Home ఇంట‌ర్వ్యూలు రచనలు జీవిత విలువలను ప్రబోధించాలి-అమ్మంగి వేణుగోపాల్

రచనలు జీవిత విలువలను ప్రబోధించాలి-అమ్మంగి వేణుగోపాల్

by Aruna Dhulipala

తొలి కాళోజీ పురస్కార గ్రహీత, ప్రసిద్ధ కవి, రచయిత, విమర్శకులు డా. అమ్మంగి వేణుగోపాల్ గారితో మయూఖ ముఖాముఖి-

                                          -అరుణ ధూళిపాళ

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణా భాషా దినోత్సవం (2015) సందర్భంగా కాళోజీ నారాయణ రావు గారి తొలి పురస్కారాన్ని అందుకున్న ప్రముఖ కవి, రచయిత డా. అమ్మంగి వేణుగోపాల్ గారి సాహితీ జీవనాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం.

సార్ నమస్కారం

1.సాహిత్య రంగంలో బహుముఖీన ప్రజ్ఞ కలిగిన మీరు ఎక్కడ జన్మించారు? మీ బాల్యం, విద్యాభ్యాసం ఎలా గడిచాయో తెలపండి.
జ :-   నమస్తే అండీ! మయూఖ పాఠకులందరికీ నా అభినందనలు. వికారాబాద్ జిల్లాలో మూసీనది జన్మస్థానమైన అనంతగిరి కొండలు తెలుసుకదా!  మూసీనది పుట్టిన చోటు నుంచి రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో నున్న ఆలంపల్లి మావూరు. జనవరి 20, 1948 లో నేను జన్మించాను. 
భట్టుపంతులు అనే టీచర్ వద్ద కొంత, వికారాబాద్ స్కూల్లో కొంత రెండవతరగతి వరకే నేను అక్కడ చదువుకోగలిగాను. మా నాయన రెవెన్యూలో క్లర్క్ గా పనిచేసేవాడు. అప్పుడింకా నిజాం స్టేటే ఉండింది. వివిధ ప్రాంతాలకు బదిలీలు అవుతుండడం వల్ల నా చదువు కొంచెం వెనుకబడింది. 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నారాయణ్ ఖేడ్ వెళ్లిపోయాం. అక్కడికి వెళ్లిన తర్వాత కేశవరావని హెడ్మాస్టర్ నాకొక టెస్ట్ పెట్టి నన్ను డైరెక్టుగా నాల్గవతరగతిలోకి తీసుకున్నారు. అప్పుడు మెట్రిక్యులేషన్ అంటే 11వ తరగతి. అప్పటివరకు నేనక్కడే ఉన్నాను. ఈ లోపు మా నాయనగారు రిటైర్ అయ్యారు. ఇక నేను పియుసి చదువుకోవడానికి నిజాం కాలేజీకి వచ్చాను. బి.ఏ. ఎమ్.ఏ. ఆర్ట్స్ కాలేజీలో చదివాను.

2.మీ ఉద్యోగ ప్రస్థానం ఎక్కడ ప్రారంభమైంది? ఎలా కొనసాగింది?
జ :-   1969 తెలంగాణ తొలి ఉద్యమం నడుస్తున్న రోజులు. డిసెంబర్ లో మా ఎమ్.ఏ. పరీక్షలు అయిపోయాయి. 1970 ఫిబ్రవరిలో రిజల్ట్స్ వచ్చాయి. ఉద్యోగం కోసం కాలేజీలో అప్లై చేసుకున్నాను. ధర్మావంత్ ఎయిడెడ్ కాలేజీలో, ఓరియంటల్ కాలేజీ కొడంగల్ లో, హుజూరాబాద్ గవర్నమెంట్ కాలేజీలో ఒకేసారి మూడు ఆర్డర్లు ఒకేరోజు తేడాతో వచ్చాయి. దివాకర్ల వేంకటావధాని గారు “మీది బీద కుటుంబమని నాకు తెలుసు. అందుకే హైదరాబాద్ ఆకర్షణలో పడకుండా దూరమైనా హుజూరాబాద్ వెళ్ళమని” సలహా ఇచ్చారు (నవ్వుతూ). పాటిబండ మాధవశర్మ గారు, నారాయణరెడ్డి గారు కూడా అదే సలహా ఇవ్వడంతో హుజూరాబాద్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేరాను. అక్కడినుండి సదాశివపేట, ఆ తర్వాత భువనగిరి, తర్వాత ప్రమోషన్ వచ్చి డిగ్రీ కాలేజీ
లెక్చరర్ గా గద్వాల్ వెళ్ళాను. గద్వాల్ నుండి సంగారెడ్డి, ఆ తర్వాత జహీరాబాద్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గా చేరి, అక్కడే రిటైర్ అయ్యాను.

3. సాహిత్య విషయకంగా మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన గురువులు ఎవరైనా ఉన్నారా?
జ :-    నారాయణ్ ఖేడ్ లో నేను చదువుతున్నప్పుడు నందగిరి అనంతరాజ శర్మగారని తెలుగు టీచరుగా వచ్చారు. వారిది వేములవాడ. ఆయన నాలుగేళ్లు మా స్కూల్లో ఉన్నారు. నాకు పద్యాలు రాయడం నేర్పింది ఆయనే. నాకు తెలుగులో మంచి మార్కులు వచ్చేవి. ఆయన విద్యార్థులకు తోకపద్యాలు, వ్యాసరచన, పద్యరచన వంటి పోటీలు పెట్టేవారు. దానివల్ల కొంత రాటు తేలడం జరిగింది. కాశీ కృష్ణాచార్యుల బాలబోధిని వంటి సంస్కృత వాచకాలను ఆయన మాచే చదివించేవారు. మాకు హిందీ పండిట్ రుక్మయ్యగారు. లైబ్రేరియన్ కూడా ఆయనే ఉండేవాడు. ఆయన నన్ను లైబ్రరీకి తీసుకెళ్లి ” ఏ పద్యోంకే చక్కర్ మే నై పఢ్ నా” అంటూ మారుతున్న కాలానికి అనుగుణంగా prose చదువుమని, ప్రేమ్ చంద్ రాసిన ‘గోదాన్’ నవలను చదవడానికి ఇచ్చారు. మన చుట్టూ ఉన్న జీవితమే ఆ పుస్తకంలో ఉంది. కవిత్వం అంటే ఊహించి రాసేది కాదని down to earth ఉండాలని తెలిసి ఆశ్చర్యపోయాను. పుస్తకం చదివిన తర్వాత దాంట్లో నుంచి కొన్ని ప్రశ్నలు కూడా రుక్మయ్యగారు నన్ను అడిగారు. రెండు నగరాల కథ, గోర్కీ-అమ్మ, టాల్ స్టాయ్ యుద్ధము-శాంతి వంటి అనువాద పుస్తకాలను, క్లాసిక్స్ గా ఉన్న తెలుగు పుస్తకాలను నా చేత చదివించారు. అట్లా నాకు సాహిత్యంలో ఒక కొత్త ప్రపంచం కనిపించింది. దానికి కారణం రుక్మయ్యగారు. తెలుగు సంప్రదాయాలు, తెలుగు పద్యం, సంస్కృత భాషల గొప్పదనాన్ని చెప్పినవారు అనంతరాజ శర్మ గారు. రెండు భిన్న కోణాలు నా మనసులో అప్పుడే ముద్ర వేసుకున్నాయి.
         మాకు దామోదర్ రావ్ అనే హెడ్మాస్టర్ ఉండేవారు. ఆయన సిటీ కాలేజీ స్టూడెంట్. పట్నం నుంచి వచ్చినవాడు కాబట్టి కొత్త కొత్త ఆలోచనలతో పాటు వాటిని ఇంప్లిమెంట్ చేయాలన్న సాహసం ఉంటుంది. కొత్త ప్రయోగాలు చేసేవారాయన. ఒక వంద కార్డులు, పక్కనే ఒక గల్లాపెట్టె. కార్డు ఒక పైసో, రెండు పైసలో ఉండేది. గల్లాలో డబ్బులు వేసి కార్డు తీసుకొని ఇంటికో, స్నేహితులకో విద్యార్థులను ఉత్తరం రాయమనేవాడు. ‘గోడపత్రిక’ ఒకటి ఏర్పాటు చేశారు. మీ సార్లకు చూయించనవసరం లేకుండా, ఎవరూ సెలెక్ట్ చేయకుండా మీకు తోచింది రాసి గోడకు అతికించుమనేవాడు. దానివల్ల పద్యమో, గద్యమో, కథో ఏదో ఒకటి రాసే అలవాటు పిల్లల్లో పెరిగేది. ప్రతీ శనివారం ఉపన్యాస పోటీలు కూడా పెట్టేవారు. నాలుగు శనివారాల్లో మూడు సార్లు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. ఈశ్వరప్ప అని ఇంకో మిత్రునికి అప్పుడప్పుడు వచ్చేది. అట్లా సాహిత్యబీజాలు అప్పుడే మొదలయ్యాయి. నారాయణ్ ఖేడ్ ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతంగా ఉన్నా మేమున్నప్పుడు ఇట్లాంటి టీచర్ల వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. నాలాంటి ఆసక్తి గల విద్యార్థులను పదిమందిని గ్రూపుగా చేసి మా పాఠశాలకు సంసృతం ఐచ్చిక భాషగా ఉండే ఏర్పాటు చేయించారు అనంతరాజ శర్మగారు.

4. కవిత్వరంగంలో మీ ప్రవేశం ఎలా జరిగింది?
జ :-    మా సార్ అనంతరాజ శర్మగారు, దాశరథి గారు ఇద్దరూ స్నేహితులు. ఒకసారి క్లాసులో ఉన్నప్పుడు పోస్టులో కొన్ని పుస్తకాలు సార్ కు దాశరథి గారి నుండి వచ్చాయి.  దాంట్లో ‘మంజీర’ కవితను చదివారు. “ఏమన్నదే నిన్ను ఏమన్నదే నిన్ను, ఏడుపాయల దుర్గ ఏమన్నదే నిన్ను? స్వరమొక్క పాయగా చీలి పొమ్మన్నాది. సాగిపొమ్మన్నాది” అంటూ ప్రశ్న, జవాబులు లాగా సాగిన కవిత. ఏడు పాయలు ఏడు స్వరాలుగా చెప్పబడిన కవిత. ఆయన అది చదివి కవిత్వమంటే ఇట్లా ఉండాలిరా! అన్నాడు. నాకప్పుడు అర్థం కాలేదు. సార్ ని అడిగి తెలుసుకున్నాను. అట్లా దాశరథి గారి మీద అభిమానం ఏర్పడింది. నారాయణరెడ్డి గారు సభల్లో ఆయన రచనల్లోని ఏవైనా గేయాలు పాడేవారు. ఆ గొంతులో మాధుర్యం, రాజసం, ఇవన్నీ ఎంతో ఆనందాన్నిచ్చేవి. ఆయనకు ప్రత్యక్ష శిష్యుణ్ణి కూడా కావడం ఎంతో అదృష్టం. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు అంధులతో పరిచయం ఏర్పడింది. అదెలాగంటే ఒకరోజు నేను నిజాం కాలేజీకి అవతలివైపు నిలబడ్డా. బాగా రష్ ఉంది. ముగ్గురు అంధులు రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతుంటే నేను వాళ్ళను నాతో పాటు రోడ్డు దాటించాను. “ఎక్కడికి వెళ్లాలో చెబితే అక్కడి వరకు తోడుంటాను” అని చెప్పాను. అప్పుడు వాళ్ళు తాము నిజాం కాలేజీ స్టూడెంట్స్ మని, రెగ్యులర్ గా రావడానికి హాస్టల్ లో సీటు దొరికిందని చెప్పారు. చాలా ఆశ్చర్యం వేసింది. అట్లా ఏర్పడిన పరిచయంతో అప్పుడప్పుడు వాళ్లకు పాఠం చదివేవాణ్ణి. ఒకసారి వాళ్ళ కోరిక మేరకు చాదర్ ఘాట్ కమలా టాకీసులో మల్లీశ్వరి సినిమాకు తీసుకువెళ్ళాను. సినిమా అయిపోయిన తర్వాత “అందులో మీరేం చూసిన్రు?” అని అడిగాను. “కనపడక పోయినా ఆ డైలాగులను బట్టి మేము అర్థం చేసుకుంటాం” అన్నారు. ఎంత గొప్ప విషయం అనిపించింది. వాళ్లకు నేను కళ్ళద్దాలు ఇప్పించాను. ఇట్లా దగ్గరగా వాళ్ల అలవాట్లను, ప్రవర్తనను గమనించాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ‘చీకటిలో బతుకు నీడ’ అని కవిత రాశాను. అది సృజన పత్రికలో వచ్చింది. దానికి రాష్ట్రస్థాయి మొదటి బహుమతి వచ్చింది. అట్లా కవిత్వ రంగంలో ప్రవేశించాను.

5.  ఆ కవితకు రాష్ట్రస్థాయి బహుమతినందుకున్న విశేషాలను చెప్పండి.
జ :-   నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ‘సృజన’ పత్రిక వస్తుండేది. ఎడిటింగ్ వ్యవహారాలన్నీ వరవరరావు చూస్తున్నాడు. దాంట్లో రాష్ట్రస్థాయి కవితా పోటీలకు సంబంధించి ఒక ప్రకటన వచ్చింది. ఉస్మానియా, వేంకటేశ్వర, ఆంధ్ర మూడు యూనివర్సిటీలలో ఎవరైనా ఈ పోటీలో పాల్గొనొచ్చు అని. ఆ పోటీ కోసం నేను ‘చీకటిలో బతుకు నీడ’ అనే కవితను రాశాను. చెన్నకేశవరెడ్డి అని నా క్లాస్ మేట్. ఆయనకు చూపిస్తే “నీ శీర్షికకే ప్రైజ్ వస్తుంది” అన్నాడు (నవ్వుతూ). రెండు నెలల తర్వాత వరవరరావు నుండి “నీ చీకట్లో బతుకు నీడ కవితకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింద”ని ఉత్తరం వచ్చింది. అంతమందిలో నాకు రావడం గొప్ప అనుభూతి.

6. హేతువాదిగా, మనోవైజ్ఞానిక సాహితీవేత్తగా పేరుగాంచిన గోపీచంద్ నవలలను ఆ దృక్కోణంలోనే సిద్ధాంత గ్రంథంగా వెలువరించారా? మరో కోణం ఏమైనా ఉందా?
జ :-   గోపీచంద్ జీవితం నాస్తికునిగా ప్రారంభమైంది. మానవేంద్ర నాథ్ రాయ్ అని ఒక కమ్యూనిస్ట్ లీడర్ ఉండేవాడు. ఆయనకు కమ్యూనిజం మీద నమ్మకం సడలిన తర్వాత ‘రాడికల్ డెమొక్రాటిక్’ పేరుతో ఒక రాజకీయ పార్టీ స్థాపించాడు. ఆ పార్టీలో గోపీచంద్ కూడా చేరి, ఆంధ్ర ప్రాంతానికి సెక్రటరీగా పనిచేశాడు. నాస్తిక వాదం, హేతువాదం, రాయిజమ్ మీద కూడా ఆయనకు నమ్మకం సడలిపోయి ఆస్తికుడయ్యాడు. అరబిందోకు శిష్యుడై ఆయనను దర్శించుకున్నాడు. ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’ లో మనకు అది కనిపిస్తుంది. ‘హేతువాది’గా ఆయన అభిప్రాయం సడలుతున్న సమయంలో ‘అసమర్థుని జీవయాత్ర’ రాశాడు. రాయ్ ప్రభావంతో రాసింది ‘పరివర్తనం’ అది మొదటి నవల. ముందు ఆయన కర్నూలులో ఉద్యోగం చేసి ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చి , ఇన్ఫర్మేషన్ డిపార్టుమెంటులో జాయింట్ డైరెక్టర్ గా చేశాడు. అది ప్రభుత్వోద్యోగం కాదు. రాజకీయ పలుకుబడి ద్వారా వచ్చింది. దాని కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఆకాశవాణిలో ప్రయోక్తగా చేరాడు.
         ఆయనకు వ్యవసాయంతో సంబంధం  ఉంది కనుక గ్రామాలకు వెళ్లి ఆ విధానాలను తెలుసుకుంటుండేవాడు. అదే సమయంలో ‘జపాన్ వరిసాగు’ అనే ఒక పద్ధతి వచ్చింది. అంతకుముందు నార్లు వేయడం ఇష్టం వచ్చినట్టు ఉండేది. ఈ పద్ధతి వచ్చిన తర్వాత ఒక క్రమ పద్ధతిలో వేసే విధానాన్ని రైతులు అలవరచుకున్నారు. ఈ పద్ధతిని ప్రచారం చేసిన వాళ్లలో గోపీచంద్ కూడా ఒకడు.  అరబిందో విశ్వాసాల పట్ల కూడా ఆయనకు నమ్మకం సడలి సాయిబాబా వైపు వచ్చాడు. నిలకడ ఉన్న మనిషి కాదు. ఆర్. ఎస్. సుదర్శనం అనే విమర్శకుడు “గోపిచంద్ రచనలు లేడికి లేచిందే పరుగు అన్నట్టు ఉంటాయి. ఒక ‘అసమర్థుని జీవయాత్ర’ లో మాత్రం స్థిరత్వం కనిపిస్తుంది” అన్నారు. అది గోపిచంద్  మాస్టర్ పీస్. అనేకమైన కథలను రాశాడు. కథా సాహిత్యాన్ని బాగా ప్రచారం చేసిన వారు ఇద్దరు. ఒకరు కొడవటిగంటి కుటుంబరావు, మరొకరు గోపీచంద్. పుంఖానుపుంఖాలుగా కథలు రాశారు. గోపీచంద్ మీద పరిశోధన చేసి గమనించింది ఏంటంటే ఆయన హేతువాదం, ఆస్తికవాదం, నాస్తికవాదం ఇట్లా అన్ని వాదాలను గౌరవించాడు. వేటినీ వ్యతిరేకించకుండా వాటిలోని మంచిని తీసుకున్నాడు. అందుకని ఆయనను ఒక సమన్వయ వాదిగా గ్రహించాను. కుటుంబరావు, శ్రీశ్రీ ఒకే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. కానీ ఈయన అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ వచ్చాడు.

7. మొదట పద్యకవిత్వం రాసిన మీ దృష్టి వచన కవిత్వంపై మళ్ళడానికి కారణం ఏమిటి?
జ :-    మొదట నేను పద్యాలు రాసేవాణ్ణి అని చెప్పాను కదా! లాల్ బహదూర్ శాస్త్రి మరణించేంతవరకు రాసిన. ఆయన మరణం నన్ను కలచి వేసి పది పద్యాలు రాశాను. మా ప్రిన్సిపాల్ ఆర్వేంద్ర శర్మ గారని జర్మనీలో చదువుకొని, ఉద్యోగం చేసి  వచ్చినవాడు. ఆయన శాస్త్రి గారి సంతాపసభ ఏర్పాటు చేశారు. ఆ సభలో ఆ పద్యాలను పాడిన. ప్రిన్సిపాల్ తెల్లవారి నన్ను పిలిచి “బహుత్ అచ్ఛా లిఖే, ఔర్ గాయే భీ” అని మెచ్చుకున్నారు. నా మిత్రుడు చెన్నకేశవరెడ్డి నీ పద్యాలకు మోగినన్ని చప్పట్లు ఎవ్వరికీ మోగలేదు అన్నాడు. ఒక పెద్దాయన చనిపోతే రాసిన పద్యాలకు ప్రశంసలు పొందడం బాధగా అనిపించింది. చెన్నకేశవరెడ్డి “పద్యాలకు కాలం చెల్లిపోయింది” అని ఒక మాట అన్నాడు. ఇతను నాకు రెండవ గురువు.
         ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యూగో రాసిన ‘les miserables’ నవలను చదివాను. నేరం చేసినవాడు ఏ పరిస్థితుల్లో చేశాడో తెలుసుకుంటే అది నేరమా కాదా? తెలుస్తుందని రచయిత ఒక కొత్త, ప్రధాన అంశాన్ని తెలుపుతూ రాసిన నవల. చెల్లెలి కూతురు ప్రాణాలు కాపాడడానికి రొట్టె ముక్కను దొంగతనం చేసి శిక్షార్హుడైన వాడి కథ. ప్రపంచ నవలల్లో గొప్పగా చెప్పబడే మొట్టమొదటి నవల. ఇటువంటి గొప్ప నవలలను చదవడం వల్ల నాకు ప్రపంచం అర్థమైనట్టు అనిపిస్తుంది. శ్రీశ్రీ రచనలు చదివాను. ‘అమృతం కురిసిన రాత్రి’ రాకముందు హారతి పత్రికలో వచ్చిన తిలక్ కవితల పేపర్ కటింగ్ లను చెన్నకేశవరెడ్డి చదవమని తెచ్చిచ్చేవాడు. దాశరథి వచన కవిత్వం, కుందుర్తి రచనలు చదివాను. అవి నన్ను కొత్తలోకాలకు తీసుకుపోయేవి. సీతా కల్యాణి గారని లెక్చరర్ ఉండేవారు. ఆమె మాకు సారస్వత పరిషత్తును చూపించి సాయంత్రం ఆరుగంటలు దాటిన తర్వాత మన కవులందరూ ఇక్కడికి వస్తుంటారు వెళ్ళమని చెప్పారు. అక్కడే విశ్వనాథ మొదలగు కవులందరినీ చూశాను. YMCA లో ఒక హాలుండేది. భద్రిరాజు కృష్ణమూర్తి, బుచ్చిబాబు, మొక్కపాటి నరసింహశాస్త్రి మొదలైన వాళ్ళు ఉపన్యాసాలిచ్చేవారు. ఒకసారి భద్రిరాజు కృష్ణమూర్తి మాట్లాడుతూ చిన్నపిల్లలు వాళ్ళ చిన్న బుర్రలలోకి స్పష్టత చేకూర్చుకునే క్రమంలో మాటలకు కొన్ని కొత్త అర్థాలను సృష్టిస్తారని, ఏ డిక్షనరీలో అవి ఉండవని, భాషా సృష్టిలో వాళ్ళ పాత్ర కూడా ఉంటుందని చెప్పిన విషయం నన్ను ఆలోచింపజేసింది. బుచ్చిబాబు చాలా సంస్కారవంతంగా మాట్లాడేవాడు. ఈ విధంగా సాహితీ మూర్తులను ప్రత్యక్షంగా కలుసుకోవడం, కవుల రచనలను చదవడం నా వచనకవిత్వానికి ప్రేరణనిచ్చాయి.

డా. అమ్మంగివేణుగారితో ముఖాముఖి గ్రహీత అరుణ ధూళిపాళ

8. మీ ‘సాహిత్య సందర్భం – సమకాలీన వ్యాస సంపుటిలో వెలువరించిన అంశాలేవి?
జ :-   నావి మూడు వ్యాస సంపుటాలున్నాయి. ‘అవినాభావం’ మొదటిది. అప్పుడు ఆంధ్రజ్యోతి ఎడిటర్ నండూరి రామ్మోహన్ రావు. ఒకసారి గురజాడ ‘సంస్కర్త హృదయం’ కథానికను గురజాడ రాసిన తీరును విమర్శిస్తూ ఒక వ్యాసం రాసి పంపించాను. వెంటనే ప్రచురించారు. అంతేకాదు. “మీ వ్యాసం కొత్త ఆలోచనలతో ఉన్నది. ఇంకా ఏదైనా రాస్తే పంపించండి” అని కార్డు రాశాడు. ఏడెనిమిది వ్యాసాలు రాశాను. అట్లా ఈ వ్యాసాలన్నీ 1999లో ‘అవినాభావం’ అనే పేరుతో వేశాను. ‘సూర్య’ అనే పత్రికలో నెక్స్ట్ టు ఎడిటర్ గా ఉన్న నిజం అనే ఆయనతో నాకు పరిచయం ఉండేది. ఆయన తెలుగు పత్రికలకు, రచనలకు సంబంధించిన వ్యాసాలు రాయమని అడిగాడు. ప్రతి సోమవారం ‘దస్తూరి’ అనే కాలమ్ వచ్చేది. దానికి రాసేవాణ్ణి. అందులో నచ్చినవన్నీ తీసుకొని ‘సాహిత్య సందర్భం – సమకాలీన స్పందన’ అనే పేరుతో వేశాను. వరవరరావు దాన్ని ఆవిష్కరించారు. కవులు వ్యాసాలు రాస్తే కవిత్వం ఉంటుందనే విమర్శ ఉంది. దీన్ని బాగా ప్రచారం చేసినవాడు చేకూరి రామారావు. కవిత్వంలో మాత్రమే కవితాత్మకత ఉండాలి కానీ వచనంలో కవిత్వ వాసన ఉండకూడదని ఆయన ఉద్దేశం. వచనాన్ని పోయెటిక్ గా రాస్తే ప్రభావశీలంగా ఉంటుందని నా వాదన. దాన్ని రూఢి చేస్తూ ఆ వ్యాసాలు రాశాను. మొదటి వ్యాసం కాళోజీ పైనే ఉంటుంది. ఈ వ్యాసాలలో పోయెటిక్ ఎక్స్ప్రెషన్ చాలా బాగుందని ఎంతో మంది మెచ్చుకున్నారు. బుచ్చిబాబు, చలం నవలల్లో కూడా వారి హృదయగతమైన కవితాత్మ కనిపిస్తుంది.

9. మీరు చేసిన అనువాదాల గురించి చెప్పండి.
జ :-    నేను అనువాదాలు ఎక్కువగా చేయలేదు. పరబ్రహ్మ శాస్త్రి గారి “Telugu script : Origin and Evolution” పుస్తకాన్ని అనువాదం చేయమని ఓరియంటల్ మాన్యు స్క్రిప్ట్ లైబ్రరీకి డైరెక్టర్ గా ఉన్న జయధీర్ తిరుమలరావు గారు కోరారు. అప్పటికే నేను రిటైర్ అయ్యాను. దాన్ని ‘తెలుగు లిపి – పరిణామం’ అనే పేరుతో అనువదించాను. అది నా మొదటి అనువాద పుస్తకం. ఇదే కాక ఇంకా 35 ఇతర పుస్తకాలను ఎడిట్ చేస్తే అవి కూడా వాళ్ళు వేశారు. అంతకుముందు ఇటువంటి కృషి ఎవరూ చేయలేదు. ఇంకో ఇద్దరు కూడా 4, 5 పుస్తకాలు చేశారు. అట్లా కేవలం రెండున్నర సంవత్సరాల వ్యవధిలో దాదాపు 45 పుస్తకాలు వాళ్ళు వేయడం గొప్ప విషయం. రెండవది మఖ్దూం మొహియొద్దీన్ మీద ఇంగ్లీషులో ఉన్న పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేశాను. కేంద్రసాహిత్య అకాడెమీ వాళ్ళు వేశారు. గవర్నమెంట్ సిటీ కాలేజీ వాళ్ళు మఖ్దుం మొహియొద్దీన్ గురించి కృషి చేసిన వాళ్లకు ఒక పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నారు. ఆయన గురించి కృషి చేయకపోయినా ఆయన భావజాలాన్ని సమర్థిస్తూ కృషి చేసిన వాళ్లకైనా ఇస్తూ వచ్చారు. నేను ఆ పుస్తకాన్ని రాసిన తరువాత సిటీ కాలేజీలో విప్లవ్ శుక్లా దాన్ని చూసి ప్రిన్సిపాల్ కు తెలియజేశారు. ప్రిన్సిపాల్ ఫోన్ చేసి మీకు అవార్డు ఇస్తున్నామని తెలిపారు. ఇక్కడొక విషయం చెప్పాలి. మఖ్దూం మొహియొద్దీన్ అందోల్ కు చెందినవాడు. మా అమ్మమ్మ పుట్టి పెరిగిన ఊరు. మేము ఎండాకాలం సెలవులకు వెళ్ళినప్పుడు ఈత కొట్టడానికి చెరువుకు వెళ్ళేవాళ్ళం. పిల్లలమనే భయంతో మా అమ్మమ్మ మాతో పాటు వచ్చేది. ఒకసారి వస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఆంజనేయస్వామి గుడి చూపించి ” ఇండ్ల ఒక తుర్కకవి తెలుగు నేర్చుకున్నడటరా” అని చెప్పింది. ఆమెకు ఆ కవి పేరు తెలియదు. తుర్కకవి హనుమంతుని గుడికి రావడమే విశేషం. తెలుగు నేర్చుకోవడం మరీ విశేషం. ఆ కాలంలో అతణ్ణి గుడి లోపలికి రానివ్వడం పూజారి గొప్పతనం. ఈ పుస్తకాన్ని అనువాదం చేస్తున్నప్పుడు ఈ విషయం అందులో ఉంది. దాంతో నేను అతడు చిన్నప్పటి నుండీ తెలిసిన వాడిగా అనుభూతి చెందాను.
         ఆకాశవాణి కేంద్రం వాళ్ళు ప్రతీ సంవత్సరం జనవరి 25 నాడు జాతీయ కవి సమ్మేళనం చేస్తారు. దాదాపు 30 కవితలు భారతీయ భాషలకు చెందినవై ఉంటాయి. దాదాపు 30 సంవత్సరాలు వరుసగా నన్ను పిలిచారు. వాటిని నేను తెలుగులోకి అనువాదం చేసి చదివేవాణ్ణి. ఇంకొకటి అప్పటి గవర్నర్ ఎన్.డి.తివారీ స్నేహితుడు జహీరుద్దీన్ బాబర్ ఉర్దూ కవిత్వాన్ని రాసి, పుస్తకంగా వేయించుమని ఆయనను అడిగాడు. గవర్నర్ దాన్ని తెలుగు అకాడెమీకి పంపించారు. అకాడెమీ డైరెక్టర్ నన్ను పిలిచి అనువాదం చేయమన్నారు. చేసి పంపితే పుస్తకం వేసి కాపీ ఒకటి పంపారు కానీ అది దొరకడం లేదు.

10. మీ సంపాదకత్వంలో వెలువడిన ప్రముఖ రచనలను తెలుపుతూ అరుదైన కవితా సంకలనంగా చెప్పబడే “మజహర్ మెహదీ – మరో ప్రపంచం” అనువాద కవితా సంకలన ప్రత్యేకతను తెలపండి.
జ :-   నా సంపాదకత్వంలో వ్యాసమంజీర, మరో కొత్త వంతెన (ఏక్ ఔర్ నయా పూల్), మజహర్ మెహదీ మరో ప్రపంచం, తెలంగాణ వైతాళికుడు – సురవరం ప్రతాపరెడ్డి, ప్రజల పక్షాన ప్రతిజ్ఞ, అద్దంలో విద్యార్థి  వచ్చాయి. అందులో మజహర్ మెహదీ – మరో ప్రపంచం ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. మజహర్ మెహదీ ఒక లౌకిక వాది అయినటువంటి ముస్లిం కవి. అయినా ఆ లక్షణాలు ఆయనలో కనిపించేవి కావు. మేము ఏక్ ఔర్ నయా పూల్  ఉర్దూ – తెలుగు కవితా సంపుటి వేసినం. ఒక పేజీ ఉర్దూ, అదే కవిత మరో పేజీ తెలుగు అనువాదంలో ఉంటుంది. ఈ విషయంలో ఆయన నాకు బాగా సహకారం అందజేసిండు. ఆయనతో నాకు స్నేహం ఏర్పడింది. అప్పటినుండి సభా కార్యక్రమాలు కలిసి చేసినం. కొంతకాలానికే ఆయన క్యాన్సర్ తో చనిపోయాడు. చాలా బాధకు గురయ్యాము. ఆయన రాసిన కవిత్వం మూడు నాలుగు సంపుటాలు ఉన్నాయి. అందులో 32 కవితలను ఎంపిక చేసి నేను, వెంకటేశ్వర్లు, వేణు సంకోజు, నోముల సత్యనారాయణ, దేవరాజు మహారాజు అందరం కలిసి వాటిని తెలుగులోకి అనువదించి ఒక దిక్కు తెలుగు మరో దిక్కు ఉర్దూ ఉండేలా చేశాము. నాకు ఉర్దూ లిపి రాదు కానీ భాష తెలుసు. అందువల్ల లిప్యంతరీకరణ చేసి ఉర్దూను తెలుగులో రాసిన. ఇట్లా ఎవరూ చేయలేదు. ఈ ప్రాజెక్టుకు నాతో పాటు ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేసిన అలీ అస్గర్ గారు అందించిన సహకారం మరువలేనిది.

11. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కాళోజీ పురస్కారాన్ని మొట్టమొదటగా మీరు అందుకోవడం వల్ల కలిగిన అనుభూతి ఎటువంటిది?
జ :-  2015 వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీ నా జీవితంలో ఒక మరపురాని రోజు. కాళోజీ నారాయణ రావు గారి పేరిట తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అవార్డు మొట్టమొదటి సారిగా నన్ను వరించింది. అది నాకు ఆశ్చర్యం. ఆనందం. దాన్ని నేను జీవన సాఫల్య పురస్కారంగా భావిస్తాను. కాళోజీ గారితో అంతకు ముందే నాకు పరిచయం ఉంది. వరంగల్ కు 30, 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుజూరాబాద్ లో పని చేసినప్పుడు ఆదివారాలు ఖాళీగా ఉండడం వల్ల వెళ్ళేవాణ్ణి. నవీన్, పెద కాళోజీ, చిన కాళోజీ ఇంకా కొంతమంది సాహితీ మిత్రులు కలిసేవారు. 1970 నుండే ఈ పరిచయాలు ఉన్నాయి. కాళోజీ గారి గురించి నేను 1978-79 ప్రాంతంలో ఒక కవిత రాసిన. మామూలుగా ఆయన ఎవరికీ ఉత్తరాలు రాయరు, చెప్పిస్తారు. అటువంటిది విద్యార్థి అనే మిత్రునితో కవిత బాగుందని ప్రశంసిస్తూ ఉత్తరం రాయించడం విశేషం. అంతకుముందే శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో ఒక సమావేశంలో సభాధ్యక్షుడుగా నారాయణరెడ్డి గారు ఉన్నారు. సభ అయిపోయి నేను వస్తుంటే వెనకనుండి నారాయణ రెడ్డి గారు ‘వేణుగోపాల్!’ అని పిలిచి, “కాళోజీ మీద అద్భుతంగా రాశావయ్యా” అని మెచ్చుకున్నారు. ఆవిధంగా ఆ అవార్డు నా బాధ్యతను పెంచింది. నాకు పేరు ప్రఖ్యాతులను అందించింది. నాకు సారస్వత పరిషత్తు వాళ్ళు సి. నారాయణరెడ్డి పురస్కారం ఇచ్చారు. మరో సంస్థ ఆకృతి పురస్కారం ఇచ్చింది. అట్లా నా సాహిత్య ప్రస్థానంలో ఎన్నో పురస్కారాలు వచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కాళోజీ పురస్కారాన్ని మాత్రం ఎంతో విశిష్టంగా భావిస్తాను.

12. మీ రచనల్లో కాళోజీ గారి ప్రభావం ఉందని అనుకోవచ్చా?

జ :-     ఆయన కవిత్వ ప్రభావం లేదు కానీ ఆయన ఐడియాలజీ ప్రభావం ఉంది. ముఖ్యంగా తెలంగాణ వాదం. ఏ పరిస్థితుల్లోనూ ఆయన దాన్ని వదులుకోలేదు. ఏనాడూ దూరం జరగలేదు. అది ఆయన గొప్పతనం. ఆయన ఆరోజుల్లో ఇందిరాగాంధిని, కాసు బ్రహ్మానందరెడ్డినీ ఎదిరించాడు. వీళ్ళిద్దరినీ విమర్శిస్తూ రాసినవి, ఉద్యమం గురించి రాసినవే 100 కవితల దాకా ఉంటాయి. తండ్రి మహారాష్ట్ర, తల్లి కన్నడ, తాను తెలంగాణలో పుట్టినవాడు కూడా కాదు. అయినా ఈ భూమి మీద పెరిగినందుకు ప్రాణం పోయినా పరవాలేదన్న తెగింపుతో ఉద్యమం చేయడం గొప్ప సాహసం. అందరినీ అది ప్రభావితం చేసింది. ఉద్యమధార తెగకుండా చూసినవారిలో కాళోజీ ఒకరైతే మరొకరు జయశంకర్ గారు. ఉద్యమం మొదటి నుండీ 2014 వరకు మీదికి కనిపించకపోయినా అంతర్గతంగా అందరి హృదయాల్లో రగిలిందంటే కారణం ఆయనే. ఆయనలాగా ప్రజాకవిత్వం రాసిన వారెవరూ లేరు. సరళమైన పదాలతో గంభీరమైన అర్థాన్నిచ్చే కవిత్వం రాశారాయన. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి మిత్రమండలి సమావేశం జరుగుతున్నది. రిక్షాలో బియ్యం సంచి వచ్చింది. రిక్షా అతను దాన్ని మోయలేక పోతుంటే ఒక కవి లేచి సహాయానికి వెళ్లబోతుంటే రిక్షా అతను “మీతో కాదు ఒక పనిమనిషి కావాలి” అన్నాడు. అప్పుడు కాళోజీ “చూశారా? పని చేసే వాణ్ణే ‘మనిషి’  అంటున్నాడతను అన్నారు. ఎంత లోతైన ఆలోచన కలిగే మాటలో చూడండి. చాలా చమత్కారంగా మాట్లాడేవాడు. కానీ మాటల్లో లోతు ఎక్కువ. అందుకే ఆయన విశిష్ట వ్యక్తిత్వం నన్ను ప్రభావితం చేసింది.

13. కేంద్ర సాహిత్య అకాడెమీ సలహా సభ్యులుగా మీ అనుభవాలను తెలపండి.
జ :- 2012 నుండి 2017 వరకు అయిదు సంవత్సరాలు నేను కేంద్ర సాహిత్య అకాడెమీ సలహా సంఘ సభ్యునిగా ఉన్నాను. అప్పుడు గోపీ గారు కన్వీనర్ గా ఉన్నారు. నేను బయటి ప్రాంతాలకు వెళ్ళలేదు కానీ హైదరాబాద్ లోనే ఎన్నో సభలు నిర్వహించాను. అది ఎంతో తృప్తి. ‘మఖ్దూం మొహియొద్దీన్’ పుస్తకం కేంద్ర సాహిత్య అకాడెమీ వేయించిందే. పల్లా దుర్గయ్య గారి శత జయంతిని నిర్వహించిన. అప్పుడొచ్చిన వ్యాసాలన్నీ రెండు, మూడు నెలల్లో పుస్తకంగా రాబోతుంది. వట్టికోట ఆళ్వార్ స్వామి శతజయంతిని నిర్వహించాను. దాని ప్రత్యేక సంచికకు సంపాదక బాధ్యతలు కూడా నేనే చేపట్టాను. త్రిపురనేని గోపీచంద్ మీద రాయమంటే రాసిచ్చాను. అది కూడా ఈ మధ్యనే వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రపంచంలోనే పెద్ద పబ్లికేషన్ సంస్థ. వీళ్ళు ప్రచురణ చేసినన్ని పుస్తకాలు ఏ సంస్థా వేయలేదు. 22 భాషల్లో పుస్తకాలు వేయడమే కాక, వాటిలో మంచి వాటికి అనువాదాలు చేయిస్తున్నది. అనువాదకుల కొరత ఉన్నది కానీ అనువాదాలు బాగానే చేయిస్తున్నారు.  ఈమధ్యనే  మహాకవి గాలిబ్ జీవిత సాహిత్యాల మీద ఇంగ్లీషులో ఉన్న గ్రంథాన్ని తెలుగులోకి అనువదించిన ఎలనాగ గారికి సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం లభించింది.

14. ఇతర భాషల్లోకి అనువదించబడిన మీ రచనలను గురించి తెలపండి.
జ :-  డా. ఎం. రంగయ్య గారు ఆయనకు నచ్చిన నా కవితలన్నీ హిందీలోకి అనువాదం చేశారు. నా ‘చీకటిలో బతుకునీడ’ అనే కవితా శీర్షికనే ఆ పుస్తకానికి “అంధేరే మే జీవన్ ఛాయా” అనే టైటిల్ గా పెట్టుకున్నారు. నారాయణ రావు అనే మిత్రుడు నాకు అవార్డు వచ్చిన ‘భరోసా’ పుస్తకాన్ని హిందీలోకి భరోసా పేరుతోనే అనువాదం చేశాడు. ఎలనాగ గారు దాదాపు 50 కవితలను “Faded leaves and Fire flies” అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. కొన్ని కవితలు కన్నడంలోకి అనువాదం అయ్యాయి. 1993లోనే ఆకాశవాణి జాతీయ కవిసమ్మేళనంలో పాల్గొని వినిపించిన ‘చెట్టు ఆత్మఘోష’ కవిత 20 భాషల్లో అనువదించబడింది.

వేణుగారి రచనలు

15. మీరు రచించిన నాటికలను గురించి చెప్పండి.
జ :-     నా నాటికలన్నీ ఆకాశవాణిలో వచ్చిన నాటికలే. అయినప్పటికీ స్టేజీ మీద ప్రదర్శించడానికి అనువుగా రాశాను. ఇందులో ‘పునాదిరాళ్లు’ అనే నాటికను రేడియో వాళ్ళు ‘వికృతశిశువు’ గా మార్చుకున్నారు. తెలంగాణ శకుంతల, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి నటులు ఈ నాటికలో పాల్గొన్నారు. నా నాటికల్లో ఒకదానికి ప్రముఖ రేడియో ఆర్టిస్ట్ శారదా శ్రీనివాసన్ దర్శకత్వం కూడా వహించారు. అట్లా దాదాపు పది నాటికలు వచ్చాయి. అందులో రెండు ప్రచార సంబంధమైనవి. ఎయిడ్స్ మీద రాసినవి. వాటిని పుస్తకంలో తీసుకోలేదు. ఇంకొక మూడు నేను రాసి, పుస్తకంగా వేసేటప్పటికి పదేండ్లు గడిచిపోయింది కాబట్టి దొరకలేదు. మిగిలిన వాటితోనే ‘అమ్మంగి వేణుగోపాల్ నాటికలు’ అనే పేరుతో పుస్తకం వచ్చింది.

16. మీ ‘భరోసా’ కవితా సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ వచన కవితా పురస్కారం పొందిన ప్రత్యేకతను తెలపండి.
జ :-  ‘భరోసా’ లోని కవితలన్నీ జీవితం మీద ఒక నమ్మకం కలిగించడమనే అంశాన్ని ప్రధానంగా చేసుకొని రాసినవే. అందుకే శీర్షిక దానికనుగుణంగా పెట్టడం జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం పొందడం సంతృప్తి కలిగించింది.

17. మీరు రాసిన కవితలన్నీ యథార్థ సంఘటనల ఆధారంగా వచ్చినవేనంటారా?
జ :-   నేను ఏ కవితనూ స్వల్పవ్యవధిలో రాయను. ఒక భావం కల్గినప్పుడో, ఒక వ్యక్తి ఎదురైనప్పుడో, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడో, ఒక ఆశ్చర్యకరమైన, భయానకమైన వార్త పేపర్లో చదివినప్పుడో అది నా మనసులో ఉండిపోతుంది. ఎప్పుడో ఒకసారి కవితారూపంలో వెలువడుతుంది. మొన్ననే సాయిబాబా గారు మరణించారన్న వార్త చాలా బాధకు గురి చేసింది. దాదాపు పూర్తి వైకల్యం కలిగిన మనిషిని జైల్లో అంతగా హింసించారన్న ఆవేదనతో ‘మనిషి – మరణం’ కవిత రాశాను. “మనిషంటే/ కాల సముద్రాన్ని ఈదిన గజ ఈతగాడు..” అంటూ మొదలవుతుంది ఆ కవిత. మండల స్వామి చనిపోయిన విషయం కూడా ఎంతో వేదన కలిగించింది. దివ్యాంగులను ప్రత్యక్షంగా చూసి కవిత రాశాను. రైల్వేస్టేషన్ కు సంబంధించిన ఒక యథార్థ ఘటన.. ప్రేమించి వివాహం చేసుకున్న యువతీ యువకులు రైల్వే స్టేషన్ కి వస్తారు. ఇప్పుడే వస్తానని చెప్పి ఆ యువకుడు వెళ్ళిపోతాడు. అతను ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఎదురుచూస్తూ జీవితమంతా ఆమె అక్కడే ఉండిపోతుంది. దాని గురించి కవిత రాశాను. సముద్రం అనే కవితలో సముద్రంలో కొండను అలలు ఎంత వేగంగా, బలంగా తాకినా కొండ నిబ్బరంగా ఉంటుందన్న అంశంతో ధైర్యమే దానికి కారణమంటూ సందేశమిస్తూ రాశాను. ఇవన్నీ నాకు మంచిపేరు తెచ్చాయి. ఎక్కువ సంఖ్యలో కవితలు రాయడం నా ఉద్దేశ్యం కాదు. రాసినవి కొన్నైనా మంచివై ఉండాలంటాను. ఆత్మీయ మిత్రుడు గోవింద్ మీద, కరోనా మీద, యుద్ధోన్మాదం మీద రాసిన కవితలు ఇటీవలి నా కవితా సంపుటి ‘ముఖచిత్రం’ లో ఉన్నాయి. ఇవన్నీ నాకు తృప్తి మిగిల్చిన కవితలు.

18. భారతీయ సాహితీ నిర్మాత మఖ్దూం మొహియొద్దీన్ గురించి అనువాద పుస్తకం రాశారు. ఆయనలో మీకు నచ్చిన అంశాలేవి?
జ :-    మఖ్దూం మొహియొద్దీన్ ఉర్దూలో గొప్ప కవి.   “చమేలీ కే మండ్ వే తలే, దో బదన్ ప్యార్ కే ఆగ్ మే జల్ గయే” పాట ‘ఛా ఛా ఛా’ అనే హిందీ సినిమాలో వచ్చింది. సినిమా ఫెయిలయ్యింది కానీ పాట చాలా హిట్టయింది. అలాంటి పాటలు ఎన్నో రాసిండు. ఆయన స్వయంగా మంచి గాయకుడు. గజల్స్ అద్భుతంగా పాడేవాడు. గజల్ ప్రక్రియకు ఆయనను ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఆయన రాసినవి మూడే మూడు సంపుటాలు అయినప్పటికీ ఎంతో పేరు పొందాయి. ఆయన ముఖ్యంగా కార్మిక నాయకుడు. ఎల్లవేళలా వాళ్ళతో ఉంటూ అధికారుల అన్యాయాలను ఎదిరిస్తూ కార్మికుల సమస్యలను పరిష్కరించేవాడు. నిజాం చివరి రోజుల్లో దేవిడీలో పనిచేస్తున్న ఖాన్ అనే అధికారి కార్మికుల దగ్గర అన్యాయంగా డబ్బు లాక్కుంటుంటే అడగడానికి మరొక కమ్యూనిస్టు లీడర్ ను కూడా తీసుకొని దేవిడీ గేటు లోపలికి వెళ్తుంటే చౌకీదార్ వీళ్లను అడ్డుకొని రానివ్వకుండా “ఖాన్ సాబ్ టైగర్ హై” అన్నాడట. అప్పుడు మొహియొద్దీన్ “ఓ టైగర్ హై తో హమ్ 303 హై” అని సమాధానమిచ్చాడట. 303 అనేది ఒక రైఫిల్. అంతటి ధైర్యం కలవాడు. కమ్యూనిస్ట్ లీడర్ గా చాలా పనులు సాధించాడు. ప్రత్యర్థులను కూడా గౌరవించేవాడు. 1952 ఎన్నికల్లో సంగారెడ్డి నుండి పోటీ చేయడానికి కాంగ్రెస్ నుండి హనుమంతరావుకు, పిడిఎఫ్ నుండి మఖ్దూం కు టిక్కెట్లు దొరికాయి. ఇద్దరి ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో సంగారెడ్డి చౌరస్తాలో ఒకరికొకరు ఎదురు పడ్డారు. మొహియొద్దీన్ తన జీపు దిగి హనుమంతరావు దగ్గరికి వెళ్లి ” హనుమంతరావు సాబ్! ముబారక్ హో, హమారే గావ్ కో ఆప్ మహబూబ్ నగర్ సే ఆయే, ఆప్ హమారా అతిథి హై” అంటూ కరచాలనం చేయడమే కాక నా వేదిక నుండి మీ భావాలను ప్రచారం చేయండి” అన్నాడట. అంతటి విశాల హృదయం కలవారు. మంచి కవిగానే కాదు మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు.

19. ‘పచ్చబొట్టు – పటంచెరు’ సంపుటి ప్రధాన ఉద్దేశ్యం పర్యావరణమేనా? మరేదైనా ఉందా?
జ :-   అది ప్రధానంగా పర్యావరణం దృష్టితో రాసింది. మా చిన్నప్పుడు గతంలో పటం చెర్వు పరిశుభ్రంగా ఉండేది. ఆ తర్వాత ఫ్యాక్టరీల కాలుష్యమంతా చెరువులో కలిసి చెరువే లేకుండా అయింది. ఒక ఫ్యాక్టరీకి ఇంకొక ఫ్యాక్టరీకి మధ్య ఉండవలసిన దూరాన్ని పాటించకుండా నియమాలను అతిక్రమించి కట్టారు.  Un planned గా ఫ్యాక్టరీలు ఉన్నాయన్న దానిమీద కేసు నడిచింది. ఈ కేసు గురించి హైకోర్టు “ఈ పటాన్ చెర్వులో ఏర్పడ్డ కాలుష్యం కాలుష్యం కాదు విషం. ఆ విషం వల్ల చాలా నష్టం జరుగుతుంది. మనుషుల ప్రాణాలను పణంగా పెట్టే పారిశ్రామిక ప్రగతి అవసరం లేదు. పారిశ్రామికీకరణ అనే ఉన్మాదపు పరుగులో మనం మనిషిని మరిచిపోతున్నాం” అని తీర్పునిచ్చింది. ఈ తీర్పును యథాతథంగా పుస్తకం ముందుమాటలో పెట్టాను. పచ్చబొట్టు ఆరోగ్యానికి సంకేతమైతే, పటం చెర్వు అనారోగ్యానికి సంకేతమన్నట్లు రాశాను.

20. వట్టి కోట ఆళ్వారు స్వామి రచనల మీద పరిశీలన గ్రంథం రాశారు కదా! ఆయన వ్యక్తిత్వాన్ని తెలపండి.
జ :-    ఆయనది గొప్ప పర్సనాలిటీ అమ్మా! ఆయన కవిత్వం రాయలేదు కానీ కథలు, నవలలు రాసిండు. శ్రీవైష్ణవుడు అయినప్పటికీ ఎక్కడా ఆ లక్షణాలు కనిపించవు. మనుషుల మధ్యనే ఉన్నాడు. రిక్షా వాళ్ళ యూనియన్ పెట్టిండు. వారికి మంచి రిక్షాలు ఇప్పించినవాడు. గుమాస్తాల సంఘం ఏర్పాటు చేశాడు. వాళ్లకు దుకాణాల్లో అమాస, పున్నమలకు తప్ప మిగతా రోజుల్లో సెలవు ఉండేది కాదు. జీతాలు కూడా చాలా తక్కువ. వాటి గురించి పోరాడి వారానికొక సెలవు ఉండేలా చేసి జీతాలు కూడా పెరిగేటట్లు చేశాడు. వాళ్ళల్లో చైతన్యాన్ని పెంచడానికి ‘గుమాస్తా’ పత్రికను నడిపాడు. ఆయన పూర్తి కమ్యూనిస్టు. రావి నారాయణ రెడ్డి అనుయాయుడు. చాలామంది చెప్పనిది, నేను మాత్రమే చెప్పేది ఆయన మంచి వక్త అని. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి రైతులలో, రైతు కూలీల్లో చైతన్యం నింపడానికి ప్రయత్నించాడు. పెద్దపెద్ద సభలు నిర్వహించి అనర్గళంగా ఉపన్యసించేవాడు. ఒకసారి రేషన్ బియ్యం దొరుకుతలేవని కరపత్రాలు తయారుచేసి సికింద్రాబాద్ అంతటా పంచాడు. దానికి దాదాపు ఆయనను నెలరోజులు జైల్లో పెట్టారు. ఇంకో రెండుసార్లు కూడా జైలు శిక్ష అనుభవించాడు. దాశరథి, కాళోజీ 1948 వరకే జైళ్లల్లో ఉంటే కమ్యూనిస్టు కావడం వలన 1952 వరకు జైల్లో ఉన్నాడు. జనరల్ చౌదరికి కమ్యూనిస్టులంటే పడదు. అందువల్ల ఆళ్వార్ స్వామి, రావి నారాయణరెడ్డిలతో పాటు కమ్యూనిస్టులందరినీ జైల్లో పెట్టాడు. ఎన్నికలు వస్తుండడంతో విడుదల చేశారు. ఆళ్వార్ స్వామి పుస్తకాలు వేసి ఊరూరా పంచాడు. దానివల్ల చదివే గుణం పెరుగుతుందని, దానితో అక్షరాస్యత పెరుగుతుందని నమ్మకం. అది జరిగింది కూడా.

21. విమర్శకులుగా….సాహిత్య విమర్శలో ఏ అంశాలను స్పృశిస్తూ రచనలు రావాలని మీరు భావిస్తారు?

జ :-    సాహిత్య విమర్శ అన్నది కూడా ఒక గొప్ప ప్రక్రియ. అది గనుక లేకపోతే ఏది మంచి పుస్తకమో, ఏది చెడు పుస్తకమో పాఠకులకు తెలియదు. ఏది ఆకర్షణీయంగా ఉంటుందో దాన్ని చదవడానికి పాఠకుడు ఇష్టపడతాడు. కానీ ఆకర్షణీయంగా ఉన్న ప్రతి పుస్తకం మంచి పుస్తకం కాదని చెప్పగలిగేవాడే విమర్శకుడు. అంటే విమర్శకుని మీద గొప్ప బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత ఉన్నవాడే మంచి విమర్శకుడవుతాడు. లేకుంటే మామూలు సమీక్షలుగా ఉండిపోతారు. విమర్శను జడ్జిమెంట్ అనికూడా అంటారు. అంటే పుస్తకం మీద తీర్పు ఇవ్వడం. అందువల్ల విమర్శ చాలా విలువైనది. ప్రజల దృష్టిలోకి పుస్తకాల మంచి చెడులు రావాలి. కానీ అది ప్రాంతాలకు పరిమితమై ఉండకూడదు.

22. వచన కవిత్వ నిర్మాణం ఏ విధంగా ఉంటే ప్రజాదరణ పొందగలుగుతుంది?
జ :-  వచన కవిత్వంలో ప్రారంభ వాక్యాలు ఎప్పుడూ ఆకర్షణీయంగా, ఆలోచనీయంగా ఉండాలి. ఇప్పుడొస్తున్న కవిత్వంలో శిల్పం కొరవడి, ఒకరినొకరు మెచ్చుకోవడమే తప్ప మంచి కవిత్వం తక్కువగా ఉంటున్నది. మేము ఇన్ని కవితలు రాసినామని చెప్పుకునే భ్రమలో ఉంటారు వాళ్ళు. జీవితంలోంచి, జీవితానుభవంలోంచి, హృదయంలోంచి కవిత రావాలి. అట్లా పద్య కవిత్వంలో కూడా వస్తుంది కానీ ఛందస్సు ఆటంకంగా ఉంటుంది.  ఛందస్సు లేనిది, నీ మనసులో నానింది ఒక రూపంగా నిలిచి వస్తువు, శిల్పం రెండూ ఒకదానికొకటి ఉంటేనే వచన కవిత్వం బాగుంటుంది. అట్లే ముగింపు కూడా పవర్ ఫుల్ గా, ఒక మెరుపులా ఉండాలి. ఆలోచనాత్మకంగా ఉండాలి. కవిత్వానికి సామాజిక ప్రయోజనం ఉండాలి. జీవితాన్ని చైతన్యవంతం చేసే తాత్వికత కూడా ఉండాలి.

23. పదికాలాలు నిలబడే సాహిత్యం ఏ విధంగా ఉండాలని మీరు భావిస్తారు?
జ :-  జీవిత విలువలకు సంబంధించిన రచనలు కలకాలం నిలబడతాయి. అది కవిత్వం గానీ, నవల గానీ, నాటకం గానీ జీవిత విలువలను ప్రబోధించాలి. అయితే డైరెక్టుగా ఉండకుండా సృజనాత్మకంగా ఉండాలి. అటువంటప్పుడే అది నిలుస్తుంది. ‘Les miserables’ అట్లాగే ఉంటుందని చెప్పాను కదా!ఇట్లాంటివి పాఠకులను ఆలోచింపజేస్తాయి. హృదయాన్ని ప్రశ్నిస్తాయి. ఇప్పటివరకు ఏవైతే గొప్ప పుస్తకాలుగా, క్లాసిక్స్ లాగా ఉన్నాయో అవన్నీ జీవిత విలువలను ప్రబోధించినవే.

24.  మీ రచనలు పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయని విన్నాం. వాటి గురించి చెప్పండి
జ :-  నా కవితా సంపుటి ‘మిణుగురు’ లో కొన్ని మినీ కవితలున్నాయి. బెంగుళూరు యూనివర్సిటీ తెలుగు శాఖ వారు 1990 లో ఎమ్.ఏ ఫస్ట్ ఇయర్ పాఠ్య పుస్తకంలో ఈ మినీ కవితల్ని పెట్టుకున్నారు. తరువాత ఎనిమిదో తరగతి ఉర్దూ మీడియం పిల్లలకు సెకండ్ లాంగ్వేజ్ కోసం కులీ కుతుబ్ షా రాసిన కవితకు నేను తెలుగులో చేసిన అనువాదాన్ని పాఠంగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఎలనాగ గారు అనువాదం చేసిన “Faded leaves and fire flies” నుండి ‘The beggar’ (బిచ్చగాడు) కవితను పాఠ్యాంశంగా పెట్టారు. ఇంటర్మీడియట్ బోర్డు వారు నాకు ఉత్తరం రాసి అనుమతి తీసుకున్నారు.

25. ప్రస్తుత రచనల పట్ల మీ అభిప్రాయాన్ని తెలుపుతూ సామాజిక చైతన్య దిశగా నేటి రచయితలకు ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వండి.
జ :-    అందరూ చెప్పేదే నేనూ చెప్తా. ఇప్పటి రచయితలెవరూ చదవడం లేదు. మేము చదివీ చదివీ రాసినం. వాళ్ళు రాసీ రాసీ కూడా చదువుతలేరు. అందుకే సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేయాలి. మన పూర్వీకులు ఏం చెప్పారు? మనం అంతకంటే గొప్పగా చెప్పగలుగుతామా? చెడును ఖండించగలుగుతామా? తెలుసుకోవాలి. సీనియర్ రచయితల రచనలను చదివి ఈ రచన ఎట్లున్నదనే విషయంలో తామే ఒక అభిప్రాయానికి రావాలి. అప్పుడే మంచి రచయితలు అవుతారు. దానివల్ల సమాజానికి మేలు కలుగుతుంది. ఇది ఒక భాషకు సంబంధించినది కాదు. ఇతర భాషల సాహిత్యాన్ని కూడా కనీసం అనువాదరూపంలో నైనా అధ్యయనం చేయాలి. వివిధ భాషల్లో ఎంతో గొప్ప రచనలు ఉన్నాయి. వాటిని చదవడం వల్ల లాభం కలుగుతుంది. తెలుసుకోకపోతే మనకే నష్టం. మనమే గొప్ప అనే భ్రమలోనే ఉండిపోతాం. ఏ రచయిత అయినా ముందు మానవుడు. అందుకే మానవజాతి ప్రయోజనమే రచయిత ప్రయోజనం కావాలి

నమస్కారం సార్🙏🏼  ఎంతో ఓపికగా మాకు మీ జీవిత, సాహిత్య ప్రస్థానాలను, అనుభవాలను పంచినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున మీకు

అనేక ధన్యవాదాలు.

You may also like

Leave a Comment