Home వ్యాసాలు మహా కవి గుంటూరు శేషేంద్ర శర్మ 16 వ వర్థంతి

మహా కవి గుంటూరు శేషేంద్ర శర్మ 16 వ వర్థంతి

by Ramesh

జ్ఞానపీఠ్ పురస్కారం సాహిత్య ప్రతిభకు కొలమానమని నేను ఏకీభవిస్తాను.కానీ అదే ప్రతిభను తూకం వేస్తుందంటే నా మనసు అంగీకరించదు. అందుకు దృష్టాంతం మన కాలపు గుంటూరు శేషేంద్ర శర్మ గారు.ఈ తరం కవులమనీ చెలామణి అవుతున్న చాలామందికే తెలియదు.ఇక సాధారణ పాఠకుడి,తెలుగువాళ్ల సంగతి సరేసరి.
సాహితీ ప్రపంచంలో పెను సంచలనం సృష్టించారు మన గుంటూరు శేషేంద్ర శర్మ.ఒక నవ్య సాహితీ రస్తా వేశారు.అది అనితరం, అసాధ్యం.
శేషేంద్ర శర్మ గారు 1927 లో నెల్లూరులో తోటపల్లి గూడూరు గ్రామంలో జన్మించారు.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లో డిప్యూటీ మునిసిపల్ కమీషనర్ గా పనిచేశారు.
నా దేశం_ నా ప్రజలు,శేష జ్యోత్స్న,రక్తరేఖ,గొరిల్లా, ఆధునిక మహాభారతం,జనవంశం,రుతుఘోష,మండేసూర్యుడు,స్వర్ణహంస,రామాయణ రహస్యాలు వారి రచనలు.కవిసేన మేనిఫెస్టో వారి సుప్రసిద్ధ రచన.ఆయన సాహిత్య కృషి కి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు, 1994లో తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేసింది.సాహిత్యవిమర్శ,కవిత్వం కలిపి 40 పైగా పుస్తకాలు ముద్రింపబడాయి.

ఒక అందమైన పోయెం అంటే
దానికి ఒక గుండె వుండాలి
అది కన్నీరు కార్చాలి
పీడుతుల పక్షం వహించాలని కవులకు హితబోధ చేశారు.
అట్లాగే
మరణించే లోపు తన మాట చెప్పలేని
నిస్సహాయ మానవుడి గొంతు పేరే కవే అని అంటాడు.

ఎవరు ఏడవగలరు మరొకడికోసం
నీ కోసం ఏడ్చేవాడికి నువ్వు ఋణగ్రస్తుడివి
మార్క్స్ కు ఈ శతాబ్దపు అన్నార్తుల ఋణగ్రస్తులని ఎలిగెత్తాడు.

కాలాన్ని నా కాగితం చేసుకుంటా
దాని మీద లోకానికి ఒక స్వప్నం రాసి ఇస్తా
దాని కింద నా ఊపిరితో సంతకం చేస్తా

చెట్టుగా వుంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది
మనిషిపై అన్నివసంతాలూ కోల్పోయానని బాధను వ్యక్తం చేశాడు.
అలాగే
దేశంలో నాల్గు చెట్లు పది పక్షులు కూడా లేవు
వసంతం వస్తే స్వాగతం చెప్పడానికని వేదన పడ్డాడు.

మూస్తే నా కళ్లు
నిద్రిస్తున్న ఆపిల్ పళ్ళు
తెరిస్తే నా గుడ్లు
వరివెన్ను కన్న వడ్లని ఎంత మనోహరంగా మనసుని ఆవిష్కరణం చేశాడు.
నీదే తప్పు
సముద్రాలే ఎండిపోతున్నాయి
నీ కన్నీరొక లెక్కా…అని ఘోషించాడు

సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు
తుఫాను గొంతు చిత్తం అనడం ఎరుగదు
పర్వతం ఎవడికీ వంగి సలాం చెయ్యదు
నేనింతే ఒక పిడికెడు మట్టే కావచ్చు
కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుందని అందంగా కవిత్వీకరిస్తాడు శేషేంద్ర మహాకవి.

మనిషి కన్నీరు తుడవడం నీ వంతు
శరీరం పోయినా నిలిచేది నీ గొంతు అని హితోపదేశం చేశాడు మానవులకు.
కోకిల పుస్తకాల నుంచి పారిపోయి
కొమ్మ ఎక్కిన గాన సామ్రాట్టు
చంద్రుడు ప్రణయాగ్నుల్లో కాల్చిన పెసరట్టు అని పలికాడు.

ఆకాశం కనిపించడం మానేసింది
ద్రవ్యరాక్షసి కడుతున్న బహు అంతస్తుల భవనాలు చూచి
ఉదయాన్ని ప్రకటించడమే మరిచిపోయిందంటాడు కవి.

భూగోళం మీద నుల్చో ఉన్న
ఆ యువకుడు
ఒక అద్భుత రుజురేఖ
ఒక వర్తమాన మహాస్తంభం
అతడొక నడుస్తున్న దేవదారు
అతడి వెన్నెముక కుతుబ్ మీనారు
రుజురేఖను వక్రరేఖ చేస్తున్న
మన రాజకీయ నేత
దేశానికి
ఒక భయంకర యమదూతని శెలవిచ్చాడు మనకు.

నీ దేహమే గంగోత్రి
నీ స్వరమే భాగీరథీ
పువ్వుల్లో లేని స్వర్గం
పురాణాల్లో ఉంటుందా
నీలో లేనిసుఖం జెండాల్లో ఉంటుందా
నీలో సాహసం ఉంటే
దేశంలో అంధకారం ఉంటుందా అనీ గొప్ప భావన నాటాడు మనలో.

అక్టోబరులో నేను పుట్టాను
అక్టోబరు లోనే విప్లవం పుట్టింది
అందుకే నేనంటే భయపడుతుంది తిమిరం
రష్యా కాదు చైనా కాదు
విప్లవం మాత్రం అజరామరం అన్నాడు
విప్లవ మే కాదు అతని సాహితీ సృజన కూడా అజరామరమే.ఆ మహాకవి అజరామరుడే. వారికి నా హృదయపూర్వక అక్షర నివాళి.

You may also like

Leave a Comment