సర్ సి.ఆర్.రెడ్డిగా ప్రసిద్ధుడైన కట్టమంచి రామలింగారెడ్డి ప్రతిభావంతుడైన కవి,విమర్శకుడు, రాజకీయవేత్త, వక్త, హేతువాది, ఆదర్శవంతుడు. మైసూరు మహారాజా కళాశాల ఆచార్యులుగా,ప్రిన్సిపాల్ గా,తర్వాత సంస్థాన విద్యాశాఖాధికారిగా,ఆంధ్ర విశ్వకళా పరిషత్ అంటే నేటి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వ్యవస్థాపక ఉపకులపతిగా(వి.సి) తన బాధ్యతను నిర్వహించడమే కాకుండా రాజకీయాలలో కూడా పాల్గొని ఎం. ఎల్.సి.గా ఎన్నికై ప్రముఖ రాజకేయవేత్తలతో కూడా సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు.
అన్ని రంగాలలో తన ప్రతిభను చాటుకున్న ఆచార్య సి.ఆర్.రెడ్డి గారు డిసెంబర్ 10 వ తేదీ 1880 సంవత్సరంలో చిత్తూరు జిల్లా కట్టమంచిలో సుబ్రహ్మణ్య రెడ్డి,నారాయణమ్మ దంపతులకు మూడో సంతానంగా జన్మించాడు.ఐదో ఏటనే వీధిబడిలో విద్యను ప్రారంభించి చిన్నవయసులోనే భారతం,అమరకోశం,రామాయణాన్ని చదివాడు.ప్రతి పరీక్షలో ఉన్నతశ్రేణిలో పాసయ్యాడు.మద్రాసు క్రైస్తవ కళాశాలలో ఉన్నతవిద్యను పూర్తిచేశాడు.1902 లో బి.ఏ.పరీక్ష లో చరిత్ర,తత్వ శాస్త్రంలో అత్యధిక మార్కులతో బంగారు పతకాలను సాధించాడు.
1899 సంవత్సరంలో నవ్య కావ్యరచన పోటీలో తన 19వ ఏటనే “ముసలమ్మ మరణం” లఘుకావ్యానికి బహుమతి లభించింది. డిగ్రీలో అత్యధిక మార్కులు సాధించిన కారణంగా భారతప్రభుత్వపు విద్యార్థి వేతనంతో ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న సెయింట్ జాన్స్ కళాశాలలో ప్రవేశం పొంది తెలివితేటలతో సమర్థతను చాటుకుని అనేక పురస్కారాలు అందుకున్నాడు. 1903 సంవత్సరంలో ఇతని ప్రతిభకు, సామర్ధ్యానికి గుర్తింపుగా “రైట్ బహుమతి” లభించింది. ఆంగ్లేయుల మన్ననలు పొందాడు.1905 లో కేంబ్రిడ్జి లిటరరీ క్లబ్ కార్యదర్శిగా ఎన్నికై తన ఉపన్యాసాలతో అందరి మనసులు చూరగొన్నాడు.1906 సంవత్సరంలో ఎమ్.ఏ.పరీక్షలో ప్రథమశ్రేణిలో ప్యాసయ్యాడు.
ఇతని ప్రతిభను గుర్తించి బరోడా సంస్థానాధీశుడు శాయాజీ రావు గైక్వాడ్ తన సంస్థానంలో ఉద్యోగం ఇవ్వదలచి, దానికొరకు వివిధ విశ్వవిద్యాలయాలు సందర్శిచడానికి అమెరికాకు పంపించాడు.పర్యటన పూర్తయ్యాక 1908 సంవత్సరంలో స్వదేశానికి వచ్చి బరోడా కళాశాలలో ఆచార్యునిగా,ఉపాధ్యక్షునిగా ఉద్యోగం చేశాడు కట్టమంచి. తర్వాత మైసూరు మహారాజా కళాశాలలో ఆచార్యునిగా,ప్రిన్సిపాల్ గా, విశ్వవిద్యాలయ రూపకర్తగా,విద్యాశాఖాధికారిగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక్కడ పనిచేసిన 12 సంవత్సరాలలో హరిజనులకు పాఠశాలలో ప్రవేశం కల్పించడానికి చాలా కృషి చేశాడు.విద్యాశాఖాధికారిగా ఉండి “ప్రతి ఊరికి ఒక పాఠశాల” అనే ఉద్యమం ప్రారంభించాడు.1921లో ఆకస్మాత్తుగా పదవికి రాజీనామా చేసి రాజకీయాలలో పాలుపంచుకున్నాడు.
1922 సంవత్సరంలో జరిగిన ఉపఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుండి అత్యధిక మెజార్టీతో శాసనసభకు ఎన్నికైనాడు.కొంతకాలం చిత్తూరు జిల్లా బోర్డ్ చైర్మన్ గా సేవ చేశాడు. తర్వాత ఆంధ్రవిశ్వకళాపరిషత్ మొట్టమొదటి కులపతిగా,తిరిగి అదే విశ్వవిద్యాలయానికి రెండవసారి ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టాడు. ఇలా సి.ఆర్.రెడ్డి అనేక రంగాల్లో సేవలు చేసి తన ప్రతిభను చాటుకున్న మేధావి.
సర్ సి.ఆర్.రెడ్డి వేదం వెంకట రాయశాస్త్రి గారి శిష్యుడు.విశ్వకళా పరిషత్ అధ్యక్షునిగా వున్నప్పుడు గురుదక్షిణగా వేదం వారికి “కళాప్రపూర్ణ” బిరుదును ఇవ్వమని యూనివర్సిటీ వారికి సూచించాడు.సి.ఆర్.రెడ్డి రాసిన గొప్ప విమర్శ గ్రంథం “కవిత్వ తత్త్వ విచారము”.
కట్టమంచి లేఖలు రాయడంలో నేర్పరి.అయితే ఈయన లేఖలు ఎన్నో ఉన్నప్పటికీ ముద్రితమైనవి తక్కువే అని చెప్పాలి. సాహిత్య మిత్రులకు,రాజకీయవేత్తలకు,సన్నిహితులకు ఎన్నో లేఖలు రాశారు కానీ లభ్యమైనవాటిలో,అందులో ముద్రితమైన వాటిలో ఎక్కువ లేఖలు రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మకు రాసినవే అవి కూడా ఆంగ్లభాషలో ఉన్నాయి.
ఈ లేఖల్లో ఆరోగ్యవిషయాలు,కుటుంబ విషయాలు, సి. ఆర్.రెడ్డి ఆలోచనలు మొదలగునవెన్నో చోటుచేసుకున్నాయి.ఒక విషయం గురించి ఆచూకీ తెలుసుకున్నప్పుడు పరిపూర్ణ అవగాహనతో సూచనలు సలహాలు ఇవ్వడం రామలింగారెడ్డి గారి లేఖల్లో కనిపించే ప్రత్యేకలక్షణం.ఆయన వేమనకు సంబంధించి అనేక ఉషయాలను సూచిస్తూ రాళ్లపల్లికి లేఖలు రాశారు.
సి.ఆర్.రెడ్డి రాళ్లపల్లికి రాసిన లేఖలో ఆంధ్ర విశ్వకళాపరిషత్ వారు ఏర్పాటు చేసిన వేమన ప్రత్యేకోపన్యాసాల గురించి ఎందుకు అప్లై చేయలేదని ప్రశ్నించాడు. రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ చేత ఉపన్యాసాలు ఇప్పించాలని ఆయన కోరికగా కనిపిస్తుంది. అందువల్లనే లేఖ రాసి ప్రత్యేకంగా ఉపన్యాసాల కోసం ఎందుకు అప్లై చేసుకోలేదని సూటిగా ప్రశ్నించాడు. ఇదే వి.వి.శర్మ దగ్గర వేమన గురించిన సమాచారం చాలా ఉన్నదని ఎన్నికైన ఉపన్యాసకునికి ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు కూడా శర్మ అంగీకరించాడని తెలిపాడు.
సి.ఆర్.రెడ్డి రాళ్లపల్లికి ఒక సుదీర్ఘమైన రహస్యలేఖను రాశాడు. ఇది చాలా విలువైనది.దీనిలో వేమనకు సంబంధించిన సమాచార సేకరణ ఉంది.
వి.వి.శర్మ. దగ్గర ఉన్న వేమనకు సంబంధించిన విషయాలను తెప్పించుకోమని సలహా ఇచ్చాడు.
బ్రౌన్ ముద్రణలో వేమనకు సంబంధించిన వంగూరి సుబ్బారావు రచనలు,క్రిస్టియన్ కాలేజీ మ్యాగజైన్ లో వచ్చిన వ్యాసం చూడవలసిందని సూచిస్తూ హాస్యగాడు అన్న పదం వేమనకు వాడవద్దని సూచించాడు.
పరిహాసరసం గురించి అధ్యయనం చేయాలని,సాహిత్యంలో పరిహాసరసం ఆవశ్యకత,అవసరం ఎంత వరకున్నదో లోతుగా పరిశీలించాలని రాస్తూ, కాళ్లకూరి గోపాలరావు రచించిన ఆపూర్వ సంఘ సంస్కార గ్రంథపీఠికలో ఈ విషయాన్ని తాను రాసినట్లు సి.ఆర్.రెడ్డి లేఖలో తెలిపారు.
“కవిత్వ తత్వ విచారం” లో సి.ఆర్.రెడ్డి పరిహాసరసం అంటే ఏమిటో రాస్తూ వేమన పద్యాలలో పరిహాసరసం ఉన్నదని రాస్తూనే “మరుగు మరియాదలు లేని మోటు విధముగా దిట్టడు. నొప్పిచెందువారు సైతం ఇతరులతో
కలిసి నవ్వునట్లు చేయ సమర్థుడు” అని వేమనను కొనియాడాడు.
వావిళ్ళ వారు ముద్రించిన గ్రంథంలో రాళ్లపల్లి రాసిన పీఠికను విమర్శిస్తూ
సి.ఆర్.రెడ్డి తన లేఖల్లో ఇలా అంటాడు” నీవు రాసిన పీఠిక బాగున్నప్పటికీ కొద్దిపాటి న్యాయమే
జరిగిందనీ, ఇంకా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని,
వేమన రచనారహస్యాలను వెలికి తీయాల్సిన అవసరం ఉన్నదని విమర్శనాత్మకంగా సూచిస్తూనే
సి.ఆర్.రెడ్డి వేమనపై తనకుగల
అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఇలా చెప్పాడు. “తెలుగు రచయితలలో
వేమన చాలా గొప్ప పండితుడని
వేమన ఒకరిని అనుకరించడు, వేమనను ఇంకొకరు అనుకరించలేరని,వేమన పద్యాలు సహజధోరణిలో సుకుమారమైన శైలి కలిగి సహజత్వాన్ని కలిగి ఉన్నాయని” రాశాడు.
ఈవిధంగా ఈ లేఖలో వేమన గురించి సమగ్ర సమాచారం అందిస్తూనే తనకు అనారోగ్యంగా ఉన్నదని,బెంగళూరుకు ప్రయాణమవుతున్నట్లు తెలుపుతూ, తన ప్రయాణ విషయాన్ని గోప్యంగా ఉంచమని
రాశాడు.ఈ లేఖలో వేమన ఉపన్యాసాలకు రాళ్లపల్లి ఎన్నికైనట్లు కూడా తెలిపాడు. వేమన పద్యాలు ఎంత గొప్పగా ఉన్నాయో వేమనపై రాసే గ్రంథం కూడా అంత గొప్పగా ఉండాలని వేమన రచించాడా అన్న అనుభూతి పొందేటట్లు రాస్తావని తన ఆశాభావం వ్యక్తం చేశాడు. రాళ్లపల్లికి రాసిన ఇంకో లేఖలో వేమన గురించి రాస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలని
హితవు పలికాడు. చుట్టుపక్కల వాళ్ళు చెప్పువాటిని పుక్కిటి పురాణాలను గుడ్డిగా నమ్మక నిజాన్ని పరిశోధించాలి అంటాడు. ‘కటారుపల్లి’ లో వేమన సమాధి ఎదుట లభించే కథలను నమ్మక, మీకు సమ్మతమని తోస్తే “వేమన గాథలు” పేర అనుబంధంలో చేర్చాలని సూచించాడు.
విగ్రహారాధనను,కర్మకాండలను,ఆచారాలను నిరసించిన వేమన సమాధి ఎదుటనే దున్నపోతులను బలి ఇవ్వడమనేది వేమన పట్ల ఇంతకన్నా ఘోర అపచారమేముంటుందని రెడ్డిగారు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు.హిందూ సమాజం దిగజారి కుళ్ళిన అంగంలా తయారైందన్న ఏహ్య భావాన్ని వ్యక్తం చేశాడు.
రాళ్లపల్లికి రాసిన ఇంకో లేఖలో వేమన గురించి తనకు తెలిసిన ఇంకాస్త సమాచారాన్ని అందించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. వంగూరి సుబ్బారావు రాసిన గ్రంథం అత్యంత విలువైనదని సూచించాడు.పోతన వేమనలను పోలుస్తూ లేఖలో ఇలా వివరించాడు. “పోతన బోధకుడుగా నీతిని మాత్రమే బోధించాడని,వేమన అలాకాక సంఘాన్ని,సమాజపరిస్థితులను,
మతాచారాలను, జీవితాలను ఆకళింపు చేసుకుని తన నీతి సూత్రాలను తన రచనలో
నిబంధించి పోతన కంటే ఒక మెట్టెక్కి అసలుసిసలైన నీతిబోధకుడుగా అవతరించాడని రాశాడు. దీన్నిబట్టి
సి.ఆర్.రెడ్డి గారికి వేమన పట్ల ఉన్న గౌరవం,అనురాగం వ్యక్తమౌతుంది.
తంజావూరు లైబ్రరీలో ఉన్న వేమన చిత్రపటమే వంగూరి సుబ్బారావు పుస్తకంలో ఉంది కాబట్టి లైబ్రరీ కార్యదర్శిని సంప్రదించాల్సిన అవసరం లేదని రాశాడు.
ఈ మధ్య కాలంలో జపాన్ భౌతిక శాస్త్రవేత్త పాదరసంలోని ఒక అణువును బంగారం అణువుగా మార్చాడు. శాస్త్రీయాధారమన్నది కాదు సమస్య, నిజంగా దొంగసన్యాసులు “హేమ తారక విద్య” చేయగలుగుతారా లేదా అన్నది సమస్య అని రాశాడు. వేమన రసవాదంపై నీవే నిర్ణయాలు తీసుకోమని చెప్పాడు.
వేమన తెలుగు ప్రజలకే పరిమితం కాలేదన్న విషయం తమిళ కన్నడ ప్రాంత ప్రజలు వేమన చెప్పిన నానుడులు,
సామెతలను వాడుతుండడం బట్టి తెలుస్తుందని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధ్యయనం కొనసాగించాలని సూచించాడు.” వేమన తంజావూరులో చాలా ప్రఖ్యాతి గడించడానికి గల కారణం ” హేమతారక విద్య” పట్ల ప్రజలలో ఉన్న విశ్వాసమేనంటాడు.అయితే వేమన తనకీ విద్య వచ్చునని ఎక్కడా తెల్పనప్పటికీ ప్రజలే వేమనలాంటి యోగులకు కూడా ఈ విద్యనంటగట్టారంటాడు.
సర్ కట్టమంచి ఇంకా ఇలా వివరించాడు.” భూమిపై సంతోషంగా జీవించాలంటే డబ్బు ఎంతో అవసరం” వేమన రచనలో కూడా పేర్కొన్నాడని వ్రాశాడు.
వేమన సమకాలీన సాంఘిక పరిస్థితులను చక్కగా అవగాహన చేసుకోవాలని సలహానిస్తూ ఆనాటి సమాజంలో స్త్రీని ఏవిధంగా చూసేవారో దృష్టిలో పెట్టుకుని స్త్రీ విషయంలో వేమన తీర్పును,వేమన దృష్టిని అధ్యయనం చేయాలని సూచనలిచ్చాడు.నిజంగా ఆనాడు సంఘంలో స్త్రీని చిన్నచూపు చూసేవారని, గ్రంథాల్లో కూడా స్త్రీ పట్ల చిన్నచూపున్నట్లే కనిపిస్తుందని,చారిత్రక దృష్టి కూడా అవసరమని రాశాడు. ఈ లేఖలో వేమన గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు వేమన సమకాలీన సాంఘిక పరిస్థితులు,చారిత్రకనేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సమగ్ర పరిశీలన చేసి చక్కని గ్రంథం వ్రాయాలన్న ఆకాంక్ష కలవాడుగా కనిపిస్తాడు.రాళ్ళపల్లికి రాసిన వేరే లేఖలో వేమనపై రాసిన ఉపన్యాస గ్రంథం పూర్తికావస్తున్నట్లుగా భావిస్తున్నానని రాస్తూ ఆ వ్యాసాలను సాధ్యమైనంత త్వరలో కాకినాడను వేదికగా చేసుకొని ఉపన్యాసాలిప్పించాలన్న కోరికను వ్యక్తం చేశాడు.
ఇంకో లేఖలో” ఉపన్యాస పరంపర గ్రంథం వెలువడడంలో మీరు కృతకృత్యులయ్యారని అభినందనలు తెలుపుతూనే ఇది నాకంత ఆశ్చర్యాన్ని కలిగించలేదంటాడు.దీన్ని బట్టి ఎప్పటికప్పుడు రాళ్ళపల్లి చేసే శ్రమను ,పరిస్థితిని తెలుసుకోవడం వలన, రాళ్ళపల్లి ఈ విషయంలో పూర్తిగా కృతకృత్యుడౌతాడన్న విశ్వాసం ఉండడం వల్ల గ్రంథరూపంలోకి వచ్చాక రామలింగారెడ్డికి పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు.రాళ్ళపల్లి రాసిన “మానిస్క్రిప్టు” లను విశ్వవిద్యాలయానికి బహూకరించమని తన ఉత్తరంలో కట్టమంచి కోరుతాడు.
రాళ్ళపల్లికి రాసిన ఇంకో లేఖలో రాళ్ళపల్లి ” శాలివాహన సప్తశతి” అనువాదాన్ని మెచ్చుకుంటూ భావయుక్తంగా ఉన్నదని,సరళంగా వున్నదని,సుందరంగా వున్నదని,ఆకర్షణీయంగా వున్నదని ప్రస్తుతిస్తూ దాని మూలగ్రంథ రచయిత కాలం,ఇతర వివరాలు తనకు తెలియపరిస్తే పీఠికను వ్రాయడానికి ఇష్టపడుతున్నట్లుగా వ్రాశాడు.అయితే కేవలం 400 పద్యాలే వ్రాసి సంతృప్తిపడక పూర్తి గ్రంథాన్ని )అనువాదం చేయమని కోరాడు.” ఇది సమీక్షాత్మక లేఖ అనవచ్చు.
ఇంకో లేఖలో తన ” కవిత్వ తత్త్వ విచారము” రెండో ముద్రణకు నోచుకుంటున్నట్లు తనకిది ఆశ్చర్యం కలిగిస్తోందని తెలిపాడు.” శాలివాహన సప్తశతి ” పీఠికకోసం రాళ్ళపల్లి సహాయాన్ని అర్థించాడు.
సారస్వత లేఖలతో పాటు కుటుంబ విషయాలకు సంబంధించిన లేఖలున్నాయి.తన కూతురు తన డ్రైవరు భార్యను చూడాలని కుతూహల పడుతున్నట్లుగా తెలపడం వలన సామాన్యులను సైతం గౌరవించే ఉన్నత వ్యక్తిత్వం ,రామలింగారెడ్డి మనస్తత్వం ద్యోతకమౌతుందని తెలుస్తుంది.
“స్వయంవరం” గురించి ప్రత్యేకంగా లేఖలో వివరించాడు.” స్వయంవరం” వల్ల యుద్ధాలు పరిణమిస్తాయని ,ఈ స్వయంవరంలో రాజులు వారిలో వారు కలహించుకుంటున్నప్పుడు వధువు తండ్రి కేవలం ప్రేక్షకునిగా మిగిలిపోతాడని ,స్వయంవరానికి అన్ని రకాల వయసు వాళ్ళు ,బ్రహ్మచారులు,బహుభార్యలు కలిగినవారు పాల్గొని ఆ పెళ్లికుమార్తె తమలో ఎవరిని వరిస్తుందోనని ఉవ్విళ్లూరుతుంటారని,తమను వరిస్తుందో లేదో అన్న అనుమానం కూడా వారికి కలదని రాశాడు.
తాను స్వయంవరం సిద్ధాంతాన్ని ప్రాథమికంగా ప్రాచీన “ఇండో ఇరానియన్ మ్యారేజ్ మార్కెట్” పద్ధతి ననుసరించి రూపొందించామని రాశాడు.ఈ మార్కెట్ లో అందమైన అమ్మాయిలను అమ్మకానికి నిలబెట్టేవారు.దానికి సంబంధించి మన వైదిక సాహిత్యంలో కూడా ఆధారాలు కనిపిస్తున్నాయని రాశాడు.
” స్వయంవరం” గురించి గ్రంథరూపంలో వెలువడితే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.ఈ విధంగా సామాజిక లేఖలు కూడా రాశాడు.
కట్టమంచి రామలింగారెడ్డి కాలంలో కన్యాశుల్కం ఉండేది.ఆడపిల్లలను వేదించడం,స్త్రీలపట్ల అగౌరవంగా వుండటమనేది మనకు పూర్వంనుండి వస్తున్న ఆచారమే.ఈ కాలంలో కూడా అందమైన ఆడపిల్ల వెళుతుంటే ఈలలు వేసి గోలలు చేసి ఏడిపించడం చూస్తున్నాం.అందం అనేది కూడా స్త్రీ జీవితానికి ఆటంకమేనని తెలుస్తుంది.
ఈ విధంగా కట్టమంచి లేఖలను పరిశీలించినట్లయితే వేమనపై సమగ్ర అవగాహన,సరియైన ఆధారాలు కనుగొని సమగ్రంగా వేమనపై గ్రంథం వెలువరింప చేయాలన్న ఆయన ఆసక్తి,మనస్తత్వం,సామాజిక అవగాహన,మొదలైన విషయాలు తెలుస్తాయి.
వేమన అంటే తన కిష్టం కావడం వల్ల వేమనపై గ్రంథం తెలిసినంతవరకు విషయ సేకరణలో సహాయం చేసి ప్రోత్సహించే వాడుగా కనిపిస్తాడు.
కట్టమంచి రామలింగారెడ్డి మద్రాసు గవర్నరుకు లేఖ రాస్తూ,ఆంధ్ర విశ్వ విద్యాలయం ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపాడు.అంతేకాక ఈ ఉత్తరం హృదయవేదనతోను,బాధతోను,విచారంతోను రాస్తున్నట్లు తెలియజేశాడు.
స్వాతంత్య్రం,ప్రజానీకం యొక్కఆర్థికాభివృద్ధి ,బ్రిటిష్ ప్రభుత్వంలో శాశ్వతంగా లభించవన్న విశ్వాసంతోను,స్వజాతీయులు ఆబాలగోపాలం చేస్తున్న త్యాగాలు సి ఆర్.రెడ్డికి మనస్తాపం కలిగించి,ఉపాధ్యక్ష పదవిలో కొనసాగుటకు ఇష్టం లేక రాజకీయాల్లో చేరాలన్న ఆసక్తితో రాజీనామా చేస్తున్నట్లుగా తెలిపాడు.
ఈ విధంగా రామలింగారెడ్డి లేఖల ద్వారా ఆయన మనస్తత్వం ,ఆలోచనా పద్ధతి తెలుసుకునే అవకాశం ఉంది సాహితీవేత్తలలో రామలింగారెడ్డి లేఖలకు కూడా ప్రముఖ స్థానముందని గమనించవచ్చు.
బహుముఖ ప్రజ్ఞాశాలి ,ఆజన్మ బ్రహ్మచారి ,సద్గుణవంతుడు, సాహితీవేత్త,విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు రాజకీయ దురంధరుడైన సర్ సి.ఆర్ రెడ్డి 1951వ సంవత్సరం ఫిబ్రవరి 24 వతేదీ తన 70వ ఏట మద్రాసులో అనారోగ్యంతో తనువు చాలించాడు.