Home ఇంద్రధనుస్సు ” రథసప్తమి – సూర్యారాధన”

” రథసప్తమి – సూర్యారాధన”

రచన :”సాహితీ సేవారత్న అవార్డు గ్రహీత”
శ్రీ. ” కావ్యసుధ”

సూర్యుడు జగత్తుకు కన్ను సూర్యకాంతియే అన్నికాంతులకు మూలం. సూర్యుడు త్రిమూర్త్యాత్మక పరమాత్ముడు. సూర్యకిరణజన్యసంయోగం చేతనే జీవులు పుడుతున్నాయి. పెరుగుతున్నాయి, నశిస్తున్నాయి. సూర్యుడు ఈ విశ్వానికి ఆత్మ అని వేదం. కనుక సూర్యభగవానుని ఆరాధన అత్యంత ప్రాచీనమైంది. రాజవంశాల్లో సూర్యవంశం మొదటిది. శ్రీరామచంద్రుడు సూర్యవంశ సంజాతుడు. నిత్యమూ సూర్యారాధన చేసేవాడు. ఆదిత్యహృదయపఠనం చేతనే రావణసంహారం కూడా చేయగలిగాడు. సూర్యుడు నమస్కార ప్రియుడు. కనుక, సూర్యుడు మనకు చేసే ఉపకారాలకు కృతజ్ఞతాసూచకంగా సూర్యనమస్కారం చేయడం – సనాతన భారతీయ సంప్రదాయం.

వేదాల్లోనే సూర్యదేవునికి సంబంధించిన అరుణమంత్రాలున్నాయి. మన మీనాడు చూస్తున్నసూర్యగోళం లాంటివి ఈ విశ్వంతరాళంలో మొత్తం పన్నెండున్నాయి. వాటినే ద్వాదశాదిత్యమండలా లంటారు. శ్రీమన్నా రాయణుడు సూర్యమండలమధ్యవర్తి, దివ్యతేజోవిరాజితుడు. సూర్యగమనం ఉత్తరాయణం – మకర సంక్రాంతితో ప్రారంభమైనా మాఘశుద్ధ సప్తమినుండి పూర్తిగా ఉత్తరదిశగా జరుగుతుంది. ఇది పుణ్యకాలం
ఉత్తర మనే పదానికి జీవులను ఊర్ధ్వముఖుల్ని చేసి, తరింపజేసే దని ఆధ్యాత్మికార్ధం. కనుక రథసప్తమ కంటిముందు కన్పించే ప్రత్యక్షదేవుడైన సూర్యభగవానుని పండుగ. సూర్యుడు జ్యోతిశ్శాస్త్రంరీత్యా నేత్రకారకుడు. అంటే కంటిచూపు, కంటి ఆరోగ్యం మొదలైన వన్నీ సూర్యాసుగ్రహించేశ చక్కగా శోభిస్తాయి. అంతేగాక “ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్ ” ఆరోగ్యం సూర్యభగవానునిద్వారా పొందా అని శాస్త్రం. కనుక సూర్యుడు మనజీవితశోభకు, మానసికపురోగతికి, అవయవపటిష్టతకు, పాడిపంటలకు, | బుద్ధి వికాసానికి అన్ని విధాలా అనుకూలించే ప్రత్యక్షదైవం!

ఇంత ఉపకారం మనకు సూర్యుడు చేసినప్పుడు మనం చేయగలిగింది కృతజ్ఞతాసూచకంగా “సూర్యదేవ నమస్తుభ్యం!” అంటూ నమస్కరించడమే! కనుకనే నవగ్రహాలలో ఏ గ్రహానికి లేని నమస్కారవిధానం సూర్యగ్రహానికి మాత్రమే ఉండడం సూర్యునివిశిష్టతకు సంకేతం. సృష్టి జరిపేవాడు గనుకనే “సవిత ” అని పేరు. గాయత్రీమంత్రం సూర్యతేజస్సంబంధ మైనదే! ఆ సూర్యుణ్ణి శ్రేష్టతముడుగా తెలుసుకోవడం, మన బుద్ధిని చక్కగా నడిపించ మని అతణ్ణి ప్రార్ధించడం గాయత్రీమంత్రంలోని ఆశయం. కనుక ఉపకారికి ప్రత్యుపకారం చేయడం మన సంప్రదాయం!
అయితే, అంతటి దివ్యతేజోరాశికి మనం చేయగలసేవ కృతజ్ఞతలు తెల్పడం తప్ప, మరొకటి ఏముంటుంది? ఇందుకే మనప్రాచీనులు రథసప్తమిని సూర్యభగవానుని పర్వదినంగా భావించి భౌతిక, ఆధ్యాత్మికపరంగా సూర్యుణ్ణి ఆరాధించి, త్రికరణశుద్ధిగా సూర్యునికి నమస్కరించి, ఆ నమస్కారంద్వారా సూర్యకిరణాలలోని దివ్యతేజస్సునూ, చైతన్యశక్తినీ మనం పొందాలి అనే సంప్రదాయాన్ని నెలకొల్పారు. కనుక సూర్యుడు కేవలగ్రహమే కాదు సాక్షాల్దేవుడు!

నమస్కారం వినయవిధేయతలకూ, కృతజ్ఞతాగుణానికి సూచకం. మనం త్రికాలాల్లో సూర్యుడికి ఒక్క నమస్కారం చేయడంవల్లే ఆయన దయామూర్తి అయి మనఆరోగ్యాన్నీ, ఐశ్వర్యాన్ని సంరక్షిస్తున్నాడు. అల్పసంతోషులైన దేవతలలో సూర్యుడు ప్రథముడు నమస్కారానికే ఇంత విలువ ఉంటే ఇక సూర్యమం పాసన, సూర్యస్తోత్రపారాయణం, అరుణమంత్రపారాయణం మొదలగునవి ఎంతశక్తిమంతాలో, మను జీవితాలపై ఎంత ఉత్తమప్రభావాన్ని రూపుతాయో ఊహించవచ్చు. మయూరుడు సూర్యాసుగ్రహంచేతనే రోగం నుండి ఆరోగ్యవంతుడై కృతజ్ఞతాసూచకంగా ఒక శతకం సూర్యునిపై రచించి, లోకాని కందించాడు. ఇలా ఎందరో మనపురాణాల్లో సూర్యుణ్ణి ఆరాధించి మణులు, అక్షయపాత్రలు, భోగభాగ్యాలు సంపాదించి, తాము తరించడమే గాక, లోకాన్ని కూడా తరింపజేశారు. కనుక ప్రతిమానవుడూ కృతజ్ఞతా గుణాన్ని అలవరచుకుని, తమకు ఉపకారం చేసిన, చేస్తున్న మహాత్ములందరికీ హృదయపూర్వకంగా ప్రతి దినమూ ఉదయం తూర్పుముఖంగా నిలబడి సూర్యుణ్ణి చూస్తూ నమస్కరిస్తే ఆ సమస్కారం అందరికీ చెందుతుంది.
విశ్వ నేత్రుడైన సూర్యుని గతి వల్లే రుతుకాల ధర్మాలు ఏర్పడి కాలం ముందుకు సాగిపోతోంది అందుకే ప్రకృతికి ఆధిదైవంగా భావించి సూర్యుని ఆరాధించు కుంటున్నాము. ఉదయభానుడి లేలేత కిరణాలు మన కనులారా వీక్షిస్తే చాలు మన శరీరంలో రసాయన ప్రక్రియ జరిగి రుగ్మతల్ని దూరమవుతాయని, దేహసంబంధితంగా చేసిన పాపాలు సైతం నాశనమైపోతాయని తెలుస్తోంది. సూర్యారాధన వల్ల ముక్తి పొందిన కథలు ఎన్నో మన పురాణాల్లో ఉన్నాయి.

సూర్యకాంతి ప్రాణుల్లో ప్రాణవాయువు గానూ భూమ్యాకాశాలకు దీప్తిని కలుగజేస్తుంది. ఏక చక్రం కలిగి ఏడు అశ్వాలు పూంచిన మకరధ్వజం అనే రథానికి తొడలు లేని అనూరుని రథసారధిగా పెట్టుకొని రాత్రి పగలు పయనిస్తూ జీవకోటిని కాపాడుతున్నాడు సూర్యుడు.
పుష్య మాసము లో సూర్యునికి “భగుడు ” అని పేరు ఈమాసములో ప్రాణుల శరీరంలో నుండి వారిని రక్షిస్తుంటాడు. మాఘ మాసములో “పూషుడు” అనే పేరుతో ప్రాణులు భుజించే ఆహారములో ఉండి వారికి పుష్టిని కలిగిస్తుంటాడు. పాల్గుణ మాసంలో “క్రతువు” పేరుతో గాలిలో ఉండి ప్రాణులకు అవసరమైన శ్వాసక్రియ కలిగిస్తూవుంటాడు.
సప్తాశ్వరధ మారూఢం
ప్రచండం కశ్యపాత్మజమ్! శ్వేతపద్మధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహమ్!

శ్రీ సూర్యనారాయణుడు మనకందరికీ ప్రత్యక్షదైవం సూర్యుడు.ఏకచక్ర
రధారూడుడు.
ఈ చక్రమే కాలచక్రం,ఆ చక్రానికి ఆరు ఆకులు, రథానికి ఏడు అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు ఆరు ఋతువులు, ఏడు అశ్వాలు ఏడు కిరణాలు. సుషుమ్నము , హరికేశము, విశ్వకర్మ , విశ్వవ్యచ , సంపద్వసు , స్వర్వడ్వసు అనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి.
“ఉదయమే బ్రహ్మణ్రూపం మధ్యాహ్నేతు మహేశ్వరం సాయంకాలే స్వయం విష్ణుః త్రిమూర్తిశ్చ దివాకరం ”
భగవానుడు ఉదయం బ్రహ్మ స్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టి యొక్క దైవిక వికారాలను రూపుమాపి, సాయంకాలం విష్ణురూపంలో బాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరించజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడైన సూర్యభగవానుని ధాతా, అర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్థాన్, పూషా, వర్ణస్య, అంశుమాన్, భగ, త్వష్ణా, విష్ణువు అనే ఈ పన్నెండు మంది సూర్యులు సమస్త జీవజాలానికి, సృష్టి విధానానికి ఆధార భూతులవుతున్నారని, ఇట్టి ఈ పన్నెండు నామాలు స్మరిస్తే దీర్ఘరోగాలు నయమవుతాయని, దారిద్ర్యం పోతుందని భవిష్య పురాణంలో పేర్కొనబడింది.
“నమస్కార ప్రియ
భాను: ” అన్నారు. సూర్యుడు నమస్కార ప్రియుడు ఉదయం పూట నూర్య నమస్కారాల చేయాలన్న సంప్రదాయం ఆరోగ్యరిత్యా ఏర్పాటు చేసినదే ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అన్నారు. సూర్యకిరణాలు ఆరోగ్య ప్రదమైనవి*. శ్రీ సూర్యారాధన వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. ‘సకల కార్య సిద్ధి జరుగుతుంది.
సౌర మానం, చాంద్రమానం, బార్హ స్పత్సమానం మొదలైనవి. కాలగమన విధానంలో ప్రసిద్ధమైనవి. సౌరమాన ప్రకారంగా ప్రతి సంవత్సరం మాఘమాస శుద్ద సమస్తమి నాడు వచ్చే ‘రథసప్తమిని సూర్య వ్రతం అని పిలుస్తారు. మాఘమాసంలో శుద్ధసప్తమి”, సూర్యసప్తమి’, ‘అచలా సప్తమి’, ‘మహాసప్తమి’, సప్త సప్త సప్తమి’ కానీ… ఇలా ఎన్నో పేర్లతో పిలువబడడమేగాక, సూర్యారాధనకు సూర్యవ్రతానికి విశిష్టమైన పర్వదినంగా భాసిస్తున్న రోజు ‘రథసప్తమి’ దినంగా, ‘సూర్యజయంతి’గా కూడా జరుపుకోవడం మన సంప్రదాయం.ఈ సప్తమి నాడు సూర్యోదయాన ఆకాశంలోని నక్షత్ర సముదాయం రథాకారాన్ని పోలి ఉండడం చేత ‘రథసప్తమి’అని అంటారు.
సూర్యుడు మాఘ శుక్ల పక్షమి అశ్వనీ నక్షతం భానువారం
(ఆదివారం) సప్తమి తిథిన దక్షప్రజాపతి పుత్రికయైన అదితి, కశ్యప
మహర్షికి ‘వివస్వంతుడు’ అనే పేరున జన్మించాడు. అదితి కశ్యపులకు
పుత్రుడైనందున ఆదిత్యుడని, కశ్యపుడని వ్యవహరిస్తారు.
విశ్వకర్మ కుమార్తె సంజ్ఞ సూర్యునికి భార్య, ఈమె యందు సూర్యునికి వైవస్వత మనువు, యమున, యముడు అనే కవలలు జన్మించారు. సంజ్ఞ తనకు మారుగా ఛాయను సృజించి, కొంతకాలము భర్తగా దూరంగా ఉన్న సమయంలో సూర్యుడు ఆ ఛాయనే సంజ్ఞగా భావించడం ఆమె వల్ల సూర్యునికి శనైశ్చరుడు జన్మించాడు.

రథసప్తమికి ముందు రోజు రాత్రి షష్టిన ఉపవాసము చేసి సూర్యుని పూజించాలి. మరునాడు సప్తమినాటి ప్రాతఃకాలములో స్నానమాచరించి సూర్యుని ధ్యానిస్తూ రాగి, వెండి మట్టి ప్రమిదలలో ఏ దేనిలోనైనా సరే నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి, దీప చేతులను తల పై పెట్టుకుని నదీజలాల్లో గాని, పారే జలాల్లో గాని వదిలితే పుణ్యం వృద్ధి చెందుతుందని ఆయురారోగ్య సంపదలు కలుగుతాయని తెలుస్తోంది.
సూర్య ప్రీత్యర్థం పాపహరణం కోసం రథసప్తమి రోజున చేసే స్నానం ఎంతో శుభప్రదమైనందున ఈరోజు ఉషోదయాన్నే నిద్రలేచి శూచియే ఈ సంకల్పం చేసుకోవాలి.
అన్ని జన్మలలో మనోవాక్కాయ కర్మలతో తెలిసీ తెలియక చేసిన ఏడు జన్మల పాపాలు, రోగాలు, శోకం మొదలైనవి ఓ రథసప్తమి నిన్నుస్తుతిస్తూ చేసే స్నానం వల్ల నశించునుగాక అని భావం.
“సప్త సప్తివహాప్రీత ! సప్తలోక ప్రదీపన! సప్తమీ సహితోదేవ గృహాణార్ఘ్యం దివాకర”అని సూర్యభగవానునికి ఆర్ఘ్యం ఇవ్వాలి. ఆర్ఘ్యం ఇస్తే అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు.

ఇలా చేయలేని వారు మరోపద్ధతిని కూడా చేయవచ్చును..

రథసప్తమి నాడు ప్రాతః కాలంలో స్నానానికి ముందు నువ్వుల పిండిని శరీరానికి రుద్దుకొని, ఏడు జిల్లేడు ( ఆర్క పత్రం) ఆకులుగానీ,రేగు ఆకులుగానీ, చిక్కుడు ఆకులను తలపైన, భుజాలపైన, చేతులపైన పెట్టుకొని స్నానం చేయడం ద్వారా సూర్య శక్తిని స్వీకరించే లక్షణం గల జిల్లేడు, రేగు, చిక్కుడు ఆకులలోని తపశ్శక్తి మన శరీరానికి తగిలి నందు వల్ల ఒంట్లోని రోగాలు తొలగిపోయి ఆరోగ్యం వృద్ధి చెందుతుంది అని అంటారు.
కొన్ని ప్రాంతాల్లో ధనుర్మాసంలో నెలంతా ఇంటి ముంగిట్లో పెట్టిన ఎండిన గొల్బిమ్మలను ఇంటి ఆరుబయట వెలిగించి వాటిపై ఆవును పాలను మరిగించి సూర్యకాంతిలో పాయాసాన్ని వండి సూర్యునికి వివేదన చేస్తే, సూర్య భగవానుని అనుగ్రహం వల్ల ఆరోగ్యం కలుగుతుంది.సత్ సంతానం కావలసిన వారికి సంతానం కూడా కలుగుతుంది.

ఖగోళ శాస్త్రరీత్యా భూగోళ సంచారం వల్ల సూర్యభగవానునికి దక్షిణాయణమనీ, ఉత్తరాయణమనీ రెండు ప్రయాణ మార్గాలు ఏర్పడ్డాయని విజ్ఞాన శాస్త్రం స్పష్టం చేస్తోంది. దక్షిణాయన సంచారం నుండి మకర సంక్రాంతి రోజున సూర్యుడు తన రథాన్ని ఉత్తరం వైపు ప్రయాణం చేయడానికి దిశ మారుస్తాడని , ఈ రథసప్తమి రోజున తన రథాన్ని పూర్తిగా ఉత్తరం దిక్కు తిప్పి ప్రయాణిస్తాడని చెప్పబడుతుంది. సూర్యుడు తన స్వర్ణ రథమును గమత్మంతునికి సోదరుడైన అనూరుని సారథ్యంలో ఉత్తరాయన దిక్కునకు మళ్ళించే పవిత్రదినం ‘రథసప్తమి’ వైవస్వత మన్వంతరం కూడా ‘ “రథసప్తమి ‘ రోజున ప్రారంభమైనట్లుగా పురాణాల ద్వారా తెలుస్తోంది..

శుక్ల సప్తమి ఆదివారం కలసి వస్తే దానిని విజయ సప్తమి అంటారు. ఆరోజున సూర్యుని ఆరాధించి దాన ధర్మాలు చేసినవారికి పుణ్య ఫలం లభిస్తుంది. ఆవునెయ్యితో కాని నువ్వుల నూనెతో గానీ ,దీపం పెట్టి ఆదిత్యుని పూజించి ‘ఆదిత్య హృదయం’ పఠిస్తే నేత్రవ్యాధులు రావు
పవిత్రమైన “రథసప్తమి” పండుగరోజు దేశమంతటా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలోని కోణార్క్, తమిళనాడులోని మా కోయిల్ ,తిరుమల తిరుపతి క్షేత్రంలో కూడా విశేషంగా సూర్యారాధనలు జరుగుతాయి. ఈ రోజున సూర్యుణ్ణి ఉపాసించితే గ్రహబాధలు పోగొట్టుకుంటారు.

సప్తమినాడు సూర్యుని ఆరాధించినవారికి అశ్వమేధ ఫలం లభిస్తుంది. సుప్రసిద్ధమైన అరసవిల్లి దేవాలయంలో శాస్త్రోక్తముగా సంకల్ప పూర్వకముగా అభిషేకం చేసి, సహస్ర నామ అష్టోత్తర శతనామ పూజ చేసిన కార్యసిద్ధి కలుగుతుంది.

విశ్వేశం విశ్వాధారం !
మహాతేజ ప్రదీపనమ్ తం !! సూర్యం ప్రణమామ్యహమ్ !!
మహా పాపహరం దేవం!!!

భక్తి ముక్తి నిచ్చి పోషించు దైవమై
ఆపదలను బాపి అనుదినమ్ము
బ్రోచు వాడ వనుచు పూనిన భక్తితో
సూర్యదేవుని మదిని స్తుతి నొనర్తు.

You may also like

Leave a Comment