రాచమల్లు రామచంద్రారెడ్డి సాహిత్య రంగంలో శ్రీ శ్రీ వలె రా రా గా రెండక్షరాల పేరుతో ప్రసిద్ధి చెందాడు.కథకుడు,సాహితీ విమర్శకుడు,పత్రికా సంపాదకునిగా ప్రఖ్యాతి గాంచాడు.
ఈయన రచించిన గొప్ప కథలు “అలసిన గుండెలు.” “అనువాద సమస్యలు”,” సారస్వత వివేచన”అనేవి సాహిత్య గ్రంథాలు.”సారస్వత వివేచన” గ్రంథానికి ఉత్తమ విమర్శనా గ్రంథంగా ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.
రారా లేఖల్లో వ్యక్తిగత విషయాలు,ఆలోచనా వైఖరి,సాహిత్య విమర్శ,ఉద్యోగ జీవితం మొదలగు అనేక విషయాలు తెలుస్తాయి.సాహితీమిత్రులకు రాసిన లేఖల్లో రా.రా.హృదయం విప్పి నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను తేల్చి చెప్పడం ప్రత్యేక లక్షణంగా గమనించవచ్చు.రా.రా తన కష్టసుఖాలను మిత్రులతో పంచుకోవడానికి లేఖలు ప్రముఖంగా ఉపయోగపడ్డాయి.దేశంలో ఉన్నప్పుడే కాక విదేశాలలో ఉద్యోగరీత్యా వున్నప్పుడు కూడా విదేశాలనుండి మిత్రులకు లేఖలు రాశారు.
ప్రత్రికారంగంలో ఉద్యోగాలు చేసినట్లుగా లేఖలవల్ల తెలుస్తుంది.విశాలాంధ్ర దినపత్రికలో పనిచేస్తూ ‘ విజయవాడ వాతావరణం’ సరిపడక గుమస్తా మాదిరి ఆఫీసు పనిచేయలేక రాజీనామా చేసి వచ్చేస్తున్నానని గోవిందరెడ్డికి రాసిన లేఖలో తెలిపాడు రా.రా.
‘ సంవేదన” పత్రికపై వచ్చిన ప్రశంసలు,విమర్శల గురించి రాస్తూనే వ్యక్తిగత విమర్శ వుందని, పత్రిక నిండా రారా వుంటున్నాడనే ఆరోపణలు వస్తున్నాయని గోవిందరెడ్డికి రాసిన ఉత్తరంలో తెలిపాడు.”దేశంలోని రచయిత ఎవ్వరూ తమ రచనలు పంపడం లేదు గనుకనే నేను రాయవలసి వస్తున్నది.అని రచయితలపై విరుచుకుపడ్డాడు.తను ఇచ్చే విరాళం తగ్గితే పత్రిక స్థాయి తగ్గిపోతుందని,సంవేదన” దేశంలో సంచలనం కలిగించి ప్రముఖుల చేత ప్రశంసింపబడినప్పటికి ఇదొక విషమ పరిస్థితి అని వాపోయాడు.
” సంవేదన” పత్రికలో సంపాదకునిగా వున్నప్పుడు మిత్రులతో కొన్ని సమస్యల నెదుర్కొన్నాడు.”సాంబుడు” వ్యాసం రాసి పత్రికలో అచ్చు వేయమంటే యథాతథంగా అచ్చువేయడం సాధ్యంకాదని,ఇంటలెక్చ్యుయల్,లిటరరీ స్థాయి లేని వ్యాసాన్ని ఉన్నదున్నట్లు ముద్రిస్తే ” సంవేదన” స్థాయి పడిపోతుందన్న ఆవేదనను వ్యక్తం చేశాడు.సాంబుడికి ,రారా కు మధ్య వాగ్వివాదం చెలరేగి చివరకు సాంబుడు వ్యాసంలో కొన్ని విషయాలు కట్ చేయడానికి ఒప్పుకున్నాడు.తరువాత తనపై ఆరోపణలు వస్తే సహించే స్వభావం లేదు రారాకు.
జయరాంకు రాసిన ఉత్తరంలో వివరాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం అన్యాయమని ” ఆరోపణలు చేసేవాడు తన సుహృద్భావాన్ని ఎదుటివాడు శంకించకుండా ఆరోపణలు చేయవచ్చు.కానీ నీవా జాగ్రత్తలు తీసుకోలేదని…ఆయన్ను యెందుకు దింపుతారు యీ రొంపిలోకి అనడం వాళ్లకేకాదు నాకు కూడా గౌరవప్రదంకాదు”. అని రాయడం వల్ల తనపై ఆరోపణలు వస్తే సహించే స్వభావం కాదని,వాతల్లాంటి సమాధానాలు చెప్పేవాడని తెలుస్తుంది.
తన స్నేహం ఎంత గొప్పదో వివరిస్తూ ” ఒకరి నొకరు నూరు మాటలు అని,అనిపించుకొని కూడా పరస్పర సుహృద్భావానికి ఏ మాత్రం భంగం కలగకుండా వుండే “సాన్నిహిత్యం” వుంది అంటూ జయరాంకు సమాధానం రాస్తూ సంస్కారరహితమైన మీ ఉత్తరాల యుద్దాన్ని అరికట్టే శక్తి నాకు లేకపోయినందుకు లోలోపలనే సిగ్గుపడడం తప్ప నాకు మార్గాంతరం ఏమైనా వుందా?” అంటాడు.
మాస్కోకు వెళ్లిన తర్వాత ” సంవేదన” పత్రిక ఆగిపోయిందని తెలుసుకొని రమణారెడ్డి రాసిన ఉత్తరంలో ” సాహిత్య పత్రికలన్నింటికి ఉన్న జబ్బే దానికి మొదటినుండి వున్నది. డబ్బు కొరతకంటే ముఖ్యన్గా మ్యాటర్ కొరత ప్రతి సంచికకు వంద పేజీలు నింపడం సమస్యగా ఉండేది.పత్రికలో సగం పేజీలు ఎన్నాళ్ళని నేనే నింపగలను చెప్పండి….ఎన్ని తంటాలు పడినా తగినంత ప్రోత్సాహము వుండేది కాదు.పైగా కొన్ని విషయాల్లో మనవాళ్లతోనే తగవులు తెచ్చుకోవలసిన పరిస్థితులు ఏర్పడేవి.” అంటూ తన మానసికావేదనను,తాను పడిన కష్టాలను చెప్పుకున్నాడు ఉత్తరాల్లో. పత్రిక నడపడంలో కష్టనష్టాలు తెలుపడం వలన ఏకాలంలో నైనా పత్రికకు రచనల ఆవశ్యకత,అవసరం కూడా ఎంతటిదో తెలుస్తుంది.
రారా మాస్కోకు అనువాదకుడుగా వెళ్ళాడు.మాస్కోలో పరిస్థితిని వివరిస్తూ విశ్వంకు ఉత్తరం రాశాడు. అక్కడ చలి ఎక్కువైనప్పటికి”0″ డిగ్రీ ఉన్నప్పటికీ ఆరోగ్యాలు చెడలేదని, తన ఇల్లు 8 అంతస్తుల భవనంలో మూడవ అంతస్తులో ఉందని తెలిపాడు తిండికి ఏ ఇబ్బంది లేదనీ,బియ్యం ముతకగా ఉన్న రుచిగా ఉండేవని, ఉల్లిగడ్డలు దండిగా దొరుకుతాయని,పాలు పెరుగు చౌక అనీ, మొదటి నెల 250 రూబుళ్లు,పని పరిమాణాన్నిబట్టి ఇంకా ఎక్కువే డబ్బు ఇవ్వడం జరుగుతుందని వివరించాడు.
వచ్చిన ఆదాయం కంటే ఖర్చు ఎక్కువని,అమూల్యమైన కాలం వృధా అవుతుందనే బాధను వ్యక్తం చేశాడు
మిత్రులకు ,ఆప్తులకు దూరమైన బతుకులో జాబులే గదా అప్పుడప్పుడు కాస్త ఊరట కలిగించేది అని అంటాడు.” రష్యా భాష రాక వీధుల్లో చెవిటి మూగ వాళ్ళు మాదిరి తిరగడమూ,విశ్రాంతి లేకుండా పని చేయడమూ…ఇవన్నీ ఎలాగైనా భరించవచ్చు గానీ,మనసు విప్పి మాట్లాడుకోడానికి ఆప్తుడన్నవాడు లేకపోవడం భరించడం కష్టం” అని ఆవేదన చెందాడు.
జయరాంకు రాసిన ఉత్తరంలో కూడా మాస్కోలో తను పడే కష్టాలను వివరించాడు.తన మనసులోని బాధ కొంతైనా వ్యక్తం చేయడం అవసరమని రాస్తూ ” ఈ గాడిద చాకిరి’, యీ నిప్పులకుంపటి లాంటి చలీ ,పలకరించే దిక్కు లేకపోవడమూ,చదువుకోవడానికి ఏమీ లేకపోవడమూ…అన్నింటికీ తోడు ఇండియా నుండి జాబులు సరిగా రావు.మిత్రుల అడ్రసులు తెలుసుకోవడం కూడా గగనమైంది.ఈ నా బాధ.” అంటూ తను అనుభవించిన భయంకరమైన ఒంటరి తనాన్ని ,మానసిక ఆవేదన మిత్రునికి వ్యక్తం చేశాడు
“మాస్కోలో లెనిన్ భజన చేయడం తప్ప మార్క్సు,ఎంగేల్స్ ను ప్రస్తావించడం తక్కువని అంటూ యిక్కడి జనం మంచివాళ్ళు, గోమాతల వంటి సాధువులు ఈర్ష్యా అసూయలు,చిల్లర దగాలు,వంచనలు చాలా చాలా అరుదు విదేశీయులను గౌరవంతోను,సానుభూతితోను మాత్రమే కాదు,ఒక ప్రీతితో కూడా చూస్తారు ” అని సంఘ పరిస్థితిని ,మాస్కోలో జనం యొక్క మృదువైఖరిని రమణారెడ్డికి రాసిన లేఖలో తెలియ జేశాడు.
రమణారెడ్డి రా.రా ను విమర్శిస్తూ “ఆయన సోవియట్ యూనియన్ లో ఒక ఉద్యోగి, ఆయన నౌకరికి ప్రమాదం వస్తే ఎట్లా,రాజకీయాలను గురించి” ఉత్తరాల్లో రాయవద్దన్నాడు. సోవియట్ యూనియన్ పై ఈగ కూడా వాలనివ్వని రారా సహించలేక రమణారెడ్డికి రాసిన జాబులో ” నన్ను గురించి మీకు యింత నీచమైన అభిప్రాయం వుంటే నాతో మీరెలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నారో అర్థం కావడం లేదు.” అని నిశితంగా సమాధానం చెప్పాడు.
విశ్వంకు రాసిన ఉత్తరంలో మాస్కోలో తన జీవన విధానాన్ని గురించి వివరించాడు. “లెనిన్ ప్రొలేటేరియన్ ఇంటర్నేషనలిజం ,గోర్కీ కథలు అనువాదం చేసినట్లు తెలుపుతూ జీవితం డల్ గా ఉందని, తిండికి బట్టకు లోటు లేకపోయినా జీవితం యాంత్రికంగా, ఒక్కోసారి బేజారుగా కూడా ఉందని అన్నాడు.మాస్కోలో విచిత్రమైన విషయం పరదేశాల పుస్తకాలు దొరక్కపోవడం,సోషలిస్టు,పెట్టుబడి దారీ పుస్తకాలు మాత్రమే లభ్యమౌతాయనీ,అక్కడ యూనివర్సిటీలలో బేరీజు వేయడం బుద్దివాదం.” అంటూనే
“ప్రేమ అనేది ఎప్పుడు హృదయ వ్యాపారంగానే ఉంటుందని,కె.కె.తన కథల్లోని పాత్రలనూ,సన్నివేశాలనూ ఎప్పుడూ హ్యూమన్ యాంగిల్ నుండే చిత్రిస్తాడు. కాబట్టి “హృదయవాది” అని అంటారు.కె.కె.కథలో సెక్స్ అనేది కేవలం శరీర వ్యాపారం కాదని,సెక్స్ లో హృదయానికి ప్రముఖస్థానం ఉండాలనే చెప్పబడుతుందంటాడు. కె.కె.హృదయవాది అని ఘంటాపథంగా వక్కాణించాడు.
రచనలు పాఠకుల హృదయాన్ని తాకాలన్న నిర్వచనం చెప్పాడనుకోవచ్చు.
గురజాడ అంటే రారా కు ఇష్టమని లేఖలద్వారా తెలుస్తుంది.గురజాడ మీద అవాకులు చవాకులు ప్రేలేవాళ్ళు అ.ర.సంలో ప్రముఖులైనారు అంటాడు వీరేశలింగం ఎంత గొప్పవాడైనా గొప్ప ఉద్యమకారుడు మాత్రమే.గొప్ప సంస్కర్త మాత్రమే మరి గురజాడ పోలికే లేనంత గొప్పవాడు.ఆయన రచనలు ( డైరీలతో సహా) చదివితే ఆయన యెంత గొప్ప మేధావి అయిందీ, సృజనాత్మక రంగంలో యెంత మహా రచయిత అయిందీ,హృదయ పరిపాకం విషయంలో యెంత మహాపురుషుడు అయిందీ తెలుస్తుంది.గురజాడను గురించి సరియైన సమగ్రమైన అవగాహన’ అవసరాల’ కు లేకపోగా ‘పురాణం”కు కూడా లేకపోగా,కనీసం ఒక పరిశీలకునికైనా లేకపోవడం నాకు బాధ కలిగించింది.” అని మల్లారెడ్డికి రాసిన లేఖలో తెల్పడం వల్ల రా.రా కు గురజాడను అంచనా వేసే తీరు, ఒకరిని విమర్శించేటప్పుడు వారి సాహిత్యంపై సంపూర్ణ అవగాహన ఉండాలన్న అభిప్రాయం తెలుస్తుంది.
చలాన్ని’ఆంధ్రాశరత్’ అనడం అర్థం లేని మాట అంటాడు రా.రా.ఇద్దరి రచనల్లోను స్త్రీలకు ప్రాముఖ్యం వుండటం తప్ప మరే పోలికా లేదని,శరత్ బాబులో లోతు లేదని చలమే ఒకచోట అన్నాడని,తెలుగు రచయితలలో కొందరు చలాన్ని అనుసరించబోయి ,అనుకరించబోయి (లత,రంగనాయకమ్మ) బూతు కథలు రాశారు అని విమర్శించాడు.
మిరియాల రామకృష్ణకు రాసిన లేఖలో మీ వ్యాఖ్యానాలతోనూ,వివరణతోనూ నేను ఏకీభవించని సందర్భాలున్నాయని ఖచ్చితంగా చెప్పాడు.సింబాలిజం గురించి రామకృష్ణ చేసిన ఊహలు,వివరణలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నాడు ” శ్రీ శ్రీ ని పొగడడానికి అడ్డుదారులు,వక్రమార్గాలు అక్కరలేదు గదా ” అని రాస్తూనే గేయాలను ప్రతీకలుగా కాక స్వతహాగానే ఎంతో అర్థవంతంగా చూస్తే మంచిదని ప్రతీకావాదము పేరుతో శ్రీశ్రీ గేయాలను పొడుపుకథలుగానూ,ప్రహేళికాలు మార్చకండి అని నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
వి.వి.యస్ మూర్తికి రాసిన ఉత్తరంలో అనువాదపద్ధతిని వివరిస్తాడు రా.రా ఒక భాషలో నుండి వేరే భాషలోకి అనువాదం చేసేటప్పుడు (తెలుగు నుండైనా,ఇంగ్లీషు నుండైనా) మూలాభాషలోని పదానికి గల విలక్షణస్వభావాన్ని బట్టి లక్ష్య భాషలోకి అనువదిస్తే బాగుంటుంది.” అని సూచనలిస్తూ ఏ భాషలోనైనా అనువాదం చేయాలంటే ఆ భాషపై అనువాదకునికి అధికారం ఉండాలి అనే భావన కలిగినవాడు భాషపై సంపూర్ణ అవగాహన ,పట్టు ఉన్నప్పుడే అనువాదం చేయడం సులభమౌతుంది.
‘ నవీన్: గారికి రాసిన ఉత్తరంలో తన గురించి ప్రజల్లో వుండే అభిప్రాయాన్ని ఇలా వివరించాడు.నిజానికి నా విమర్శలు వ్యక్తిగతంగా, అనాగరికంగా,ద్వేషాపూరితంగా ఉన్నాయనే అభిప్రాయం ” ఉందని రాస్తూ కాళోజిమీద రా.రా.సమీక్ష “రాక్షసం” అన్నవాళ్ళున్నారని అంటాడు.” అద్దేపల్లి” ని కూడా అంతకంటే తీవ్రమైన మాటలు అన్నానని ” ఈనాడు తెలుగు సాహిత్యంలో జరుగుతున్న ఘోరకృత్యాలు చూసినప్పుడు యెంత విజయసంపన్నునికైనా ” ఆరోగెన్స్” కలుగుతుంది.తెలుగు సాహిత్యానికి జరుగుతున్న ఘోరమైన అపచారాలు చూసినప్పుడు ” చాలా బాధ కలుగుతుందని కేంద్ర సాహిత్య అకాడమీ అనర్హమైన తెలుగు వాళ్లకే అవార్డులిచ్చిందని, అకాడమీల ద్వారా జరిగే యీ కృషితో తృప్తిపడని భారతపెట్టుబడిదార్లు ఇటీవల “జ్ఞానపీఠం” అనేది ఒకటి స్థాపించి కేవలం సాహిత్య సేవాదీక్ష అంటూ భ్రమపడతారని విమర్శిస్తాడు.నా ఆగ్రహం కేవలం ఇంటపరేట్ ఎమోషన్ కాదు పార్ట్ ఆఫ్ ది డెలిబరేట్ పాలసీ అని కన్ఫం చేస్తున్నాను.మెత్తగా చెప్పడం చాతగాక కాదు గట్టిగా ఘాటుగా చెప్పడం వల్ల నాకు పర్సనల్ గా చెడ్డపేరు వస్తే రావచ్చు కానీ,నేను కోరిన ఫలితాలు లభిస్తాయని నమ్ముతున్నాను.” అని చెప్పుకున్నాడు.
ఏదైనా ముక్కుసూటిగా విమర్శించే మనస్తత్వం. దాపరికం అనేది లేదు ఎదుటివాడు ఏమనుకొన్న పట్టించుకునే తత్వంకాదు మనసులోని విషయం బాధ కలిగించుకునేదైనా సరే,చెడ్డ పేరు వచ్చినా సరే ఖండితంగా చెప్పేయడమే రా రా తత్వం అని తెలుస్తుంది.
తెలుగు సాహిత్యానికి చెడ్డరోజులు వచ్చాయని,వట్టి నినాదాలు ” అభ్యుదయకవిత్వంగా ఒకప్పుడు చలామణి అయ్యాయని” అంతకంటే ఘోరమైన దిగంబరబూతులు విప్లవ కవిత్వంగా శ్రీశ్రీ లాంటి వాళ్ళచేత ఆమోదింపబడడం…. విప్లవకవిత్వం పేరుతో ఇంకెంత ఘోరాలు జరుగుతాయో తలచుకుంటే నాకు భయమౌతుంది .” అని రాస్తూ రమణారెడ్డికి రాసిన లేఖలో తన మనసులోని ఆందోళనను వెల్లడించాడు కాళోజీ తను చేసే విమర్శకు అర్హుడని అంటాడు
రమణారెడ్డికి రాసిన ఇంకో లేఖలో ” ఆయనతో మీకు గల వ్యక్తిగత సంబంధాలను బట్టి నా విమర్శ బాధ కలిగించవచ్చు గానీ,వెల్ అనే పదానికి కూడా అర్థం తెలియని వ్యక్తి ఇంగ్లీషు కవిత్వాన్ని అనువదించడానికి పూనుకోవడంలోని దురహంకారం …తెలుగుదేశంలో… కానీ వాళ్ళందరూ ఒక టన్ను ఫోజు పెట్టి ఒక తులం యోగ్యతైనా వున్న వాళ్ళు,అరతులం యోగ్యత కూడా లేకుండా ఐదు టన్నుల ఫోజు పెట్టిన వాడు నా ఎరుకలో కాళోజీ ఒక్కడే…నా బోటి వాడెవడైనా కాళోజీ నిజమైన యోగ్యత ఎంతో వెల్లడిస్తే అది రాక్షసమంటారు “అని కుండబద్దలు కొట్టినట్లు వ్యక్తం చేశాడు.
అభ్యుదయకవిత్వమంటే ఎట్లా ఉండాలి? అభ్యుదయ రచయిత అంటే ఎవరు? అనే వానికి జయరాంకు రాసిన లేఖలో చక్కని వివరణ యిచ్చాడు. అభ్యుదయ రచయితకు మార్క్సిజం లోతుగా, రాజకీయ పార్టీల నాయకులకు తెలిసినంత సమగ్రంగా తెలియనక్కరలేదంటే తనకేమీ అభ్యంతరం లేదని,”శ్రీ శ్రీ తనకు మార్క్సిజం తెలియదని అన్నాడంటే తనకు గాని,తన రచనలో గాని ఆ దృక్పథం లేదని అర్థం కాదు గదా తనకు సరిగా తెలియదని మాత్రమే అర్థం ” అని సోదాహరణంగా వివరించాడు.
మనవి బూర్జువా డేమోక్రటిక్ ఆశయాలు కావు .మనం పెట్టుబడిదారీ దశలో వున్నాం ఇప్పుడు మనకుండవలసిన ఆశయాలు సోషలిస్టు విప్లవానికి సంబంధించినవి మన సాహిత్యచరిత్రలో ‘భావకవిత్వం’ బూర్జువా డెమొక్రటిక్ విప్లవానికి సంబంధించినది.ఆ కవిత్వం అడుగంటిదంటే ఆ చారిత్రకదశ గడిచిపోయింది.కానీ ” ఈనాడు సోషలిస్టు భావాలు,కార్మిక డిమాండ్లు ప్రతిబింబించని సాహిత్యం అభ్యుదయ సాహిత్యం కాలేదు.ఏమైనా ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవలసింది ఏమిటంటే అభ్యుదయ సాహిత్యంలో ఈనాడు పెట్టుబడి దారీ వ్యతిరేక ధోరణి ఖచ్చితంగా వుండాలి మరి యీ ధోరణి ఖచ్చితంగా ఉండాలంటే రచయితకు మార్క్సిజంతో అంతో ఇంతో పరిచయం వుండాలి కనీసం ఒక్క స్థూలమైన మార్క్సిస్టు అవగాహన వుండాలి. అది లేకపోతె రచయితలో,రచనలలో రాజీ ధోరణులూ ,పెడధోరణులూ ఆస్పష్ట మానవతావాద భావాలు ప్రవేశిస్తాయి.తెలుగుదేశంలో వున్నది ఈనాడు యింకా ప్రధానంగా వ్యావసాయిక సమాజమే.కానీ యీ సమాజంలోని సమస్యలను కూడా బూర్జువా డెమొక్రటిక్ దృష్టితో కాక మార్క్సిస్టు దృష్టితో చూడగలవాడే ఈనాడు అభ్యదయ రచయిత కాగలడు.” అని తన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించాడు మార్క్సిస్ట్ భావాలు గల రా.రా.
రమణారెడ్డికి రాసిన లేఖలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ వల్ల తెలుగు సాహిత్యం నష్టపడిందనే భావన వ్యక్తం చేశాడు.
రాజకీయ విషయాలను స్పృశిస్తూ తన లేఖలో కమ్యూనిజం ఆత్మను బాగా అర్థం చేసుకున్న వాళ్ళు జెక్ రచయితలని చెప్తూ మరొకసారి ‘స్టాలినిజం’ అనే ఘాతుకభూతం యీ భూమండలం మీద యెక్కడ తలయెత్తినా యిక కమ్యూనిజానికి పుట్టగతులుండవు.కమ్యూనిజం వంద యేండ్లు ఆలస్యమైనా సరే స్టాలినిజం యే దేశంలోను రిపీట్ కాకూడదనే నా గాఢమైన కాంక్ష.” అంటూ అధికారంలో ఉన్న కమ్యూనిస్టు నాయకుల మాటలను నమ్మవద్దంటాడు.
రామమోహన్ కు రాసిన ఉత్తరంలో మానసిక శాస్త్ర విధానంపై విమర్శ ఉంది.దీనిపై రా.రా విమర్శనావిధానం ఎలా వుందో గమనిద్దాం.” ఉదాహరణకు భౌతిక పరిస్థితులనుబట్టి మనిషి మారతాడని బూర్జువా శాస్ర్తజ్ఞులు గుర్తిస్తారు.కానీ మనిషి అంటే ఏమిటి ? అన్నప్పుడు వాళ్ళు ఒక నిత్యసత్యమైన నిర్వచనం ఇచ్చుకుంటారు.ఈ పదిలక్షల ఏండ్లలోనూ మనిషి ఎంతగానో మారినాడని అంగీకరిస్తారు గానీ ” మనిషి” అనదగిన మూల పదార్థం ఏదో అది శాశ్వతంగా,పరిణామరహితంగా వుందని అనుకుంటారు.మన ” డైలక్టికల్ అండర్ స్టాండింగ్” ప్రకారం మనిషి ఎల్లప్పుడూ చారిత్రకపరిస్థితుల శిశువు మాత్రమే.” అని వివరించాడు.
భావ, భాష విషయంలో కూడా రా.రా ఒక అభిప్రాయాన్ని తెలుపుతూ విశ్వంకు రాసిన లేఖలో ఇలా వివరించాడు.” కడపజిల్లా నుడికారం నాకు సంతోషమే కలిగిస్తుంది.కానీ ,మరీ “గ్రామ్యం ” లో రాస్తే పాఠకుల్లో అత్యధిక భాగానికి అర్థం కాకపోయే ప్రమాదం వుంది. రా.వి.శాస్త్రి విశాఖపట్నం గ్రామ్యంలో రాసిన కొన్ని కథలు నాకు విసుగు కలిగించాయి.అలాగే తెలంగాణ వాళ్ళు తెలంగాణ గ్రామ్యంలో రాస్తే మనము అసలు చదవలేము గదా.కనుక ఈ విషయంలో రాజీ అవసరం.లాజికల్ ఎండ్ కు పోకుండా రీజనబుల్ లిమిట్స్ తో ఉండడం మంచిది.వాక్యం బిగువుగా ఉండడం ముఖ్యం.” అని రాశాడు ” గిడుగు గురజాడలు చెప్పింది శిష్టవ్యావహారికము” అని చెప్పాడు.
రా.రా.లేఖలను పరిశీలించి నట్లయితే తేలే అంశమేమంటే ఆయన స్పృశించని అంశం లేదంటే అతిశయోక్తి కాదు. శాస్త్రీయ దృక్పథం, రాజకీయ అవగాహన, మార్క్సిస్ట్ దృక్పథం, సాహిత్య విమర్శ, సోపపత్తిక విమర్శ,గురజాడ,శ్రీశ్రీ లపై మంచి అవగాహన,కాళోజీపై విమర్శల వర్షం ఇలా ఎన్నెన్నో భావాలు ఈయన లేఖల్లో చోటు చేసుకున్నాయి.
సునిశితపరిశీలన,తన కటువైన విమర్శ ఎదుటివారికి బాధ పెట్టినా సరే ఖండించే వైఖరి మొదలైన వెన్నెన్నో రా.రా.లేఖల్లో కనిపించే ప్రముఖ లక్షణాలు.
తెలుగునాట సామూహికంగా ఆయన విమర్శకు గురైన వేత్తలు ఎందరో ఉన్నారు.సాహిత్య విమర్శకు కొత్తబాటను వేసిన వాడుగా రా.రా.ను పేర్కొనవచ్చును.నిశితంగా విమర్శించడం,చెప్పదలచుకొన్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పడం రా రా.కే చెల్లింది.
ఉదాహరణకు
” నక్కలు బొక్కలు వెదకును
అక్కరతో నూరబంది అగడిత వెదకున్
కుక్కలు చెప్పులు వెదకును
టక్కరి నా లంజకొడుకు తప్పులె వెదుకున్” ప్రాచీన కాలంలో కవి అన్నట్టు తప్పులే వెతికేటి కుహనా విమర్శకులను నిర్దాక్షిణ్యంగా దుయ్యబట్టాడు.
రా రా అనువాద పద్ధతిని,సమీక్షా వైఖరిని తన లేఖల్లో సూచించాడు., ఆయన అనువాద పద్ధతులను లోతుగా అధ్యయనం చేశాడు. ఆయన రచించిన ” అనువాద సమస్యలు” గ్రంథం యువరచయితలకు,జర్నలిజం విద్యార్థులకు ఎంతో ఉపకరిస్తుంది.
ప్రత్రికారంగంలో ఆయనెదుర్కొన్న సమస్యలు ,విదేశంలో ఆయన జీవన విధానం,ఇలా ఒకటేమిటి ఎన్నో విషయాలు రా రా తన లేఖల ద్వారా వెల్లడించాడు.
శ్రీ శ్రీ (శ్రీరంగం శ్రీనివాస రావు) ,కొ కు( కొడవటిగంటి కుటుంబరావు) తర్వాత తెలుగు నాట రెండక్షరాల సంక్షిప్త నామంతో ఎంతో ప్రసిద్ధి చెందిన రా రా( రాచమల్లు రామచంద్రా రెడ్డి) వ్యక్తిగత అభిప్రాయాలు,విమర్శనా వైఖరి,ఆలోచనా సరళి మొదలగు ఎన్నో విశేషాలు లేఖల ద్వారా తెలుసుకోవడం సాహిత్య ప్రపంచంలో రా.రా కు ప్రముఖస్థానం ఉందనడానికి లేఖలే నిదర్శనం..
రారా.జీవనరేఖ
రా.రా గా ప్రసిద్ధి చెందిన రాచమల్లు రామచంద్రా రెడ్డి కడప జిల్లా పైరిపాలెం గ్రామంలో ఆదిలక్ష్మి,భయపురెడ్డి దంపతులకు 28 ఫిబ్రవరి 1922 సంవత్సరంలో జన్మించాడు.
పులివెందుల హైస్కూల్ లో స్కూల్ చదువు పూర్తి చేసి అనంతపురంలో ఇంటర్ మీడియట్ ,
చెన్నై లోని గిండీ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో గాంధీజీ నిరాహార దీక్షకు మద్దతుగా సమ్మెలో చేరినందుకు కాలేజీ నుండి యాజమాన్యం రా.రా ను తొలగించింది.యాజమాన్యం వారికి క్షమార్పణ చెపితే కాలేజిలో తీసుకుంటామంటే అందుకు నిరాకరించాడు.దేశభక్తి కలిగిన రా.రా తర్వాత విశాలాంధ్ర పత్రికలో ఉపసంపాదకునిగా పనిచేశాడు.మార్క్సిజం వైపు ఆకర్షిపబడి దృక్పథాన్ని వంటపట్టించుకున్నాడు.
“సంవేదన” అనే పత్రికను నడిపాడు.తర్వాత రష్యా కు వెళ్లి అక్కడ మాస్కోలోని ప్రగతి ప్రచురణాలయంలో 6 సంవత్సరాలు అనువాదకునిగా పని చేశాడు.
ఆ సమయంలో మార్క్స్,ఎంగెల్స్ సంకలిత రచనలు, లెనిన్ సంకలిత రచనలు, పెట్టుబడిదారీ అర్థశాస్త్రం, గోర్కీ కథలు, చేహావ్ కథలు మొద లైన రష్యన్ గ్రంథాలను ఇంగ్లీషు నుండి తెలుగులోకి సరళమైన తెలుగులో అనువదించారు. మాస్కోలో సంపాదించిందంతా కడపలోని ‘హోచిమిన్’ భవన నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు.
తర్వాత ఇండియా వచ్చి 1977 నుండి ఈనాడు పత్రికలో సంపాదకునిగా పని చేసారు.
రా.రా.అనేక ప్రక్రియల్లో రచనలు చేశాడు. గొప్ప కథా రచయిత.ఆయన రాసిన 12 కథలు అలసిన గుండెలు
పేరుతో కథాసంకలనంగా వెలుగులోకి వచ్చింది.
, గొప్ప జర్నలిస్ట్,ప్రముఖ అనువాదకుడు మంచి విమర్శకుడు అయిన రా.రా అనువాద సమస్యలు అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది.
సారస్వత వివేచన గ్రంథానికి సాహిత్య అకాడమీ అవార్డ్ లభించింది.
విమర్శకు దారిదీపం అయినటువంటి రా.రా విమర్శను సాహితీ ప్రక్రియగా అభివృద్ధి చేసిన ఘనత దక్కించుకున్న ప్రముఖ విమర్శకుడు .ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ 1988 సంవత్సరం నవంబరు 25 వ తేదీన తనువు చాలించాడు. తెలుగు సాహిత్య విమర్శనా రంగం ఒక ప్రముఖుణ్ణి కోలుపోయింది.