‘రచ్చబండ’ నాటక సంకలనం….పరిశీలనా వ్యాసం
నాటక రచయితగా, కవిగా సామాజిక పరమైన వివిధ అంశాల నేపథ్యంతో సందేశాత్మక రచనలు చేసి పలువురి ప్రశంసలకు పాత్రులై, నంది పురస్కారాలను అందుకొన్న రావుల పుల్లాచారి గారు రచించిన ‘రచ్చబండ’ నాటకాలను పరిశీలిద్దాం.
“కావ్యేషు నాటకం రమ్యం”, “నాటకాంతం హి సాహిత్యం” అన్నాడు మహాకవి కాళిదాసు. కావ్యాలలో నాటకం కడు రమ్యమైంది. అలాగే సాహిత్యంలో అన్ని ప్రక్రియలు స్పృశించాకే నాటకాన్ని స్పర్శించాలన్నాడు. వాటి పట్ల అవగాహనతో నాటకం రచించడం సరియైనదని ఆయన నొక్కి వక్కాణించారు. దీన్ని బట్టి నాటకాలకున్న విశిష్ట స్థానం మనకు తేటతెల్లం అవుతుంది. ప్రాచీన కాలం నుండీ దృశ్యకావ్యాలుగా పరిగణించబడిన నాటకాలు లలితకళల సమాహారాలు. నవరస నటనానురక్తికాలు. నన్నయ్య తన భారత అవతారికలో ” కావ్య నాటకముల్ పెక్కు జూచితి ” అని ప్రస్తావించడాన్ని బట్టి ఆనాటికే నాటకాలు ఉన్నట్టు మనకు తెలుస్తున్నది.
అలనాటి నుండి ఇప్పటివరకు నాటకాలు జనరంజకంగా కొనసాగుతూనే ఉన్నాయి. మొదట్లో పౌరాణిక నాటకాలు మొదలై భక్తిభావ భరితాలై
పద్యాలు, గేయాలు, కీర్తనలు, భజనలతో జనులను
ఉల్లసింప చేసేవి. రాను రాను సామాజిక చైతన్య దిశగా
సంఘంలోని అన్యాయ, అక్రమాలను ఉటంకిస్తూ సందేశాత్మకంగా సాగుతూ వచ్చినవి. దేశ స్వాతంత్ర్యోద్యమంలో ప్రజలలో దేశభక్తిని పెంచేందుకు
నాటకాలు ఉత్ప్రేరకాలుగా తోడ్పడడమే కాక ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి.
ఇరవయ్యవ శతాబ్దం తెలుగు నాటక రంగానికి గొప్ప భూమిక అని చెప్పవచ్చు. ఎంతోమంది నాటక కర్తలు ఈ రంగాన్ని ఎప్పటికప్పుడు సుసంపన్నం చేస్తూనే ఉన్నారు. అట్టివారిలో తెలంగాణ నుండి నాటకరంగంలో విశేష కృషి చేసి ‘నంది’ పురస్కారాన్ని అందుకున్న రావుల పుల్లాచారి గారు పేరెన్నిక గన్నవారు.
ఆరు దశాబ్దాలు తెలంగాణా ప్రజలతో మమేకమై వారి సాధక బాధకాలను ప్రత్యక్షంగా చూసిన అనుభవం ఆయనది. తెలంగాణ తొలి, మలి దశల ఉద్యమాలలో భాగస్వామ్యం వహించిన ఘనత ఆయనది. వారు 50కి పైగా కథలు, 20కి పైగా నాటకాలు రచించారు. ఆయన రచనల్లో తెలంగాణ భాష, యాస, ప్రజల కష్టాలు అన్నీ సమ్మిళితంగా మనకు కనిపిస్తాయి. ఆయన తెలంగాణా ప్రజల మనిషి. తాను రాసిన కథలనే నాటకాలుగా
మలచడం వీరి ప్రతిభకు గీటురాయి.
ఇవి “రచ్చబండ” పేరుతో సంకలనంగా ముద్రించబడ్డాయి. ఇందులో ఉన్న ఎనిమిది నాటకాలు సమాజంలో జరుగుతున్న అంశాల్ని ప్రత్యక్షంగా మనముందు నిలబెడతాయి.
“బాకీ పడ్డ బ్రతుకులు” అనే నాటికలో
గ్రామాల్లో ఉండే భూస్వాములు నిరక్షరకుక్షులైన అమాయక ప్రజలను ఎట్లా మోసం చేస్తారో, ఖాళీ కాగితాలపైన వేలిముద్రలు వేయించుకుని వారి తర్వాత తరాలను కూడా ఎలా బానిసలుగా మార్చుకుంటారో భుజంగం పాత్ర ద్వారా చూపిస్తారు. ఆ దుర్మార్గుడి దాష్టీకానికి గౌరి అనే ఆడపిల్ల బతుకు బుగ్గి అవడం చూసి, విద్యాధికుడైన విజయ్ ఏ విధంగా భుజంగానికి బుద్ధి చెప్తాడో, అన్యాయానికి గురై తండ్రిని కోల్పోయిన గౌరి జీవితాన్ని ఏ విధంగా సరిదిద్దుతాడో చూపబడింది.
ఇక “రచ్చబండ” అనే నాటిక…పుల్లాచారి గారికి
ఉత్తమ రచయితగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు గాను ప్రతిష్టాత్మకమైన రెండు నంది అవార్డులను అందించిన నాటిక. ఇది దాదాపు 50 కి పైగా ప్రదర్శనలు జరుపుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. దీన్ని బట్టి ఈ నాటిక ఎంత ప్రాచుర్యాన్ని సంతరించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో ఆత్మాభిమానం గల రైతు మల్లయ్య. ఊళ్ళో అందరిచేత పిల్లలమర్రి పెద్ద మల్లయ్య అని పిలువబడతాడు. తన పిల్లలకోసం ఉన్న భూమిని అమ్ముకుని, బర్లు కాస్తూ బతుకుతుంటాడు. ఆ బర్రెలు శివయ్య పొలాన్ని తొక్కి పాడుచేసాయనే ఒక నెపంతోను, ఆ బర్రెలలో పింజారి భద్రయ్య బర్రె ఒకటి మాయమవడం, దాన్ని మల్లయ్యే దొంగిలించి అమ్ముకున్నాడనే మరో నెపం తోను శివయ్య, భద్రయ్య మల్లయ్యను అవమానిస్తారు. పంచాయతీలో తేల్చాలనుకుంటారు. ఎంతో ఆత్మస్థైర్యం కలిగి ఎవరికీ తలవంచని మల్లయ్య, పంచాయతీకి వెళ్లడం తలవంపులుగా భావించి, ఆ అవమానభారాన్ని తట్టుకోలేక, మానసిక క్షోభకు గురయి మరణిస్తాడు. రచయిత ఈ సన్నివేశాన్ని పాఠకుల గుండె లోతుల్లోకి తీసుకొని పోయి కంట తడి పెట్టిస్తారు. కొసమెరుపు ఏంటంటే మాయమైన బర్రె పక్కవూర్లో నుండి ఈ ఊళ్ళో ప్రత్యక్షం అయి మల్లయ్య నిర్దోషిత్వాన్ని నిరూపించడం. కానీ అప్పటికే చేయని నేరాన్ని తలపై మోయలేక తీరని మానసికవేదనతో ప్రాణాలు కోల్పోతాడు మల్లయ్య. అప్పుల బాధలో, కరువు కాటకాల వల్లో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం మనకు సాధారణమై పోయింది.. కానీ ఇందులో విభిన్నకోణంలో మల్లయ్యను మనకు చూపిస్తారు పుల్లాచారి గారు. మనిషికి ఉండే ఆత్మాభిమానం ప్రాణం కన్నా విలువైనదన్న సత్యాన్ని మరోమారు నిరూపిస్తారు.
దీంట్లో..మోకాళ్ళు నాయి కాకుంటే కాశి దాకా దేకొచ్చు/ కన్ను మిన్ను కానకుండడం/ కాకి తన్నిన బతుకాయె/ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవడం/ గంజిల ఈగను తీసి పారేసినట్లు తీసి పారేయడం/ తాకిన ఏలుకే పొట్రౌతు తాకినట్టు అయింది/ నూతిల పడ్డొని మీద నూరు రాళ్లు ఏయకండి/ తాడు తన్నే వాడుంటే, వాడి తలదన్నే వాడు ఉంటడు…లాంటి సామెతలు, జాతీయాలు సందర్భానుసారంగా ప్రయోగింపబడుతూ తెలంగాణా యాసకి వన్నె తేవడమే కాక నాటకానికి అలంకారాలయ్యాయి.
“ఓ ప్రేతాత్మ దిగిరా” అనే నాటికలో క్షుద్రపూజల పేరిట జరిగే మోసాలు, ప్రజలు ఎంత మూఢంగా ఇలాంటి వాటిని నమ్మి తమ జీవితాలను నరకప్రాయం చేసుకుంటారో చెప్తూనే వారి పన్నాగాలను తిప్పికొట్టే ఎమ్ ఎస్ సి విద్యార్థులు నవీన్, గీతాంజలి పాత్రల ద్వారా వాటిని దూరం చేయడానికి ప్రయత్నిస్తారు.
“మనసు చెక్కిన శిల్పం” లో కళాకారులను సమాజం ఎంత నిరాదరణకు గురి చేస్తుందో స్పష్టీకరిస్తారు. “గంగిగోవు పాలు” నాటికలో గోవుల యజమానులకు మాయమాటలు చెప్పి, వాటిని కబేళాలకు అమ్మే దళారుల అన్యాయాలను ఎండగడతారు. “ఈ వేస్తున్న అడుగు ఎటు” అనే
నాటికలో నిరుద్యోగులైన యువకులు వ్యామోహాల వలలో చిక్కుకొని డబ్బు సంపాదనకు అక్రమమైన మార్గాలను ఎన్నుకోవడం కనిపిస్తుంది. ఇందులో ఒకచోట ” అవినీతి అవినీతి మీద చెలామణి అవుతుంది” అని ప్రయోగించిన వాక్యం సమాజంలో అవినీతి వేళ్లూనుకున్న విధానాన్ని తెలియచేస్తుంది.
” ఆట” అనే నాటిక బతుకు తెరువుకోసం వచ్చిన కోతులాడించే తండ్రీ కూతుళ్ళ జీవితాన్ని కాముకుడైన
సర్పంచ్ ఎట్లా కష్టాల్లోకి తోయడానికి ప్రయత్నించాడో చెప్తుంది. ఇక చివరగా ” రిటర్న్ గిఫ్ట్ ” అనే నాటికలో నేటి సమాజంలో తల్లిదండ్రులు కష్టపడి తమ పిల్లలను చదివిస్తే వాళ్ళను వదిలి విదేశాలకు వలసపోతున్న వారసుల అవివేకాన్ని, తల్లిదండ్రుల ఆవేదనను హృద్యంగా వర్ణించారు.
ఈ నాటికలలో రచయిత మనలను సామాజిక, మానవీయ ఆలోచనాపథంలోకి తీసుకెళ్తారు. ప్రతీ నాటిక సమాజంలో జరుగుతున్న సత్యదూరం కాని
అంశాలతో రూపొందించబడింది. సమస్యను చూపిస్తూనే ఆ సమస్య పరిష్కారంతో ముగింపు నివ్వడం ఆయనలోని ఆశావహదృక్పథానికి తార్కాణం.
” జీవితాన్ని ప్రతిబింబించేదే నాటకం – నాటకానికి ప్రతి స్పందించేదే జీవితం ” అన్నట్లు మనిషి జీవితాన్ని తన నాటకాలకు వస్తువుగా తీసుకొని మనస్సులను కదిలించడంలో కృతకృత్యులైనారు. వారికి భగవంతుడు చక్కటి ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా ఇలాంటి విలువైన రచనలు కొనసాగేటట్లు అనుగ్రహించాలని కోరుకుందాం.