Home వ్యాసాలు శత్రువుతో ప్రయాణం జండర్‌ స్పృహ

శత్రువుతో ప్రయాణం జండర్‌ స్పృహ

by Devendra

ఈ ఉగాది
నాకు విరోధి
షడ్రుచులు వడ్డించిన
భూమి తల్లిపై
అత్యాచారం
అంటూ స్త్రీల పక్షాన నిలబడి అక్షరగొంతుకను వినిపించిన కవి, విమర్శకులు ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌ గారు. శ్రీశ్రీ కోరినట్లుగా పీడితుల పక్షాన నిలబడి అభ్యుదయ దృక్పథంతో పయనిస్తున్నారు. ‘శత్రువుతో ప్రయాణం’ కవితా సంపుటిలో ఉన్న 36 కవితలు సమాజాన్ని అనేక కోణాల్లో ప్రశ్నిస్తాయి. మార్పుతో కూడిన మానవత్వాన్ని కోరుకుంటాయి. రాజకీయ రంగులను ఎండగడుతాయి. స్త్రీవాద ఉద్యమాన్ని సమర్థిస్తాయి.
అస్తిత్వ ఉద్యమాల్లో భాగంగా వచ్చిందే స్త్రీవాదం. స్త్రీల ఉనికిని, స్త్రీల హక్కులను, స్త్రీల సమస్యలను స్త్రీలే వ్యక్తపరిచే సాహిత్యాన్ని స్త్రీవాద సాహిత్యం అంటున్నాం. తరతరాల వ్యవస్థ నిర్మాణంలో మాతృస్వామ్యం రూపాంతరం చెంది పితృస్వామ్యంగా స్థిరపడిపోయింది. ఆనాటి నాగరిక సమాజం నుండి నేటికి ఆ మూలాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించి, ఎదిరించే క్రమంలో వచ్చిందే స్త్రీవాదం. జెండర్‌ స్పృహ, గృహహింస, మాతృత్వం, ఇంటి చాకిరి మొదలైన అంశాలెన్నో స్త్రీవాద ఉద్యమంలో వెలుగులోకి వచ్చిన అంశాలు. జండర్‌ సహజంగా ఏర్పడిరది కాదు. కుటుంబం, సమాజం, మతం ‘స్త్రీలు’ అంటే ఇలా ఉండాలి, ‘పురుషులు’ అంటే ఇలా ఉండాలి అని జీవనవిధానంలో అలవాటు చేసే క్రమపద్ధతిని జండర్‌స్పృహ అంటున్నాం. ఎంగెల్స్‌ ప్రకారం ‘‘పురుషత్వం, స్త్రీత్వం అనేవి శరీర ధర్మాల ప్రకారం ఏర్పడినవి కావు. ఒక సుదీర్ఘ చారిత్రక యుగంలోను పురుషత్వం, స్త్రీత్వం అనేవి వేరువేరుగా నిర్వచించబడ్డాయి. ఈ నిర్వచనం ఆయా యుగాలలోని ప్రధానఉత్పత్తి విధానమీద ఆధారపడి ఉంటుంది’’ అన్నారు. అంటే స్త్రీత్వ, పురుషత్వాల గురించి భావజాలాన్ని సమాజం తయారుచేసి అందిస్తోంది. ఆ భావజాలం తిరిగి సమాజక్రమాన్ని స్థిరపరచడంలో సహాయపడుతుంది. ఈ క్రమానంతటిని స్త్రీవాదం పరిశీలించింది. స్త్రీవాదం అంటే పురుషులను ద్వేషించడం కాదు. స్త్రీల సమస్యలను గుర్తించి స్త్రీలందరు ఏకమై పురుషులకు అర్థమయ్యేలా చెయ్యడం. ఈ భావజాలాన్ని అర్థంచేసుకున్న సహృదయ కవి ఆచార్య మాడభూషి కుమార్‌గారు. ‘ఆమె’ కవితలో స్త్రీల సమస్యలను కళ్ళకు కట్టినట్లు లోతైన భావుకతతో అక్షరీకరించారు.
‘‘చిన్నప్పటినుండి అంతే
చిన్నచూపుతోనే పెరిగింది’’ అంటారు
……….
ఇంకా
ఆమె నిఘంటువు నుంచి ఏ నిషేదం
అందుకే
ఎందుకు, ఏమిటి
లాంటి ప్రశ్నలు ఆమెనోట్లో రాకూడదని శాసనం’’
బాల్యంనుండే ఆడపిల్ల జండర్‌వివక్షను ఎదుర్కొంటుంది. కన్నతల్లే కొడుకును ఒకరకంగా కూతురును మరొరకంగా పెంచుతుంది. లేకపోతే తల్లిపెంపకం బాగాలేదంటారు. దుస్తులు, ఆటలు, ఆహారం, ఇలా అన్నిట్లోను ఆ వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. కుటుంబంలో ఆడపిల్ల ఇట్లా ఉండాలి అని తర్ఫీదునివ్వబడుతుంది. తల్లిదండ్రుల అదుపాజ్ఞలలో పెరిగిన ఆడపిల్లకు పెళ్ళి అనే బంధం మరిన్ని బాధ్యతలను, పరిమితులను విధిస్తుంది. అందుకే కవి ఇలా అంటారు.
‘‘అతగాడికి కావలసింది ఒక మరమనిషి
సంపాదించడానికి
వండిపెట్టడానికి
కోరికలు తీర్చడానికి
పెళ్ళిరోజున ఎ.టి.ఎం లాంటి
పెళ్ళాం దొరికిందని మరిసిపోతాడు’’
స్త్రీకి పెళ్ళిజీవితం అనేది రూపాయి బిల్లకు ఉండే బొమ్మ, బొరుసు లాగా మారిపోయింది. మంచి భర్త దొరికితే పరవాలేదు కాని, ఆమెను అర్థంచేసుకోలేని కుటుంబంలోకి అడుగుపెట్టినప్పుడు జీవితఖైదీగా మారిపోతుంది. అసలు కుటుంబమే స్త్రీని కంట్రోల్‌ చేసే బంధిఖానా అవుతుంది. ఇంటిపని, వంటపని, పిల్లల పెంపకం అన్ని స్త్రీల బాధ్యతలే. ఉద్యోగం చేసే ఆడవాళ్ళు కూడా వీటన్నింటిని బాలెన్స్‌ చేసుకోవాలి. తద్వార స్త్రీల శారీరక, మానసిక ఆరోగ్యాలమీద ఒత్తిడి పెరుగుతుంది. ఎదిగే క్రమంలో అనేక సవాళ్ళను స్త్రీ ఎదుర్కోవలసి వస్తుంది. ‘ఆమె’ కవితలోనే ఈ పంక్తులు చూడండి.
‘‘ఆకాశమంత వ్యాపించి
అందీ అందని ఆ తేజోమూర్తిని చూసి
నిందలు వేసే వాళ్ళెందరో!
మబ్బుల నడుమనుంచి
అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటేనే
ఇంత అసూయగా ఉంటే
పున్నమి వెన్నెల విరిస్తే
రెక్కలు ముక్కలు చేసుకొని
ఆకాశానికి ఎగురుతున్న ఆమె రెక్కల్ని
ముక్కలు చేయడానికి ఎందరో’’
అన్న పంక్తులు బాధ్యతల దొందరలో, ఉరుకుల పరుగుల ‘ఆమె’ జీవితంలో పడగనీడలా నిందలు, ఆధిపత్యాలు, అకృత్యాలు, వివక్షలు, చిన్నచూపులు ఇలా ఎన్నో ఎన్నెన్నో సంఘర్షణల మధ్య స్త్రీ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటు ముందుకు వెళ్ళే సాహసం చేస్తుంది. అయినప్పటికి స్త్రీలు తమను తాము నిరూపించుకుంటూ అన్నిరంగాలలో ముందుకు వెళ్ళే ప్రయత్నంచేస్తున్నారు. అయినప్పటికి అడగడుగున పరీక్షలపర్వాలను దాటక తప్పడంలేదు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లి కలలుకంటుంది. అన్నీ తానై భరిస్తుంది. అయినప్పటికి తండ్రి అంటే పిల్లలకు గౌరవం. తల్లి అంటే చిన్నచూపు. ‘ఆమె’ గురించి కవి మాటల్లో …
ఇంట్లో సెలవులేదు
పనిలో సెలవులేదు
జీవితమంతా పిల్లలకోసం పరుగెత్తి పరుగెత్తి
అలిసిపోయిన ఆమెకు
ఆసరా లేదు
………
ఆమె లేకుండా
మానవ చక్రం పరిభ్రమించదు
అందుకే ఆమెను
పరిమళించనివ్వండి
కవితా ముగింపులో స్త్రీ ఉన్నతిని ఆకాంక్షిస్తున్నారు కవి. ఈ విశ్వమానవ కాలభ్రమణంలో స్త్రీ, పురుషులిద్దరు అవసరమే. ఎవరికివారుగా బాధ్యత నిర్వహణలో పోటీపడాలి గాని ఆధిపత్యాలు, అహంకార పెత్తనాలు స్త్రీల అశాంతికి కారణమౌతున్నాయి. హింసకు దారితీస్తున్నాయి. స్త్రీల చుట్టు భయాన్ని గుర్తుచేస్తూ ‘భయం’ కవిత లో ఇలా అంటారు.
భయం
కట్నంలా రావచ్చు
పట్నంలో రావచ్చు
అత్యాచారంలా రావచ్చు
నిత్యాచారంలా ఉండవచ్చు
……………..
భయం
మగాడిలా ఉండవచ్చు
మగడి రూపంలో ఉండవచ్చు
మైరావుణుడి రూపంలో ఉండవచ్చు
రూపం ఏదైనా
భయం మాత్రం ఒక్కటే
అది భయమే
స్త్రీలకు ఉన్న భయాలు అన్ని ఇన్ని కావు. పురుషస్వామ్య ప్రపంచంలో ఎక్కడ పొంచి ఉంటుందో ఆ భయం. కవి పై కవితలో కట్నం వలన భయం అనడంలో మనం ఇప్పటికి వరకట్న వేదింపులకు బలైన స్త్రీలను మీడియా ముఖంగా చూస్తునే ఉన్నాం. స్త్రీలపై అత్యాచారం అన్నది ఈనాటికి రూపుమాపలేకపోయాం. ప్రభుత్వాలు నిర్భయ చట్టాలు చేసిన దిశ లాంటి అమ్మాయిలు ఇంకా బలవుతూనే ఉన్నారు. ఇవన్నీ ఒకెత్తవుతే కన్న తండ్రి కళ్ళు కామంతో కప్పబడినపుడు కూతురు పరిస్థితి అగమ్యగోచరం. ‘తండ్రి’ అన్న కవితలో
‘‘కన్న బిడ్డనే కామించే తండ్రులు
తండోపతండాలుగా పత్రికల్లో మొలుస్తూనే
టీవీలో మెరుస్తునే ఉన్నారు
వాటిని చూసిన మొహంతో
కన్నబిడ్డను చూసే శక్తిలేక
ఆత్మహత్య చేసుకుంటున్న’’
అంటారు. ఇక్కడ కవి ఈ సంఘటనకు కరుణరసభరిత కవితాక్షరాలను మనముందుంచారు. ఎవరో చేసిన పనికి తండ్రిగా కూతురు ముందు నిలబడలేని స్థితిని తండ్రులందరి పక్షాన నిలబడి బలమైన సందేశాన్ని ఇచ్చారు. ‘మగాడు’ కవిత జండర్‌ వివక్షను మరింత స్పష్టంగా చెప్తుంది.
‘‘వాడు కావాలనుకొన్నప్పుడు
నేను రావాలి
వాడు తేవాలన్నప్పుడు
నేను తేవాలి
వాడు తిరగమన్నట్టు
నేను తిరగలిగా తిరగాలి’’
స్త్రీ, పురుషులిద్దరు మనుషులే. ఇద్దరిలో ప్రవహించే రక్తం ఎర్రగానే ఉంటుంది. కాని, స్వేచ్ఛా పరిధిలోకి వచ్చేసరికి జండర్‌ వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తుంది. పితృస్వామ్య వ్యవస్థ పురుషుడిని ‘మగాడు’ గా చూడాలనుకుంటుంది. మగాడు అంటే ఎలా ఉండాలని సమాజం, కుటుంబం చెప్పిందో కవి ప్రతిసందర్భంలో మగాడి రంగును తేటతెల్లం చేస్తాడు. స్త్రీ ఎల్లప్పుడు పిల్లలకోసమో, పుట్టింటి వారి కోసమనో, పరువు మర్యాదల కోసమనో తను ఉండాలనుకున్నట్టుగా ఉండలేకపోతుంది. తన అస్తిత్వాన్ని ఉనికిని పరిస్థితులకు ఫణంగాపెట్టి అన్నిటికి సర్ధుబాటుతనపు సంకెళ్ళు వేసుకుంటుంది. అందుకే ‘కవి’ స్త్రీ, పురుషుల సహవాసాన్ని శత్రువుతో పోల్చడం సమస్య తీవ్రతను తెలియజేస్తుంది.
‘‘నేను సహవాసం చేస్తున్నది
శత్రువుతో
నేను సహజీవనం చేస్తున్నది
శత్రువుతో
నేను పంచుకొంటున్నది
శత్రువుతో
పనిచేస్తున్నది
శత్రువుతో’’
ఈ శత్రువులు మిత్రులు అయ్యేదెప్పుడు! జండర్‌వివక్ష తగ్గినప్పుడు ఒకరికొకరు పరస్పర సహకారంతో ముందుకెళ్ళినప్పుడు అంటే స్త్రీవాదాన్ని పురుషుడు అర్థంచేసుకున్నప్పుడే సమస్య పరిష్కారం దిశగా ముందుకు కదులుతుంది. ఆచార్యస్థానంలో ఉన్న మాడభూషి సంపత్‌గారు మహిళల ఆర్తిని, ఆవేదనను, వివక్షను అర్థంచేసుకున్న వ్యక్తిగా, కవిగా, ప్రగతిశీల మార్గదర్శకుడిగా స్త్రీల గొంతుకను ‘శత్రువుతో ప్రయాణం’ పేరుతో తన కవితాధారతో బలం చేకూర్చిన మానవతామూర్తి ఆచార్య సంపత్‌కుమార్‌గారు.

ªªª

You may also like

Leave a Comment