Home వ్యాసాలు లేఖల్లో సాహిత్యాంశాలు

లేఖల్లో సాహిత్యాంశాలు

by Cheedella Seetha Lakshmi

ఆ కాలంలో కావ్యాలకు వ్యాఖ్యానం రాసే విషయంలో పండితులకు సహితం సలహాలను ఇచ్చాడు బ్రౌన్. “శబ్దమునకు శబ్దం ఎంత మాత్రమూ అల్లించకుండా తేలే తాత్పర్యం మాత్రం చెప్పుకు అపురూప శబ్దములు తాత్పర్యం బోధ చేస్తే చాలుతుంది” అని పెద్ద కావ్యాలకు టీక రాసే మార్గాన్ని సూచించాడు.

19వ శతాబ్ది ఉత్తరార్ధంలో కొందరు కవులు తెలుగులో సంస్కృత నాటకాలను అనువదించారు. నాటకాలను అనువాదం చేసేటప్పుడు ఎటువంటి కష్టాలు ఉంటాయో లేఖల ద్వారా తెలుసుకోవచ్చును.

వీరేశలింగం పంతులుగారు పూండ్ల రామకృష్ణయ్యకు వ్రాసిన లేఖలో “తెలుగు నందు నాటకములు లేని కాలములో మొట్టమొదట ఆంధ్రీకరణమునకుం బూనిన నాకు కష్టములెక్కువగా ఉండును. ఇప్పటివారితో ఇదివరకు చేయబడిన భాషాంతరీకరణము లొకటి రెండుండి యుండుట చేత నట్టి కష్టము లేదు. వెనుకటి వానిం జూసి కొంత మెరుగు పెట్టవచ్చును. వెనకటి వానిలో గొన్ని లోపములెంచవచ్చును” అని వ్రాయడం వలన మొదట అనువాదం చేసిన వారికి కష్టాలు ఎక్కువ కానీ తర్వాత వారికి మార్గం సులభతరం అని అభిప్రాయపడ్డారు.

అనువాద ప్రక్రియ ఎంత కష్టమైనదో అనువాదం చేయడం కూడా ఒక కళే అని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు దువ్వూరి రామిరెడ్డి గారు. ఒక భాషలో నుంచి ఇంకో భాషలోకి అనువాదం చేయునప్పుడు సంప్రదాయ సిద్ధములైన కొన్ని ఉత్ప్రేక్షలు, ఉపమానములు ఇంగ్లీషులోకి తర్జుమా చేయబడినప్పుడు ఆ భాష ప్రతిభను అనుసరించి చాలా నీరసములుగను మెకానికల్ గను అగుపడును. ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా కాబడవలసిన కవిత్వమునందు యూనివర్సల్ అప్పీల్ ఉండవలెను. అట్టివే ఏరుకొనిన బాగుగానుండును. ఇంగ్లీషులోని భావములు తర్జుమా చేయగలమే గాని మన సంప్రదాయము ననుసరించి ఆ భావముల నావరించిన అట్మాస్ఫియర్ ను తర్జుమా చేయలేము”

ఇట్లు అనడం వలన ఒక భాషలోని భావాలను అనువాదం చేయవచ్చును గానీ, వాతావరణాన్ని సంప్రదాయములను పాటించడం కష్టం కాబట్టి అనువాదం చేయాల్సిన విషయాలను ఏరుకొని భావాన్ని గ్రహించి అనువాదం చేయాలి. మక్కికి మక్కి అనువాదం చేస్తే కూడా కవిత్వం ఆహ్లాదకరంగా ఉండదు అని గమనించాలి.

వేదం వేంకటరాయ శాస్త్రి పాత్రోచిత భాషను నాటకాలలో ప్రయోగించి కొత్త మార్గాన్ని తొక్కారు. ఈ విషయంలో పండితుల్లో అనేక వాదోపవాదాలు వచ్చాయి కొందరు పండితులు మెచ్చుకున్నారు. కొందరు విమర్శించారు. కాలం మారుతున్నప్పుడు రచనా పద్ధతి మారడం సహజం. పూర్వకాలంలో రాజాస్థానాలల్లో ఆదరించబడిన కావ్యాలకే కావ్య గౌరవం ఉండేది. అందుకని ఆనాటి కవులు రాజానుగ్రహం పొందటానికే, విద్వాంసులలో అగ్ర పీఠం సంపాదించడానికే ప్రయత్నం చేసేవారు.
“నేడన్నచో నాటక మూలము ప్రజలను జ్ఞానవంతులుగను, నీతిమంతులుగను చేయవలసిన బాధ్యత వర్తమాన కవుల యందున్నది”. రామస్వామి చౌదరి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ కవికి స్వాతంత్ర్యం ఉండాలని నొక్కి వక్కాణించాడు. ద్రావిడ భాషలు స్వతంత్రమైనవి కాబట్టి “నీచ పాత్రములకే గ్రామ్య భాష గాని,మిశ్రమ భాష గాని యుపయోగింపబడవలయును. ఉచ్ఛ పాత్రములకు భిన్నజాతీయుడైన నేమి, భిన్న మతస్తుడైన నేమి గ్రాంథిక భాషనే యుపయోగించుట సమంజసమని” తలుస్తూ భాషా ప్రయోగ పద్ధతి పట్ల తన అభిప్రాయాన్ని వెల్లడించాడు రామస్వామి చౌదరి.

వడ్డాది సుబ్బరాయశాస్త్రి వేదం వారికి రాసిన లేఖలో “నీచ పాత్రములకు తెలుగు నాటకముల యందు తమరు చూపిన దారి నా మటుకు ఆదరణీయంగానే తోచుచున్నది. గ్రామ్యము లేవో యగ్రామ్యములేవో యె రుంగనివారు అనేకులు ఉందురు గాన వారికి గ్రామ్యములివి యగ్రామ్యములివి యని తెలుసుకొనుటకు వీలు కలుగుచున్నది”అని వ్రాశారు.

గురజాడ అప్పారావు “నాది ప్రజల ఉద్యమం” అని చెప్పుకొని ఎన్ని ఆటంకాలు వచ్చినా లక్ష్యపెట్టక వ్యావహారిక భాష ఉద్యమాన్ని కొనసాగించి విజయం సాధించారు.కన్యాశుల్కం నాటకానికి “సమకాలిక ఇతివృత్తాన్ని స్వీకరించి దానిని తెలుగున వాడుక భాషలో నాటకంగా రూపొందించాను”అని రాశారు.ఇతివృత్త స్వీకారంలో భాషా విషయంలో నూతన ఫక్కీ లో చరించి ఆ కాలంలో ఒక విప్లవాన్ని లేపి సంప్రదాయుల విమర్శలకు గురైన ప్రజాకవి గురజాడ తనదంటూ ఒక ప్రత్యేక బాట నేర్పరిచి తరువాత వారికి మార్గదర్శకుడు అయ్యాడు.

కవిత్వ విషయాన్ని ప్రస్తావిస్తూ గుడిపాటి వెంకటాచలం తన లేఖలో రచయితలు రెండు రకాలని చెబుతూ “తాము బాధపడుతో ఆ బాధని కాగితం మీద రాసేవారు. వీరు కోరేది లోకంలో సంఘస్థితిలో మార్పు. రెండో రకం వారు రాద్దామనుకుని ఏదో ఒక సమస్యను ఆధారంగా చేసుకుని రాసేవాళ్లు” అని వివరిస్తూనే “చలం కోరింది హృదయంలో మార్పు గనుక అతడు ఎన్ని శతాబ్దాలకీ లోకవిరోధిగానే వుండిపోయినాడు, ఉండిపోతాడు” అని తనకు బాధ లోంచే కవిత్వం పుడుతుంది అని వ్రాస్తూ “బాధ అనేది ప్రపంచంలో ఉన్నన్నాళ్ళు పుట్టడం అనేది విషాదం. నాలుగు మణుగుల ఆనందం ఉన్నా సరే రెండు తులాల బాధ దాన్నంతా చెరుపుతుంది. ఇంత బాధ చుట్టూ లేకపోతే నేను రాసే ఉండను రాసినా అవసరం ఉండకపోను” అంటూ తన రచనావైఖరిని విశదీకరించాడు.

కథ చిత్రించే విధానంలో కూడా చలం అభిప్రాయం “కథకి గొప్పతనం పట్టాలంటే కథ చిత్రించే జీవితం భూమి నుంచి పైకి తేవాలి” అంటూనే ఆకలి, డబ్బు లోంచి పోయెట్రీని తెప్పించలేం. ఒక లోతైన అనుభవం లోంచి వచ్చిన మనిషి మాట్లాడుతున్నట్టు” అని కథారచన వాస్తవికంగా ఉండాలన్న అనుభవంతో కూడుకొని ఉండాలనేదే చలం ఉద్దేశం.

ఆదర్శం లేకుండా కవిత్వం లేదు ఒక ఆదర్శాన్ని ఆశించి మానవత్వాన్ని చూపిస్తూ కవిత్వం రాయాలి అన్న బాల గంగాధర్ తిలక్ అభిప్రాయం. “కుళ్ళిన ముసలిదైపోయిన సంఘాన్ని బూజుపట్టిన భావాల్ని రూపుమాపే బాధ్యత కూడా రచయితదే అంటాడు తిలక్. “కరుణ, సౌందర్యం, మానవత్వం ఈ మూడు ప్రాతిపదికలుగా చేసుకొని తన ఆదర్శాన్ని ,ఆలోచనల్ని నిర్మించుకున్నానని చెప్పుకున్నాడు తిలక్.

రచనా పద్ధతిని వివరిస్తూ సంజీవ్ దేవ్ “సుందరమైన భావావళి లేని సుందరమైన పదావళి పాఠకుని హృదయం పై అంతగా ముద్ర వేయజాలదు కానీ ఇందుకు వ్యతిరేకంగా సుందరమైన పదావళి లేని సుందరమైన భావావళి పాఠకునిపై మంచి ప్రభావాన్ని వేస్తుంది” అంటూ అభి వ్యక్తికి చక్కని భాష మాత్రమే కాదు భావ గాంభీర్యం కూడా ఉండాలి అని తన అభిప్రాయం వెలిబుచ్చాడు.

లేఖల వలన వివిధ కవుల
సాహిత్య కృషి తెలుస్తుంది. వీరేశలింగం పంతులు స్వీయ చరిత్ర, కవుల చరిత్ర రచించినట్లు గురజాడ అప్పారావు కన్యాశుల్కం,బిల్హణీయ నాటకాలను, ముత్యాల సరాలను వ్రాసినట్టు, వేదం వారి సాహిత్య పిపాస, దువ్వూరు రామిరెడ్డి కృషీవలుడు, జలదాంగన,వనకుమారి కావ్యాలు రచించినట్లు తమ తమ లేఖలలో తెలిపినారు.

బ్రౌన్ సాహిత్యానికి చేసిన కృషి అనగా నిఘంటు నిర్మాణంలో పడిన శ్రమ, కావ్య సేకరణ కోసం పడిన పాట్లు, టీకా వ్యాఖ్యానాలు వ్రాయించడంలో చూపిన నైపుణ్యం, సలహాలు బ్రౌన్ లేఖల వలన తెలుస్తుంది.

విజ్ఞుల అభిప్రాయాలను లేఖల ద్వారా వెల్లడించడం వలన గుంటూరు శేషేంద్ర శర్మ రచనల ప్రాధాన్యత స్పష్టమవుతుంది.
నా దేశం నా ప్రజలు, ఋతుఘోష, సాహిత్య కౌముది, స్వర్ణ హంస, నరుడు- నక్షత్రాలు, షోడసి మొదలగు కావ్యాలపై
“శ్రీశ్రీ,విశ్వనాథ సత్యనారాయణ, పుట్టపర్తి నారాయణాచార్యులు, వేలూరు శివరామశాస్త్రి, జలసూత్రం రుక్మిణినాథ శాస్త్రి, దివాకర్ల
వేంకటావధాని మొదలగు ప్రముఖుల అభిప్రాయాలు సాహిత్య విమర్శకు దోహదం చేస్తున్నాయి అనడంలో సందేహం లేదు. శేషేంద్ర కవిత్వాన్ని గురించి శ్రీ శ్రీ అన్న మాటలు శేషేంద్ర కవితా రీతిని తెలుపుతాయి.

“శ్రీనాధుని క్రీడల్లో
అల్లసాని వాడల్లో
కూడా దొరకని
పదచిత్రం
విచిత్రం కడు పవిత్రం
ధూమాగా ఉంది ఇమేజీ రమారమి కవుల సమాధి”.

వేలూరి శివరామశాస్త్రి గారి మాటలు శేషేంద్ర కావ్య శైలిని తెలుపుతాయి. “తిలకించండి నేడు ఆవిర్భవించుచున్న పలు తెరగుల కవితలలో గూడా మీ ప్రతిభ ఉజ్వలముగా దీపించుచున్నది మీరు నడిచినను పరిగెత్తినను సొగసుగనేయున్నది
మీ నడకలో పరుగు పరుగులో నడక కానగును”.

వీరేశలింగం కవుల చరిత్ర ప్రథమ భాగమును ముద్రించి మిత్రులకు పంపించి, వారికి రాసిన లేఖల్లో “నా పుస్తకములోని గుణములను శ్లాఘింపవలసిన పనిలేదనియు, నేను దిద్దుకొనుటకవకాశం కలుగుటకై దోషములను మాత్రమే చూపవలసినదని వ్రాసియుంటిని”. అని వంగూరు సుబ్బారావుకు రాయడం వలన కావ్యాన్ని రచించగానే విమర్శ కోసం నలుగురికి పంపించేవారని సాహిత్యంలో విమర్శకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని తెలుసుకోవచ్చు.

గురజాడ “ఒక కావ్యాన్ని చదివి దాన్ని సునిశితంగా పరిశీలించి తూచినట్లు విలువ కట్టాలని” విమర్శ విధానాన్ని పేర్కొన్నాడు. గురజాడ అప్పారావు ఇంగ్లీష్ లో రాసిన సారంగధర పద్యాలను చదివి శ్రీముఖర్జీ “సారంగధర నిజంగా చెప్పుకోదగ్గ కల్పన. కవికి ఎంతో గొప్ప భవిష్యత్తు ఉందని అది ఋజువు చేస్తున్నది…. నిరంతర పఠనం అవసరం, మీరు అన్య భాషలో వ్రాస్తున్నారు గనుక ఆ భాష పై సంపూర్ణ అధికారం మీకు సిద్ధించాలి. గొప్ప గొప్ప కవులు తమ భావాలను ఎలా అభివ్యక్తం చేశారో ఆకళించుకోండి. భావ వ్యక్తీకరణకు తగినంత శబ్దశక్తిని సాధించేవరకు మీ జీనియస్ కు సరిపడే నూతన మార్గాన్ని అన్వేషించే వరకు
మీరు ఇతరులను అనుకరించవలసి ఉంటుంది” అని వ్రాయడం వలన విమర్శయే కాక మహాకవులుగా రాణించడానికి పెద్దవారు ఇచ్చిన సలహాలు, మార్గాలు కూడా కారణాలు అయ్యాయి, అనడానికి లేఖలు ప్రత్యక్ష సాక్ష్యం.
ఈ విధంగా రచనను విమర్శించడమే కాక హితోక్తులు,పూర్వ రచనలు చదవాలని సూచనలనిస్తూ కూడా చెప్పేవారు.

దువ్వూరి రామిరెడ్డి
కృషీవలుడు కావ్యంపై గిడుగు రామ్మూర్తి పంతులు గారి విమర్శ లేఖల వల్ల తెలుస్తుంది “కృషీ వలుడు, జలదాంగన కావ్యాలను సమీక్ష చేయడానికి నాకే అభ్యంతరమూ లేదు వాటిలో నిజమైన కవిత్వం ఉన్నది. కానీ వ్యక్తంగాను వ్యక్తావ్యక్తం గానూ కవి వాడుకలో లేక గ్రంథము నందే నిలిచిన పదాలను ప్రయోగించడము చూచి విచారము కలిగింది” అని వ్యావహారిక భాషను ఉపయోగించనందుకు విచారాన్ని వ్యక్తం చేశాడు.

జి.హెచ్. కజిన్స్ సమదర్శన అను గ్రంథము నందు “భారతీయ భాషా కవిత్రయము అను భాగమునందు రామిరెడ్డిని గురించి వ్రాశాడు. రామిరెడ్డి తన కావ్యాలను ఇంగ్లీషులో “వాయిస్ ఆఫ్ ద రీడ్” గా ప్రకటించడం చూసి కజిన్స్ మెచ్చుకుని
తొలిపలుకలలో మహోన్నతమైన దేశ భాష కవిత్వమునకు ఇది ఆహ్లాదకరమైన అనువాదము అని తన గుణముల మీదనే ఆధారపడి నిలువవలెను అనడం వలన రామిరెడ్డి కావ్యాలకున్న విలువను గుర్తించవచ్చు.

వేదం వెంకటరాయ శాస్త్రి జలదాంగన, కృషీ వలుడు కావ్యాలపై అభిప్రాయాన్ని తెలుపుతూ “వాని యందు కవితాబీజమైన ప్రతిభ నాకు గోచరించినది. శబ్ద సౌష్ఠవ ప్రణవత్వము కూడా నగపడుచున్నది అనడం వలన రామిరెడ్డి కవిత్వంలో శబ్ద సౌందర్యానికి సంబంధించిన ప్రశస్తి తెలుస్తుంది.

సోమ సుందర్ కథలు చదివి తిలక్ తన అభిప్రాయాన్ని లేఖ ద్వారా వ్యక్తం చేస్తూ “కథాకథనంలో గద్యశయ్యా విధానంలో చక్కని కౌశల్యం ఉన్నది. కానీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించుటకు కానీ బలపరచడం గాని నీవు చేసిన ప్రయత్నం ఆ కథా శిల్పంలోని ముఖ్య దోషం” అని విమర్శించాడు.

చలం మిత్రులకు వ్రాసిన లేఖ వలన వర్తమాన కాలంలో కవులపై చలంకు గల అభిప్రాయము వ్యక్తమవుతుంది. మండువ జగ్గారావుకు రాసిన లేఖలో “శరత్ నాయికా నాయకులకు వెన్నెముక లేదు వాళ్ళ ఒళ్లంతా మెత్తని హృదయాలే ఎముకలు లేవు విధికి వెన్నవలె లొంగిపోతారు” అంటాడు.

“శ్రీ శ్రీ ఒక్క ఆర్థిక విధానాన్నే కాక అతని కవిత్వంలో ఇంకా చాలా మార్పుల్ని కోరాడు, కనుక అతని కవిత్వానికి గొప్పతనం పట్టింది.

చలం కోరింది హృదయంలో మార్పు గనుక, అతడు ఎన్ని శతాబ్దాలకి లోక విరోధిగానే ఉండిపోయినాడు ఉండిపోతాడు” అంటూ ఇలా ఇతర కవులపై అభిప్రాయాలే కాక ఆత్మవిమర్శ కూడా కనిపిస్తుంది చలం లేఖలో.

రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి “నాజూకైన సూర్యకాంత తీగెకి మృదువు, ఉజ్వలమైన ఎర్రటి పువ్వులా పూసినట్టుంది ఠాగూర్ కవిత్వం” అని తెలిపాడు.

గురజాడ పై విమర్శ ఇలా ఉంది “తెలుగు రచనల్లో ఆనాడు ఎవరూ సాహసించని పనుల్ని చేశారు ఆయన. అది ఆయనలో విశేషం. ఆయన తిరుగుబాటంతా ఆయన ఆలోచనల్లోనూ రాతల్లోనే కానీ జీవితంలో ఏమీ కనపడదు. ఆయన హృదయం విశాలమైంది. ఆయన ఆనాటి సమాజాని కన్నా రచనా, ఇరుకు పద్ధతుల కన్నా దూరదృష్టితో చూశారు. భాషాభావాల్ని ఇరుకున్న పెట్టే సంకెళ్ళని ఒక్క దెబ్బతో ముక్కలు చేశారు” అని విమర్శతో కూడిన ప్రశస్తి ఉంది.

శివం గారికి రాసిన లేఖలో శివం రచనలపై విమర్శ కనిపిస్తుంది “భగ్నజీవితాలు చదివాను. క్యారెక్టరైజేషన్ సి చ్యుయేషన్ డైలాగ్ బాగున్నాయి. కానీ సాగదీశారు చాలాసేపు పైగా ఆ ఎండింగ్- ఆదర్శం ఇట్లాంటివి ప్రజలకు ఏదో సంతోషాన్నిస్తాయి. థాట్ లో ఇమ్మెచ్యూర్ ఇంకా” అనే అభిప్రాయం తిలక్ వ్యక్తపరిచారు.

‘సంజీవ్ దేవ్’ “అభిమానాలకు కులతత్వాలకు అయోగ్యతలకు విలువ ఇవ్వటానికి చాలా విఖ్యాతి చెంది ఉన్నాయి అకాడమీలు” అని అకాడమీల వ్యవస్థను విమర్శిస్తూనే సమీక్షలు ఎట్లా ఉండాలో వివరిస్తూ “సమీక్షలు ప్రశంసాత్మకంగా ఉంటేనే ఉత్తమమైనవని నేను భావించను కానీ నింద మాత్రమే ప్రధానంగా ఉన్నవే ఉత్తమమైనవి అని కూడా నేను భావించను. అయితే నేను భావించేది మాత్రమే సక్రమమైనదని… నేను భావించనిది అక్రమమైనది కూడా నేను భావించను లెండి” అంటారు. సమీక్షలు
నిర్మొహమాటంగా చేయాలి. ప్రశంసలు విమర్శలు అన్ని సక్రమంగా ఉంటేనే నిజమైన సమీక్ష. ముఖస్తుతి వెగటు ఉండకూడదు.రచనపై చక్కని అవగాహన చేసుకుని ఖచ్చితమైన అభిప్రాయాన్ని సూటిగా వ్యక్తం చేయాలి. విమర్శ అయినా అంతే… రచనను సమగ్రంగా చదివి ఒక అభిప్రాయానికి వచ్చి తూచి విలువ కట్టాలి అప్పుడే విమర్శకు న్యాయం జరుగుతుంది.

రాచమల్లు రామచంద్రారెడ్డి (రా.రా.) లేఖల్లో సాహిత్యానికి సంబంధించిన అంశాలెన్నో చోటుచేసుకున్నాయి. అనువాద విధానాన్ని వివరిస్తూ రా. రా. ఒక భాషలో నుండి వేరే భాషలలోకి అనువాదం చేయాలంటే ఆ భాషపై సంపూర్ణ అధికారం, అవగాహన ఉండాలంటాడు.

మిరియాల రామకృష్ణ రాసిన ‘శ్రీశ్రీ సింబాలిజం’ పై విమర్శిస్తూ “శ్రీశ్రీ గేయాలను ప్రతీకలుగా కాక స్వతహాగానే ఎంతో అర్థవంతంగా చూస్తే మంచిదని, ప్రతీక వాదం పేరుతో శ్రీశ్రీ గేయాలను పొడుపు కథలుగాను, ప్రహేళికలు గాను మార్చకండి” అని నిస్సంకోచంగా లేఖలో తెలిపాడు.

గురజాడను అంచనా వేసే తీరు రా.రా.లేఖల్లో స్పష్టంగా గోచరిస్తుంది. గురజాడ పై విమర్శ చేయాలంటే ఎంతటి అవగాహన ఉండాలో సూచిస్తాడు. గురజాడ మీద అవాకులు చవాకులు పేలే వాళ్ళు అ.ర.సం.లో ప్రముఖులైనారు. అంటూనే “వీరేశలింగం ఎంత గొప్పవాడైనా గొప్ప ఉద్యమకారుడు మాత్రమే గొప్ప సంస్కర్త మాత్రమే. మరి గురజాడ, పోలికే లేనంత గొప్పవాడు. ఆయన రచనలు డైరీలతో సహా చదివితే ఎంత గొప్ప మేధావి అయిందీ, సృజనాత్మక రంగంలో ఎంత మహా రచయిత అయింది, హృదయ పరిపాకం విషయంలో ఎంత మహాపురుషుడు అయింది తెలుస్తుంది అంటాడు.

కాళోజి నా విమర్శకు అర్హుడని ఎంతో ఘనంగా చెప్పుకుంటాడు రా.రా. ఆయనలో ఉన్న ధైర్యం విమర్శనా దృక్పథం లేఖల్లో స్పష్టంగా అవగాహన చేసుకోవడానికి అవకాశముంది.

మల్లారెడ్డికి రా.రా. రాసిన లేఖలో ముప్పాళ్ళ రంగనాయకమ్మ రాసిన విషవృక్షంపై ఘాటైన విమర్శ ఉంది. దానిలో శాస్త్ర దృష్టి ,చారిత్రక దృష్టి చివరికి రొమాంటిక్ దృష్టి కూడా లేదని విమర్శించాడు. అర్థం లేని ద్వేషమూ, కసి తప్ప ఏమీ కనపడవని అన్నాడు. వాల్మీకి శ్లోకాలను ఉల్లేఖించి వక్ర భాష్యం చేయడం, మరి ఇలాంటి విషం మీద మనమేమని విమర్శ రాయాలి? రంగనాయకమ్మకున్న విషదృష్టిని చెడమడా తిట్టకుండా విమర్శ రాయడం సాధ్యం కాదు. అని స్పష్టంగా దూషోక్తంగా, నిర్మొహమాటంగా విమర్శించాడు రా.రా.

రారా సాహిత్య విమర్శకులలో గొప్పవాడని ఆయన లేఖలను బట్టి ఘంటాపథంగా చెప్పవచ్చు.

నార్ల వేంకటేశ్వరరావు లేఖల్లో కొన్ని మాత్రమే సాహిత్యాంశాలు కన్పిస్తున్నాయి. నార్ల రచించిన జాబాలిని హరిహరప్రియ కన్నడం లోకి అనువదించినట్టుగా హరిహరప్రియకు రాసిన లేఖల వలన తెలుస్తుంది. నార్ల తాను పాతకాలం మనిషి అయిన కారణం చేత తన వచనం కూడా పాతదేనని తన శైలిని వివరించాడు. నార్ల గ్రంథాలు మరాఠీ భాషలోకి అనువదింపబడినట్లు లేఖల ద్వారా విదితమవుతుంది. వీరేశలింగంపై వ్రాసిన మోనోగ్రాఫ్ గుజరాతీ భాషలోకి కూడా అనువదింపబడింది. నార్ల రచనల గొప్పతనం తెలుగు వారికే పరిమితం కాలేదన్న విషయం లేఖల ద్వారా స్పష్టమవుతుంది.

కట్టమంచి రామలింగారెడ్డి లేఖల్లో సాహిత్య విషయానికి సంబంధించిన లేఖలే అత్యధికంగా ఉన్నాయి. రాళ్లపల్లి కి వ్రాసిన లేఖల్లో వేమన గురించి సంపూర్ణ అవగాహనతో కూడిన సమగ్ర సమాచారాన్ని,
విలువగల సలహాలను ఇచ్చినట్టు
ద్యోతకమవుతుంది. రాళ్లపల్లికి వ్రాసిన ఒక లేఖలో వి.వి. శర్మ దగ్గరున్న వేమనకు సంబంధించిన విషయాలను తెప్పించుకోమని, వేమన జీవితంపై రాసిన వంగూరి సుబ్బారావు గ్రంథం, క్రిస్టియన్ కాలేజీ మ్యాగజైన్ లో వెలువాడిన వ్యాసం చూడవలసినదని సలహా ఇచ్చాడు.

వావిళ్ళ వారు ముద్రించిన గ్రంథంలో రాళ్లపల్లి రాసిన పీఠికను ప్రస్తుతిస్తూనే ఇంకా న్యాయం జరగలేదని, వేమన గురించి ఇంకా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని విమర్శిస్తూ సూచనలు ఇస్తాడు.

తన “కవిత్వ తత్వవిచారము” రెండో ముద్రణకు నోచుకుంటుందన్న విషయాన్ని లేఖలో తెలిపాడు. “శాలివాహన సప్తశతి” కి రాళ్లపల్లి చేసిన అనువాదాన్ని మెచ్చుకొని, శైలి బాగున్నదని, సహజంగా, ఆకర్షణీయంగా ఉన్నదని, ఇంత మంచిగా ఉన్నందువల్లనే నన్ను పీఠిక రాయటానికి పురికొల్పిందని అంటూ పీఠిక వ్రాయాలన్న ఆసక్తిని కనబరిచాడు. ఈ విధంగా కట్టమంచి లేఖల్లో సాహిత్యాంశాలు గమనించవచ్చును.

ఈ విధంగా లేఖల్లో అరమరికల్లేకుండా నిర్మొహమాటంగా సాహితీవేత్తలు వారి వారి అభిప్రాయాల్ని వ్యక్తం చేయడానికి సావకాశం ఉంది. విమర్శలు, పొగడ్తలు హృదయం విప్పి చెప్పే రహస్యాలు అనేక సాహిత్య విషయ సంబంధులు లేఖల్లో గోచరిస్తాయి.

You may also like

Leave a Comment