మన ‘ఘన’ గణపతి
గణానాం త్వా గణపతిగం హవామహే!
కవిం కవీనా ముపమశ్రవస్తవం!!
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః !
శృణ్వన్నూతిభి: సీదసాదనం!!
ఈ మంత్రం గణపతిని స్తుతించేది. ఋగ్వేదం రెండవ మండలంలోని ఇరవై మూడవ సూక్తంలోనిది. ఈ సూక్తం బృహస్పతి దేవతలను ఉద్దేశించి చెప్పింది. గణనీయమైన వారికి ఈశ్వరునివంటి వాడనీ, సర్వజ్ఞులకు సర్వజ్ఞుడవనీ ప్రసిద్ధులందరిలోనూ విరాజమైన వాడివనీ మేము తలస్తున్నాం. ఓ గణనాధా ! నీవు వచ్చి మా హృదయ ఫలకాలపై అధిష్ఠించు అని అర్థం .
‘గ’ అనగా వివేకం, ‘ణ’ అనగా ‘ముక్తి’ లేక ‘మోక్షము’ అని అర్థాలు ఉన్నాయి. గణపతి అంటే ‘శుద్ధ మనస్సు’ అని నిర్వచనం. గణమనగా 36 తత్వాల సమూహం అనీ భావము.
ఎవరీ విఘ్నేశ్వరుడు ?
మన దేశంలో త్రిమూర్తుల తర్వాత విశేషంగా వినాయకుడినే పూజిస్తారు. ఏ కార్యమైనా నిర్విఘ్నంగా సమాప్తి కావడానికి వినాయకుని పూజతో ప్రారంభమవుతుంది. ప్రతి శుభకార్యం తొలిగా ఆరాధింపబడే దైవం. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు జన్మించాడు కాబట్టి ఆ రోజు విశేష పూజలు జరుపుతారు. వినాయక చవితి నాడు సూర్యోదయానికి ముందు తూర్పున ఎలుక ఆకారం, దానిమీద ఏనుగు ఆకారం గల రెండు నక్షత్రాల గుంపులు ఉదయిస్తాయని, సూర్యోదయానికి ముందు ఏ నక్షత్రం ఉదయిస్తుందో ఆ నక్షత్రానికి సంబంధించిన దైవాన్ని పూజించాలని ఋగ్వేదంలో పేర్కొనడం వల్ల వినాయక పూజ భాద్రపద శుద్ధ చవితినాడే జరుపుతున్నారు.
విఘ్నాలకు నాయకుడు విఘ్నేశ్వరుడు. విఘ్నాలు అంటే ఒక పనికి పూనుకున్న వారికీ ఎదురయ్యే అడ్డంకులను ‘విఘ్నాలు’ అంటారు. వినాయకుడు విఘ్న గణాలను తన ఆధీనంలో ఉంచుకొని భక్తులకు ఆ విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదిస్తూ ఉంటాడు. మన ఇంట్లో ఉన్న పదార్థాలను మూషకం ఎలా కాజేస్తుందో, అలాగే గణపతి వాహనమైన మూషకం జీవుల హృదయాల్లో ఉన్న అజ్ఞానాన్ని అపహరిస్తూ ఉంటుంది. సర్వాంతర్యామియైన ఈశ్వరుడే గణపతిని సేవించాలని మూషక రూపం ధరించి వాహనమయ్యాడని కూడా అంటారు.
గజవదనం గణపతిది. సర్పాలే ఆభరణాలు, అనింద్యుడనే మూషిక వాహనం, చేటల్లాంటి చెవులు, చిన్న చిన్న నేత్రాలు, గణపతికి గొప్పవారని కాని, పేదవారనిగాని బలవంతుడనిగాని, బలహీనుడనిగాని తారతమ్యాలు లేవని, వారి గజవదనం, మూషిక వాహనం తెల్పుతున్నాయి. సర్పాలకు మూషికాలకు జన్మ శతృత్వం కాని, మితృత్వంగాని లేదని పాములు ఆభరణాలుగా, మూషికం వాహనంగా కల్గి వున్నారు. చిరు నేత్రాలు సూక్ష్మబుద్ధికి తార్కాణం. భక్తులు ఏ దిక్కు నుండి పిలిచినా అంటే అష్టదిక్కులే కాక, ఊర్ధ్వ, అధో భాగాలనుండి పిలిచినా భక్తుల మొర విని ఆదుకొనే గణపతి దేవుని పూజిస్తే సకల విద్యలు, సకలైశ్వర్యాలు కలిగి సకల కార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయని ప్రతీతి.
హిందూ దేవతలలో వినాయకుడు అగ్రగణ్యుడు. ఈ స్వామి పుట్టుక, అతడి రూపం, విన్యాసాల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వినాయకుడికి ఈ రూపం ఎలా వచ్చింది అనే అంశం కూడా ఈ అష్టగణపతులలో వక్రతుండుడు సింహవాహనుడు మత్సరాసురుని సంహరించాడు. ఏకదంతుడు మూషక వాహనుడు మదాసుర నిహంత మహోదరుడు మూషక వాహనుడు జ్ఞానదాత. మోహాసుర నాశకుడు, గజాననుడు మూషిక వాహనుడు సాంఖ్యసిద్ధి ప్రదుడు, లోభా సుర సంహర్త లంబోదరుడు మూషక వాహనుడు, క్రోధాసుర వినాశకుడు. వికటుడు, మయూర వాహనుడు, కామాసురాంతకుడు. విఘ్నరాజు శేషవాహనుడు మమతాసుర ప్రహర, ధూమ్రవర్ణుడు మూషక వాహనుడు, అహం తాసురహంత. దీనిని బట్టి యెవ్వరు గణపతిని ఉపాసింస్తున్నారో వారికి గణపతి అనుగ్రహబలముచే కామక్రోదాదులు నశించి తత్త్వజ్ఞానం సిద్ధింస్తుందని తెలుస్తున్నది. వక్రతుండ, మహోదర, ఏకదంత, గజానన, లంబోదర, వికటుడు, విఘ్నరాజు, దూమ్రవర్ణ అని గణపతి ఎనిమిది అవతారాలను ఎత్తినట్లుగా ముద్గల పురాణం పేర్కొంది.
కలియుగంలో రెండు చేతులు కలిగి తెల్లని కాంతి గలవాడై, కోర్కెలన్నిటిని దీర్చు గణపతిని ధ్యానించాలి. సర్వవిఘ్నాలను హరించేవాడు కావడం వలన ఈయన ప్రథమ పూజ్యుడైనాడు. విఘ్నేశ్వరుని పూజించనిదే ఎవ్వరికిని ఏ కార్యమూ సిద్ధించదు. “అపూజితో విఘ్నకరోపిమాతూ” అను గణేశ పురాణ వచనం. కార్యారంభమున తన్ను స్మరింపనిచో కన్నతల్లికైనా విఘ్నము కలిగిస్తాడని తెలుపుచున్నది. ఇది వినాయకుని నిష్పాక్షిక ప్రవృత్తికి నిదర్శనం.
“త్వమేవ కేవలం ఖల్విదం బ్రహ్మసి” అని గణపత్యుపనిషత్తు పేర్కొంటున్నది. దేవతల్ని పూజించటానికి ముందు గణపతిని పూజిస్తేనే నిర్విఘ్నంగా పూజా ఫలం లభిస్తుందని, లేకపోతే ఆ పూజలన్నీ వ్యర్థమైపోతాయని మన నమ్మకం. అందుకనే మనం ఏ కార్యం తలపెట్టినా ఓం ప్రథమంగా పసుపుతో వినాయకుణ్ణి చేసి, “సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజ కర్ణకః” అంటూ గణేశుని పూజిస్తుంటాం. శ్రీ విఘ్నేశ్వరున్ని ఆరాధిస్తే విఘ్నాలు తొలగి, విజయాలు సిద్ధిస్తాయి. ఈ గణేశుని పండుగని “చవితి”నాడే ఎందుకు జరుపుకోవాలో జ్యోతిష్యశాస్త్ర రీత్యా పరిశీలించినట్లయితే,
వేదకాలంలో మన మహర్షులు మన పండుగలను జ్యోతిషశాస్త్ర ఆధారంగా హిందూ పంచాంగాన్ని ప్రమాణికంగా చేసికొని ఏర్పాటు చేశారు. మనకు వినాయక చవితి గొప్ప పండుగ.
“చవితి”నాడే గణేశుని పండుగని ఎందుకు జరుపుకోవాలి?!
భాద్రపద మాసం సూర్యుడు సింహరాశి చివరలో ఉండగా రావడం, శుక్లపక్ష చవితినాడు చంద్రుడు కన్యారాశితో హస్తానక్షత్రం మీద ఉదయిస్తాడు. అయితే హస్తా నక్షత్రం చేతి వేళ్ళవలె హస్తాకారంలో, అంటే చేతివంటి ఆకారంలో ఉంటుంది. భాద్రపద శుద్ధ చవితినాడు చంద్రుడుదయించే సమయానికి శిరస్సున హస్త నక్షత్రంలో కనిపిస్తాడు. హస్త ముఖమును కలిగినవాడు కనుక హస్తిముఖుడు. హస్తి అంటే ఏనుగు అని కూడా కదా! దీనిని బట్టి గణపతికి ఏనుగు ముఖము అని హస్తి ముఖుడు అన్నారు.
ఇలా ఒక్క భాద్రపద శుద్ధ చతుర్దినాడే హస్తలో చంద్రుడుండగా ఉదయిస్తాడు. హస్తా నక్షత్రానికి కన్యారాశికాగా, దీని అధిపతి బుధుడు. ఈ బుధుని రంగు పచ్చ, మరకతం, అందుచే గణపతిని ఆకుపచ్చ రంగుగా ఉండే గరిక చిగుళ్ళు, దూర్వాంకులాలతో, పత్రితో పూజిస్తారు.
ఋషులు పూర్వం ఆశ్రమాలలో బ్రహ్మ విద్యాభ్యాసం వినాయక చవితి మరుసటి రోజున అంటే పంచమి రోజున (గణపతి) ప్రారంభించేవారు. పంచమి సప్త ఋషులతో ఉదయిస్తుంది. కనుక ఆనాడు గణపతి విద్యలకెల్ల నొజ్జయై బ్రహ్మ విద్యాధిపతి కాగా, రాశులలో కన్యారాశి ఆరవది. ఈ అరవస్థానం జ్యోతిష్య శాస్త్రములలో శత్రువులకు, అపనిందలకు, రోగములకు, విఘ్నములకు మూలస్థానం కాబట్టి ఈ రాశిలో విఘ్నములకు, శత్రువులకు కారకుడైన గణపతిని ఏర్పాటుచేసి పూజించితే, సుఖ సౌఖ్యాలతో ఉంటామని ఋషులు భాద్రపద శుద్ధ చతుర్థినాడు ఆ విఘ్నములు తొలగుటకు వినాయకుని పండుగను ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
విశేషమేమంటే వినాయక చవితి వ్రత కథలో కూడ, సింహం చేత మరణించిన ప్రసేకుడు నీలాపనిందల పాలైన శ్రీకృష్ణునికి మిత్రుడే శత్రువైన, జాంబవతునితో వైరము శతృత్వానికి ప్రమాదాన్ని సృష్టించే శమంతకమణి కథ ఈ జ్యోతిష్య రహస్యాన్ని సూచిస్తున్నది.
ఎందుకు వినాయకుని దంతం విరిగింది?
శివభక్తుడైన పరశురాముడు మహా ముక్కోపి. ఓసారి కైలాసం వస్తాడు. శివపార్వతులను దర్శించాలనుకుంటాడు. ద్వారం వద్దనున్న గణపతి పరశురాముడిని అడ్డుకుంటాడు. దాంతో ముక్కోపి అయిన పరశురాముడు ఆగ్రహిస్తాడు. ఇద్దరికి భయంకర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో వినాయకుడు తన తొండంతో ఎత్తి పరశురాముడిని దూరంగా విసిరేస్తాడు. పరశురాముడు తనకు శివుడు ప్రసాదించిన మహిమాన్వితమైన పరశువుని వినాయకుడిపై ప్రయోగిస్తాడు. ఆ పరశువు దెబ్బవల్లే వినాయకుని తొండం విరిగిందని పురాణ ఐతిహ్యం.
ఎందుకు గణపతికి తొలిగా కొబ్బరికాయ కొడతారు?
కొబ్బరికాయ కొట్టి గణపతి పూజ ‘మొదలు పెడతాం. ఇలా కొబ్బరి కాయ కొట్టడంలో ఒక పరమార్థం దాగి వుందట. తామ్ర, లోహ, స్వర్ణ ఈ మూడు త్రిపురాలను ఆక్రమించిన ముగ్గురు రాక్షస రాజులు ప్రజలను పట్టిపీడిస్తుంటే, శివుడు వారిని సంహరించడానికి పూనుకోగానే ఏదో ఒక విఘ్నం సంభవించేదట. విఘ్న రాజైన పుత్రుడు వినాయకుని సంప్రదించగా విఘ్నరాజు సూచన ప్రకారం శివుడికి ప్రతి రూపంగా మూడు రంధ్రాలున్న కొబ్బరికాయను ఛేదించి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి, ఆ ముగ్గురు రాక్షసులను ఎలాంటి విఘ్నాలు లేకుండా సంహరించాడని, ఆ నాటి నుండి వినాయక పూజకు ముందుగా కొబ్బరికాయ కొట్టడం మొదలైందని ఐతిహ్యం.
ఎందుకు తులసి గణేశుని పూజకు పనికిరాదు?
గణపతికి ఏకవింశతి పత్రాణి పూజ చేస్తారు. కాని ఇరవైనొక్క రకాల పత్రాలతో పూజలందే గణనాథునికి తులసి పత్రాలతో అర్చించే భాగ్యం లేదు. ఈనాడు కొన్ని వినాయక వ్రత పుస్తకాల్లో “గజకర్ణకాయ నమ: తులసీ పత్రం పూజయామి” అని కనిపిస్తున్నది. కాని ‘తులసీ పత్రం వినాయక పూజకు పనికి రాదు’ అని శాస్త్రం చెబుతున్నది. శ్రీమహావిష్ణువుని భర్తగా పొందాలని తపస్సు చేస్తున్న తులసీదేవి గణపతిని చూచి, “నీవు సాక్షాత్తు శ్రీకృష్ణుడివి. విష్ణువుకూ, నీకు భేదం లేదు కనుక నిన్ను వరిస్తున్నాను. పెళ్లి చేసుకో! ” మని అడిగితే ‘నాకు వివాహేచ్చ లేదు. నేనసలు నిన్నే కాదు, ఎవరినీ పెళ్లి చేసుకోను’ అని ఆయన తిరస్కరించాడు. అప్పుడు తులసికి కోపం వచ్చి “నీకు త్వరలోనే వివాహం అగుగాక” అని శాపమిచ్చింది. అప్పుడు గణేశుడు “నీకు రాక్షసుడు భర్త అవుతాడు. వచ్చే జన్మలో నువ్వు వృక్షానివై పుడతావు. సమస్త దేవతలు నీ దళాలతో పూజింపబడినప్పటికీ నాకు మాత్రం అవి పనికి రాకుండా పోతవి” అని ప్రతి శాపమిచ్చాడు. ఈ కథను మనం బ్రహ్మవైవర్తంలో గమనించవచ్చు. అలా గణపతి శాపం ఉండటం మూలాన తులసీ పత్రాలు వినాయకపూజకు పనికిరావని చెప్పటం జరిగింది. భగవంతుడు కోరిన ఫల, పుష్ప, పత్రాలతో పూజిస్తేనే భక్తి, ముక్తి.
ఎందుకు చంద్రుడు శాపానికి గురైనాడు?
ఓరోజు గణేశుడు మూషికవాహనంపై తిరుగుతుండగా ఓ పాము కనిపించేసరికి, మూషికం కంగారు పడి వినాయకుడ్ని పడేస్తుంది. ఆయన దగ్గర ఉన్న మోదకాలన్నీ పడిపోతాయి. దాంతో వినాయకుడికి కోపం వచ్చి పాముని తన పొట్టకు ఆభరణంగా చుట్టుకుంటాడు. తనను చూసి నవ్విన చంద్రుడి పైకి కోపంతో విరిగిన దంతాన్ని విసిరి “ఇక నుండి నీవు కాంతి విహీనుడివి అవుతావని శపిస్తాడు.” అప్పడు చంద్రుడు కాంతి విహీనుడయ్యేసరికి ప్రతిరోజూ చీటి రాత్రులవుతాయి. అప్పుడు బ్రహ్మాది దేవతలు వినాయకుడిని తన శాపాన్ని ఉపసంహరించుకోమని కోరతారు. దాంతో ఆయన నెలలో సగం రోజులు పూర్ణచంద్రుడిగాను, మిగిలిన రోజులలో అర్థచంద్రుడిగాను ఉంటాడని అనుగ్రహిస్తాడు. చంద్రుడు శాపానికి గురైన రోజు భాద్రపద చతుర్థి. ఆరోజు చంద్రుని చూడకూడదని, చూస్తే నీలాపనిందలు వస్తాయని ప్రజలలో ఒక విశ్వాసం ఉంది. ఒకవేళ చూస్తే ఆ దోష పరిహారార్థం
సింహం ప్రసేన మవధీత్
సింహా జాంబవతాహతః
సుకుమారక మారోః
తవ హ్యేష శమంతకః ||
అనే శ్లోకం పఠించాలి, లేదా శమంతకోపాఖ్యానం వినాలని మన పురాణాలు చెబుతున్నాయి.
గణేశుని ప్రార్థించిన రావణుడు
రావణుడు ఒకసారి శివుని కోసం మహాతపస్సు చేసి విచిత్రమైన వరాన్ని కోరతాడు. అతనికిగానీ, అతని రాజ్యానికి గానీ ఎవరివల్లా ఎటువంటి హాని ఎప్పటికీ జరగకుండా ఉండేలా వరం ఇమ్మని అడుగుతాడు. అప్పుడు, శివుడు ఓ శివలింగం ఇచ్చి, దీనిని రాజ్యానికి తీసుకుపోయి సదా పూజా కార్యక్రమాలు నిర్వహించమంటాడు. ఐతే మార్గ మధ్యంలో దానిని కింద పెట్టకూడదన్న షరతు పెడతాడు. రావణుడెంతో సంతోషంతో ఆ లింగం తీసుకుని బయల్దేరతాడు. శివుడు రావణుడికిచ్చిన ఈ వరానికి మిగిలిన దేవతలంతా భయపడిపోయి వినాయకుడిని ప్రార్థిస్తారు. రావణుడు తన రాజ్యానికి పయనించే మార్గంలో వరుణదేవుడు ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. అలాంటి పరిస్థితులలో రావణుడు చేతిలో ఉన్న శివలింగాన్ని పటుకోలేకపోతాడు. అలా శివలింగాన్ని కింద పెట్టడానికి కూడా అతని మనసు అంగీకరించదు. అయితే ఏం చేయాలో తెలియని పరిస్థితులలో అతడిని ఎవరో బాలుడు పిలిచినట్లయి అక్కడ ఉన్న ఓ నేలమీద పెట్టి, తనను ఎవరు పిలిచారా అని నలుదిక్కులా వెతికి అతను కనబడితే సంహరించాలని చూస్తాడు. అప్పుడా బాలుడు గణేశుని రూపంలో ప్రత్యక్షమై రావణుని ఓ బంతిలా చుట్టి ఆకాశానికి విసిరేస్తూ ఆటలా ఆడుకుంటాడు. అప్పుడు రావణుడు తన తప్పు తెలుసుకుని తనకున్న పరిమితులను గుర్తించి గణేశుడెంతటి శక్తివంతుడో గ్రహించి, అతడిని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తాడు. ఇలా ఎన్నెన్నో సంఘటనలు, గణేశుని కోపానికి, శాపానికి గురైన విషయాలు గణేశ పురాణంలో కోకొల్లలు.
మట్టి వినాయక నిమజ్జన మహిమ :
వినాయకుని పూజించి చివరి రోజున చెరువుల్లో, బావుల్లో, నీటిలో నిమజ్జనం చేస్తారు. భూ -జల తత్వాల నుంచి ఏర్పడిన మూర్తిని, తిరిగి అవే తత్వాలలోనికి చేరడం ప్రకృతి ధర్మం. వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు ఆ చోట నుండి కొద్ది మట్టిని తెచ్చి, ధాన్యపు గాదెల్లో వేస్తారు రైతులు. ఇలా చేయడం వలన పంటలు బాగా పండి, గాదెల నిండ ధాన్యం పుష్కలంగా చేరుతుందని రైతన్నల నమ్మకం.
పూర్వం కలుషిత జలాన్ని శుభ్రపరిచేందుకు ఈనాటి మాదిరిగా సౌకర్యాలు ఆనాడు ఉండేవి కావు. నీరు కలుషితం కాకుండా వినాయకుడి పూజలో ఉపయోగించిన ఏక వింశతి (21) పత్రాలను నీటిలో నిమజ్జనం చేయడం వలన ఔషద గుణాలు కల్గిన పత్రాలు నీటిని శుభ్రపరిచి కాలుష్యాన్ని, వ్యాధి కారక క్రిములనూ పోగొట్టి నీటిని శుద్ధి చేస్తాయి. ఇది వినాయక పూజ పత్రాల్లో దాగిన రహస్యం.
నిమజ్జనం: నీళ్ళు స్థానంగా కలిగినటువంటివాడు నారాయణుడు. అయన ఎవరో కాదు సాక్షాత్తు శ్రీమహావిష్ణువే. గణపతిని ఉత్సవాల అనంతరం నీటిలో నిమజ్జనం చేస్తున్నామంటే, గణపతి రూపమైన విష్ణుమూర్తి యొక్క స్థానమైన నీటిలో నిమజ్జనం ప్రాముఖ్యత.
హిందూ మతశాఖల్లో గాణాపత్యం ఒకటి. భారత దేశంలోనే కాక గణపతిని బ్రెజిల్, మెక్సికో, బర్మా, థాయిలాండ్, గ్రీస్, కాంబోడియా, చైనా, జపాన్ వంటి విదేశాల్లో సైతం ఆరాధిస్తుండగా జైనులు, బౌద్ధులు కూడా పూజిస్తున్నారు.
గణపతి ఆరాధన – ఆరోగ్య సాధన
గణపతి జ్ఞాన సాగరుడు. అట్టి గణపతిని మనం పర్యావరణానికి హానిచేయని మట్టితో తయారుచేసిన విగ్రహాలకు ప్రాముఖ్యత నిచ్చి పర్యావరణ భద్రతకు సహకరించి, శాంతి సౌభాగ్యాలకోసం పవిత్ర హృదయాలతో గణపతిని ఆరాధించి ఇహపర సౌఖ్యాలను పొందుదాం!
పూజలలో ప్రథముడు విఘ్నేశ్వరుడు. ఏ శుభకార్యమైన “శ్రీ మహా గణాధిపతయే నమ:” అని, శుక్లాంభరధరం అనే శోకంతో ప్రారంభిస్తారు.
శ్రీ మహాగణపతి సగుణ నిర్గుణ స్వరూపుడు. షోడశనామ ధరుడగు మంత్ర ద్రష్ట, నిర్విఘ్న మూర్తియైన విఘ్నాకారకుడు, బ్రహ్మాది దేవతలచే, లంభోదరంతో, సింధూర వర్ణంతో విరాజిల్లుతూ గణాలన్నింటిలో ప్రథమ గణంగా పొగడబడుచున్నాడు. సకల శ్రేత, స్మార్త, కర్మాలకు, శుభా శుభకర్మలకు “అదౌపూజ్యోగణాధిపః”గా తొలిగా పూజలందుకునే మంత్రానుష్ఠాన ప్రథమ దేవత వినాయకుడు.
గణపతి చవితి పూజనాడు కూడా ముందు గణపతి పూజ చేసిన తర్వాత సిద్ది వినాయక పూజ చేస్తారు. పార్వతీ పరమేశ్వరుల వివాహానికి కూడా గణపతి పూజే చేస్తారు. దీనిని బట్టి సర్వ దేవతా పూజలకు వినాయకుని పూజ ముఖ్యంగా కనబడుతుంది. సృష్టికి ముందు, సృష్టి తర్వాత ప్రళయానంతరం కూడా సత్య స్వరూపుడై ప్రకాశించే వాడే మహాగణపతి.
గణత్యుపనిషత్తు “త్వమేవ కేవలం ఖల్విదం బ్రహ్మాస్మి” అని పేర్కొంది. దేవతలను పూజించడానికి ముందు ఈ గణపతిని పూజిస్తేనే నిర్విఘ్నంగా పూజాఫలం లభిస్తుంది. కనుకనే మనం ఏ శుభకార్యం తలపెట్టినా, ‘ఓం’ ప్రథమంగా పసుపుతో గణపతిని చేసి “సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజ కర్ణకః” అంటూ గణపతి పూజ నిర్వహిస్తూ ఉంటాము. గణపతి సర్వదేవతా అనుగ్రహ ప్రదాత అని గణేశపురాణ వచనం. “విగతోనాయకః యస్వసః వినాయకః” అని వ్యుత్పత్తి. సర్వస్వతంత్రుడు నాయకులు లేని నాయకుడు.
నూటఎనిమిది ఉపనిషత్తులున్నాయని తెలుస్తున్నా, అందులో ఎనభై తొమ్మిది ఉపనిషత్తు గణపతోపనిషత్తు. పురాణాల ప్రకారం వినాయకుని అవిర్భావం బహు విచిత్రంగానే ఉంటుంది. గణపతి దేవుడు వేదమంత్రాలకు అధిపతియని, వేదాలు, ఉపనిషత్తులు కూడా అనేక విధాల స్తుతించాయి. ఈ సృష్టి అంతా ఎవరి వలన పుట్టిందో, ఎవరి మీద ఆధారపడి ఉందో, ఎవరిలో లయం అవుతుందో అట్టి సాక్షత్ పరమేశ్వరుడే గణపతి యని ఉపనిషత్తులు విశదీకరిస్తున్నాయి.
జ్యోతిశ్శాస్త్రంతో కూడా ముడిపడి ఉన్నది గణపతి ప్రాముఖ్యం. భాద్రపద శుద్ధ చవితి సూర్యోదయాత్పూర్వము గగనంలో హస్తా నక్షత్రం ఉదయిస్తుంది. సూర్యోదయాత్పూర్వవం ఉద్గమనమైన నక్షత్రాల నారాధించడం సంప్రదాయం. అది గణపతి ఆకారం గల నక్షత్ర సముహమని కొందరు జ్యోతిశ్శాస్త్రజ్ఞుల అభిప్రాయం.
మంత్ర శాస్త్రాల్లో గణపతి ఎంతో ప్రాముఖ్యత వుంది. ఇతడు నాగరి లిపిలోని ఓంకార రూపాన్ని పోలి ఉంటుంది. ఓం కారాకారుడు అనగా బ్రహ్మ, ఇతని ప్రణవ స్వరూపునిగా మన పూర్వులు ఉపాసించారు. యంత్రశాస్త్రంతో ఇతని ఉపాసన సంబంధాన్ని కలిగి ఉన్నది. ఇతని యంత్రం త్రిభుజరేఖలుగా పరిగణింపబడినవి. ఈ త్రిభుజాలు ఇచ్ఛాశక్తి, జ్ఞాన శక్తి, క్రియా శక్తులకు ప్రతీకలు.
విఘ్నాలకు నాయకుడు విఘ్నేశ్వరుడు. ‘వి’ అంటే విఘ్నం కాబట్టి విఘ్న గణాలను తన ఆధీనంలో ఉంచుకొని భక్తులకు అవిఘ్నాలనూ, భక్తి రహితులకు విఘ్నాలనూ ప్రసాదిస్తూ ఉంటాడు. గణపతి చేతుల్లో ధరించిన పాశం భక్తుల మనస్సులలోని మోహన్ని బంధిస్తుంది. అంకుశం దుష్టనాశనం కావిస్తుంది. ఆయన వరముద్ర భక్తాభీష్టాలను సిద్ధింపజేస్తూ ఉంటుంది. ఆభయముద్ర ఆత్మ తత్త్వవేత్తలకు మోక్ష రూపమైన అభయాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది.
మహాగణపతి ఆయుధాల తత్వం : ఆవిద్యా వాసనలు లేని బీజముతో నిండిన మాయరూప బీజఫలం, ఒక చేతను అవిద్యా కార్యమస్తకభేది, విద్యా రూపగదను, మనస్సు అనే చెఱకువిల్లును, త్రిపుటీరూప త్రిశూలాన్ని, సంసార రూప చక్రాన్ని, అజ్ఞానమనే నిద్రనుండి మేల్కొలుడానికి, మ్రోగించే శంఖాన్ని, రాగరూప పాశాన్ని, శుద్ధజ్ఞానం వల్ల వికసించిన హృదయం రూప ఉత్పలాన్ని, జీవులకు ఆనందం కలిగించేదిగా వడ్లకంకిని, ఖండనరూప భిన్నదంతాన్ని, జ్ఞానవిజ్ఞాన రత్నపూరిత అమృత కలశాన్ని పదిచేతులలోనూ, తొండమునందు ధరించినవాడు మహాగణపతి.
మాయాకార నరశరీరమూ కంఠానికి దిగువ ప్రదేశంలో పురుషాకార గజవదనం, కంఠ ప్రదేశానికి ఉపరిభాగాన రూపముగా కల్గినవాడు. జాగ్రత్, స్వప్న సుషుప్తి అనే మూడు స్వ ప్రపంచాలకు సాక్షిభూతమైన త్రినేత్రము కల్గినవాడు, బ్రహ్మశక్తి రూపమైన సిద్ధిలక్ష్మిని ఆలింగనం చేసుకున్నది శ్రీమహాగణపతి రూపం. ప్రపంచ సృష్టి, స్థితి, లయకారుడు అష్టపురి అనే ఈ శరీరంలో ఉండేవాడు, శ్రీ మహాగణపతి యొక్క సగుణరూపం.
విఘ్నేశ్వరుడికి వినాయక చవితి రోజు ఓం సుముఖాయ నమః మాచీ పత్రం పూజాయామి అని బృహతీ పత్రిని ఇలా బిల్వ పత్రం, దూర్వాయుగ్మం (గరిక), దుత్తూర (ఉమ్మెత్త), బదరీ (రేగు), ఆపామార్గ (ఉత్తరేణి), తులసి, చూత (మామిడి), కరవీర (గన్నేరు), విష్ణు క్రాంతి, దాడిమీ (దానిమ్మ), దావదారు, మరువక (దవనము), సింధూవార (వావిలి), జాజీ, గండకీ, శమీ (జమ్మి), అశ్వత్థ (రావి), అర్జున (మద్ది), అర్క (జిల్లేడు) 21 పత్రాలతో స్వామివారిని పూజిస్తే మనకి శారీరకంగా చాలా ఆరోగ్యం కలుగుతుంది. ఈ వినాయక పూజలోని పత్రిలో ఆ కాలానికి, అంటే వర్షాకాలానికి వచ్చే సాధారణ వ్యాధుల్ని నివారించే, నయం చేసే ఎన్నో ఔషధగుణాలు పుష్కలంగా ఉండడం వలన స్వామివారికి సమర్పిస్తారు.
మరో కోణంలో అంతర్గత దృష్టితో పరిశీలిస్తే 21 తత్వాలను ఏకం చేసి ఏకాగ్రతతో గణపతిని అర్చిస్తే జన్మరాహిత్యం, మోక్షం కలుగుతుందని శాస్త్రోక్తి. మన శరీరంలో ఇంద్రియాలన్నింటికీ అధిష్టాన దేవతలున్నారు. పైకి కనిపించే శరీరాన్ని స్థూల శరీరమని, లోపలి శరీరాన్ని సూక్ష్మ శరీరమని గురువులు బోధిస్తారు. ఇటువంటి స్థూల శరీరం జ్ఞాత తత్వాలతో కలిసి ఉంటుంది. మన సూక్ష్మ శరీరం 19 తత్వాలతో అధిష్టాన దేవతలతో కూడి ఉన్నది. పంచజ్ఞానేంద్రియాలు శ్రోత్రం, త్వక్, చక్షుర్, జిహ్వ, ఘ్రాణేంద్రియాలు. శ్రీతేంద్రియానికి దిక్కులు, త్వణేంద్రియానికి వాయువు, చక్షురింద్రియానికి సూర్యుడు, జిహ్వేంద్రియానికి వరుణుడు, ఋణేంద్రియానికి అశ్వినీ దేవతలు. ఇక కర్మేంద్రియాలు ఐదు అవి వాక్, పాణి, పాద, గుహ్య, వాయువులు. అయితే వాగ్వేంద్రియానికి అగ్ని, వాణేంద్రియానికి ఇంద్రుడు, పాడేంద్రియానికి విష్ణువు, గుహేంద్రియానికి ప్రజాపతి, వాయురింద్రియానికి మృత్యువు అధిష్టాన దేవతలు. వాయువులు ఐదు వ్యాస, ఉదాన, సమాన, ప్రాణ అని అపానములు. వీటికి విశ్వయోని, అజుడు, జయుడు, విశిష్ఠుడు, విశ్వకర్త అధిష్టాన దేవతలు. ఇక అంతఃకరణాలు నాలుగు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనస్సుకు చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, చిత్తానికి క్షేత్రజ్ఞుడు, అహంకారానికి రుద్రుడు అధిష్టాన దేవతలు. ధ్యానంలో ఈ 19 సూక్ష్మశరీర తత్వాలను దాటితే మహాత్తత్వం. మహాతత్వం నుండి అవ్యక్త తత్త్వము, అవ్యక్త తత్త్వము దాటితే, అంటే ఏక వింశతి తత్వాలు దాటితే మనలో ఉన్న ఆత్మ అంతటా నిండిఉన్న పరమాత్మలో లీనమవుతుంది. అందుకే గణపతికి ఏక వింశతి పత్రాణి పూజ నిర్వహణ అంతరార్థమిది. గణపతి ఏక వింశతి నామాలతో కీర్తింపబడుతున్నాడు. అందుకే ఏకవింశతి పూజ కల్పంలో విధింపబడింది. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, దశేంద్రియాలు, మనస్సు అనే 21 ఏకవింశతి తత్వాలపై గణపతికి అధికారం ఉన్నది. కాబట్టి ఏకవింశతి నామాలు, ఏక వింశతి పత్రపూజ విధింపబడినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది.
వరదాభయహస్తుడైన, గజాననుడు ఆశలనెడి పాశాలలో జీవుని తగుల్కొననీయక అంకుశంతో గజం యొక్క మత్తును విదలించినట్లు జీవుని నిత్య జాగరూనికి చేస్తూ, మోక్షమనేడి వరదానాన్ని ఇచ్చి, అభయమనే అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. గణపతిని సేవించి, పూజించి, ఆరాధించి ఆయన కృపకు పాత్రులు కావాలి!
కావ్య సుధ (హరిశంకర్)