Home వ్యాసాలు లేఖాప్రపంచంలో నార్ల

లేఖాప్రపంచంలో నార్ల

by Cheedella Seetha Lakshmi

“పత్రికొక్కటున్న పదివేల సైన్యము

పత్రికొక్కటున్న మిత్రకోటి

ప్రజలకు రక్షలేదు పత్రిక లేనిచో!!

అని నమ్మిన డా.నార్ల వెంకటేశ్వర రావు పత్రిక సైన్యాధ్యక్షునిగా ఆంధ్ర ప్రభ,ఆంధ్ర జ్యోతి పత్రికలలో ఎడిటర్ గా పనిచేసి పత్రికను పైకి తేవడానికి కొత్త ఒరవడిని ప్రవేశపెట్టి కాగడా,జనవాణి పత్రికల్లో  తాపీ ధర్మారావు ప్రారంభించిన వ్యావహారిక భాషా ఉద్యమాన్ని ఆంధ్రప్రభ,ఆంధ్రజ్యోతి పత్రికల ద్వారా సమర్థంగా కొనసాగించిన దిట్ట.

     హేతువాది,రాజ్యసభ సభ్యుడు ,సంపాదకుడు అయిన నార్ల   వెంకటేశ్వర రావు డిసెంబర్ 1 వతేదీ 1908 సంవత్సరంలో లక్ష్మణరావు,మహాలక్ష్మి దంపతులకు మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించాడు. కృష్ణాజిల్లాలో విద్యాభ్యాసం కొనసాగింది.

    మద్దూరి అన్నపూర్ణయ్య ప్రచురించే ” కాంగ్రెస్” పత్రికకు 1928 సంవత్సరం తన 20 సంవత్సరాల వయసులో రాసిన మొదటి ఉత్తరం నార్ల పత్రికారచన వైపుకు దారి తీసింది.  మొదట్లో ఉపేంద్ర,రవీంద్ర పేరుతో స్వరాజ్య,జనవాణి,ప్రజామిత్ర  పత్రికల్లో వ్యాసాలు రాశాడు.

1938 సంవత్సరంలో సులోచనాదేవితో వివాహం జరిగింది.

 1938లో ఆంధ్రప్రభలో న్యూస్ ఎడిటర్ గా చేరి 1942 నుండి 1959 వరకు ఎడిటర్ గా బాధ్యత ను నిర్వహించాడు.

   కేవలం ఒక సంపాదకుడి కోసం  ఆ రోజుల్లో కె.ఎల్.ఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి పత్రిక  1960 జులై 1 వ తేదీ విజయవాడలో ఆవిర్భవించింది.  ఆ సంపాదకుడు నార్ల  వెంకటేశ్వర రావు. ఆయన సంపాదకత్వంలో ఆంధ్రజ్యోతి పత్రిక కొత్త పుంతలు తొక్కింది.నిజాయితీకి,నిర్భీతికి మారుపేరు నార్ల.

    ఎవ్వరికీ భయపడని ఆదరని బెదరని వ్యక్తిత్వం నార్లది.ప్రజలకు అర్ధమయ్యే జీవ భాషలో సంపాదకీయాలను రాశారు. నైజాం ప్రభుత్వం ఆంధ్రప్రభను నిషేధిస్తే రజాకార్ల దురాగతాలపై ఎత్తిన కత్తి దించకుండా కలం కదిలించిన యోధుడు.

   జైల్లో ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య గారు తనకు ఇస్తున్న ఆంధ్రప్రభ దినపత్రిక  నానా కత్తిరింపులతో సెన్సార్ చెయ్యబడి వస్తున్నదేమిటి అని నార్ల వారికి ఉత్తరం రాశారు.తన సంపాదకత్వంలో వస్తున్న పత్రికను ప్రభుత్వం కత్తిరింపులతో రాజకీయ ఖైదీలకు అందిస్తున్నందుకు నిరసనగా ఒకరోజు పత్రిక మొదటి పేజీనిండా నల్లగా తారు పూసి విడుదల చేశాడు.అది పత్రికా ప్రపంచంలో చాలా ఘాటైన నిరసన.దానితో ప్రభుత్వం దిగివచ్చి సెన్సార్ చేయడం మానుకుంది.

   నార్ల స్వతంత్రుడు.ఏ రాజకీయ నాయకుణ్ణి విమర్శించకుండా వదలలేదు.రాజగోపాలచారిని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని 1946లో మహాత్ముడు నిర్ణయించినపుడు దానికి నిరసనగా నార్ల  శరపరంపరగా సంపాదక అస్త్రశస్త్రాలను ప్రయోగించాడు. నచ్చని నాయకుణ్ణి ఎన్నుకోవాలని చెప్పే హక్కు గాంధీజీతో సహా ఎవరికీ లేదు అని తెగేసి చెప్పాడు. ఇందిరాగాంధీ నిరంకుశపాలనను,కుటుంబ వారసత్వ పాలన రాజకీయాలను ద్వేషించాడు.పౌరహక్కులు, మానవ విలువలు కావాలనుకునే వాడు.

    ఆధునిక పత్రికా ప్రపంచాన్ని తన సంపాదకీయాల ద్వారా ఉర్రూతలూగించి, పత్రికకు ప్రాణదీపాలుగా మార్చి, సామాజిక సంస్కరణకు వాహికలుగా మార్చిన ఘనుడు లేఖాప్రపంచాన్ని కూడా పరిపుష్టం చేసిన మహనీయుడు.

నార్ల వారిలో ఎంతో సృజనాత్మక దృక్పథం ఉంది.దానిని మించి విమర్శావలోకనం కూడా ఉంది.సమకాలీన కాలంలో ఎంతో మందికి వ్రాసిన ఉత్తర ప్రత్యుత్తరాల వలన ఆయన విమర్శనా దృక్పథాన్ని అవగాహన చేసుకోవచ్చు.

   బిరుసైన పండితులనుంచి మొదలుపెట్టి ప్రాథమికావస్థలో ఉన్న సాహిత్య ప్రియులవరకు నార్ల స్వయంగా స్వదస్తూరితో లేఖలు రాసి తమ మనోగతాభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు.

   బెంగుళూరు నివాసి అయిన ” హరిహరప్రియ” అని పిలువబడే సాతవల్లి వెంకట విశ్వనాథకు నార్లకు మధ్య  సాహిత్య సంబంధాలున్నాయి.

వయోరీత్యా ఆలోచిస్తే నార్ల హరిహరప్రియ కంటె చాలా పెద్దవాడు.చిన్నవాడైన హరిహరప్రియ వ్రాసిన ఎన్నో ఉత్తరాలకు నార్ల ప్రతిస్పందించి ఎంతో ఓపికగా సమాధానాలిచ్చాడు.అది నిజమైన సాహితీవేత్తకుండే సమ్యక్ దృష్టి.ఈ దృష్టి నార్లలో విశాలంగా ఉంది.

      నార్ల వ్రాసిన ఉత్తరాలను 50కి పైగా జాగ్రత్తగా భద్రపరచి హరిహరప్రియ  ముద్రించి పుస్తకరూపంలో వెలికి తెచ్చాడు.అయితే ఈ ఉత్తరాలన్నీ ఆంగ్లంలో ఉన్నాయి.నార్లకు తెలుగులో ఎంత భావావేశం ఉందో ఆంగ్లంలో కూడా అంతకు రెట్టింపు భావావేశమున్నదని ఈ ఉత్తరాలను లోతుగా దర్శిస్తే తెలిసిపోతుంది.ఉత్తమ విమర్శకునికి ఉండాల్సిన సమ్యక్ దృష్టి ,విశ్లేషణాత్మక, నార్లలో పుష్కలంగా ఉన్నాయి.

     “హరిహరప్రియ” కు రాసిన ఉత్తరాల్లో సాహిత్య విషయాలతో పాటు తన కుటుంబానికి సంబంధించిన అరుదైన విషయాలను ప్రస్తావించాడు. చిన్నవాడైన హరిహరప్రియతో తన ఆరోగ్య విషయాలు చర్చించాడు. విషయాలను ప్రస్తావించేటప్పుడు నిర్మొహమాటంగా చెప్పడం నార్ల వారి ప్రధాన లక్షణం.తనకు నచ్చని విషయాలను కూడా నచ్చిన విషయాలతో కలుపుతూ చురకలంటించిన సందర్భాలు చాలా వున్నాయి.వైజ్ఞానిక వ్యవహారాలు,వైయక్తిక విషయాలు,సమకాలికుల ప్రస్తావన, పుస్తకాల ముద్రణ,పుస్తక వ్యవహారాల ఇచ్చిపుచ్చుకోవడాలు ఇలాంటి వెన్నెన్నో అంశాలు నార్ల లేఖలో ప్రస్తావనకు వచ్చాయి.నార్ల రాసిన లేఖలను హరిహరప్రియ భద్రపరచి ముద్రించాలనుకొన్నప్పుడు హరిహరప్రియ నార్ల అనుమతి కోరాడు.తనపై చూపే అభిమానాన్ని ఒకవైపు మెచ్చుకుంటూనే తన మరణానంతరం లేఖలను ముద్రించవచ్చని నార్ల కోరాడు.ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఏ ఉత్తరంలోనైతే నార్ల

ఈ విషయాన్ని ప్రస్తావించాడో ఆ ఉత్తరమే హరిహరప్రియకు చివరిసారిగా వ్రాసిన ఉత్తరమైంది.

 కవులు,విమర్శకులు క్రాంతదర్శిత్వం కలవారని చెప్పటానికి  ఈ ఉత్తరం ఒక ప్రత్యక్ష తార్కాణం.

     నార్ల లేఖలను భిన్నకోణాలనుండి దర్శించి సమీక్షింపవచ్చు.హరిహరప్రియ కు వ్రాసిన ఉత్తారాల్లో చాలావరకు సమీక్షాత్మక లేఖలే అధికం.సరళమైన ఆంగ్ల పదాలతో భావ వ్యక్తీకరణ చేశాడు పదాల పటాటోపం కోసం ప్రాకులాడినట్లు ఎక్కడా కనిపించదు.పరాయిభాష పట్ల వ్యామోహాన్ని ప్రదర్శించే మనస్తత్వం నార్లలో కనిపించదు.అసలు పదాడంబరం అంటేనే నార్లకు అసహ్యం.ఒకచోట నార్ల పదాలపై నా అధికారం చూడు అనేది నా మట్టుకు కవిత్వం కాదు.నీ గుండెపై నా రాజ్యాన్ని చూడు అని చెప్పగలిగిందే కవిత్వం అని అంటాడు. ఈ వాక్యంలో కవిత్వాన్ని ఎంత ప్రస్ఫుటంగా గాఢంగా నిర్వచించాడో తెలుస్తుంది.

    హరిహరప్రియకు రాసిన ఉత్తరాల్లో నార్ల తన ఆరోగ్యం గురించి అప్పుడప్పుడూ అక్కడక్కడా ప్రస్తావించాడు. ఆ లేఖలను బట్టి జీవితంలో ఎక్కువభాగం అనారోగ్యంతో బాధపడినట్లు తెలుసుకోవచ్చును.

అనారోగ్యం వలన ఆరోగ్యంగా ఉన్న సమయాలలో కూడా అస్వస్థులుగా కనిపించే వారట.

 నార్లలో నిండైన  మానవత్వం తొణికిసలాడుతుంది.గర్వం మచ్చుకైనా కన్పించదు.

తాను గొప్పవాడినని భావించినప్పటికీ అదే మోతాదులో ఇతరుల గొప్పతనాన్ని కూడా గుర్తించే హృదయవైశాల్యం కలవాడు.అందుకే

ఆయన నిండైన మానవతావాది.ఇతరులను గౌరవించడం వలన తమ గౌరవం కూడా పెరుగుతుందన్న విశాల దృక్పథం కలిగినవాడు నార్ల.

        నార్ల రచించిన ” జాబాలి” ని హరిహరప్రియ కన్నడభాషలోకి అనువదించాడు ఆ సందర్భంలో ముగింపు వాక్యాలను గురించి అనువాదకుడు కొన్ని సూచనలు చేశారు. హరిహరప్రియ చేసిన సూచనలను నార్ల అంగీకరించాడు.దీనిని బట్టి ఆయన హృదయవైశాల్యాన్ని అంచనా వేయవచ్చు.” జాబాలి” కన్నడంలోకి అనువదింపబడిన తర్వాత హరిహరప్రియను ప్రశంసిస్తూ నార్ల ఆయనకు లేఖలు రాశాడు. కన్నడ పాఠకులు తన అనువాదగ్రంథాన్ని ఆదరించాలని దీవించాడు.ఆద్య రచయితగా కన్నడంలో ఆ పుస్తకాన్ని ముద్రించిన తర్వాత తనకు రెండు ప్రతులను పంపించమని నార్ల కోరాడు.చూసే వారికి ఈ కోరిక ఎంత చిన్నదైనా నార్ల ఎంత సంతృప్తిపరుడో తెలుస్తుంది.

అచ్చువేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా నార్ల హరిహరప్రియకు సూచించాడు.దీనినిబట్టి ఆయనలోని భావసౌందర్యమే కాదు రస సౌందర్యం,రూప సౌందర్యం కూడా వ్యక్తమౌతుంది.

జాబాలి కావ్యాన్ని కన్నడంలో డా.పుట్టప్ప చదివి తన అభిప్రాయం తెలిపినట్లు రాశాడు ఉత్తరంలో. అలాగే ఒక కాపీని డా.ఆద్య రంగాచార్యకు అందచేయమని చెప్పాడు.

 రామాయణంలోని రెండవ నాటకం సీత జోస్యం ప్రచురణ అయ్యాక నీకు పోస్ట్ చేయిస్తానని రాశాడు. మీ ఇంట్లో అమ్మ నాన్నకు మీ శ్రీమతికి శుభాకాంక్షలు అని రాశాడు.

       కన్నడంలోకి ” జాబాలి” అనువదింపబడిన తర్వాత మైసూరు విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్.వి.యెస్.సుందరం జాబాలిపై వ్యతిరేకాభిప్రాయాన్ని వ్యక్తీకరించాడు.ఆయన వ్యక్తీకరించిన అభిప్రాయాన్ని నార్ల ఒకచోట ప్రస్తావిస్తూ ” సుందరం గారి విజ్ఞతకు ఒకవైపు మెచ్చుకుంటూ చురక వేశాడు. మృదువుగా విమర్శించి మౌనముద్ర దాల్చడం నార్లకు పెట్టని భూషణం.

     రచయితలు పుస్తక రచనలు చేస్తూ తమకు తాము ప్రచురించుకోవడం సరియైనది కాదని నార్ల అభిప్రాయపడ్డాడు.

ఈ విషయాన్ని హరిహరప్రియకు సూచించాడు కూడా.పుస్తకాలను తమకు తామే ప్రచురించుకోవడం వలన అమ్మడం కష్టమవుతుందని తత్ఫలితంగా విపరీతమైన నష్టాన్ని భరించవలసి వస్తుందని నార్ల అభిప్రాయ పడ్డాడు.పుస్తక ముద్రణ విషయంలో ప్రచురణకర్తలు ప్రోత్సహించాలని కూడా హరిహరప్రియకు సూచించాడు.

     నార్ల భౌతిక జగత్తుకు చెందిన మనిషి. ఆయన ఉత్తరాల్లో ఎక్కడా మర్మవాదపు ఛాయలు గోచరించవు.ఆధ్యాత్మిక బోధలు అసలు రుచించవు. ఉత్తరాలను విశ్లేషిస్తే సామాన్యమానవుని జీవితానికి  సంబంధించిన నమ్మశక్యంగాని రాయిలాంటి వాస్తవాలు బయటపడతాయి.అది ఆయన ఉత్తరాలలోని ప్రత్యేకత అంతేగాని ఊహాలోకాల్లో తేలిపోవడం అసలే నచ్చదు.

    నార్ల చక్కని కుటుంబ జీవి.సాంసారిక సుఖాలను స్వర్గంలా భావించిన విశాల హృదయుడు. ఒక్కొక్కసారి తమ పిల్లల గురించి గొప్పలు చెప్పుకుంటూ నా సంతానమే నా సౌభాగ్యం అని పరవశించిపోతూ ఉండేవాడు.

   నార్ల వారి ఉత్తరాల్లో హాస్య చమత్కారాలు మబ్బుచాటున మెరుపుతీగల్లా మెరిసిపోతుంటాయి.

ఐదుగురు కొడుకులు ,కోడళ్ళు,ముగ్గురు కూతుళ్లు, అల్లుళ్లు డాక్టర్లు.అందరూ విదేశాల్లోనే. ఒక కూతురు అల్లుడు మాత్రం ఇక్కడున్నారు మరి నాకేమో రెండు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. మా కుటుంబంలో నా భార్య తప్ప మిగతా వారంతా డాక్టర్లే.ఆమెకు కూడా ఏ విశ్వవిద్యాలయమైనా గౌరవ డాక్టరేట్ ఇస్తే బాగుంటుంది.అప్పుడు మాఇంట్లో అందరూ డాక్టర్లే అవుతారు.ఇంతమంది డాక్టరులున్నా నేనెప్పుడూ పేషేంట్ నే.తలనుంచి కాలుదాకా నేనో రోగాల పుట్టని”. నార్లవారి అరుదైన చమత్కారానికి ఈ ఉత్తరం నిదర్శనం. ఇప్పటి లాగా డబ్బులిచ్చి కొనుక్కునే దొంగ డాక్టర్ డిగ్రీలు ఆనాడు లేవు మరి.

 నార్ల ఉత్తరాల్లో ఒకచోట తన వచనశైలికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది తాను పాతకాలపు మనిషి అయిన కారణంచేత తన వచనం కూడా పాతదేనని తెగేసి చెప్పాడు. పత్రికారంగంలో ఆంధ్రజ్యోతి సంపాదకునిగా గణనీయమైన స్థానాన్ని సంపాదించిన నార్ల

ఏ పరిస్థితుల్లో దాన్ని వదులుకోవలసి వచ్చిందో హరిహరప్రియకు లేఖద్వారా తెలియచేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.పత్రికాస్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న యాజమాన్యంపై నార్ల విరుచుకు పడ్డ సందర్భాలెన్నో ఉన్నాయి.

       సమకాలీన సాహిత్యాన్ని అధ్యయనం చేయడం నార్లవారికి ఉన్న చక్కని అలవాటు ” తెలుగు విద్యార్థి” వంటి పత్రికలను క్రమం తప్పకుండా చదివి యువరచయితలను అర్థం చేసుకుంటానని హరిహరప్రియకు నార్ల మాట ఇచ్చాడు.ఇతరులు రాసిన ఉత్తరాలకు ప్రత్యుత్తరాలు రాసినపుడు ఆలస్యం జరిగినపుడు క్షమార్పణ చెప్పే మనస్తత్వం కలిగిన వ్యక్తి నార్ల.హరిహరప్రియకు ఎన్నో సందర్భాల్లో క్షమార్పణ చెప్పి తన వ్యక్తిత్వాన్ని పెంచుకున్నాడు.

      మిత్రులతో కలిసి భోజనం చేయడమంటే నార్లకు చాలా ఇష్టం.అది ఆయన సంస్కారాన్ని తెలియచేసే విషయం.ఎంతో సంయమనంతో సమకాలికులతో జీవితాన్ని పంచుకోవాలన్న మనస్తత్వం నార్లది.తాను మైసూరు,బెంగుళూరు నగరాలకు వెళ్లినప్పుడు హరిహరప్రియ ఆతిథ్యాన్ని మెచ్చుకుంటూ నార్ల ప్రశంసల వర్షం కురిపించాడు.

   నార్ల వ్యక్తిత్వాన్ని తలపింపజేసే ఎన్నో విషయాలు హరిహరప్రియ రాసిన లేఖలో ప్రస్తావనకు వచ్చాయి.ఒక ఉత్తరంలో నార్లను హరిహరప్రియ డా.నార్ల అని సంబోధించాడు. అలా సంబోధించడం వల్ల తన వ్యక్తిత్వం అంతగా పెరగదని నార్లకి, డా.నార్లకి అంత వ్యత్యాసం కనిపించడంలేదని మృదువుగా త్రోసిపుచ్చి భవిష్యత్తులో  అలాంటి సంబోధనలు అక్కరలేదని సూచించాడు.అనవసర ఆడంబరాలకోసం ప్రాకులాడడం నార్లకు గిట్టదని ఈ లేఖ ద్వారా విదితమౌతుంది.

      నార్ల వ్రాసిన కొన్ని గ్రంథాలు మరాఠీ భాషలోనికి కూడా అనువదించబడ్డాయి.

వీరేశలింగంపై

రాసిన మోనోగ్రాఫ్ గుజరాతీ భాషలో కూడా అనువదించబడింది.ఆయన రచనల గొప్పతనం తెలుగువారికే పరిమితం కాకుండా సమస్త భారతీయులు సైతం అవగాహన చేసుకొనే స్థితికి దిగారు.

  నార్లకు సమకాలీన సమస్యలపై చక్కని అవగాహన ఉంది.తన కూతురు వివాహ విషయంలో తాను స్వయంగా కలుగజేసుకొని తన అల్లుడికి వరకట్నం ఇవ్వ ప్రయత్నించినప్పటికీ ఆయన కట్నంలేకుండా  పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది.ఈ విషయాన్ని హరిహరప్రియతో ప్రస్తావించి ఎంతో మురిసిపోయాడు.సమకాలీన కాలంనాటి వరకట్న సమస్యకు భిన్నంగా తాను మంచిబుద్ధి కలిగిన అల్లుడి ద్వారా అధిగమించానన్న ఆనందాన్ని నార్ల పొందినట్లున్నాడు.

  ఇలా నార్ల వారి ఉత్తరాలను విశ్లేషించుకుంటూపోతే ఎన్నో అంశాలు బయట పడ్తాయి. కుటుంబ విషయాలు,మిత్రుల విషయాలు,రచనలకు సంబంధించిన విషయాలు,సాహిత్య విమర్శలు, సమకాలీన సమస్యలపై చర్చలు మొదలగు అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.ఇద్దరు వ్యక్తుల మధ్య సాగిన ఈ లేఖలవల్ల సమకాలీన సమాజానికి పనికి వచ్చే ఎన్నో విషయాలు నిక్షిప్తమై ఉండడం వల్ల సాహితీజగత్తుకు ఈ లేఖలు చక్కని సందేశాన్ని అందించినట్లు తెలుస్తుంది.

   సంపాదకీయ వ్యాసాలు,సమకాలీన రాజకీయ పరిస్థితులను ఏ రకంగా శాసించాయో

లేఖాప్రపంచంలోని లేఖలు కూడా సమకాలీన సాహిత్యాంశాలను ఎన్నింటినో ఎత్తి చూపుతూ ఉత్తమ విమర్శకు చక్కని ఉదాహరణలుగా మిగిలిపోయాయి.

 నార్ల వెంకటేశ్వర రావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూ అనేక ప్రక్రియల్లో రచనలు చేశాడు. నవయుగాల బాట నార్ల మాట  అనే మకుటంతో  700 పైగా సందేశాత్మకంగా ఆట వెలది పద్యాలు,బాలలకోసం నీతి పద్యాలు,16 ఏకాంకికల సంపుటి,సాంఘిక,పౌరాణిక నాటకాలు,వ్యాసాలు మొదలైనవి ఎన్నో రాశాడు. ఏది రాసినా సామాజిక ప్రయోజనమే.

ఇంగిలీషులో భగవద్గీతపై విమర్శనాత్మక రచన చేయగా అది పలు విదేశీ జర్నల్స్ లో  ప్రచురితమైంది.

నార్ల ఎన్నో కొత్తమాటలు,పదబంధాలు సృష్టించాడు.మాండలికానికి పెద్దపీట వేశాడు.భాషాపరమైన అంశాలలో  ప్రయోగాలు ఆయన సొత్తు.  ఆయన ఒక కదిలే  విజ్ఞాన బాండాగారం.

   ప్రశ్న ప్రగతికి మూలం.ప్రశ్నలేని జగత్తు ప్రశ్నార్థకం అని అంటాడు.

   ” తెలుగులో ఆలోచించి, తెలుగు నుడికారంలో తెలుగుదనం ఉట్టిపడేటట్టు రాయగలిగినప్పుడే తెలుగువారిలో మనం కదలిక పుట్టించగలం” అని ఆనాడే తోటి జర్నలిస్టులకు ఉద్బోధించాడు. నిజాయితీగా,నిర్భీతిగా ఉండాలని కోరే మేటి పాత్రికేయుడు నార్ల.

     1981లో “సీత జోస్యం” నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందాడు.1983లో ఎన్. టి. రామారావు    ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక నార్లను సాంస్కృతిక వ్యవహారాల సలహాదారునిగా నియమించారు.

   నిజాయితీయే  ఆయుధమై స్వేచ్ఛగా జీవితాన్ని గడిపి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించి, కొన్ని దశాబ్దాల పాటు పత్రికారంగాన్ని శాసించి,పఠితలను ఉర్రూతలూగించిన  డా. నార్ల వెంకటేశ్వర రావు  1985 సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన . నార్ల  స్వర్గస్తులయ్యారన్న వార్త పత్రికారంగానికి  శరాఘాతంగా,తీరని లోటుగా మిగిలింది.

——————————-

డా.చీదెళ్ళ సీతాలక్ష్మి

విశ్రాంత సహాయాచార్యులు

హైదరాబాద్

You may also like

Leave a Comment