కవిత్వం పై పుస్తక సమీక్ష.
ప్రముఖ కవి,కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు గ్రహీత,విశ్రాంత లైబ్రేరియన్,ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్,వారాల ఆనంద్ మనిషి లోపల no man’s land కవిత్వంపై పుస్తక సమీక్ష.ఈ పుస్తకాన్ని తన భార్య ఇందిరా రాణికి అంకితం ఇవ్వడం ముదావహం.ఆనంద్ కవితా సంపుటిలో కలిసి బతుకుని పంచుకుందామని వచ్చి నాకు జీవితాన్నే ప్రసాదించిన సహచరి ఇందిరకు అని రాసుకున్న అంకిత వాక్యాలు అతనికి తన భార్యపై ఉన్న గౌరవాన్ని ప్రకటిస్తున్నాయి.ఈ పుస్తకానికి అన్నవరం శ్రీనివాస్ చక్కటి ముఖచిత్రం అందించారు.దర్భశయనం శ్రీనివాసాచార్య ముందు మాటలో ఆగస్టు 2013 నుంచి ఇటీవల దాకా ఆయన రాసిన కవిత్వమే ఈ సంపుటి.నేను ఈ కవితల్ని చదివి ఆశ్చర్యపోయాను.క్లిష్ట వేదనా సమయంలో ఇంత రాశిగా కవిత్వం రాసాడా అని నిదానంగా ఆలోచిస్తే,ఇది పెద్దగా ఆశ్చర్య పడాల్సిన విషయం కాదనిపించింది.వ్యక్తీకరణ తెలిసిన సాహిత్యశీలి కనుక తన లోపలి ప్రపంచాన్ని,
ప్రకంపనల్నీ,నిశ్శబ్దాన్నీ,అలజడిని రికార్డ్ చేశాడు. ఐతే కుదురైన వచన వాక్యాన్ని రమ్యంగా రాయగలిగే శక్తీ,అలవాటు ఉన్న ఆనంద్ తన భావాల్ని వచన రూపంలోకి కాక,కవిత్వ రూపంలో ఎందుకు పెట్టి వుంటాడు?తాను తన వేదనను వ్యక్తీకరించాలి.వేదనను అధిగమించే ప్రయత్నాన్ని వ్యక్తీకరించాలి.ఒక emotoional సందర్భం.దానికి కవిత్వమే సరైన మాధ్యమని భావించి వుంటాడు. వ్యక్తీకరణకు అవసరమైన మూలకాలు తనలో ఎలాగు వున్నాయి.వేదనా సమయంలో మనిషి ఆలోచనలు పలు దిశలకు ఎలా సాగుతాయో ఈ సంపుటిలో కవితలు చెబుతాయి.మనిషికి మెలిక అవసరాలైన ప్రేమ,స్నేహం,తోడు,సంభాషణల పలవరింత ఆనంద్ కవితల్లో అగుపడుతుంది. దుఃఖాన్ని అధిగమించడానికి మనిషి చేసే ధైర్య చింతనకు దాఖలాలు ఇందులో వున్నాయి. నిజానికి,రెండు మూడు కవితల్ని మినహాయిస్తే, మిగతా అన్ని కవితల్లో సాగిన చింతనలో ఏక సూత్రత వుంది.అరమరికలు లేని సూటి దనముంది.వ్యక్తీకరణలో స్పష్టత ఉంది.కవిలోని శిల్ప ధ్యాస వస్తువుతో మిళితమై రాణించిన కవితలు బలంగా సాగాయి.వస్తు ప్రధానమైన కవితలు భావ ప్రకటన అనే ఏక లక్ష్యంతో కదలాయి.సున్నితంగా మనిషిలో సాగే ప్రకంపనలు దాదాపు అన్ని కవితల్లోనూ వుండడం ఒక వాస్తవాంశమే కాకుండా విశేషాంశం కూడా.ఒక సంక్లిష్ట సందర్భానికి ఆనంద్ ఇచ్చిన అక్షర రూపం ఈ సంపుటి.దుఃఖమూ కవిత్వమూ కవలలని తాను తెలుసుకున్నాడు.అనుభవంతో తాత్విక స్థాయి కెళ్ళి దుఃఖపు జీర లేకుండా ఏదైనా ఆనందమెలా అవుతుంది అని వ్యాఖ్యానించాడు ఆనంద్.ఈ సంపుటిలో దుఃఖం అనే మాట కనిపించినంతగా మరే మాట కనిపించదు.ధైర్యం అనే భావం పలికినంత మరే భావము పలక లేదు.వారాల ఆనంద్ సినిమా ప్రపంచంలో కదుల్తూనే కవితా ప్రపంచాన్ని వెంటేసుకు తిరగాలని ఆకాంక్షిస్తూ .. దర్భశయనం శ్రీనివాసాచార్య అన్నాడు.ఆనంద్ మనిషి లోపల కవిత్వం గురించి తెలుసుకోవాలని తహతహగా ఉందా?అయితే ఒక్క సారి మనసు పెట్టి కవితా చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారించండి. గొప్ప గొప్ప కవితానుభూతుల లోకంలోకి వెళ్ళి విహరించండి.లోపలా – బయట కవితలో గది లోపల/మిరుమిట్లు గొలిపే కాంతిలో/ఆకులన్నీ పేర్చి విస్తరి కుట్టినట్టు/గ్లౌజులు తొడుక్కున్న చేతులు/ చకచక కదిలి పోతున్నాయి/సైగలే అక్కడి భాష/ నిశ్శబ్దానిదే రాజ్యాధికారం/గది బయట/ ప్రశాంతమైన కొలనులో రాయి పడినట్టు/అలలు అలలుగా అక్కడొకరు ఇక్కడొకరు/చేతులు కట్టుకుని ఒకరు/జేబుల్లో చేతులు పెట్టుకొని ఒకరు/ఉబికి వస్తున్న కన్నీళ్లు ఆగని వెక్కిళ్ళు/నిశ్శబ్దాన్ని మంద్రంగా చేదిస్తున్నాయి/అంటున్నారు.ఆనంద్ తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఉన్నాడు.హాస్పిటల్ గది లోపల ఏం జరుగుతుంది?హాస్పిటల్ గది బయట ఏం జరుగుతుంది? అనే విషయాలను ఎంత అద్భుతంగా కవిత్వంలోకి మలిచాడో చదివితే హృదయం ద్రవిస్తుంది.ఆనంద్ వేదనామయ జీవితాన్ని కవిత్వంలో చక్కగా వ్యక్తీకరించిన సాహసిగా చెప్పవచ్చు.వేదన నుంచి కవిత్వం పుడుతుంది అంటారు.కాలం కవితలో గతం, వర్తమానం,భవిష్యత్తు కాలాన్ని తడుముతూ నడుస్తున్న కాలం/మనిషికి జీవ ధాతువు/ అంటున్నారు.నడుస్తున్న కాలంలో మనిషి తాను జీవనం కొనసాగించాలి.నడుస్తున్న కాలం మనిషికి జీవాన్ని అందించే ధాతువు అంటూ కాలం విలువను తెలియజేసారు.కవి ఆత్మవిశ్వాసంతో బతుకు పట్ల ఆశను కలిగిస్తూ ప్రేరణను అందిస్తున్న తీరు బాగుంది.ఇమ్మ్యునో సప్ప్రెస్సర్స్ కవితలో శరీరంలో ప్రతిఘటించే గుణాన్ని/నియంత్రించేదేదో/రక్తనాళాల్లో సుళ్లు తిరుగుతోంది/ప్రతిఘటనా నియంత్రణ/ శరీరానికే కానీ ఆలోచనకు కాదు కదా/మనసులో ముంచిన ఆలోచనలకు/పదును పెడుతూ/తనని తాను ఆవిష్కరించుకుంటున్నాడు/ఎంతయినా మనసున్న మనిషి కదా/అంటున్నారు.ఇమ్మ్యునో సప్ర్పెస్సర్స్ అంటే శరీర రోగ నిరోధక వ్యవస్థను తగ్గించే ఔషధాలు.రోగనిరోధక వ్యవస్థ క్రియాశీలతను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి.అవయవ మార్పిడి సమయంలో శరీరం కొత్త అవయవాన్ని తిరస్కరించకుండా ఉండేందుకు వైద్యుల పర్యవేక్షణలో దీనిని ఇస్తారు.దురదృష్టవశాత్తు ఆనంద్ మూత్రపిండాలు పాడై పోయినాయి.తన సహచరి ఇందిర మూత్రపిండం ఇచ్చి తన భర్త ఆనంద్ ను ప్రేమతో కాపాడుకుంది.ఈ కవితలో తన శరీరంలో మూత్రపిండం అవయవ మార్పిడి జరిగినప్పుడు మనసున్న మనిషి కదా అని తన గురించి తాను నిభాయించుకుంటున్నాడు.ఈ వాక్యాలు ప్రాణం పోతున్నవారికి ప్రాణం పోసేలా ఉన్నాయి.విజయ తీరం కవితలో మూసినా తెరచినా/కళ్ళు కలల్ని/తోడ్కొని వస్తాయి/కురిసిన ఆరినా/కన్నీళ్లు/మనసును కడిగేస్తాయి/వేకువా చీకటీ/ఒక దాని వెనక మరోటి/ఏది ముందు వస్తుందో/ఏమి ఎరుక/అంటున్నారు.మనిషి కాలంతో పాటు పయనించి విజయ తీరాలకు చేరుకోవాలనే భావన స్ఫూర్తిని కలిగిస్తుంది.నాని గాడు కవితలో ఇన్నేళ్లూ/వాడు నాకర్థం కాలే/అవును ఎవరయినా/ ఎందుకు అర్థం అవుతారు/మనం ప్రయత్నిస్తే కదా/ ఇన్నేళ్లూ నాకు తెలియనిదేదో/తెలుస్తున్నట్టు/వాడి అంతరంగమేదో/ఆవిష్కృతమవుతున్నట్టు/వాడి కలలేవో రూపు దిద్దు కుంటున్నట్టు/అంతరిక్షం నుంచి సృజన వైపు/వాడి ప్రయాణం/సారీ రా నాని/నువ్వు అర్థం కాలేదనుకున్నా/కాని నేనే అర్థం చేసుకోలేదు/ అంటున్నారు.పిల్లలు తల్లిదండ్రుల కలలకు రూపాలు.పిల్లలు దైవ స్వరూపాలు అంటారు. అందులో సందేహానికి తావులేదు.తల్లిదండ్రుల ఆశయాలను పిల్లలు గ్రహిస్తారు,అర్థం చేసుకుంటారు.తల్లిదండ్రులు తమ గురించి ఏమనుకుంటున్నారు?అనే వాస్తవాన్ని పిల్లలు గ్రహిస్తారు.తల్లిదండ్రులే పిల్లలను సరిగా అర్థం చేసుకోరు అనిపిస్తుంది.ఆనంద్ తన కుమారుడు అన్వేష్ కు సృజనాత్మకమైన కళల పట్ల గల ఆసక్తిని తెలుసుకొని తండ్రిగా ఎంతో సంతోషిస్తాడు.నా కలలూ నీ కలలూ/ప్రోది చేసుకుని/విశ్వంలోకి దూసుకెళ్ళు/నిన్ను అందరూ అర్థం చేసుకుంటారు/ అంటున్నారు.ఆనంద్ అవధులు లేని తన సంతోషాన్ని వ్యక్తం చేసిన తీరు బాగుంది.నిష్టూరం కవితలో ఎవరికీ ఎవరి మీదైనా/నిష్టూరం ఎందుకు/ముడుచుకోవడం/విచ్చుకోవడం/ పరిమళించడం/వారి వారి జీవ లక్షణం కదా/కలిసి రావడం/కలిసి నడవడం/కలిసి జీవించడం/ఎవరికి వారు గీసుకున్న/వృత్త పరిధిలోనే కదా/అయినా ఎవరి మీదయినా/నిష్టూరం ఎందుకు/కలిసొచ్చే అంశాల్లో కలిసిపోయి/కాని విషయాల్ని వదిలేసి/చిరునవ్వులు చిందిస్తూ/ప్రవాహమయి పోతే సరి/అంటున్నారు.నిష్ఠూరం అనగా నిందనీయమైన మాటలు.ఇతరుల మాటలను అపార్థం చేసుకుని సరైన కారణం లేకుండా నిందిస్తుంటారు.ఇతరులు ఏ సందర్భంలో అలా మాట్లాడారు అనే విషయాన్ని గ్రహించాలి.నిష్ఠూరపు మాటల వలన మనకు కావాల్సిన దగ్గరి వాళ్ళు మనసు నొచ్చుకొని దూరమవుతారు.కవి నిష్ఠూరం ఎందుకు?అని ప్రశ్నిస్తున్నారు.కలిసి వచ్చే అంశాల్లో కలిసి పోవాలి.పనికిరాని విషయాలను వదిలి వేయాలి.మనసులో ఏ కల్మషం లేకుండా చిరు నవ్వులు చిందిస్తూ కలిసిమెలిసి ఉండాలి.మనలో సానుకూలమైన ఆలోచనలు కలిగేలా ప్రోత్సహించి ఇతరులతో సామరస్య ధోరణిలో కలిసిమెలిసి సాగాలి అని వ్యక్తీకరించిన భావం అద్భుతంగా ఉంది.మనస్సు తేలికపడింది కవితలో దేన్నయినా/కోల్పోవడానికి/దూరం చేసుకోవడానికి/ సిద్ధంగా లేదు మనసు/ప్రేమనీ ద్వేషాన్నీ/కోపాన్నీ ఆప్యాయతనీ/విచ్చుకున్న పూలనీ/విరగ కాసిన చెట్టునీ చెట్టు బెరడునీ/చుక్కల ఆకాశాన్ని హత్తుకున్న దేన్నయినా సరే/వదులుకోవడానికి సిద్ధంగా లేదు మనసు/నేనే అశాశ్వతం కదా/ అన్నాను గుసగుసగా/ఉలిక్కిపడింది మనస్సు/ నువ్వు నేనూ లేకున్నా/నీ కవిత్వం ఉంటుందిగా/ తేలికపడింది మనస్సు/అంటున్నారు.మనస్సు చేసే మాయాజాలం మనం ఎరిగినదే.మనలను ఆలోచనా తరంగాల్లో తేలియాడ జేసిన భావాలు చక్కగా ఉన్నాయి.సహచరి కవితలోఆమె/ఒక భోళా/తనకు తెలిసినదేదో తెలిసినట్టు/తోచిందేదో తోచినట్టు/ స్వపర భేదాల్లేవు/ముందు వెనకల్లేవు/కుళ్ళూ లేదు కుతంత్రం లేదు/మా ఇద్దరి గమనంలో రహస్యం లేదు/ప్రేమలో మాలిన్యం లేదు/ఆమె స్నేహంలో/ వెన్నెల కురుస్తుంది/త్యాగంలో ఆకాశాన్ని స్పృశిస్తుంది/ఆమెతో జీవితం/బతుకంత లోతయింది/విశ్వమంత విశాలమయింది/ అంటున్నారు.ఇందిర కిడ్నీని దానం చేసి తన భర్త ఆనంద్ ను కాపాడుకుంది.నేటి సమాజంలో కుటుంబ సంబంధాలు బీటలు వారుతున్న ఈ రోజుల్లో తన భర్త పట్ల అపారమైన ప్రేమానురాగాలను చూపిన ఇందిర తన కుటుంబానికి,సమాజానికి ఆదర్శంగా నిలిచింది. ఆనంద్ సహచరి ఇందిర గురించి వ్యక్తం చేసిన భావాలు చక్కగా ఉన్నాయి.ఆపరేషన్ థియేటర్ కవితలో శీతల గదిలో తెల్లటి మంచం మీద/కాళ్లు బార్లా జాపి/శవాసనంలా వున్నాడతను/ అకస్మాత్తుగా/కళ్ళు మిరుమిట్లు గొలిపే/కాంతి ప్రసరించింది/అతని కాళ్లూ చేతులూ/తలా శరీరమూ అన్నీ/మాట్లాడటానికి నోళ్ళు తెరిచాయి/గానం చేయడానికి గొంతు సవరించుకున్నాయి/కాని అన్నీ చలనరహితమయి మూగవయిపోయాయి/అతని మనసొక్కటే మేల్కొని/కళ్ళ కిటికీలోంచి మంచు గదిని చూడ్డం మొదలు పెట్టింది/అంటున్నారు. ఆపరేషన్ థియేటర్ లో ఏం జరిగింది?అనే దానిని స్పష్టంగా గమనించి తన మనసులోని భావాలను కవితలో చక్కగా వ్యక్తీకరించిన తీరు బాగుంది. ఎట్లా…కవితలో నాకేదీ నచ్చడం లేదు/నన్నసలు ఏదీ ఆకర్షించడం లేదు/అవును మరి/కళ్ళల్లో మెరుపు లేకుండా/పెదాలపై చిరునవ్వు ఏం బాగుంటుంది/అందుకే/గుండె లోతుల్లోంచి రాకుండా/పైపైన ఏమి వస్తే మాత్రం/ఎట్లా నచ్చుతుంది/ఆత్మ లోతుల్లోంచి లేకుండా/ ఎంత అందమైతే మాత్రం/ఎట్లా ఆకర్షిస్తుంది/అంటున్నారు. ఇవ్వాళ మనుషులు వ్యవహరించే తీరులో ఎంతో మార్పు వచ్చింది.మనిషి బతుకు నటనగా మారింది.హృదయం లోతుల్లో నుంచి వచ్చే ఆత్మీయత కావాలి.మనుషుల్లో ఈనాడు ఆత్మీయత కొరవడింది.నాకేది నచ్చడం లేదు.నన్ను అసలు ఏది ఆకర్షించడం లేదు.పై పై ప్రేమలు నీటి బుడగ లాంటివి.అవి నటనగానే కనిపిస్తాయి.నటనలు వద్దు.హృదయపూర్వకమైన ప్రేమ కావాలి అని వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది.నో మాన్స్ లాండ్ కవితలో సరిహద్దుకు అవతల/అది ఎవరికీ చెందిన స్థలం కాదు/నన్ను చూడ్డానికి వచ్చావు/గాలి నియంత్రించిన గదిలో/పడి ఉన్నాను/నిన్ను చూస్తూనే ఉన్నాను/కూడబలుక్కున్న మాటలు/నీ కళ్ళల్లోఓ కన్నీటి చార/అంటున్నారు.ఆనంద్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు చూడడానికి వచ్చిన బంధువులు,మిత్రులతో ఆ ప్రాంతం సందడి సందడిగా ఉంది.దుఃఖము వద్దు.వేదన వద్దు.
వీడ్కోలు తెలియని సాంగత్యంలో ఇక నిర్భయంగా కలిసి ఉందాం అనే ఓదార్పు మాటలు ఎవరికైనా తృప్తిని కలిగిస్తాయి.మనిషి జీవితం ఒక్కో సారి సరిహద్దు అవతల పని చేస్తున్న సైనికుని జీవితం వలె మారడం సహజం అనిపిస్తుంది.ఆనంద్ ఆనాటి తన మానసిక స్థితిని చక్కగా కవిత్వీకరించారు. విషాదం కవితలో ఎటూ కదలడానికి వీల్లేదు/ఎటూ మెదలడానికి వీల్లేదు/మైళ్ళకు మైళ్ళు నడవాలనిపిస్తది/ఉరుకులు వేయాలనిపిస్తది/ అందరిలో కలవాలనిపిస్తది/అందరిని అవ్వాలనిపిస్తది/మనం అనుకున్నట్టుగా చేయలేకపోవడం/మనం అనుకున్నట్టుగా ఉండ లేకపోవడం/మరణం కన్నా విషాదం/అంటున్నారు.ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు. మనిషి జీవితం చిత్రమైనది.ఒక్కోసారి మనిషి జీవితం తెలియకుండానే విషాదంలోకి నెట్టబడుతుంది.మనిషి జీవితం మరణం కన్నా విషాదం అని తెలిపిన భావాలు వాస్తవానికి అద్దం పడుతున్నాయి.ఒక్కోసారి కవితలో ఒక్కోసారి నిలిచిపోవడం/కాల్రెక్కలు కుదేసినట్టు కూలబడి పోవడం/మంచిదేనేమో/ఒక్కోసారి/నిలిచిపోవడం లోంచే/నిలువెత్తుగా ఎగిసిపడడానికి సత్తువ వొస్తుంది/తలెత్తుక తిరగడానికి/ప్రాణమొస్తుంది/ అంటున్నారు.ఒక్కోసారి మనిషి జీవితంలో ఏం జరుగుతుంది?కూలబడిపోయిన మనిషికి కూడా స్వస్థత చేకూరుతుంది.మనిషి సంకట సమయంలో ధైర్యంతో వ్యవహరిస్తే అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్య వంతుడవుతాడు.మనిషిలోని నిర్జీవమైన అవయవాలు చైతన్యం పుంజుకుని ఆరోగ్యంతో నిలబడగలుగుతాడు అనే ధైర్యం కలిగిస్తున్నాడు.ప్రేమ స్నేహం కవితలో తొలి చూపులో ప్రేమించడం/మొదటి పరిచయంలోనే స్నేహించడం సులభమే/ సహజంగా స్వచ్ఛంగా వాటిని కొనసాగించడమే కష్టం/ప్రేమలోనూ స్నేహంలోనూ/ఇవ్వడం పుచ్చుకోవడం రెండూ ఉంటాయి/ప్రేమకు అనంతమైన భావోద్వేగమూ/ స్నేహానికి నిర్మలమైన స్వచ్ఛతా కావాలి/ అంటున్నారు.ఇవ్వాళ సమాజంలో ప్రేమ,స్నేహంలో కూడా తేడాలు కనబడుతున్నాయి.ప్రేమ,స్నేహం లేకపోతే దిక్కులేని వాన్నవుతాను.ప్రేమ,స్నేహం లేకపోతే ఈ లోకమే దిక్కులేనిది అవుతుంది అంటూ నిర్మలమైన ప్రేమ,స్నేహం ఆవశ్యకతను తెలియజేసిన తీరు చక్కగా ఉంది.సమయమిదే… కవితలో లోపలెక్కడో దాగి వున్న/పిసరంత ధైర్యాన్ని కూడగట్టుకుని/నిలబడాల్సిన సమయమిదే/సరిగ్గా ఇప్పుడే ఇక్కడే/నీ కాళ్లపై నువ్వు నిలబడాలి/ఓటమి అంచుని తాకి,విజయ తీరాల వైపు సాగాలి/ అంటున్నారు.ఆరోగ్యం బాగాలేదని ఎవ్వరు కూడా అధైర్యపడవద్దు.ధైర్యాన్ని కూడగట్టుకొని నిలబడాల్సిన సమయం ఇదే అని చెప్పిన భావాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ కవితలో నిరాశ నిండిన జీవితం/ప్రేమ కోసం ఎంతగా ఆశపడుతుంది/నిరాశ నిండిన రోజున/వెలుగు కిరణాల మెట్లపై/గాలి కెరటాల వోలె ఉప్పొంగితే/చిరునవ్వులు విరబూస్తూ ప్రేమ చిగురిస్తుంది/చిరుజల్లు వోలె రోజంతా వర్షిస్తుంది/అంటున్నారు.నిరాశ కమ్ముకున్న రోజున ప్రేమ కోసం ఆరాటపడతాం.సూర్యకిరణాలు ప్రసరిస్తే,సముద్రంలోని కెరటాలు ఉప్పొంగితే మనలో సంతోషం ఎగసిపడుతుంది.ఆశావహ దృక్పథంతో మనలో ప్రేమ చిగురిస్తుంది.ప్రేమ చిరుజల్లు వలె కురుస్తుంది అని వ్యక్తం చేసిన భావాల తీరు బాగుంది.ఇంకా మిగిలే వుంది కవితలో నేస్తమా/జీవితాన్ని శోధించాలి/కొంచెం వేదనను వదిలేయి/ఇంకొంచెం ఆశ్చర్యాన్ని విడిచేయి/గుప్పిట విప్పి గుండె లోతుల్లోని/స్వప్నాల్ని మేల్కొల్పాలి/ కళ్ళు తెరిచి కన్నీటి/సముద్రాలు దాటాలి/ఎత్తు పల్లాల్ని దాటుకుంటూ/మనం పయనం సాగించాల్సిందే/మనం కలిసి గడపని/క్షణం ఇంకా మిగిలే వుంది/అంటున్నారు.మన ప్రయాణం ఇంకా మిగిలే ఉంది అంటూ స్నేహితునికి ప్రేరణ కలిగిస్తున్నారు.ఆత్మగల మనుషులు కవితలో ఏదో ఒక క్షణాన/సంక్షోభం ఆవరిస్తుంది/తెలియని సంక్లిష్టత/చుట్టు ముడుతుంది/ధైర్యం కొడిగడుతుంది/దైన్యం ముప్పిరిగొంటుంది/ఆత్మ గల మనుషులే/అన్ని శక్తుల్ని కూడదీసుకుని/ కూలిపోకుండా నిలదొక్కుకుంటారు/చేతులు బార్లా జాపి/అందర్నీ నిలబెడతారు/అంటున్నారు.ఆత్మగల మనుషుల గురించి వ్యక్తీకరించిన భావాలు వాస్తవాన్ని తెలియజేస్తున్నాయి.బతుకు కవితలో బతుకు కష్టంగా ఉందా/నిరాశ చుట్టూ/ఓ వృత్తాన్ని గీయి/ఆశ దాని చుట్టూ తిరిగి తిరిగి/నిటారుగా/ నీ ముందు నిలుచుంటుంది/అంటున్నారు.మనిషి బతుకులో కష్టాలు కన్నీళ్లు ఉంటాయి.బతుకులో కష్టాలు ఉన్నాయని నిరాశతో బెదిరిపోకూడదు. మనిషి ఆశను శ్వాసగా చేసుకుని జీవించాలి అని బతుకు అర్థం చెప్పిన తీరు బాగుంది.ఎక్కడ కవితలో దుఃఖమూ సంతోషమూ/మొదలెక్కడ చివరెక్కడ/చీకటీ వెల్తురూ/దారెక్కడ దరెక్కడ/నిద్రా మెలుకువా/పోరెక్కడో బతుకక్కడ/ అంటున్నారు. ఎక్కడ అంటూ ప్రశ్నించి సమాధానం చెప్పిన తీరు బాగుంది.మిత్రమా కవితలో మనం మాట్లాడుకోవడం మానేసి/చాలా రోజులైంది/ పలకరించుకోవడమే మిగిలింది/అవును మరి మాట్లాడుకోవడానికి/మనసులుండాలి,ఆత్మలుండాలి/ఎదురు ఎదురుగ్గా మనుషులుండాలి/ అంటున్నారు.ఈనాటి సమాజంలో మిత్రుల మధ్య పొరపొచ్చాలు,విభేదాలు పొడచూపుతున్నాయి. ఆప్యాయతతో కలిసిమెలిసి ఉండాల్సిన మిత్రుల మధ్య సఖ్యత కొరవడింది.మిత్రులు మాట్లాడుకోవడం మానేసి చాలా రోజులైంది అంటూ ఆవేదన చెందుతున్నారు.కలిసిపోయే మనసులు ఆత్మలు ఉండాలి.మిత్రమా మనుషులు ఎదురు ఎదురుగా ఉండాలి అంటూ చెప్పిన భావం చక్కగా ఉంది.మలుపు కవితలో సాఫీగా గడిచిపోతున్న/జీవితంలో/ఓ పెద్ద కుదుపు/అది మొదటిది కాదు/చివరిది కాదు/మిగిలిన జీవితానికో/పెద్ద మూల మలుపు/అంటున్నారు. ఆనంద్ మూత్రపిండాలు పాడయిపోయి హాస్పిటల్ లో చేరడం అతని జీవితానికి అది కోలుకోలేని ఓ పెద్ద దెబ్బ.అతని బతుకులో పెద్ద మూల మలుపు అని పేర్కొన్న భావాలు అద్భుతంగా ఉన్నాయి. మాట్లాడటమే కవితలో అన్ని అనివార్యతలకి/అన్ని నిర్బంధాలకి/అన్ని మౌనాలకి ఒకే సమాధానం/ నిశ్శబ్దాన్ని ఛేదించుకు మాట్లాడ్డమే/గుండెను గొంతులోకి తెచ్చుకొని విచ్చుకోవడమే/ అంటున్నారు.మాట్లాడ లేనప్పుడు మౌనంగా ఉంటాం.మాట్లాడటం అవసరమైనప్పుడు మాట్లాడటమే అని చెప్పిన తీరు బాగుంది. మొదలయింది.. కవితలో ఏదైనా మొదలు పెట్టడమే కష్టం/మనసుని కూడ దీసుకోవాలి/ఆలోచనల్ని సరి చేసుకోవాలి/అందమైన పువ్వుల్ని కూర్చాలి/కలల్ని చల్లాలి కన్నీళ్ళని చల్లాలి/మొదలైంది ఏదీ ముగియకుండా వుండదు/అది బతుకయినా.. కవితయినా!/అంటున్నారు.ఆనంద్ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత తనలో కలిగిన స్పందనలకు రూపం ఇది.ఏదైనా పని మొదలు పెట్టడం కష్టం.పని మొదలు పెట్టడానికి మన మనసు సిద్ధం కావాలి.మన మనసును సమాధాన పరుచుకుని పనిలోకి నిమగ్నం అవ్వాలి.పని చేయడం మొదలు పెట్టిన తర్వాత ఏ పని అయినా పూర్తి అవుతుంది.మనం బతుకడం కొరకు పని చేస్తాం.కవి రాసిన కవిత అయినా రాయడం మొదలు పెడితేనే పూర్తి అవుతుంది.మనిషి బతుకుకు,కవితకు పోల్చి చెప్పిన భావం అద్భుతంగా ఉంది.భావ లయ కవితలో సూర్య చంద్రుల సాక్షిగా/కాలం గడుస్తూనే వుంటుంది/ జీవితంలో/అనుభవం మాత్రం మిగులుతుంది/ చీకటి,శూన్యము/అమితంగా భయపెడతాయి/కానీ వాటిలోంచే/వెల్తూరు సృష్టీ మొదలవుతాయి/ అంటున్నారు.ఎంత మాట్లాడినా మిగిలేదేముంది? అని ప్రశ్నిస్తున్నారు.మాట్లాడే విషయం మన
గురించి మరియు అసంఖ్యాక జనం గురించి అయినా అయి ఉండాలి.లేకుంటే మనం మాట్లాడే మాటల్లో పనికిరాని ఉబుసుపోక కబుర్లతో ప్రయోజనం ఏమీ ఉండదు అంటూ వ్యక్తం చేసిన భావం ఆలోచింపజేస్తుంది.దుఃఖం కేంద్రీకృతమయింది కవితలో కదలడానికి చేతులూ/నడవడానికి కాళ్లూ/ఏడిచేందుకు కళ్ళూ.. అన్నీ/ఇసుక పొరల కింద కమ్మేసినట్టు/ఇనుప చెరల కింద బందీ అయినట్టు/మనసంతా ఆవరించిన దుఃఖం/ ఆలోచనల్నీ నియంత్రిస్తోంది/ అంటున్నారు.బంగాళాఖాతంలో తుఫాను కేంద్రీకృతమైంది.అందుకే భారీ వర్షాలు పడుతున్నాయి అంటాం.ఆనంద్ మనసు పొరల అడుగున అవధులు లేని దుఃఖం కేంద్రీకృతమైంది. బతుకు మళ్లీ కొత్త దోవలోకి మళ్ళింది.ఆనంద్ దుఃఖాన్ని అధిగమించాడు అనే భావం బాగుంది. నేను కవితలో నాకు నటించడం చేతకాదు/కష్టాలూ కన్నీళ్లూ తెలుసు/ప్రేమించడం స్నేహించడమూ తెలుసు/అందుకే/నేను మరెవ్వరిలానూ ఉండలేను/ అంటున్నారు.నేను కవితలో తన మనసులోని భావాలను కుండబద్దలు కొట్టినట్టు పలికించడం అద్భుతంగా ఉంది.శేషం కవితలో దుఃఖాన్ని ఆనందంచే/భాగించేసా/శేషంగా మిగిలింది/నేనూ నా కవిత్వం/అంటున్నారు.ఒంటరితనం – ఏకాంతం కవితలో ఒంటరితనం ఓ సంఘర్షణ/ఒంటరితనం ఓ అనివార్యత/ఏకాంతం ఓ తపస్సు/ అనిర్వచనీయమైన/అవిభాజ్యమైన మానసిక స్థితి/ఒంటరితనంలోంచి పరిణామం చెందిన/ ఏకాంతం/అంతం లేనిది/అనంతమయింది/ అంటున్నారు.మనిషి జీవితంలో ఒంటరితనాన్ని ఏకాంతాన్ని ఎప్పుడో ఒకసారి ఎదుర్కొంటాడన్న అద్భుతమైన భావాలు అలరింపజేస్తున్నాయి. వోటమి గెలుపు కవితలో కను చూపు మేరలో/ఓటమి అంచు కనిపిస్తూ వుంటే/నిలదొక్కుకోవడం ఎంత కష్టం/కళ్ళు బైర్లు కమ్ముతాయి/గుండెలు జారిపోతాయి/మొత్తంగా ఊపిరి/లయ తప్పుతుంది/వెనక్కి నడవలేం/పక్కకి కదలలేం/వున్న చోటా వుండలేం/అంటున్నారు. ఓడిపోతున్నామని మనకు తెలిసినప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉంటుంది?అప్పుడు మనిషి ధైర్యంతో తనను తాను నిభాయించుకొని ముందుకు సాగాలి.జీవితంలో గెలుపు ఓటమి ఓ భాగం.నిటారుగా నిలబడి ఓటమిని జయించడానికి నడుచుకుంటూ వెళ్ళవచ్చు అని చెప్పిన తీరు చక్కగా ఉంది. మౌనం కవితలో నా మౌనం ఒక మౌనం కాదు/నా మౌనం వెనకాల దృశ్యాల పరంపర/నా మౌనం ఒక ఆంధీ/ఆంధీ గలీలు దాటుకుంటూ/జిందగీని/తవ్వుకుంటూ/చౌరంఘి లేన్ లో స్థిరపడింది/మౌనమే గొప్పది కదా/మౌనమే గొప్ప సంభాషణ కదా/అంటున్నారు.ఒక్కోసారి మనిషి మౌనంలోకి వెళ్లాల్సిన పరిస్థితులు తటస్థ పడతాయి.మౌనంలో కూడా గొప్ప భావాలు దాగి ఉంటాయి.మౌనాన్ని కవితామయం చేయడం బాగుంది.ప్రకృతి మనుషులు కవితలో నిజంగానే ప్రకృతిలో/నవ యవ్వనం ప్రతిఫలిస్తుంది/వేల ఏళ్లుగా ఇంతే/ప్రకృతికేమో వయసు తెలీదు/ఈ మనసులకే/ యవ్వనమూ ముసలితనమూ/ అంటున్నారు.ప్రకృతితో మనుషులను పోల్చిన తీరు అద్భుతం.సత్యం కవితలో ఏదో ఒకటి/దేనికోసమో ఒక దాని కోసం/నిరంతరం వెతుకుతూనే వుంటాం/ అనవరతం తిరుగుతూనే వుంటాం/అది సత్యం కావచ్చు/సౌందర్యం కావచ్చు/అన్వేషణ కొనసాగుతూనే వుంటుంది/జీవితం నిరంతరం చలనంలో వుంటుంది/చలనం వైరుధ్య భరితం అవుతుంది/వైరుధ్యంలోంచి సంఘర్షణ/ సంఘర్షణలోంచి సత్యం బయటపడుతుంది/ అంటున్నారు.సత్యం అనగా నిజాయితీ,త్యాగం వలె ఆచరించదగినది.సత్యం మనం పాటించవలసినట్టిది.సత్యం కోసం పాటు పడిన సత్య హరిశ్చంద్రుడు మనకు గుర్తుకు వస్తాడు. ఎందుకైనా మంచిది కవితలో ఎందుకైనా మంచిది/హృదయం తెరిచే వుంచాలి/మనసు గల ఏ మనిషో/తలుపు తట్టకుండానే పలకరించి పోవచ్చు/ కదుల్తూ కదుల్తూ ఆత్మ గలవాడు/ప్రేమ సంతకం చేసి పోవచ్చు/అంటున్నారు.ఎందుకైనా మంచిది అంటూ హృదయాన్ని తెరిచి ఉంచు అంటూ మనకు ప్రేరణ కలిగిస్తున్నాడు.వెల్తురు ముక్కలు కవితలో ఆ వెల్తురు ముక్కల్ని/చేతిలోకి తీసుకున్నా/ఒళ్లంతా వెల్తురు ప్రవహించింది/గది సంగతేమో కాని/నా లోపలి చీకటి అంతా పటాపంచలయింది/ అంటున్నారు.మనిషి జీవితంలో వెలుతురు కోసమే ఆరాటపడతాడు.వెలుతురుతోనే మనిషిలో చైతన్యం పొంగి పొరలుతుంది.వెలుతురు తోనే మనిషి ఏదైనా సాధించ గలుగుతాడు.కవి ఆనంద్ తాను వెలుతురులోకి వచ్చినట్లుగా చెప్పిన తీరు బాగుంది.బతికి పోదు కవితలో ప్రేమను పంచ గల/మనిషి ఎవరయినా కనిపిస్తే/అక్షరాలు వాక్యాలయి సంభాషణై/నిశ్శబ్దం పటాపంచలై పోను/నే బతికి పోదు/అంటున్నారు.ప్రేమ అనేది అత్యంత ఉత్కృష్టమైన సద్గుణం లేదా మంచి అలవాటు.లోతైన వ్యక్తుల మధ్య అనురాగం నుండి సరళమైన ఆనందం వరకు బలమైన భావోద్వేగ మరియు మానసిక స్థితిని కలిగి ఉంటుంది. సర్వసాధారణంగా ప్రేమ,బలమైన ఆకర్షణ మరియు భావోద్వేగ అనుబంధాన్ని సూచిస్తుంది.ప్రేమను పంచగల మనిషి కావాలి అప్పుడే సృజన ఆవిష్కృతమవుతుంది అని చెప్పిన తీరు బాగుంది. ప్రాణ వాయువు కవితలో నిద్రా మెలకువా/ రెంటిలోనూ కలలే/కలలు నిండా/ఆశలూ ప్రేమలే/ అవి మనకు ప్రాణవాయువులే/అంటున్నారు. మనిషికి నిద్రలోను కలలు వస్తాయి.మనిషికి మెలకువగా ఉన్నప్పుడు కలలు వస్తాయి.కలలు మనిషి జీవితానికి ప్రాణ వాయువులు.కలలలోనే మనిషి బతుకుతాడు.కలలు,ఆశలు,ప్రేమలు,మనిషి జీవితంలో పెనవేసుకుని ఉంటాయి అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.ఎప్పటికప్పుడు కవితలో ఎప్పటికప్పుడు/దరి కోసమో దారి కోసమో/ ఊపిరి కోసమన్నంత ఆర్తిగా/వెతుకుతూనే వున్నా/చీకటి తుఫానులో/చిక్కుకున్న ప్రాణానికి/రాత్రి లేదు పగలు లేదు/నిద్ర లేదు మెలకువా లేదు/అంటున్నారు.ఎప్పటికప్పుడు అంటూ మనిషి బతుకుకు అవగాహన కల్పిస్తున్న తీరు బాగుంది.కవలలు కవితలో దుఃఖం నాలో వున్నదో/నేను దుఃఖంలో వున్నానో/నాకు తెల్వదు/ నా కవిత్వం లాగే/భూమికీ ఆకాశానికీ మధ్య/నాకు నా అంతరంగానికి మధ్య/దుఃఖం అంటిపెట్టుకునే వుంటుంది/రోడ్డుమీదో కాగితం మీదో/నడుస్తూ ఉంటానా/ఒకడుగు నేల మీద/మరోటి ఆలోచనల్లో/అంటి పెట్టుకునే వుంటుంది/నాకు తెల్సు/దుఃఖమూ కవిత్వమూ కవలలని/ అంటున్నారు.దుఃఖము కవిత్వము రెండు కవలల వలె అంటిపెట్టుకొని ఉంటాయి అని చెప్పిన తీరు బాగుంది.కలలు కవితలో కళ్ళు మూసుకుంటానా/ కనురెప్పల తెరపై నీ/రూపం సాక్షాత్కరిస్తుంది/ చుట్టూ వేగంగా వీస్తున్న గాలిలో/నీ పాదాల సవ్వడి వినిపిస్తుంది/అంటున్నారు.నిద్రకు చెందిన స్థితిలో కొన్నిసార్లు అసంకల్పితంగా మనసులో మెదిలే భావాల,భావావేశాల,ఇంద్రియ సంవేదనల సందోహాలని కలలు అంటారు.మనిషి కలలు కంటాడు.కలలో ఆమె రూపం కనబడుతుంది.ఆమె పాదాల సవ్వడి వినిపిస్తుంది.కలల గురించి
కవిత రూపంలో వ్యక్తం చేయడం బాగుంది.లంగరు కవితలో నాకు కవిత్వం కేవలం కవిత్వం కాదు/సగం శబ్దం సగం నిశ్శబ్దం/ శబ్దమేమో బతుకు ఏడుపులోంచి/ఎగిసిపడుతున్న ఎక్కిళ్ళు/ నిశ్శబ్దమేమో బతుకు చేతగాని తనంలోంచి/ వ్యక్తమవుతున్న మౌనం/నిజానికి నాకు కవిత్వం/ కేవలం కవిత్వం మాత్రమే కాదు/సంక్షోభ కాల ప్రవాహంలో/నన్ను ఒడ్డుకు చేర్చే తెరచాప/బతుకు సమరంలో/నిలబెట్టే లంగరు/అంటున్నారు.కవి ఆనంద్ జీవితంలో కవిత్వం ఎంతగా పెనవేసుకుపోయిందో తెలియజేసిన భావాలు అద్భుతంగా ఉన్నాయి.నిశ్శబ్దం కవితలో నీకూ నాకూ మధ్య/నిటారుగా నిశ్శబ్దం/ మాటలుంటాయి/మమతలు కరువు/నీకు నాకు మధ్య/ట్రాన్స్పరెంట్ నిశ్శబ్దం/అంటున్నారు.మన నుంచి మనసుకు చేరిన మంచును ఎలా కరిగించాలి?కలల్ని బతుకుల్ని పండించుకునేదెట్లా అని చెప్పిన తీరు బాగుంది.పెద్ద తేడా లేదు కవితలో చుట్టూ ఉన్న చెట్లన్నీ గాలికి/ఊగి నాదాలు పలుకుతుంటే/మౌన నినాదమై నిలుచున్నాడతను/ ప్రశాంత సరస్సుపై కురుస్తున్న/చినుకుల సవ్వడి/ నేలరాల్తున్న ఆకుల గలగల/శబ్దం అంటని మౌనముని అతను/అతనికి నాకూ/పెద్ద తేడా లేదు/అంటున్నారు.అతనికి మౌనమునికి ఎలాంటి తేడా కనిపించడం లేదు అని చెప్పిన భావాలు విస్మయం కలిగిస్తాయి.జీవితం విసిరిన సవాలు అతనిని మునిగా మార్చింది.చిరు ప్రేమలు కవితలో నా మల్లెపూల బాల్యాన్ని/వదిలి వచ్చింది ఇక్కడే/ తెలియని తనాన్ని తెలిసినతనంగా/భ్రమ పడిందీ ఇక్కడే/ఇష్టమయిన వారి కోసం వెతుక్కుంటూ/ చౌరస్తాలో నిలబడిందిక్కడే/కాలం విసిరిన/వెలుగు కిరణాల దారులెంట/పడుతూ లేస్తూ నడుస్తూనే వున్నా/నడక నా గమ్యం కాదు/నా జీవనశైలి/ అంటున్నారు.చిరు ప్రేమలు కవిత బాల్యం నాటి సంగతులను గుర్తుకు తెస్తున్నాయి.మాట్లాడ కూడదు కవితలో ఒంటరితనంతో దిగాలు పడ్డ/బతుకు కెరటంపై/జంట పక్షుల కిలకిల రావాల్ని కురిపిస్తూ/స్నేహంగానో ధైర్యంతోనో/ఏదైనా మాట్లాడకూడదూ/మాటలు ఉట్టి మాటలే కాదు/ భావాల్ని మోస్తున్న/బాధ్యతా తరంగాలు/మనిషికీ మనిషికీ/మధ్య ధ్వని బంధాలు/అంటున్నారు.కవి ఆనంద్ మాటల గురించి అద్భుతమైన భావాల్ని పండించారు.కర్తవ్యం కవితలో యుద్ధం జరుగుతూనే ఉంది/లోపలా బయటా/గెలుపును చేరుకోలేను/ ఓటమిని అంగీకరించనూ లేను/కొనసాగుతున్న యుద్ధంలో గెలుపు ఓటములు ఎట్లా నిర్ణయిస్తావు/ముగియని యుద్దంలో/విజేత లెవరు పరాజితు లెవరు/పోరు అనివార్యమయిన చోట/యుద్ధమొక్కటే సిద్ధాంతం/కాలు కదపడమే కర్తవ్యం/అంటున్నారు.మనిషి లోపల మనసు లోపల జరుగుతున్న సంఘర్షణను కర్తవ్యం కవితగా మలిచిన తీరు అద్భుతం.రాత్రి కవితలో విరామం కావలసిన రాత్రి/నిద్రా మెలకువా కాని/సందిగ్ధ సందర్భమవుతుంది/అన్ని స్థితుల్నీ పటాపంచలు చేస్తూ/తూర్పున వెలుగు కిరణం/వేకువ ఒకటే/ రాత్రులు ఎన్నో/అంటున్నారు.ఒక్కోసారి విరామం తీసుకోవలసిన రాత్రి కళ్ళ మీద కునుకు లేకుండా చేస్తుంది.మనిషి జీవితంలో నిద్రలేని రాత్రులు ఎన్నో ఉంటాయి.కాని వేకువ ఒకటే అంటూ పాఠకులను ఆలోచింపజేస్తున్నాడు.నీడ కవితలో నీడది ఎప్పుడూ/వెల్తురుకు వ్యతిరేక దిశే/వెల్తురు చిమ్మితే విజృంభిస్తుంది/దీపం ఆరితే/ దిగాలుగా అదృశ్యమవుతుంది/పెరుగుతూ తరుగుతూ/నీడ ఒక బహు రూపి/నిలబడ్డానికైనా/అంతరంగ దర్శనానికైనా హృదయపు నీడే/ అంటున్నారు.నీడ మనిషి వెన్నంటే ఉంటుంది.చూడు చూడు నీడలు అని మహాకవి శ్రీశ్రీ అన్నాడు.నీడను కవితామయం చేయడం బాగుంది.అతను కవితలో మాటల పరిమళాల్ని/వెదజల్లుతూ/అతనొస్తాడు/నా ముఖం వికసిస్తుంది/విలువల పూల గంపని/నా ముందు బోర్లిస్తాడు/గదంతా పరిమళభరితమవుతుంది/ ఆయన నన్ను ఇష్టపడ్డాడో/నేను అతన్ని ప్రేమించానో/సుఖ సమయంలో కాదు కాని/దుఃఖ కాలాల్లో/నాలుగు ధైర్యపు చినుకుల్ని రాల్చాడు/ అంటున్నారు.ఆనంద్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అతను చూడడానికి వచ్చేవాడు.అతని సహచర్యంలో కలిగిన అనుభూతులు కవిత ద్వారా వ్యక్తం చేసిన భావాలు చక్కగా ఉన్నాయి.తల్లి వేరు కవితలో మనిషన్నంక/గాయపడ్తాం/కత్తులూ కటార్లతోనే కాదు/మాటలతో చేతలతో/మూతి విరుపులతో/గాలికి గాయాలను మాన్పే మర్మం తెలుసు/గాలి విశ్వవ్యాప్తం/మనస్సే మరింతగా/ విస్తరించాలి/తడితోనూ ప్రేమతోనూ/మనిషి తనానికి మనసు లోపల తడి/తల్లి వేరు/అంటున్నారు. మనస్సు విశాలం చేసుకుంటే అపార్థాలకు తావు ఉండదు,గొడవలకు ఆస్కారం ఉండదు.మనిషి మనస్సును అర్థం చేసుకోవాలి అంటూ తల్లి వేరు కవిత ద్వారా గొప్ప భావాలను పలికించారు.ఆమె కవితలో ఆమె/నడిచినంత మేరా/స్నేహ పరిమళాలు/సీతాకోకచిలుకల్లా విహరిస్తాయి/ పూలన్నీ తలవంచి/సలాములు చేస్తాయి/ లోకంలోని ధైర్యమంతా/నాలోకి ప్రవహిస్తుంది/ఆమె/ సాన్నిహిత్యం నిండా/ ప్రేమలు విరబూస్తాయి/ అంటున్నారు.ఆమెతో గడిపిన అనుభూతులు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి.ఇల్లు కవితలో వాకిలీ పెరడూ/పెద్దర్వాజా/రెండు తలుపులు తీసుకుని వెళ్తే/రెండు లోకాలు/కాపురం ఒక్కటే/ దేహాలు రెండు/బతుకు ఒకటే/భాషలే రెండు/ఒకటి ఆకాశమూ/మరోటి నేల/మాట మాటకు ఉరుము/ ఛత్ ఒక్కటే/మనసులే రెండు/ఎప్పుడూ విడిపోవు/ నిరంతరం సమాంతరం/ అంటున్నారు.ఇల్లుతో మనిషి బతుకును పోల్చిన తీరు అద్భుతంగా ఉంది.పులకరింత కవితలో గాలి అలల్నిండా/ సంగీతమే/శరీరం నిండా పులకరింతే/నా చెవుల్నిండా జీవితమే/ అంటున్నారు.అస్తమిస్తున్న సూర్యుడు, లోకాన్ని తడుముతున్న చిరుగాలి,గాలి అలల నుండి వినిపించే సంగీతం,ప్రకృతిలోని అందాలు చూడగానే శరీరం నిండా పులకరింత,నా చెవుల నిండా జీవితమే అంటూ పరవశించిపోవడం బాగుంది.కిష్టాపురం కవితలో గంగవతల అడవిలో/పొందిచ్చిన ఊరు/కిష్టాపూర్/నిజంగానే కిష్టాపురం/నాకు శ్వాసనిచ్చింది ఆత్మ నిచ్చింది/ సరికొత్త లోకాన్ని దర్శనమిచ్చింది/పట్నం గాలి నుంచి/విశాల ప్రపంచం వైపు/దారులు తీసింది/ అంటున్నారు.కిష్టాపురం గ్రామంలోఆనంద్ పెద్దమ్మ ఉండేది.కిష్టాపురం సందర్శించిన ఆనంద్ కు కలిగిన అనుభూతులు మధుర మనోహరంగా ఉన్నాయి. రూం నెం. 213 కవితలో నేను నిలబడే ఉన్నాను/ హృదయం పగిలిపోయింది/నాకెదురుగా కూర్చుని తలవంచుకుని/మాటల కోసం వెతుక్కుంటున్నావు నువ్వు/ఏదో చెప్పాలని ఎంతో చెప్పాలని/నాకు తెలుసు/నీ కళ్ళ వెనక అశ్రు పర్వతాలున్నాయని/నీ గుండెల నిండా అగ్నిగుండాలున్నాయని/ భవిష్యత్తుంతా శూన్యమయినట్టు/నీ కాళ్లు చేతులు ఆడటం లేదని/నేను నిలబడే ఉన్నాను/నిరర్థకమైన మాటల కంటే/నీ చేయిని నా చేతుల్లోకి తీసుకుని/ భవిష్యత్తులోకి నడవడం మొదలు పెట్టాను/ అంటున్నారు.ఆనంద్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు రూమ్ నెంబర్ 213 గదిలోకి తనకు కావలసిన ఆప్తుడు వచ్చినప్పుడు కలిగిన స్పందనగా తోస్తోంది. అతడితో ఆనంద్ ఏమీ మాట్లాడలేదు.ప్రేమగా అతడి చేయిని తన చేతిలోకి తీసుకొని భవిష్యత్తులోకి నడవడం మొదలు పెట్టాను అని చెప్పిన మాటలు బాగున్నాయి.దాఖలా కవితలో కాలానికి/నిరంతర గమనమే/గమ్యాల్ని మనమే నిర్దేశించుకోవాలి/వేగాన్ని మనమే అందుకోవాలి/ కాలానికి పోటీపడి/నడవడం అభ్యసించాలి/ అప్పుడు కదా/కాల పాదముద్రికల్లో/మన గుర్తులు మిగుల్తాయి/పలానా కాలంలో/ జీవించామనడానికి/దాఖలాలు మిగుల్తాయి/ అంటున్నారు.కాలం యొక్క విలువను తెలియజేసిన తీరు అద్భుతంగా ఉంది.నింగికి ఎగిరిన తార కవితలో కలాలకూ గళాలకూ బేడీలు ముసురుకుంటున్న కాలంలో/ఆయన అక్షరాలు కూర్చుకుంటూ/నిర్మలంగా నిల్చున్నాడు/కరీంనగర్ క్లాక్ టవర్ సాక్షి గా/వచ్చే వాళ్ళకూ పోయే వాళ్ళకూ/మిత్రులకూ యోధులకూ/యువకులకూ మేధావులకూ/దిక్సూచిగా నిర్భయంగా నిల్చున్నాడు/అంటున్నారు.జీవగడ్డ విజయ్ కుమార్ స్మృతిలో రాయబడ్డ కవిత ఇది.ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఉంది.వీడ్కోలు కవితలో మనం కలిసున్న క్షణాల కంటే తల్చుకున్న క్షణాలే అధికం/మన స్నేహానికి/వయసంతరాల్లేవు దూరభారాల్లేవు/ అంటున్నారు.వీడ్కోలు కవిత కూడా నరేందరు స్మృతి కవిత.మనిషి లోపల కవితా సంపుటిలోని కవితలు అన్ని ఆనంద్ హృదయం నుండి ఉబికి వచ్చిన భావాలు.వాటిని చక్కగా చదువుకోవచ్చు. చెరబండ రాజు రాసిన కవితా పంక్తి ఒకటి గుర్తుకు వస్తుంది.అనారోగ్య బాధితుడిని అయినా నేను యోధున్నే అని అన్నాడు.నిజంగా ఆనంద్ కలం యోధుడు.అతనిని మనసారా అభినందిస్తున్నాను. కవి ఆనంద్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని కోరుకుంటున్నాను..
పుస్తకం : మనిషి లోపల no man’s land
రచయిత : వారాల ఆనంద్
ప్రచురణ : ప్రోజ్ పోయెట్రీ ఫోరమ్
కరీంనగర్.
పేజీలు : 122
వెల. :₹ 60/-
ప్రతులకు :
వి.ఇందిరా రాణి,
ఇం.నెం. 8 – 4 – 641, హనుమాన్ నగర్,
కరీంనగర్ -505001.
సెల్ నెంబర్: 9440501281.
and
All leading Book sellers.