కాలక్రమానుగతంగా అన్ని రంగాల్లోనూ మార్పు అనివార్యం. అందులో దేనికీ మినహాయింపు ఉండదు. అలాగే సాహిత్యంలోనూ ప్రాచీన కాలం నుండి ఇప్పటివరకు సామాజిక పరిస్థితులకు, మనుష్యుల భావాలకు అనుగుణంగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఛందో బద్ధమైన పద్యకవిత్వం నుండి, మాత్రా ఛందస్సులతో కూడిన గేయకవిత్వంతో పాటు అనేక కవితాప్రక్రియలు సాహిత్య పూదోటలో వికసించి లతలుగా పెనవేసుకున్నాయి. అటువంటి వాటిలో వచనకవిత్వానికి నేటికాలంలో ఎంతోమంది కవులు తమ హస్తాక్షరాలతో అలంకారాలు తొడిగి ప్రకాశింప జేస్తున్నారు.
కవుల భావనా తరంగమై ప్రవహించి కవిత్వం ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. అలాగని అది ఎటువంటి నియమాలకు లోబడి ఉండక పూర్తి స్వేచ్ఛా కాంక్షతో రూపు దిద్దుకున్నప్పుడు కొంత లోప భూయిష్టంగాను, మరికొంత పొరపాట్లతోను, ఇంకొంత పాఠకులకు అనాసక్తిగా పరిణమించే అవకాశం లేకపోలేదు. జీవన మనుగడ నియంత్రణ అవసరమైనట్లే దేనికైనా ఒక నియమం, ఒక నియంత్రణ అత్యవసరం.
‘వచన కవితా పితామహుడు’ గా కుందుర్తి ఆంజనేయులు గారు ఆధునిక కాలంలో వచన కవిత్వ ఆవశ్యకతను గుర్తించి 1958 లో ‘ఫ్రీవర్స్ ఫ్రంట్’ ను స్థాపించారు. వచన కవిత్వ లక్షణాలతో ‘నగరంలో వాన’ కావ్యాన్ని రచించారు. ‘ఫ్రీవర్స్’ అనే ఇంగ్లీషు పదానికి సమానార్థకంగా తెలుగులో వచనకవిత చెప్పబడుతోంది. శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి కృష్ణమాచార్యులు, డా. సి.నారాయణ రెడ్డి, గుంటూరు శేషేంద్రశర్మ మొదలైన వారు వచన కవిత్వాన్ని ఆదరించారు. రచించారు. తరువాతి తరాలకు మార్గదర్శకులయ్యారు.
ప్రజలకు సన్నిహితంగా ఉండేందుకు, వాడుక భాషలో, అలతి పదాలతో, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండడం వచన కవితకు ప్రధాన లక్షణం. దీన్ని రాసేటప్పుడు కవులు ఏ విధమైన నియమాలను, లక్షణాలను పాటించాలో, సమాజంలో ఏ విధంగా చైతన్యాన్ని వికసింపజేయాలో తెలుపుతూ దాస్యం సేనాధిపతి గారు ‘దిక్సూచి’ అనే పుస్తకాన్ని వెలువరించారు. దీనిని వచన కవితకు కరదీపికగా ఉంటుందని పేర్కొన్నారు. దీనికి ఈ పేరు పెట్టడం లోనే ఆయన అంతరార్థం ప్రస్ఫుటమవుతోంది. శక్తివంతమైన రచనా నైపుణ్యతను సాధించే దిశగా ప్రస్తుత కవులకు సుబోధకంగా, సులభసాధ్యంగా ఆయన ఈ పుస్తకాన్ని వెలువరించారు.
‘కవిత్వమంటే’ …అని ప్రారంభిస్తూ, అనేకమైన మౌలిక లక్షణాలను క్రోడీకరిస్తూ ‘కవిత్వంలో మానవతావాదం’ వరకు ఉన్న విభాగాలు వచనకవిత్వ ప్రాధాన్యత, దాని నియమావళిని తెలుపుతాయి.
ఈ భాగాలలో దాదాపు 320 మందికి పైగా ప్రాచీన కవుల నుండి నేటి కవులవరకు వారి రచనలలోని పాదాలను దశలవారీగా ఉటంకించడం, స్వరూప సామ్యాలను తెలపడం సేనాధిపతి గారి తులనాత్మక పరిశీలనను ప్రతిబింబిస్తుంది.
“కవిత్వమంటే హృదయాలను కదిలించే అనుభూతినివ్వాలి. వస్తువును దాచడం కాదు. పొరలు పొరలుగా విప్పుతూ పద బంధాలతో, భావచిత్రాలతో పాఠకుడిని తన్మయుడిని చేసేది కవిత్వం, కవిత్వం హృదయాన్ని మీట గలగాలి” ఈ మాటలు చాలు కవిత్వం రాసే కవుల కర్తవ్యాన్ని బోధించడానికి. దీనికి ఉపపత్తిగా ప్రముఖ కవి త్రిపురనేని శ్రీనివాస్ గారు రచించిన ‘కవిత్వం కావాలి కవిత్వం’ అనే కవితను మనముందు నిలుపుతారు.
అలంకారాల గుబాళింపు, పద చిత్రాలు, ప్రతీకలు, విరుపులు, మెరుపులు, ఎత్తుగడ, ముగింపు ఎంతవరకు అమరాలో, ఒదగాలో అది మంచి కవిత్వమని నందిని సిధారెడ్డి గారు చెప్పిన భావాల విశ్లేషణతో సేనాధిపతి గారు ఉత్తమ కవిత్వానికి ఉండాల్సిన ఎన్నో లక్షణాలను విశదీకరిస్తారు.
డా. సి నారాయణ రెడ్డిగారు రాసిన ‘మనోదృశ్యం’ కవిత
ఎత్తుగడ….
“ఆ దృశ్యాన్ని ఎన్నాళ్లుగా చూస్తూ ఉన్నానో/
దాని అందాలను ఎన్నిసార్లు తాగి చూస్తున్నానో/
దాహం తీరలేదు”….ఇలా మొదలవుతుంది. అది పాఠకుని అవ్యక్తభావనలో ముంచుతుంది. అందుకే కవిత్వ నిర్మాణానికి ఎత్తుగడ చాలా ముఖ్యమైనది.
అలాగే కవితా వస్తువును విశ్లేషించడానికి వినియోగించబడే భాష, పదబంధ ప్రయోగంలో ఔచిత్యం, శైలి, శిల్పం ఇవి ప్రధాన భూమికను పోషించడంతో పాటు నర్మ గర్భత, సంక్షిప్తీకరణలు, కవితా నిర్మాణంలో శబ్ద, అర్థాలంకార ప్రయోగాలు కవిత్వాన్ని పరిపుష్టం చేస్తాయంటారు సేనాధిపతి గారు.
ప్రముఖ కవి యాకూబ్ గారు…
“నిన్ను కలిసాకే
నా మనో ఉద్యానవనంలో పూలు పూచాయి
అక్షరాల కలువలు విప్పారాయి…..” అన్నప్పుడు
మరో ప్రముఖ కవి సుంకిరెడ్డి నారాయణరెడ్డి…
“ముక్కారు
పచ్చని వరెన్నుల్ని ప్రసాదించే
బంగారు బాతు మా వాగు..” అని చెప్పినప్పుడు
ఆ అలంకార ప్రయోగాలు ఎదలను హత్తుకుంటాయి.
కవిత్వాన్ని నిర్వహించేటప్పుడు భావాలను గణాలుగా, భావవ్యక్తీకరణకు అనువుగా విభజించుకోవడం ఒక పద్ధతి. కవి ప్రతిభను వెల్లడించడానికి, కవిత్వ సౌందర్యానికి, పాఠకులలో ఆసక్తిని పెంచి, క్రమంగా కవిత్వంతో నడవడానికి, సులభంగా అవగాహన చేసుకోవడానికి ఈ గణాలు ఉపయోగపడతాయి.
‘కాలం కాలం చేసింది’ కవితలో సినారె గారు…
మొదటి పేరాలో మూడు పంక్తులు, రెండవ పేరాలో నాలుగు పంక్తులు, మూడవ పేరాలో మూడు, నాలుగవ పేరాలో రెండు…ఇట్లా స్వేచ్ఛా భావనకనుగుణంగా కవితను రూపొందించారు.
అదే విధంగా దాశరథి గారు ‘తమ పునర్నవం’ లో కావ్యంలో ‘రూపాయికి విలువలేని రోజు రేపు వస్తుందట’
అన్న శీర్షికతో రాసిన కవిత నిన్న, ఇవాళ, రేపు పేరాలుగా క్రాంత దర్శనం చేయిస్తుంది. ఈ భావగణాల్లో అక్షరాలు, పాదాల విషయంలో ఎటువంటి నియతి ఉండదు. భావమే ప్రధానం.
‘వక్రోక్తి’ వచన కవిత్వానికి ఉండే ప్రధాన లక్షణాల్లో మరొకటి. పాఠకుల హృదయంలో ఆలోచన రేకెత్తించి, స్తబ్ద మనస్తత్వాన్ని నిరసించడం కోసం వక్రోక్తి కొంతవరకు ఉపయోగపడుతుంది. వ్యంగ్యం, చమత్కారం వక్రోక్తికి ఆభరణాలు. కానీ అది వస్తువు యొక్క పరిధి దాటకూడదు. పదబంధ ఔచిత్యానికి భంగం వాటిల్లకూడదు.
శ్రీశ్రీ నిరసన గళంలో…
“మనదీ ఒక బ్రతుకేనా?
కుక్కలవలె నక్కల వలె
సందులలో పందుల వలె…..” అనే వక్రోక్తులు తమను
తాము ప్రశ్నించుకునేలా చేస్తాయి.
కవి డా. ఎన్. గోపి ‘ఫ్రీడం ఫైటర్’ కవితలో…
“అతడు నాకు రోజూ కనిపిస్తాడు
లక్షల్తో త్యాగాన్ని వెలిగించి
ఇంట్లో ఎండిన డొక్కల కోసం
ఇల్లిల్లూ తిరుగుతుంటాడు…” లాంటి పాదాలు ఆకలి పేగులను దృశ్యమానం చేస్తాయి.
కవిత్వ నిర్మాణంలో ‘భావచిత్రాలు’ ఒక ప్రత్యేక లక్షణం. వీటిని ఇంగ్లీషులో ‘ఇమేజరీ’ అంటారు. భావచిత్రాలు కవి భావావేశాన్ని, భావధారను స్పష్టీకరిస్తాయి. భావచిత్రం కంటికి కనిపించేది కాదు. అనుభూతి ప్రధానమైనది.
దాశరథి గారి ‘అగ్నిధార’ లో
“లోకపు చీకటి చీరకు/ ఆకాశం రైక మీది/ చిన్ని చుక్కల పువ్వులు/ తళుక్కుబెట్ట గలిగేనా/ జరి అంచు మెరిసేనా?…..” లాంటి పాదాల భావ చిత్రాలు దృశ్యాలను కట్టెదుట నిలుపుతాయి.
అహ్మద్ ఫైజ్ రాసిన కవిత్వాన్ని వి.జి. కిర్నన్ ఆంగ్లంలోకి అనువదిస్తే దానిని జం జం సత్యనారాయణ అనే మహబూబ్ నగర్ కు చెందిన కవి తెలుగులోకి అనువాదం చేసారు. అందులో ‘నేటి రాత్రి’ కవితలో “ఈ రాత్రి వీణపై విషాద రాగాలకు/ గతం బాధలన్నీ దూరమైనాయి…..” వంటి పాదాలు కవిత్వ సౌందర్యాన్ని ఇనుమడింపజేసాయి.
సినారె గారు ‘రెక్కలు’ కవితా సంపుటిలో కొవ్వొత్తులు తాగుతాయి/తనమీద దాడి చేసిన/ పురుగుల రెక్కలను….. ” అంటూ అద్భుత భావచిత్ర పద మాధుర్యాన్ని అందించారు.
కవిత్వంలో వస్తువు ప్రధానమన్నది అందరికీ తెలిసినదే. దాన్ని అందంగా, పొందికగా నిర్మించడంలోనే కవి సృజనాత్మకత ఆవిష్కారమవుతుంది. అయితే కవిత్వంలో విరుపులు, పాదాంతాలు వీటి దగ్గర ఉపయోగించే విరామచిహ్నాలు కూడా కవిత్వంలో ప్రాధాన్యతను సంతరించుకున్న అంశమే. వీటిని కూడా సందర్భోచితంగా, అవసరమైనంత మేరకే ఉపయోగించుకోవాలి.
కవిత్వంలో ‘ఔచిత్య పద బంధ ప్రయోగం’ చాలా ముఖ్యమైనది. కవిత్వం మనిషి అంతరాత్మతో సంభాషణవంటిదంటారు సేనాధిపతి గారు. కవి తన భావావేశాన్ని కొన్నిసార్లు అగ్నిపర్వతంలా వెడల గక్కుతాడు. ఒక్కోసారి ఆర్ద్రతతో నల్లని మబ్బులా వర్షిస్తాడు. అయితే సంయమనం కోల్పోయే పరిస్థితుల్లో పద ఔచిత్య విస్మరణకు గురయ్యే ప్రమాదం ఉంది. పాఠకులలో అన్ని రకాల వాళ్ళుంటారు కాబట్టి సభ్యత, సంస్కారయుతమైన పదాలు కవికి గౌరవాన్ని ఆపాదిస్తాయి కాబట్టి తగు జాగ్రత్త అవసరమని సేనాధిపతిగారు చెప్పిన విషయాలు కవులు తప్పక పాటించి తీరాలి.
చాలా సందర్భాల్లో కవి ‘స్వగతం’ కవితారూపాన్ని పొందుతుంది. ఆనందం, విషాదం రకరకాల పాత్రలుగా దృగ్గోచరమవుతుంది. ఈ స్వగతాన్ని బహిర్గతం చేసేటప్పుడు చమక్కులు, వ్యంగ్యం, మెరుపులు, చురకలు చోటు చేసుకోవచ్చు. వస్తువు స్వగత రూపంలో అంతర్వేదన వాహిని అవుతుంది.
కవిత్వ నిర్మాణంలో భాష చాలా కీలకమైనది. కవి తన హృదయంతో కవిత్వం రాస్తాడు. ఏ భాషలో నైనా కవులు విశ్వజనీన భాషకే పట్టం కడతారు. వస్తు రూపాలు, శిల్పం, అభివ్యక్తి వీటన్నింటికీ మూలాధారం భాష. కవిని కవిగా నిలబెట్టేది భాష. భాషకు కావలసింది పాండిత్యం కాదు వస్తువును ప్రతిభావంతంగా,
సందర్భోచితంగా, ఔచితీవంతంగా ప్రకటించడానికి మామూలు పదాలు అయినా ఉండవచ్చు అని తమ అభిప్రాయ ప్రకటన చేస్తారు సేనాధిపతి గారు. మాండలికంలో కవిత రాసేటప్పుడు మొదటి నుండి చివరిదాకా ఆ పదాలనే ఉపయోగించాలి. కవిత్వ పదాల్లో సంక్లిష్టత, సందిగ్ధతలకు తావు ఉండకుండా జాగ్రత్త పడాలి. అక్షరదోషాలు ఉండకుండా చూసుకోవాలి.
ఇక ‘ముగింపు’ అనేది కవితను మొత్తంగా ఆలోచింపజేస్తుంది. ఇది కవి రచనా నైపుణ్యాన్ని వ్యక్తీకరిస్తుంది. కవి శైలి,ముద్ర ఇందులో కనిపించాలి. ఇది ఆలోచనాత్మకంగా, సందేశాత్మకంగా ఒక వ్యంగ్యం, ఒక మెరుపు, ఒక చురుకు, ఒక చరుపులతో ఉండాలి. కొత్త ఆలోచనకు తెరతీయాలి. కవితాత్మకమైన స్పష్టత కనిపించాలి. ఇవన్నీ రావాలంటే కవికి అధ్యయన శీలత్వం, ప్రముఖుల రచనల పరిశీలన, వాటి తీరుతెన్నులను గ్రహించే నేర్పు ఉండాలని కవులకు పథ నిర్దేశం చేస్తారు దాస్యం సేనాధిపతి గారు. ఇంకా ఇలాంటి అనేకమైన విషయాలు ఈ పుస్తకంలో పొందు పరచబడ్డాయి.
నేటి కాలంలో కవులు, కవయిత్రులు అనేక మాధ్యమాల ద్వారా వారి కలాలను, గళాలను కదిలిస్తున్నారు. కొంతవరకు వాటిని పరిశీలిస్తే ఆత్మవిమర్శకు తావు లేకుండా, రాయడమే ప్రధానంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాంటి వారందరూ తప్పక చదవాల్సిన పుస్తకం దిక్సూచి. రాయడం ప్రారంభించాలనుకున్నవారికైనా, రాస్తున్న వారికైనా ఆత్మ పరిశీలన చేసుకొని మంచి కవిత్వాన్ని రాయగలిగే మెళకువలను బోధించే ఉత్తమ గ్రంథమిది. దీనికోసం ఆయన చేసిన కృషి అనితరసాధ్యం. ఎవ్వరైనా చేతి ఊతంగా దీన్ని పట్టుకొని వచన కవితా సాగరతీరాన్ని సులభంగా చేరుకోవచ్చు. తరతరాలు నిలిచివుండేలా ప్రామాణికమైన కవిత్వ లక్షణాలతో ఒక గొప్ప పుస్తకాన్ని అందించిన సేనాధిపతిగారు అభినందనీయులు.