Home వ్యాసాలు యోగ ప్రాముఖ్యత

యోగ ప్రాముఖ్యత

by Bandi Usha

యోగా అంటే కలయిక, కూడిక, ఏకమగుట. వీటిని సాధించటమే యోగము.

శరీరము, మనసు కలయిక కోసం చేసేసాధనే యోగా. ఆ రెండూ ఏకమవటం యోగము.

“యజ్యతే ఏతదితి యోగః,

యుజ్యతే అనేన ఇతి యోగః”

ఇంద్రియములను వశపరచుకొని ఏకాగ్రత సాధించటానికి అత్యుత్తమమైన మార్గం యోగ.

యోగా సమత్వ ముచ్చితహః”

“చిత్త వృత్తి నిరోదహః”

అభ్యాస వైరాగ్యాల వలన చిత్తవృత్తులను నిరోధించే సమత్వంతో జీవించటానికి రాచబాట యోగ.

యోగా రెండక్షరాల పథము. ఇందులో శతకోటి శతఘ్నుల బలం ఉంది. ఇది ఒక శాస్త్రము. శాస్త్రము అంటే నిరూపించబడినది. ఆధునిక వైద్యశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం రెండూ ముక్తకంఠంతో యోగాకు యోగ్యతా పత్రాన్ని ఇచ్చాయి.

వేదభూమిగా ఖ్యాతిగాంచిన భరతావని సకలశాస్త్రాలకు పుట్టినిల్లు, సర్వశాస్త్రాలకు మూలం వేదాలు. మానవ జీవిత పరిపూర్ణత్వమునకు  శాస్త్రీయపరమైన మూలప్రమాాలు వేదాలే. ఇందు యోగశాస్త్రము కూడా తెలియజేయటం జరిగింది.

5000 సంవత్సరాలకు పూర్వమే భారతదేశంలో ఉన్న జ్ఞానము యొక్క అంతర్భాగము యోగా. మానవునిలోని అనంతమైన మేధోశక్తిని వెలికి తీసి పరిపూర్ణ జీవన విధానానికి తోడ్పడుతుంది. ఇందుకు యోగా, ధ్యానము అవసరము. అప్పుడే ఏకతా స్థితిలో జీవించవచ్చు.

ఈ చరాచర సృష్టిలోని సమస్త జీవరాశుల కన్నా మానవ జన్మ లభించటం అదృష్టమైతే, అది సద్వినియోగపరుచుకున్నప్పుడు వరము అవుతుంది.  ఎందుకంటే జీవితాన్ని యాంత్రికంగా కొనసాగించటానికి, చైతన్య వంతంగా గడపటానికి ఎంతో తేడా ఉంది.

నేటి మానవుడు శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంతో  అభివృద్ధి చెందినప్పటికీ, ఆరోగ్య విషయంలో మాత్రం నాటి మానవుని కన్నా వెనుకంజలో  ఉన్నాడు.  దీనికి కారణం వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించినట్లుగా నేటి మానవుడు శ్రద్ధ వహించటం లేదు. భౌతిక వస్తువులకు, ధనము, దుర్వ్యసనాలకు ప్రాముఖ్యత నిస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. దీనితో వ్యక్తిగత జీవితంలోను, సామాజిక జీవితంలోను సుఖశాంతులు కరువయ్యి ఆనందమనే సహజ స్థితిని కోల్పోతున్నాడు.

వైద్యరంగం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, పుట్టగొడుగుల్లా కొత్త వ్యాధులు పుట్టడంతో మనిషి ఆయుఃప్రమాణం తగ్గిపోతుంది. దీనికి పరిష్కారం యోగ విద్యే.

జీవితంలో కొన్ని విషయాలను కనుక్కోవటం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, అది మానవుని యొక్క జీవనశైలిని సులభతరం చేయటమేకాక జీవిత లక్ష్యాన్ని తెలియచేయటం. అలాంటివాటిలో యోగా ప్రముఖమైనది. మన ప్రాచీనులంతా యోగ విద్య నాచరించి సంపూర్ణ జీవితాన్ని అనుభవించారు. ఇది ఖర్చుతో కూడుకున్నది కాదు. శరీరానికి ఎటువంటి హాని ఉండదు. శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఋజువ అవటంతో మన పాశ్చాత్యులు కూడా దీనిని ఆచరిస్తున్నారు.

మనిషి శరీరం చేయకల్గిన అత్యున్నత వ్యాయామాలతో యోగా ప్రథమస్థానంలో ఉంది. అందుకే ప్రస్థుతం ప్రపంచంలో ఎంతో ఆదరణకు నోచుకుంది. ఏ ఇతర వ్యాయామాలతో పోల్చి చూసుకున్నప్పటికి దీనిలో ఉన్న విశిష్టత వలన యోగ విద్య నాచరించే వారిని ప్రత్యేకంగా నిలబెడుతుందని నిస్సహందేహంగా చెప్పవచ్చు.

శరీరంలో రుగ్మత ఉంది అంటే, అది మనసుకు సంబంధించిన లోపమే. క్రమం తప్పకుండా యోగా చేస్తూ, ధ్యానమాచరిస్తూ శారీరక దృఢత్వం, మానసిక పటుత్వాన్ని పెంచుకుంటే మనలోని శక్తులు వికాసము పొంది పరిపూర్ణానందానికి సహకరిస్తాయి. యోగా అవసరం గుర్తించి ఎక్కువ మంది ఆ వైపుకు పరుగులు తీస్తూ ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఇంకా మార్పు రావాలి.

ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చే ఆచరణాత్మక, క్రియారూపమైన ఈ విద్యను అందరూ నిరంతర సాధనతో ఆనందంగా, ప్రశాంతంగా, సుదీర్ఘ ఆయువుతో, సంపూర్ణ స్వేచ్ఛతో పరిపూర్ణంగా జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను. ముందుముందు యోగా, ధ్యానం వాటి ఆచరణ విధానం చిత్రాలతో తెలియచేస్తారు.

ఈ బ్రహ్మవిద్యను ఆదరించి, ఆచరించి, ఆరోగ్యం పొందితే నేను చేసిన కృషి సఫలమవుతుంది.

 

 

You may also like

Leave a Comment