మాదాడి నారాయణ రెడ్డి (మానారె)”మా పల్లె పిలుస్తుంది” కవిత పై విశ్లేషణా వ్యాసం. ప్రముఖ కవి, ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాల సేకరణ కర్త,పరిశోధకుడు,రిటైర్డ్ ప్రిన్సిపల్, ఎస్.అర్.అర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్, మాదాడి నారాయణ రెడ్డి (మానారె) కలం నుండి జాలువారిన “మా పల్లె పిలుస్తుంది” కవిత పై విశ్లేషణా వ్యాసం. కవిత ఏమిటి? అని ఆసక్తి తో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.
“మా పల్లె పిలుస్తుంది కిలకిలారావాలతో “అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది”
పల్లెటూరు అంటే మనిషి సంఘజీవి కనుక ఇతరులతో అవసరాలను అనుసరించి దగ్గరగా జీవించుటకు కొందరు ఒక చోట లేదా ఒక ప్రాంతమును కేంద్రముగా చేసుకొని వారి వారి నివాసాలను ఏర్పాటు చేసుకోగా ఏర్పడింది.పల్లె ఒక నివాస ప్రాంతం.పల్లెను కూడా గ్రామంగా వ్యవహరిస్తారు.గ్రామాల మధ్య వ్యాపార సంబంధమైన కార్యకలాపాలు నెరవేరేందుకు వాటికి కూడలిగా కొన్ని పట్టణాలు ఏర్పడతాయి.పల్లె వాతారణంలో మనిషి చుట్టూ ఆహ్లాదకరమైన స్థితి అలుముకుంటుంది.పల్లెలు ప్రకృతి సహజ సౌందర్యానికి పట్టుకొమ్మలు.పల్లెలో జనాలంతా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. వ్యవసాయ భూములకు అనుకూలంగా పల్లెను ఏర్పరచుకుంటారు.పల్లెలో వ్యవసాయమే ప్రధాన రంగంగా పేరు పొందింది.పల్లెలో కొనసాగే సాంప్రదాయాలు,ఆచారాలు ప్రకృతి సహజత్వాన్ని పెంచే విధంగా ఉంటాయి.పల్లెలో జనాలు కోడి కూతతోనే నిద్ర లేస్తారు.పల్లె అందంగా కనపడుతుంది.పచ్చని పొలాల నుండి సూర్య బింబం పొడుచుకు వస్తుంది.సూర్యకిరణాలు వేడి పెరిగే కొలది చెట్లు మనకు ఎంతో హాయినిస్తాయి. పల్లెలో ఉండే చెరువులు,చెరువుల చుట్టూ ఉండే గట్టు,చెరువు గట్టు పై ఉండే చెట్లు,చెట్ల చాటున సాగే దాగుడుమూతల ఆటలు అవి మనిషికి మరపురాని స్మృతులుగా ఉంటాయి.పల్లె అందాలు చెట్లు చేమలతో కూడి ఉంటుంది.పల్లెలో ఉండే ఇళ్ళు కూడా పూల మొక్కలతో కాయగూరల పాదులతో చక్కగా ఉంటాయి.పల్లెలో మనిషికి కావలసిన గాలి చాలా స్వచ్ఛమైనదై సహజంగా లభిస్తుంది.పల్లెలో చెట్లు విరివిగా ఉంటాయి.చెట్ల ద్వారా ఆక్సిజన్ లభిస్తుంది.భూమి,గాలి,నీరు,నిప్పు,ఎంత సహజంగా ఉంటే ప్రకృతి అంత ప్రశాంతంగా ఉంటుంది.భూమిపై కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోయే మనిషి ప్రకృతి పై చేసే మార్పులే మనిషికి మునుముందు దుర్భరంగా మారుతాయి.మనిషి పల్లె వాతావరణాన్ని సమతుల్యంగా కాపాడు కోవాలని పెద్దలు చెప్తారు.పంచభూతాలైన భూమి,గాలి,నీరు,నిప్పు వలన మనిషి మనుగడ ప్రశాంతంగా సాగుతుంది.స్వచ్ఛమైన గాలి మనసుపై మంచి ప్రభావం చూపుతుంది.భూమి నుండి లభించే ఆహార పదార్థాలు స్వచ్ఛంగా ఉంటే మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా జీవించగలడు.స్వచ్ఛమైన నీరు మానవ శరీర పోషణలో కీలకంగా ఉంటుంది.పల్లె గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.సహజమైన ప్రకృతి పల్లెలో ఆహ్లాదకరంగా ఉంటుంది.పల్లెలో గ్రామ జీవితం శ్రమతో కూడుకొని ఉంటుంది.అయినప్పటికీ పల్లె జీవితం సంతృప్తికరం గా ఉంటుంది.పల్లెలో కోడి కూతతోనే నిద్ర లేస్తారు.సూర్యోదయానికి ముందు నిద్ర లేస్తే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు.పల్లెవాసులు ఆరోగ్య నియమాలు పాటిస్తారు.పల్లెలో అంతా అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఉండడం వలన స్నేహితులు బంధువులు,బాంధవ్యాలు బలంగా అల్లుకుని ఉంటాయి.అందువల్ల పల్లెలో ఎక్కడ లేని ప్రశాంతత నెలకొని ఉంటుంది.
“జల కళలీనుతున్న తటాకాలతో
పల్లెలో ఉండే చెరువులు నీళ్లతో తళ తళలాడు తుంటాయి.తటాకం అంటే నీళ్లు ఉన్న పెద్ద కుంట.చెరువు మంచి నీటికి వ్యవసాయానికి ఉపయోగపడే సహజ వనరు అని చెప్పవచ్చును.చెరువు ద్వారా రైతుల పొలాలు సస్యశ్యామలమవుతాయి.పశువులకు తాగడానికి నీరు లభిస్తుంది.పల్లెలోని జనాలు చెరువులో ఈతలు కొడతారు. బెస్త,తెనుగు వాళ్ళు చేపలు పట్టి అమ్ముకొని జీవనం కొనసాగిస్తారు.చెరువులో సబ్బండ వర్ణాల ప్రజలు స్నానం చేస్తారు మరియు బట్టలు పిండుకుంటారు.చెరువు దగ్గర గల చెలిమెలో పల్లె జనాలు నీరు తాగుతారు.చెలిమెలో నుండి నీరు బిందెల ద్వారా త్రాగడానికి తీసుకుని పోతారు.చెలిమె నీరు తీయగా ఉంటుంది.చెలిమెలో నీరు ఎంత తోడినా అలా ఊరుతూనే ఉంటుంది.
“హరితహారం గా నిలిచిన పచ్చని చెట్లతో
పల్లెలు హరితహారం గా ఉండి పచ్చని చెట్లతో నిండి ఉంటాయి.ప్రకృతిని సంరక్షించుకోవడం,ప్రతి మనిషి బాధ్యత.వృక్షో రక్షతి రక్షితః అనగా చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్థం.భూభాగంలో 33% పచ్చదనం ఉంటేనే వాతావరణం సమతుల్యత సాధ్యమవుతుంది. పెరుగుతున్న జనాభా,పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో అడవులు తరిగిపోతున్నాయి.దీనివల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతున్నది.మానవ జీవితం అల్లకల్లోలం అవుతున్నది.హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం వల్ల పచ్చదనం నెలకొంటుంది.అందుకే మా పల్లె హరితహారంతో కూడి పచ్చని చెట్లతో శోభాయమానంగా ఉంటుంది.
“సేంద్రియ ఎరువులతో పండిన పంటలతో
మా పల్లె సేంద్రియ ఎరువులతో పండిన పంటలతో ప్రకృతి సిద్ధమైన పర్యావరణ అనుకూలమైన జీవాధారిత వ్యవసాయంతో విరాజిల్లుతుంది.సేంద్రియ వ్యవసాయం,జీవుల వైవిధ్యాన్ని జీవుల వివిధ దశలను మరియు నేలలో గాలి, సూక్ష్మజీవుల పనితనాన్ని వృధ్ది పరుస్తుంది.సేంద్రియ వ్యవసాయం అనగా సహజసిద్ధ కార్బన్ కలిగి ఉన్న మొక్కల, జంతువుల వ్యర్థాలు మరియు ఇతర జీవ పదార్థాలతో పాటు జీవన ఎరువులను ఉపయోగించుకొని చేసే వ్యవసాయం. నేలలోని పోషకాలను పంటలకు సమగ్రంగా అందిస్తూ సుస్థిర వ్యవసాయ దిగుబడులను సాధిస్తూ నేల,నీరు, వాతావరణం,కాలుష్యం కాకుండా కాపాడుకునే పద్ధతే సేంద్రియ వ్యవసాయం.నేల సజీవంగా ఉండే విధంగా మా పల్లెలో పంటలను పండించడం జరుగుతుంది.
“పాలిచ్చే పాడి పశువుల మందలతో
వ్యవసాయంలో పశుసంపద ముఖ్యమైనట్టిది.పశుసంపద వ్యవసాయం పైన ఆధారపడిన రైతుల పంటలకు అవసరమైన ఎరువులు అందించి దిగుబడిని పెంచుటకు తోడ్పడుతుంది.అంతే కాకుండా మనకు కావాల్సిన పోషక ఆహారం పాలు,మాంసం మరియు గుడ్లు లభిస్తాయి.ఈ పశుసంపద వల్ల ఉపాధి సౌకర్యాలు సమకూరుతాయి. సంవత్సరం పొడుగునా ఆదాయం లభిస్తుంది.పశు ఉత్పాదక శక్తి,ఆ జాతి లక్షణాలు,బంజరు భూముల నుండి మరియు రైతుల పొలం నుండి లభించే పశుగ్రాసం పై ఆధారపడి ఉంటుంది.పశువుల వృద్ది రైతులు పాటించే యాజమాన్య పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది.మా పల్లెలో పాలిచ్చే పాడి పశువుల వల్ల వ్యవసాయదారులైన రైతులకు సరైన ఆదాయం ఉంటుంది.
“లోటు లేని రైతుల పచ్చని కాపురాలతో
పల్లెలో పంటలు పండించే రైతును వ్యవసాయదారుడు అని కూడా అంటారు.ఆహార పంటలు పండించడమే కాక తోటలు,పాడి పశువులు,చేపలు మరియురొయ్యల పెంపకం, చేపట్టిన వారిని కూడా రైతులు అంటారు.సాధారణంగా రైతులు తమ సొంత భూమిని సాగు చేయడమే కాక ఇతరుల భూమిని కూడా కౌలుకు తీసుకొని సాగు చేస్తుంటారు.రైతు వ్యవసాయంలో నిమగ్నమై ఉండే వ్యక్తి. రైతు ఆహారం లేదా ముడి పదార్థాల కోసం జీవాలను అనగా పశువులు,గొర్రెలు, పందులు మొదలైన వాటిని పెంచుతాడు.ధాన్యాలు,పండ్లు మరియు కూరగాయలు వంటి పంటలను పండిస్తాడు.రైతులు పంటలు పండించడానికి మరియు జంతువులను పెంచడానికి అనేక రకాల పద్ధతులను ఉపయోగిస్తారు.రైతులు సాంప్రదాయిక పద్ధతిలో భూమిని దున్నుతారు.రైతులు చేతితో నాటు వేస్తారు.రైతులు భూమిని కాపాడుతూ జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తారు.రైతులు ఆహారాన్ని ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు.రైతులు పంటలు పండించడానికి మరియు పశువులను పెంచడానికి కష్టపడి పని చేస్తారు.రైతులు భూమిని పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు.రైతులు భవిష్యత్ తరాల కోసం భూమిని సంరక్షిస్తారు.రైతులు మన సమాజానికి వెన్నెముక అని చెప్పవచ్చు.రైతులు మనం తినే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తారు.రైతుల వల్లనే మనం భూమి మీద జీవించగలుగుతున్నాం.రైతులు ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు అయినప్పటికి వారికి సరైన సహకారం లేదు.మా పల్లెలో రైతులు సుభిక్షంగా ఉన్నారు.
“మా పల్లె పిలుస్తుంది ఒక్కసారి రా రమ్మని
మా పల్లె అలా పిలవడం సరైనదే అనిపిస్తుంది.మా పల్లె జలాశయాలతో, నిండిన చెరువులతో మరియు పల్లెలో ఎటు చూసినా పచ్చదనంతో కూడుకున్న చెట్లతో మరియు సేంద్రియ ఎరువులు పశువుల పేడ ప్రకృతి సిద్ధమైన వాతావరణానికి అనుకూలమైన జీవాధారిత వ్యవసాయం ద్వారా పండిన పంటలతో, పాలిచ్చే పశు సంపద మందలతో రైతులు సుభిక్షంగా ఉన్నారు.మా పల్లెలో ఎలాంటి లోటు ఉండదు.కాబట్టి రైతు జీవితం ఎల్లప్పుడు పచ్చని కాపురాలతో కళకళలాడుతూ ఉంటుంది.అందుకే మా పల్లె ఒక్కసారి రా రమ్మని పిలవడం చాలా చక్కగా ఉంది.
“కడిగిన ముత్యంలా ఉన్న వీధులతో
మా పల్లెలో ఎవరి ఇంటి ముందు వారు ఊడ్చుకుంటారు.గ్రామ పంచాయతీ ఆఫీస్ వారు వచ్చి వీధులు ఊడుస్తారని ఎవరు ఎదురు చూడరు.పల్లె వాళ్ళు తమ పనులు తాము చేసుకుంటారు.తమ ఇండ్లను శుభ్రంగా ఉంచుకుంటారు.తమ ఇంటి ముందు మరియు వీధులను కూడా శుభ్రంగా చీపురుతో ఊడుస్తారు.కాబట్టి పల్లెలో వీధులన్నీ కడిగిన ముత్యంలా తళ తళ మెరుస్తూ ఉంటాయి అని చెప్పిన కవి నారాయణరెడ్డి (మానారె)భావం చక్కగా ఉంది.
“క్రిమిసంహారక మందులు సోకని కూరగాయలతో
సాంప్రదాయిక పద్ధతిలో కేవలం సహజ వనరులను ఉపయోగించి వ్యవసాయం చేయడాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు.సేంద్రియ వ్యవసాయంలో ఎలాంటి రసాయనిక ఎరువులను కాని పురుగు మందులను కాని వాడరు. రసాయనిక ఎరువులను అసలే ఉపయోగించరు.పంట భూముల్లో ప్రకృతి సేంద్రియ వ్యవసాయం చేస్తూ సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవడం జరుగుతుంది.మా పల్లెలో క్రిమిసంహారక మందులు సోకని కూరగాయలు లభ్యం అవుతాయి అని చెప్పడం గొప్పగా ఉంది.
“కార్బైడ్ ఊసే లేని పండ్ల ఎగుమతులతో
పల్లెలో రైతులు పండ్ల తోటలు పెంచుతారు.మామిడి,నిమ్మ, అరటి మరియు రకరకాలైన పండ్లను పండిస్తారు.పల్లె రైతుల తోటల్లో పండ్లు సహజసిద్ధంగా పండుతాయి.మా పల్లెలో రైతులు కార్బైడ్ ద్వారా కృత్రిమంగా పండ్లను పండించే పద్ధతులను అవలంబించరు.కేవలం దళారులు మాత్రమే కార్బైడ్ ద్వారా పండ్లను పండునట్లు చేస్తారు.పల్లెలో రైతులు ఎలాంటి మోసాలకు తావు లేకుండా చెట్ల నుండి తెంపిన తాజా పండ్లనే అమ్ముతారు మరియు ఎగుమతి చేస్తారు.పల్లె రైతులు ప్రజల ఆరోగ్యాన్ని కోరేవారు అని అర్థమవుతుంది.
“రోగాలు దరికి రాని జనాలతో
పల్లెలో ఉన్న జనాలకు ఎట్లాంటి రోగాలు సోకవు.పల్లె జనాలు కోడికూతతోనే మేల్కొంటారు.పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు తమ వ్యవసాయ పనుల్లో మునిగి తేలుతారు.పల్లె జనులు సాయంత్రం కాగానే శుభ్రంగా స్నానం చేసి వేడి వేడి అన్నం తింటారు.పల్లె జనాలకు ఇతర విషయాల పట్ల ధ్యాస ఉండదు.పల్లె జనాలు నిత్యం శ్రమ చేస్తుంటారు. అలసిపోతే ఏ చెట్టు కింద అయినా సుఖంగా నిద్రపోతారు.పల్లె వాళ్లకు ఏ రోగాలు దరిచేరవు అంటే ఆశ్చర్యం కలగవచ్చు.కాని నిజంగా మా పల్లెలో అలాంటి మెరుగైన వాతావరణం ఉంటుంది.అందుకే వారిని ఏ రోగాలు దరికి చేరవు అనే వాస్తవాన్ని కవి నారాయణరెడ్డి(మానారె) తెలియజేశారు.
“కనుల పండువు చేస్తున్న వనాలతో
పల్లెలు ఎక్కడ చూసినా పచ్చదనంతో నిండి ఉంటాయి.ప్రకృతికి పర్యాయపదంలా మా పల్లె ఉంటుంది.పల్లె చెట్లు చేమలతో పాడి పంటలతో విలసిల్లుతూ కనుల పండువు చేస్తుంది.
“మా పల్లె పిలుస్తుంది ఒక్కసారి రా రమ్మని
పల్లె ఎందుకు పిలుస్తుంది అనిపించవచ్చు.మా పల్లె కడిగిన ముత్యంలా ఉన్న వీధులతో కళకళలాడుతూ ఉంటుంది.మా పల్లెలో ఎటు చూసినా కూరగాయల చెట్ల పాదులు ఉంటాయి.ఆ కూరగాయలు సేంద్రియ ఎరువులతో పండించబడతాయి.ఎలాంటి క్రిమిసంహారక మందులు ఉపయోగించబడవు.మా పల్లెలో పండించిన పండ్లు సహజ సిద్ధంగా చెట్ల మీదనే పండుతాయి.మా పల్లె వాసులు కార్బైడ్ లాంటి రసాయనిక మందులు ఉపయోగించి పండ్లను పండించరు.మా పల్లె వాసులు సహజసిద్ధంగా పండిన పండ్లను ఉపయోగిస్తారు.అటువంటి పండ్లనే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు.మా పల్లె వాసులు నిరంతరం శ్రమిస్తారు. అందుకే వారి చెంతకు ఎలాంటి రోగాలు దరిచేరవు.మా పల్లెలోని జనాలను చూస్తే రోగాలు దూరంగా పారిపోతాయి.మా పల్లెలో ఎటు చూసినా పచ్చని చెట్లతో ప్రకృతి శోభాయ మానంగా కళకళలాడుతూ కనిపిస్తుంది.మా పల్లె ఎటు చూసినా పచ్చని పచ్చదనంతో కూడుకున్న చెట్లతో ఉద్యానవనాలను తలపిస్తుంది.అందుకే మా పల్లె పిలుస్తుంది రా రమ్మని అనడం చక్కగా ఉంది.
“మద్యాన్ని బహిష్కరించిన మా పల్లె
మద్యపానం అలవాటుగా మొదలై చివరికి వ్యసనంగా మారుతుంది.తాగుడుకు అలవాటై వ్యసనంగా మారి దానికి బానిసైన వ్యక్తి పతనమైపోతాడు.మద్యపానం అంటే సారాయి త్రాగు అలవాటు.మద్యపానం ఆరోగ్యానికి హానికరం.మా పల్లె వాసులకు ఎలాంటి సారాయి త్రాగే అలవాటు లేదు.మా పల్లె వాసులు ఎలాంటి మద్యపానం జోలికి పోరు.మా పల్లెలో మద్యపానాన్ని బహిష్కరించారు.మా పల్లెలో తాటి చెట్లు,ఈత చెట్ల ద్వారా సహజంగా లభించే కల్లును తాగుతారు.కల్లును ఎలాంటి కల్తీ చేయరు.మా పల్లెవాసులు మద్యం వల్ల ఆరోగ్యం పాడవుతుందని త్రాగుడుకు బానిసలు అయితే కుటుంబాలు నాశనమవుతాయని మద్యాన్ని బహిష్కరించారు.ఈ వాస్తవాన్ని కవినారాయణరెడ్డి(మానారె) తెలియజేస్తున్నారు.
“పొగ త్రాగడాన్ని నిషేధించిన మా పల్లె
ధూమపానం వల్ల పొగాకులోని నికోటిన్ నేరుగా మెదడుకు చేరుకొని నెమ్మదిగా రక్తపోటును పెంచుతుంది.పొగ త్రాగే అలవాటు కారణంగా మూత్రపిండాల పనితీరు మందగించడమే కాకుండా మూత్రాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు పొగ త్రాగిన వారి ఊపిరితిత్తులు కూడా చెడిపోతాయి.కాబట్టి పొగ త్రాగడం హానికరం అనే మాట ఎక్కడ చూసినా కనబడుతుంది.మా పల్లె లో బీడీ,చుట్ట,సిగరెట్,జర్ద, లాంటివి అమ్మరు.మా పల్లె వాసులు పొగ త్రాగడాన్ని నిషేధించారు అని చెప్పడం చక్కగా ఉంది.
“పిల్లలందరిని బడి ఒడిలో చేర్చిన మా పల్లె
బడి అనగా విద్యాలయం.ఇక్కడ పిల్లలకు విద్యను బోధిస్తారు.విద్యను అభ్యసించే వారిని విద్యార్థులు అంటారు.విద్యను బోధించే వారిని ఉపాధ్యాయులు అంటారు.మా పల్లెలో పిల్లలంతా బడికి వెళ్లి చదువుకుంటారు.మా పల్లెలో ఉపాధ్యాయులు పిల్లలకు చక్కగా పాఠాలు చెపుతారు.పిల్లలంతా బడి ఒడిలోకి చేరి పాఠాలు నేర్చు కుంటారు.పల్లెవాసుల పిల్లలు అంతా చక్కగా బడికి చేరి విద్యను అభ్యసించడం మా పల్లె చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు.
“ఇంటింటికి మరుగుదొడ్లను నిర్మించిన మా పల్లె.
మరుగుదొడ్డి అంటే మల విసర్జనకు ఉపయోగించే గది.ఈ సౌకర్యం లేనివారు మలవిసర్జన బయట ప్రదేశాల్లో చేస్తారు. మరుగుదొడ్లు లేకపోవడం వలన నీరు,గాలి,కాలుష్యమై విరేచనాలు,జీర్ణాశయ వ్యాధులు పెరిగి లక్షల మంది ప్రజలు ప్రతి సంవత్సరం చనిపోతున్నారు.మా పల్లెలో ప్రతి ఇంట మరుగుదొడ్డిని నిర్మించుకున్నారు.పాత కాలం రోజుల్లో ఎక్కడపడితే అక్కడ బహిరంగంగా మలవిసర్జన చేసే వారు. నేడు చక్కగా మరుగు దొడ్డిని నిర్మించుకొని వాటిని వాడుతూ పర్యావరణాన్ని మరియు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.
“ఆడపిల్లను తమ ఇంటి లక్ష్మిగా
“చదువుల సరస్వతిగా చేస్తున్న మా పల్లె.
ఆడపిల్లలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు.ఆడపిల్లలు సాధికారత కలిగి పూర్తి రక్షణతో జీవించాల్సి ఉంటుంది. ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో జీవిస్తూ నవ సమాజ స్థాపనలో తమ వంతు పాత్రను నిర్వర్తించేందుకు అనుకూలమైన వాతావరణం మా పల్లెలో కల్పించబడింది.మా పల్లెలో ఆడపిల్లలు అనే వివక్షత లేదు.ఒకప్పుడు ఆడపిల్లలకు చదువు ఎందుకు అనే భావన ఉండేది.ఇప్పుడు మా పల్లెలో ఆడపిల్ల పుడితే మహా లక్ష్మిగా చూసుకుంటున్నారు.ఆడపిల్లను చక్కగా చదివించి చదువుల సరస్వతిని చేస్తున్నారు.ఆడపిల్లలు చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు.
“శాంతి సౌఖ్యాలకు నెలవైన మా పల్లె
మనుషుల జీవితాల్లో క్షోభ,దుఃఖం లేని స్థితిని శాంతిగా భావించవచ్చు.ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ సుఖం ఉంటుంది.శాంతి ఎక్కడ ఉంటే అక్కడ స్వర్గం ఉంటుంది. కోపం,దుఃఖం, ఈర్ష్య, అసూయ వంటివి లేకుండడమే శాంతి.ప్రపంచంలో అందరు సుఖాన్ని కోరుకుంటారు.ఎవరు కష్టాలు కావాలని కోరుకోరు.చాలామంది తాము అనుభవిస్తున్నది నిజమైన సుఖమని అనుకుంటారు.నిజానికి శాంతి లేనిదే సుఖం లభించదు.లేనిపోని అనవసర ఆలోచనలు విషయ లంపటాలపై ఆసక్తి,ఇత్యాదులను త్యజిస్తే శాంతి లభిస్తుంది.శాంతి అనగా తగాదాలు,యుద్ధాలు లేకుండా మానవులందరూ సఖ్యతగా మెలగడం.మా పల్లెలో జనాలు శాంతితో ఉంటు పరస్పరం సహకారమందించుకుంటూ సంతోషంగా ఉంటున్నారు అనే వాస్తవాన్ని తెలియజేయడం చక్కగా ఉంది.
“పిలుస్తుంది ఒక్కసారి వచ్చి పొమ్మని
మా పల్లె అందరిని పిలుస్తుంది.ఒక్కసారి వచ్చిపొమ్మని స్వాగతం చెబుతుంది.మా పల్లెకు ఒక్క సారి వచ్చినట్లయితే మా పల్లెను చూసినట్లయితే ఇట్లాంటి పల్లెలు లోకంలో ఎక్కడైనా ఉన్నాయా అని ఆశ్చర్యం కలగక మానదు.ఇట్లాంటి పల్లెలు ఉన్నాయని తెలపడానికి నారాయణ రెడ్డి (మానారె) చక్కటి కవితను అందించారు. నారాయణ రెడ్డి (మానారె) మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
మాదాడి నారాయణ రెడ్డి (మానారె) మర్రిపల్లి గూడెం గ్రామం, హుజురాబాద్ తాలూకా,కరీంనగర్ జిల్లాలో తేది 24-07-1940 రోజున సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు.తల్లిదండ్రులు రంగమ్మ, గోపాల్ రెడ్డి.నారాయణరెడ్డి తండ్రి గోపాల్ రెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. నారాయణరెడ్డి తాత నరసింహారెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు.
నారాయణ రెడ్డి 1 వ తరగతి నుంచి 4 వ తరగతి వరకు 1947 నుంచి 1951 మార్చి వరకు ప్రభుత్వ పాఠశాల బుట్టారెడ్డిగూడెం నామాంతరం గల మర్రిపల్లిగూడెం గ్రామంలో చదివారు.నారాయణ రెడ్డి మిడిల్ స్కూల్ ఐదవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు 1951 నుండి 1954 మార్చి వరకు ప్రభుత్వ పాఠశాల కమలాపూర్ గ్రామం, హుజురాబాద్ తాలూకా, కరీంనగర్ జిల్లాలో చదివారు. నారాయణరెడ్డి 8 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరకాలలో 1954 జూన్ నుండి1956 మార్చి వరకు చదివారు. నారాయణరెడ్డి పదవ తరగతి 1956 జూన్ నుండి 1957 మార్చి వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మంథని గ్రామంలో చదివారు. నారాయణరెడ్డి హెచ్.ఎస్.సి. ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.నారాయణరెడ్డి పి.యు.సి. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల,సుబేదారి,వరంగల్ లో 1957- 1958 వరకు చదివారు.నారాయణ రెడ్డి పి.యు.సి. తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.నారాయణ రెడ్డి బి.ఏ. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల,సుబేదారి, వరంగల్ లో చదివారు.నారాయణ రెడ్డి బి.ఏ. ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.నారాయణ రెడ్డి ఎం.ఏ. తెలుగు ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాదులో 1961 నుండి 1963 వరకు చదివారు.నారాయణరెడ్డి ‘ఏ” హాస్టల్లో ఉండి చదువుకున్నారు.నారాయణరెడ్డి ఎం.ఏ. తెలుగు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.నారాయణ రెడ్డి ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్ లో ట్యూటర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. నారాయణ రెడ్డి వివిధ హోదాల్లో పనిచేస్తూ .31-07-1998 రోజున ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్ లో ప్రిన్సిపల్ గా పదవి విరమణ చేశారు.నారాయణ రెడ్డి వివాహం 1959 వేసవికాలంలో శకుంతలతో జరిగింది.నారాయణ రెడ్డి శకుంతల దంపతులకు నలుగురు సంతానం.ముగ్గురు కుమారులు,ఒక కుమార్తె.
1)ప్రథమ సంతానం: రాంగోపాల్ రెడ్డి, భార్య రజిత. .2)ద్వితీయ సంతానం: విజయ్ పాల్ రెడ్డి, భార్య రుక్మిణి.
3)తృతీయ సంతానం: శ్రీధర్ రెడ్డి భార్య సబిత.
4)చతుర్థ సంతానం:కుందూరి వనజాదేవి,భర్త రఘువీర్ రెడ్డి.
నారాయణ రెడ్డి భార్య శకుంతల తేదీ 01-01-1986 రోజున ప్రమాదవశాత్తు ఈ లోకాన్ని వీడిపోయారు.
నారాయణ రెడ్డి ఉద్యోగ విరమణ అనంతరం వివిధ సాహిత్య మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు. నారాయణ రెడ్డి విస్తృతంగా పుస్తకాలు అధ్యయనం చేస్తుంటారు.పుస్తక పఠనం తో సేద తీరుతున్నారు.
మాదాడి నారాయణ రెడ్డి (మానారె) వెలువరించిన గ్రంధాలు.
1) స్పందన కవితల సంపుటి.ముదిగొండ ఈశ్వర చరణ్,ముదిగొండ వీరేశలింగం,మాదాడి నారాయణరెడ్డి (మానారె) ముగ్గురు కవులు కవితలు రాశారు.
2) శైవలిని కవితా సంకలనం.నారాయణ రెడ్డి కవితా సంకలనంనకు సంపాదకత్వం వహించారు.ఇది ఆదిలాబాద్ జిల్లా రచయితల సంఘం ద్వారా ప్రచురింపబడింది.
3) అంకమ రాజు కథ కోలాటం పాట నవంబర్, 2001లో నారాయణ రెడ్డి (మానారె) ప్రచురించారు.
4) అదిలాబాద్ జిల్లా జానపద గేయాలు,మార్చి 2007లో నారాయణ రెడ్డి (మానారె) ప్రచురించారు.
5) ఆదిలాబాద్ జిల్లా జానపద గేయ స్రవంతి, జనవరి 2009లో నారాయణ రెడ్డి (మానారె) ప్రచురించారు.
నారాయణ రెడ్డి రాసిన వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
నారాయణ రెడ్డి సాహిత్య రంగంలో విశేష కృషికి నిదర్శనంగా సెమినార్లు మరియు కాన్ఫరెన్స్ లలో పాల్గొన్నారు.
నారాయణ రెడ్డి ఆకాశవాణిలో కూడా పాల్గొని ప్రసంగించారు.
నారాయణ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు ఉపన్యాసకులుగా విశిష్ట సేవలు అందించినందుకు గాను ఉత్తమ ఉపాధ్యాయుడిగా 1994 సంవత్సరంలో సర్టిఫికెట్ ప్రధానం చేశారు.
24-01-1999 రోజున ఉత్తమ ఉపాధ్యాయునిగా డాక్టర్ జె. రమణయ్య మెరిట్ అవార్డు సర్టిఫికెట్ ను పొందారు.
ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు పుస్తకానికి డిసెంబర్ 2007 లో బొందుగులపాటి అహల్య సుందర్రావు స్మారక సాహితీ గౌతమి,కరీంనగర్ వారి పురస్కారాన్ని అందుకున్నారు.
మై గిఫ్ట్ పురస్కార్ 2008 మై గిఫ్ట్ యువత సంస్థ నర్సింగాపూర్ చందుర్తి మండలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారు నారాయణ రెడ్డి కి పురస్కారం అందించి సన్మానించడం జరిగింది.
తేది 19-10-2018 రోజున ఆదిలాబాద్ జిల్లా ఆకాశవాణి 32వ వార్షికోత్సవం సందర్భంగా నారాయణ రెడ్డిని ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలపై చేసిన పరిశోధనలకు గుర్తింపుగా ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం వారు ఘనంగా సత్కరించినారు.