Home వ్యాసాలు ‘మహాప్రస్థానం’లో మహిళాభ్యుదయం

‘మహాప్రస్థానం’లో మహిళాభ్యుదయం

by Raprolu Sudarshan

తెలుగు సాహిత్యంలో మహిళల జీవితాల్ని చిత్రిస్తూ ప్రత్యేక రచనలు వెలువడ్డాయి. మొదట్లో జగన్మాత, లక్ష్మీ, సరస్వతి మొదలైన స్త్రీ దేవతామూర్తుల ఔన్నత్యం, ఆ తర్వాత సావిత్రి, అరుంధతి, అనసూయ, దమయంతి ఇత్యాది మహిళామతల్లుల పాతివ్రత్య వైవిష్ట్యాన్ని తెలిపేవి గమనిస్తాం. ఆధునిక కాలంలో సామాజిక స్ప ృహతో కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, చెలం, కొడవటిగంటి కుటుంగారావు, శ్రీశ్రీ వంటి రచయితలు స్త్రీల జీవితాల్ని తీసుకొని వాళ్ళు పడుతున్న కష్టాల్ని చూపుతూనే కొందరు బైటపడే మార్గాల్ని చూపారు. ఆతర్వాత 1980ల నుంచి మహిళా దృక్కోణం (Feministic)  నుంచి ప్రత్యేక రచనలు ఆరంభమై ఉద్యమ రూపం దాల్చినవి. దీనికి ఓల్గా, కొండేపూడి నిర్మల, జయప్రభ, సావిత్రి, శిలాలోలిత మొదలైన వారిని పేర్కొనవచ్చు. ఇలా మహిళా దృక్కోణం నుంచి నేటికీ వెలువడుతూనే ఉన్నాయి. ఇలాంటి వారిలో మహాకవి శ్రీశ్రీ రచనల్లో మకుటాయమానమైన ‘మహాప్రస్థానం’లో మహిళాభ్యుదయం  ఉన్న తీరును విశదీకరించడమే ఈ వ్యాస పరిధి.

తెలుగు సాహిత్యం 1930ల వరకు తనను నడిపిస్తే, అప్పటి నుంచి దానిని తను నడిపినట్లు చెప్పుకున్న మహాకవి శ్రీశ్రీ రచనల్లో అక్కడక్కడ స్త్రీల దృకోణం నుంచి  రచించినట్లు మనం గమనిస్తాం. ‘ఒసే తువ్వాలందుకో’ అనే కథానికలో పురుషాధిక్య సమాజం లో ప్రతీక్షణం స్త్రీ ఎలా నలిగిపోతున్నదో తెలిపే ఇతివృత్తంతో రాశాడు శ్రీశ్రీ.  ‘హేమంతం’ అనే కథానికలో ‘భిక్షువర్షీయసీ’ కవితలోని అవ్వనే యౌవనంలో ఉన్న తీరును ఇతివృత్తంగా చేసుకొని శ్రీశ్రీ రచించాడు. ఇలాగే పురాణ పాత్ర అయిన శూర్పణఖను తీసుకొని ఆమెకు జరిగిన అన్యాయాన్ని కథానికగా ‘శూర్పణఖ మాన సంరక్షణ’ అనే కథానిక రాయడం జరిగింది. నాటక ప్రక్రియలో ఒంటరిబావి, భూతాల కొలిమి మొదలైనవి  స్త్రీ కోణం నుంచి రాసినవే. ఓ సినీ (దేవత) గేయంలో ‘‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి…’’ అంటూ స్త్రీ జాతి ఔన్నత్యాన్ని అక్షరీకరించాడు శ్రీశ్రీ.

‘‘క్రిష్ణశాస్త్రి తన బాధని అందరిలోనూ పలికిస్తే, శ్రీశ్రీ అందరి బాధనూ తనలో పలికిస్తాడు’’ అని ‘మహాప్రస్థానం’ పీఠికా కర్త చెలం చెప్పిన దానిలో ‘‘అందరి బాధనూ’’   అనడంలో స్త్రీలు కూడా ఉంటారని చెప్పకనే చెప్పినట్లైంది. మహాకవి శ్రీశ్రీ రచనల్లో అత్యధికంగా ప్రజాదరణ పొందిన ‘మహాప్రస్థానం’ కావ్యంలో పతితుల, భ్రష్టుల, బాధాసర్పద్రష్టులైన మహిళలకు ‘పరిపూర్ణపు బ్రదు’కొచ్చేందుకు ప్రస్తావించిన వాటిని పరిశీలిద్దాం.

నలభై కవితలతో 1950లో వెలువడిరది ‘మహాప్రస్థానం’ కవితా సంపుటి. ఇందులోని చాలా కవితలు 1933 నుంచి 1940 మధ్యలో రాయబడినవి, వివిధ పత్రికల్లో ముద్రితమై ఖ్యాతిని ఆర్జించినవి. ఈ కావ్య శక్తిని, ప్రభావాన్ని చెలం చెబుతూ ‘‘… పాత పద్ధతులు, విశ్వాసాలు, ధర్మాలు అన్నీ ఓ మూలనించి  కూలిపోతున్నాయని’’, ఈ కావ్యం    కూల్చుతుందనే ధోరణిలో చెప్పారు. ఇందులో స్త్రీల పట్ల ఉన్న పాత భావనలూ నశిస్తాయని అంతరార్థంగా భావించవచ్చు. సమసమాజాన్ని సాధించడమే ఈ కావ్య లక్ష్యంగా  పేర్కొంటాం. శ్రీశ్రీ కలలుకంటున్న ‘మరోప్రపంచం’లో సమసమాజమే ఉంటుంది. ఆ సమసమాజం కేవలం వర్గ వ్యవస్థకే గాక ‘స్త్రీ, పురుష సమానత్వం’ కూడా   చెప్పుకోవచ్చు. అటువంటి ఈ కావ్యంలోని కవితలను మహిళా దృక్కోణం నుంచి చూసినప్పుడు మూడు  రకాలుగా విభజించవచ్చు. అవి: 1. అచ్చంగా స్త్రీల గురించి రాసినవి, 2.   పార్శ్వంగా తరుణులను పేర్కొన్నవి, 3. లింగం (Gender)) చెప్పకుండా స్త్రీ, పురుషులిద్దరికీ వర్తించే విధంగా రాసిన కవితలు. ఈ వింగడిరపుతో వివరంగా చూద్దాం.

అచ్చంగా స్త్రీల గురించి రాసిన కవితలు:

మహాప్రస్థానంలోని మంచి కవితల్లో ఒకటి ‘భిక్షువర్షీయసి’. ఇది 13`8`1938 నాడు రాసిన కవిత. ఈ కవితలో బిచ్చగత్తె దీన, హీన స్థితిని కళ్ళకు కట్టినట్లు చిత్రించాడు    శ్రీశ్రీ. ఇందులో ఏడు స్టాంజాలు ఉన్నాయి. ‘‘దారిపక్క, చెట్టు కింద / ఆరిన కుంపటి విధాన / కూర్చున్నది ముసల్దకతె / మూలుగుతూ, ముసురుతున్న / ఈగలతో వేగలేక’’ అనే మొదటి స్టాంజాలో కలం కుంచెతో దారిని, పక్కనే ఓ చెట్టును, దాని కింద ఓ   ముదుసలి కూర్చున్నట్టు చిత్రాన్ని రూపుకట్టించాడు. ఇలా కెమెరాతో ఛాయాచిత్రాన్ని బంధించినట్టుగాక, వీడియో కెమెరాతో ఆమె చేష్టలనూ చిత్రించి ఆ ముసలావిడ మూలుగులను వినిపించాడు, తన మీద ముసురుతున్న ఈగలను తోలేంత శక్తిలేకపోయిన      తీరును ‘వేగలేక’ అనే పదంతో కళ్ళకు కట్టాడు శ్రీశ్రీ. ఇంకా ‘‘ఆరిన కుంపటి విధాన  కూర్చున్నది’’ అనడం వల్ల ఒకప్పుడు బాగా మండి, ఆ మంట ఎవరికి ఎలా కావాలో  అలా సహాయపడి, ప్రస్తుతం నిస్సహాయ స్థితిలో పడి ఉందనే భావాన్ని ప్రదర్శించాడు  కవి.

ఆ బిచ్చగత్తె శరీర సౌష్టవాన్ని చెప్పబూనుకొని ఆమె తలను ప్రతిరోజు స్త్రీలు పొద్దున్నే  వాడే తెల్లటి ముగ్గు బుట్టలా ఉందని, ముదిమి వల్ల శరీరంలో ఏర్పడ్డ ముడతలు, ఆరోగ్యవంతులకు ఉండే శక్తివంతమైన కళ్ళు కాస్త కాంతి విహీనంగా మారడమేగాక ఆమె శరీరంకన్నా శవం నయమనిపించేంత ఘోరంగా ఉందన్నాడు కవి శ్రీశ్రీ. ఆమెకు     వయోభారం వల్ల ఒంట్లోని కీళ్ళు సడలి పోతున్నవి,  అనారోగ్యంతో పడిపోయింది, ఈ పడడం తన ప్రక్కనే ఉన్న జడ పదార్థమైన బండ రాతిలాగ పడి ఉంది, అడుక్కునే శక్తిలేదు, బతకాలనే కోర్కెలేదు, ఎవరూ దిక్కులేని దీనురాలైన ఆమెకు రాబోయే కాలంలో మరిన్ని కష్టాలు రాబోతున్నవని చెప్పడానికి నిత్యం బిచ్చమడుగుకొని బతుకుతున్న ఆమెకు శక్తి కూడా నశించింది, పైపెచ్చు రాబోయేది చలికాలం. ఇలా ఆ బిచ్చగత్తె స్థితిగతుల్ని నాలుగు స్టాంజాల్లో చూపాడు శ్రీశ్రీ. అనంతర మూడు స్టాంజాల్లో ఆమె పట్ల సమాజ  పోకడను, సమాజ బాధ్యతను తెల్పబూనుకొని ‘‘ఆ అవ్వే మరణిస్తే / ఆ పాపం ఎవ్వరి’’దని వెర్రిగాలి ప్రశ్నిస్తూ / వెళ్ళిపోయింది’’ అలా మనుషులు వెర్రిగాలిలా  మారిపోకూడదు సాటి మనిషి చావుబతుకుల మధ్య ఉంటే అని మన బాధ్యతని గుర్తెరిగేట్టు చేశాడు ఈ కవితలో శ్రీశ్రీ.

ప్రాణాలు పోవడానికి సిద్ధంగా ఉన్న ఆ అవ్వ ప్రక్కనుంచి ఎముక తింటూ, కనీసం    పట్టించుకోకుండా ఓ కుక్క, ఇలాగే తొందరగా అక్కడి నుంచి వెళ్లిపోయింది ఓ తొండ. అంటే మన పరిసరాల్లో జీవిస్తున్న అన్య జీవుల్లానే, మన సమాజంలోని సాటి  మనుషులూ కుక్కల్లా, తొండల్లా సాగిపోతున్నారేగానీ పట్టించుకోవడంలేదనే భావాన్ని ప్రత్యేకంగా ఎత్తి చూపాడు శ్రీశ్రీ. అంతలోనే ఆ అవ్వ మీదకు ‘ఎంగిలాకు’ ఎగిరి వచ్చింది, కనీసం ఈ విస్తరికి అతుక్కొని ఉన్న మెతుకులైనా ఆవిడకు ఆందుబాటులోకి వచ్చాయా  అనుకుంటే ‘‘క్రమ్మె చిమ్మచీకట్లు’’ అనడంతో ఆమె ప్రాణాలు గాలిలో కల్సిపోయి ఆ నాటి   రోజుకి, ఆమె శరీరానికి చిమ్మచీకట్లు కమ్ముకున్నాయని తెల్పడంతో మరణ వార్తను చీకటితో పోల్చి చెప్పినట్లైంది. అంటే వ్యవస్థలో ఓ వ్యక్తి బిచ్చమెత్తుకునే స్థాయికి   దిగజారడం, కనీసం వయోభారం మోస్తున్న వారిపట్లనైనా వ్యవస్థ పట్టించుకోకపోవడాన్ని శ్రీశ్రీ సీరియస్‌గా తీసుకున్నాడనిపిస్తుంది. సమాజంపట్ల బాధ్యతగా ఉండని వారిని ఈ కవితాకరెంటు షాక్‌తో చైతన్య పరచాలనుకున్నాడు మహాకవి.

1936 ప్రాంతంలో రాసిన ‘అద్వైతం’ అనే కవితను రాశాడు శ్రీశ్రీ. ఈ కవిత రాసిన  సుమారు ఇరవై ఏళ్ళకు అంటే 1955లో వినోద పిక్చర్స్‌ వారితో నిర్మితమైన  ‘కన్యాశుల్కం’ చలనచిత్రంలో సగం వరకు పాటగా వాడుకున్నారు. ఈ పాటపై మధురవాణి   పాత్రధారిjైున సావిత్రి హావభావాలను ప్రదర్శిస్తూ అద్భుతంగా నాట్యం చేసింది. ఇక ఈ కవితలోని వైశిష్ట్యానికొస్తే ‘అద్వైతం’ అంటే జీవాత్మా, పరమాత్మ వేరుకావు, ఒకటే అనేది భావం. ఈ పదాన్నే తీసుకొని ప్రేయసీ, ప్రియులిద్దరూ వేరుకాదు ఒకటే అనే అర్థంతో శీర్షికను పెట్టి ప్రేమికుడివైను నుంచి ఈ కవితను అల్లాడు శ్రీశ్రీ. ఇందులో  ఆమెను ‘‘హసనానికి రాణివి నీవై… కుసుమించిన త్వదీయ మోదం… నా భావికి దేవివి నీవై…’’ ఇలా ప్రేయసిని వర్ణిస్తూ  మన ఆనందం సముద్రమైతే, మన అనురాగం    ఆకాశమంత అయితే ‘‘అనురాగపు టంచులు చూస్తాం / ఆనందపు లోతులు తీస్తాం’’      అంటూ ఇప్పటికి 86 సంవత్సరాల క్రితం రాశాడు శ్రీశ్రీ ఈ గేయాన్ని. దీన్ని ఎన్ని సార్లు విన్నా, చదివినా వన్నె తరగని పాట ఇది.

1940లో ‘జగన్నాథుని రథ చక్రాలు’ శీర్షికతో రాసిన కవిత ‘మహాప్రస్థానం’ కావ్యంలో చిట్టచివరిది. ఈ కవిత ‘‘పతితులారా! / భ్రష్టులారా! / బాధా సర్పదష్టులారా!’’ అంటూ ఆరంభమవుతుంది. వీళ్ళందరూ‘‘…శని దేవత రథ చక్రపు / టిరుసులలో పడి నలిగిన’’ బ్రతుకు వాళ్ళుగా చెప్పి, ‘‘సఖుల వలన పరిచ్యుతులు / జనుల వలన తిరస్క ృతులు / సంఘానికి బహిష్క ృతులు’’ అయినటువంటి వారిని గూర్చి ‘‘మీ బాధలు, మీ గాథలు / అవగాహన నా కవుతాయి’’ అని చెబుతూ ‘‘మీ రక్తం కలగి కలగి / మీ నాడులు కదలి కదలి / మీ పేవులు కనలి కనలి / ఏడవకండేడవకండి!’’ అని ఓదారుస్తూ ‘‘మీ కోసం కలం పట్టి’’నానంటూ ‘‘ఆకాశపు దారులంట / అడావుడిగ వెళ్ళిపోయే’’ జగన్నాథుని రథ చక్రాలను ‘‘భూమార్గం పట్టిస్తాను / భూకంపం పుట్టిస్తాను’’ అంటూ బరోసా ఇస్తూ   ‘‘ద్రోహులను తూలగొట్టి / దోషాలను తుడిచి పెట్టి / స్వాతంత్య్రం / సమభావం /    సౌభ్రాత్రం / సౌహార్దం / పునాదులై ఇళ్ళులేచి / జనావళికి శుభంపూచి / శాంతి,      శాంతి, కాంతి, కాంతి / జగమంతా జయిస్తుంది / ఈ స్వప్నం నిజమవుతుంది / ఈ స్వర్గం ఋజువవుతుంది’’ అని నిర్ధారణగా మహాకవి శ్రీశ్రీ ఈ కవిత ద్వారా సుమారు 82 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఇలా వనితాలోకంపై ప్రత్యేకంగా కొన్ని కవితల్ని       రాశాడు మహాకవి శ్రీశ్రీ.

పార్శ్వంగా తరుణులను పేర్కొన్న కవితలు:

ప్రత్యేకంగా స్త్రీల గురించి రాసిన కవితలేగాక పార్వ ్శంగా స్త్రీ జన ఉద్ధరణకై రాసిన   కవితలూ ‘మహాప్రస్థానం’లో ఉన్నాయి. అవి బాటసారి, కవితా! ఓ కవితా! మొదలైనవి. వాటిని చూద్దాం.

‘బాటసారి’ కవితలో ‘‘కూటికోసం, కూలి కోసం, / పట్టణంలో బ్రదుకుదామని / తల్లి  మాటలు చెవిని పెట్టక …’’ అని చెబుతూనే, ఆ తల్లిని గూర్చి ఇంకా ‘‘కళ్ళు వాకిట నిలిపిచూచే / పల్లెటూళ్ళో తల్లి ఏమని / పలవరిస్తుందో…?’’ అని తల్లి గూర్చి చెబుతూ ఈ కవితాంతమున ‘‘బాటసారి కళేబరంతో / శీతవాయువు ఆడుకుంటోంది / పల్లెటూళ్ళో తల్లికేదో / పాడు కలలో పేగు కదిలింది’’ అంటూ ఆ తల్లి కాలిన కడుపును బాధాపూరితంగా తెలిపాడు శ్రీశ్రీ.

‘మహాప్రస్థానం’ కావ్యానికే మకుటాయమానమైంది ‘కవితా! ఓ కవితా!’ అనే కవిత. ఇందులో ‘‘అందని అందానివిగా…’’ అనీÑ ‘‘శతకోటి సముద్ర తరంగాల మ్రోతలు! విన్నానమ్మా! విన్నా, నెన్నో విన్నాను!…’’ అనీÑ ‘‘నను కరిగించిన కవన ఘృణీ! / రమణీ! / కవితా! ఓ కవితా!…’’ అంటూÑ ‘‘నన్ను పునీతుని కావించిన కవితా! / లలిత లలిత కరుణా మహితా!…’’ అనడమే గాకÑ చివరిలో ‘‘జననీ! ఓ కవితా! / కవితా! కవితా! ఓ కవితా!…’’ అంటూ ఈ కవితను ముగించాడు శ్రీశ్రీ. ఇందులో ‘కవిత’ను వనితగా తనను కరుణించిన దేవతగా, తల్లిగా భావించాడని గ్రహిస్తాం. ఇంకా ఈకవితలో ‘‘అపుడే ప్రసవించిన శిశువు నెడద నిడుకొని / రుచిర స్వప్నాలను కాంచే / జవరాలి మన:  ప్రపంచపుటావర్తాలు’’ అనీÑ ‘‘కడుపు దహించుకుపోయే / పడుపు కత్తె రాక్షస రతిలో / అర్థ నిమీలిత నేత్రాల…’’ అనీÑ ‘‘నా జనని గర్భంలో / ఆకారం లేకుండా నిద్రిస్తూన్న / నా అహంకారానికి…’’ అంటూ మహిళలను ప్రస్తావించాడు శ్రీశ్రీ ‘కవితా! ఓ కవితా!’ అనే కవితలో. ఈ కవితను చూస్తే స్త్రీల పట్ల శ్రీశ్రీకి అపారమైన గౌరవం ఉన్నట్లు తెలుస్తుంది.

‘నవకవిత’అనే కవితలో ఆధునిక కవిత్వం ఎలా ఉండాలో పలు ఎర్రనివి చెబుతూ ‘‘కలకత్తా కాళిక నాలిక / కావాలోయ్‌ నవ కవనానికి’’ అంటూ కాళికా మాత ఎర్రని నాలుకలా ఆధునిక కవిత్వం ఉండాలని తెలిపాడు శ్రీశ్రీ.

‘అవతారం’ అనే కవితలో ‘‘కనకదుర్గా చండ సింహం / జూలు దులిపీ, /  ఆవులించింది’’ అంటూ జగన్మాత వాహనమూ తిరగబడుతున్నదని చెప్పాడు శ్రీశ్రీ. ఇంకా ఈ కవితను ‘‘పుడమి తల్లికి / పురిటి నొప్పులు / కొత్త సృష్టిని స్ఫురింపించాయి’’ అంటూ వ్యవస్థ మార్పును ‘భూమాత’తో పేర్కొంటూ ముగించాడు కవి. ఇలా కొన్ని కవితలను       పార్శ్వంగా స్త్రీల ప్రస్తావనతో చెప్పాడు కవి.

లింగ (Gender)  దృష్టితోగాక స్త్రీ, పురుషులిద్దరికీ వర్తించే కవితలు:

‘మహాప్రస్థానం’ కావ్యంలో స్త్రీల గురించి రాసిన, స్త్రీల ప్రస్తావన తెచ్చిన కవితలతో    పాటు స్త్రీ, పురుషులిరువురికీ వర్తించే విధంగా కొన్ని కవితల్ని రాశాడు శ్రీశ్రీ. అలాంటి వాటిలో అవతలిగట్టు, సాహసి, పరాజితులు, వ్యత్యాసం, ప్రతిజ్ఞ, చేదుపాట, నీడలు   మొదలైన కవితలు పేర్కొనవచ్చు. మచ్చుకి ఓ కవిత చూద్దాం.

‘‘ఔను నిజం, ఔను నిజం / ఔను నిజం నీ వన్నది! / నీ వన్నది, నీ వన్నది, / నీ వన్నది నిజం, నిజం!’’ అంటూ ఆరంభ మరియు ముగింపు స్టాంజాలుగా ఉన్న ‘చేదుపాట’ అనే కవితలో ‘‘మనదీ ఒక బ్రదుకేనా? /  కుక్కల వలె, నక్కల వలె! / మనదీ ఒక  బ్రదుకేనా? / సందులలో పందుల వలె!’’ అంటూ మన వ్యవస్థలోని ఈ జీవితం పురుషులదా, లేక స్త్రీలదా అని ప్రత్యేకంగా కవి తెల్పలేదు కాబట్టి ఇద్దరిదీ, లేక స్త్రీలదీగా కూడా   భావించనలవిగా ఉంది. ఇలా ‘మహాప్రస్థానం’ లో స్త్రీ, పురుషులిద్దరికీ వర్తించే విధంగా మరికొన్ని కవితలూ దృగ్గోచరమవుతాయి.

ఈ కావ్యం గూర్చి రావి శాస్త్రి ‘‘… కవితామతల్లి ఆదిశక్తి. ఆ శక్తిని అతను పతితుల భ్రష్టుల బాధాసర్పదష్టుల పక్షాన నిలబెట్టేడు. ఆమె చేతికి ఆయుధాలుగా ఇచ్చేడు తన కవితల్ని. శ్రీశ్రీ మహాకవి ధర్మపక్షాన నిలబడ్డాడు. ఆయన కవిత ధర్మంచేతి బాణం’’ (పుట`114, మహాప్రస్థానం, ముద్రణ: విరసం, జూన్‌ 1999) గా పేర్కొన్నాడు. ఇటువంటి కవితల ‘మహాప్రస్థానం’ కావ్యాన్ని స్త్రీ దృక్కోణం నుంచి పరికిస్తే ‘స్త్రీవాద ఉద్యమ సాహిత్యం’ అనేది తెలుగులో పొడసూపక పూర్వమే వ్యవస్థలో మహిళల స్థితిగతుల్ని  అభివర్ణిస్తూ రాసిన కవితలుగా మనకు దర్శనమిస్తాయి.

You may also like

Leave a Comment