Home వ్యాసాలు లేఖా స్వరూపం

లేఖా స్వరూపం

by Cheedella Seetha Lakshmi

లేఖా స్వరూపం
————————–
‘లిఖ్’ ధాతువునుండి లేఖ ఉద్భవించింది అనుకుంటే ‘లిఖ్’ అంటే వ్రాయడం అని అర్థం.ఏది రాసినా లేఖ అవుతుందా? ఎట్లా రాసిన లేఖ అవుతుందా? అంటే కాదు. దానికి కొన్ని నియమ నిబంధనలున్నాయి.

పూర్వకాలంలో ఒక విషయాన్ని ఇతరులకు తెలియజేయాలంటే మనిషి చేత కబురు పంపేవారు.అప్పుడు ఈ తపాలా సౌకర్యం గాని,వాహన సౌకర్యం గాని లేవు.కాబట్టి వారికి నమ్మకమైన మనిషితోనే సమాచారాన్ని తెలియనంపేవారు.ఒకరి అభిప్రాయం మరొకరికి తెలియజేయడానికి కేవలం మానవులే కాక రాయబారం నడపడానికి హంసలు,చిలుకలు,
పావురాలు కూడా వాటివంతు కార్యాన్ని నిర్వహించాయని చెప్పడానికి గ్రంథాలే సాక్ష్యం. కాలక్రమంలో అనేక సదుపాయాలు, 1954 సంవత్సరంలో మన దేశంలో పోస్టల్ వ్యవస్థ
సమకూరాక ఉత్తర ప్రత్యుత్తరాలు విరివిగా
కొనసాగుతున్నాయి.

లేఖ నిర్వచనం

లేఖ అనగా “ప్రత్యక్షంగా లేని మనిషికి పరోక్షంగా
తన మనోగత అభిప్రాయాన్ని వ్రాసి పంపడం లేదా తెల్పడం” అని నిర్వచనం చెప్పుకోవచ్చు. ఒక విధంగా లేఖ ఆత్మకథా రచనకు సంబంధించిందే అని చెప్పాలి.

చారిత్రిక ఆధారాలు పరిశీలిస్తే రాజ్యాంగపరమైన లేఖలను శాసనాలు తయారు చేయడంలోని విధానాలను తెలియచెప్పే అంశంలో
చాణుక్యుడు తన అర్థశాస్త్ర గ్రంధంలో
లేఖా లక్షణాన్ని విపులంగా వివరించాడు
” రాజుగారి ఆజ్ఞను జాగ్రత్తగా విని ఆ ఆజ్ఞ లోతుపాతులను, పూర్వాపరాలను,లక్ష్యాన్ని చక్కగా గ్రహించి సంక్షిప్తంగా రాయడానికి పూనుకొనవలెను. అన్య దేశపు రాజునకు ఉత్తరం వ్రాయునప్పుడు మర్యాదకరమైన భాషచే అతని రాజ్యమును,అతని సంపదను,వంశ క్రమమును,అతని పేరు ప్రస్తావించవలెను. లేఖను సర్వసామాన్యము,గౌరవనీయుడయిన
వ్యక్తికి వ్రాయునప్పుడు
అతని దేశమును,
పేరును మర్యాద వాచకములతో జోడించవలెను.
ఎవరికి ఆజ్ఞ జారీ చేయబడునో,అతని వంశము,కులము,
సంఘంలో అతని స్థానము,వయస్సు,
విద్యాప్రమాణం, వృత్తి
ఆస్తిపాస్తులు,
గుణగణాలు,
రక్తసంబంధం మొదలగువన్ని లేఖ ప్రారంభంలో సంబోధనా పద్ధతిలో వ్రాసి,కాలాన్ని,స్థలాన్ని తెలియపరుస్తూ ఆజ్ఞ
లేక ఉత్తరం ఎవరికి వ్రాయబడుచున్నదో
అతని హుందాకు తగిన స్వరూపములో
రాజుగారి భావము స్ఫుటముగా అవగాహన అగునట్లు లేఖకుడు లిఖించవలెను.
ఉన్నత స్థాయిలో గంభీరమైన సులభశైలిలో ,
స్వచ్ఛంగా,
అరమరికలు లేకుండా రాజుగారి అభిలాషను,ఎదుటి
వారి కర్తవ్యమును ఖచ్చితంగా ప్రదర్శించెడి మృదువైన భాషను ,పదజాలాన్ని ప్రయోగించి లిఖించడమే రాజ శాసనాల్లోని ప్రత్యేకతలు. విషయాలను,సమస్యలను వాటి అవసరాన్ని బట్టి ఒక క్రమ పద్ధతిలో రచింపవలెను.అభిప్రాయమును సూటిగా ఎదుటివాని హృదయమునకు తగులునట్లు సమస్యలకు సంబంధించిన కారణాలు,
ఉదాహరణలు అవసరమైతే చిత్ర పటాలతో సహా స్పుటమైన పలుచని గానటువంటి పదములను అవసరమైన చోట వాడవలెను. తృప్తికరమైన ఫలితాన్ని లభించునట్లు మిక్కిలి సొగసైన విధంగా భావమునకు తగిన పదములనుపయోగింపవలెను.”
రాజ్యాంగపరమైన అంశానికి సంబంధించినదైనా లేఖా లక్షణాన్ని ఎంతో చక్కగా వివరించాడు కౌటిల్యుడు.
ఉత్తరం రాసేటప్పుడు సంబోధన,స్థలము,
కాలము మొదలైనవి సూచించాలని చెప్తూ అభిప్రాయాన్ని సూటిగా ఎదుటివాని హృదయానికి తగిలేట్లుగా వ్యక్తం చేయాలని చెప్పాడు.
లేఖా స్వరూపాన్ని వివరిస్తూ లేఖల్లో వ్రాసే
భాష కూడా భావానికి తగిన పదాలను వాడి
సులువుగా అర్థం చేసుకునే విధంగా వుండాలన్నాడు. విషయాన్ని బట్టి పేరా విభాగాన్ని కూడా సూచించడం ఈ లేఖలో వివరింపబడింది. ఈ లక్షణాలన్ని నేటి లేఖా స్వరూపాన్ని వివరించడం చూస్తున్నాం.

మడికి సింగన్న తన”సకలనీతి సమ్మతం” లో లేఖ గురించి చెబుతూ “ఎవరిదగ్గరి నుండి వచ్చినా సరే అనాదరణ చేయక లేఖను పరిశీలించినట్లయితే సకల విషయాలు తెలుసుకోవచ్చునంటాడు.అంటే లేఖ వలన రహస్యాలు తెలిసే అవకాశం ఉంది.

ఏ నిఘంటువులో కూడా లేఖకు సరి అయిన నిర్వచనం ఇవ్వలేదు.”ఆంధ్ర వాచస్పత్యము” నిఘంటువులో లేఖ అనగా “రేఖ,లిపి,వ్రాత,కమ్మ,చీటి,జాబు,లెటరు, ఇచ్చిపుచ్చుకోలు పత్రము,ఉత్తరము అనే అర్థాలున్నాయి.

బ్రౌన్ ఇలా చెప్పాడు.

A letter of correspondence. Also a post mail of a letter bag – a Reply – అని నిర్వచించాడు.

‘బ్రిటానియా ఎన్ సైక్లోపీడియా’ లో లెటర్ ” A written or printed communication from one person to another. especially
a message longer than a note, an epistle”
అని నిర్వచించబడింది.
ఎన్ సైక్లోపీడియా-USAలో
letter గురించి నిర్వచిస్తూ “A communication in
writing or printing
addressed to a person or no.of
persons” అని వుంది.

“లేఖ ఒక హృదయం నుండి సుఖదుఃఖాలను రెండో
హృదయానికి అందించే అనాసక్త దూత” అని దోనేపూడి రాజారావు అన్నారు.

ఒక ప్రసిద్ధ ఉర్దూకవి లెటర్ గురించి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ ఈ విధంగా అన్నాడు.
” ఆద్మీ పెహచానా జాతాహై
సియాఫా దేఖ్ కర్
ఖద్ కా మజ్మూ
భాక్ లేతేహై లిఫాఫా దేఖ్ కర్”
మనిషి ముఖం చూడగానే వాడి తత్వాన్ని తెలుసుకున్నట్లు ఉత్తరాన్ని చూడగానే ఎవరు ఎక్కడి నుండి
వ్రాశారు అన్న విషయాన్ని
తెలుసుకోవచ్చును.
సంజీవదేవ్” ఉత్తరాలు కేవలం పాఠ్యగ్రంథాల్లోని పాఠాలలాగా భోగట్టా ప్రధానంగా మాత్రమే ఉంటే ఎండుగా,నీరసంగా వుంటవి.వ్యక్తిగత విశేషాలుంటేనే అపరోక్షంగా కాక పరోక్షంగా ఇన్ఫర్మేషన్ అందజేయబడుతూండాలి కదూ! వినోదం కూడా విజ్ఞానం” అని అంటాడు.
ఉత్తరం ఎట్లుండాలో చలం రాసిన “ప్రేమ లేఖలు” లో ఇలా” చక్కని లేఖలు రాయాలంటే,అందులో వాజ్మయంలో విలువగల లేఖ రాయాలంటే ఎంత సంస్కారం,ఎంత విశాలమైన విద్య,జ్ఞానం,ఆత్మ ఔన్నత్యం వుండాలి” అనడంలో ఉత్తరం ఎట్లా ఉంటే బాగుంటుందో చక్కగా వివరించాడు.

లేఖకు చాలా పేర్లున్నాయి. ఉత్తరం,కమ్మ,లెటర్,
చీటీ,జాబు,కబురు.
పూర్వకాలంలో తాటాకు పైన రాసేవారు కాబట్టి కమ్మ అన్నారు.కమ్మ అంటే తాటాకు అని అర్థం. ఉత్తరం దక్షిణానికి వ్యతిరేకం.శ్రేష్టమైనది అని అర్థం.బదులివ్వడం అనే అర్థంలో ఉత్తరం,జవాబు,జాబు అని వాడారు.కబురందిందా,జాబు రాశాడా అని వాడుతుంటాం.అడిగిన విషయానికి సమాచారం వ్రాసి పంపడం,జవాబు వ్రాయడం కాబట్టి జవాబే జాబు గా మారింది.ఖబర్ అనేది ఉర్దూ పదం.ఖబర్ అంటే వార్త ఉర్దూ ప్రభావంచేత ఖబరే కబురుగా మారింది. కవర్ లోపల రహస్య విషయాలుండడం వల్ల కవర్ అందిందా అనే మాటను వాడుతారు. లెటర్ ఆంగ్ల పదం ఈ రకంగా వ్యవహారంలో లేఖ పలు నామాలతో వున్నప్పటికీ ఇవన్నీ లేఖకు పర్యాయ పదాలే అనొచ్చు.

పలువురు విజ్ఞుల అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత తేలిన అంశమేమిటంటే లేఖ అంటే వార్త పంపడం లేదా ఒక విషయాన్ని అభివ్యక్తం చేయడం,మనసులో ఉన్న అభిప్రాయాన్ని రెండో హృదయానికి అందించే అనాసక్త దూత అని తెలుస్తుంది.దాపరికం లేకుండా ఎదుటివారికి తన మనసులో అంశాలను స్వేచ్ఛగా వెల్లడించేవి లేఖలు. ప్రత్యక్షంగా లేని మనిషికి పరోక్షంగా మనోగత అభిప్రాయాన్ని రాసి పంపడమే లేఖ.

లేఖా పద్ధతులు

లేఖ రాయడంలో కొన్ని పద్ధతులున్నాయి.
పూర్వకాలంలో రాజులకు వ్రాసేటప్పుడు శ్రీ మన్మహారాజ,
గండభేరుండ అంటూ వారి బిరుదులతో సంబోధించేవారు.
పెద్దలకు వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి,బ్రాహ్మణులకు గోత్రం,వంశం మొదలైన వాటితో సంబోధించి వ్రాసేవారు.పురుషులకు బ్రహ్మశ్రీ,వేద మూర్తులయిన అని పునిస్త్రీలకు శ్రీ మహాలక్ష్మీ సమానులైన అని విధవలకు గంగా భాగీరథీ సమానులైన అని సంబోధించేవారు.
నాడు,నేడు చిన్నవారిని ‘చిరంజీవి’ అని సంబోధించడం పరిపాటి. పెద్దలకు వారి వారి బిరుదనామాలతో
వరుసతో గౌరవంగా పాదపద్మాలకు నమస్కారమని ఎంతో మర్యాదగా ఉత్తరాలు వ్రాసేవారు.

అధునాతన కాలంలో ఎన్నో కొత్త పద్ధతులతో కొత్త సంప్రదాయ రీతిలో నూతనత్వాన్ని సంతరించుకుని విరాజిల్లుతోంది నేటి లేఖ.
ఇప్పుడు సామాన్యంగా ఒకే విధమైన లేఖలు వస్తున్నాయి.సంబోధన అప్పటి వలె దీర్ఘంగా, బిరుదనామాలతో లేకుండా చిన్న చిన్న సంబోధనలతో లేఖలు వ్రాయడం జరుగుతుంది.
ఆ కాలంలో ఉత్తరం చివర తేదీ రాసేవారు.ఇప్పుడు కుడి చేతి వైపు తేదీ, వ్రాసేవారి చిరునామా, ఎడమ వైపు ఎవరికి వ్రాస్తారో వారిని సంబోధిస్తూ ఉత్తరాలు వ్రాస్తున్నారు.ఇది పాశ్చాత్య పద్ధతి.
అంటే లెటర్ చూడగానే ఎవరు ఎవరికి,ఏ రోజు రాసారో తెలియచెప్పడం నేటి పద్ధతి.తరువాత విషయవివరణ,చివరికి ముగింపు ఉంటుంది.

ఈ శతాబ్ద ప్రారంభం లో సాహిత్య పత్రికలలో లేఖాసాహిత్యం బాగా సాగింది.
పత్రికలలో అనేక విషయాలుంటాయి.
వాటికి సంబంధించిన ఉత్తరాలు కూడా పాఠకులు వారి అభిప్రాయాలను సంపాదకులకు తెలియచేస్తారు.
ఆ కాలంలో లేఖలు లేని పత్రికలు లేవనడం నిర్వివాదాంశం.పత్రికలే కాక రేడియో లోనూ,టీవీ లోనూ కూడా ఉత్తరాలకు ప్రత్యేక స్థానముంది.
వ్యాసము,కథానిక,
నవల మొదలైన వివిధ ప్రక్రియలపై పాశ్చాత్య ప్రభావమున్నట్లే లేఖా రచనలో కూడా పాశ్చాత్య ప్రభావం కనిపిస్తుంది.జాతీయ,అంతర్జాతీయ రీతిలో ఎన్నో లేఖలు ఇప్పటికీ వస్తున్నాయి.
ఏ విషయం తెల్పడానికైనా లెటర్ అత్యవసర సాధనంగా,మనిషి జీవితంలో ఒక అంతర్భాగంగా స్థానమేర్పరుచుకుంది.
విషయాలు తెలుసుకోవడం,తెలియ చెప్పడం లేఖల పరమ ఉద్దేశ్యం.
క్షేమ సమాచారాలు మొదలుకుని నిత్యజీవితంలో ఎన్నో విషయాలకు సంబంధించిన అంశాలకే కాక రాజకీయంగానూ,
సాంఘికంగా పలు కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లోనూ లేఖలు ప్రముఖ ప్రయోజనాన్నే
అందిస్తున్నాయి.
కొందరు దినచర్యలో ఒక భాగంగా లేఖలు వ్రాయడం,చదవడం
కూడా చేస్తారు.ఈ విధంగా లేఖలకున్న విలువ అపారం.

లేఖల్లో సాంఘీక,రాజకీయ,
ఆర్ధిక,తాత్విక మొదలైన ఎన్నో విషయాలు వారి వారి అభిప్రాయాలు ప్రస్ఫుటమవుతాయి.కొందరు బయటికి బాహాటంగా చెప్పలేని విషయాలను వారి ప్రియమిత్రులకో,లేక వారి ముఖ్యులకో అనేక విషయాలను వెల్లడిస్తారు.దీని వలన
వారి వివేచనాశక్తిని తెలుసుకోవచ్చును.
అంతేకాక లేఖల్లో ఎన్నో సాహిత్యాంశాలు కన్పిస్తాయి.అందు
వలన సాహిత్యములో లేఖలకు ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చును.
భాషా విషయకంగా గానీ,వస్తు విషయకంగా గానీ,లేఖలు కొన్ని ప్రపంచ సాహిత్యంలో అగ్రశ్రేణి
నాక్రమించాయి.

“టెలిఫోన్ పుట్టకముందు సమాచార వాహికలు లేఖలే.ఆ లేఖల్లో వ్యక్తి గతాంశాలుండొచ్చు.
సమకాలీన,సామాజిక,సాంస్కృతిక,సాహిత్య సంబంధి వివిధ విషయాలుండొచ్చు.
విద్వాంసులు,
రచయితలు,
కళాకారులు పరస్పరం రాసుకునే లేఖావళి సాహిత్య శ్రేణుల్లోకే వస్తుంది.అయితే ఆయా లేఖల అర్హతను బట్టి అంచనా వేసుకోవాలి”అని అంటారు ఆచార్య సి. నారాయణ రెడ్డి గారు.

లేఖాసాహిత్యం పూర్వరంగం
————————

మనకు తెలిసినంత వరకు ప్రపంచంలో వెలువడిన మొట్టమొదటి లేఖ ఆచార్య నాగార్జునుడు రాసిన”సుహృల్లేఖ” తన మిత్రుడైన యజ్ఞశ్రీ శాతకర్ణికి ప్రాకృతభాషలో రాయబడింది.
సంస్కృత సాహిత్యంలో కూడా అక్కడక్కడా లేఖలు కన్పిస్తాయి.మహాకవి కాళిదాసు రాసిన “అభిజ్ఞాన శాకుంతలం”లో తామరాకుపై గోటితో శకుంతల తన భర్తకు లేఖ రాసినట్లు తెలుస్తుంది. సంస్కృత ప్రబోధచంద్రోదయంలో ద్వితీయాంకంలో మహామోహునికి మదనుడు పంపిన లేఖ వచనంలో ఉంది.
ప్రాచీన తెలుగు సాహిత్యంలో కూడా లేఖలు కన్పిస్తాయి. పింగళి సూరన “ప్రభావతీ
ప్రద్యుమ్నమ్” కావ్యంలో తృతీయాశ్వాసంలో ప్రద్యుముని ఉత్తరం వుంది.
ప్రాచీన కావ్యాల్లో అక్కడక్కడా లేఖలు దర్శనమిచ్చినప్పటికీ ఆధునిక తెలుగు సాహిత్యంలో లేఖలకు ప్రముఖ స్థానముంది.
కావ్య గమనానికి దారితీయడానికి లేఖలు మంచి ఉపయోగకారి.ఆధునిక సాహిత్యంలో నవల,కథల్లో ఉత్తరాలను బాగానే ఉపయోగించుకున్నారుకేవలం లేఖాత్మకమైన సాహిత్యం వెలువడడం విశేషం.

గోపీచంద్ రచించిన “పోస్టు చేయని ఉత్తరాలు” “ఉభయ కుశలోపరి” ,తిరుపతి వెంకటేశ్వరకవి రచించిన” గీరతం” తెలంగాణా తీరు తెన్నులు’,బోయిభీమన్న రాసిన” జానపదుని జాబులు” ,మిత్తింటి మందేశ్వరరావు గారి “లేఖా ప్రబంధం”,
చలం “ప్రేమ లేఖలు”,కె.యల్.
నరసింహారావు రాసిన”నాన్నకు జాబులు”, గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన “ప్రేమ లేఖలు”,మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ‘దూరం” మొదలైన రచనలు లేఖాత్మకమైనవిగా వెలువడ్డాయంటే సాహిత్యంలో లేఖకు గల ప్రాధానత తెలుస్తుంది.

ప్రముఖ సాహితీ వేత్తలకు సంబంధించిన ఉత్తరాలు పుస్తక రూపంలో వెలువడడం విశేషం.లేఖల్లో మనోగతాభిప్రాయలే కాక ప్రముఖ సాహితీవేత్తల వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు.

” వ్యక్తిగత పరిధిని దాటినప్పుడు లేఖలకు సామాజిక విలువలు ఏర్పడి ఆ లేఖలు మొత్తం సమాజంలోని వ్యక్తులందరికీ చెందుతాయి.అందుకే ఇటువంటి లేఖలను ప్రచురించడం జరుగుతుంది.
ఈ లేఖలకున్న చారిత్రక,రాజకీయ,
సాంఘిక,సాంస్కృతిక విలువలు వాటిని వ్యక్తిగతం నుండి సాధారణం చేస్తాయి.అవి మనందరి సొత్తు అవుతుంది” అంటారు డా.డి.చంద్రశేఖర రెడ్డి.

ఒక్క మాటలో చెప్పాలంటే లేఖల్లో స్పృశించని,ప్రస్తావించని అంశాలే లేవు.సాంఘికోద్యమాలు,సాంప్రదాయ విలువల పునరుద్ధరణ,రాజకీయఆర్థిక విషయాల ప్రస్తావన,పరదేశీయుల సాహిత్యం,వారి విమర్శలు మొదలైన విషయాలెన్నో చోటు చేసుకున్నాయి.
అన్ని రంగాలను తనలో కలుపుకున్నా సాహిత్య పరంగా ప్రాధాన్యత కలిగిన లేఖలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేకతను చాటుకున్నాయి.
విమర్శ రంగానికి కూడా లేఖలు దోహదం చేశాయంటే అతిశయోక్తి కాదు.

ఆంగ్ల సాహిత్యంలో లేఖారచనమొక ప్రక్రియ.కవులు రాసిన లేఖలను సేకరించి గ్రంథంగా ప్రకటించడమనే పద్ధతి ఆ భాషలో ఉంది.

నేటి ఆధునిక కాలంలో మారిన లేఖల స్థితి

మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించి ప్రపంచాన్నంతా “గ్లోబాల్ విలేజ్’ గా మార్చేశాడు.కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఆధునిక జీవన విధానాన్నే అనూహ్యంగా మార్చి వేశాయి.ప్రపంచంలో ఏ మూలకున్నా ఒకటి,రెండు క్షణాల్లో మాట్లాడుకోగలుగుతున్నాం.
ఇది హర్షించదగిన పరిణామమే అయినా ఒకప్పటి మధుర భావాలు,గతస్మృతులుఅనుబంధాలు,ఆత్మీయతలు,ఇవాళ మనిషి కోల్పోతున్నాడు.
మానవ సంబంధాలు కృత్రిమంగా,స్వార్థంగా మారిపోతున్నాయి.ఈ ఎలక్ట్రానిక్ యుగంలో మనిషి ఎంతో అభివృద్ధి పథంలో పయనించినా మానవ సంబంధాలు తీవ్రంగా దెబ్బ తింటున్నాయి.ఎదుటి వ్యక్తితో మాట్లాడే తీరుబాటు లేకుండా పోతుంది. ఒకప్పుడు ఒక లేఖ కోసం ఒక మిత్రునిదో,ప్రియునిదో,ప్రియురాలిదో,అన్నదో,చెల్లిదో,తండ్రిదో – ఇలా రకరకాలుగా మనవాళ్ళు రాసే ఉత్తరం కోసం ఎదురుచూస్తూ వుండేవాళ్ళం.ఆ ఎదురు చూపుల్లో ఎంతటి మధురానుభూతి,ఎంత తీయని ఆత్మీయత,అనుబంధాలు దాగి ఉన్నాయో మాటల్లో చెప్పలేం.
ఒక లేఖ మనిషికి మనిషికి మధ్య మానసిక బంధాన్ని పెంచుతుంది.అందు
లోని తీయని మాటలు మనిషికి ఊరటనిస్తాయి.
ఆ మనిషి మన గురించి ఆలోచిస్తున్న తీరును భద్రంగా మనసుల్లో అలాగే పట్టి ఉంచుతాయి.ఇదంతా లేఖల గొప్పతనం.చరవాణి,అంతర్జాలం మహిమ వల్ల నేడు వ్యక్తిగత లేఖలు,సాహిత్యపరమైన లేఖలు బాగా తగ్గిపోయాయి అని చెప్పవచ్చు. అయితే వ్యక్తిగత ఉత్తరాలు పోస్ట్ చేయడం తగ్గిపోయినా దూరదర్శన్,
ఆకాశవాణి, సామాజిక మాధ్యమాలలో మరియూ పత్రికా రంగంలో అభిప్రాయమాలికలుగా ఉత్తరాలు నేటికీ
కొనసాగుతూనే ఉన్నాయి.
చరవాణిలో ఎప్పటికప్పుడే మెసేజ్ లు అంటే మనోగతాభిప్రాయాలు తెలియజేస్తూనే వున్నారు.

—1916 లో త్రిపురనేని రాసిన లేఖ.—

స్వగతం

ప్రముఖ సాహితీ వేత్తలు “చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, కందుకూరి వీరేశలింగం పంతులు,వేదం వేంకటరాయ శాస్త్రి,గురజాడ అప్పారావు,కట్టమంచి రామలింగారెడ్డి,త్రిపురనేని రామస్వామి చౌదరి,గుడిపాటి వేంకట చలం,దువ్వూరి రామిరెడ్డి,నార్ల వేంకటేశ్వర రావు,సంజీవదేవ్,దేవరకొండ బాలగంగాధర తిలక్,రాచమల్లు రామచంద్రారెడ్డి,
గుంటూరు శేషేంద్రశర్మ” గార్ల లేఖలను పరిశీలించి “తెలుగులో లేఖా సాహిత్యం” అనే అంశం పై ఉస్మానియా విశ్వ విద్యాలయంలో పి.హెచ్.డి., చేశాను. గ్రంథ రూపంలో కాక వివిధ సంచికల్లోనూ,వ్యక్తుల సేకరణలోను మరెన్నో లేఖలున్నాయి.వాటి నన్నింటిని సేకరించి ప్రచురించాల్సిన అవసరముంది.
సాహిత్య కళాపరమైన లేఖలే కాక ఇతరంశాలతో కూడిన లేఖలపై కూడా పరిశోధన జరగాల్సిన అవసరముంది.
ఆనాటి భాష ,సంస్కృతి,వారి ఉద్దేశ్యం,వారి భావాలు లేఖల ద్వారా తెలుసుకునే అవకాశం వుంది.

గురజాడ అప్పారావు “నాది ప్రజల ఉద్యమం” అని చెప్పుకున్నాడు తన లేఖలోనే.
ఒక రకంగా చెప్పాలంటే లేఖా సాహిత్యం సామాజిక,సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతుంది. తెలుగు సాహిత్య విమర్శకు ఒక ప్రాథమిక అవస్థను కల్పించింది.ఆధునిక యుగంలో భాగంగా ఎన్నో ప్రక్రియలు పుట్టుకొచ్చాయి.
ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పులొచ్చాయి.
ఇలాంటి మార్పులు ఒకరినొకరు స్పష్టంగా అవగాహన చేసుకోవడానికి,
సాహిత్య విలువలు,సాంఘిక విషయాలు ప్రచారం చేసుకోవడానికే 20వ శతాబ్ది ఆరంభ దశలో ఈ లేఖా సాహిత్యం గణనీయమైన పాత్రను పోషించింది.చర్చలు,వాదోపవాదాలకు తెరతీసింది.
విమర్శనాత్మకత,సృజనాత్మకత అనే రెండు లక్షణాలను సంతరించుకుని లేఖాసాహిత్యం ఒక ప్రత్యేక ప్రక్రియగా తెలుగు సాహిత్యంలో విరాజిల్లుతోంది.
————————–

You may also like

6 comments

Lalitha sharma July 3, 2021 - 5:09 am

Seetha akka nice ……….its amazing………brilliant idea..👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Reply
కె.ఇ.నిలమంగై July 3, 2021 - 6:37 am

చక్కటి వ్యాసంతో లేఖ రచనా పద్ధతిని తెలిపారమ్మా .పూర్వకాలంలో శాసనాలను,లేఖలను ,సందేశాలను హంసతో,పావురాలతో ఎలా పంపారో బాగా తెలియ పరచారు ఈనాటి తరం వారికి.నమస్సులు🙏🙏🙏

Reply
Dr.Darla VenkateswaraRao July 3, 2021 - 5:31 pm

మంచి పరిశోధన విషయాలు మరలా ఇక్కడ వ్యాస రూపంలో అందించిన మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు

Reply
అరుణ జ్యోతి, సూర్యాపేట July 8, 2021 - 1:26 pm

మీరు నాకు దర్పణం సాహితీ గ్రూఫు ద్వార పరిచయం. మీ సాహిత్య సృష్టి గురించి తెలుసుకోవడం సంతోషం. మీకు సంపూర్ణ సహకారాలందిస్తున్న పరిమిగారికి నమస్సులు. మీ కలం నుండి ఎన్నో రచనలు రావాలని ఆశిస్తూ మీ నుండి స్ఫూర్తి పొందుతున్న

Reply
అరుణ జ్యోతి, సూర్యాపేట July 8, 2021 - 1:31 pm

నమస్సులు

Reply
అరుణ జ్యోతి, సూర్యాపేట July 8, 2021 - 2:58 pm

దర్పణం సాహితీ వేదిక ప్రధాన కార్యదర్శిగా పరిచయం అయినారు. లేఖా సాహిత్యంపై పరిశోధన చేసి చాలా విషయాలు తెలియజేసారు. సాహిత్యాభిలాష కలిగిన అన్యోన్య దంపతులు. నాకు స్ఫూర్తి కలిగిస్తున్న మీకు ధన్యవాదాలు

Reply

Leave a Comment