దినోత్సవం (పల్లె సుద్దులు)
8 శిశు సంరక్షణ (యక్షగానం)
9.పర్వేదు రామాయణ పద్య నాటకం
10. శ్రీశ్రీశ్రీ దత్తగిరి మహారాజ్ జీవిత చరిత్ర (బుర్రకథ)
 11. శ్రీశ్రీశ్రీ దత్తగిరి మహారాజ్ జీవిత చరిత్ర (నాటకం )
12. శ్రీశ్రీశ్రీ దత్తగిరి మహారాజ్ జీవిత చరిత్ర (గేయామృతం)

 3 పద్య గ్రంథాలు
1. కాశీ క్షేత్ర యాత్ర
2. మా ఊరి మందారం
3. బాగన్న చరిత్ర
4. కడియాల తారావళి
5. అవధాన ఆణిముత్యాలు
6. అవధాన పద్య రత్నాలు- తాండూర్ శతావధానం
7.వినాయక స్తవం- పద్య చిత్ర బంధకవిత్వం 8.శతావధానం బర్దీపూర్ ఆశ్రమం

 4. సంకలనం గ్రంథాలు
1.పద్యతరంగణి
2. పద్య మంజరి
3. శతకవల్లరి
4. ఆచల గురుతత్త్వ రత్నావళి
5. ఇతర గ్రంథాలు
1.రంగారెడ్డి జిల్లా కవులు- రచయితలు- సాహిత్యసేవ
2.యోగానంద జీవిత చరిత్ర
3. దత్తగిరి మహారాజు జీవిత చరిత్ర
4. భాషాత్రయ సులభ వ్యాకరణం
5. వ్యాకరణ చంద్రిక
6.అభినందన పద్యమందారాలు
7.సాయి రెడ్డి శారదార్చన
8.మోనిగారి నారాయణ షష్టిపూర్తి సంచిక
9. రాం రెడ్డి పదవీ వివరణ సంచిక
10.తెలుగుతేజం
11. పన్నెండు పడగల వెంకటేశ్వర చరిత్ర
12. వికారాబాద్ జిల్లా సాహిత్య చరిత్ర
13. శ్రీశ్రీశ్రీ దత్తగిరి మహారాజ్ సంక్షేప్త చరిత్ర

పద్మజ:- వికారాబాద్ జిల్లా సాహిత్య చరిత్రను రాయాలని మీకెందుకు అనిపించింది?
ఎల కోయిలలు వేయి వెలుగెత్తి పాడినా
       కొసరైన కమ్మని గొంతు వారు
లేత మామిడి వేప లేచిగుళ్ళకు లేత
       వగరుకు వగరైన పొగరువారు
ఒక మంచి మాటకే యొడలెల్ల నుప్పొంగి
        సర్వంబు నర్పించు సదయవరులు
చెయ్యన లేచినా చైత్రమాసపుటెండ
         మమతలు కురిసినా మల్లెదండ
 ఎవరు ఎవరయ్య ఎవరయ్య యెవరు వారు కలిమిగల వన్నెకాడు సత్కళలరేడు
మూడు లింగాల నడుముండి ముజ్జగాల వెలుగులను నింపు మొనగాడు తెలుగువాడు
                       సి. నారాయణరెడ్డి
        ఇలాంటి తెలుగు సాహిత్యంపైన మమకారం కలిగినవారు ఈ రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ప్రాంతంలో అధికంగా ఉన్నారు. సాహితీ సమితి, జాతీయ సాహిత్య పరిషత్తు, అనంత సాహితీ, ప్రాజ్ఞ కళా సమితి ఇలా రకరకాల సాహితీ సంస్థలు ఉన్నాయి. ఎంతోమంది కవులకు పుట్టినిల్లైన ఈ ప్రాంతంలో చాలామంది గ్రంథాలు రాశారు. అవి వెలుగులోకి రాకుండా ఉన్నాయి. “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరియసీ” అన్నట్లుగా నేను కూడా ఈ ప్రాంతంలో పుట్టాను. ఏదైనా నా మాతృగడ్డకు చేయాలని ఉద్దేశంతో ‘రంగారెడ్డి కవులు- రచయితలు’ అనే అంశం పైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2011లో నేను పి.హెచ్. డి చేయడం జరిగింది. అందులో భాగంగా 2018- 19 ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం వారు వికారాబాద్ జిల్లా సాహిత్య చరిత్రను ఎవరు రాస్తారని గ్రహించి, నాకు ఆ కార్యాన్ని అప్పగించడం జరిగింది. ఆ కారణంగా ఆనాడు అక్కడ ఉన్నటువంటి నందిని సిధారెడ్డి గారు నాకు ఈ అంశాన్ని ఇచ్చి వికారాబాద్ జిల్లా సాహిత్య చరిత్రను రాయమన్నారు. నేను సంతోషంగా స్వీకరించాను. మా ప్రాంతానికి నాకు జన్మనిచ్చిన మాతకు సేవలు చేసిన వాడిని అవుతాననీ, ఆ పుస్తకం సమాజానికి అందిచాలనే ఉద్దేశంతో వారు ఇచ్చినటువంటి సాహిత్య ప్రక్రియను అనుసరించి ఆ పుస్తకాన్ని రాయడం జరిగిందమ్మా!

పద్మజ :- చాలా సంతోషమండి. మరో విషయం చెప్పండి. శతక పద్యాలను ఒకే జాతికి  చెందిన పద్యాలలో రాస్తారు కదా! మీరు చేవెళ్ళ చరిత్ర శతకంలో చంపకోత్పలమాల వృత్తాలలో రాయడానికి కారణాలేమైనా ఉన్నాయా?
అంజయ్య:- అమ్మా! నేను 14 శతకాలు రాయడం జరిగింది. కందం ,ఆటవెలది, తేటగీతి, సీసం, వృత్తాలు, మధ్యాక్కరలు, అదేవిధంగా ఒకే పద్యంలో మూడు, నాలుగు పద్య లక్షణాలు ఉండే గర్భకవిత్వంలో కూడా శతకాలను రాయడం జరిగింది. అయితే మీరన్నట్లుగా ఒకే ఛందస్సులో శతకం రాయాలనే సంప్రదాయాన్ని పాటించాలి. కాకపోతే చంపకమాలైనా ఉత్పలమాలైనా ఒకే ఛందస్సుకు చెందినవి. ఇవి రూపంలో వేరుగా ఉన్నా లక్షణం మాత్రం ఒకటే. ముందున్న ఒక్క అక్షరాన్ని మారిస్తే ఉత్పలమాల చంపకమాలవుతుంది; చంపకమాల ఉత్పలమాలవుతుంది. ఒకే మకుటం రెండు పద్యాలకూ పనికి వస్తాయి. అదే విధంగా శార్దూల, మత్తేభ పద్యాలలో కూడా ముందున్న ఒక అక్షరం మారిస్తే శార్దూలము మత్తేభము అవుతుంది; మత్తేభం శార్దూలము అవుతుంది. ఈ రెండిటికి కూడా ఒకే మకుటం సరిపోతుంది. పూర్వకవులు చాలామంది రెండు వృత్తాలను కలిపి రాశారు. ఉదాహరణకు దూర్జటి రచించిన శ్రీ కాళహస్తీశ్వర మహత్మ్యంలో శార్దూల, మత్తేభ పద్యాలు ఉన్నాయి. మారద వెంకన్న రాసిన భాస్కర శతకంలో కూడా ఉత్పల, చంపకమాలలలోనే ఉంటాయి. వాళ్లని ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఉత్పలమాల చంపకమాల పద్యాలతో కలిపి శతకం రాశాను.

పద్మజ:- మీ రచనలలో మీకు ఇష్టమైన రచన ఏమిటి?
అంజయ్య :- అమ్మా! తెలుగులో ఉన్న అనేక ప్రక్రియల్లో నూరు పుస్తకాలు రాశాను, అరవై పుస్తకాలు ముద్రణయ్యాయి. ఎక్కువగా పద్యానికి సంబంధించిన కావ్యాలు, శతకాలు, పద్య నాటకాలు ఉన్నాయి. తరువాత కీర్తనలకు సంబంధించిన ఉన్నాయి. బాలగేయాలకు సంబంధించినవి, వ్యాకరణానికి సంబంధించినవి అనేక పుస్తకాలున్నాయి. అయినా కూడా నాకు ఆనందాన్ని, అనుభూతులను కలిగించే పుస్తకం ఆధ్యాత్మిక గురువు ‘దస్తగిరి మహారాజు జీవిత చరిత్ర’ను రాశాను. అది వారి అనుగ్రహంతో రాశాను. అది 550 పేజీల పెద్ద పుస్తకం. అది ఒక పరిశోధన గ్రంథం వలె ఉంటుంది. అయితే ఎందుకు తృప్తినిచ్చిందంటే నాగఫణిశర్మ గారు ఆ జీవిత చరిత్రను రాయాలనుకున్నారు. వారికి సమయం లేక మీరే రాయండి నాయనా! అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కసిరెడ్డి వెంకటరెడ్డిగారు కూడా ఆ పుస్తకం రాయాలనుకున్నారు. సమయం చాలక రాయలేదు. అంజయ్యగారూ! మీరు రాశారు నాకు చాలా ఆనందం అయిందని చెప్పారు. రమణాచారి గారు ఆ గ్రంథాన్ని చూసి నాయనా! ఒక యాదవ వంశంలో జన్మించిన అంజయ్య గారూ! మీలో ఆ దస్తగిరి మహారాజు సంపూర్ణంగా ఉండి రాయించినట్లు ఉంది కనుక మీ జీవితం ధన్యమైందని చెప్పారు. ఈ పుస్తకం అంటే నాకెంతో ఆనందమమ్మా! ఆ పుస్తకమే నాకు కీర్తిని తెచ్చిపెట్టింది, ఆ పుస్తకమే నాకు ఆనందాన్ని కలిగించింది. ఆ గురుదేవుల అనుగ్రహం వలన లభించిన పుస్తకమమ్మా అది.

పద్మజ:- సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి తత్సమ చంద్రిక రాశారు కదా! మీరు వ్యాకరణ చంద్రిక రాశారు. ఈ రెండింటికి ఏమైనా పోలికలు ఉన్నాయా? విపులంగా విశదీకరించండి.
అంజయ్య:- వ్యాకరణమంటే బాల వ్యాకరణమే. చిన్నయసూరి రచించిన బాల వ్యాకరణం వంటిది మరొకటి లేదు. ఆ తరువాత ప్రౌఢవ్యాకరణం వచ్చింది. తర్వాత ముక్త లక్షణ కౌముది వచ్చింది. ఆ తరువాత తెలుగుభాషకు భాష్యాలు మాదిరిగా అనేక వ్యాకరణ గ్రంథాలు ఒక గైడ్ మాదిరిగా వారి అనుభవాలను రాయడం జరిగింది. చాలా మంది వ్యాకరణం రాశారు నేను చిన్నప్పటినుండి కళాశాలలో, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో గురువుగారు రవ్వా శ్రీహరి గారు చెప్పినటువంటి వ్యాకరణాంశాలుగానీ, వరదాచార్యులుగారు చెప్పినటువంటి వ్యాకరణాంశాలు గానీ తర్వాత మా చిన్నప్పుడు కృష్ణయ్య గౌడ్ గారు లక్ష్మణరావు గారు చెప్పినటువంటివి అన్ని వ్యాకరణాంశాలు క్రోడీకరించి ఒక నోట్స్ మాదిరిగా రాసాను. నాకున్న సమస్యలే విద్యార్థులకు ఉండవచ్చని ఉద్దేశంతో ఈ వ్యాకరణ చంద్రికను రాశాను తప్ప సన్నిధానం వారి తత్సమ చంద్రికను చూడలేదమ్మా! దానికి దీనికి పోలికలు లేవు.  నా వ్యాకరణంలో అక్షరం, పదం, పద భేదాలు, వాక్య భేదాలు, సంధులు, సమాసాలు, తత్సమ పదాలు, తద్భవ పదాలు, అచ్చ తెలుగు పదాలు, వాటికున్న వ్యత్యాసాలు ఛందస్సుకు సంబంధించిన లక్షణాలు, ఒక పద్యం ద్వారా అనేక పద్యాలు రాయడం నేర్చుకునే సులభమైన పద్ధతులు, దానికి తోడుగా కొన్ని సంస్కృత శబ్దాలు, చిన్నచిన్న వాక్యాలు, సంస్కృత సంధులు, దీనిలో పెట్టి విద్యార్థుల కోసం రాసిన చిన్న ప్రయత్నం తప్ప కొత్తగా వ్యాకరణం సృష్టించింది ఏమీ లేదమ్మా!

పద్మజ :- మీకు లభించిన పురస్కారాలు గురించి మా పాఠకులకు తెలియజేయగలరు?
అంజయ్య:- నాకు పురస్కారాలు స్వచ్ఛంద సంస్థల ద్వారా, ప్రభుత్వం ద్వారా ,అనేక మహనీయుల ద్వారా అర్థ శతం పైనే లభించాయి. అందులో నాకు ఆనందాన్ని ఇచ్చినటువంటి పురస్కారాలు మా గురువుగారు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అనూప్ ఝలోఠా  సంగీత విద్వాంసుల చేత స్వర్ణ కంకణం లభించింది. వేలమంది మహాపండితుల సమక్షంలో చేయడం జరిగింది. అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రతిభా పురస్కారం ఇవ్వడం జరిగింది. కీర్తి పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. వారణాసిలో హిందూ విశ్వవిద్యాలయం వారు అక్కడ జానపదకళా రంగంలో  కళా ప్రదర్శన చేసిన సందర్భంగా వారు అక్కడ పురస్కారం ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నో పురస్కారాలు వచ్చాయి. మన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వారు ఉత్తమ అవధానం పేరుతో 50,000 నగదుతో నన్ను సన్మానం చేయడం జరిగింది. నాకు అన్నిటికంటే ఎక్కువ సంతోషం కలిగించింది ఏమిటంటే? ఐదు వందల సంవత్సరాల నాడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులను సన్మానం చేసిన వేదిక పైన వారి మనవడు ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం ఎనిమిది మంది కవులకు సన్మానం చేస్తున్నారు. ఆ ఎనిమిది మందికవుల్లో నన్ను ఒకరిగా స్వీకరించి ఐదు సంవత్సరాల నాడు అదే వేదిక పైన హంపి విజయనగరంలో భువన విజయం వేదికపైన అష్టదిగ్గజ కవుల్లో ఒక కవిగా నాకు సన్మానం చేశారు అంతకంటే ఈ జీవితంలో ఏమి సాధించేది లేదు. నాకు చాలా ఆనందాన్నిచ్చింది. నాగఫణి శర్మ గారు ప్రపంచ తెలుగు మహాసభల్లో నేను అవధానం చేసిన తర్వాత నా శిష్యుడు అందరిని మెప్పించాడని నన్ను మెచ్చుకొని అవధాన పీఠానికి పిలిపించి వారి చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది. ఇది కూడా నాకు చాలా ఆనందం ఇచ్చింది.

పద్మజ :- మీరు కొత్తగా వచ్చే అవధాన్లకు ఇచ్చే సందేశాలు ఏమిటి?
అంజయ్య:- అవధానులు పద్య పూరణ చేసేటప్పుడు ఛందస్సుతో పూరించకుండా కవిత్వంతో పూరించాలి. ఏ పద్యాన్ని పూరించినా పృచ్ఛకులు ఇచ్చిన ప్రశ్నలను గ్రహించి రెండు నిమిషాలో, మూడు నిమిషాలో తదేకంగా ఆలోచించి, పది కాలాలపాటు ఆ పద్యం నిలిచేటట్లు ప్రతి సాహిత్యవేత్త హృదయంలో అది ప్రతిధ్వనించే విధంగా ఆ పద్యం ప్రతి నోట్లో నాట్యం చేసేటట్లు ఉండాలి తప్ప ఛందస్సుతో పూరించి, ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్లు ఉండకూడదు. ఏ పద్యమైనా అలంకార శోభితంగా ఉండి రానున్న తరానికి ప్రేరణదాయకంగా పద్యం ఉంటుందమ్మా! పద్యాలను రాగయుక్తంగా పాడుకునేందుకు తర్వాత భావవ్యక్తంగా ఉండాలి. ఏదో పదాలను కలిపి ఛందస్సు అల్లితే అది పద్యం కాదు. అటువంటి అవధానుల వలన అవధానం రంజించదు.

పద్మజ:- మయూఖ పత్రిక మీద మీ అభిప్రాయం ఏమిటి?
అంజయ్య:- మయూఖము అంటే సూర్య కిరణము, నెమలి అని అర్థాలు ఉన్నాయి. నెమలి అనే అర్థం తీసుకున్నట్లు అయితే అనేక కళలకు నెమలి ప్రతీక. అది నృత్యం చేస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ నెమలి పింఛం ఆది గురువైన శ్రీకృష్ణుని తలపై ఉంటుంది. ఎంత గొప్పదైతే ఆ స్థాయిని పొందుతుంది? ఏకాగ్రతకు, బ్రహ్మచర్యానికి అది ప్రతీక. మీరు అన్నట్లుగా సూర్యకిరణం అనే భావంతో తీసుకుంటే సూర్యకిరణం లేనిదే ఈ ప్రపంచం నడవదు. సూర్యుడు ఉదయించినదే పగలు కాదు. సూర్యుడు జ్ఞానానికి ప్రతీక. అలాంటి పేరు కలిగినటువంటి మీ పత్రిక, మన పత్రిక, యావత్ ప్రపంచానికి జ్ఞాన జ్యోతిని వెలిగించి అనేక కళలకు నిలయమై ఎంతోమంది ఆణిముత్యాల వంటి పౌరులను పైకి తీసుకొని వచ్చి, ఎంతో మందికి ప్రేరణదాయకమై తెలుగు సాహిత్యంలోని అనేక ప్రక్రియలను సమాజానికి అందించి మట్టిలో మాణిక్యంలాంటి మాలాంటి వాళ్లను కూడా పైకి తీసుకుని వచ్చి సమాజానికి అందించారు. ఇది దేవాలయం లాంటిది‌. అంత గొప్ప పత్రికను ఈ సమాజం ఉపయోగించుకొని దానిలో ఉన్నటువంటి అంశాల ద్వారా జ్ఞాన జ్యోతులు వికసింప చేసుకోవాలి. ఒక వెలిగే జ్యోతి  మరొక జ్యోతిని వెలిగిస్తుంది అన్నట్టుగా మీరు జ్ఞానాన్ని పొంది, ఆ అనంతమైనటువంటి సూర్య ప్రకాశాన్ని మీలో ప్రజ్వలింప చేసుకొని మరొక జ్యోతికి మరొక జ్ఞాన జ్యోతిని వెలిగించాలని కోరుకుంటున్నాను.
          గ్రహణ శక్తి, ధారణ శక్తి కలిగిన అత్యంత ప్రతిభాశాలి అవధాని మలుగు అంజయ్య గారితో ఈనాటి ఇంటర్వ్యూ చాలా ఆసక్తికరంగా సాగింది కదా! ఇందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ ఇంతటితో ఈ ముఖాముఖి ముగిద్దామా? బహుముఖ ప్రజ్ఞాశాలుల పరిచయం కలగడం నాకెంతో సంతోషదాయకం!
ఇంత మంచి అవకాశం కల్పించిన మయూఖ అంతర్జాల ద్వైమాసిక పత్రికా సంపాదకురాలికి అగణిత కృతజ్ఞతలతో

ముఖాముఖి గ్రహీత రంగరాజు పద్మజ

You may also like

Leave a Comment