కవి,చిత్రకారుడు,కళ్యాణం శ్రీనివాస్ కలం నుండి జాలువారిన పిడికిలి కవితా సంపుటి పై పుస్తక సమీక్ష.ఈ కవితా సంపుటిని మే 1998 సంవత్సరంలో ప్రచురించారు.కవి శ్రీనివాస్ తాను స్వయంగా చిత్రకారుడు కాబట్టి పుస్తకానికి తానే ముఖ చిత్రాన్ని చేకూర్చుకున్నారు.ఈ కవితా సంపుటిని తనకు కళాశాలలో తెలుగు బోధించిన ఎ. గజేందర్ రెడ్డికి అంకితం ఇచ్చి గురువు ఋణం తీర్చుకున్నాడు.ఈ పిడికిలి శ్రీనివాస్ రచించిన రెండవ కవితా సంపుటి.డాక్టర్ సి.నారాయణ రెడ్డి ముందు మాటలో ఎత్తిన పిడికిలి ప్రతిఘటన చైతన్యానికి చిహ్నం అని. కళ్యాణం శ్రీనివాస్ కవితా సంపుటి పేరు “పిడికిలి’.ముఖ చిత్రంలో ఉన్నది పిడికిలే.పిడికిలి ఎలా రూపొందుతుందో “చర్య” అనే కవితలో శ్రీనివాస్ సునిశితంగా చెప్పాడు.”నమ్మొద్దు” అనే శీర్షికతో రాజకీయులకు సంబంధించిన నిష్టుర సత్యాన్ని చెప్పాడు.శ్రీనివాస్ కవితల్లో ఆవేదన ఉంది.అంతకు మించిన ఆందోళన ఉంది.సామాజిక చిత్రాన్ని ఏ రంగుల పులుముడు లేకుండా నలుపు తెలుపుల్లో గీసి చూపాడు.శ్రీనివాస్ కవితలకు తగ్గ బొమ్మలు తానే చిత్రించాడు.శ్రీనివాస్ కవితల్లోని పదునుకు నా ఆశీరాభినందన అని సి నారాయణ రెడ్డి అన్నారు.ఎ.గజేందర్ రెడ్డి ముందు మాటలో కళ్యాణం శ్రీనివాస్ కొద్ది కాలం క్రితం నా విద్యార్థి. అచిర కాలంలోనే ఆత్మీయుడైనాడు.ఈ కావ్యాన్ని అంకితమిస్తానన్నప్పుడు ఆశ్చర్యం,ఆనందం కలిగాయి.ఊహించని సంఘటన ఇది.విద్యార్థులకు సత్సంబంధాలు విలుప్తమవుతున్న ఈ రోజుల్లో సహృదయుడైన ఒక విద్యార్థి రాసిన కావ్యాన్ని అంకితం గైకొనడం మరిచిపోలేని మనోహర దృశ్యం.సామాజిక దృక్పధం గల కావ్యాన్ని అంత సమర్థవంతంగా రాయగలడని ఈ పిడికిలి నిరూపించింది.అతనికి నా ఆశీస్సులు అని అన్నారు.డాక్టర్ జి.లక్ష్మణ్ రావు ముందు మాటలో శ్రీనివాస్ కవీ,చిత్రకారుడు,ఒక బాపు,ఒక అలిశెట్టి ప్రభాకర్ ల ఒరవడిలో స్వీయ కవితలకు స్వీయ రేఖా చిత్రాలు గీసి అత్యాధునిక వైఖరిలో పిడికిలి బిగించాడు శ్రీనివాస్ అన్నారు.ఆ పై అభినందిస్తూ, ఆశీస్సులు అంద జేశారు.చేతి వేళ్ళను బొటన వేలితో సహా ముడుచుకొని ఉన్న ముష్టిని పిడికిలి అంటారు.సాధారణంగా రాజకీయ రంగంలో నాయకులు పదవుల కోసం పోట్లాడే సమయంలో అంతర్గత కలహాలు, కుమ్ములాటలు,ముష్టి యుద్ధాలు జరుగుతాయి.పిడికిలి అనేది తిరుగుబాటు,ప్రతిఘటన మరియు ఐక్యతకు చిహ్నం.పిడికిలి కవితా సంపుటి యాభై ఒక్క కవితలతో అలరారుతూ ఉంది.పిడికిలి కవితా సంపుటిలో నలుబది ఆరు మినీ కవితలతో పాటు మిగతా ఐదు కవితలు కాస్త పెద్దవిగా ఉన్నాయి. కవితలన్ని భావస్ఫోరకంగా,పాఠకుల హృదయాలను కదిలించేలా ఉన్నాయి.
కవితలను ఆసక్తితో చదివాను.కవితలలోని భావాలు నా మనస్సుకు నచ్చాయి.నన్ను ఆలోచింపజేసాయి. శ్రీనివాస్ నూనూగు మీసాల నూత్న యవ్వనంలో ఉన్నప్పుడు ఉత్సాహం ఉరకలెత్తి పొంగి పొరలే భావాలతో రాసిన ఈ మినీ కవితలు పాఠకుల హృదయాలను ఇట్టే ఆకట్టుకుంటాయి.ఆల్ఫాక్షరాల్లో అనల్పమైన భావాన్ని పలికించాడు.ఆ కవితలకు తానే చిత్రం గీశాడు.ఈ కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనాయి.కవి శ్రీనివాస్ కవితల్లోని భావాలు సమాజాన్ని పట్టిపీడిస్తున్న సాంఘిక దురాచారాలు, సామాజిక సమస్యలు,స్త్రీలపై జరుగుతున్న కుటుంబ హింస,వరకట్న దురాచారాలు,స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు,అణచివేత,దోపిడీ విధానం,అవినీతి,ఆశ్రిత పక్ష పాతం,యంత్రాలు వచ్చిన తర్వాత కులవృత్తులు విధ్వంసం కావడం, కరువు కాటకాలతో పల్లె ప్రజలు ఉపాధి కరువై వలస బాట పట్టడం,ఇవన్నీ చూస్తుంటే హృదయం ఉన్న మనిషికి బాధను కలిగిస్తాయి.పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అంటారు.పల్లెలో అతివృష్టి,అనావృష్టి ఏర్పడి కరువు రక్కసి కరాళ నృత్యం చేస్తున్నది.పల్లె ప్రజలు ఉపాధి అవకాశాలు కరువై పట్టణాలకు వలస బాట పట్టినారు.ఆరుగాలం కష్టించి పనిచేసే అన్నదాతకే తిండి కరువై సబ్సిడీ బియ్యం కొనుక్కుని తింటున్నాడు.రైతులు మరియు చేనేత కార్మికులు కుటుంబ భారం మోయలేక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి కొనసాగుతున్నది.ఈ దేశంలో సామాన్యుల జీవితాలు కునారిల్లి పోతున్నాయి.పల్లె వాసుల పట్ల సరైన అవగాహనతో సమస్యలకు పరిష్కారాలను కూడా అందించాడు.కవి శ్రీనివాస్ చుట్టూ ఉన్న సమాజాన్ని దగ్గర నుండి చూసి పొందిన స్పందనకు ప్రతిరూపమే పిడికిలి.శ్రీనివాస్ ఉబుసుపోక కోసం మరియు కాలక్షేపం కొరకు ఆషామాషీగా రాసిన కవితలు కావు ఇవి.కవి,చిత్రకారుడిగా సమాజం పట్ల తన బాధ్యతను కవితల ద్వారా చక్కగా నెరవేర్చినాడు.కవి శ్రీనివాస్ పిడికిలి కవితలో ఆకలి/అరుణమైతే/అది కొందరికే ఎరుపు/ అరుపు/ ఉరుమైతే/అది కొందరినే కుదుపు/పిడికిలి/ఓ దుముకైతే/అది అంతటినీ కదుపు/అని అంటున్నారు.ఇవ్వాళ సమాజంలో ప్రజలు తినడానికి తిండి కరువై పేదరికంలో మగ్గుతున్నారు. పేద వాడి ఆకలి కాంతి అయితే ఆ కాంతి కొందరికే ఎరుపు అని చురుకు అంటిస్తున్నారు.పేదవాడి అరుపు ఉరుములా గర్జిస్తే దోపిడీదారులను కదిలిస్తుంది.పేద వాడు పిడికిలి బిగిస్తే పెట్టుబడిదారుల దోపిడీ వ్యవస్థ అంతమవుతుంది అని వ్యక్తం చేసిన భావం విప్లవానికి నాంది పలికింది.నగ – పగ కవితలో పొగ/తాగే వాడికి/ సిగరెట్టు ఒక నగ/రక్తాన్ని/శుద్ధి చేసే/గుండె కది పగ /అని చెప్పారు.సిగరెట్టు తాగే వాడు సిగరెట్టును నగలా భావిస్తాడు.సిగరెట్టు తాగడం వల్ల రక్తాన్ని శుద్ధి చేసే గుండెకు పగ అని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.సిగరెట్టు తాగడం ఆరోగ్యానికి హానికరం అని ప్రకటనలు చేస్తారు.సిగరెట్ తయారు చేస్తున్న కంపనీలను నిషేధించకపోవడం,ప్రభుత్వం యొక్క ద్వంద నీతిని వెల్లడిస్తుంది.సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులు చెడి పోతాయి.ప్రాణాంతక వ్యాధుల బారిన పడి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి.ఆకలి కవితలో వికటించేది/ విస్ఫోటించేది/ప్రపంచంలో/ఎప్పుడో ఒక నాడు/విశ్వాన్ని శాసించేది/ఒకే ఒక్కటి/అదే ఆకలి/అని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.ఆకలి అంటే ఏదైనా తినాలి అనిపించే ఒక భావన.ఆహారం లేకపోవడం వల్ల కలిగే బాధ లేదా మరణం.
పేదలు ఆకలి మంటలు ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండి లేక ఆకలితో మలమల మాడి చస్తున్నారు.ఈ దేశంలో పేదల ఆకలి చావులు మనసుని కలత పెడుతున్నాయి.దోపిడి కవితలో ఒక/రక్తపు చుక్క/కోట్ల/చెమట చుక్కల్ని/సృష్టిస్తుంది -/ఒక దోపిడీ చెయ్యి/కోట్ల/రూపాయలుగా/పరివర్తింప చేసుకుంటుంది/అని అంటున్నారు.పేదవాడి రక్తం చిందించి చెమట చుక్కలు కారుస్తాడు.చెమటను దోచి పెట్టుబడుదారు కోట్ల రూపాయలు ఆర్జిస్తాడు. పెట్టుబడిదారుని దోపిడీ స్వభావం గురించి తెలిపిన తీరు చక్కగా ఉంది.పవిత్రులు కవితలో బ్రహ్మ రాసిన రాత వల్ల కర్మచేసి బతుకులు సాగిస్తున్నాం. అందుకే మేము దరిద్రులం,ఈ ధరిత్రి పై మేమే పవిత్రులం.ఎన్నాళ్లు కష్టపడినప్పటికీ ఫలితం లేదు.దోపిడీ చేసిన వారే సుఖాలు అనుభవిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నటన కవితలో అంతా కృత్రిమత్వం/ అనంతమవుతున్న నాటకత్వం/ప్రగతైనా… ప్రతిభైనా…/ కుత్రిమత్వమే/మనిషికీ/సర్వాంగానాం నయనం ప్రధానం/ నేటి బతుక్కి/సర్వానందానికి నటనం ప్రధానం/అంటున్నారు.మనిషి జీవితంలో ఉదయం లేచిన వేళ నుండి రాత్రి పడుకునే వరకు నటన కొనసాగుతుంది.మనిషి జీవితం నటన అయింది అని వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది.తేల్చుకో కవితలో పేద వాడి ఆకలి కేక ధనికుడి అధికారపు కేక పోల్చుకో అంటూ కలుషిత హృదయమెవ్వరిదో కఠిన పాషాణమెవ్వరిదో తేల్చుకో తెల్సుకో అంటూ సమాజాన్ని ప్రశ్నిస్తున్నాడు.పర్యవసానం కవితలో బుక్కెడు బువ్వ దొరకక/డొక్కలు ఎండుతేనే/ఆకలి నిప్పులు కక్కేది/రెక్కలు ముక్కలైనా/చేతికి రొక్కం రాక పోతేనే//వేళ్లు పిడీకిలిని బిగించేది…/మబ్బు తర్వాతే …/ఉరుము/ఆ తర్వాతే/పిడుగు/ అంటున్నారు.ఏదైనా పని చెయ్యడం ద్వారా చివరకు లభించు ప్రయోజనం పర్యవసానం అంటారు.ఏం జరిగింది?దాని పర్యవసానం ఏమిటి?అని మాట్లాడుతూ ఉంటాం.కాలే కడుపులు ఎందుకు మాట్లాడతాయి?తినడానికి బుక్కెడు బువ్వ దొరకక పోతే డొక్కలు ఎండుతాయి. కడుపులో ఆకలి మంటలు చెలరేగుతాయి.రెక్కలు ముక్కలు చేసుకుని కష్టించినా చేతికి కూలి డబ్బులు ఇవ్వక పోతేనే కోపంతో శ్రామికుని వేళ్లు పిడికిలి
బిగుసుకుంటుంది.ఆకాశంలో మబ్బు తర్వాతే ఉరుము ఉరుముతుంది.ఉరుము తర్వాతే ఫెళ ఫెళమంటూ పిడుగు విరుచుకుపడుతుంది అనే భావంలో ఉద్యమాలు ఎలా రూపు దాలుస్తాయో చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.సూచిక కవితలో మనిషి జీవితంలో కాల చక్రం ప్రభావం ఎంతో ఉంటుంది.కాలాన్ని అనుసరించి సాగితేనే జీవితానికి ఆధారం లభిస్తుంది అని కాలం విలువను తెలియజేసిన తీరు చక్కగా ఉంది.అద్దంలో నువ్వు
కవితలో నిశ్చలత్వంలో/బురద గుంట కూడా/ ప్రతిబింబాన్నిస్తుంది/అనిశ్చలత్వంలో/మంచి నీరైనా/ ప్రతిబింబాన్నివ్వదు/హృదయం శుద్ధయితేనే/ పరిణతి ఉంటుంది/ఆకారమెలా చెప్తుంది/అంతర్గత వికృతాన్ని? అంటూ అద్దంలో నువ్వు కవిత ద్వారా పాఠకులను ప్రశ్నిస్తున్నాడు.ప్రశ్నలోనే సమాధానం దాగి ఉంది.ధీరుడు కవితలో ఈ సృష్టి/ చీకటి రేకులు/కప్పుకున్నంత వరకు/చీకటి పురుగులు/ నిష్క్రమించవు/పేద డొక్క/ఆకలి కేకలు/ వినిపిస్తున్నంత వరకు/విప్లవ వీరుడు/ విశ్రమించడు/అంటున్నారు.ధీరుని యొక్క గొప్ప గుణాలను చక్కగా వ్యక్తికరించారు.కార్మికుడు కవితలో రాయి కొట్టినా/రత్నం పండించినా/కూలి వాడే చేయాలి/కండ కరిగించినా/ఇంకోడి కండ పెంచాల్సినా/కార్మికుడే చేయాలి/ఓట్లు ఒదిగినా/ పదవి తూట్లో ఇమిడినా/శ్రామికుడే కావాలి/ అంటున్నారు.కార్మికుని యొక్క ప్రాధాన్యతను చెప్పిన తీరు బాగుంది.నమ్మొద్దు కవితలో రాయి/ శిల్పమయ్యిందంటే నమ్మొచ్చు/కానీ/రాజకీయుడు/ రంతీ దేవుడయ్యాడంటే నమ్మొద్దు/రాళ్ళు/రాగాలు పలుకొచ్చు/కానీ/రాజకీయుడు/నిజాయితీని మాత్రం కక్క లేడు/అని అంటున్నారు.ఇవ్వాళ రాజకీయుడు రంగుల ఊసరవెల్లిలా మారి సమాజాన్ని దోపిడీ చేస్తున్నాడు.రాజకీయుడిని నమ్మొద్దు అనే నిష్ఠుర సత్యాన్ని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.ఆకలి రాజ్యం కవితలో అధికారుల చేతుల్లో/ఆ బతుకులు/అంధకారపు ఛాయల్లో/ఈ మెతుకులు/ఆ బతుకుల చెరవీడదు!/ఈ మెతుకులు దొరికి చావవు!/ అందుకే వాడికెప్పుడూ/ఆయుధమే గుర్తొస్తుంది/ ఆకలి రాజ్యంలో/ వాడినెపుడూ/ తిరుగుబాటు దారునిగానే గుర్తిస్తారు/అంటున్నారు. ఇందులో ఆకలి రాజ్యం ఎలా ఉంటుందో గొప్పగా వ్యక్తీకరించారు.వ్యధ! కవితలో లచ్చిగా…/ రాష్ట్రం లచ్చలు/కేంద్రం కోట్లు/పలు పథకాలకు/విడుదల చేస్తే…/చారెడు సద్వినియోగం/బారెడు దుర్వినియోగం/నీ యవ్వ!/ ఇంకెక్కడ్రా…/మన బతుకులు/మారేది ?/మెతుకుల వ్యధ/ తీరేది?! అంటున్నారు.ప్రజా సంక్షేమం కోసం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినారు.రాజకీయ నాయకులు మరియు అవినీతి అధికారులు ప్రభుత్వ పథకాల నిధులను దుర్వినియోగం చేస్తున్నారు.సామాన్య ప్రజలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల నిధులు అందడం లేదు అని తెలంగాణ మాండలికంలో వ్యధ కవిత రాసి ప్రభుత్వ పథకాల గుట్టు విప్పిన తీరు చక్కగా ఉంది.గుండె గాయాలు కవితలో ఒక/ కన్నీటి పొరను/విశ్లేషించు/వేదనా ప్రపంచమంత/ గోచరిస్తుంది/ఒక/ఆకలి కేకను/ పరీక్షించు/దరిద్రం ఎంత వైశాల్యం/విస్తరించిందో/అర్థమవుతుంది/ఒక సారి/బాధాతప్త హృదయాన్ని తట్టి పరిశీలించు/ గుండె గాయాలెన్నో/ ప్రతిబింబిస్తాయి/ అంటున్నారు. పేదల కన్నీటి పొరను,ఆకలి కేకను,దరిద్రాన్ని, బాధపడుతున్న హృదయాన్ని పరిశీలిస్తే గుండెకు తగిలిన గాయాలు కనబడతాయి అని వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది.చర్య కవితలో భాస్వరానికి/ రాపిడి జరిగితే/ అగ్గిపుల్ల భగ్గుమంటుంది/ గుండెకు/ దెబ్బ తగిలితేనే/ఐదేళ్లు పిడికిలిగా బిగుసుకుంటాయి/అంటున్నారు.చర్య అనగా క్రియా పదం.చర్య ద్వారా భాస్పరానికి రాపిడి జరిగి అగ్గిపుల్ల భగ్గున మండుతుంది.చర్య ద్వారా గుండెకు దెబ్బ తగిలి మనిషి ఐదు వేళ్లు పిడికిలిగా బిగుసుకుంటాయి అని చెప్పిన తీరు బాగుంది. పెన్ను – గన్ను కవితలో శక్తి,యుక్తే /కాదు/విలువ గలవి/విధ్వంసం చేయగలవి/సమాజంలో ఉన్నవి/రెండే రెండు/ఒకటి పెన్ను/రెండోది గన్నూ/ మిత్రమా!/మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా!/మలినం కాకుండా/మీరైనా నిలవండి/సమాజ ప్రక్షాళనకు/సన్నద్ధం కండి/ అంటున్నారు. నిజాయితీగా పెన్ను పట్టి వార్తలు రాస్తున్న జర్నలిస్టులను తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారు.గన్ను పట్టి ప్రజలను రక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకుల కొమ్ము కాస్తున్నారు.రక్షక భటులు భక్షక భటులుగా తయారయ్యారు.అంతం వరకు కవితలో ఐదు వేళ్ల ఐక్యత/ఒక పిడికిలని మర్చిపోకు/ఆరంభం అంతం వరకు/విడిపోవన్నది విస్మరించకు/ దరిద్రుడి/ అరచేతిలోనే ‘నీ’అదృష్టం/ఇమిడి ఉందని గుర్తించు/ప్రతి ఆకలి కేకకు/అంతర్మధనాన్ని గమనించు/ నేడో,రేపో…/నీ ఉనికి/ పరిసమాప్తమన్న/వాస్తవాన్ని గ్రహించు/ అంటున్నారు.ఐక్యతతో పేదవాడు పిడికిలి బిగిస్తే పెట్టుబడుదారుడు ఉనికి లేకుండా పోతాడు అన్న వాస్తవం తెలియజేయడం చక్కగా ఉంది.పిశాచం కవితలో ఎన్ని నక్కలు/ఏ పార్టీ రంగు పులుముకుని/ఎన్నికల్లో నిలబడ్డా!/ప్రజని గొర్రెను చేసి/పుర్రెలు ఊపేస్తూనే ఉన్నాయి/ఎన్నికల బొక్కలు/ఎన్నిసార్లు ఎంత కొరికినా/ఏలికలోని అరాచకత్వంలో/ఇసుమంత కూడా మార్పుండదు/ ఓట్ల తూటాలను/ఎంత జాగ్రత్తగా/బ్యాలెట్ పెట్టెలో పేల్చినా!/ప్రసవించిన ప్రతి నాయకుడు/పిశాచ గుణాలతోనే పుడుతున్నాడు/అంటున్నారు.ఇవ్వాళ సమాజంలో రాజకీయ నాయకులు పిశాచాల రూపు దాల్చి ప్రజలను పట్టి పీడిస్తున్నారు అని గొప్ప భావాన్ని కవితలో వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది. అర్ధ నగ్నం కవితలో చీర కట్టుకే/చొంగ కార్చే/చీమలు వేలుండగా/చెరిచే సెక్సు బిట్టుకి/ప్రేక్షకులు/వేన వేలు తగలడరా/వంద రోజుల పండుగను/అర్ధ నగ్నంగా ప్రదర్శించరా!/అంటున్నారు.సినిమాల్లో స్త్రీలను చెరిచే దృశ్యాలను ప్రదర్శించడాన్ని,అర్ధ నగ్నంగా ప్రదర్శించిన సినిమాలు వంద రోజుల పండుగను జరుపుకోవడాన్ని నేటి సినిమాల తీరుతెన్నులను గురించి వ్యంగ్యంగా వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.నిరుద్యోగం కవితలో లేలేత/పచ్చని విద్యార్థి/ హృదయాల్ని/పుస్తకాల పురుగులు/పత్ర హరితం తినేసి వదిలేస్తే/విద్యాలయాలు/ఉద్యోగాలయాలు/ నిరాకరించి నెట్టేసిన/బజారు బాటసారులే నేటి/ నిరుద్యోగులు/అంటున్నారు.మన దేశంలో నిరుద్యోగం ఎంతగానో పేరుకుపోయింది.చదివిన చదువులకు ఉద్యోగాలు లేక బజారు బాటసారిగా తిరుగుతున్నారు అనే వాస్తవాన్ని నిరుద్యోగం కవిత ద్వారా వ్యక్తం చేయడం చక్కగా ఉంది.పెళ్లి కవితలో ముగ్ధ మోము/ముద్దు మాట/మాకెందుకు/ మంచి మనసు/మెచ్చే నడత/అసలెందుకూ/ఇచ్చే కట్నమెంత?వచ్చే కానుకలెన్ని?కరెక్ట్ గా చెప్పు/ మావోడికి పెళ్లి చేస్తాం/మీ కూతుర్ని/మేం కోడలిగా స్వీకరిస్తాం!/అంటున్నారు.పెళ్లి చేసుకుని తమ ఇంటికి వచ్చే కోడలు ఎంత కట్నం కానుకలు తీసుకువస్తున్నారు అనే విషయాలకి ప్రాధాన్యం ఇస్తున్నారు.అమ్మాయి చక్కగా ఉందా?మంచి మనసు,మంచి నడత,మంచి అలవాటు,చక్కగా కుందన బొమ్మలా ఉండాలి అని ఆలోచించడం లేదు.పెళ్లిని ఒక తంతుగా భావిస్తున్నారు.పెళ్లి కవితలోని భావాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. సమాజంలో వచ్చిన ఈ మార్పు ఆడపిల్లల తల్లిదండ్రులకు శాపంగా మారింది.విప్లవం కవితలో గుండె గదుల నిండా/బాధా తంత్రులు మోగుతున్నప్పుడు/గొంతు ద్వారాలందు/దగా పడిన పదాలు పచార్లు చేస్తున్నప్పుడు/హృదయ పొరలందు/కన్నీటి తెరలు నిండుకొన్నప్పుడు/ కనుపాప ఎర్ర జీరను పుంజుకుంటుంది/ అణువణువూ తూలుతూ/ఆవేశాన్ని రాజుకుంటుంది/అపుడే/ఒక ఆలోచన విప్లవరూపం దాల్చుతుంది/ఒక ఆశయమై రూపొందుతుంది/ లక్ష్యసిద్ధికి ఉపక్రమిస్తుంది/అంటున్నారు.విప్లవం కవిత విప్లవానికి నిర్వచనంలా ఉంది.మూలం కవితలో మనం కలిపిన/మట్టి పెళ్లే/వాడికి మేడై నిలిచింది/మనం పిసికిన/పిండి ముద్దే/వాడి పొట్టను పెంచింది/మనం ఉతికిన/బట్ట ముక్కే/వాడికి అందాన్ని తెచ్చింది/అంటున్నారు.ధనికుని సుఖ సంతోషాలకు మూలం ఏమిటి?శ్రామికుని శ్రమ మూలాల వల్లనే ధనికుడు సుఖాలు అనుభవిస్తున్నాడు అని కవితలో వివరించిన తీరు అద్భుతంగా ఉంది.సమైక్యం కవితలో సాటి మనిషి కష్టాల్లో ఉండి కన్నీళ్లు కార్చితే చూసే వాళ్ళ కళ్ళకు కూడా కన్నీళ్లు ఉబికి వస్తాయి.కానీ కొందరు మాత్రం సాటి వాడు కష్టాల్లో ఉంటే చూసి మొసలి కన్నీరు కారుస్తారు.ఎలాంటి సాయం అందించక కన్నీరు కార్చే వాళ్లంటే నాకు అసహ్యం అంటున్నారు. కాకులు చూడు తోటి కాకులతో కూడి కమ్మగా కలిసి తింటాయి.పక్షి అయిన కాకులంటేనే నాకు ఇష్టం అని చెప్పిన తీరు అద్భుతం.సాటి వాడికి సహాయం చేసే స్థితిలో ఉండి కూడా మనిషి ఎలాంటి సాయం చేయకుండా మొసలి కన్నీరు కార్చడం వింతగా అనిపిస్తుంది.సాటి మనిషికి సాయం చేసి ఓదార్చాలి.పక్షుల్లో ఉన్న సమైక్యత మనుషుల్లో శూన్యమై మానవత్వం కొరవడడం బాధను కలిగిస్తుంది.అగ్గి పోరు కవితలో సమాజంలో వరకట్నం దురాచారం ఇంకా కొనసాగుతున్నది. వరకట్నం సంతలో వధువు వరుణ్ణి కొనుక్కోవడం జరుగుతున్నది.కోడలు తెచ్చిన కట్నం ఎంత?కొడుకు తూగే బరువెంత?బేరీజులో తేడా వస్తే మనం సృష్టించిన బ్రహ్మ అయినా ఆప లేడు.వరకట్నం కొరకు అత్తమామలు,ఆడపడుచుల వేధింపులు కొనసాగడం నిత్య సత్యం కూడా.రాజుకున్న అగ్గి పోరు ఆగదు.వధువు ప్రాణాలు మంటలకు ఆహుతి అయి గాలిలో కలిసిపోతున్నాయి అనడం చక్కగా ఉంది.అనుమానం కవితలో ఏ వస్తువైనా/దగ్ధం చేయడానికి/ఒక అగ్గిపుల్ల చాలు/ఏ క్షణమైనా/సంసారం విచ్ఛిన్నమవడానికి/ఒక/ అనుమానం చాలు/అది ఒకసారి దహించి వేస్తే/ఇది క్షణక్షణం దహించి వేస్తుంది.అనుమానం కవిత సంసారంలో అనుమానానికి తావివ్వకూడదు అనే సందేశాన్ని అందిస్తుంది.అరాచకం కవితలో క్షీణిస్తున్న/వివాహ వ్యవస్థ/పూజిస్తున్న/వరకట్నపు సిస్టం/అబలనెపుడూ/అవస్థకు గురిచేస్తున్న/ ఆచారాలే/వ్యవస్థను పట్టిపీడిస్తున్న/అరాచకమే ఇది!/అంటున్నారు.వరకట్నం వ్యవస్థను పట్టిపీడిస్తున్న అరాచకం అని వ్యక్తం చేయడం చక్కగా ఉంది.బూజు కవితలో నేటి/మేటి పేపరు ప్రకటన!/ఒక ‘తార’/తెరపై వెలగటానికి/ఒక ప్రేక్షకుడి/ మతిపోగొడితే/చాలట!?/అయితేనే/హీరోయిన్ గా అవకాశమట!/ సినీ పరిశ్రమకు పట్టిన/ బూజును/ భూతద్దంలో ప్రకటించారట!/అంటున్నారు. సినిమాలో హీరోయిన్ అందాలు ప్రదర్శించి ప్రేక్షకుల మతి పోగొట్టి డబ్బులు సంపాదిస్తున్నట్టి సినీ పరిశ్రమకు పట్టిన బూజును వదిలించాలని వ్యంగ్యంగా వ్యక్తీకరించిన తీరు బాగుంది.’రాత’ కవితలో ఈ పూట గడిస్తే/అంతే చాలు/ఈ ఆకలి తీరితే/ఎంతో మేలు/ఏం రాసావురా/బ్రహ్మ/ఇలా ఎందుకురా/మా కర్మ!/చాటుకు ఉండి ఇలాగే రాస్తే/ నిలదీసేందుకు/సన్నద్ధమవుతారు/నిగ్గు తేల్చుకునేందుకు/సంసిద్ధమవుతారు/జాగ్రత్త!! అంటున్నారు.ఈ కవితలో రాత రాసిన బ్రహ్మనే ప్రశ్నిస్తున్నారు.బ్రహ్మను ప్రశ్నించడం మరియు జాగ్రత్త అని హెచ్చరించడం అద్భుతంగా ఉంది.అవస్థ కవితలో ఇద్దరిదీ/ఒకే అవస్థ/కాలు తీసి కాలు/ వేయలేని పరిస్థితి/కాకుంటే/వాడు/బలిసి/వీడు/ చితికి/అంటున్నారు.ఇది ఎంత అద్భుతమైన పోలిక.మధనం అంచున కవితలో మధనం నుంచే ఆలోచన ఉద్భవిస్తుంది/ఆ ఆలోచన పరిపక్వమే పోరాటమవుతుంది/అంటున్నారు.పరిణామం కవితలో అభాగ్యుల్లో/ఆలోచనా స్రవంతులు సాగుతున్నాయ్/అందని నింగిని సైతం/ అందుకోవడానికి ఎగసిపడుతున్నాయ్/ అంటున్నారు.శంఖారావం కవితలో ఇప్పుడు/ఒక శరీరంలోని అణువులు మాత్రమే/అజ్ఞానం మత్తు వదిలి మేల్కొన్నాయ్/వర్తమానం వంచన పైకి/ విచ్చుకత్తులై లేస్తున్నాయ్/ అంటున్నారు.సూర్యుని బావుటాలు కవితలో పీడితులారా!తాడితులారా!! ఏకంకండి/ఈ తరుణం మళ్ళిక రాదు/గుంపులు, గుంపులు,గుంపులుగా కదలండి/నింగిన సూర్యుడు మనతో కలిసి/ఎర్రబావుటాన్ని ఎగురేశాడు/ అంటున్నారు.ఎవరమ్మా!నువ్వు కవితలో ఎవరమ్మా నువ్వు!/కన్నీటి సముద్రానికి/కేంద్ర స్థానం/నీ గుండె అయినట్లు…/నీ బుగ్గలపై కన్నీటి చారికలేంటమ్మా!/ నీ సహనాన్ని/అవకాశంగా తీసుకుని/చలనం లేకుండా చేయకముందే/నీలో కదలిక రావాలి…/మౌనంగా భరించే/బాధలు… బాధ్యతలూ…/ బాకులా దూకాలి/అంటున్నారు. సమాజంలో స్త్రీల స్థితి ఆకాశంలో సగం అవకాశంలో శూన్యం అన్నట్లుగా ఉంది.కవి శ్రీనివాస్ స్త్రీల పట్ల గల ప్రేమతో ఎవరమ్మా నువ్వు అంటూ ఓదారుస్తున్నారు మరియు వారిలో స్ఫూర్తిని కలిగిస్తున్నారు. సమాజ అభ్యుదయాన్ని కాంక్షించి చక్కటి మినీ కవితలు రాసిన కవి శ్రీనివాస్ ను అభినందిస్తున్నాను.కవి శ్రీనివాస్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
కళ్యాణం శ్రీనివాస్ తేది 02 – 06 – 1971 రోజున కరీంనగర్ జిల్లాలోని ఆర్నకొండ గ్రామంలో జన్మించారు.వీరి తల్లిదండ్రులు రాజవ్వ, రాజయ్య. తండ్రి రాజయ్య చేనేత మగ్గంపై చీరలు నేసేవాడు. వీరి తండ్రి రాజయ్య 1994 సంవత్సరంలో అనారోగ్యంతో ఈ లోకం వీడిపోయారు.శ్రీనివాస్ కు ఒక అన్నయ్య.పేరు వాసుదేవ్.వీరు ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖలో పని చేసి రిటైర్ అయ్యారు.వీరి అన్నయ్య ఆర్నకొండ గ్రామంలో నివాసం ఉంటున్నారు.శ్రీనివాస్ కు ఒక అక్క ఉంది.పేరు భారతి.వీరు చొప్పదండి గ్రామానికి చెందిన వారు. శ్రీనివాస్ 1 వ తరగతి నుండి 7 వ తరగతి వరకు ఆర్నకొండ గ్రామంలో చదివారు.వీరు 8 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చొప్పదండి జడ్.పి.ఎస్.ఎస్.ప్రభుత్వ పాఠశాలలో చదివారు. వీరు ఇంటర్మీడియట్ విద్యను ప్రభుత్వ జూనియర్ కళాశాల,చొప్పదండి గ్రామంలో చదివారు.వీరు ఐ.టీ.ఐ. ఫిట్టర్ కోర్సును ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ,(ఐటిఐ)మంచిర్యాలలో చదివారు.వీరు బి.ఏ. తెలుగు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివారు.వీరు ఎం.ఏ.తెలుగు నాగార్జున యూనివర్సిటీలో చదివారు.వీరు యానిమేషన్ కోర్సును హార్ట్ యానిమేషన్ అకాడమీ,హైదరాబాదులో చదివారు.వీరికి చిన్నప్పటినుండి సాహిత్యం పట్ల ఆసక్తి ఉండేది.వీరు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుండి కవితలు రాయడం ప్రారంభించారు.వీరు చిన్నతనం నుండి బొమ్మలు గీయడం, కార్టూన్లు వేయడం చేస్తున్నారు. వీరు ఈనాడు పత్రికలో జర్నలిస్టుగా పని చేసారు. వీరు అందులో పొలిటికల్ కార్టూన్లు వేసేవారు.వీరు ప్రస్తుతం రెండు యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారు. . శ్రీనివాస్ ప్రచురించిన పుస్తకాల వివరాలు:
1) హృదయం గేయ సంపుటి,ఆగస్టు,1996.
2) పిడికిలి కవితా సంపుటి,మే 1998.
వీరు పలు సాహితీ పుస్తకాలకు ముఖచిత్రాలు వేశారు.వీరు తెలంగాణ కార్టూనిస్టుల వెల్ఫేర్ సంఘానికి ఆర్గనైజేషన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్నారు.వీరు అంతర్జాతీయ స్థాయిలో పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా పీవీ నరసింహారావు పై క్యారికేచర్ పోటీ నిర్వహించడం జరిగింది.అందులో 20 దేశాల కళాకారులు పాల్గొన్నారు.వీరు యానిమేషన్ డైరెక్టర్ గా రాణించారు మరియు పలు అవార్డులు కూడా అందుకున్నారు.వీరు ప్రస్తుతం హైదరాబాదు నగరంలో ఉంటున్నారు.