“ప్రతి ఒక్కరు తమ మాతృభూమిని,సంస్కృతిని, మాతృభాషను గౌరవించాలి. ఎందుకంటే అవి మనకు ఆనందాన్ని కలిగించేవి” – ఋగ్వేదం
భారతదేశంలో వాడుకలోకి వచ్చిన భాషలు 380. వీటిలో కొన్ని భాషల్లో వ్యాకరణం,సాహితీ సంపద ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా, లిపిలేని మౌఖిక రూపంలో ఉన్నా, ప్రతి భాష దాన్ని మాట్లాడే జాతికి అంతరాత్మ అవుతుంది. సమాజ భౌతిక వికాసానికి అనుమేయంగా భాషా సంపద అభివృద్ధి చెందుతుంది. ప్రతి భాష తానున్న పరిస్థితుల రీత్యా ప్రామాణికమైనది గాను, ప్రపంచభాషా సంపదలో తనదైన ముద్రతోనూ ఉంటుంది. ప్రపంచీకరణ పేరుతో కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకు పరిమితమైన అభివృద్ధి వ్యూహంతో సాగే ప్రభుత్వాలు, పాలకవర్గాలు మాతృభాషల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నాయనేది వాస్తవ విషయం. స్థానిక భాషలు అంతరించి పోతున్నాయి. జ్ఞానం ఎప్పుడూ స్థానికం నుంచి ప్రారంభమై విశ్వజనీన మ వుతుంది. ఆ ప్రయాణానికి అతి ముఖ్యమైనది భాష.
మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలిబడి. ప్రపంచంలో మాట్లాడే భాషలన్నిటికంటే మనం మన వ్యక్తిగత ప్రపంచంలో ఏ భాషలో మాట్లాడుతామో, ఏ భాషలో మన తల్లిదండ్రుల్ని అర్థం చేసుకుంటామో, ఏ భాషలో పాఠశాల్లో తోటి విద్యార్థులతో మాట్లాడుతామో అదే మన మాతృభాష. ఆ భాషే మన భావోద్వేగాల అభివృద్ధికీ, జ్ఞానాభివృద్ధికీ ఉపయోగపడటంలో గణనీయమైన పాత్ర నిర్వహిస్తుంది.
” నాగరిక జాతి మాతృభాషలోనే మాట్లాడుతుంది” అన్న డబ్ల్యూ.బి.ఈట్స్ మాటల్ని బట్టి మనది నాగరిక జాతి అవునోకాదో మనమే నిర్ణయించుకోవాలి. మాతృ భాష అనేది జాతి మనుగడకు జీవగర్ర వంటిది. మాతృ భాషను కాపాడుకోవడం అంటే వారసత్వాన్ని నిలుపు కోవడం వంటిదేనని చెప్పవచ్చు.
మనం మన మాతృభాష తెలుగుకు సంబంధించి సంధి దశలో ఉన్నాం. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే పరిస్థితి చేయి దాటిపోక తప్పదు. పద సంపదను, సాహితీ సొబగులను, వ్యాకరణ పారిజాతాలను, పలుకుబడులను పట్టించుకోకపోతే వాటి ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. ప్రామాణికీకరణ విషయాన్ని పక్కన బెడితే తక్షణం భాష స్థిరీకరణ చేసుకోవాలి. ఉన్నదున్నట్లు కాపాడుకోవడం పై శ్రద్ధ వహించాలి. వారసత్వ సంపదగా వస్తున్న వ్యాకరణం, ఉచ్చారణ,సాహిత్య సంపద ఒకచోట చేర్చి సంస్కృతిని పరిరక్షించాలన్నది మనందరి కనీసకర్తవ్యం. దీనిగూర్చి ఇప్పటివరకూ జరిగిన కృషి అంతంతమాత్రమే అని చెప్పవచ్చు. రాతప్రతుల్లో అక్కడక్కడా గ్రంథాలయాల్లో మాత్రమే ఈ సంపద నిక్షిప్తమై ఉంది. యావత్ తెలుగు భాషాసంపదను కంప్యూటరీకరిస్తే భాషను స్థిరీకరించు కోవచ్చు. ప్రపంచీకరణ పేరుతో పాలక వర్గాలు శరవేగంగా పరాయి భాషలను రథమెక్కించి ఊరేగిస్తుండగా ఆ రథచక్రాల కింద నలిపి వేయ బడుతున్న భాష,సాహిత్య,సంస్కృతులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే.మహోన్నతమైన తెలుగు భాష గత వైభవాన్ని విస్మరించరాదు.
ఘన చరిత్రను కలిగిన మన తెలుగు భాష క్రీస్తు పూర్వము నాలుగు వందల నుండి వాడుకలో ఉంది.
తెలుగు భాషను మాట్లాడుతున్నప్పుడు మన శరీరంలో 72,000 న్యూరాన్లు యాక్టివేట్ అవుతాయి. ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో కన్నా ఇదే ఎక్కువ అని సైన్స్ నిర్ధారించింది. అదేవిధంగా 2012లో ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ వారిచే తెలుగు భాష ప్రపంచంలో రెండవ బెస్ట్ స్క్రిప్ట్ గా ఎన్నికయింది.
కానీ విచారకరమైన విషయమేమంటే ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు భాషా అభివృద్ధిలో కీలకమైన విద్యా రంగంలో మాత్రం పరిస్థితి నిరాశాజనకంగానే ఉంది. విద్యారంగంలో తెలుగు వినియోగం బాగా పడిపోవడానికి కారణం ప్రపంచీకరణం అనే సాంఘిక ప్రక్రియగా మనకు తెలుస్తుంది.
ఒక జాతి నాగరికతను, సంస్కృతిని, ప్రజా జీవనాన్ని భాష ప్రతిబింబిస్తుంది. భాష కేవలం భావ వ్యక్తీకరణ,భావప్రకటన సాధనంగానేకాక, భావాలను సమైక్యపరచి భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి దోహదపడుతుంది. పరిపాలన నిర్వహణలో ప్రపంచంలో ఏ దేశంలోనైనా,ఏ ప్రాంతంలోనైనా అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే భాష అధికార భాష అవుతుంది. అటువంటి అధికార భాషగా మాతృభాష ఉంటే మరింత మేలు జరుగుతుంది.
మనం మొట్టమొదటగా నేర్చుకునేదీ , ఎక్కువగా మాట్లాడేదీ, భావావేశ లేదా హృదయానుగత సంబంధం కలిగినదీ, ప్రతీచర్యలో ఉపయోగించేది మాతృభాష. ప్రపంచవ్యాప్తంగా జరిపి న పరిశోధనల ద్వారా విద్యార్థులు ఏశాస్త్రమైనా, ఏ ఇతర భాషలు నేర్చుకోవడానికైనా మాతృభాష మాధ్యమమే సరి అయినదని తేల్చారు. జపాన్, ఐర్లాండ్, ఐలాండ్, చైనా వంటి దేశాలు మాతృభాషలో విద్యాబోధన అందిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ‘బహుళ భాషల సమాజాల మనుగడ నేడు వాస్తవమైనా మాతృభాష పరిరక్షణ తప్పనిసరి అవుతుంది. ‘ అని ప్రకటించారు 2012 ఫిబ్రవరి 21న అప్పటి యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరీనా బొకోవా. ‘నేను నా అభిమాన భాషలోనే మాట్లాడుతాను. ఎందుకంటే నా ఉనికికి నా భాషే కారణం గనుక. మా అభిమాన మాతృభాషనే మాబిడ్డలకు నేర్పుతాం వారెవరో వారికి తెలియడం అవసరంగనుక.’ ఇవన్నీ యునెస్కో నినాదాలు మానవునిలో సృజనాత్మక శక్తికి ఆధారం భాష. మాతృభాష స్వేచ్ఛను ప్రతిఫలిస్తుంది. అంతరంగాన్ని వెల్లడిస్తుంది.ప్రజాస్వామ్య పునాది పైనే అది వికసిస్తుంది. అయితే మన విషయానికివస్తే నేటి కాలంలో మానవ సంస్కృతిలో యాంత్రికత ప్రబలి పోతున్న కారణంగా మనిషిలోని మానవత్వానికి ప్రతీకలుగా నిలిచే భాష, సాహిత్యం, కళలు వంటివి ప్రగతి పేరుతో ప్రపంచీకరణ మోజులో పడిపోతూ సాంస్కృతికతను కోల్పతుండటం శోచనీయమైనది.
ప్రాథమిక విద్యాస్థాయిలో మాతృ భాషా మాధ్యమం అనివార్యమైన అవసరమని భారత రాజ్యాంగం (అధికరణం 350 ఎ), 1964 -66 నాటి కొఠారీ కమిషన్ మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యకతను తెలియజేశాయి.2010లో భారత ప్రభుత్వం తెచ్చిన విద్యాహక్కు చట్టం విభాగం 29 (2 ) లో ఎలిమెంటరీ స్థాయిలో వీలైనంత వరకు మాతృభాష మాధ్యమాన్ని అమలు చేయాలని నిర్దేశించింది. నూతన జాతీయ విద్యా విధానం (2020)కూడా ఐదవ తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరగాలని సూచించింది. అంతర్జాతీయ సంస్థలైన యునెస్కో, వరల్డ్ బ్యాంక్ ,వరల్డ్ డిక్లరేషన్ ఆన్ ఎడ్యుకేషనల్ ఫరా ల్ (ఎఫ్. ఎఫ్.ఏ), జనరల్ అసెంబ్లీ వంటి సంస్థలన్నీ పిల్లలకు ప్రాథమిక విద్యను మాతృభాషలో నేర్చుకునే హక్కుందని నిర్ధారించాయి. జ్ఞానార్జనకు మాతృభాష పునాది వంటిది. పిల్లల్లో విద్యాభ్యాస సమయంలో ఆసక్తి, అవగాహన పెంపొందించడానికి మాతృభాషలో బోధన అత్యంతావశ్యకం. విద్యార్థుల మనోభావాలను సాకల్యంగా తేటతెల్లం చేయడానికి, క్రొత్త విషయాలను ఆకళింపు చేసుకోవడంలో మాతృభాష భూమికగా నిలుస్తుంది. మాతృభాషలో బోధన ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసంతో పాటు దేశాభిమానం, దేశభక్తి వెల్లివిరుస్తాయి. మాతృభాషలో విషయాన్ని వ్యక్తం చేయడం, బోధన,అభ్యసన వంటి ప్రక్రియలు సులభతరం అవుతాయి. అలాగే వ్యక్తిత్వ వికాసానికి, కళాపోషణ,సాహిత్యాభిరుచి, సృజనాత్మకత,వివేచనా శక్తి మొదలైన సామర్థ్యాల పెంపుదలలో మాతృభాష ప్రధాన పాత్ర వహిస్తుంది.
మాతృభాషలో అధ్యయనం ద్వారా బట్టి విధానానికి స్వస్తి పలకడమే కాకుండా, అవగాహనతో కూడిన భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించ గలుగుతారు. మాతృభాషలో విద్యార్థి జ్ఞానాన్ని పెంపొందించుకుని స్వీయ రచన కోసం సంసిద్ధుడవుతాడు. మాతృభాష మాధ్యమం వల్ల దేశీయ భాషలు అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా విద్యార్థులు మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు ఆట పాటల ద్వారా శారీరక మానసిక వికాసం కలుగుతుంది. తద్వారా సామాజిక స్పృహ పెంపొందుతుంది. మాతృభాషలో బోధన ద్వారా పిల్లల అభ్యసన క్రమం మరింత మెరుగు పరచడంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం పెరుగుతుంది. తద్వారా సత్ఫలితాలు సాధించవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వ వికాసంలో మాతృ భాష బోధన కీలక పాత్ర వహిస్తుంది. కానీ నేడు చదువులు ఆంగ్ల మాధ్యమంగా సాగడం అనేది తప్పనిసరి అవసరంగా ప్రజలు భావిస్తున్నారు. దీనికి కారణం ఇంగ్లీషులో చదివితేనే ఉద్యోగాలు వస్తాయని భావించడమే. అయితే నిరుద్యోగానికీ, ఆయా దేశ ప్రభుత్వాలు అనుసరించే ఆర్థిక విధానాలకీ ఉన్న సంబంధం గుర్తించలేని విద్యావిధానాన్ని విడనాడాలి. ప్రతిభకేత ప్ప భాష ప్రాతిపదికగా ఉద్యోగాలు లభించవని గుర్తించగలగాలి.కావున ఇప్పటికైనా విద్యను గురించి వ్యాపార దృష్టితో కాకుండా మానవీయ కోణంలో ఆలోచించాలి. మాతృభాష మాధ్యమంగా బోధన సాగించి, విలువల విద్యను అందించాల్సిన అవసరాన్ని తెలుసుకొనగలగాలి. యునెస్కో రిపోర్టు ప్రకారం వారి పరిశీలనల ప్రకారం ఏ భాష అయినా కనీసం 40 శాతం మంది మాతృభాషలో విద్యను నేర్చుకోకపోతే కొద్ది సంవత్సరాల్లోనే ఈ భాష అంతరించి పోతుంది. ఈ పరిస్థితికి దరిదాపుల్లో ఉన్న తెలుగు భాషను పరిరక్షించాల్సిన బాధ్యత పాలకులు, పాలితుల పైన ఉందనేది మరవరాదు.
కన్వెన్షన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ (సి ఆర్ ఎస్) ఆర్టికల్ 29, 1 ఓ సెక్షన్ 269 లో ఆర్టికల్ 29 ప్రకారం మాతృభాషలోనే విద్య నేర్చుకునే విద్యార్థులకు తెలివితేటలు ఎక్కువ ఉంటాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా మాతృభాషలో విద్యాభ్యాసం ద్వారా ప్రపంచంలోకి చూసే హక్కు పిల్లలందరికీ ఉందని నిర్ధారించడమైనది. పిల్లలకున్న భాషా పరమైన హక్కుని దృష్టిలో పెట్టుకుని మాతృభాషను క్షుణ్ణంగా నేర్పాలి. డాకర్ ఫ్రేమ్ వర్క్ ఫర్ యాక్షన్ (2000), వరల్డ్ డిక్లరేషన్ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ (1990 )యునెస్కో లాంటి సంస్థలు పిల్లల భాషాపరమైన హక్కుని తెలియజేస్తున్నాయి.
విద్యార్థుల్లో సమగ్ర వికాసానికి మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యకత ప్రముఖుల మాటల్లో….
సుప్రసిద్ధ అమెరికన్ భాషా శాస్త్రవేత్త నోమ్ చామ్స్కీ వాదన ప్రకారం విద్యార్థికి 15 నుండి 20 సంవత్సరాలు వచ్చే వరకు మాతృభాషలో బోధన జరిపిన తర్వాత మాత్రమే ఏదైనా ఇతరభాష బోధనాభాషగా ప్రవేశపెడితే అతడు అభ్యసనం సులభంగా సాగించగలడు.
“Indian Education will collapse if, mother tongue is not as a medium of Instruction ” అంటున్న పంజాబ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జోగాసింగ్ గారి లాంటి పెద్దల మాటలను పెడచెవిని పెట్టకుండా చిత్తశుద్ధితో కార్యాచరణ దిశగాఅడుగులు వేయాలి.
“వ్యక్తి ఏ భాషా జాతీయతకు, ఏ సాంస్కృతిక వారసత్వానికి,ఏ ప్రాంతానికి చెందినవాడో అతని భాష చెప్తుంది. వ్యక్తుల అస్తిత్వం వారి మాతృభాష వల్లనే రుజువవుతుంది. మాతృభాషను పదిలపరచుకోవడం ద్వారా వ్యక్తి తన ఉనికిని తానే నిలుపుకుంటాడు. విద్య గ్రామీణుల అవసరాలు తీర్చేదిగా ఉండాలి. విద్యాబోధన మాతృభాషలోనే జరగాలి. కొల్లగొట్టుకు తినే సామ్రాజ్యవాదులకు సహాయకారిగా ఉండకూడదు.” -మహాత్మాగాంధీ (1937 )
” మాతృ భాష యందు విద్య గరుపుటయే మిక్కిలి సహజమైన మార్గము. ఆంగ్ల దేశమునందు ఆంగ్లేయులకు ఆంగ్లభాష యందును, ఫ్రాన్స్ దేశమునందు ఫ్రెంచి భాష యందును విద్య గరపబడుచున్నది. కానీ ఇతర భాషల యందు గరపబడుట లేదు. మన ప్రస్తుత విద్యా విధానము నందు అనేక లోపములు గలవు. అందులో మొదటిది మన బాలురు విషయ జ్ఞానము లేకయే తమ పాఠములను గ్రుడ్డితనంగా వల్లించి మెదడులోనికి ఎక్కించుకొనుట. ఆ పాఠములు పరభాషలో నుండుట వలన బాలురు వానిని జ్ఞాపకముంచుకొనుటకే యత్నించుచున్నారుకానీ తాము చదివే పాఠముల యొక్క అర్ధమునుగానీ, విషయమునుగానీ గ్రహించుటకు యత్నించుట లేదు. దీనివలన వారి గ్రహణ శక్తి నశించి పోవుచున్నది. జ్ఞానమును అభివృద్ధి చెందించని విద్య నిజమైన విద్య కానేరదు.అటువంటి విద్యావిధానం ఖండం ఖండనార్హము.”- సర్ కట్టమంచి రామలింగారెడ్డి
ప్రసిద్ధ తెలుగు భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి గారు చెప్పినట్లు పాఠశాల స్థాయిలో ఐదో తరగతి దాకా మాతృభాషలోనే అన్ని అంశాలు చెప్పాలి. ఆరో తరగతి నుంచి ఒక పాఠ్యాంశంగా ఆంగ్లం నేర్పడం,ఎనిమిదో తరగతి నుండి పదో తరగతి వరకు ఏటా ఒక సబ్జెక్టును ఆంగ్లంలో ప్రవేశపెట్టడం ప్రధానంగా విజ్ఞాన శాస్త్రాలు, సాంకేతిక విషయాలు. ఒకటి నుండి పదో తరగతి వరకు తెలుగు చదువుకునే పిల్లలకు ఆంగ్లం నేర్చుకోవడం సులభం అవుతుంది. భావ వ్యక్తీకరణలో సృజనాత్మకత దెబ్బతినకుండా ఉంటుంది. విజ్ఞాన శాస్త్ర విషయాలను అంచెలంచెలుగా 8 -10 తరగతుల్లో ఉభయ భాషా విధానంలో నేర్పాలి. అప్పుడు అవగాహన బాగా పెరిగి పై తరగతులకు వెళ్ళినప్పుడు ఉభయ మాధ్యమాలకు అలవాటు పడతారు. వీటిని అమలు చేస్తే తెలుగు చిన్నారుల నైపుణ్యాలకు ఆకాశమే హద్దుగా ఉంటుంది.
“మానవ నియో కోర్టెస్క్ (మెదడు పై భాగం)లో పెద్ద భాషా సంబంధిత ప్రాంతం ఉంటుంది. తెలివితేటలు, విశ్లేషణా శక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను అది ప్రభావితం చేస్తుంది. మాతృ భాషలో చదువుకుంటున్నప్పుడు అది విశేషంగా స్పందిస్తుంది. మెదడు దాని సారాంశాన్ని జీర్ణించు కుంటుంది. దాని లోతుపాతులపై మెరుగైన పద్ధతిలో చర్చించడానికి,తిరిగి ప్రశ్నించడానికి అవసరమైన చురుకుదనాన్ని ప్రేరేపిస్తుంది.”- డాక్టర్ అశోక్ పంగారియా
మాతృభాషలో బోధించడం అంటే పిల్లలకు వాళ్ళ జాతి సంస్కృతుల్ని గూర్చి తెలియజెప్పటమే అంటున్న పరిశోధకులు, భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని,పాఠశాలల్లో బోధనాభ్యసన పద్ధతులు, విధి విధానాలను రూపొందించే విషయంలో ప్రభుత్వాలు జాతి మనుగడపై దృష్టిసారించాలి. అలాగే తల్లిదండ్రులు కూడా ఆ దిశగా ఆలోచించి సహకరించాలి.
అభ్యాసకునికి మొదటి భాష (మాతృభాష) ద్వితీయ భాష నేర్చుకోవటంలో ముఖ్య కారకమవుతుంది. మొదటి భాష రెండవ భాష నేర్చుకోవటంలో చేతనంలోగానీ, ఉప చేతనంలోగానీ ఉపకరణంగా సహకరిస్తుంది. మాతృభాష వచ్చాక అవకాశాన్ని బట్టి,అవసరాన్ని బట్టి,ఇష్టాన్ని బట్టి,ఇతర భాషలు నేర్చుకోవడం సులభతరం అవుతుంది. మాతృభాషలో విద్యా బోధన వల్ల విద్యార్థికి బోధన అంశం సమగ్రంగా అర్థమవుతుంది. నైపుణ్యాలు పెరుగుతాయి. మాతృభాషలో అభ్యసనం విద్యార్థులకు వినయవిధేయతలను అందిస్తుంది. ఐక్యరాజ్యసమితి 2019 సంవత్సరాన్ని అంతర్జాతీయ స్వదేశీ భాషల సంవత్సరంగా ప్రకటించింది. కనుమరుగయ్యే స్థితిలో ఉన్న భాషలను పరిరక్షించుకోవాలన్నది దానర్థం. ఒక భాష అభివృద్ధి అనేది ఒక వ్యక్తి సమగ్ర అభివృద్ధికి భూమిక అని ఒక యాభై ఏళ్ళ క్రితమే ఆధునిక హిందూ పిత భారతేందు హరిశ్చంద్రగారన్న మాటల్ని బట్టి మాతృ భాష మీద అవగాహన లేకుండా ఒక వ్యక్తి ఎదుగుదల అసాధ్యం అని అర్థమవుతుంది. గణితం విజ్ఞాన శాస్త్రం వంటి వాటిని మాతృభాషలో బోధించడం వల్ల సృజనాత్మకత పెరుగుతుంది.ప్రాథమిక పాఠశాల స్థాయిలో పిల్లలు చూపే సృజనాత్మకత వారి భవిష్యత్తుకు పునాది వంటిది. అది మాతృభాషలో బోధన ద్వారానే సాధ్యమౌతుంది. చిన్నారుల వ్యక్తిత్వానికి సంబంధించిన మేధోపరమైన, నైతిక లక్షణాలను అభివృద్ధి చేయడంలోమాతృ భాష కీలక పాత్ర పోషిస్తుంది. ఇంట్లో సమాజంలో పిల్లాడికి చుట్టుపక్కల ఎక్కువగా మాట్లాడే భాషకు సంబంధించిన దృశ్య శ్రవణ సంకేతాలను మెదడులోని మిర్రర్ న్యూరాన్స్ గ్రహించి, వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తాయి. చిన్నారికి మాతృభాషలో శ్రవణ భాషణములందు నైపుణ్యము సిద్ధించే వరకు ఈ అనుకరణ కొనసాగుతుంది.మానవ మేధో వికాసానికీ,,ఆలోచనాశక్తి అభివృద్ధికీ మాతృభాషే ప్రాథమిక సోపానం. ప్రాంతాలపరంగా నైతేనేమి,ప్రా కృతిక పరంగానైతేనేమిఒకే భాషాజాతిలో నెలకొనే సాంస్కృతిక వైవిధ్యాలను, వారసత్వాలను కాపాడుకోవాలంటే మాతృభాషా పరిరక్షణ అత్యంతా వశ్యకము.
మాతృభాషలో బోధన ద్వారా విద్యార్థుల సమగ్ర వికాసానికి బాటలు వేయడానికి మనం ఆచరించవలసిన ప్రస్తుత కర్తవ్యం ఏమిటంటే ప్రపంచీకరణ పేరుతో మనకు దగ్గరైన సాంకేతిక నైపుణ్యాన్ని అంతర్జాలాన్ని వినియోగించుకుంటూ మన భాష,సాహిత్య,సాంస్కృతిక సంపదలను మూలాలతో సహా పదిలపరచుకొని భావితరాలకు వారసత్వపు హక్కుగా అందించాలి. తెలుగు సాహిత్యం లోని విశిష్టమైన అవధానం వంటి ప్రక్రియల్లో విద్యార్థులకు అభినివేశం కల్పించి,వారి మేధోవృద్ధికి తోడ్పడాలి.తెలుగు భాష లోని సాహిత్య, సాంస్కృతిక, పౌరాణిక,చారిత్రక, నైతిక,మానవీయ విలువలతో కూడిన అంశాలతో పాఠ్యాంశాలను రూపొందించాలి. ఈ విధమైన కృషి ద్వారా మన మాతృభాష ఘనతను ప్రపంచానికే తలమానికమగునట్లు విశ్వవ్యాప్తం చేస్తూ మాతృభూమి రుణం తీర్చుకునే ప్రయత్నం నిర్విరామంగా కొనసాగాలని ఆశిస్తున్నాను.
* పాఠశాల యందు పాఠ్యాంశ బోధన
మాతృభాష లోనె మధుర మవుచు
కన్న ప్రేమ లోని కమ్మదనము బంచి
బాల బాలికలకు భవిత నొసగు
* మాతృభాష లోని మాధుర్యము నెరిగి
ఆత్మ శుద్ధి తోడ ఆదరించు
పరుల భాషలోన పలుకుట యేలరా
నీదు భాష గూర్చు నీకు ఘనత