Home వ్యాసాలు విశిష్ట అధ్యాపకులు వెల్లలూరి వెంకట రాఘవశర్మ

విశిష్ట అధ్యాపకులు వెల్లలూరి వెంకట రాఘవశర్మ

1950 లో హైదరాబాదు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకుల కోసం ఇంటర్యూలు నిర్వహించింది. హేమాహేమీలైన తెలుగు పండితులు ఉద్యోగార్థులై వచ్చారు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో లేదా బ్రిటిష్ ఆంధ్రలో కన్న నిజాం ప్రభుత్వంలో లెక్చరర్లకు 150 రుపాయల జీతం అధిక మని వినికిడి. అందువల్ల ఇతర విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నవారు సైతం ఇక్కడికి రావాలని కోరుకునేవారు. పింగళి లక్ష్మికాంతం, విశ్వనాథ సత్యనారాయణ, నిడుదవోలు వెంకటరావు, గంటిజోగి సోమయాజి లాంటివారు వచ్చారని వినికిడి. వారంతా వయసులో మరీ పెద్దవారు కావడం అభ్యంతరకరమైంది. కొత్తపల్లి వీరభద్రరావు ఇంటర్వ్యూకు హాజరైనట్లు, సెలెక్ట్ కానట్లు స్వయంగా చెప్పుకున్నారు. సెలెక్టయిన వారు ఇద్దరు. 1. వెల్లలూరి వెంకటరాఘవ శర్మ 2. దివాకర్ల వెంకటావధాని. రాఘవశర్మ 1950 లో చేరి 1951 ఉత్తరార్థంలోనే ఇక్కడి వాతావరణం సరిపడక రాజీనామా చేసి వెళ్ళి పోయారు. దివాకర్ల వ్యక్తిగత కారణాలతో ఏడాది పాటు ఆలస్యం చేసి 1951 జూన్ లో ఉస్మానియా తెలుగు శాఖలో చేరారు. ఇక్కడే రిటైర్ అయ్యారు .

వెల్లలూరి వెంకట రాఘవశర్మ గురించి వివరాలు పెద్దగా తెలియడంలేదు. చిత్తూరు వాస్తవ్యులు. జననం.3-9-1912. ఉస్మానియా తెలుగుశాఖలో చేరిన తేది 10-8-1950. బక్కగా ఎర్రగా నిగనిగలాడుతూ ఉండేది. తలపాగ – జోద్ పురి కోటు, పింజలు పోసిన ధోవతి. బూట్లు వేసుకోక పోయేది. చెప్పులు వేసుకొనేవారు. ఇది వారి ఆహార్యం. కాస్త ఎత్తు పండ్లు కూడ ఉండేవి. ఆపారమైన పాండిత్యం ఆయన సొంతం. బి.ఓ.యల్ పూర్తి చేసిన పిదప 1940 లో మదరాసు విశ్వవిద్యాలయం నుండి నన్నెచోడ మల్లికార్జునుల కృతుల్లోభాష గురించి సిద్ధాంతవ్యాసం రాసి ఎం. ఓ. యల్ పట్టం గ్రహించారు. సంస్కృతాంధ్రాంగ్లభాషల్లో కూలంకషమైన పాండిత్యం, కన్నడ తమిళాల్లో అభినివేశం కలవారు. సంగీతజ్ఞానం ఆయనకు అదనపు ఆకర్షణ. ఉద్యోగానికి జరిగిన ఇంటర్వ్యూ లో అప్పటి తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం, విషయనిపుణులు (subject expert) గా అంధ్రవిశ్వవిద్యాలయం తెలుగుశాఖాధ్యక్షులు గంటి జోగిసోమయాజులు, పబ్లిక్ సర్వీసు కమీషన్ సభ్యులు, ఇంగ్లీష్ ప్రొఫెసర్ తనికెళ్ళ వీరభద్రుడు, ఇంకా మరికొందరు సభ్యులున్నారు. ఇంకా ఆనాటి ఉస్మానియావిశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు నవాబ్ అలీయావర్ జంగ్ బహద్దూర్, బూర్గుల రామకృష్ణారావు, వి.బి. రాజు కూడా సభ్యులని కొత్తపల్లి వీరభద్రరావుగారు పేర్కొన్నారు. అప్పటి ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపల్ దొరైస్వామి కూడా ఇంటర్య్వూలో ఉంటే ఉండవచ్చు. సభ్యుల్లో ఒకరు కారకమంటే ఏమిటి అని ప్రశ్నించారు. కారకం ఒక్కటి ఉండదు. కర్తృకారకం, కరణకారకం, అధికరణకారకం అంటూ ధారాపాతంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఇంటర్వ్యూ చేస్తున్న పెద్దలందరూ ప్రసన్నులయ్యారు. సెలెక్ట్ చేశారు. హైదరాబాదులో 1950 లో కాపురం పెట్టారు. అద్దె ఇల్లు దొరకడం కష్టమయింది. నేరుగా అప్పటి ముఖ్యమంత్రి ఎం.కే వెల్లోడి ప్రభుత్వంలోని ఒక మంత్రిని వెళ్లి వసతి సౌకర్యం లేనప్పుడు ఎలా ఉండగల మని ప్రశ్నించారు. మంత్రి గారు ఏవో రెండు మూడు ప్రభుత్వ క్వార్టర్స్ సూచించారు. కాచిగూడ రైల్వేస్టేషన్ దగ్గరున్న ఒక చిన్న ప్రభుత్వ క్వార్టర్స్ లో ఉన్నారు. ఆర్ట్స్ కళాశాలలో బి. ఏ క్లాసులు ఎం. ఏ క్లాసులు ఇచ్చారు.

బి.ఏ (రెండవసంవత్సరం) లో సి. నారాయణరెడ్డి, ఎం. ఎల్. నరసింహారావు (?), రసగ్రాహి కలంపేరుతో కవితలు రాసిన తోటపల్లి యజ్ఞనారాయణశర్మ లాంటి వారు విద్యార్థులు. అందరి కంటె ఆరేడేళ్ళు పెద్ద అయిన చలపతి రెడ్డి మరో విద్యార్థి. బి.ఏ (మొదటిసంవత్సరం)లో ఎం. కులశేఖరరావు, ఇరివెంటి కృష్ణమూర్తి, బాలకృష్ణ, తిరుపతిరంగారావు, చంద్రమరాజు మొ. వారున్నారు. ఆరోజుల్లో బియ్యే రెండేళ్ళు మాత్రమే వుండేది. సినారె batch కు కొన్ని నెలలు మినహా రెండేళ్ళు (1950 ఆగస్టు-  1951 జూన్ తరువాత ) చెప్పారు. 1951 జూన్ ఆఖరులో బి.ఏ (మొదటిసంవత్సరం)లో చేరిన ఎం. కులశేఖరరావు batch కు కొన్ని నెలలు గద్యాన్ని బోధించినట్లు ఆచార్య ఎం. కులశేఖరరావు తమ స్వీయచరిత్ర నాకథ (2016) పుట 25లో పేర్కొన్నారు. ఎం. ఏ (ఫైనల్ -1950 జూన్ నుండి 1951 ఎప్రిల్ ) లో బి. రామరాజు, ఇల్లిందల సరస్వతీదేవి కూతురు సుజాత రెగ్యులర్ విద్యార్థులు కాగ అబ్బూరి రామకృష్ణరావు అల్లుడు సత్తిరాజు కృష్ణారావు ( ప్రైవేటు విద్యార్థి ) ఎం.ఏ (ప్రథమ)లో వెల్దుర్తిమాణిక్యరావు తమ్ముడు వెల్దుర్తి రామకృష్ణారావు ఒక్కడే విద్యార్థి. బి. రామరాజుగారు తమ పరిణతవాణి ప్రసంగంలో, మరోచోట ప్రస్తావించారు. తొలి తెలుగు ఎం.ఏ విద్యార్థిని శ్రీమతి ఇల్లిందల సుజాతగారు (నేడు 92ఏళ్ళు) కూడా రాఘవశర్మగారి బోధనవైశిష్ట్యాన్ని మనసారా ప్రశంసిస్తున్నారు. ఇరివెంటి కృష్ణమూర్తి గారు తమ డాక్టరేట్ గ్రంథమైన “కవిసమయములు” ను 1987లో ప్రచరించారు. అందులో “విశ్వవిద్యాలయస్థాయిలో నన్ను విద్యార్థిగా తీర్చిదిద్ది, నాలో సాహిత్యజిజ్ఞాసను మేల్కొల్పి, నాజీవితానికి లక్ష్యాన్ని ప్రసాదించిన మనీషివతంసులు, మానవతామూర్తులు, ఉత్తమదేశికులు” అంటూ ఖండవల్లి, దివాకర్ల, పల్లాదుర్గయ్యలతోపాటు విద్వాన్ శ్రీ వెల్లలూరు వేంకట రాఘవశర్మగారిని కూడ స్మరించి ఇరివెంటివారు భక్త్యంజలి ఘటించారు. చంద్రమరాజుగారు  90 ఏళ్ళు దాటిన వారు. ఇటీవలె కీర్తిశేషులు. ఉన్నతోద్యోగంలో రిటైర్ అయినవారు. ఆచార్య బి. రామరాజుగారి బావమరిది. వారు కూడ బియ్యేలో తాను రాఘవయ్య విద్యార్థినని చెప్పుకోవడానికి గర్విస్తున్నానని, వారు ప్రతిదానికి రకరకాలుగా జవాబులు చెప్పేవారు.. దానివల్ల నాకు ఉద్యోగజీవితంలో ఎంతో మేలు జరిగింది. నేను మా ఉన్నతాధికారులకు భిన్నభిన్న కోణాల్లోంచి పరిష్కారాలను సూచించేవాడిని. వారి కనుకూలమైంది వారు స్వీకరించేవారు. ఈ నైపుణ్యం నాకు రాఘవయ్య శిష్యరికం వల్ల కలిగింది. ఇన్నేళ్ళ తర్వాత ఆ మహానుభావుడిని గుర్తు చేసినందుకు ముందుగా మీకు కృతజ్ఞత లన్నారు చంద్రమరాజుగారు.

తన ప్రవచన వైపుణ్యంతో శిష్యులను ఆకట్టుకున్నారు. త్యాగరాజు కీర్తనలు ఆలపించేవారు. వసుచరిత్ర పద్యాలను కమ్మగా రాగయుక్తంగా పాడి శిష్యుల మనసులను దోచుకున్నారు. శిష్యులు ఒకటడిగితే పది చెప్పేవారు. సి. నారాయణ రెడ్డిని నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. క్లాసు లెగ్గొట్టకుండా రెగ్యులర్ గా రావాలని చెప్పారు. దాంతో సినారె గురువుగారికి ప్రియతమ శిష్యుడయ్యాడు . అప్పుడే 1950- మే నెలలో బి.యే విద్యార్థి చలపతిరెడ్డికి సంయుక్తారెడ్డిగారితో వివాహమైంది. రాఘవశర్మ గారు వాత్సల్యంతో వారింటికి వెళ్ళి ఆ నూతన దంపతులు ఎంతో గౌరవంగా ఇచ్చిన పాలను స్వీకరించి ఆశీర్వదించారు. శిష్యుడు రిక్షా తెస్తానన్న వినకుండా దగ్గరే కదా అంటూ నడిచి వెళ్ళి పోయారు. శ్రీమతి సంయుక్తారెడ్డిగారు 1955 లో ఎం. ఏ చేసి 9 ఏప్రిల్ 1959న ఉస్మానియాలో తెలుగుశాఖలో అధ్యాపకులుగా చేరారు. 1993 జూన్ 30న రిటైర్ అయ్యారు.  వారు కూడా . ఇటీవలె కీర్తిశేషులు. ఆనాటి బి.ఏ విద్యార్థుల్లో ఒకరైన చలపతిరెడ్డి గారికి నేడు 94 ఏళ్ళు. ఖండవల్లి లక్ష్మీరంజనం, కోవూరు గోపాలకృష్ణారావు శాశ్వతోపన్యాసకులు కాగా నిజాం కళాశాల నుండి గరికపాటి లక్ష్మికాంతయ్య, సరిపల్లె విశ్వనాథశాస్త్రి, కురుగంటి సీతారామయ్య మొదలగు వారు వచ్చి ఎం ఏ క్లాసులు తీసుకొనేవారు. కాని వీరెవరూ పద్యాన్ని రాగ యుక్తంగా పాడే వారు కాకపోవడంతో రాఘవశర్మ గారి ఆకర్షణ పెరిగింది. దివాకర్ల వెంకటావధానికే ఆయన ఉపన్యాసాలు స్ఫూర్తి ఇచ్చాయని అంటారు. ఆ కాలంలో నిజాం కళాశాల తెనుగు సారస్వతసమితి పక్షాన వీరు ప్రసంగించినట్లు తెలుస్తుంది. “ఆచార్య శ్రీ వెల్లలూరి వేంకట రాఘవశర్మగారు నవంబరు 15 (1950) వతేదీన సాహిత్యము– సంగీతము అను విషయముపైన ఉపన్యసించిరి. కడు హాస్యముతో భావగర్భితమైనవారి ఉపన్యాసము శ్రోతలనానంద పరవశులు చేసినది. అందులకు మాసమితి కృతజ్ఞతలు” అని ఆ సమితి వార్షిక నివేదికలో పేర్కొనబడింది. (“విద్యార్థి ” నిజాం కళాశాల సారస్వత సమితి వార్షికసంచిక ఎప్రిలు, 1951 పుట, 122)

ఉస్మానియావిశ్వవిద్యాలయం ఆంధ్రవిద్యార్థిసంఘం 1950 నాటి నివేదికను కార్యదర్శి వెల్దుర్తి రామకృష్ణారావు ఉస్మానియా తెలుగువిద్యార్థుల అర్ధవార్షిక సంచిక శోభ జనవరి 1951సంచికలో ప్రచురించారు. అందులో రెండుసార్లు వీరి ప్రస్తావన వస్తుంది. “23-11-50 గురువారము మధ్యాహ్నము పై సంఘపక్షమున నొక యసాధారణ సమావేశము జరిగినది. బ్రహ్మశ్రీ వెల్లలూరి వేంకట రాఘవశర్మగారు (ఆంధ్రోపన్యాసకులు) సంగీతసాహిత్యములకు గల సంబంధమెట్టిదో క్షుణ్ణముగ దెలిపిరి. 1950 డిసెంబరు 9, 10, 11 తేదీలలో ఉస్మానియా ఆవరణలో ఘనంగా జరిగిన ఆంధ్రాభ్యుదయోత్సవాలు ఆనాటి విద్యార్థులకు ఒక మధురస్మృతి. అందులో భాగంగా రెండవరోజు 11-12-1950 సాయంత్రం 5 గంటలకు “దేశభాషలందు తెలుగు లెస్స” రాఘవశర్మగారు ప్రసంగించారు.  కాళిదాసు మేఘసందేశంలో మొదటి 15 శ్లోకాలకు రాఘవశర్మగారి అనువాద పద్యాలు “ఆంధ్రమేఘసందేశము” పేరిట శోభ జనవరి 1951సంచికలో ప్రచురితమయ్యాయి.

ఒకరోజు ఆర్ట్స్ కళాశాలకు మదరాసు విశ్వవిద్యాలయం నుండి ఆచార్యులు కోరాడ రామకృష్ణయ్య వచ్చారు. వారు భాషోత్పత్తి, సంధి పుస్తకాలు రాశారు. రాఘవయ్య గారికి సాక్షాత్తు గురువు గారే అయినా కోరాడ రామకృష్ణయ్య తప్పులు రాసి విద్యార్థులను తప్పుదోవ పట్టించారని ఆయనతో వాదానికి దిగారు.

హైదరాబాదులోని ఉష్ణవాతావరణానికి తట్టుకోలేక పోయారు. కాస్త కుష్ఠు వ్యాధి తలెత్తిందని అతి ప్రచారం చేశారు. పొమ్మనకుండా పొగబెట్టారు. ఆయనకు మానసిక స్థైర్యం ఇవ్వలేదు. ఒకనాడు అంగీ లేకుండగా రాఘవశర్మగారిని చూసినట్లు, ఎక్కడా కుష్టుకు సంబంధించిన ఒక్క మచ్చ కూడా లేకపోవడాన్ని గమనించినట్లు, మరెందుకిలా ప్రచారంచేసి వెళ్ళిపోయేలా చేశారో ఈనాటికీ అర్థం కానట్లు చలపతిరెడ్డిగారు చెప్తున్నారు. హైదరాబాదునుండి వెళ్ళిపోవడం అన్నివిధాలా శ్రేయస్కరమన్న భావన పెరిగింది. ఆయన నిజంగానే వెళ్ళిపోతే ఆ ఉద్యోగం తనకు వస్తుందని అప్పుడే ఎం.ఎ పూర్తి చేసిన విద్యార్థిలో ఆశలు మోసులెత్తాయి. రాఘవయ్య 1951చివరలో ఏకంగా ఉద్యోగానికి రాజీనామా చేసి బెంగుళూ వెళ్ళి పోయారు. బహుశా తొందర పడ్డారేమో! 1952నాటి ఉస్మానియావిశ్వవిద్యాలయం బడ్జెట్ వివరాలు తెలిపే గ్రంథంలో తెలుగుశాఖలో ఒక ప్రొఫెసర్, ఇద్దరు లెక్చరర్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. ఒక ప్రొఫెసర్ అంటే ఖండవల్లి లక్ష్మీరంజనం, ఇద్దరు లెక్చరర్లు అంటే కోవూరు గోపాలకృష్ణారావు, దివాకర్ల వేంకటావధాని, కనుక రాఘవయ్యగారు 1952 జనవరికి ముందే వెళ్ళిపోయారని నిర్ధారణ అవుతుంది. ( 1952ఎప్రిల్ నుండి 1953 మార్చి దాక ఆచార్యుని సంవత్సరజీతం 8400 Basic +1260 D.A. మొత్తం 9660రు.లు అంటే నెలకు 805రు.లు జీతం. ఇక ఇద్దరు లెక్చరర్లకు కలిపి సంవత్సరానికి 7680 Basic +1334 D. A. మొత్తం 9024రు.లు అంటే నెలకు 376 రు.లు. అన్నమాట. రాఘవశర్మగారి ప్రారంభవేతనం 274-4-6 అని విశ్వవిద్యాలయ సివిల్ లిస్టులో నమోదు చేయూడింది.   ఇంటి అద్దెలు, ఇతర అలవెన్సుల లాంటివేవీ లేవు. గోపాలకిషన్ రావు, రాఘవశర్మలు నాలుగయిదు నెలలు తేడాలో కొత్తగా సర్వీసులో చేరినవారే కనుక జీతంలో తేడా వుండదు. ఇద్దరికీ ప్రారంభం scale వుంటుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో ఏవో పుస్తకాలు చూస్తూ, కాళ్ళకు పుస్తకాలు తగులుతున్నాయని పక్కకు జరుపుతుంటే ఈ బడ్జెట్ పుస్తకం దొరికింది. 1951, 1952 బడ్జెట్ వివరాలు, అధ్యాపకులవివరాలకోసం ఎంతో గాలించాను. కానీ ప్రయోజనం లేకపోయింది. 1949 జూన్ దాక నిజాంప్రభుత్వంలోని ప్రతిశాఖలోని ప్రతి ఉద్యోగి వివరాలు లభిస్తున్నాయి. కాని తరువాతి రికార్డ్స్ మాత్రం ఎందుకు దొరకడంలేదో బోధపడడం లేదు. ఉస్మానియా నుంచి వెళ్ళి 1952లో మద్రాసు విశ్వవిద్యాలయంలో ట్యూటర్ గా చేరినట్లుగా ఉంది. ఆధారాలు లేవు. ఆ తరువాత రాఘవయ్య బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజిలో అధ్యాపకులుగా పనిచేసినట్లు తెలుస్తుంది. (1953- 1960ల నడుమ కావచ్చునని నా ఊహ.) ఆయన తరువాత ఆ ఉద్యోగాన్ని అప్పటికే సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో తెలుగు పండితునిగా పనిచేస్తున్న ఆయన మేనల్లుడు గడియారం సుబ్బయ్యశాస్త్రి కి ఇచ్చారట. ఈ రోజు రాఘవయ్య గారు, సుబ్బయ్య శాస్త్రి గారు ఇరువురు గతించారు. బెంగుళూరులో తెలుగు వారు అధికంగా ఉండే శివాజినగర్ లో రాఘవయ్య ఒక తెలుగు ముద్రాక్షరశాల నడిపి చేతులు కాల్చుకున్నట్లు తెలుస్తుంది. ఒకసారి చాలాకాలం తర్వాత బెంగుళూరు వెళ్ళినప్పుడు అచార్యబి. రామరాజు, ఆచార్య ఎం. కులశేఖరరావు గారలు రాఘవశర్మను దర్శించారు. “నేను మీ శిష్యపరమాణువునండీ” అని రామరాజుగారన్నారట. వెంటనే ఆ గురువుగారు “వామ్మో! పరమాణువా? వెరీడేంజర్” అన్నారట. వారి వివరాలు చెప్ప గలిగే వారు లేరు. బెంగుళూరులో ఏమైనా ఆచూకి దొరకకపోదా అని ఆచార్య తంగిరాల సుబ్బారావు, ఆచార్య జి.యస్. మోహన్, శ్రీ ఘట్టమరాజు అశ్వత్థనారాయణ లాంటి పెద్దలను సంప్రదించాను. కానీ పెద్దగా లాభం కలుగలేదు. రాఘవయ్య ఆంధ్రమేఘసందేశం పద్యాలు తప్ప మరే రచనలు చేసినట్లు కనిపించడంలేదు. బెంగుళూరు వాస్తవ్యులైన ఆచార్య రత్నాకరం శంకరనారాయణరాజు 97 ఏళ్ళపెద్దలు, వారిని టెలిఫోనుద్వారా సంప్రదించే అవకాశం కలిగింది. రాఘవయ్య అన్నగారి పేరు వెంకటాద్రిశర్మ. వారు కూడ తెలుగు అధ్యాపకులే. 1951-52 లో బెంగుళూరు ఎం. అర్ కాలేజిలో వెంకటాద్రిశర్మ రిటైర్ కాగా, ఆ స్థానంలో తాను అధ్యాపకులుగా నియమితులైనట్లు తెలిపారు. రాఘవయ్య మృదుభాషి, మితభాషి, గంభీరంగా ఉండేవాడని, పెద్దగా పరిచయం ఏర్పడలేదని శంకరనారాయణరాజుగారు చెప్తూనే మరో అదనపు సమాచార మందించారు. రాఘవయ్యగారి కొడుకులు, కూతుళ్ళసంగతి సరిగా తెలియదు. ఒక్కకూతురు మాత్రం పెళ్ళయి ప్రవసమయంలో ఆసుపత్రిలో డాక్టర్లు నిర్లక్ష్యంగా కడుపులో గుడ్డలు కుక్కి కుట్టేయడంతో చనిపోయిందని తెలిపారు. ఈ సంఘటన ఎన్నేళ్ళక్రితం జరిగిందో, అప్పుడు తండ్రి బతికే ఉన్నాడా లేదా అన్న సంగతి వారికి గుర్తుకు రావడంలేదు.

ఈమాత్రం అయినా తెలుస్తున్నాయంటే అది చలపతి రెడ్డి గారు కట్టుకున్న పుణ్యం కొంత. నా ఆసక్తి, శ్రమ ఫలితం కొంత. ఈ తెలివిడి నాకు పాతికేళ్ళక్రితమే కలిగివుంటే మరెన్నో విషయాలు సేకరించగలిగేవాడిని. ఇప్పుడందరూ కీర్తిశేషులే. ఏంచేస్తాం!. వీరి మనుమలు, మనుమరాళ్ళు బెంగుళూరులోనో, అమెరికాలోనో  హైదరాబాదులోనో ఉండే అవకాశముంటుంది. వెల్లలూరు ఇంటిపేరు గలిగిన బెంగుళూరు వయోవృద్ధులకు తెలియవచ్చు.  దయచేసి వీరి వివరాలుకానీ, సంతానం వివరాలుకానీ ఏ మాత్రం తెలిసినా తెల్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

***

You may also like

Leave a Comment