వ్యక్తులను చిరంజీవులుగా చేసే అంశాల్లో సాహిత్యం ఒకటి.ఆ కోణంలో సమాజ హితం కోసం అవిశ్రాంతంగా సంస్కృత ఆంధ్ర భాషల్లో విశేషమైన రచనలు చేసి ఇటీవలే స్వర్గస్తులైన అవధానులు డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ గారు నిజంగా చిరంజీవులే.
సంస్కృత ఆంధ్ర భాషల్లో లబ్దప్రతిష్టులైన సరస్వతీ పుత్రులు డా.అయాచితం నటేశ్వరశర్మ గారు జూలై 17 ,1956 లో కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి గ్రామంలో జన్మించారు. పూవ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లుగా అయాచితం వారు 1969లో విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లోనే సంస్కృతంలో,తెలుగులో పద్య, గేయ రచనలు చేయడం మొదలుపెట్టారు. తన సంస్కృత పాండిత్యంతో విద్యార్థి దశలోనే జయేంద్ర సరస్వతి గారిని మెప్పించడం ఆయనకే చెల్లింది. జయేంద్ర సరస్వతి గారు” నీవు ఎప్పటికైనా గొప్ప కవిగా పేరు తెచ్చుకుంటావని ” అతనితో అన్న మాటే తదనంతర కాలంలో నిజమైంది. నటేశ్వర శర్మ గారు తిరుమలలోని సంస్కృత పాఠశాలలో ,తరువాత శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో,తదనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటీలో “ఆముక్తమాల్యద” కావ్యంపై ఎం.ఫీల్ శంకరభగవత్పాదుల” సౌందర్య లహరి” పి.హెచ్ డి చేసి బంగారు పతకం అందుకున్నారు. కామారెడ్డి లోని ప్రాకృత విద్యా పరిషత్ ప్రాచ్య కళాశాలలో సంస్కృత అధ్యాపకుడిగా 1977లో ఉద్యోగ జీవితం ప్రారంభించిన నటేశ్వర శర్మ 2014లో అదే కళాశాలలో ప్రధానాచార్యుడిగా పదవీ విరమణ పొందారు. 2011 నుంచి 2013 వరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రాచ్య భాషా విభాగానికి డీన్ గా సేవలందించారు. ఆయన సాహిత్యంలో ఎక్కువగా మంచితనం మానవత్వాన్ని సృజించేవారు.చెడును ఎక్కడున్నా ఖండించేవారు. దానికి ఈ మాటలే సాక్ష్యం” మాటలు/ సిరుల మూటలే/ వాటిని వృధా పోనీయకు/ మాటలలో చెడును రానీయకు/ మాట ప్రాణం/ మాట ధ్యానం /ఒక్క నిమిషమైనా/ అసత్యం కానీయకు/ మౌనపంజరంలో/ మాట సురక్షితం/ పంజరాన్ని దాటనీయకు/ మాటలోని అమృతాన్ని ఆస్వాదించు/ మాటలోనే ఆనందాన్ని అనుభవించు”. తన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికిని తను రచనలను వదిలిపెట్టలేదు. సాహిత్యాన్ని ధ్యానించాడు,సాహిత్యాన్ని శ్వాసించాడు. దాని ఫలితంగానే సంస్కృత ,తెలుగు భాషల్లో మొత్తంగా 50కి పైగా రచనలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి. అందులో పద్యాలు,గేయాలు,శతకాలు, ఖండకావ్యాలు విమర్శలు కూడా ఉన్నాయి. వాటిల్లో బాల రామాయణం, సమయ విలాసిని ,శకుంతల,రుతుగీత, నవ్య గీతి, భారతీ ప్రశస్తి,ఆముక్తమాల్యద- పరిశీలనలు,వసంతకుమారి, శ్రీ షోడశీ,చుక్కలు ,సౌధామినీ విలాసం, చైత్ర రథం,చుక్కలు మొదలైనవి గొప్ప రచనలుగా పేరుపొందాయి. వీరి సేవలను గుర్తించిన భక్తి సాధనమనే ఆధ్యాత్మిక సంస్థ గజారోహణతో సత్కరించింది.
సంస్కృత,ఆంధ్ర భాషల్లో విద్వత్కవి అయిన అయచితం వారు అష్టావధానాలను ఎంతో ఇష్టంగా చేసేవారు. ఆయన శతావధాని గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ అవధానాలతో స్ఫూర్తి పొంది డా.రంగనాథ వాచస్పతి గారితో కలిసి జంటగా అవధానాలు చేశారు. వారు తమ జీవితంలో మొత్తం 125 పైగా అష్టావధానాలు, శతావధానాలు చేశారు.
తన రచనలతో అవధానాలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన శర్మ గారిని అనేక పురస్కారాలు వరించాయి. 2009లో రంజని విశ్వనాథ కవిత పురస్కారం, 2010లో కిన్నెర ఆర్ట్ థియేటర్ వారి వచన కవితా పురస్కారం , 2011లో కిన్నెర కుందుర్తి వచన కవితా పురస్కారం, 2012లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి అవధాన కీర్తి పురస్కారం, 2013లో సర్వవైదిక సంస్థానం విశిష్ట కవి పురస్కారం,అదే సంవత్సరంలో తెలంగాణ పద్య సాహిత్య పురస్కారం, 2014లో శాతవాహన విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, అదే సంవత్సరంలో తేజ ఆర్ట్ క్రియేషన్స్ నుంచి విశిష్ట కవి పురస్కారం, ఆ సంవత్సరంలోనే భక్తి టీవీ వారి ఆధ్యాత్మిక సేవా పురస్కారం, 2017 లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అవధాన ప్రతిభా పురస్కారం, 2016లో ఇందూరు అపురూప సాహితీ పురస్కారం, 2020లో వర్గల్ సరస్వతి క్షేత్రం వారి అవధాన భారతి పురస్కారం, 2021లో మల్లినాథ సూరి కళా పీఠం వారి మహోపాధ్యాయ పురస్కారం, 2021 లోని డి.వి.ఎల్ శాస్త్రి స్మారక సాహితీ పురస్కారం, ఆ సంవత్సరంలోనే కోటం రాజు స్మారక సాహితి పురస్కారం, వంటి పురస్కారాలను ఎన్నింటినో అందుకున్నారు. చివరగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యుత్తమ సాహితీ పురస్కారమైన దాశరధి పురస్కారాన్ని 2023లో అందుకున్నారు.
ఒక కవి అన్నట్టు “నేను జైలులో బంధీనై ఉన్నాను, కానీ నిజానికి నేనున్నది ప్రజల మధ్యలోనే”అలాగే భౌతికంగా అయాచితం మన మధ్య లేకపోయినా వారి సాహితీ సంపదను మన మధ్య వదిలి వెళ్లిపోయారు.తెలుగువారు ఉన్నంతకాలం అయాచితం వారు ఉంటారు. వారి సాహితీ గుబాళింపులను తెలుగువారందరూ ఆఘ్రాణిస్తూనే ఉంటారు.