Home వ్యాసాలు బహుముఖ విద్వన్మణి వేదం

బహుముఖ విద్వన్మణి వేదం

by Cheedella Seetha Lakshmi

ప్రముఖులు రాసిన లేఖల్లోని విశేషాలను తెలుసుకునే ధారావాహికలో భాగంగా మనమిప్పుడు ప్రముఖ
సాహితీవేత్త వేదం వేంకటరాయ శాస్త్రి గారి లేఖల ప్రాధాన్యాన్ని తెలుసుకుందాం.
సాహితీవేత్త,బహుగ్రంథకర్త ,ఆంధ్ర విశ్వకళాపరిషత్ ప్రప్రథమ ఉప కులపతి కట్టమంచి రామలింగారెడ్డి గారు(సి.ఆర్.రెడ్డి)
శాస్త్రిగారి గురించి ప్రశంశిస్తూ ఆయన మాటల్లో ఇలా వివరించారు. “వేదం వేంకటరాయ శాస్త్రి గారు గొప్ప సాహితీవేత్త మరియు బహుగ్రంథ కర్త
‘కళాప్రపూర్ణ’ బిరుదానికి అర్హులని చెబుతూ

“ప్రతాపరుద్రీయాది స్వతంత్ర గ్రంథములు వీరి కవితాపరిపాటికిని,
విమర్శన వీరి సునిశితమగు విశేషమునకును,శృంగార నైషధాది వ్యాఖ్యానములును,కథా సరిత్సాగరాది భాషాఅంతరీకరణములను వీరి రసజ్ఞతకును
తార్కాణములు వారు వార్ధక్య దశలో మనః క్లేశము,దేహక్లేశములకు వెనుదీయక ఆముక్తమాల్యదకు సమగ్రమగు మహా వ్యాఖ్యానమును వీరు
ఇటీవలే రచించి ప్రచురించుట చూడగా
భాషా కృషి వీరికి కర్తవ్యముగానే గాక స్వభావము కూడా అని స్పష్టమగుచున్నది” అని రాశారు.

ఈ మాటల బట్టి చూడగా శాస్త్రి గారి రచనాసక్తి,సాహిత్య
తృష్ణ,వయసు సైతం లెక్కచేయని ఆయాన తెలుగు భాషా సేవ బహుధా ప్రశంసనీయం,చిరస్మరణీయం.

తెలుగు సాహిత్యంలో బహుముఖ ప్రజ్ఞను చూపి నాటక రచనలో పాత్రోచిత భాషను ప్రయోగించి తనదైన ప్రత్యేక ముద్రను వేసి కీర్తి గడించిన విద్వన్మణి వేదం వెంకటరాయ శాస్త్రి.

విమర్శకుడు,నాటకకర్త,,వ్యాఖ్యారచయిత,పరిశోధకుడు,పరిష్కర్త,అనువాదకుడు ,ముద్రాపకుడైన వేదం వారి ప్రతిభకు తార్కాణంగా అనేక బిరుదులు,సత్కారాలు ఆయన ఖాతాలో వచ్చి చేరాయి.

మహామహోపాధ్యాయ,కళాప్రపూర్ణ వేదం వేంకటరాయ శాస్త్రి గారు వేంకట లక్ష్మణ శాస్త్రి,లక్ష్మమ్మ దంపతులకు 1853 డిసెంబర్ 21 వ తేదీన మద్రాసులో జన్మించారు.సంస్కృతం,ఆంగ్ల భాషల్లో పట్టభద్రుడు వివిధ ప్రక్రియల్లో తనవంతు కృషి చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహనీయుడు వేదం.
వేదం వారు ఆర్ధిక దురవస్థకు గురైన సమయంలో ఔదార్యవంతుడు, తనంటే అభిమానురాగాలు చూపే వెంకటగిరి మహారాజాగారికి తన మనోరథాన్ని తెలుపుతూ ఒక సుదీర్ఘ లేఖ రాశారు.

కుటుంబభారం కోసం ధనం సరిపోక సంపాదనార్ధం ధనాపేక్ష కలిగి ” విక్రమార్కాది పురాతన రాజర్షి చరిత్రాభిమానిత చేతను తచ్చరిత్ర పుస్తకములను
సంస్కరించి సటిప్పణ ములనుగా ముద్రించితిని. ఇట్టి ఉద్యమము వలన ముందున్న లేనికి తోడు ఋణములు సైతము
సంభవించినవి….
కొంత అపు తీర్చుటకై
జ్యోతిష్మతీ ముద్రాక్షర శాల లోని సామగ్రి విక్రయం చేత తీర్చి,శిష్టఋణమును నా జీవితము వలననే. తీర్చుచుంటిని”.
అని బాధను వెల్లడించారు. ఆర్ధిక సమస్యలు,అప్పులో ఉన్నా అప్పు తీర్చడం కోసం ఆయన పడే పాట్లు పురాతన రాజర్షి
చరిత్రపై వేదం వారికి ఉన్న అభిమానం కొద్దీ
టిప్పణాలు రాసి ముద్రించడం. శాస్త్రిగారి మనోభావాలు లేఖలో తొంగి చూస్తున్నాయి.

ఎన్ని సమస్యలున్నా కూడా,ఎన్ని ఆర్థిక బాధలనుభవిస్తున్నప్పటికీ సాహిత్యకృషిలో
మాత్రం శ్రద్ధ తగ్గలేదు.
ఆయన మాటల్లోనే,” సంస్కృత నాటకములను
పెక్కింటిని శాకుంతల,మాలతీమాధవ,

మహావీరచరిత్రోత్తర రామచరిత్రాదులను మూల విరుద్దార్థముగా నాంధ్రీ కృతములైనట్టి వానిని–వాస్తవార్థబోధకముగా వ్యాఖ్యాసమేతముగా –ప్రకటింపవలసియున్నది—వ్యుత్పత్తులనొసంగునట్టి నిఘంటువొకటి నిర్మించవలసియున్నది.శ్రీమదాంధ్ర మహాభాగవతమును సాధుపాఠ నిర్ణయ పూర్వకముగాను గూఢార్థ బోధన పూర్వకంగాను ప్రకటింపవల్సియున్నది.శిశుపాలవధాది కావ్యములను సంస్కృతాంధ్ర వ్యాఖ్యానాంధ్ర టీకా సమేతముగా ముద్రింపవలయును.

మహావీరచరిత్రోత్తర రామచరిత్రాదులను మూల విరుద్దార్థముగా నాంధ్రీ కృతములైనట్టి వానిని–వాస్తవార్థబోధకముగా వ్యాఖ్యాసమేతముగా –ప్రకటింపవలసియున్నది—వ్యుత్పత్తులనొసంగునట్టి నిఘంటువొకటి నిర్మించవలసియున్నది.శ్రీమదాంధ్ర మహాభాగవతమును సాధుపాఠ నిర్ణయ పూర్వకముగాను గూఢార్థ బోధన పూర్వకంగాను ప్రకటింపవల్సియున్నది– ఎల్లవారికిం బఠనీయముగా సకల నాటక కథావళి రచింపవలసియున్నది.శిశుపాలవధాది కావ్యములను సంస్కృతాంధ్ర టీకా సమేతముగా ముద్రింపవలయును. అమరకోశమునకు ఆంధ్రగీర్వాణ మయమైన సుబోధవ్యాఖ్య రచింపవలయును.కాశీఖండ సోమ హరివంశ పాండురంగ మహాత్మ్యాది దివ్యప్రబంధములను విషయ పద టీకలతో ముద్రితములంజేయవలయును.” అని చెప్పుకోవడంలో సాహిత్య సేవకై ఆయన తపన,ఆరాటం తెలుస్తుంది.నిరంతర శ్రమ చేసి ఏదో రాయాలని,ముద్రించాలని తహతహలాడేవారు.వేదం వారి వ్యక్తిత్వం,తెలుగు భాషా సాహిత్యం కోసం ఆయన పడ్డ శ్రమ,ఆందోళనను మహారాజుకు తన మనసు విప్పి చెప్పుకునే తీరు,మహారాజుతో ఈయనకు గల సాన్నిహిత్యాన్ని ఋజువు చేస్తుందీ లేఖ.” నా వ్యాపారము ప్రకృతమున నదీ మాతృకమయిన సుకృషి సుక్షేత్రము విత్తనము లేక చల్లకము మానినందున కంపతంపర మయిన రీతింబొందియున్నది.” నీటి వసతి ఉన్న నల్లనిమట్టి కలిగి చక్కని పండే భూమి వున్నప్పటికీ విత్తనాలు చల్లకపోతే కంపపెరిగి బీడు భూమిగా ఎట్లా అవుతుందో తన వ్యాపారం కూడా క్షీణించిందని తెలుపుతూ నాకు నిరంతరము ఏకాశ్రయులు,రాజవారేనని తన మనసులో ఉన్న విషయాన్ని బాధను వ్యక్తం చేసి రాజా వారి సహాయాన్ని అర్థించిన సాహిత్య పిపాసి.అరమరికలు లేకుండా తన మనోవ్యధను రాజవారికి తేటతెల్లం చేశారీలేఖలో.
ఈ లేఖ ద్వారా మనకు కూడా ఏదైనా పనిని చేయాలన్న తపన,దానికి తగ్గ శ్రమ ఎట్లా ఉండాలో సూచించినట్టుంది.

వేంకటరాయశాస్త్రి గారు నాగానందం నాటకాన్ని ఒక కొత్త మార్గంలో రచించారు.సంస్కృత నాటక మర్యాదలననుసరించి సంస్కృత భాష వుండేచోట సలక్షణ భాషను,ప్రాకృతాది భాషా భేదం వుండేచోట తెలుగు గ్రామ్య భేదాన్ని అంటే పాత్రోచితభాషను ప్రయోగించి అనువాదం చేశారు.” ఆంధ్ర భాషలో పాత్రోచిత భాషలో రచింపబడిన మొట్టమొదటి నాటకము నాగనందమే” కొత్తమార్గాన్ని కొందరు సహృదయులు ఆమోదించారు.వడ్డాది సుబ్బరాయ కవి శాస్త్రుల వారికి వ్రాసిన లేఖలో ” నీచ పాత్రములకు తెలుగు నాటకముల యందు దమరు చూపిన దారి నామట్టు కాదరణీయముగానే తోచుచున్నది.మఱియు దాని వలన ననేక లాభములున్నట్లు నేను దలంచుచున్నాడను.గ్రామ్యములేవో యగ్రామ్యములేవో యెఱుంగని వారలనేకులుందురు గాన వారిని గ్రామ్యములివి యాగ్రామ్యములివని తెలిసికొనుటకు వీలు కలుగుచున్నది.మఱియు వాడుక ప్రకారము అట్టి గ్రామ్యరూపములు వ్రాయుట కష్టమే.నాకు జూడ దన్నాటకము బహు రసవంతముగా నున్నది.” అని తన అభిప్రాయాన్ని లేఖాముఖంగా వెల్లడించారు.

ప్రతాపరుద్రీయము నాటకాన్ని రచించారు.పూండ్ల రామకృష్ణయ్య గారు లేఖ వ్రాస్తూ వెలగల యశస్సును తెచ్చి పెడుతుందని అచ్చునకివ్వమని ప్రోత్సహిస్తూ
“తాటాకు చప్పుళ్లను మీరు లక్ష్యము చేయకుడు” ఎవరెన్ని పోకడలు పోయినా లక్ష్యపెట్టవద్దని,విమర్శనలనెదుర్కోవాలని హితవు చెప్పి వెన్నుతట్టారు.

‘జక్కన విక్రమార్కచరిత్ర’ ముద్రణానంతరము అనేక ఆక్షేపణల నెదుర్కొన్నారు.” అన్ని పద్యములును అన్యాపదేశముగా వ్రాసి నిందించినారు.వానిలో తెలుగు భాషలో బాండిత్యము లేదని సూచింపబడియున్నది.మీరు సంస్కృత పండితులే గాని యాంధ్ర పండితులు గారట” అని రామకృష్ణయ్య గారి లేఖలో తెలిపారు.ఆనాడు కూడా ఓర్వలేనివారు ఏదో పేరు పెట్టి విమర్శించే వారని తెలుస్తుంది.అట్లాంటి వాటిని లెక్క చేయక దైర్యంగా ముందుకు పోతేనే అభ్యుదయం.జంకకుడు,వెనుకంజ వేయకుడు ” అంటూ సవ్యసాచిగా ఇప్పుడుండవలెనని ప్రోత్సహించారు రామకృష్ణయ్య గారు.నాడైనా,నేడైనా మంచి పని చేస్తున్నప్పుడు యేడ్చెవాళ్లు,వెనక్కి కాలు గుంజే వాళ్ళుంటారని తెలుస్తుంది.

ఆనాడు పూండ్ల రామకృష్ణయ్య గారికి వేదం వారికి గల మైత్రీబంధం,వెన్నుతట్టి వేదం వారిని ప్రోత్సహించే పధ్ధతి లేఖల ద్వారా స్పష్టమౌతుంది.

వేదం వారిపై గురజాడ అప్పారావు గారి అభిప్రాయం లేఖల ద్వారా తెలుస్తుంది.

ఏదైనా విషయాన్ని తీసుకుని చర్చ మొదలెడితే దాన్ని ఆమూలాగ్రం చర్చించే స్వభావం వేదం వారిదని ప్రస్తుతించారు అప్పారావుగారు.అదే ఆనాటి పండితులలో కన్పించదంటారు. జీవితంలో కల్సిపోయిన మన సంప్రదాయాలను,అలవాట్లను,ఒక్కసారిగా మార్చుకోవడం సులభం కాకపోయినప్పటికీ
” మీలాంటి నిజమైన తాత్వికవేత్తలు మీకున్న అనుభవసారం,సాహిత్య శక్తితో ఒక కొత్త సాహిత్య ప్రక్రియకు నూతన మార్గాలు కనిపెట్టి, నూతన పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసి స్తంభించిపోయిన సాహిత్యాన్ని రక్షించగలరు” అని పెద్ద భారాన్ని గురజాడ వేదం వారిపై మోపారు.
వేదం వారి శైలిని గురించి విమర్శిస్తూ వ్యాకరణము,శైలి అంతా పూర్వకవుల పంథా లోనే సాగుతుంది మీ పద్యరచన అని అంటారు.

వీరేశలింగం పంతులు, వారి అనుచరులు. సాహిత్యపరంగా గ్రాంధికభాషకు అలవాటు పడిపోయి
మాట్లాడే మాండలిక పదాలను కూడా సీరియస్ గా సాహిత్యధోరణిలో రాస్తేనే అది అగౌరవంగానూ హాస్యాస్పదంగానూ ఉండదా!! వీరేశలింగం ఆధ్వర్యంలో ఉన్న ఈ పద్ధతి పట్ల (గద్యరచన) వేదం వారి అభిప్రాయాన్ని కోరుతూ లేఖలో పేర్కొన్నారు.

‘శృంగార నైషధ వ్యాఖ్య’ పై కూడా అభిప్రాయాన్ని తెలుపుతూ అప్పారావు గారు లేఖలో తెలుగు సాహిత్య విద్యార్థులకు
అమూల్యమైనదని,
తెలుగులో సగటు విద్యావేత్తలు ఎవరూ దానిని అర్థం చేసుకోలేరని,ఇప్పుడు మీరు చేయని చేయలేని గొప్ప కార్యాన్ని చేశారని ప్రస్తుతించారు. వేదం వారు యూనివర్సిటీ లో పరీక్షాధికారిగా ‘తెలుగు విభాగానికి’ నియుక్తులయ్యారు. పూండ్ల రామకృష్ణయ్య గారు ఈ విషయమై
లేఖ రాస్తూ “యీ మహాయుద్ధములో మిమ్మునాంధ్రముకే ఏర్పాటు చేయుట కొంత సుగుణమనియు విమతులకు శృంగభంగమనియు తలచెద.ఇక మాకందరికీ తమరు ‘ఎగ్జామినరగుట’ బ్రహ్మానందముగా నున్నది” అనడం వలన
ఆ కాలం నాటి సమాజపరిస్థితి కొంత అర్థం చేసుకోవచ్చు. ఒకరిపై ఒకరికి పడరానివారున్నారనీ,అడ్డుపుల్లలు వేసేవారని,కుయుక్తులు చేసేవారికి శాస్త్రి గారి పరీక్షాధికారి నియామకం వలన శృంగభంగమైందని తెలుస్తోంది.ఈ కాలంలో వలెనే ఆకాలంలో కూడా కుట్రదారులు,
కుళ్ళుపోతులు ఉండేవారని స్పష్టం.

‘ఆంధ్రభాషాభిమాని సమాజానికి’ అధ్యక్షునిగా ఉండి నీతిమంతంగా ప్రవర్తించి డబ్బు విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండేవారని శాస్త్రి గారి ప్రవర్తన,గుణశీలాదులు
లేఖల ద్వారా తెలుస్తాయి.

ఈ విధంగా ప్రముఖుల చేత కూడా మన్నలను పొందిన ఉన్నత కవి వతంసులు,
బహుముఖ ప్రజ్ఞాశాలి,’పాత్రోచిత భాష’కు ఒక కొత్త ఒరవడి చేకూర్చి తెలుగు సాహిత్యవనంలో గుబాళించిన పుష్పం శ్రీ
వేదం వెంకటరాయ శాస్త్రి గారు అని ఆయన లేఖల ద్వారా విశదమౌతుంది.

బహుముఖ విద్వన్మణి వేదం వేంకటరాయ శాస్త్రి గారు తెలుగు సాహిత్య సేవలో తరించి తన 76 వ ఏట1929వ సంవత్సరం జూన్ 18 వ తేదీన మద్రాసులోనే తుది శ్వాస విడిచారు.

మహా మహోపాధ్యాయుని జయంతి సందర్బంగా దివ్యస్మృతికి నివాళులర్పిస్తూ…

డా.చీదెళ్ళ సీతాలక్ష్మి.

You may also like

Leave a Comment