Home Uncategorized మయూఖ ఫిబ్రవరి శిశిర సంచిక సంపాదకీయం

మయూఖ ఫిబ్రవరి శిశిర సంచిక సంపాదకీయం

by mayuukha

ప్రకృతి ఎంతో విచిత్రమైంది. మానవ ప్రకృతి కూడా అంతే విచిత్రమైంది. భూమి గుండ్రంగా ఉంటుందని నిరూపించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని ఏనాడో ఒడిసిపట్టుకుని కష్టాలను, బాధలను అధిగమించి ఉన్నత స్థాయికి పోయే ప్రయత్నాలు నిరంతరం చేసే చరిత్ర మనిషిది.

ఎరుక పిడికెడు ధనము అని అంటారు. ఎంత ఎక్కువ విషయాలు తెలిస్తే అంత అభివృద్ధి సోపానాలు అవుతాయి అనే అర్థం ఉన్న మాట ఇది. అటు కొత్త సంవత్సరం 2022 వచ్చింది, ఇప్పుడు శిశిర ఋతువులోకి అడుగుపెడ్తున్నాం. ఇటు శోభకృత్ నామంతో వసంత ఋతువును మళ్ళీ తొందరలోనే చూడబోతున్నాం. తెలుగు, ఇంగ్లీషం క్యాలెండర్ల ప్రస్తావన కాదు. ఇక్కడ ఓ రెండు నెలల కాలం మనకు ఇచ్చిన జ్ఞాపకాలను స్పృశించుకోవడం. ఏడాదిలో కొన్ని రోజులకు కొన్ని ప్రత్యేకమైన పేర్లు పెట్టుకొని పిలుచుకుంటున్నాం. ఇది ఎందుకు అంటే ముందు అనుకున్నట్లు ఒక ‘ఎరుక’ కోసం.

స్వాతంత్ర్యం సాధించుకున్నప్పటి నుండి సమాజానికి చేరువ కావాల్సిన ముఖ్యాంశాలపై నిర్వహించే‘దినోత్సవాలు‘ ప్రజలకు చేరువవుతూనే ఉన్నవి. మానవ హక్కుల దినోత్సవం, మానవ ఐక్యతా దినోత్సవం , కార్మిక దినోత్సవం వంటివి. హక్కుల ప్రాముఖ్యత తెలుపడానికీ, సంఘటిత శక్తిని తెలుపడానికీ ఏర్పరుచుకున్నవి. అట్లాగే దేశస్థితిని తెలియజేసే స్వాతంత్ర్య దినోత్సవం , గణతంత్ర దినోత్సవం కూడా మనవే ! మనిషి కి గృహానికీ గల సంబంధబాంధవ్యాలు తెలియాలని, కుటుంబ , జీవన సావకాశాలు తెలియాలని, మాతృదినోత్సవం, గురుపూజ దినోత్సవం వంటివీ మనకోసమే . భాష మన సంపద అని చెప్పే గుర్తుగా మాతృభాషా దినోత్సవాన్ని ఫిబ్రవరి 22ను జరుపుకోవడమూ ఒక ఎరుక కోసమే. అదేవిధంగా కాన్సర్ అనే జబ్బును తెలిసేలా ‘కాన్సర్’ డే లూ ఏర్పరచుకున్నాం.
సమాజంలో ఏదైనా చెడు విస్తరిస్తుంటే, దాష్టీకాలు ఎక్కువుతుంటే ‘కాన్సర్ లా ప్రాకుతున్నది’ అని వ్యాఖ్యానించే అలవాటున్నది. ఒక జబ్బును చెడుకు పోలుస్తూ చెప్పడం ఇది. కాన్సర్ వల్ల మనుషులు మరణం వరకూ పోవడమో , బ్రతికున్నన్నాళ్లూ చికిత్స చేసుకోవాల్సి రావడమో జరుగుతున్నది. రకరకాల కాన్సర్లకు రకరకాల పేర్లు. శరీరంలోని జీవకణాలు కొన్ని అసాధారణంగా పెరుగుతుండటం కొందరిలో జరుగుతుంది. ఇదే ప్రాణాంతకమవుతుంది.
శరీర కణ విభజనలు ఒక క్రమపద్ధతిలో, నియంత్రణలో ఉంటాయి. ఒక్కోసారి కణాల పెరుగుదల ఉండాల్సిన నియంత్రణలో ఉండక అతివేగంగా పెరిగి ఒక కంతిలాగా అవడాన్నే కాన్సర్ వ్యాధి అంటారు. ఆంకాలజీ, Oncology ఒక పెద్ద సబ్జెక్ట్. ఈ భయంకరమైన వ్యాధిని పరీక్షలు, అధ్యయనాలు చేసి, ప్రారంభదశలోనే గుర్తిస్తే, తగ్గించే అవకాశాన్ని చేజిక్కించుకొని, ఆరోగ్యవంతులు అవ్వవచ్చు.

ఆహారపు అలవాట్లు కావచ్చు, పనిచేసే వాతావరణం కావచ్చు, వ్యసనాల వలన ముఖ్యంగా దూమపానం, అతి మద్యపానం వల్లనూ రావచ్చు. చెడు అలవాట్ల తో నిర్లక్ష్య ధోరణి కూడా కారణం కావచ్చు. అయితే ఈ అన్నీ కూడా నివారణకు వీలైనవే. కాని వీటితో పాటు వంశపారంపర్యంగా హెరిడిటీగా వచ్చే జబ్బులు ఉంటాయి . అవి మినహాయిస్తే మిగతా కారణాలన్నీ మనిషిపై వ్యాపార మాఫియాలు చేస్తున్న కనబడని దాడిగా ఏం అనుమానం పడకుండా చెప్పవచ్చు. వ్యసనాలను వీడని మానవ నైజాన్ని పెద్ద కారణం గా చెప్పవచ్చు. ఇక్కడ కారణాల కంటే దోపిడి వర్గాల దుశ్చర్యలే ఎక్కువ ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ఈ ఇనుప గుప్పిళ్లనుండి బయటపడేలా ప్రయత్నపూర్వకంగా జీవిస్తే తప్ప ఇటువంటి కాన్సర్ల నుండి బయటపడగలదు మానవ సమాజం.
అయితే రేపు మార్చి 8న జరుపుకోబోయే మహిళాదినోత్సవాన్ని ఒకసారి స్మరణకు తెచ్చుకున్నప్పుడు మొన్ననే, ఫిబ్రవరి 4న విన్నటువంటి కాన్సర్ డేను గుర్తుకు తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా సభ్య సమాజంపైన ఉన్నది. ప్రతి ఇంట్లో స్త్రీలు అమ్మగానో, అక్కగానో, చెల్లిగానో, భార్యగానో, బిడ్డగానో ఉండే ఉంటారు. కాబట్టి ఈ సమస్య స్త్రీల ఒక్కరిదే కాదు పురుష ప్రపంచానిది కూడా! ఇంట్లో ఆడవాళ్ళకు అనారోగ్యంగా ఉంటే ఆర్థిక, హార్థిక ఇబ్బందులు వచ్చేది మొత్తం కుటుంబానికి కూడా! కుటుంబం అంటేనే స్త్రీ పురుషుల సమాన భాగస్వామ్యంలో ఉండేది కాబట్టి ఇది సభ్య సమాజం బాధ్యత అనడం. ఇదంతా ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళకు ఈ కాన్సర్ గురించి ఎవేర్ నెస్, తెలివిడిని కలిగించాలి అని! నిర్లక్ష్యమో, తెలివి తక్కువతనమో, తెలియనితనమో, మొండితనమో, అమాయకతనో, ఆర్థిక ఇబ్బందులో, ఇంట్లోవాళ్ళకు చెప్పే ధైర్యం లేకపోవడమో, బిడియమో, ఆర్థికస్వేచ్ఛ, స్వీయ ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడమో ఒక్కటేమిటి ఎన్నో కారణాలు రణాలై స్త్రీలను బాధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వీటిని గమనించాల్సిన ధర్మం ఎవరిది?
ఒకే చూరుక్రింద మసిలే అందరిదీ! అందుకే ఇంట్లో ఆడవాళ్ళను తరచూ వారి ఆరోగ్యాన్ని గురించి కనుక్కోవాలి. అవసరమైన పరీక్షలు, ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నదో లేదో తెలియజేసే మోమోగ్రామ్ అనే పరీక్షను చేయించుకొమ్మని, ఇది ముందు జాగ్రత్తనేగాని, అనుమానపడి భయానికి గురికావద్దని నెమ్మదిగా నచ్చచెప్పి హాస్పటల్ కి తీసుకెళ్ళి దగ్గరుండి పరీక్షలు చేయించాలి. వాళ్ళంతట వాళ్ళు హాస్పిటల్ కు వెళ్ళి పరీక్ష చేయించుకోలేని స్త్రీలే అధికశాతం ఉంటారు. తండ్రి గా , భర్తగా, అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా మామగారిగా మగవారి బాధ్యత అందరి బాధ్యత అనుకున్నప్పుడే ఈ జబ్బు నుండి బయటపడడం, భయం దీర్చుకోవడం జరుగుతుంది. ఆలోచించాలి, ఆచరించాలి. అప్పుడే మదర్స్ డేలు, మహిళా దినోత్సవాలు ఎందుకు చేస్తున్నాం అనే సోయి వస్తుంది.
సర్వకాల సర్వావస్థలలో తెలివైన జీవిగా మనిషి నిలబడాలి అంటే ఎరుకతో ఉండాలి. ఏడేడు తరాలకూ ఆదర్శంగా ఉండాలి. అసలే ‘కోవిడ్ 19 ‘ వచ్చి ప్రపంచాన్ని క్రిందమీద చేసింది. కరోనా కంటే ముందు , కరోనా తరువాత అని ఏదో శకాల గురించి చెప్పుకున్నట్టు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. కరోనా కొంత తగ్గు ముఖం పట్టింది అనుకుంటుంటే డిఫరెంట్ వెరియంట్స్ తో మిమ్మల్ని వదలను అని హెచ్చరిస్తున్నట్టు ‘ఒమిక్రాన్’ అనేదీ దాడి చేసింది. ఇంకా ఏం వస్తాయో, ఎట్లా వస్తాయో తెలియక, అగమ్య గోచరంగా ఉన్నది. అయినా చింతించాల్సిన పనిలేదు. ఎదురీదాలి. గెలవాలి. ఇదే కదా చేయాల్సింది.
ఆర్థిక మాంద్యము, ద్రవ్యోల్బణమూ వంటి పెద్ద పెద్ద పదాల అర్థాలూ, ప్రభావాలూ తెలియని అతి సామాన్యులు మన చుట్టూ ఉంటారు. వాళ్లను గమనింపు లోకి తీసుకోవాలి. ఈదురుగాలులకు నిలువగలవు చిన్న చిన్న చెట్లు . కాని తుఫాను భీభత్సాలకు నిలువగలవా! ప్రజలు… ప్రజలు…ఎక్కడ చూసినా ప్రజలు సామాన్య ప్రజలు ఉన్నారు, పేద ప్రజలూ ఉన్నారు. వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ప్రతి మనిషీ ఒక సిఐడీ ఆఫీసర్ లాగా, ఒక సిన్సియర్ పోలీస్ లాగా, ఒక వీర జవాన్ లాగా ఒక నిఘా యంత్రపు కన్నులా ఉండాలి, చూడాలి. ఏదైనా తెలిస్తే చెప్పాలి , తగిన సలహా లు ఇవ్వాలి , సహాయాలూ చేయాలి . అప్పుడే కాన్సర్ ను జయించగలం, కాన్సర్ లా వ్యాపిస్తున్న అన్యాయాలనూ ఎదిరించగలం. అడ్డుకొనగలం – ఆరోగ్యవంతులం కాగలం.

అదిగో యుద్ధాలు – ఒక దేశంపై మరో దేశం యుద్ధం చేయడం చూస్తున్నాం. ఇది ఏ ఆటవిక దృశ్యమూ కాదు. అత్యాధునిక శాస్త్ర సాంకేతిక అతి విజ్ఞానపు దుశ్చర్యల దురాక్రమణల పర్యవసానం . ఈ పసిగట్టలేని అన్యాయం ఎంతో ఉన్నది. ఇలా సమయం వచ్చినప్పుడల్లా మాట్లాడుకోవలసిందే . విజ్ఞులందరికీ ఇవి తెలియనివా ? అన్నీ తెలుసు కాని మౌనం ప్రధానపాత్ర వహిస్తుంది. హెచ్చరిక ఇవ్వచూస్తుంటుందీ లోకం!

ప్రకృతి విచిత్రమైందనుకున్నట్టే, ప్రకృతి సమయపాలనలో దిట్ట! అదిగో శిశిరం పోయి వసంతమూ వస్తుంది. మార్చి పోయి ఏప్రిల్ కూడా వస్తుంది. క్యాలెండర్ లో డేట్స్ మారకుండా ఉండవు, కాలంలో ఋతువులు మారకుండా ఉండవు, మరి మనుషులుగా వయసు మారుతున్నప్పుడు బుద్ధి జీవులు గానూ మనం మారకుంటే ఎట్లా? మారుదాం, మారుద్దాం! కాస్తంత ముందుచూపు, కాస్తంత ఎరుక ఇంతే చాలు. కొత్త సంవత్సరంలో సంతోషకర విశేషాలు పంచుకుందాం అని మంచి ని ఆశిద్దాం!!
__ కొండపల్లి నీహారిణి

You may also like

Leave a Comment