దీనత్రాణైక నామం దినదినశుభ సంధాయ కామేయ నామం ధ్వస్తాఘామోఘ నామం మునిజనదమన స్తోమ నిర్భిన్న నామం కామక్రోధమ్న నామం కరివరవరదానంత సుస్వాంత నామం
వందే యాదక్షమాభృత్కటక వటుభుజారంహ లక్ష్మీనృసింహమ్ || తాత్పర్యం : శ్రీహరినామస్మరణ ఎంత మహిమాన్వితమైనదో ఈ శ్లోకంలో చక్కగా వివరించబడింది. ఆపన్నులైన దీనజనుల్ని ఉద్ధరించగల ఏకైక నామం! ప్రతినిత్యమూ శుభాలను చేకూర్చే మితిలేని మహిమాన్వితమైన నామం! నీతిమాలిన ఘోరపాపాలను సైతం నశింపజేయగల నామం! మునులను, ఋషులను హింసించే రాక్షస సమూహాలను భేదించగల నామం! కామక్రోధాది అరిషడ్వర్గాన్ని మట్టుపెట్టగల నామం! మొసలిచేత పట్టుబడిన గజరాజును విముక్తుణ్ణి చేసి, వరప్రసాదం చేత, అనంతమైన సాంత్వనము చేకూర్చిన నామం! అటువంటి శక్తివంతమైన తన నామస్మరణతో భక్తులను అనుగ్రహిస్తూ శ్రీ యాదాద్రిపై వెలసి, తన పటుతరమైన భుజబలపరాక్రమాన్ని ప్రదర్శిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిని నమస్కరిస్తున్నాను. విశేషాలు : విష్ణు భక్తులు తమకున్న పదవీ, అధికార, జన, ధన బలాలు దేనిపైనా నమ్మకం ఉంచరు. ఓర్వలేని బాధలు చుట్టుముట్టిన సందర్భంలో కూడ హరినామస్మరణ ఒక్కటే తరణోపాయంగా భావిస్తారు. ప్రహ్లాదాది భక్తవర్యుల చరిత్రే ఇందుకు ఉదాహరణ. దీనులైన భక్తులను ఆపదల నుండి రక్షించే (దీన+త్రాజైక+నామం=) ఏకైక మార్గం హరినామస్మరణ మాత్రమే! “శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం” ఈ తొమ్మిదీ భక్తి మార్గాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ పేర్కొన్న మార్గాలన్నీ నామస్మరణ పూర్వకాలే! మహర్షులు అందుకే భగవన్నామ స్మరణకు ప్రథమ స్థానం కల్పించారు.
(దినదిన+శుభ సంధాయక+అమేయ+నామం=) ప్రతి నిత్యమూ హరినామస్మరణ చేసే భక్తులకు సకల శుభాలనూ కలిగించే అపరిమిత శక్తి కలిగిందీ హరినామం! ప్రతి జీవి జన్మ ఎత్తిన తరువాత క్షణకాలమైనా కర్మనాచరించకుండ ఉండలేదు. ఆచరించిన కర్మకు, అది పాపమైనా పుణ్యమైనా, దానికి తగిన ఫలితం తప్పక జీవి అనుభవించవలసిందే! తెలిసి కాని, తెలియక కాని చేసిన పాపకర్మల నుండి విముక్తి పొందాలంటే హరినామస్మరణ తప్ప మరొక్క మార్గం లేదు! (ధ్వస్త+అఘ+అమోఘ+నామం=) హరినామస్మరణ చేసే భక్తుల పాపాలను నశింపజేయగల గొప్ప నామం హరినామం!
దుష్కర్మల్ని, మహాపాపాల్ని ఆచరించిన వారూ, శాపగ్రస్తులూ రాక్షసులు మొదలైన దుష్టజన్మల్ని ఎత్తుతూ ఉంటారు. మళ్ళీ వారు (మునిజన+దమన+నోమ+నిర్భిన్న నామం=) ఋషులు, మునులు, సాధువులు మొదలైన వాళ్ళని హింసిస్తూ ఉంటారు. అటువంటి దుష్టుల సమూహాలను నశింపజేయగల శక్తి కలది హరినామం!
ఏనుగు శారీరక బలానికే కాకుండా మదానికి కూడ ప్రతీక, గజేంద్రమోక్ష ఉపాఖ్యానం దుర్మదాంధులకు ఎటువంటి స్థితి కలుగుతుందో చక్కగా వివరిస్తుంది. గజేంద్రుడికి ఆ జన్మ రావటానికి కారణం దాని మదోన్మత్త ప్రవర్తనా – తత్ఫలితంగా మునిశాపం కలగటమే కదా! (కరివర+వరద+అనంత+సుస్వాంతనామం =) మొసలి చేత పట్టుకోబడ్డ గజేంద్రుడు ఎంతో కాలం తన బలాన్ని మాత్రమే నమ్ముకొని పోరాడాడు. చివరికి కృశించి, నిస్సహాయ స్థితికి చేరుకున్నాడు. అప్పుడు భగవంతుణ్ణి శరణుపొందటం తప్ప మరో మార్గం లేదని అతను గ్రహించాడు. హరిని మొరపెట్టుకున్నాడు. అప్పుడు (కరివర +వరద +అనంత+సుస్వాంత + నామం =) మొసలిని తన చక్రంతో ఖండించి, గజేంద్రుణ్ణి రక్షించి, తన ‘వరద’, ‘అనంత’ నామాల నామౌచిత్యాన్ని మరొక్కసారి నిరూపించుకుని, గజరాజుకు మోక్షాన్ని కలిగించి, అతని మనస్సుకు ఊరట కలిగించిన నామం హరినామమే కదా!
శ్రీ యాదాద్రిపై వెలసి, తన పటుతర భుజబలాన్ని ప్రదర్శిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని తన మృదుమధుర పద సుమాలచే అర్చించి, స్వామి నామం యొక్క అనంత బలాన్ని స్మరిస్తూ నమస్కరిస్తున్నాడు కవి.