Home వ్యాసాలు మరో మాగ్నాకార్టా

మరో మాగ్నాకార్టా

by Madiraju Brahmananda Rao


ప్రజాకవి వేణుశ్రీ శతకపరంపరలో నాయకశతకం మూడవది. ఇంతకుముందు ప్రచేతసశతకం-కైరవశతకాలను రచించాడు. ఈ రెండు శతకాల్లోను రాజకీయ-సామాజికాంశాలకు సమప్రాధాన్య మివ్వబడింది. కాని ఈ నాయకశతకం ఫక్తు రాజకీయ శతకమే. ఇందులో మనకు కేవలం బడాబడా నాయకులే కనిపిస్తారు. వారు చేసే రాజకీయ (వికృత) క్రీడలే ఈ శతక వస్తువు.
”నాయకుల గుణముల మార్చ నారసింహ-వేగరావయ్య భువి పైకి వేడ్కజేయ ” అనే మకుటంతో 109 సీసపద్యాలతో నాయక శతకం కూర్చబడింది . కవి జన్మభూమి ఋణం తీర్చుకొంటూ-స్వంత గ్రామంలో కొలువైయున్న శ్రీనరసింహస్వామికి ఈ శతకమంకిత మిచ్చాడు. సామాన్యంగా నారసింహునకంకితమిచ్చే రచనలన్నీ దాదాపు విప్లవాత్మక-బీభత్సాలు గానే ఉంటాయి. నరసింహ తత్త్వమే అట్టిది. ఇదే పద్ధతిలో ఈ శతకరచన సాగుతుంది. పూర్వరచయితలు పలువురు ”దుష్టసంహార నరసింహ దురితదూర” అంటూ సంబోధించి దుష్టులను చంపేయమని కోరగా –వేణుశ్రీ వారిపై కొంత మేర జాలిచూపి అట్టి దుష్టులస్వభావాన్ని మార్చమనే కోరాడు.
ఈనాటి రాజకీయమెంతటి భయానకంగా తయారయిందో నాయక శతకం కళ్లకు కట్టినట్లు చూపించింది. శతకారంభంలో పూర్వపు నాయకులు రాజకీయాలనెంత ఉన్నతంగా నడిపించారో తేటతెల్లం చేస్తూ–నేటి నాయకులెంతగా వాటిని భ్రష్టు పట్టించారో రచయిత మొదటగా అంచనా వేసాడు. దేశ పరమార్థాన్ని కోరి ఆనాటి నాయకులు ఏ విధంగా స్వార్థ త్యాగం చేసి జైళ్లకు వెళ్లారో చెప్పి-ఈ నాటి నాయకులు స్వార్థంతో స్వలాభాన్ని కోరి ప్రజలను ఏవిధంగా ఇక్కట్లపాలు జేసి జైళ్లలో కుక్కుతున్నారో తులనాత్మకంగా పరిశీలించి ఆనాటి, ఈనాటి నాయకుల తారతమ్యాన్ని గ్రహించమని మొదటి పద్యంలోనే ప్రజాకవి కోరుతున్నాడు. నాందిగా రూపొందింపబడిన ఈ కోరికే శతకమంతటా విస్తరింపబడింది. ప్రచేతస-కైరవ శతకాల్లోని రాజకీయాంశాలకు కొనసాగింపుగా నాయక రాజకీయాంశాలిందు ప్రస్తావింపబడ్డాయి. మొదటి రెండు శతకాల్లో రచయిత నాయకులను సుత్తితో కొడితే ఈ
శతకంలో నాయకులను సమ్మెటతో మోదాడు.
1
ఈశతకంలో చెప్పబడ్డ నాయకులేయొక్క రాష్ట్రానికో సంబంధించిన వారు కారు. దేశం లోని అన్ని రాష్ట్రాల్లోను నాయకులు వెలగబెడుతున్న నిర్వాకాలివ్వే. మనం తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్నాం కాబట్టి– ఉభయ రాష్ట్రాల్లోని నాయకులను దగ్గరుండి గమనిస్తుటాం కాబట్టి- తేలిగ్గా ఉభయ రాష్ట్ర నాయకుల స్వరూప స్వభావాలనే మన ఆలోచనలను పరిమితం చేసుకొని ఈ శతకాన్ని విమర్శిస్తాము. కాని ఇందలి వస్తువు అపరిమితమైన మేరగలిగినట్టిది.
వేణుశ్రీ రాజకీయ నాయకులను చాలా నిశితంగా దగ్గరనుండి గమనిస్తూ–రాజకీయ స్థితిగతులను సమీచీనంగా అవలోడనం చేస్తూ ఈశతకాన్ని ఆధునిక రాజకీయ వ్యవస్థకు దర్పణంగా మలిచాడు. అందుకే ఇందలి విషయాలు గానీ-నాయక పాత్రలు గానీ సులభంగా కళ్లకు కట్టినట్లు కనబడతాయి. రాజకీయపరంగా ఇందు ప్రస్తావింపబడని అంశమంటూ ఏదీ లేదు. నేడు రాష్ట్రంలో ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయో తెలుసుకో్వాలనుకుంటే ఈ శతకాన్ని చదివితే చాలు. అవగతమై పోతుంది. శ్రేష్ఠ-దుష్ట పాలనావ్యత్యాసాన్ని గమనించాలంటే ముందుగా వినీతనాయకుల ప్రశంసలు-అవినీతి పాలకాభిశంసనలు చేయాలి. ఈ పనే వేణుశ్రీ ఈ శతకంలో చేసాడు. శతకారంభ పద్యంలోనే నాటి నాయకులను ప్రశంసిస్తూ ”ఒకనాటినాయకులోర్పుతో ప్రజలను కష్టపెట్టకుండ కలసి మెలసి” అంటూ పూర్వనాయకుల నిబద్ధతను ప్రశంసిస్తూ ”నేటి నాయకులు స్వార్థనేతలైరి” అంటూ అని మొదటి పద్యాన్ని ముగించాడు. శతకానికి నాందీయనదగిన ఈ పద్యం లోనే శతకప్రణాళిక యేమిటో కవి స్పష్టపరిచాడు. పాలకుడు మంచిపాలన అందిస్తే ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు. పండగ చేసుకుంటారని ”రాష్ట్ర ప్రజకు బాధ రాకుండ పాలించి ” (79) అనే పద్యంలో స్పష్టం చేసాడు. ”మంచిమనసు నాయకులను మరవరెవరు ”(95) అని చెప్పి దీనికి వ్యతిరేకమైతే ఆతనిని ఆ ప్రజలే అథ:పాతాళానికి త్రొక్కుతారన్నాడు.
ఈ శతకంలో వేణుశ్రీ రాజకీయంగా అన్ని సంఘటనలను మన దృష్టికి తీసుకొని వచ్చాడు. ఏ విషయాన్ని విడిచి పెట్టలేదు. ఉచిత పథకాలు-ఆ పథకాల మాటున ఉండే నయవంచనలు; భూ ఆక్రమణలు- వాటి వెనుక దందాలు, భూమి రిజి్ష్ట్రేషన్లు-ధరణి పోర్టు
2
లావాదేవీలు; అధిక పన్నులు-అక్రమసంపాదనలు-కుంభకోణాలు; గిట్టుబాటు ధరలు-కోల్డు స్టోరేజులు; ఇండ్లకేటాయింపులు-డబుల్ బెడ్ రూములు; కుల, మత సంఘాలు-వాటి మధ్యచిచ్చు; క్రీడాసంఘాలు-వాటిపై అజమాయిషీ; అక్రమ కట్టడాలు-నాయకుల అనుచిత లబ్ధి; సాహిత్యసంఘాలు-వాటి వైరం; ఉద్యోగస్థుల-పెన్షనర్ల జీతాలు- ఇట్లా ఒకటేమిటి-చెప్పుకుంటూ పోతే అనేకాంశాలిందు చోటుచేసుకున్నాయి. నాయకులు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదని ఒకవేళ పట్టించుకున్నా అది తమకు లాభాన్ని చేకూర్చే పథకంగా రూపొందించుకొంటారని వేణుశ్రీ ఆవేదన. ప్రజలను గొఱ్ఱెలను చేసి నాయకులు వాటిని ఉచిత పథకాలంటారు. ”ప్రజలు గొఱ్ఱెలనియు పథకములను పేర –ఉచితమనియు పంచి ఊసులెట్టు ” (16). అంటూ ఇవన్నీ ఓట్ల కొనుగోలు పథకాలే అని రచయిత నిర్ణయం. ఇట్లా నాయకులు ప్రవేశపెట్టిన పథకాలనేకం ఈ శతకంలో ప్రస్తావింపబడ్డాయి. విజయోత్సవాలు-దశాబ్ది ఉత్సవాలు- విధవలు, వృద్ధుల పథకాలు బతకమ్మచీరెలు-బియ్యం పథకాలు-పెండిండ్లపథకాలు- (32) మొదలైన వన్నీనాయకులు చిత్తశుద్ధితో చేసేవి కావు. కేవలం ఓట్లు దండుకోవటానికే.
ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు ప్రజా సంక్షేమానికై ప్రవేశపెట్టబడ్డాయి. నేటి నాయకులు వాటినికూడా తమ స్వార్థానికై భ్రష్టు పట్టించటం నిజంగా బాధాకరమే. ఇందులో ప్రథానమైనవి విద్య-వైద్యరంగాలు. ప్రస్తుత పాలకులు ఎయిడెడ్ పాఠశాల, కళాశాలలను ఎత్తివేసారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం ఛెసారు. కార్పొరేట్ వారు దోచుకోవటానికి అనుకూలంగా విద్యావిధానాన్ని మార్చివేసారు. ఆస్పత్రులను కూడా ఈ విధంగానే ప్రజలకందుబాటు కాకుండా విధానాలనన్నిటినీ మార్చారు. ఇష్టమైన విధంగా వారే ఫీజుల నిర్ణయించుకొనే నియమాలు రూపొందించారు. పెట్టుబడులు పెట్టి పెద్దయాస్పత్రుల/ వ్యాపారసంస్థల పాఠశాలలుబెట్టి .. ” (99) అంటూ తన అసహనాన్ని కవి ఇట వెలిబుచ్చాడు.
ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుల మధ్య పార్టీల మధ్య పరస్పర విద్వేషాలు తారాస్థాయినందుకొన్నాయి. చట్టాలు చేసి వాటి ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లవలసిన నాయకులు కేవలం దూషణలకే పరిమితమయ్యారు. అసెంబ్లీలలో సహితం
3
కారుగూతలకే ప్రాధాన్యమిచ్చారు. వ్యక్తిగత ఆవేశ కావేషాలు హద్దులు దాటాయి. ఇదేమని ప్రశ్నిస్తే వారిని జైలుపాలు చేస్తారు. పార్టీలు మారటం -విడిచిన పార్టీని తిట్టటం సర్వసాధారణమైపోయాయి. ఈ పెడ సంస్కృతిని నిరసిస్తూ రచయిత విపుల సమీక్ష చేయటం 41-42-43 పద్యాల్లో గమనింప వచ్చు. ఇటీవల బాగా ముదిరిన సలహాదారుల సంస్కృతిని గూర్చి చెపుతూ ”నాయకుల సలహానందించె వారల-శకుని పాచికలాగా శల్యపాత్ర ” (6) వారిది శకుని, శల్యపాత్రలన్నాడు.
ఈ శతకం ప్రస్తావించిన ముఖ్యమై అంశాలు మరో మూడున్నాయి. 1. రైతులవెతలు 2. సాహిత్య సంస్థలు 3. స్వంత రాజ్యాంగం. నాయకులు రైతులను బానిసలుగా మార్చారు. వ్యవసాయ ఫలాలన్నీ కార్పొరేట్ సంస్థలకు ముట్టేటట్లు చేసారు. కోల్డ్ స్టోరేజులంటూ ఊదరగొట్టారు. (25) తమకు నచ్చిన సాహిత్య సంస్థలను ఆదరించారు. తమను పొగిడే కవులకు పదవులిచ్చారు(98). చివరకు కవులు కూడా నాయకప్రలోభాలకు లొంగిపోయారంటూ” దురభిమానం తోడ దొరల కవితలన్ని–వాస్తవాల నసలే వ్రాయలేరు” (8) అంటూ ఏ పరిణమాన్ని తాను కోరలేదో ఆ పరిణామమే కవుల్లో చోటు చేసుకోవటం వలన సాహిత్యవేత్త అయిన రచయిత ఈసందర్భంగా పొందిన అంతర్మథనం అంచనావేయలేనట్టిది.
నాయకులు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని విడబుచ్చి స్వంత రాజ్యాంగాలను రచిస్తున్నారు. వాటినే అమలుపరుస్తున్నారు. చివరకు కోర్టులన్నా, కోర్టు ధిక్కరణలన్నా లక్ష్యపెట్టటం లేదు. ఈ విషయమే ”రాజ్యాంగమములును రక్షణ చేయుచు” (105) అనే పద్యంలో చెప్పబడింది.
ఇక నాయకుల అక్రమసంపాదన గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. రాజకీయాలెప్పుడైతే సేవాధర్మాన్ని వదలిపెట్టి అనైతిక సంపాదనకు తెరదీసాయో అప్పుడే ప్రజాజీవితం ప్రశ్నార్థకమయింది. యువతను ప్రలోభ పెట్టి తమ బానిసలుగా మార్చి యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారు. విజ్ఞానవంతులను ప్రక్కకు నెట్టివేసారు. (97) ఉన్నతాదర్శాలతో మెలగవలసిన నాయకులు చివరకు కాముకులై ప్రవర్తించటం క్షమింపరాని నేరమంటూ గర్హించాడు(84).
4
నాయక శతకం ప్రస్తుత నాయకుల వ్యవహార చిత్రాలను సమీక్షించే శతక సర్వస్వం. ఇట్లాంటి నాయకమ్మన్యులను సరిజేయటానికి ప్రజలహక్కులపత్రమీ శతకం. గాడిదప్పిన రాజకీయాలు-నీతిదప్పిన నాయకులు మారాలంటూ ” కులమతభేదాల కూకటివేళ్లతో-పెకలించు పార్టీలు పెరగవలయు”(108)అని శతకాంతంలో కోరుకున్నాడు. శతకానికి భరత వాక్యంగా ”దేశసౌభాగ్యమింకను తేజమొప్పు-జనులు సుఖసంతసమ్ముల సరిగనుండు” (109) అని చెప్పిన రచయిత సమీహ నెరవేరాలని కోరుకుందాము. చిరంజీవి వేణుశ్రీ ప్రజోపకరాలైన మరిన్ని రచనలు చేయాలని ఆశిద్దాం.

You may also like

Leave a Comment