Home వ్యాసాలు రుబాయీలు

రుబాయీలు

by Acharya Phanindra

రుబాయీ అన్నది నాలుగు పంక్తులు గల కవిత. రుబ్ అంటే రసం లేక సారం అని అర్ధం. రుబాయీ అంటే రసవంతమైన కవిత అని భావించవచ్చు. ఈ రుబాయీ అన్నది ముందుగా “పర్షియన్” భాషా సాహిత్య ప్రక్రియ. “రుబాయీ” అనేది అరబిక్ పదం. ఈ రుబాయీలను సాధారణంగా, దేని కదే సంపూర్ణ భావంతో, “ముక్తక కవితలు”గా వ్రాస్తుంటారు. ఇది మాత్రా ఛందస్సులో సాగే ప్రక్రియ. ఇందులో – 1,2,4 పాదాల చివరి పదాన్ని “రదీఫ్” అంటారు. రదీఫ్ కంటే ముందు ఉండే పదాన్ని “కాఫీయా” అంటారు. మొదటి పాదంలో ఏ పదం రధీఫ్ గా ఉంటే రెండవ, నాల్గవ పాదాలలో అదే పదం రదీఫ్ గా వస్తుంది. కాఫీయా అంటే అంత్యప్రాస లాంటిది. మూడవ పాదానికి రదీఫ్, కాఫియాలు ఉండనవసరం లేదు. తెలుగులో కొందరు రదీఫ్ అంటే అదే పదాన్ని వాడకుండా, అదే రకమైన ప్రాసతో కూడిన పదాలు వేస్తూ రుబాయీలను రచించారు. ఇక అక్కడ కొందరు వేరుగా కాఫియాను ప్రయోగించని సందర్భాలు కూడ ఉన్నాయి.

ఈ రుబాయీలలో అన్ని పాదాలకు సమమైన మాత్రలు ఉండాలె. ఏదో ఒక లయలో కొనసాగడం అవసరం. ప్రతి పాదానికి ఒక స్వతంత్ర అస్తిత్వం చూపుతూ, నాలుగు పాదాలకు కలిపి ఒక విశిష్టమైన అస్తిత్వాన్ని సాధించాలె. మొదటి రెండు పాదాలు రుబాయీ కవితలో భూమికగా నిలుస్తాయి. మూడవ పాదం ఆ కవితా వేదికను సుస్థిరం చేసి, నాల్గవ పాదంలో ఒక తుది మెరుపును మెరిపించడం ద్వారా ఆ రుబాయీ శ్రోతల గుండెలకు హత్తుకొంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రుబాయీ అన్నది క్లుప్తీకరించిన “గజల్” ప్రక్రియ లాంటిది.

పార్సీ భాషలో ఈ రుబాయీలకు ఆద్యుడు ఉమర్ ఖయాం. ఆ తరువాత పార్సీ, ఉరుదూ భాషలలో ఎందరో కవులు అసంఖ్యాకమైన రుబాయీలను రచించి ఈ ప్రక్రియకు ప్రఖ్యాతిని కొని తెచ్చారు. 

తెలుగు భాషలో ఈ ప్రక్రియను మనకు పరిచయం చేసింది మహాకవి డా. దాశరథి గారు. ఆయన రచించిన కొన్ని రుబాయీలను పరిశీలిద్దాం …

పడవ నడపలేని వాడు నావికుడు –
పాట పాడలేనివాడు గాయకుడు –
అందుకనే వేదనతో నేనంటాను …
ప్రజల నడపలేనివాడు నాయకుడు!

డా. దాశరథి

నింగిని కితాబుగా చేశాను –
చుక్కల హిసాబులు వేశాను –
ప్రేయసి కోసం వేచీవేచీ,
మంచం కన్నీటితో తడిపేశాను!

డా. దాశరథి

నవ బాష్ప ధారలో నవ్వు కాగలవు!
ముళ్ళ తీగెలలోన పువ్వు కాగలవు!
యత్నించి చూడమని అంటాను నేను –
రాళ్ళ రాసులలోన రవ్వ కాగలవు!

డా. దాశరథి

నిన్నటి ధర రెండింతలు పెరిగింది నేటి ఉదయం!
మొన్నటి ధర మూడింతలు పెరిగింది సాయంత్రం!
అన్నింటి ధర పెరిగినా నేనంటాను …
ధర పెరుగని సరుకొకటే – మానవ ప్రాణం!!      

డా. దాశరథి

కోటి నదులు పోలలేవు ఒక్క సింధువుని!
కోటి తారలు పోలలేవు లోక బాంధవుని!
అందుకనే గళం విప్పి నేనంటాను –
కోటి నేతలు పోలలేరు ఒక్క గాంధీని!

డా. దాశరథి

ఉత్తరాన గల హిమాచలం
దక్షిణాన గల జలధి జలం
మన అందరిదీ అని నేనంటాను!
ఐకమత్యమే గద మనకు బలం!

డా. దాశరథి

రక్తం నదులై పారకపోతే రాదా రెవల్యూషన్?
బుర్రలు బుర్రలు పగులక లేదా సమస్యకు సొల్యూషన్?
హింసా యుద్ధం ఔట్ డేటెడ్ అని నేనంటాను –
శాంతి ఒక్కటే మానవజాతికి సాల్వేషన్!

డా. దాశరథి

ఈ విధంగా తొలితరంలో .. తెలుగు రుబాయీలలో … దాశరథి గారు గానీ, తరువాతి తెలుగు కవులు కూడ కొందరు భావానికి, మౌలిక రూపానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ, అంత్య ప్రాసలను మాత్రం పాటిస్తూ, రదీఫ్, కాఫియా విషయంలో కొంత సడలింపులను చేసి, అక్కడక్కడా కొంత స్వతంత్రతను చాటారు. 

ఇప్పుడు .. మరి కొందరు ప్రముఖులు తెలుగులో వ్రాసిన రుబాయీలను చూద్దాం.
……..

చిత్రశాల చూశారా చిందులేయు మనసు
మధుశాల చూశారా మత్తెక్కును మనసు
భావి పౌరులకు జ్ఞానామృతాన్ని పోసేటి
పాఠశాల చూశారా పారిపోవు మనసు!!   
   – డా.తిరుమల శ్రీనివాసాచార్యులు

ఆకాశం ఎత్తెంతో కనుక్కో!
భూగోళం వ్యాసమెంతో కనుక్కో!
పాతాళం లోతెంతో కనుక్కో!
తెలియదా? పుస్తకాలు కొనుక్కో!
    – డా.తిరుమల శ్రీనివాసాచార్యులు

ఎవరి తోట అయితేనేం – పూలింట్లో పడితే సరి!
ఎవరి గ్రంథమైతేనేం – మన గూట్లో పడితే సరి!
బడి ఎవ్వడు కడితేనేం – గుడి ఎవ్వడు కడితేనేం –
మన బుడుతని తెలివి పెంచి, చదివి బాగుపడితే సరి!
      – డా.తిరుమల శ్రీనివాసాచార్యులు

…….//……….//……

వాకపల్లి ఘోరానికి సిగ్గే లేదు
దుర్మార్గుల నేరానికి ఎగ్గే లేదు
జాతికింత అవమానం జరుగుతు ఉన్నా
జనంలో రగులుతున్న అగ్గే లేదు!!
   – శ్రీ ఎండ్లూరి సుధాకర్

ఆడవాళ్ళ చట్టాలను కాపాడాలి!
ఇరుగు పొరుగు వారికొరకు పోరాడాలి!
దెబ్బతినే దేశమాత దేహం చూసి –
దేవుడైన ఆమె వైపు నిలబడాలి!
     – శ్రీ ఎండ్లూరి సుధాకర్

రాతి దేవుళ్ళకు నమస్కరిస్తాడు!
బాబాలను బహుగా సత్కరిస్తాడు!
యాచకులెవరైనా ‘అయ్యా’ అంటే –
ఛీ పొమ్మని ఆ భక్తుడు ఛీత్కరిస్తాడు!
      – శ్రీ ఎండ్లూరి సుధాకర్

ఆమె మొదట్లో ఒక పువ్వనుకున్నాను!
ఏమీ తెలియని గూటి గువ్వనుకున్నాను!
మైకు ముందు నిలబడ్డాకే తెలిసింది –
ఆమె నిజంగా ఒక నిప్పు రవ్వనుకున్నాను!
       – శ్రీ ఎండ్లూరి సుధాకర్

……//…………..//………//…….

శిలలు ఒరుసుకుంటే అగ్నికణం పుడుతుంది!
చెట్లు ఒరుసుకుంటే దావానలం పుడుతుంది!
రాపిడి లేకుండా ఏ చైతన్యం ఉండదు కద –
గుండె పగిలితే, వెంటాడే వాక్యం పుడుతుంది!
        – పెన్నా శివరామ కృష్ణ

కనిపించే గాయమైతె తడమకనే తెలిసేది!
లోలోపలి వేదన ఒక తలగడకే తెలిసేది!
అవ్యక్తపు ఆర్తులన్ని కడదాకా అనాథలే!
సాంధ్యఘోష అంతా ఒక పడమరకే తెలిసేది!
        – శ్రీ పెన్నా శివరామ కృష్ణ

………//………….//……….//………..

మాటల్లో మాధుర్యం గుర్తు పట్టవచ్చు
రాతల్లో సుకుమారం గుర్తు పట్టవచ్చు
మనసులోని అందాలకు కొలమానం లేదు
సహజమైన సౌందర్యం గుర్తుపట్టవచ్చు

   – శ్రీ ఏనుగు నరసింహా రెడ్డి

వచనం ఎక్కువైతే కవితా తగ్గుతుంది!
భాష్యం ఎక్కువైతే భావనా తగ్గుతుంది! మొక్కకు నీరుండాలి; ముంచేట్టుగా కాదు – సంపదలెక్కువైతే ప్రేమా తగ్గుతుంది!
    – శ్రీ ఏనుగు నరసింహా రెడ్డి

రుబాయీలు రాయడమొక మజాకు కాదు! రదీఫూను కాఫియాను అల్లుడు కాదు! పట్టరాని చేపపిల్లలంటి ఊహలు  
మాత్రల్లో పరుగు తీయ సడాకు కాదు!
       – శ్రీ ఏనుగు నరసింహా రెడ్డి
 
ఇక నేను రచించిన కొన్ని రుబాయీలను కూడ మీ ముందుంచి, ఈ వ్యాసాన్ని ముగిస్తాను.

         రుబాయి రసోయి
        ~~~~
రచన : డా. ఆచార్య ఫణీంద్ర
“””””””””””””””””””””””””””””””

కవితా హృదయం ఒక రసోయి –
కమ్మని కవితలు వండేందుకు కదోయి!
రకరకాల కవితల వంటకాలలో
మరో మధుర వంటకం – రుబాయి! 1

ఉమర్ ఖయాం, మహ్మద్ ఇక్బాల్ ఉరుదూలో –
ప్రసిద్ధులే కదా “రుబాయి” ఘనతలో!
ఆద్యుడైన రుబాయిల “దాశరథి” –
మార్గదర్శి మా కెపుడు తెలుగులో! 2

భావంలో తలపించు గోవర్ధనం!
పలుకులలో పరిమళించు సరళ గుణం!
వినిపిస్తే కమ్మని ఆ రుబాయి –
తలలూపేరు కద మహాజనం! 3

తెలుగున నీ జనకుడై, రుబాయి!
కదిలించెను “దాశరథి”యె తన చేయి!
ఆ పై పోషించి, పెంచి నీ కాయె –
“తిరుమల శ్రీనివాసాచార్య” బాబాయి! 4

పాలు, తేనె మిశ్రమం రుచి చూడు –
పూలలోని మకరందం రుచి చూడు –
ఇవి అన్నీ తోడైన రుబాయిలో ..
తెలుగు భాష మాధుర్యం రుచి చూడు! 5 #

You may also like

Leave a Comment