Home వ్యాసాలు మానసిక వికాసానికి రాచబాట – పూల పూల వాన కవిత్వం

మానసిక వికాసానికి రాచబాట – పూల పూల వాన కవిత్వం

by Dr. Uppala Padma
   సాహిత్యానికి ప్రేరణ సమాజం. సమాజ సంస్కరణే సాహిత్యం పరమావధి. ఇది సాహితీ ప్రయాణం చేసిన, చేస్తున్న కవులు, రచయితలందరికీ తెలిసిన విషయం. అంత ప్రశస్తమైన సాహిత్యంలో  ప్రసిద్ధమైనవారు, తెలుగు సాహితీ జనావళికి సుపరిచితులైన కవి, రచయిత, విమర్శకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి. వారి సాహిత్యం  కవితలు, రుబాయిలు, పాటలు,వ్యాసాల రూపంలో  అక్షరమక్షరం మూడు దశాబ్దాలుగా వ్యక్తిత్వ వికాసానికి వాహికయి, చైతన్యమే పరమావధిగా గుబాళింపులను వెదజల్లుతూ సాగుతున్నది. ఈ పరంపరలో ఏనుగు నరసింహారెడ్డి గారు ' పూల పూల వాన' గా పాఠకులకు అందించిన మినీ కవితల సౌరభాలను పాఠక హృదయాలపై స్ప్రే చేయడమే ఈ వ్యాసం ఉద్దేశం.
    సైకాలజిస్టుల ప్రకారం ఒక వ్యక్తి మూర్తిమత్వం అంటే అతని ప్రతి విషయాన్ని తెలిపే సంపూర్ణ వ్యక్తిత్వం. ముఖం, పళ్ళు, కళ్ళు మొదలుకొని మాట్లాడే విధానం, అలవాట్లు, ఆలోచనా విధానం ఇలా ప్రతి విషయాన్ని తెలియజేసేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తి శారీరక, మానసిక, నైతిక, సాంఘిక లక్షణాల సమాహారం మూర్తిమత్వం. ఈ అన్ని కోణాలకు సరితూగే వారు ఏనుగు నరసింహారెడ్డి. ఈ విషయం వారి సాహిత్యాన్ని అధ్యయనం చేసిన వారికి అవగతమవుతుంది.  ఒక కవిని, రచయితనీ అర్థం చేసుకోవాలంటే వారి సాహిత్యాన్ని అర్థం చేసుకుంటే చాలు. ఆటోమేటిగ్గా వారు అర్థమవుతారు.  ప్రసిద్ధ విమర్శకులు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి మాటలు గమనించినప్పుడు  " రచయిత వ్యక్తిత్వం రెండు రకాలుగా వ్యక్తమవుతుంది. 1. రచయిత తీసుకొనే వస్తువు 2. వస్తువును రచయిత అభివ్యక్తం చేసే విధానం. ఈ రెండు మార్గాల ద్వారా రచయితలు తమ వ్యక్తిత్వాలను చాటుకుంటారు"(చంద్ర శేఖర రెడ్డి, రాచపాళెం: కవుల తెలంగాణం, అక్టోబర్, 2016) అన్న రాచపాళెం మాటలు ఇక్కడ సరిపోతాయి.
 కలం పుష్టికి చిరునామాగా నిలిచే ఏనుగు నరసింహారెడ్డి 'పూల పూల వాన' లో " నేను పనిలో భాగంగా అప్పుడప్పుడు ఒరాల మీద నడుస్తాను. గట్ల వెంట, చెట్ల నీడన, రాళ్ల వెంట, బోళ్ళ మీద, సామాన్యులతో, మాన్యులతో కలసి పర్యవేక్షణ చేస్తాను. నోరున్న వాళ్లను, నోరుమెత్తని వాళ్లను కలుస్తాను. గ్రామీణతను పట్టణత్వాన్ని దగ్గరగా పరిశీలిస్తాను." అంటాడు.   'పూల పూల వాన 'లోని మినీ కవితలలో ఈ అంశాలే ప్రస్ఫుటమవుతాయి. "కొత్త ప్రదేశాల్ని చూసినప్పుడు, కొత్త వ్యక్తుల్ని కలిసినప్పుడు, కొత్త అనుభవాలకు గురైనప్పుడు, పరవశించినప్పుడు, పస్తాయించినప్పుడు, ప్రకృతి దినం దినం తనను తాను సంజాయించుకుంటూ ఎదురైనప్పుడు నాలో కొన్ని ఊహల ముత్యాలు రాలుతుంటాయి. సమయం రాత్రి, పగలు ఎంత మాత్రం ఆగకుండా నడుస్తుండడం వల్ల అవి కొన్నిసార్లు పెద్ద కవితలుగా ఎదగలేదు."  ఆయా సందర్భపు ఊహలు ఇదిగో ఇలా కాగితం చెట్టు మీద పోత పూసుకున్న పూలయ్యాయని 'పూల పూల వాన' సంపుటిలోని మినీ కవితల నేపథ్యాన్ని తెలిపారు.  'పూల పూల వాన ' లో తాను తడవడమే కాకుండా పాఠకలోకంపై పూల వానని కురిపిస్తారు. వాన అందరికీ తెలిసిందే. కానీ పూల వాన, పూల పూల వాన నరసింహారెడ్డి లాంటి కవులకు మాత్రమే తెలుస్తుంది.

‘పూల పూల వాన’ సంపుటిలోని మొత్తం 285 మినీ కవితలను పరిశీలించినప్పుడు మానసిక వికాసం, సామాజిక దృక్పథం, ప్రకృతి, స్త్రీ దృక్కోణం, వృత్తులు, జీవన నైపుణ్యాలు, స్నేహం, పెళ్లి, రాజకీయాలు ఇత్యాది అంశాలు కనిపిస్తాయి.

మానసిక వికాసం:-
‘పూల పూల వాన’ లోని కవితలన్నీ మినీ కవితలు అయినప్పటికీ చిట్టి పాదాలలో గట్టి కవిత్వం పలికించారు కవి. వ్యక్తి శారీరకంగా ఎంత ఫిట్గా అయినా ఉండవచ్చు గాక, మానసికంగా ఫిట్టు లేనప్పుడు అటువంటి శారీరక పట్టుత్వం చొప్ప బెండుతో సమానం. ఆ విధంగా చూసినప్పుడు కవితలు పెద్దవా! చిన్నవా! అనేది ప్రధానం కాదు. ఈ సంపుటిలోని మినీ కవితలలో ఏనుగు నరసింహారెడ్డి వ్యక్తి వికాసానికి తోడ్పడే అనేక అంశాలను చర్చకు తెస్తారు. తద్వారా మనిషిని మానసికంగా బలోపేతం చేయడమే కాక సమ్యక్ దృక్పథానికి బాటలు వేస్తారు.
“వాడు కత్తి పట్టుకొని
పువ్వుల్ని కోసేయగలడేమో కానీ
రాబోయే వసంతాన్ని
ఏ ఆయుధమూ ఆపలేదు”
నిజంగా ఏ రోజుల్లో అయినా సాధారణమైన వ్యక్తి ఎదుగుదల అంత సాధారణమైనదేమీ కాదు. అడుగడుగునా అవాంతరాలు, అడ్డంకులు వ్యక్తి రూపంలోనో, పరిస్థితుల రూపంలోనో మొత్తానికి రూపం ఏదైనా కానీ ఎదురవుతూనే ఉంటాయి. ఆ ముల్లులను పువ్వుల్లా మలుచుకోవాలి. పోతే పోనీ! పువ్వులే కదా! చెట్టు లాంటి వ్యక్తి ప్రతిభా పాటవాలు కాదు. వేరు లాంటి ప్రాణమూ కాదు. వసంతం లాంటి పచ్చని భవిత కచ్చితంగా వస్తది. ప్రతి వ్యక్తి అలవర్చుకోవాల్సిన ఆశావహ దృక్పథాన్ని అలా కవి నూరి పోస్తాడు.
” అందుకుందామని
పోయిన కొద్దీ చంద్రుడు మెత్తబడి
ఏదో ఒక రోజు తనపై
తప్పక దిగమంటాడు”
అసలు ఈ వాక్యాలు ఎన్ని విషయాలకో అన్వయించుకోవచ్చు. అవకాశాలు, అధికారులు, ఇతరులతో అక్కరలు, అనుబంధాలు… ఇక్కడ ఏవైనా కావచ్చు అందుకోవడానికి మనిషి చేసే ప్రయత్నం ఆగకూడదు. చెయ్యి పైకెత్తి చంద్రుని అందుకోగలమా! చేయి కందలేదు నిచ్చెన కందుతాడేమో! అందలేదు. తాడుకు అందుతాడేమో! ఏమో ఏదో ఒక రోజు మన ప్రయత్నాన్ని చూసిచూసి చలించి అయితే తనపై తప్పక దిగమంటాడు. లేదా తానే మనిషి దగ్గరకు దిగి వస్తాడు. ఇక్కడ చంద్రుడు మనం అందుకోవాలని అనుకున్న అంశం. అది ఏదైనా కావచ్చు. ప్రయత్నిస్తే పోయేదేముంది? వస్తే ఫలితం. లేదంటే అనుభవం.
ఇలా నేను వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన కవితలను చెప్తూ వెళితే ఎన్నో చెప్పాల్సి వస్తుంది.
” పగలడాన్ని భరించిన
పలుగురాళ్ళు
మెరుస్తాయి
వెలుగులోనూ,చీకట్లోనూ” అంటాడు.
ఆటుపోట్లను ఎదుర్కోవడం అలవాటైన మనిషి చీకటి, వెలుగుల విజేత. “పోనీ పోనీ పోతే పోనీ.. రానీ రానీ వస్తే రానీ కష్టాల్ నష్టాల్ కోపాల్ శాపాల్ రానీ రానీ .. కానీ కానీ గానం ధ్యానం హాసం ళాసం కానీ కానీ.. అన్న శ్రీ శ్రీ గుర్తొచ్చాడు ఇక్కడ.
” వాళ్ళు
నన్ను రోజూ నిందించనీ
నాలో నిందించలేని లక్షణాలేవో
నాకూ తెలిసి వస్తాయి” అంటాడు.
ఇది కదా! నిజమైన పాజిటివ్ ఆటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ను అలవర్చుకోవాలి అదే జీవిత పథగమనంగా నిర్దేశించుకుని ముందుకు కదలాలని చెప్పే సైకాలజిస్టులకు కూడా అందని శిఖరాత్మక భావన ఇది.
“శత్రువుకు వందనం
నిజంగా అతనొక్కడే
భుజాలు కందేలా
మనల్ని మోసుకు తిరుగుతాడు” పరిపక్వమైన ఆలోచనకు, ధనాత్మక వైఖరికి అద్దం పట్టే కవితా పంక్తులు ఇవి.

సామాజిక దృక్పథం:-
సమ్యక్ సమాజమే కవి లక్ష్యమైనప్పుడు కవి కవిత్వమంతా సామాజిక దృశ్యమే అవుతుంది.
” ఎండలో కూడా
చల్లగా ఉన్నై పూరిండ్లు
అవును మరి!
అవి చెమటతో కట్టినవి”
గుడిసెలో చల్లగా ఉంటుందనేది సాధారణ భావన. ఆ చల్లదనం వెనుక ఎంత చెమట దాగి ఉంటుందో తెలుసుకోగలగడం మనసున్న కవికే సాధ్యం.
” మా అమ్మ రోటి కారంతో
తినబెట్టింది
ఈ నోటికి
ఘాటెక్కువ “
కష్టపడి ఎదిగిన వ్యక్తికి తన చుట్టూ జరిగే లోటుపాట్లను సహించడం కాస్త కష్టమే. ప్రశ్నించడం, ప్రతిఘటించడంలో ఘాటు కూడా ఎక్కువే ఉంటుంది మరి.
” కుర్చీల మీద
మనం కూర్చున్నా
ఆఫీసులు
ప్రజలవనే జ్ఞానం ముఖ్యం”

“నీ అయ్య జాగీరా?
అనలేకపోతుంది
ప్రజ
ఆఫీసులో చూసి మనల్ని” అంటాడు.
ఇదే తరహాలో
“చట్టాల నూతుల్ని
తవ్విందెందుకు?
నిరుపేదల్ని
తొయ్యడానికే!”అంటాడు.
ఎంతమంది అధికారులకు ఈ వాక్యాల అర్థం తెలుసు. నిజంగా తెలిస్తే, తెలుసుకుంటే గనక అధికార దర్పం అనే పదాన్ని నిఘంటువుల నుండి తొలగించవచ్చనిపిస్తుంది.
“మీ పాళీల
పత్తు లిరిగి పోనూ
ఇన్ని పేజీల పేపర్లో
ఒక్క నిజమూ రాయరే”
ఇక్కడ కవిలో ఒక పల్లె తల్లి కనిపించింది. ఆ తల్లి గొంతుక వినిపించింది. ఫోర్త్ స్టేట్ గా పేరుగాంచినది పత్రికా రంగం. అటువంటి పత్రికలు పక్కదోవలు పడుతున్న రోజులివి. పత్రికల్లోని రాతలను నిలదీస్తూ కలం గట్స్ చాటిన కవిత ఇది.
” కట్టడంలో
గొప్పతనం కాదు
కలరింగ్ లో చమత్కారం
నగరంలో భవన సముదాయం”
రియల్ ఎస్టేట్ మోసాలకు ప్రతిబింబం ఈ మినీ కవిత. కట్టుబడిలో ఒకప్పుడు ఉన్న నాణ్యత నేడు ఉండడం లేదు. మూన్నాళ్ళ ముచ్చటగా కట్టిన నాలుగు రోజులకే గోడలు బీటలు వారడం, పెచ్చులు ఊడటం, ఇంకా చెప్పాలంటే కట్టిన పెద్ద పెద్ద వంతెనలు కొన్ని రోజులకే కూలిపోయిన ఉదంతాలు నేటి సమాజంలో కోకొల్లలు.
” వలలు
పులుల్ని పడేయలేవు
పిచ్చుకల పైనే
వాటి ధ్యాస” అంటాడు కవి.
ఎవరైనా మోసపోయే వాళ్ళనే కదా మోసపుచ్చేది. మోసపోకుండా ఉండే జాగరూకత మనిషికి అవసరం అని చెప్పే వాక్యాలు ఇవి. ఇలా చెప్తూ వెళితే అనేకమైన సామాజిక అంశాల గురించి కవి స్పందించిన విధానం, సంస్కరణ పూరితమైన వారి ఆలోచనలు ఉన్నతంగా అనిపిస్తాయి.

స్వీయానుభూతి:-
సాధారణంగా కవి తనకు అనుభవంలోకి వచ్చిన అంశాన్ని కానీ, తాను అనుభూతి చెందిన సంఘటనను కానీ లేదా ఇతరులకు సంబంధించిన వివిధ అంశాలకు తాను తాదాత్మ్యం చెంది కవిత్వం సృజిస్తాడు.
” అంత విశాలమంటారా ఆకాశాన్ని
ఆనందంతో గంతులేయడానికి
అంతరంగమంత పెద్దదేదీ
నాకు ఇంతవరకు కనపడనే లేదు” ఈ ఒక్కటి చాలు. ఒక్క మెతుకు లాగా ‘పూల పూల వాన’ అనే ఈ సంపుటి శీర్షికను బలపరచడానికి.
“లోకాన
ఇంతమంది అందగత్తెలు
దైన్యం!
చూసేందుకు రెండే కళ్ళు”
” అందంగా
చూపించే అద్దాలు
శాస్త్రవేత్త లింకా
ఎప్పుడు కనిపెడతారో “
“ఢీకోడ్ చేస్తే తప్ప, అర్థం కాని, సాంకేతిక సందేశాలు, ఆమె చూపులు”… ఇలా కవి చిన్ని చిన్ని అనుభూతులను, కొన్ని కొన్ని సందర్భాలలో మనసుపెట్టే గిలిగింతలను చిట్టి చిట్టి కవితలుగా అందించి పాఠకులను రంజింపచేస్తారు.

” పిలిస్తే
ఒలికే ప్రేమ కంటే
వెతుకులాడే
ఆత్మకు తడి”
పెదాల మీద ప్రేమను అంటించుకుని నటించే మనుషుల వైఖరికి ప్రతిబింబం ఈ మినీ కవిత. పైపై మాటల ప్రేమల కలికాలంలో ఆత్మ తడి ఎంతమందికి పడుతుంది.
” తిరుగు ప్రయాణం లేని
చివరి రైలెక్కకముందే
ఎవరికైనా బాకీ పడ్డామేమో
తరచి తరచి చూసుకోవాలి” కాటికి టికెట్ తీసుకోవడానికి ముందుగనే ఈ జన్మలోని ఋణాలను తీర్చుకోవాలి. ” ఋణాను బంధ రూపేణా పశుపతి సుతాలయహః” అన్న శ్లోకం గుర్తొస్తుంది. కర్మ సిద్ధాంతానికి ఊతమిచ్చే కవిత ఇది.
” వాన బరువును
ఆగబట్టిన మొక్కను చూసి
మహావృక్షం
సిగ్గుతో చితికింది” అంటాడు కవి. ఎన్నో విషయాలలో బలహీనమైన వ్యక్తి తనకు ఎదురయ్యే కష్టనష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడం, అన్నిటికి అన్ని ఉన్నా, చిన్న కష్టానికి మహావృక్షం లాంటి బడా మనుషులు బెంబేలెత్తిపోవడం సమాజంలో చూస్తుంటాం. ఇటువంటి పరిణామాన్ని ఒడిసి పట్టింది ఈ కవిత. ప్రకృతిని, సమాజానికి అన్వయిస్తూ రెంటినీ మిక్సింగ్ చేస్తాడు కవి.
” రుచి దొరకటం లేదు
అన్నంలో
ఒక పూట జంపిచ్చి చూడు
అదే పరమాన్నం”
ఆకలి రుచి కరువైన మనిషికి అన్నం రుచించకపోవడం, రుచి దొరకపోవడం సహజం. ఆకలిని చమత్కరించిన కవిత ఇది.

ప్రకృతి తాదాత్మ్యం:-
ప్రకృతికి పరవశించని కవి ఉండడు. కానీ ఆ పరవశంలో కూడా లోకహితాన్ని వెతికే కవులు అరుదు.
” తాటి చెట్టులో
కల్లోక్కటే చూస్తే ఎలా
ఆ తల్లి
కావ్యాల్ని మోసింది” ఇదే తాటి చెట్టులో కళ్ళుని మాత్రమే చూసే సాధారణమైన వ్యక్తికి కవికి ఉండే తేడా. అలనాటి నుండి తాటి పత్రాలే కదా తాళపత్రాలై తెలుగు సాహితీ సంపదను సుస్థిరం చేసింది. తల్లిలా భావితరాలకు అందించింది. అల్పాక్షరాలలో అంతులేని భావం అంటే ఇదే కదా!
” ఈదురుగాలి
జోరువాన ఎక్కడ కలిసాయో
ఆగని సయ్యాట
తెగని యుగళగీతం”
గాలికి, వానకు ముడిపెట్టిన కవితా హృదయం. గమ్మత్తయిన కవిత ఇది. ఇలా గాలి మీద, వాన మీద, చెట్టు మీద వివిధ ప్రాకృతికాంశాల మీద చెప్పిన మినీ కవితలు కోకోల్లలు.

” మందారం పెరుగుతుంటే
ఇనుప గేటు బిక్కమొహం
అంత గట్టిగా ఉంటే
ఎదుగుదల కష్టం మరి” అన్న కవి మాటలలోని లోతు చాలా ఎక్కువ.
నిజానికి ఊహ గొప్పది. దాని పరిధి కూడా అనంతం. కానీ ఈ కవిత చదివినప్పుడు కవిలోని భావాత్మకతమందు ఊహ చిన్నబోయినట్టు అనిపించింది. గేటు పక్కన ఎత్తుగా పెరిగిన మందారం చెట్టు ముందు, ఇనుప గేటు చిన్నదైపోయిందని కవి అనడాన్ని బట్టి, ఎదగాలంటే ఒదుగుతూ వెళ్లాలని చెప్పకనే చెప్పినట్లు అనిపిస్తుంది.

స్త్రీ దృక్కోణం:-
సమ సమాజాన్ని కాంక్షించే ఒక వ్యక్తి స్త్రీల పట్ల ఎలా ఉంటాడు? ఎలా ఉండాలి? ఎలా ఉన్నప్పుడు స్త్రీవాద ఉద్యమాలకు, స్త్రీ హక్కులకు తెరపడుతుంది? అన్న ప్రశ్నలకు సమాధానాలుగా నరసింహారెడ్డి మినీ కవితలు కనిపిస్తాయి. వారు వ్యక్తం చేసిన భావజాలం లోకమంతా పరచుకున్నప్పుడు పుడమి తల్లికి పులకింతే మరి. వీటికి నిరూపణగా ఈ మినీ కవిత..
” ఏ రోజు మహిళల్ది
కాదో చెప్పండి
మార్చి 8న
మహా సంబరం చేయడానికి”
పురుషులతో సమానంగా స్త్రీలకు అన్నింటిలో సమాన అవకాశాలు, సమానమైన విలువ దక్కినప్పుడు నిజమే మార్చి 8లు ఎందుకు? మహిళా దినోత్సవాలతో మహిళకేమక్కర.
” అందిపుచ్చుకోలేక
ఆమెను కవిత్వంలో చిత్రించాను
అక్కడ కూడా
నవ్వమని ఎవరన్నారు” స్త్రీ ఔన్నత్యాన్ని గొప్పగా చాటిన కవి హృదయానికి, మహిళలను తక్కువ చేసి చూసే మురికి మనసుల విచక్షణకు ఈ పంక్తులు మచ్చుతునక.
“ఆమె కంటి నీట
మెరుపు శకలాలు
మన మాటలన్నీ
ఎండు పుల్లలు” అంటాడు కవి.
రామ పాదము తాకి రాయి అహల్యగా మారిందని చెప్తే విన్నాము. చదివి తెలుసుకున్నాము. ఈ కవితలో ఎందరో అహల్యలను అర్థం చేసుకున్న రాముడు ప్రత్యక్షంగా కనిపించాడు. పురుషులందరూ కవులు కావాలని ఒక కొత్త ఆశ పుట్టించిన మినీ కవిత ఇది. ఆడవాళ్లను అర్థం చేసుకోవడానికి ఇంతకు మించి ఇంకొకటి ఉంటుందా!
ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలను గౌరవిస్తూ,అభిమానిస్తూ, అర్థం చేసుకుంటూ ఎంతో ఉన్నతంగా వారి గురించి ఆలోచించినట్లు పాఠకులకు అవగతమవుతుంది.

వృత్తులు:-
“కోటి విద్యలున్నా కులవృత్తికి సాటి రావు” అన్నట్లుగా వృత్తులకు పట్టం కడుతూ కవితలల్లారు నరసింహారెడ్డి.
” గౌడు చెట్టెక్కి
చుక్కల్ని చూస్తాడు
మోకు విప్పి
అంపశయ్యపై పవళిస్తాడు”
“చెట్టులెక్కగలవా ఓ నరహరి! పుట్టలెక్కగలవా”అని ఓ పాట ఉంది. కానీ తాటి చెట్టు ఎక్కడం మామూలు మాటలు కాదు.అది గౌడన్నకే సొంతమైన నైపుణ్యం. కమ్మని కల్లుకోసం ఆవురావుమనే గొంతులను తడుపుతూ తన, తన కుటుంబీకుల జానెడు పొట్ట నింపడానికి అంపశయ్యపై నిత్యం పవళిస్తాడు గౌడన్న.
“భూదానం చరిత్ర
వర్తమానం పట్టుచీర
ఎటు మర్లినా
మెరిసే పోచంపల్లి”
చారిత్రకంగా భూదానోద్యమానికి భూమికై నిలిచిన పోచంపల్లి వర్తమానంలో నేతన్నల శ్రమకు ప్రతీకగా పట్టుచీరలతో మెరుస్తుందని కవి భావన. పోచంపల్లి చేనేతతో మెరుస్తుందని గుర్తించి, చేనేత వృత్తి పట్ల కవి వ్యక్తం చేసిన గౌరవ పూర్వక భావన ఇది.
వ్యవసాయ సంబంధిత కవితలు ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి.
” కాల్వల్తో కాదు
కన్నీటితో పండుతాయి
పీఠభూమిలో
పునాసలు”
“ఒంపు మడిలోకి దూకడం
నీళ్ల ఒడుపు కాదు
మిర్ర మడిని అద్దం
చేసిన నేర్పరిది” అంటూ రైతు పరిశ్రమను తెలుపుతాడు.

భాష:-
కవులకు రచయితలకు భాషాభిమానం మెండు.” మనం ఏ రాచరికంలో
డంకా భాజాయించినా
ఊహలన్నీ
మాతృభాషలోనే పురుడుపోసుకుంటై”
మాతృభాష ప్రాధాన్యతను నిరూపించిన కవిత ఇది. మాతృభాషను తక్కువగా భావించే భాషా ద్రోహులకు చెంపపెట్టు లాంటి వాక్యాలివి.
ఈ విధంగా ఇంకా మానవ సంబంధాలు, స్నేహం, ప్రేమ, వివాహం, వర్తమాన సమాజ పోకడలు ఇలా ఎన్నో అంశాలపై చక్కని మినీ కవితలున్నాయి. పరిశ్రమకు పచ్చ జెండా అయినా ఏనుగు నరసింహారెడ్డి గారి శక్తివంతమైన సృజన ‘పూల పూల వాన’. ఈ సంపుటిని చదివినవారు ఎవ్వరైనా సరే కచ్చితంగా నూతన చైతన్యంతో కొత్త శక్తిని పెంపొందించుకుంటారు.
సాహిత్యం పట్ల, సమాజం పట్ల తనవంతు బాధ్యతను నెరవేరుస్తున్న డాక్టర్ ఏనుగు సింహారెడ్డి గారి ‘పూల పూల వాన’ కచ్చితంగా వ్యక్తి మానసిక వికాసానికి రాచబాటే. సమాజానికి మంచి సాహిత్యాన్ని అందిస్తున్న కవి డా. ఏనుగు నరసింహారెడ్డి అభినందనీయులు.

You may also like

Leave a Comment