Home అనువాద సాహిత్యం సంతాప తీర్మానం

సంతాప తీర్మానం

మితృలారా!

నాకోసం  ఈ ఒక్క పని చేసి పెట్టండి

చనిపోయిం తర్వాత నన్ను ఆగం చేయకండి

నాకు యే మత ధృవీకరణ పత్రాన్నో జారీ చేయించకండి

పని గట్టుకని యే బోధనలకూ పూనుకోకండి

ఈమె యే ఫలానీ నమ్మకాలకో, దేశానికో, జాతీయతకో

విధేయురాలు అంటూ

నమ్మించే ప్రయత్నం చేయకండి,

నా శవాన్ని ప్రభుత్వాలకు ఒప్పజెప్పే ప్రయత్నం చేయకండి కనీసం –

అయ్యలారా – అమ్మలారా-

దౌర్భాగ్యులు అణచుకోలేక చేసే తిట్ల దండకమే నాకు గుర్తింపు

రచ్చబండ అంచులకయినా వాళ్ళు రాకపోవచ్చుగాక,

నా ప్రేమికులకేం కొదువ లేదు –

జీవితంలో దాగిన వాస్తవ బీజం,

దుమ్మూ – ధూళీ, రికామీ గాలీ నా ప్రియ నేస్తులు

వాళ్ళని నిందించకండి,

శుద్ధవాదుల మెప్పు కోసం

నా శవాన్ని మాత్రం క్షమాభిక్ష కోరే స్థితిలోకి నెట్టకండి-

సహచరీ!

నన్ను తెల్లశాలువాలో చుట్టలేదని బాధపడకు,

నా శవాన్ని అడవిలో వదిలెయ్

ఈ ఆలోచనే ఎంత సేద దీరుస్తుందో తెలుసా నన్ను!

అడవి మృగాలు నా కోసం వస్తై

నా ఆలోచనలను యే నీతుల తరాజు లోనో పెట్టకుండా

నా ఎముకలనూ, మాంస ఖండాలనూ

కెంపు లా మెరిసే నా గుండెనూ

ఆబగా పీక్కుతింటూ సంతోషపడుతై

పెదవులు నాక్కుంటూ తృప్తిగా చప్పరిస్తై

స్నేహ విధేయమైన వాటి కళ్ళల్లో

అప్పుడు

నీవు సైతం చెప్పలేని

సత్యం మెరుస్తుంది

ఈ శవం ఓ మనిషిదనీ

తను అనుకున్నదే మాట్లాడిన ఆమెదనీ

ఏనాడూ పశ్చాత్తాపం ఎరుగని జీవితానిదనీ

  • ఉర్దూమూలం : ఫమీదా రియాజ్
  • స్వేచ్ఛానువాదం : కొల్లాపురం విమల

ఫమీదా రియాజ్ 1946లో బ్రిటిష్ ఇండియాలో పుట్టి పాకిస్తాన్ లో పెరిగిన ప్రగతిశీల కవయిత్రి.  స్త్రీవాది – హక్కుల కార్యకర్త. తన భావాలను నిక్కచ్చిగా రాసే కవయిత్రిగా ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. జనరల్ జియా – ఉల్ – హక్ మతోన్మాద వైఖరులను ధిక్కరించినందుకు ఆమె నడుపుతున్న పత్రిక మూసేయాల్సి వచ్చింది. ఆమె భర్త జైలు పాలయ్యాడు. ప్రముఖ కవయిత్రీ, స్నేహితురాలూ అయిన అమృత ప్రీతమ్ సాయంతో తన పిల్లలతో పాటుగా పాకిస్తాన్ నుంచి తప్పించుకొని 7 యేళ్ళపాటు రాజకీయ శరణార్థిగా భారతదేశంలో తలదాచుకుంది. పేట్రేగిన మతతత్వ ధోరణులను ఖండించిన నేపథ్యంలో “నీవు కూడా నాలాగే” అనే తన కవితలో ఛాందసత్వాన్ని ధిక్కరించిన మేధావి. భావాలలో, కళాత్మక వ్యక్తీకరణలో నజ్మాహికత్, పాబ్లో నెరూడా సార్ర్తే, సిమోన్ డిబోరా లతో సమానంగా ఈమెని విమర్శకులు గుర్తిస్తారు.  పార్సీ కవయిత్రి ఫరోక్ జాద్, రూమీ వంటి కవుల కవితలను ఉర్దూలోకి అనువదించి మంచి అనువాదకురాలిగా సైతం గుర్తింపు తెచ్చుకున్నారు. 2018 సంవత్సరంలో లాహోర్లో ఆమె చనిపోయిన వార్తను పత్రికలో చదివి ఆమెకి నివాళిగా కొల్లాపురం విమల చేసిన స్వేచ్ఛానువాదం (వివిధ ఇంగ్లీషు అనువాదాల ఆధారంగా) ఈ కవిత.

 

 

 

You may also like

1 comment

విలాసాగరం రవీందర్ September 26, 2021 - 8:38 am

గొప్ప కవిత. చిక్కని అనువాదం మేడం

Reply

Leave a Comment