Home వ్యాసాలు రాజవరం గ్రామ ప్రజల కొంగుబంగారం –  మల్లప్పయ్య స్వామి  జాతర

రాజవరం గ్రామ ప్రజల కొంగుబంగారం –  మల్లప్పయ్య స్వామి  జాతర

by Kancharla Mahesh

           భారతరాజ్యాంగం అన్ని కులాలకు, అన్ని మతాలకు సమోన్నత స్థానాన్ని కల్పించింది. కనుక ఏ కులము, ఏ మతము తక్కువ కాదు. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశ యొక్క విశిష్ట లక్షణం. ఇంతటి విశిష్టత కలిగిన 28 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రానిది ప్రత్యేక స్థానం. తెలంగాణ రాష్ట్రము అనగా గుర్తుకొచ్చేది  వీరత్వం. అలాంటి వీరత్వం కలిగిన ఈ నేలలో ఒక యుద్ధానికే కాదు దైవత్వానికి కూడా చోటు ఉంది. ఉత్తర తెలంగాణ మొత్తం శైవాన్ని ఆరాధిస్తే, దక్షిణ తెలంగాణ మాత్రం వైష్ణవాన్ని ఆరాధిస్తూ వస్తుంది. దానికి కారణమేంటంటే చారిత్రక నేపథ్యం కలిగిన రాజులు ఆ ప్రాంతాలను పరిపాలించారు. చరిత్రలో చూస్తే కాకతీయులు ఓరుగల్లును కేంద్రంగా చేసుకొని పరిపాలించారు. వీరి ప్రధాన దైవ ప్రచారం శైవ మతం. రాజులు తమ యొక్క గొప్పతనం తెలపడం కోసం మరియు ఇష్ట దైవాలా కోసం గుళ్ళు గోపురాలు కట్టడం రాజుల యొక్క ఆనవాయితీ. వాటిలో చూడదగినవి  వేయి స్తంభాల గుడి, స్వయంభు ఆలయం, అయినవోలు మల్లన్న  మొదలైనవి. కాకతీయుల కాలంలో గొప్ప కవుల సైతం శైవ మత ప్రచారానికి తమకలాన్ని బలంగా వాడారు. వారిలో తెలంగాణ ఆదికవిగా ప్రసిద్ధి చెందిన పాల్కురికి సోమనాథుడు ఈ నేలపైన శైవ మతాన్ని ప్రచారం చేశారు. అట్లని వైష్ణవం లేకపోలేదు ఉత్తర తెలంగాణలో వైష్ణవం మరియు జైనం  కూడా స్వల్ప స్థాయిలో కనబడుతుంది. మరి దక్షిణ తెలంగాణను విష్ణు కుండీనులు పరిపాలించారు. వీరు ఇంద్రపాల నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. స్వల్ప స్థాయిలో శైవాన్ని, జైనాన్ని శిఖర స్థాయిలో వైష్ణవాన్ని ప్రోత్సహిస్తూ వచ్చారు.  వాటిలో చూడదగినవి తెలంగాణ తిరుపతిగా వర్ధిల్లే యాదగిరి నరసింహస్వామి, కృష్ణా నది ఒడ్డున విరిసిల్లిన మఠంపల్లి లక్ష్మీ నరసింహ స్వామి మొదలైనవి. చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా విష్టకుండీలా కాలం నాటిదే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కాకతీయులు తమ రాజ్యాధికారాన్ని విస్తరించుట కొరకు యుద్ధాలు చేస్తూ అక్కడక్కడ దైవత్వాన్ని ప్రతిష్టిస్తూ వెళ్లారు. అట్ల ఏర్పడినటువంటి గుళ్లలో నల్లగొండ జిల్లాలోని పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం, రాజవరంకు సమీపాన ప్రతిష్టించబడిన మల్లప్ప స్వామి గుళ్ళు నిలువెత్తు నిదర్శనాలు. 12వ శతాబ్దం నాటి ఈ గుళ్ళు చెక్కుచెదరకుండా నేటికీ కొన్ని గ్రామాల ప్రజల దైవంగా వర్ధిల్లుతూ వస్తున్నాయి.
గుడి చారిత్రక నేపథ్యం :
        తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా, తిరుమలగిరి సాగర్ మండలం రాజవరం మరియు చుట్టుపక్కల  గ్రామప్రజల దైవం మల్లప్పయ్య స్వామి. కొలిచేవారికి కొంగుబంగారమై నిలిచింది. . రాజవరం గ్రామం నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో గట్ల మధ్య కొలువైన ఒక అందమైన గుడి. ఈ గుడి చారిత్రక నేపథ్యం సుమారుగా 800 సంవత్సరాల క్రితం. అంటే కాకతీయుల కాలం నాటిది. వీరి కాలంలో కట్టిన గుళ్ళు ఎక్కువగా మండపాల రూపంలో కనబడుతుండేవి. కాకతీయులు యుద్ధానికి వెళ్లే సమయంలో పేరిణి నృత్యం  ద్వారా శివుని రౌద్రాన్ని ఆరాధిస్తూ వెళ్లేవారు. అలా చేస్తే వారి యుద్ధంలో గెలుస్తారని విశ్వాసం. అట్లాంటి విశ్వాసాన్ని తెలంగాణ నేలపై అంతా విస్తరించిన ఘనత కాకతీయులది. మల్లప్పయ్య స్వామి గుడి కూడా మండపం రూపంలో ఉన్నదే. అలా కట్టిన గుళ్ళు ఇప్పటిదాకా చెక్కుచెదరలే. ఇంతటి సుందరమైన గుడులను కట్టిన కాకతీయులు తెలంగాణ నేలను, తెలుగు నేలను సుసంపన్నం చేస్తూ దైవత్వాన్ని ప్రచారం చేశారు. కాకతీయులకు అద్దం పట్టిన ఈ గుడిలో అద్భుతమైన శివలింగాన్ని చూడవచ్చు. ఇక్కడ చుట్టూ అద్భుతమైన ప్రకృతి వనంలో ఆరాధ్య యోగ్యమైన శివలింగం నిండు పున్నమిలా కనబడుతుంది.
 మహాశివరాత్రి పర్వదినం…
             జాతర అనగా జనం గుమికూడటం. జనాలు మొత్తం గుమిపూడి తమ సుఖశాంతులను పంచుకునే అద్భుతమైన వాతావరణమే పండగ. చిన్న పెద్ద ముసలి ముతక, యువకులు, కులమతలకు అతీతంగా అంగరంగ వైభవంగా జరుపుకునే పండగే మహా శివరాత్రి. అలాంటి పండుగను రాజవర గ్రామం మరియు చుట్టు ప్రక్కల ప్రజల ఎక్కడలేని విధంగా అంగు ఆర్భాటాలతో  జరుపుకుంటారు. మహాశివరాత్రి అనేది ఇక్కడి గ్రామ ప్రజల పెద్ద పండుగ. తెలంగాణలో పెద్ద పండగ దసరా అయితే ఆ పండక్కు తమ ఆడ బిడ్డలని తీసుకొని రావడం ఆనవాయితి. కానీ రాజవరం గ్రామ ప్రజలు దసరా కంటే భిన్నంగా మహాశివరాత్రికి తమ ఆడబిడ్డలను తీసుకొని వస్తారు. మొక్కులు ఉన్నవారు ఉపవాసాలు ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే “ప్రభలు కట్టడం”. ఇలా  ప్రభలు కట్టడం, ఉపవాసాలు ఉండటం వల్ల తమ కోరికలు తీరుతాయని ప్రజల నమ్మకం. శివరాత్రి నాడు తమ మొక్కుల తీర్చుకొనుటకు ప్రభలను కట్టి ఆ రోజంతా ఊరేగింపు చేసి 12 గంటలు దాటిన తర్వాత మల్లప్పయ్య గుడి దగ్గరికి బయలుదేరుతారు. ధూప దీప నైవేద్యాలతో, మొక్కు ముడుపులను దేవునికి సమర్పిస్తారు. జాగారాలతో జరిగే ఈ పండగ దశ దిశల విస్తరిస్తూ, కోరిన కోరికలు తీరుస్తూ మహిమను చాటుతూ వస్తుంది. ఇక్కడ శివలింగానికి ప్రత్యేకత ఏంటంటే సూర్యకిరణాలు నేరుగా లింగంపై పడడం. కాకతీయులు తమ గుళ్లను కట్టేటప్పుడు ఒక సైంటిఫిక్ అనువర్తనాలను అనువదిస్తూ కట్టి ఉండవచ్చు. ఈ మల్లప్ప స్వామి గుడి కూడా ఆకోవకు చెందినదే. ఇంతటి విశిష్టత కల్గిన మల్లప్పయ స్వామి మహిమలను దశ దిశలా చాటాల్సిన బాధ్యత రాజవరం మరియు చుట్టుపక్కల ఉన్న  గ్రామ ప్రజలపైనే ఉంది.
 కోనేరు ప్రత్యేకత :
    ప్రాణ కోటికి జీవనాధారం నీరు. అలాంటి నీరు భూమి పైన 97% ఉప్పునీరు. మూడు శాతం మంచినీరు కలదు. ఆ మూడు శాతం మంచినీరులో త్రాగడానికి యోగ్యమైన నీరు మాత్రం ఒక్క శాతం మాత్రమే. భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరిగే ప్రయత్నాలు జరగొచ్చు. కనుక నీరు ఎంత ముఖ్యమైనదో మనం గమనించవచ్చు. మల్లప్ప గుడి దగ్గర ఉన్న కోనేరు మాత్రం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. “నిత్య కళ్యాణం – పచ్చతోరణం” లాగా సంవత్సరం పొడుగు నీళ్లు ఊరుతూనే ఉంటాయి. ఏ కాలంలో పోయిన ఎంత కరువు వచ్చినా అక్కడ నీళ్లను మనము చూడవచ్చు. గుడి దగ్గరికి వచ్చిన భక్తులందరూ ఆ కోనేటిలో స్నానం చేసి తమ మొక్కుబళ్లను దేవునికి సమర్పిస్తారు. కోనేటిలో స్నానం చేయడం వల్ల తన పాపాలు పోతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. ఎంత ఎండాకాలమైనా రాళ్ల మధ్యలో నుండి వచ్చే నీరు రిఫ్రిజిరేటర్ లో నీటి కంటే చల్లదనంగా ఉంటాయి.
 ముగింపు:
   ప్రజలు అనుకున్న కోరికలు తీరాలని అన్నదాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు గ్రామ పెద్దలు ఎడ్ల పంద్యాలను కూడా పెడుతూ ఉండేవారు. ఈ పండక్కి ఎంత దూరాన ఉన్నా, ఏ పని చేస్తున్న కదిలి రావాల్సిందే. శివరాత్రికి వచ్చిన వారందరికీ మర్యాదలు చేస్తారు. నిజమైన భక్తి శ్రద్దలతో సేవించడం వల్ల కోరికలు తీరుతాయని, ఈ మహిమకరమైన పండుగ  సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. రాజవరం గ్రామ ప్రజలందరూ ఐక్యతతో అంగరంగ వైభవంగా నిత్య భక్తిశ్రద్ధలతో చేసే మహా అద్భుత పండుగ ఈ మహా శివరాత్రి. తమకు ఏ కష్టం వచ్చినా ముందుగా చెప్పుకునే దేవుడే మల్లప్పయ్య. స్వామి తమ కష్టాలను కన్నీళ్లను కడగండ్లను తీరుస్తారని ప్రజలందరి గట్టి నమ్మకం.                                          

You may also like

Leave a Comment