Home వ్యాసాలు షట్చక్రవర్తి చరిత్రము- డా. నందవరం మృదుల

షట్చక్రవర్తి చరిత్రము- డా. నందవరం మృదుల

ప్రబంధ వ్యాసాలు

గురజాల రామశేషయ్య

నిర్వహణ:

– గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ (తెలుగు)ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ ప్రబంధాలు:
1. చిత్ర భారతము- చరిగొండ ధర్మన్న
2. తపతీ సంవరణోపాఖ్యానము- అద్దంకి గంగాధరుడు
3. షట్చక్రవర్తి చరిత్ర – కామినేని మల్లారెడ్డి
4. యయాతి చరిత్రము – పొన్నిగంటి తెలగన్న
5. ముకుంద విలాసము – కాణాదం పెద్దన సోమయాజి

ఇవి ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ పంచ కావ్యాలు అనదగిన ఐదు ప్రబంధాలు

పరిచయ కర్తలు:
1. డా॥ సంగనభట్ల నరసయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
2. డా॥బ్రాహ్మణపల్లి జయరాములు, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
3. డా॥ మృదుల నందవరం, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
4. డా॥ సి.హెచ్ . లక్ష్మణ చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
5. డా॥ గండ్ర లక్ష్మణరావు, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్.

ఈ రచయితల వ్యాసాలు తెలంగాణ ప్రబంధ మాలిక శీర్షిక లో వరుసగా ధారావాహికంగా వస్తాయి


ప్రవేశిక
భారతీయ భాషలలో తెలుగు ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన ప్రసిద్ధమైన భాష. అనేకానేక విషయబాహుళ్యము వలన విస్తృతమైన సాహిత్య సంపదగలిగిన మధురమైన భాష. స్వరములు అంటే అచ్చులు .ఇవి నాద మాధుర్యానికి పుట్టినిండ్లు .అ,ఇ,ఉ కారాది స్వరాలతో ఆదిమధ్యాంతము సర్వవిధముల అలరారు మెలపులు గల పదాలతో కూడిన తెలుగు భాష పలుకు తీపికి తేనె పెర. మృదువైన పలుకుబడి పదములతో నవనీత సదృశ ‘రుచి’ర . ఈ కారణాలవల్లనే స్వభాషాభిమానానికి పరాకోటి ప్రాధాన్యతను పాటించే తమిళభాషా కవులలో సుప్రసిద్ధులైన సుబ్రహ్మణ్య భారతి వంటి ప్రామాణికులైన మాన్య సాహిత్యవేత్తలు సైతము “సుందర తెలుగు” అని వక్కాణించినారు. అంతకు’ముందెన్నడో “ఆంధ్రత్వమాంధ్రభాషా చ బహుజన్మ తపః ఫలమ”ని తెలుగును వేనోళ్ళ పొగిడిన అప్పయ్య దీక్షితులకు తెలుగు వారందరు కూడా కృతజ్ఞతాబద్ధులే! సుమారు రెండు వందల సంవత్సరాల కాలం భారతదేశంలో తిష్ఠ వేసిన బ్రిటీష్ , తదితర భాషా పండితులు మన తెలుగు భాషను “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ “ అని ముచ్చటపడి మెచ్చుకున్నారు. ఇక్కడొక విషయం చింతనీయం -అంతకు ముందు వాళ్ళకు ఇటాలియన్ తెలిసి దానితో మన తెలుగును పోల్చుకొని మెచ్చుకున్నారు . కాని , వాళ్ళు రావడానికి వేల సంవత్సరాలకు ముందే మాధుర్యాన్ని పండించుకొటున్న తెలుగు భాషను ఇటాలియన్ తో పోల్చుకొని ఇటాలియన్ గురించి ” తెలుగు ఆఫ్ ద వెస్ట్”అని మార్చుకొనదగినంత మధురాతి మధుర మృదు మాధ్వీక రసనిష్యంద తుందిలమైన మన తెలుగు నిజంగా ప్రపంచ భాషలలోనే మధురమైన భాష.

ఇక దక్షిణ భారతదేశంలో అక్షీణ యశస్సును పండించుకొని, స్వయంగా కవియై , ఆముక్తమాల్యాది కావ్యరచయితయై, స్వర్ణయుగ కర్తగా పేరుపొందిన శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటాది భాషాప్రాంతాలకు ఏలికయై ఉండి కూడా ‘“దేశభాషలందు తెలుగు లెస్స “అని ప్రశంసించటం సర్వజన సువిదితమే! అంతకుముందే శ్రీనాథ మహాకవి ఈ అభిప్రాయాన్నే ప్రకటించిన తీరు కూడా గమనార్హం.

మధ్యయుగాల వైభవమును ప్రతిబింబించిన 16 వ శతాబ్దపు ‘ ప్రబంధ పద్యము ’ పద్యరచనకు పరాకాష్ఠ స్థితి (climax) . ప్రబంధ పద్యం అంటే ప్రబంధం లోని పద్యం. ఇతిహాస,పురాణ , నాటకాది వివిధ ప్రక్రియలకు చెందిన గ్రంథాలన్నీ ప్రబంధ శబ్ద వాచ్యాలే అయినా కావ్యాలకే ప్రబంధము మారు పేరుగా, మరోపేరుగా ధ్రువపడింది. రూఢి అయింది .

వాస్తవానికి “సర్గబంధో మహాకావ్యమ్” అంటూ దండి అనే సంస్కృత లాక్షణికుడు చెప్పిన లక్షణాలే తెలుగు లాక్షణికులైన విన్నకోట పెద్దనాదులు కావ్య ప్రబంధ లక్షణాలుగా స్వీకరించారు.
క్రీ.శ. 16వశతాబ్దమునందలి కావ్యములను ముఖ్యంగా మనుచరిత్రము ను పురస్కరించుకొని ప్రత్యేకంగా రూఢమైన “ప్రబంధ లక్షణముల”ను ప్రకటించినవారు 20 వ శతాబ్దపు తెలుగు విమర్శకులే కాని ప్రాచీన లాక్షణికులుకారు. ( తెలుగు అకాడమీ పత్రిక ‘తెలుగు’ మే 1995 సంచికలోని ప్రొఫెసర్ జి.వి.సుబ్రహ్మణ్యం గారి ప్రత్యేక వ్యాసం చూడండి.

పైన పేర్కొన్న కేంద్రసాహిత్య అకాడమీ విమర్శ పురస్కార స్వీకర్త గారి మాటలను అనుసరించి పర్యాలోచిస్తే ౼ కేవలం 16 వ శతాబ్దంలో క్రీ.శ. 1522 తదనంతరం శ్రీకృష్ణదేవరాయల కోరికపై అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర ను మాత్రమే దృష్టిలో ఉంచుకొని “……మనుచరిత్రమే ప్రబంధ లతకు పూచిన తొలి పువ్వు“ అని తీర్మానించిన మాట వాస్తవమని ఆంధ్రసాహిత్య అభిజ్ఞ పండితవర్గము గుర్తించగలదు. ఈ విధంగా ప్రబంధ లక్షణాలివి అని , తమకు నచ్చిన కావ్యగతాంశాలను కొన్నిటిని ప్రామాణీకరించుకొని , అష్టాదశ వర్ణనలు ప్రధానంగా ఉండే స్వతంత్ర కథోచిత మనోహర పద్యగద్యాలున్న కావ్యాన్నే “ప్రబంధమ”ని నిర్వచించినారు. కాని, మనుచరిత్ర కంటే సుమారు దశాబ్దం పైబడిన కాలం ముందటిదైన , 16 వ శతాబ్దపు ప్రారంభాన ఓరుగల్లు ను పాలించిన చిత్తాపుఖానుని మంత్రియైన పెద్దనామాత్యునికి అంకితమైన చరిగొండ ధర్మన్న కవియొక్క ‘చిత్ర భారతం ‘ ను గుర్తించదలచరైరి.

కాలక్రమానుగుణంగా “చిత్రభారతము” (చరిగొండ ధర్మన్న) క్రీ.శ. 1503-12 మధ్యకాలములోనిది. “మనుచరిత్రము” క్రీ.శ.1522లో భువన’విజయము లో కొలువుండి శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనను అడిగి వ్రాయించుకున్న ప్రబంధము. ఈ విధంగా కాల సన్నివేశాలను పోల్చిచూసినట్లైతే “చిత్రభారతము”తొలి తెలుగు ప్రబంధమగుట వాస్తవము.న్యాయము. ఈ ప్రామాణిక , చారిత్రక శాసనాధారాలుగల విషయాలను 2013 లో తెలుగు విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసిన డా॥సంగనభట్ల నరసయ్య గారు : ఉపకులపతి డా॥ ఎల్లూరి శివారెడ్డిగారి కోరికమేరకు పరిష్కరించి, విపులమైన పీఠికను చేర్చి వెలువరింప’చేసినారు.

ప్రస్తుతము 2014 నుండి తెలుగు భాషకు చెందిన రాష్ట్రాలు రెండు . ఒకటి తెలంగాణ , రెండు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత 2017 డిసెంబరు నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిర్వహించుటకు సంకల్పించిరి. అంతకు కొద్ది నెలల ముందుగా డా॥నందిని సిధారెడ్డిగారు తొలి అధ్యక్షులుగా “తెలంగాణ సాహిత్య అకాడమీ” ప్రారంభించబడినది. ఈ క్రమంలో ప్రపంచ తెలుగుమహాసభలు డా౹౹నందిని సిధారెడ్డి గారి అధ్వర్యంలోనే మూడు రోజులు వివిధ ప్రసిద్ధ సాహితీవేత్తల పేరిట ఏర్పాటు చేయబడిన వేదికలపై నిర్వహింపబడినవి. అందులో భాగంగ “తెలంగాణ ప్రబంధాలు” శీర్షికన గతంలో ప్రచుర పఠన పాఠన పరంగా విస్తృత ప్రచారం లోకి రాని ప్రబంధములకు చెందిన ప్రత్యేక, విశిష్ట లక్షణములను గురించి నాకు : గురిజాల రామశేషయ్య కు ప్రసంగించుటకు అవకాశము లభించినది. ప్రముఖులైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ పండితుల సమక్షంలో తెలంగాణ ప్రక్రియా ప్రాదుర్భావ వికాస విశేషాంశములు పునర్మూల్యాంకన గణనం లోనికి రావలెనని నివేదింపబడినది . ఆ క్రమంలోనే నేను తదుపరి సంవత్సరములలో తెలంగాణ సాహితీ వేత్తలను సంప్రదించి ఒక్కొక్కరికి ఒక్కో ప్రబంధం చొప్పున అప్పగించి కవిపరిచయము–స్థల కాలాది’విశేష–కథాసంగ్రహ–ప్రబంధ నిర్మాణ విశేషాదిక పద్య’శిల్ప వైభవ విశేషములను వివరిస్తూ విషయవిస్తృతి గల వ్యాసములను వ్రాసి ఇవ్వవలసినదిగా కోరితిని .

కోరినవెంటనే సమ్మతించి ఆయా ప్రబంధములను కూలంకషముగా అధ్యయనము చేసి తత్ ప్రబంధ సంబంధిత చర్చనీయాంశాలకు చెందిన వివిధ సాహిత్య చరిత్రాది గ్రంథములను సంప్రదించి రచించి విద్వన్మిత్రులు వ్యాసములను పంపినారు . అయితే ఇంతలోనే వచ్చిపడిన కరోనా గండ సమయములో ప్రచురణ -ఆవిష్కరణాదులకు చెందిన సమయసందర్భ అవకాశాలు కుంటు పడుటచే ఏదైన పత్రిక ద్వారా మొదటి విడతగా ఈ ఐదు వ్యాసాలను వెలువరించ దలిచితిని. ఇంతలో దైవికముగా అమెరికాలో తమ పిల్లల దగ్గర ఉన్న ప్రసిద్ధ తెలంగాణ స్త్రీవాద రచయిత్రి,కవయిత్రి, ఒద్దిరాజు సోదరులపై విశేష శ్రమకోర్చి పరిశోధన చేసిన విద్వాంసురాలు డా॥ కొండపల్లి నీహారిణి ఒక రోజు ఫోన్ ద్వారా సంభాషిస్తూ , తాను ఒక ద్వైమాసిక అంతర్జాల పత్రికను ప్లవ ఉగాది నుండి ప్రథమ సంచికను వసంత సంచికగా ప్రకటించ’దలచినానని చెప్తూ , మీరు ఏదైనా ఒక ప్రత్యేక అంశానికి చెందిన తెలంగాణ సాహిత్య శీర్షికను నిర్వహింపవలెనని కోరినారు. వెదుకబోయిన రత్నము చేతికి దొరికినట్లు భావించి : వెంటనే నేను సేకరించిన తెలంగాణ ప్రబంధాలకు చెందిన విషయ విస్తృతిగల వ్యాసములను తమ ‘ మయూఖ ’ అంతర్జాల పత్రికలో ధారావాహికముగా ప్రచురించుకొన’వచ్చునని చెప్పినాను. అందుకు సంపాదకులు డాక్టర్ నీహారిణిగారు అంగీకారము తెలిపినారు .

తెలంగాణ ప్రబంధాలు శీర్షికతో తొలివిడతగా _తెలంగాణ పంచకావ్యాలు_ అనదగిన తెలంగాణ సాహిత్య వికాసరూపాలనదగిన ఐదు ప్రబంధాల పరిచయమాలికను సహృదయులకు అందించగలుగుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.

ఈ పరిచయ మాలికను తమ మయూఖ తెలంగాణ సాహిత్య ద్వైమాసిక అంతర్జాల పత్రిక లో ప్రచురించుకొనుటకు అంగీకరించిన మయూఖ సంపాదకులకు తదితర నిర్వాహక కుటుంబ సభ్యులకు : హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః

గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ తెలుగు హైదరాబాద్ +91 70326 79471

 

డా. నందవరం మృదుల :
డా. నందవరం మృదుల గారు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖలో తెలుగు సహాయ ఆచార్యులుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న విదుషి. సంస్కృతాంధ్ర భాషా సాహిత్య మర్యాదలు తెలిసిన మహిళ. కవిత్వ ఆదర్శ లక్షణాలతో పాటు నాట్య శాస్త్ర విశేషాలు సైతం పరిశీలించిన ప్రజ్ఞామూర్తి. తనదైన ముద్రలో సాహిత్య పాఠం చెప్పగల సలక్షణ అధ్యాపకురాలు.
ఎన్నదగిన క్రమశిక్షణలో తెలుగు సాహిత్యాధ్యయనం చేసి ఎం.ఫిల్‌ మరియు పిహెచ్‌.డి. పట్టాలను స్వీకరించినది. అంతేనా! అంతకు ముందే డిగ్రీ స్థాయిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ‘‘స్వర్ణపతకాన్ని’’ కైవసం చేసుకున్నది. ఇంతేనా! కాదు. డిగ్రీ స్థాయి సంస్కృతం చదువుకు సైతం ‘‘స్వర్ణ పతకం’’ జతగా చేర్చుకున్నది. మరింకా చెప్పాలంటే హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి పి.జి. స్థాయి తెలుగు అధ్యయన అభ్యసనానికి కూడా ‘‘స్వర్ణ పతకం’’ సాధించుకున్నది. ముచ్చటగా మూడు స్వర్ణపతకాలను పొందినది. వినయసంపన్న. సరస్వతి దయను చవిచూసిన ‘‘మృదుల’’ ఆమె పేరుకు తగ్గట్టు నామ మద్రాలంకార రీత్యా మృదు స్వభావి. ప్రతిపద సమప్రాధాన్య స్పష్టంగా వాక్యాలను పలుకుతూ సాహిత్య ప్రసంగం చేయటం ఈమె శైలి.
తిక్కన గారి సాహిత్యంపై విరాటోద్యోగ పర్వాల పరిధిలో ‘‘తిక్కన కవిత` నాట్యశాస్త్ర మర్యాదలు ’’ అనే ఎం.ఫిల్‌. గ్రంథం; తిక్కన సీస పద్యాలు ` పరిశీలన ’’ అనే పిహెచ్‌. డి. సిద్ధాంత గ్రంథం ఈమె వైదుష్యానాకి తార్కాణాలు. మొత్తం మహాభారతం గురించి, తిక్కనగారి ఇతరేతర సాహిత్య లక్షణాంశాలను గురించి విద్వాంసులు మెచ్చే వ్యాసాలు విశ్లేషణ వ్యాసాలు కూడా ప్రసిద్థ పత్రికలలో ప్రచురించింది. అంబటి పూటి వెంకటరత్నం గారు తెలుగు సంస్కృతం బాగా నేర్చిన వారు. మహా విద్వాంసుడు. రసజ్ఞ కవితామూర్తి. భక్తి తనువునిండా మనసు నిండా నింపుకున్న శిష్యవాత్సల్య మూర్తి. ఆయన శిష్యులలో నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీసిరిప్రగడ భార్గవరావు పద్యరచనలో నన్నయాది కవుల పంక్తిలో అవిస్మృతికరమైన పద్య శిల్పము నందుకున్న మేటి. విశ్వనాథ, శేషేంద్రల మనసుకెక్కి ప్రశంసింపబడిన ధన్యకవి. అయితే ఇక్కడ నేను ప్రస్తావించవలసిన ముఖ్యాంశమేమిటంటే వెంకట రత్నకవి అనేక ఛందస్సులతో తమ ‘‘కృష్ణ భక్తి’’ తత్పర భావం లో భాగంగా ‘‘గోపీకావ్యం’’ అనేకానేక ఛందస్సులతో కూడినది రచించినారు. ఆ కావ్యం గురించి ప్రస్తుత వ్యాసరచయిత్రి డా. ఎన్‌. మృదుల ‘‘గోపీ కావ్యం ` లక్ష్య సంగ్రహం’’ శీర్షికతో వ్యాసం రచించింది. ఈమె వ్యాసాలు ఎక్కువభాగం భారతం గురించి, తిక్కన గురించి వ్రాసినవే. అయినా కథానికల గురించి తదితర ప్రక్రియల గురించి కొన్ని వ్యాసాలు రచించి తన సాహిత్యఅభినివేశాన్ని తెలుపుకున్నారు. జాతీయ, ఆంతర్జాతీయన సెమినార్లలో ప్రసంగించిన వక్తగా గుర్తింపును పొందిందీమె.
ప్రస్తుతం ఉద్యోగ ధర్మంలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ పాఠ్య ప్రణాళిక సంఘ సభ్యురాలుగా, తెలంగాణ రాష్ట్ర ‘‘ ఉన్నత విద్యాశాఖ ` కళాశాల విద్య ’’ పక్షాన ప్రత్యేకంగా రూపొందిస్తున్న ‘‘భాషా పత్రిక’’ సంపాదక సభ్యురాలుగా వ్యవహరిస్తున్నారు.
నా ‘‘ తెలంగాణ ప్రబంధాలు’’ ప్రాజెక్ట్‌లో తొలివిడత ఐదు ప్రబంధాలలో కామినేని మల్లారెడ్డి రచించిన ‘‘షట్చక్రవర్తి చరిత్ర’’ ఒకటి. ఈ ప్రబంధంలో తెలుగు కమ్మని పలుకుతో పాటు సంస్కృతచ్ఛాయా శైలి అధికము. పావనోదార చరితులైన ‘‘ షట్చక్రవర్తుల కథలు ’’ ప్రబంధీకరింపబడిన రసప్లావిత మనోహర పద్య శైలీ కావ్యం ‘‘ షట్చక్రవర్తి చరిత్ర’’.
నేను కోరగానే వ్యాసరచనకు అంగీకరించి వ్యాసాన్ని అందజేసిన మృదులకు పురోభివృద్థి శుభాకాంక్షలతో శుభాశీస్సులు అందిస్తున్నాను.
ఈ సందర్భంలో ధారావాహికంగా నా ‘‘తెలంగాణ ప్రబంధాలు’’ తొలి విడత ఐదు వ్యాసాలను తమ ‘‘ మయూఖ’’ అంతర్జాల ద్వైమాసిక పత్రికలో ప్రచురించి వెలుగులోకి తెచ్చిన ప్రసిద్ధ కవయిత్రి, కథారచయిత్రి, పరిశోధకురాలు, మంచి వక్త, సంపాదకులు డా. కొండపల్లి నీహారిణి గారికి కృతజ్ఞతా పూర్వకంగా శుభాశీస్సులు తెలుపుకుంటున్నాను.
జయంతే సకృతినో ! రససిద్ధాః కవీశ్వరాః
కావ్యం నిలబడితేనే జాతి బలపడుతుండి. (రాశేకలం)
గురిజాల రామశేషయ్య
రిటైర్డ్‌ అసోసియేయట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ తెలుగు

షట్చక్రవర్తి చరిత్రము
‘తెలంగాణములో కవులు లేరు’ అన్నమాటకు సురవరం ప్రతాపరెడ్డి గారు గోలకొండ కవుల సంచిక ద్వారా సమాధానం చెప్పారు. ఈ సంచిక- ఈ నేలలో ఎందరు కవులు విలసిల్లారో, ఎంత సాహిత్యం విస్తరించిందో తెలియజేసింది. తెలంగాణమలో ప్రాచీనకాలము నుండి వచ్చిన రచనలు తెలిపి, ఈ మట్టి ప్రాభవాన్ని మరోసారి గుర్తుకు తెచ్చింది – ఈ పత్రిక. అంతేకాదు, ప్రభువులకు ధీటుగా సంస్థానాలు ఏ విధమైన సాహిత్య కృషి చేసాయో వివరించింది.
1. కవిస్థల కాలాదులు : సాహితీ పోషణలో ప్రధానపాత్ర వహించింది – నిజాం ప్రభువుల పాలనలో ఉన్న మెదక్ మండలములోని బిక్కనవోలు సంస్థానము. ఈ సంస్థానాధిపతి అయిన కాచ భూపతి యొక్క నాల్గవ పుత్రుడు రాజా మల్లారెడ్డి రచించిన షట్చక్రవర్తి చరిత్ర తొలి మహాప్రబంధంగా గుర్తింపు పొందింది.
రాజామల్లారెడ్డి శివధర్మోత్తరము, పద్మపురాణము అనే గ్రంథాలు కూడా రచించారు. ఇంకా ఇతర రచనలు చేసినట్లు ప్రతీతి. కాని అలభ్యములు. షట్చక్రవర్తి చరిత్రకు పీఠిక రాసిన పెద్దమందడి వేంకట కృష్ణకవి గారు మల్లారెడ్డి గారి సోదరుల గురించి, వారి కాలంలో వచ్చిన గ్రంథాల గురించి తెలిపారు.

సీ. రమణీయ బాలభారత కిరాతార్జునీ
యాది ప్రబంధములందినాడు
దేవమందిర మహీదేవ గృహా రామ
నిధితటాకంబుల నిలిపినాడు
దాన కంకణము జేబూని యర్థులనెల్ల
ధనధాన్య రాసులందనిపినాడు
శౌర్య హర్యక్షుడైన సంగరాంగణము నం
దరి నృపాలు గర్వమడచినాడు

గీ. నిఖిల దేశావనీశులు నిచ్చ మెచ్చ
గర్తలతికల దిశల బ్రాకించినాడు
ధరచతుర్థక మాత్రుడే ధరణి సురల
కిలను వేలుపు గిడ్డియా యెల్లరెడ్డి (పద్మ. పుట. 10)
ఈ పద్యం మల్లారెడ్డి గారి మూడవ అన్న అయిన ఎల్లారెడ్డిగారు ఎటువంటి గ్రంథాలు అందుకున్నారో తెలియజేస్తుంది. అంతేకాదు ఆనాడు ఎటువంటి గ్రంథాలు వెలువడ్డాయో, ఆనాటి సంస్థానాధీశులు సాహిత్య సృజనకు ఎంతటి ప్రాధాన్యం ఇచ్చారో కూడా మనకు అవగతం అవుతుంది.
పైగా ఆ రచనల్లోని వైవిధ్యాన్ని కూడా మనం గుర్తించవచ్చు. సంస్థానాధీశుల సేవానిరతిని గ్రహించవచ్చు. అది ప్రబంధాలు పరిఢవిల్లే కాలం అని భావించవచ్చు.
ఇటువంటి కాలంలో వెలువడిన ఏ గ్రంథమైనా సర్వసమగ్రంగానే నిలుస్తుంది. అందులో మేటి మన తొలి తెలంగాణ ప్రబంధం – ‘షట్చక్రవర్తి చరిత్ర’. ఈ గ్రంథము ఆరుగురు మహారాజుల చరిత్రను తెలిపే మహాప్రబంధము.
2. కథల సంగ్రహం : షట్చక్రవర్తి చరిత్ర ఎనిమిది ఆశ్వాసముల ప్రబంధము.
ప్రథమ, ద్వితీయ, తృతీయాశ్వాసములలో హరిశ్చంద్ర మహారాజు కథ, చతుర్ధ, పంచమా శ్వాసములలో నలమహారాజు కథ, షష్ఠాశ్వాసములో పురుకుత్స, పురూరవ మహారాజుల కథ, సప్తమా
శ్వాసములో సగర చక్రవర్తి కథ, అష్టమాశ్వాసములో కార్తవీర్యుని కథ చెప్పబడింది. ఈ కథలను పరిశీలించినట్లయితే
2.1 హరిశ్చంద్ర మహారాజు కథ
2.2 నలమహారాజు కథ
2.3 – పురుకుత్స మహారాజు కథ
2.4 – పురూరవ మహారాజు కథ
2.5 – సగర చక్రవర్తి కథ
2.6 – కార్తవీర్యుని కథ
(కథలు టైప్ చేయబడినవి)
ఈ కథలు వేటికవే ప్రబంధం కాగలిగిన లక్షణాలు కలిగినవి. కాని కవి వీటిని ఒక సమాహారంగా చేసి ఒకే గ్రంథంగా ఇవ్వడంలోని ఆంతర్యం – ‘రాజు’ అయినవాడు ఈ ఆరుగురిని ఆదర్శంగా తీసుకొని, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ధర్మానికి కట్టుబడి నిలిచి పోరాడాలని తెలియజేయడం. అప్పుడే చరిత్రలో నిలబడగలిగే చక్రవర్తులవుతారని అంతర్లీన బోధన. ఈ కథలను నేటి ప్రజాస్వామ్య పాలన కొరకు కూడా అన్వయం చేయవచ్చు.
3. ప్రబంధ సాధారణ లక్షణాలు : డా. జి.నాగయ్య గారు ‘తెలుగు సాహిత్య సమీక్ష’ మొదటి సంపుటంలో ప్రబంధ ప్రక్రియ గురించి చర్చించి నిర్ణయించిన అంశాలు ఈ సందర్భంలో పరిశీలించదగినవి.
“స్థూల దృష్టికి కావ్య ప్రబంధ శబ్దములు రెండును సమానార్థకములే. రెండిటియందును అష్టాదశ వర్ణనాదులు సామాన్యములే. కనుక సామాన్యములకు వీటి భేదము గుర్తింపరానిది.
సంస్కృతాలంకారికులు, కవులు, వ్యాఖ్యాతలు ప్రబంధ శబ్దమును ‘కావ్య సామాన్య వాచి’గా ప్రయోగించినారు. కాని ఒక సారస్వత ప్రక్రియా విశేషముగ మాత్రముపయోగింపలేదు.. ప్రబంధ పద ప్రయోగ విషయమున తెలుగు లాక్షణికులు సంస్కృతాలంకారికులనే అనుసరించినట్లున్నది. నన్నెచోడునితో పాటు తిక్కన, కేతన, మంచన, ఎర్రన, శ్రీనాథుడు, పిల్లలమర్రి పినవీరభద్రుడు, నంది మల్లయ్య, ఘంటసింగనలు మొదలగువారు ప్రబంధ కావ్యపరముగానే ప్రయోగించినారు. తిక్కన తాను రచించిన పదునేను పర్వముల భారతమును “ప్రబంధ మండలి” అని పేర్కొనెను. పురాణమగు హరివంశమును కూడ ఎర్రన ప్రబంధమనియే వ్యవహరించినాడు. వీధి నాటకమగు క్రీడాభిరామము, వీరగాథా కావ్యమగు పల్నాటి వీర చరిత్రలు కూడ ప్రబంధములుగానే వ్యవహరింప బడినవి. అల్లసారి పెద్దనాది కవులును తమ ప్రబంధములను కావ్యములుగానే పేర్కొనియున్నారు….తెలుగు సాహిత్య చరిత్రకారులు కావ్య ప్రబంధ శబ్దములకు అర్థభేదము కల్పించి…. కృష్ణదేవరాయల యుగము – క్రీ.శ. 16వ శతాబ్దమును ప్రబంధ యుగమని ప్రత్యేకముగా పేర్కొన్నారు. క్రీ.శ. 16వ
శతాబ్దము నందు వెలువడిన కావ్యములకు మాత్రమే ప్రబంధమను పేరు రూఢమైనది… ‘రచనా విధానములో కథావస్తువులో పాత్ర చిత్రణములో రసపోషణలో అలంకార వర్ణనాధికములో ప్రబంధములో కొత్తరీతులను సంతరించుకొన్న కావ్య ప్రక్రియ…. ప్రకృష్టమైన బంధము కలది ప్రబంధము. బంధ శబ్దమునకు ‘కూర్పు’, ‘నిర్మాణము’ అను నర్థములు కలవు. సంఘటనలు, వర్ణనలు మొదలగు కావ్యగత విషయములన్నియు ప్రధాన ప్రయోజనాభిముఖముగా అనుసంధింపబడిన కావ్యమే ప్రబంధమని చెప్పవచ్చును” పుటలు 594-596. “ప్రబంధ కవులు కేవలము కథావస్తువు కొరకు మాత్రము పురాణములపై ఆధారపడి ఆ కథావస్తువును గ్రహించి దానికి స్వకపోల కల్పితములైన వర్ణనాదుల గూర్చి వన్నెచిన్నెలు కల్పించి ఒక మనోహరతను, ఒక నవ్యతను సృష్టించినారు… పూర్వ కవులు ఉపమాలంకారము, రూపకము, స్వభావోక్తి వీనిని తమ రచనలలో ఎక్కువగా వాడుచుండిరి. ప్రబంధ కవులు ఈ అలంకారములకు తోడు ఉత్ప్రేక్ష, అతిశయోక్తి వీనిని విరివిగా మార్చిరి. పూర్వకవులు మొత్తము మీద సులభ సామాన్యశైలికి నలవడినవారు. ప్రబంధయుగము నాటి నుండియు కవులు పండిత ప్రీతికై ప్రౌఢ శైలిలో రచించెడివారు. వీరు కూడ మృదువైన రచన అక్కడక్కడ చేయకపోలేదు.
4.వర్ణనా చాతుర్యం : ఈ షట్చక్రవర్తి చరిత్రములో కవి వర్ణనా నైపుణ్యం ప్రత్యేకంగా కనిపిస్తుంది.
4.1. విశ్వామిత్రుని వర్ణన : విశ్వామిత్రుడిని హరిశ్చంద్రుడు సాక్షాత్తు శివునిగా భావిస్తున్నట్లు కవి రచన చేస్తారు.
సీ.కరుణారసము వెలికురికెనోయనమౌళి
బల్లవస్ఫుటజటాపటలమమర
జాబిల్లిపూదేనె జిరెనోయన మేన
నతనుభూతి ప్రభావితతి మెఱయ
రహిగంటిలో వహ్ని రాజుచున్నదియన
నొసల మేలిమి బొట్టు పసలమసల
దొలికినగాంగబిందు పరంపరోయన
నటుతను స్ఫటికహారాళి బెళుక

గీ.గలికివన్నియ పులితోట కటిని గట్టి
యీశ్వరుడు బోలి గాధేయుడేగువేర
నెదురుగానే భయభక్తులెనగ నృపతి
యర్ధదండ ప్రణామంబు లాచరించె (2-21)
శివునిరూపును విశ్వామిత్రునిలో ఉపమించి చెప్పడం-కవిలోని వర్ణనావైచిత్రి తెలుస్తుంది. పద్యపాదాలలోని మొదటి పదాలు ఉపమానాలుగాను, మధ్యపదాలు ఉపమేయాలుగాను, చివరిపదాలు క్రియావాచకాలుగాను ఉండటం మనం గమనించవచ్చు. ఇటువంటి పద్యరచన తిక్కన సీసపద్య రచనకు దగ్గరగా ఉన్నదని కూడా చెప్పవచ్చు.
4.2. బోయవారల వేట వర్ణన :
అడవిలోని బోయలు ఏవిధంగా వేటకు సిద్ధపడ్డారో కవి-
సీ. బలుకెంపులగు మీసముల గుంపులను మధ్య
ములకంపు పాలపెంపు దొలకరింప
వడదోళ్ళు గురివెద మెడనూళ్ళునుడు గని
వెడవేళ్ళు తలముళ్ళు వెడదనోళ్ళు
సెలవిళ్ళు తగు వన్యముల తిళ్ళును మెకాల
గుడికాళ్ళు మిడిపళ్ళు కురుకుదోళ్ళు
కనుకట్లు పరియాచ కపుదిట్లు కనువట్లు
నెద పెట్లు తలచుట్లు నెఱ్ఱబాట్లు.

గీ. చిల్లకోలలు చలికూళ్ళ చిక్కములను
గలిగియత్యత భీకరాకార పటిమ
రాకచేచాయపతిహజారంబు చాయ
బోయ దొరమూక వీకతోడాయనిలిచి (2-53)
అని అచ్చతెలుగు పదాలతో బోయ దొర, బోయ దొర మూకలు ఎలా వేటకు బయలుదేరాయో చక్కగా వర్ణించారు. ఇటువంటి వర్ణనే హరిశ్చంద్రుని వద్ద –
సీ. మురువుగారవగంధములు మేనుల నలంది
కస్తురిబొట్లలికముల దీర్చి
పసిడిపూలరుముళ్ళు పలుదెఱంగులగట్టి
సందిళ్ళ గడియముల్పొందు పఱచి
మొలబట్టుదట్టీలు మొనయవంకలు చెక్కి
కీలుకత్తులుకేలగీలు కొలిపి
పొదుపుగానమ్ముల పొదలువీపున జేర్చి
యెగవారు చెప్పులు బిగియదొడిగి

గీ. వెండి బంగారములకట్లు వెలయుజల్లి
విండ్లు త్రిప్పుచు గడును విడినివీర
భటులు చనుదెంచి యతులితార్భటులు వాలయ
మ్రొక్కి నిలిచిరి యవనీశు చక్కినెలమి (2-52)
రాజుగారి భటుల అలంకారములలో తత్సమాలను బోయ దొర మూకల అలంకారములలో గ్రామ్యాలను ప్రయోగించడం కవిలోని ఔచితీవైచిత్రిని మనం గుర్తించవచ్చు.
4.3. వశిష్ఠుని ఆశ్రమ వర్ణన : కవి రెండవ ఆశ్వాసంలో వశిష్ఠుని ఆశ్రమాన్ని అద్భుతంగా వర్ణిస్తారు. తనివితీర 119వ పద్యం నుండి 128 వచనం వరకు ఆశ్రమాన్ని వర్ణించి పఠితలకు వశిష్ఠుని ఆశ్రమ రమణీయతను కళ్ళ ముందుంచుతారు. ఉదాహరణకు
సీ. విలసిత కపిలగవి విరాజిరాజిత
సౌష్ఠవంబై సాంఖ్యశాస్త్రమగుచు
రమణీయ కృష్ణసారథమాంకితలీల
బొగడొంది ద్వారకానగరమగుచు
సలిలితరాజహంస విహార భాసురా
భోగమై యాకాశ భాగమగుచు
జారుకేసరిజాలశరభముఖ్యాన్యోన్య
సఖ్యమైసుగ్రీవ సైన్యమగుచు (2-119)

గీ. గువలయోల్లాసకరబహుసవనవిభవ
గౌరవంబున వెలయు కాసారమగుచు
ఘనతబెంపొందునెప్పుడగణ్య పుణ్య
విశ్రమంబు వసిష్ఠమౌన్యాశ్రమంబు (2-119)

సీ. నియత ఫలాహార నియమంబు వాటించు
విలసిల్లు శుకసంతతులను మెఱసి
కమనీయ కిసలభక్షణ వృత్తి బచరించు
బహువనీప్రియకదంబములదనరి
సుమనః ప్రసంగతి యమరవర్తించుమా
ధుకర కులమ్ముల తోడనెనపి
భువన స్థలంబుల బొలుపొంద జరియించు
బరమహంసవతంస పటలినలరి

గీ. మఱియు సకలాగమములకు మనికి యగుచు
భవ్యమాధవవిస్ఫూర్తి ప్రణుతికెక్కి
నైమిశారణ్యమని పోల్పనైజమైన
యొక్క యుద్యానమధిపతి యొప్పగా చె (2-126)
ఈ విధంగా కవి, వశిష్ఠుని ఆశ్రమము, అనేకరకాల పుష్ప, ఫలములతో కూడినదని, వన్యప్రాణులు, పర్వతములు, జలపాతములు, పక్ష్యాదులతో కూడి వేదధ్వనులతో నైమిశారణ్యమును పోలి ఉన్నదని రమణీయంగా వర్ణిస్తారు. ఆనాటి ఆశ్రమాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్లు రచన చేసారు. నాలుగు సీసపద్యాలు, గీత, వచనాలలో ముని ఆశ్రమాన్ని వర్ణించి, తమ రచనా చాతురిని చాటుకున్నారు.
4.4. మాతంగకామినుల వర్ణన :
ఎటువంటి మాతంగ కామినులు రాజైన హరిశ్చంద్రుని చూచిరో కవి అద్భుతంగా వర్ణిస్తారు.
సీ. వీరికొప్పులు కప్పు మీరుఘనంబులు
శృంగారరసమువర్షించుటరుదె
వీరిగుబ్బలు చూడ విద్రుమమంజరు
ల్గురురాగవిస్ఫూర్తి గూర్చుటరుదె
వీరివాల్గన్నులు విస్ఫుట తారకల్
శ్రవణ సంగతి గాంచి ప్రబలుటరుదె
వీరినితంబుల్ విశ్రుత చక్రంబు
లంబరమణిదీప్తి నలరుటరుదె

గీ. యనంగ నింపుసొంపుహావంబు భావంబు
గలిగి పూర్ణచంద్రకళలనంగ
మౌనియను మతమున మాతంగ కామిను
లవనినాథుగాంచి యభినుతించి (2-129)
అని మాతంగ కామినులు ఏవిధంగా అలంకారము చేసుకున్నారో, వారి సౌందర్యం ఏవిధంగా ఉన్నదో కవి నిసర్గ సుందరంగా వర్ణిస్తారు.
4.5. సూర్యోదయ వర్ణన : తృతీయాశ్వాసంలో 67వ పద్యం నుండి 75వ పద్యం వరకు సూర్యోదయ వర్ణన సాగడం కవి ప్రతిభకు గొప్ప తార్కాణం.
సీ. జగము గైసే యునిశాప్రసాధిక చేతి
మురవైనలత్తుక ముద్దయనగ
మకరాంక విజయసిద్ధికి బ్రాగ్భరంబుపై
నిలిపిన సౌవర్ణ కలశమనగ
బూర్వాదిక్కాంతవిస్ఫుటకుంకుమారుణి
తాయిరస్తనమండలంబనంగ
నాకాశరమనవిహారార్భమై పట్టిన
కొమరొప్పుకింశుక గుచ్ఛమనగ

గీ. సూనబాణుండు విరహుల మానధనము
కుప్పగావించి యందుపై నొప్పనిడిన
హారికాశ్మీరము ద్రాంకమనగ బూర్ణ
సూర్యుడుదయించె గాంతిని స్తంద్రుడగుచు (3-67)

సీ. ప్రార్దిశాభామిని ఫాలభాగంబుపై
బాలుచుసింధూరంపు బొట్టనంగ
గైసేయుతఱి వజ్రకాంతకుబట్టిన
పద్మరాగంపు దర్పణమనంగ
బ్రకటనక్తంచర ప్రతతుల ఖండించి
చనుదెంచు హరిదివ్యచక్రమనగ
బురుహూతపురము గోపురముపై నిలిపిన
పటుశాతకుంభంబనగ

గీ. బద్మములు నిక్కగైరవపటలి స్రుక్క
జక్రములుపొంగదారకాచయమడంగ
దిమిరములు బాటు దిక్కులు తెలివిమీర
ధరణి యుదయించె నఘనదీ తరణియగుచు (3-75)
టూ రమణీయ సూర్యోదయ వర్ణన చేస్తారు కవి. ఏ రచనలోనైనా కవి సూర్యోదయ, సూరాస్తమయాలకు సంబంధించి ఒక పద్యాన్ని రచించడం సాధారణంగా కనిపిస్తుంది. కాని అందుకు భిన్నంగా రాజమల్లారెడ్డి గారు ఒక ఘట్టాన్ని అనేక పద్యాలలో రచించడం మనం గమనించవచ్చు. సూర్యాస్తమయ వర్ణన పరిశీలిస్తే – తృతీయాశ్వాసంలో 41వ పద్యం నుండి 48వరకు కవి సూర్యుడు అస్తమించిన సమయంలో ఆకాశం ఏవిధంగా ఉంటుందో పరమ అద్భుతంగా చేస్తారు కవి.
సీ. సారతరాకాసార తీరంబున
బొందైనరక్తబ్జా బృందమనగ
వస్తాచలంబుపై నావిర్భవించిన
భూజాళి పల్లన పుంజమనగ
ద్రిజగజ్జయార్థమై తేరుపై నిలిపిన
పంచేషుమంజిష్ఠ పడగయనగ
నప్పతిసన్యాసి యారంగ గట్టిన
వలనొప్పు కాషాయ వస్త్రమనగ
గీ. జరమదికృతిలాస్యావసరము నందు
బయలుగాకుండు నిడుతోపు బచ్చడంపు
తెఱయొకోయనబశ్చిమ దిశను మిగుల
ఘనతర స్ఫూర్తి సాంధ్యరాగంబు దోచె (3-43)
సీ. వలరాజు లోకముల్లెలువ బోవగదిశా
లలనలు చల్చిన లాజలనగ
నభ్రకాసారంబు నందంబుగాడంబు
మీటిన కుముదం మీలనంగ
శివతాండవోద్వృత్తి జెదరి మిన్నంటన
సురనదీవారిశీకరములనగ
జదలనియెడి నీలిచందువాగుట్టిన
పొలుపైన వెలిపట్టు పూవులనగ
గీ. నక్షరాభ్యాస మొనరించు నట్టివేళ
బంకరుహసూతినభమను పలకమీద
సుద్దచేబట్టి వ్రాసిన సున్నలనగ
సలలిత స్ఫూర్తి నక్షత్రములు వెలింగె (3-48)
ఈ విధంగా కవి సూర్యాస్తమయం మొదలుకొని రాత్రివేళ వరకు ఆకాశములో కలిగే మార్పులను రమణీయంగా వర్ణిస్తారు. ఈ రచనలో వారు ఎంత ప్రకృతి ప్రేమికులో తెలుస్తున్నది.
అగ్నివర్ణన (3-77), గంగావర్ణన (3-95), కాశీపట్టణ వర్ణన (3-100,101,103) చంద్రమతి వర్ణన (3-121-125), స్మశాన వర్ణన (3-167, 183-197), ఈశ్వర వర్ణన (7-104) మొదలైన వాటిని పరిశీలించినప్పుడు కవిలోని వర్ణనాచాతురి మనకు అవగతమవుతుంది.
5. రచనా శిల్పం : కవి రచనా శిల్పాన్ని, గ్రంథానికి పీఠిక రాసిన పెద్దమందటి వేంకట కృష్ణ కవి గారి మాటల్లో పరిశీలిద్దాము.
“యీ కవి పుంగవుని కవిత మృదుమధుర పదపూరితమై నిర్దుష్టమైన నవరసాలంకార భూయిష్టమై ద్వావింశద్వర్ణనాకరమై నానావిధ బంధ శ్లేష యమకాదులకు స్థానమై నిరర్గళ గంగా ప్రవాహము వలె ననవద్య హృద్య ధారాశుద్ధితో నలరారుచున్నదను విషయము పండితులెల్లరేకీభవింతురని నా నమ్మిక” (పీఠిక || -1926) ఈ వాక్యాలు గ్రంథం చదువుతున్నవారికి సత్యములని ఋజువవుతాయి. ‘షట్చక్రవర్తి చరిత్రమను యిమ్మహా ప్రబంధమును రచించిన కవిశిఖామణి రాజామల్లారెడ్డిగారు…” అనే పీఠిక తొలి వాక్యం – ఈ గ్రంథం ప్రబంధమని, అందునా మహాప్రబంధమనీ తెలుస్తుంది. అనేక (ఆరు) ప్రబంధాలతో కలిసి మహాప్రబంధంగా వెలుగొందినదని బోధపడుతున్నది.
5.1. పద్యశిల్పం : రచనాశిల్పంలో మొదటగా పఠితలను ఆకర్షించే అంశం – పద్యశిల్పం కవి తన శైలి ఎలా ఉంటుందో షష్యంతాలలో నిక్షిప్తం చేశారు. అంతేకాక,
‘సహసా పాహియే దేవి త్రిలోకీజనసన్నుతే
ఆరోగ్యమభయం దత్వాయుష్మదంఫ్రి యుగార్చనం (ప్ర. 1)
అనే శ్లోకంతో కవి కావ్యాన్ని ప్రారంభించారు. మొదటగా సంస్కృత శ్లోకంతో ప్రారంభించడం, కవి – రాజా మల్లారెడ్డి గారి సంస్కృత భాషాభిమానం వ్యక్తమవుతుంది.
షష్ఠ్యంతాలు :
క. శ్రీ మద్భూమీధరపు
త్రీమణి కుచకుంభికుంభ మృగమదవిదిత
శ్యామలకోమల వక్షో
ధామున కభిరామభూమిధర ధామునకున్ (ప్ర.2)
క.శరణాగత శరణాంతః
కరణావరణునకు నిత్యకరుణాభరణ
స్మరణ స్ఫురణాదరణా
చరణునకును నిగమకటకచణ చరణునకున్ (ప్ర.3)
క. జూటీతట కోటీరట
దాటీకధునీ ఘమంఘమార్భట పేటీ
కోటీరునకును ధాతృక
కోటీయుత మదన తను గురుపటీరునకున్ (ప్ర.4)
క. కుండల మణి కుండల ఘృణి
మండల మండిత కపోల మండలునకును
ద్ధండ భవషండకుధరా
ఖండలునకు భూరివైరిగణ ఖండలుకున్ (ప్ర.5)
క. దక్షాధ్వర శిక్షాపర
కౌక్షే యాక్షుద్ర రౌద్ర కరబాహునకున్
రూక్షణ వీక్షణ భక్షణ
రక్షదేహునకు నుక్షరాడ్వాహునకున్ (ప్ర.6)
క.జంఖాసురరిపు బాహా
దంభోళిస్తంభ దంభ దనుజారంభో
జృంభత్పయోధి కుంభజ
శుంభచ్ఛార్యునకు భక్త శుభాకార్యునకున్ (ప్ర.7)
క. వారాకరభవ గరళా
హారునకు నుదారహర హారపటీర
క్షీరసుధారస శారదా
శారదరుచిపూర చారు శరీరనకున్ (ప్ర.8)
క. బుద్ధ్యంచద్ద్యానధ్యే
యాధ్యవసాయునకు మహాదహంకృతి మధ్యా
సాధ్యస్వమాయునకుభ
క్తద్వాత్మసుధాయునకు సదాదాయునకున్ (ప్ర.9)
క. రంగద్భుజంభోగా
భంగురమణికిరిణ వీరణ బాలాతపస
త్యాంగత్యారుణిత విభా
లింగిత తను సిద్ధరామలింగంబునకున్ (ప్ర.10)
వ. సమర్పితంబుగా నా యొనర్పంబూనిన షట్చక్రవర్తి చరిత్రంబను
మహా ప్రబంధమునకుం కథా సూత్రంబెట్టిదనిన (ప్ర.11)
అని షష్యంతాలతో కథను ప్రారంభిస్తారు కవి. అంతే కాదు తన రచనాశైలిని కూడా నిక్షిప్తం చేశారు. మొదటి శ్లోకంలో సంస్కృత భాషాభిమానం, రెండవ పద్యంలో సిద్ధరామేశ్వర స్మరణ, సంస్కృత పదభూయిష్ఠ రచన, మూడవ పద్యం నుండి పదవ పద్యం వరకు వృత్త్యనుప్రాస, యమకాలంకారాలు, మణి ప్రవాళ శైలి తదితర ప్రత్యేకతలు మనకు కనిపిస్తాయి.
5.2. ఛందస్సుల పేర్లతో పద్యరచన :
ద్వితీయాశ్వాసంలోని హరిశ్చంద్రుని కథలో
సీ. విలసిత మత్తేభ విక్రోడిత స్ఫూర్తి
మహిత ప్రపంచ చామర నిరూఢి
విస్ఫుట శార్దూల విక్రీడిత ప్రొథి
తత భుజంగ ప్రయాతక్రమంబు
మానితసింహరే ఖానేక సంస్థితి
పటుతరహరిణీ ప్రభావ సరణి
నిరుపమ విస్మయాకర శరభక్రీడ
రమణీయ వనమయూర ప్రదీప్తి
గీ. మఱియు దక్కిన యుపజాతి మహిమ బెక్కు
చందముల మీటి గణనకాశ్చర్యమొ
బ్రబల గురులఘు వర్ణనిర్ణయముగాగ
సత్కవియుబోలి నిర్మించి జగతినించె (68)
అనే పద్యంలో కవి అనేక ఛందస్సులతో పేర్లతో పద్యాన్ని కూర్చాడు. ఛందస్సు మీది ప్రీతితో, ఆ పేర్లతోనే పద్యాన్ని రచించడం పద్యశిల్పంపై ఉన్న ప్రత్యేకాభిమానం వ్యక్తమవుతుంది.
సంస్కృత పద్యాలతో పద్యాన్ని కూర్చి పూర్తి సంస్కృత వృత్తమా! అనిపించేట్లుగా రచన చేయడం ఈ గ్రంథంలో మనకు కనిపిస్తుంది.
చ. ఘన, ఘనలీల విస్ఫురిత కంఠలున్నృకరోటమాల్యబం
ధన,ధనదాదిశత్రుగజ దానవదర్ప పయోధరప్రభం
జన జన లోక భక్తజన సంతత పోషణ భూషణాత్మఖా
వన వనజాప్త చంద్రశిఖి వర్ణిత తోచ నబంధ మోహనా. (ద్వి. ఆ. 156)
అనే పద్యం, తెలుగు విభక్తి ప్రత్యయాలు లేకుండా సంస్కృత పదాలతో కూర్చి తెలుగు ప్రబంధంలో రాశారు కవి. అంతేగాక ఈ పద్యం పాదాలలో ముక్తపదగ్రస్తాలంకారం అనిపిస్తుంది.
ఇటువంటి పద్యరచనకు మరొక ఉదాహరణ.
క.నానాదిశాధినాయక
మానసదర్పాపహృత్య మంజస శౌర్యా
ధీనమదోత్కట తనుగజ
దానవసంహార కరణ తాశీలమతీ (ద్వి. ఆ. 157)
ఈ విధమైన పద్యరచన మనకు కావ్యమంతా విస్తరించిన తీరు మనం గమనించవచ్చు. ఉదాహరణకు
సీ. విష్ణవేపోషిత జిష్ణవే కృష్ణాయ
శ్రేయోగుణాయనా రాయణాయ
శాంతాయమునిజన స్వాంత నిశాంతాయ
మధుసూదనాయర మాధవాయ
హరయేముకుందాయ గరుడాధివాహాయ
వేదవేద్యాయదా మోదరాయ |
వందారుసురబృంద మందార భూజాయ
కంబుధరాయ పీతాంబరాయ
తే. శేషశయనాయ కౌస్తుభ భూషణాయ
దోషహరణాయ దానవ భీషణాయ
దోషరహితాయసూనృత భాషణాయ
భానుకోటి ప్రభాయతుభ్యం నమోస్తు (6-31)
సంస్కృత విభక్తి ప్రత్యయాలతో తెలుగు పద్యం రచించడం ఒక్క రాజామల్లారెడ్డి గారికే చెందినదని చెప్పడం అతిశయోక్తి కాదు.
సీ. కంజాతదళనేత్ర ఘనాఘనాఘనగాత్ర
కమలాకళత్రరంగచ్చరిత్ర
కౌస్తుభమణిభూష కమనీయ బహువేష
విలసిత సంతోష విగత రోష
భక్తరక్షోల్లాసభర్మ నిర్మిత వాస
కోమలహాస వైకుంఠవాస
నిఖిల లోకాధార నిర్జితాసురవార
నిబిడ కల్మషదూరనిగమహార
గీ. పక్షిరాజతురంగ కృపాంతరంగ
సత్యసంకల్ప పన్నగ స్వామి తల్ప
పద్మభవపాక శాసనపారికాంక్షి
శరణశరణాగతవన శరణు శరణు (6-32)
కథానుగతంగా విష్ణుమూర్తి స్తుతిని సీసపద్యంలో సంస్కృత విభక్తి ప్రత్యయాలతో రచించడం పై పద్యంలో గమనించవచ్చు.
5.3. దేవతాస్తుతులు : ఇతర గ్రంథాలతో పోలిస్తే షట్చక్రవర్తి చరిత్రలో దేవతాస్తుతులు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. పద్యరచనలో దేవతాస్తుతులు చాలా సహజంగా ఒదిగిపోవడాన్ని బట్టి, కవి ఎంతగా ఛందస్సు తిరిగినవారో తెలుస్తుంది.
5.3.1. ప్రథమాశ్వాసములో – సిద్ధరామలింగస్తుతి చేస్తూ
శా. గౌరీ సంచిత భోగభోగ ధరభోగస్నిగ్ధరత్నచ్చటా
స్ఫారాలంకృతి యోగయోగ జన హృత్పర్మద్విరేఫాయితో
దారాంఘిద్వయ భాగభాగణ సముద్య చ్చూలవిధ్వస్తద
క్షారాతిస్ఫుటయాగయాగ భుగజాద్యాశాస్తుత ప్రక్రియా (1-47)
క. గంధపటు ఖడ్గదారిత
బంధురతర కంధరాబ్జ బహుపూజాధౌ
రంధర్య భక్తి చణదశ
కంధరవరదాన దీక్ష కారుణ్య నిధీ! (1-48)
పంచచామరం
భవాభవాభవానుభావ భావజారిభూరిగో
భవాభవాహనేహగేహ బాహవాహవాధికా
నవాహవంజ వాహనోదనాదమేదురాధరా
శివాశివాంతరంగసంగ సిద్ధరామలింగయా ! (1-49)
పద్యాలలో సంస్కృత రచనాశైలి, ముక్తపదగ్రస్తాలంకారం సమ్మిళితమై కనిపిస్తుంది.
5.3.2. శివస్తుతి
సీ. పశ్యల్లలాట శుంభత్ఫణీశకిరీట
చంద్రకళాజూట శరణు శరణు
రాజితాచలగే హరమ్య గోపతివాహ
శారదాంబుదదేహ శరణు శరణు
కాలకూటాహర గజద్వైత్య సంహార
సర్వలోకాధార శరణు శరణు
సద్భక్తసురభూజసంయమికృత పూజ
శతకోటి రవితేజ శరణు శరణు
గీ. శైలకన్బామనోనాథ శరణు శరణు
శైలరాజశరాసన శరణు శరణు
శైలధరి దివ్యసాయక శరణు శరణు
శైలభేదన గురువంద్య శరణు శరణు (3-117)
అని శరణుఘోషలతో పద్యరచన చేశారు కవి. కథను మూలం చేసుకొని తనివితీరా భగవంతుని స్తుతి చేయటం ఈ గ్రంథంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది.
5.3.3. బ్రహ్మస్తుతి
సీ. చతురాననాయ ధీచతురాయ శాంతాయ
శతధృతయే కృపా సాగరాయ
పరమాత్మనే పరబ్రహ్మణే పరమేష్ఠి
నే హేమగర్భాయ నిర్భరాయ
విశ్వసృజే జగద్వీశ్వ సద్వ్యాపినే
ధాత్రేబ్జజాయ పితామహాయ
వందారుసురబృంద మందార భూజాయ
సత్వగుణాయ విచక్షణాయ
తే.హంసవాహాయ కోటిసూర్య ప్రభాయ
సకల భువనైక కర్రేవశంవదాయ
వేదవేదాంతవేద్యాయ విభవదాయ
భారతీవల్లభాయతుభ్యం నమోస్తు (7-42)
సగరుని పాత్ర ద్వారా కవి ఈ విధంగా బ్రహ్మస్తుతి చేస్తారు. సంస్కృత విభక్తి ప్రత్యయాలతో సీసపద్య రచన చేయడం అలవోకగా సాగిపోతుంది.
5.3.4. గరుడ స్తుతి :
సీ. ప్రాతర్భవంతంస్మరామి శక్రాదిగ
ర్వాణ సంచయగేయ వైనతేయ
భవదీయ దివ్యరూపంద్రష్టుమిచ్ఛామి
వరపుణ్య సముదాయ వైనతేయ
త్వద్వచళోతుం ప్రవక్ష్యామి సంహృత
వనరాశి బహుతోయ వైనతేయ
త్వాంభజేహం సర్వదాముదానుతచిత్ర
వర్ణనిర్నయకాయ వైనతేయ

తే. మయికృపాందేహిభో హిరణ్మయపతత్ర
తాళవృంత విధూన నోత్తాలశమిత
జలధికన్యాధి నాయక శ్రమనికాయ
దీనజనరక్షణాపాయ వైనతేయ (7-69)
ఈ పద్యంలో సంస్కృత క్రియావాచకాలు ఉండటం ప్రత్యేకంగా కనిపిస్తాయి. సంస్కృత వాక్య మర్యాదతో పద్యనిర్మాణం చేయడం, కవి ప్రతిభాపాటవాలను తెలియజేస్తుంది.
పై పద్యం వెనువెంటే కవి
సీ. గాడాంధకారంబు గప్పియుండిన వాని
కపుడు సూర్యోదయంబైనయట్ల
దుష్టవరజ్యరారుతండైనట్టి వానికి
దొడరి ధన్వంతరి దొరికినట్ల
యాజన్మ దారిద్ర్యుడైనట్టి వానికి
నరుదైన నిక్షేప మబ్బినట్ల
గహనంబులో త్రోవ కానని వానికి
దొడరి చక్కని తోడు దొరికినట్ల

గీ. యతుల దుఃఖాన్వితుండనైనట్టి నాకు
జూపడితివిందునెనరైన చుట్టమవయి
యెఱుగనిడమిద్ధమని యానతియ్యవయ్య
దీనజనపోషణోపాయ వైనతేయ (7-70)
అని తెలుగు వాక్యనిర్మాణ శైలిని పరిపుష్టం చేస్తూ ఉపమాలంకారంతో గరుడ ప్రార్థన చేస్తారు. రెండు పద్యాలు వెంటవెంటనే ఉండటం సంస్కృత, తెలుగు భాషలపై వారికున్న అభినివేశం తెలియజేస్తుంది.
ఇటువంటి దేవతాస్తుతులు కథాగతంగా మరెన్నో మనం గుర్తించవచ్చు. ఉదాహరణకు 1-98; 3-95, 183 నుండి 189; 5-5; 6-42, 7-96, 114; 8-14 పద్యాలను పేర్కొనవచ్చు.
6. అలంకార నిర్వహణ : కవి రచనాశైలిని ప్రకటింపజేసే ప్రధానమైన అంశం అలంకార నిర్వహణ. ఆయనలోని కవితాత్మకత అలంకారం ద్వారానే వ్యక్తమవుతుంది.
6.1. ఉపమాలంకారము
సీ. కైలాసగిరికిని గాశికాపురి సాటి
గగనస్రవంతికి గంగసాటి
విఘ్నేశునకు దుండి విఘ్నేశ్వరుడు సాటి
రహిగుమారునకు భైరవుడు సాటి
ప్రమథ వర్ణములకు బాశుపతుల్సాటి
సురలకు నిచటి భూసురులు సాటి
యద్రిరాట్పుత్రికి నన్నపూర్ణయె సాటి
హరునకు విశ్వనాయకుడు సాటి

తే. యందు వృషభేశ్వరునకిందు నంది సాటి
రుద్రకన్యలకీ సుందరులును సాటి
చాటుచున్నవి శ్రుతులు ముజ్జగములందు
నిందులకు సంశయము వలదిందు వదన (3-100)
కాశీపట్టణాన్ని కైలాస పర్వతముతోనూ, గంగానదిని అమరగంగతోనూ, దుండి వినాయకుడిని, విఘ్నేశ్వరునితోనూ, భైరవుడిని కుమారస్వామితోనూ, పట్టణంలో సంచరించే పాశుపతులను ప్రమథ గణాలతోనూ, అక్కడి బ్రాహ్మణులను దేవతలతోనూ, అన్నపూర్ణను పార్వతీదేవితోనూ, విశ్వేశ్వరుని సాక్షాత్తు శివునిగానూ, నందిని వృషభేశ్వరునితోనూ, అక్కడి స్త్రీలు రుద్రకన్యలతోనూ పోలుస్తూ కైలాసగిరి కాశీ సమానమని, మూడు లోకాలలోనూ శ్రుతులు చాటుచున్నాయని, ఇందులో సంశయం లేదని హరిశ్చంద్రుడు చంద్రమతీదేవితో చెబుతాడు. ఉపమాన ఉపమేయాలను ప్రస్తావిస్తూ ఉపమాలంకారాలను ప్రతిపాదంలోనూ చొప్పిస్తూ రచన చేయడం ఒక ప్రత్యేకాంశంగా చెప్పొచ్చు.
6.2. ముక్తపదగ్రస్తం
చ ఘన, ఘనలీల విస్ఫురిత కంఠలున్నృకరోటమాల్యబం
ధన, ధనదాదిశత్రుగజ దానవదర్ప పయోధరప్రభం
జన జన లోక భక్తజన సంతత పోషణ భూషణాత్మఖా
వన వనజాప్త చంద్రశిఖి వర్ణిత తోచ నబంధ మోహనా. (2- 156)
6.3. యమకం
కం. ఈ నేల నెందటేలిరి
యీనేలయనంగ నేలయేరీ వారల్
భూనాయక వినవెయని
త్వానిశరీరాణి యనుచు నార్యులు పల్కన్ (2-152)

6.4. వృత్త్యనుప్రాస :
కం. నానాదిశాధినాయక, మానసదర్పాపహృత్సమంజసశౌర్యా
ధీనమదోత్కట తనుగజ, దానవసంహార కరణతాశీలమతీ (2-157)

పు. తారహారదారశేష తారశారశారదా
కారగౌర సారమూర్తి కాంతశాంత సం
త్సారితారి భూరిసేన ధర్మకర్మ శర్మదా
శ్రీరశూర ధీర సిద్ధలింగసాంగమంగళాతతో (2-158)

సీ. ఉబ్బులైయపరంజి లిబ్బులై తళుకులా గుబ్బలై తగుగబ్బి గుబ్బిలమర
నేపులై వలరాజు తూపులై మోహంపురూపులై క్రొవ్వాడి చూపులమర
గప్పులైనీలాల చొప్పులై మేఘంపు నిప్పులై జిగిమీజు కొప్పులమీర
ఠీవులై తేనెల బావులై చివురుల ప్రోవులై దొమ్మంచు మోవులమర (2- 156)

తే. సళధళని చెక్కులమృతంబు లొలుకు పలుకు
లలననగు మొగములనంట్లు గెలుచు తొడలు
నిగనిగని మేనులును గల్గిజిగిదాలంక
జెలువలూర్వశిదండనసించి రెలమి (6-48)
ఇటువంటి పద్యాలలో ఒక్కొక్క పాదంలో ఒక్కోరీతిగ వృత్త్యనుప్రాస ప్రయోగింపబడటం గుర్తించవచ్చు. ఈ విధంగా పేర్కొనబడిన అలంకార ప్రయోగాలు కేవలం ఉదాహరణ ప్రాయములే. చేయి తిరిగిన కవి కలము నుండి దాదాపుగా ప్రతిపద్యమూ అలంకారయుక్తంగానే వెలువడుతుందన్నది పండితులు గుర్తించిన విషయమే.
6.5. అలంకార ప్రీతి : ఛందోనామములతో పద్యరచన చేయడం పూర్వ కవుల గ్రంథాల్లో గమనించవచ్చు. రాజామల్లారెడ్డి గారు ఒకడుగు ముందుకేసి అలంకారాల పేర్లతో పద్యరచన చేసి తన రచనా శక్తిని పరోక్షంగా తెలుపుకున్నారు.
సీ. ఒకచోటగరహాట శకలాటనృపతుల
యతుల పర్యాయోక్తి గతులు మెఱయ
నాకచాయ సదుపాయ యుతీ మంత్రివర్యుల
తత విశేషోక్తి యుత్సవములలర
నొకచెంత హరిచింత మెనం విద్వాంసుల
ధీస్వభావోక్తి సంస్థితులు చెలగ
నొకవంక నకలంక సుకవీశ్వర శ్రేణి
యతిశయోక్తి విశేషమమర జేయ

గీ. దద్గుణ విభావనములు దాత్తములుగాగ
నధిక దృష్టాంతములనపహ్నవము చేసి
లసదలంకార మహిమ చెలంగుచుండు
నిండు గొలువుండెనల మేదినీ విభుండు (4-20)
7. భాషా విశేషాలు : రాజామల్లారెడ్డి గారు సంస్కృత, తెలుగు భాషలలో విశేషమైన పాండిత్యాన్ని అందుకున్న వారు. రెండు భాషలలోనూ రచన చేయగల ధీశాలి అని ఇంతకు పూర్వం ఛందోవిభాగంలో మనం పరిశీలించాము. అచ్చతెనుగులోనూ సందర్భానుగుణంగా రచన చేయగల దిట్ట, ఈ కవి.
హరిశ్చంద్రుని కథలో రాజు వేటకు బయలుదేరిన సందర్భంలో వేటగాళ్ళు రాజుతో మాట్లాడిన తీరును కవి సహజ సుందరంగా రచించారు.
క. సామీ యేమని సెప్పెద
మాము కానన్మందమందలో సొద్దెముగా
బూములను మెకములెగసిన
వేమివగంబోవు నిచ్చ నెఱుగముజియ్యా (2-55)

ఆ సామి దరమరాజ సంపన్న బూవుల
మాసిగాడు కట్టి మస్సిగోడు
పోసిగాడు గూడిపోయిరి రేతిరి
సూసి వచ్చినారు సోదెమయ్య (2-56)

ఇది కవిగారి అచ్చతెనుగు రచనాశైలికి ఉదాహరణ మాత్రమే. దాదాపుగా 2-41 నుండి 2-77 వరకు ఏకధాటిగా మనము ఇటువంటి శైలిని గమనించవచ్చు.
7.1. జంతువుల పేర్లు : వేటగాళ్ళు తమ కుక్కల పేర్లను తెలియజేస్తూ –
సీ.దీని పేరు తుపాకి దేవసింగమునైన
బోనీకయడుగిటిలోన బట్టు
సుడిగాలియిది జియ్యకెడసి యాకలిగొన్న
గబ్బిబెబ్బులినైన గతిచి విడుచు
జలిపిడుగది సామి చెలగియా యేనుగు
నైన మళ్ళించి యిట్టట్టు సేయు
నిది వెండిగుండుమయీ పాలపసి సూపి
యేయే కలమునైన నెత్తివేసు

గీ. గడమ వానిని నెదురెంచగలమె జగతి
మేమె యుసికొల్పినను జందమామలోని
మృగమునైనను జంగున నెగసిబిట్టు
పట్టి విదళించివచ్చు నీ పొదమాన (2-66)
అచ్చతెలుగు పదాలతో వేటకుక్కల పేర్లు కవి రచించడం భాషాప్రౌఢిమనే కాక, వారిలోని సాంఘిక దృష్టి కూడా మనకు అవగతం అవుతుంది.
7.2. దేవతాస్తుతులు : బోయలు తమ యిష్టదేవతల కోసం చేసే ప్రార్థనల్లో అచ్చతెనుగు పదాలు ప్రయోగించడం కవిలోని ఔచితీదృష్టిని తెలియజేస్తుంది.
సీ. వేటసాగింపుమీ వేగంబెదుతను
గానుక పెట్టేము కాట తేడ
మాకు దోడైరమ్ము నీకెక్కదెచ్చేము
గరుడాలమంతుని గంబమయ్య
మెకములలో జేయు మీ సింగమును నీకు
దొలుతగానిచ్చేము దుర్గదేవి
జయమిమ్ము పోతానె జాతరయేసేము
మా పొటేలును గొట్టి మలలతల్లి

గీ. యనుచు దమ వేల్పులకు మ్రొక్కి యధిపుచక్కి
బలిమివాసి చెలంగ దర్పంబు మిగుల
గానరాబంతముల్ హెచ్చి కానజాచ్చి
బోయమూకలు వేటాడబోయె నెలమి (2-98)
7.3. జనవ్యవహారము : ప్రజలు పలికే భాషతో పద్యరచన చేయడం మరొక చమతృతి.
సీ. ఏమకూటము కాడ నెదురించు శరబము
ల్వేనవేలకు మించు మానవేశ
మలయాసలము కాడ మలయు సింగంబులు
లచ్చల కొలదులిలాతలేశ
విందెశైలముకాడ వియరించు బెబ్బులుల్
కోటానుకోటులు కువలయేశ
సిత్రకూటము కాడ సెరలాడు పందులు
నరుబుదంబుల సంకె నరవరేశ
గీ.కడమ మెకములకును లెక్క గలవె యైన
సామిపాతలు వాటెడు సారెనేరి
యేటులోననద్రుంచేము మాటలోన
నయ్య సెలవిమ్ముమ కంబమయ్య తోడు
ఏమకూటము (హేమకూటము), మలయాసలము (మలయాచలము), విందెశైలము (వింధ్య శైలము), సిత్రకూటము (చిత్రకూటము), వేనకువేలు, కాడ, లచ్చలు, వియరించు, కోటానుకోటులు, కాడ సెరలాడు, కడమ, వాఱు, యేటు మొదలైనవన్నీ మాటలను స్వీకరించి సందర్భోచితముగా రచించడం ప్రజల కవులకే చెల్లుతుంది. అది రాజా మల్లారెడ్డి గారు సాధించారు. పదాలు, పలుకుబడులు అన్నీ చొప్పించి రచించడం పద్యరచన పై ఆయన సాధించిన పట్టును తెలియజేస్తుంది.
ఈ విధంగా ‘షట్చక్రవర్తి చరిత్రము’ అనే గ్రంథం ద్వారా కవి రాజామల్లారెడ్డి గారు రాజులకు ఉండవలసిన ఉన్నత గుణాలను తెలియజేస్తూ ‘మార్గదర్శి’ని రూపొందించారు.
ఒక్కొక్క రాజుచరిత్రను ఒక్కొక్క ప్రబంధంగా తీర్చిదిద్ది ‘మహాప్రబంధం’గా పాఠకుల ముందు ఉంచారు. అత్యుత్తమ ప్రతిభతో ‘రచనాశైలి’కి ఉదాహరణగా ఈ గ్రంథాన్ని ఆనాటి, ఈనాటి పఠితలకు అందించారు.
ఆయా రాజుల జీవితాలలో ఎదురైన ఘట్టాలను చదువుతున్నప్పుడు పాలకులకు, పాలితులకు ఒక ప్రేరణ గ్రంథంగా నిలవడమే కాక – ఛందో ప్రియులకు లక్ష్య గ్రంథంగా, పురాణ ప్రియులకు పౌరాణిక గ్రంథంగా, భాషా ప్రియులకు బహుభాషల సమాహారంగా రసప్రియులకు కావ్యరస సమాయుక్త ప్రబంధంగా మలచబడి ఆనాటి ఆలయాలలోని పురాణ ప్రవచనంలో ముఖ్యపాత్ర వహించి నవగ్రహ దోష పరిహార తంత్ర గ్రంథంగానూ నిలిచే ఇహపర సాధనమని చెప్పడం అక్షర సత్యం.

You may also like

Leave a Comment