Home వ్యాసాలు బిడ్డా.. నువ్వు గెలవాలి! – సమీక్ష

బిడ్డా.. నువ్వు గెలవాలి! – సమీక్ష

by mudigonda Santhosh

కొలిమి సాహిత్య సాంస్కృతిక వేదిక లో ఫిభ్రవరి 2021 సంచికలో అచ్చు అయిన వేణు నక్షత్రం రచన  “బిడ్డా నువ్వు గెలవాలి! “ కథ పై సంతోష్ ముదికొండ  సమీక్ష

కరోనా సమయంలో మధ్య తరగతి జీవితాలు, కొడుకులు లేని తండ్రి చనిపోతే , ఆ తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఆ కూతురు పడ్డ వేదన, చేసిన పోరాటం, ఈ  రెండు సందర్భాలను కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తూ, తన ప్రతి కథలో  ఒక సామాజిక అంశాన్ని సృజించే వేణు నక్షత్రం  ఈ కథలో స్త్రీలు సాంప్రాదాయం ముసుగులో  అనాదిగా  కోల్పోతున్న ఇంకొక హక్కుని గుర్తు చేస్తూ, స్త్రీలలో పోరాట పటిమని తట్టి లేపిన కథాంశమే  “వేణు నక్షత్రం” కలం నుండి వెలువడ్డ “బిడ్డా నువ్వు గెలవాలి”.

నారాయణ ఒక మధ్యతరగతి గృహస్తుడు. అందరిలాగే తాను పిల్లలను పెంచి పోషించాడు. కాకపొతే ఆయనకు ఉన్నది ఇద్దరూ ఆడపిల్లలే కవిత,సవిత.  అయినా ఆయన ఏలోటు లేకుండా మగ పిల్లలలాగే వాళ్ళను పెంచాడు. పెద్దగా చదువుకున్న వాడు కాకపోయినా, అధర్షభావాలు ఉన్నవాడు కాబట్టి మంచి చదువులు చదివించి ఆడపిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా వారిని తీర్చిదిద్దారు. అంత బాగానే ఉంది కాని నారాయణకు ఒక దిగులు ఉంది. నిజానికి నారాయణ దిగులు కోట్ల ప్రజానీకానికి ఉంది. నారాయణ లాంటి వారు సమాజం లో అడుగడుక్కు తారసపడతారు. ఉన్నంతలో బాగానే బతుకుతున్నాడు.   కాస్త ఆర్థిక పరిస్థితి చతికిల బడ్డా ఆడంబరాలు లేకపోయినా అన్నానికి కొదవలేదు.

మరి ఈ దిగులు దేనికి?  ఆయన దిగులు బతుకు గురించి కాదు ఆ మాటకొస్తే అసలు బతికున్న రోజుల గురించి కాదు మరణించాక జరిగే తంతు కోసం దిగులు. ఎందుకు అది అంటే ఉన్నది ఇద్దరు ఆడ పిల్లలు. అనాదిగా సమాజం కొడుక్కు తలకొరివి పెట్టె హక్కు ఇచ్చింది కానీ ఆడపిల్లకు కాదు. . ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా వ్యథను అనుభవిస్తారు. మానసికంగా ఎంతగానో కృంగిపోతారు ఈ విషయంలో.  కొడుకు ఎంత దుర్మార్గుడు అయినా  తల కొరివి పెట్టాలి అనే ఒకే ఒక నియమం కోసం వాళ్ళు పెట్టె కష్టాలు అనుభవిస్తూ చావుకోసం ఎదురుచూస్తుంటారు. కానీ ఎదిరించి మాట్లాడలేని దయనియమైన స్థితి వారిది.  ఇంకా చెప్పాలంటే, ఎప్పుడు ఎలాంటి సహాయం చేయని,  ఎవరో దూరపు బందువుల మగ  పిల్లలలకు తలకొరివి పట్టే  అవకాశం ఉంటుంది కానీ ఏందో ప్రేమగా చూసుకున్న స్వంత కూతుర్లకి ఆ అవకాశం లేదు మన సంప్రాదాయంలో.    చచ్చాక తప్పించే పున్నామ నరకం కోసం బతికుండగా నరకాన్ని అనుభిస్తున్న తల్లిదండ్రులు కోకొల్లలు. చనిపోయిన తండ్రి కి తలకొరివి ఎవరు పెట్టాలి అని చర్చ జరగడం, కవితకి తాను తండ్రికి ఇచ్చిన మాట గుర్తురావడం. ఆ విషయం తెలిసిన కులపెద్దతో సహా అక్కడి పెద్దవాళ్ళు అదేదో పెద్ద అపరాధం అన్నట్టు గోల చేయడం. వాళ్లంతా  సంప్రదాయాలకు బానిసలు అయిన వాళ్ళు. కానీ చదువుకున్న తన మరిది వదినకు ఎంతో గౌరవం ఇచ్చే వాడు కూడా దాన్ని వ్యతిరేకించి మాట్లాడడం, అరవడం కవిత జీర్ణించుకోలేకపోయింది.  తన తండ్రి చివరి కోరిక తీర్చాలి అనే పట్టుదల ఆమెలో బలంగా ఉంది. ఆనాడు తండ్రి మాట తీసుకున్ననాడు తనకు తెలియదు ఈ విషయం లో ఇంత గొడవ జరుగుతుంది అని,  అయినా  తాను గెలవాలి.  ఓడిపోయి ఎలాంటి ఒత్తిడులకు లొంగిపోవద్దు అని గట్టిగా నిర్ణయించుకుంది.   ఆడది మగాడికి సంసారం మోసి పిల్లలను కని వంశాన్ని వృద్ధి చేయడానికి అందరికి అన్ని సేవలు చేయడానికి  పనికొస్తుంది. ఆడదాని సంపాదన మీద కూడా మగాళ్లు బతకవచ్చు కానీ ఆడది అంతిమ సంస్కరం చేయడానికి పనికి రాదా అని సూటిగా సమాజాన్ని కడిగేస్తుంది.  ఈ విషయం లో అవసరమైతే కోర్టుకి కూడా వెళ్తా అనే తెగువ చూపించడం అభినందించాలి.  కవితలో వచ్చిన చైతన్యం సమాజం లో రావాలి. ఆడది తనను తాను నిలబెట్టుకోడానికి తానే పోరాడాలి.  కవిత భర్తకి ఆమెను సమర్ధించాలని ఉన్నా పెద్దల మాట కుల ఆచారాలు అతన్ని మాట్లాడనివ్వవు.

తాగడం అనేది సంస్కృతిలోభాగంగా అయింది అనాలా మనం అలా భాగం చేసామా  అనాలా ఏదైనా మనం చేసుకున్నది ఎక్కువ.  కథలో ఈ మద్యం ప్రస్తావన లేకపోయినా, దాన్ని తప్పించి రాసినా కథ కి లోటు ఉండేది కాదు. అది రాయడం వల్ల దాన్ని జీవితంలో భాగంగా మనంఒప్పుకుంటున్నట్టు అవుతుందేమో ఆలోచించాలి.  సాహిత్యం జీవితాల్ని ప్రభావితం చేస్తుంది.  ఇలాంటి నెగెటివ్ కోణాలు కథకులు కథల్లో చొప్పించ కుండా ఉంటే బాగుంటుంది.

కూతుళ్ళను కర్మ చేయమని అడగడం మార్పు, అది రావాలి లోకంలో కొడుకైన కూతురైన ఒకటే అనేది. వేసెక్టామి కూడా నారాయణ  చేయించు కోవడం కూడా కొత్త కోణం.  నిజానికి మగవాల్లే చేయించుకోవాలి కానీ సాధారణంగా ఆడవాళ్లకు  చేయిస్తారు. వారి ఆరోగ్యం రీత్యా అదికరెక్టు కాదు.

కరోన పరిస్థితుల్లో నిజానికి చాలా మంది ఎన్నో సమస్యలు  ఎదురుకున్నారు.  హాస్పిటల్ మూత పడడం, ఎలాంటి ఇతర జబ్బులున్న వ్యక్తులను కూడా కరోనా పేషంట్ లాగానే ట్రీట్ చెయ్యడం,  ఎక్కువ డబ్బులు లాగడం, లాంటి ఎన్నో  ఇబ్బందులు పడ్డారు అందరూ కథలో నారాయణ కుటుంబం లాగా.  కరోన వచ్చిన వాళ్ళది ఒక రకం బాధ అయితే రాని వాళ్ళది మరో రకం బాధ.  హాస్పిటల్ వాడు, ఆటో వాడు ప్రవర్తించిన తీరు మనకు నిర్దయగా  ఆటోవాళ్ళ డబ్బు గుంజే వ్యవహారం,  అంత ఆపద వచ్చిన కుటుంబానికి సాటి మనిషిగా సహాయం చేయాల్సింది పోయి ఇంకా ఎక్కువ డబ్బులకోసం పీక్కు తినడం చాలా బాధాకరం.

అమ్మాయి ఇంటి పేరు మారడం ఒక సమస్య, ఒక వంశం వాళ్ళు ఇంకో వశం వారికి కర్మ కాండలు  చేయరాదు అనడం ఇవన్నీ అడ్డంకులు.   కవిత తీసుకున్న నిర్ణయం హర్షించదగింది.  ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  అంతిమ సంస్కారం బిడ్డలెవరయినా చేయొచ్చు అనే సంప్రదాయం  మారాలి.  ఎప్పుడు అండగా ఉండని వారు ఆంక్షలు విధించడానికి తయారూ అవుతారు.

స్త్రీ సాధికారత, సమానత్వం పరంగా రావలసిన కథల్లో ఒక మంచి కథ ఇది.   ఆత్మ విశ్వాసం నింపే కథలు అవసరం అబలగా కాకుండా ఆదిశక్తి గా స్త్రీ లను చూపించి సమాజం లోని స్త్రీ లకు మార్గదర్శకత్వం అందించాలి ఇలాంటి కథలు . చక్కని కథ.

నక్షత్రం వేణు గారు మంచి కథకుడు. ‘మౌనసాక్షి’ వీరి మొదటి కథా  సంపుటి, ఇప్పుడు “అరుగు” పేరుతొ రెండవ కథా  సంపుటి  సిద్ధం చేస్తున్నాడు.  తన పుట్టిన గడ్డకు దూరంగా ఉంటున్నా,  తన మాతృభాషను మరిచిపోలేదు.   తన మూలాలను   వదులుకోలేదు.  తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ  ఆ మమకారాన్ని పెనవేసుకునే ఉన్నారు. ఒక రచయితగా ఎదిగి, చుట్టూ ఉన్న సమాజం లో తారసపడే సంఘటనలు విషయాలు అక్షరికరిస్తూ  ఒక చైతన్యానికి దోహదం చేస్తున్నారు.  ఆధునిక భావజాలం,  ఆధునిక అంశాలతో మంచి శైలి తో వీరి కథలు ఆకట్టుకుంటున్నాయి,  ఆలోచింపజేస్తున్నాయి. ఒక మంచి కథను అందించిన వీరికి ధన్యవాదాలు.

వేణు నక్షత్రం అమెరికాలోని  వాషింగ్టన్ డి.సి లో గత రెండు దశాబ్దాలకు పైగా స్థిరపడిన రచయిత, దర్శకుడు మరియు నిర్మాత.  కథ తో పాటు పాట, మాట, చిన్నసినిమా ఇలా వివిధ అంశాల్లో వీరికి ప్రావీణ్యం ఉంది.   సాఫ్ట్ వేర్ రంగంలో  ప్రధాన వృత్తిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రవృత్తి గా కథా రచన, సినిమా, టీవీ రంగాన్ని ఎంచుకొని  పెద్ద సినిమాలకు ఏ మాత్రం తగ్గని పూర్తి హంగులతో మనసుకు హత్తుకునేట్టుగా నిర్మించి, దర్శకత్వం వహించిన సినిమాలు  ఎంతెంతదూరం, అవతలివైపు, పిలుపు, మై డాడ్. తనతో పనిచేసిన వారి టాలెంట్ ను ప్రోత్సహిస్తూ ప్రొడ్యూసర్ గా నిర్మించిన లఘు చిత్రం ఎక్స్చేంజ్,  కాక్టైల్ డైరీస్ అనే ఎనిమిది ఎపిసోడ్ ల వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో పలువురు ప్రేక్షకులని అలరిస్తున్నాయి. లఘు చిత్రాలు ఈ యూట్యూబ్ లింక్ లో చూడొచ్చు. https://youtu.be/S717rCUReoc

సిద్దిపేటలో 90వ దశకంలో మంజీరా రచయితల సంఘం స్పూర్తితో, కాలేజీ రోజుల నుండే రాయడం అలవాటు చేసుకున్నవేణు నక్షత్రం తొలి కథా సంపుటి ‘మౌనసాక్షి’. వేణు రెండవ కథా సంపుటి “అరుగు” అతి త్వరలో మన ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేణు నక్షత్రం రాసిన మొట్ట మొదటి నవల “శ్రీగీతం-Faction, Love, Romance – Ceded to Nizam” అనే  ట్యాగ్  లైన్ తో  అతి త్వరలో వెలువడనుంది.  వేణు నక్షత్రం కొన్ని పాటలను కూడా రాసాడు, కానీ కథకుడుగానే కొనసాగుతున్నాడు. వేణు నక్షత్రం రాసిన చందమామ పాట ఇటీవల యూట్యూబ్ లో విడుదల చేసిన సందర్బంగా చాలా మంది ప్రశంసించారు. ఈ పాటను యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు. https://youtu.be/TbRD8RLDC0U

 

పూర్తి కథను  కథలలో చూడగలరు.

 

You may also like

Leave a Comment