సంస్కృత భాషతో మూర్తీభవించిన పుంభావ సరస్వతి శ్రీ భాష్యం విజయసారథిగారు. అద్భుతమైన భాషా పాండిత్యంతోపాటు మధుర, మంజుల మనోహరంగా కవిత్వం చెప్పగల పద్మశ్రీ, మహాకవి, మహామహోపాధ్యాయ వాచస్పతి – కులపతి, యుగకర్త, యుగోద్ధర్తా, యుగచక్రవర్తి, సరస్వతీ సంతోత్తంసులు శ్రీ శ్రీ భాష్యం విజయసారథిగారు. వీరు గోపమాంబ – నరసింహాచార్య పుణ్యదంపతులకు – కరీంనగర్ జిల్లా చేగూర్తి గ్రామంలో తేదీ 10.3.1936లో జన్మించినారు. చిన్ననాటి నుండే వీరిలో మానేరు నీటి గలగలలా కవిత్వం ప్రవహించింది. పదకొండవయేటనే ‘శారద పద కింకిణి’ బాసర అమ్మవారిని నుతియించినారు. ఆనాటి నుండి మొదలైన కవిత్వం పాయలు పాయలుగా విస్తరించి 150కి పైగా గ్రంథరచనలు చేసి యావతం భారత్ ప్రజానీకం మన్ననలు అందుకన్న మందాకిని కవి. వీరి రచనలు నాగరి లిపిలోనూ కొన్నింటిని తెలుగు లిపిలోనూ అందించినారు. ఈ మహాకవి గ్రంథాల్లో తాత్త్విక చింతన , సర్వమత సమన్వయం వంటివి విషయపరంగానూ, ఛందో అలంకార వైవిద్యం వంటివి రచనాపరంగానూ అనేక అంశాలు గోచరిస్తాయి. వారి గ్రంథాల్లో ప్రధాన విషయం సమాజం. పైకి వీరి రచనలన్నీ దైవభక్తి ప్రపూరితాలైనా కనిపించినా అంతఃసూత్రంగా సమాజ చిత్రీకరణ ఉంటుంది. వివిధ దేవతాస్తతులలోను, చివరికి భక్తికి పరాకాష్ఠగా చెప్పబడే సుప్రభాతాలలోను దైవభక్తి – మోక్షసాధన పైకి కనిపించినా దేశభక్తి, స్వాతంత్ర్య సమర భావనలు అంతర్లీనంగా ఉంటాయి.
ఈనాటి ప్రపంచమంతా డబ్బుకు లోకం దాసోహం అంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకని శ్రీ భాష్యం వారు రూపాయి మహిమను ‘రూపసూక్తం’లో వ్యంగ్యంగా రాశారు. మనిషి చేత సృజింపబడి మనిషిని ఏ విధంగా రూపాయి ఆడిస్తుందో తెల్పారు. రూపాయి తెల్సుకోవటానికి ఎవరికి సాధ్యమవుతుందంటూ ఆరంభించిన సూక్తంలో అద్భుతంగా రూపాయి మహిమను తెల్పారు.
శ్రీ భాష్యం వారు ఎంత సనాతన సంప్రదాయ విషయ అవగాహన దార్శనికులు. లోతులు కలిగినవారో అంతే ఆధునికతను జీర్ణించుకున్న విద్వత్ కవి, ఈ విషయంలో మనం లోపలికి వెళ్ళి ‘సృష్టి దర్శనం’ చూస్తే అందరికీ అవగతమవుతుంది. ఈ కవి ఆత్మను పట్టుకోవాలంటే సంపూర్ణ అవగాహన లోతైన పరశోధన అవసరఁ. వీరి గ్రంథాల మీద రచనలలో అంతర్గతాంశముల మీద వివిధ విశ్వవిద్యాలయాల నుండి పరిశోధనలు జరుగుతున్నాయి. వీరి రచనలు వివిధ ప్రక్రియలలో మనకు అగుపిస్తాయి. దాదాపు అన్ని సాహితీ ప్ర్రకియలను వీరు స్పృశించినారు. సుప్రభాతాలు, స్తోత్రాలు, భక్తి రచనలు, అధిక్షేప కవితలు, విమర్శ, ఆప్తలేఖలు (లేఖా సాహిత్యం) ఖండ కావ్యాలు, నవలలు, ప్రహేళికలు, విమర్శ, వర్ణనాకావ్యాలు, అనువాదాలు.
ప్రస్తుతం యావత్ ప్రపంచం అంతా కరోనా విషూచికతో బాధపడుతుంది. దీనిని దృష్టియందు ఉంచుకొని గురువుగారు ‘కరోనా మూలతో జహి’ రాసి అందులో కరోనా సోకకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో చాలా విషయాలు రాసి జనాలను అప్రమత్తం చేసినారు.
ఎంత అద్భుతమైన కవియో అంతే అద్భుతమైన విద్యారు్థల గుండెలలో చోటు సంపాదించుకున్న అధ్యాపకులు. చక్కటి స్వ రూపంతోపాటుగా సుస్వరంతో వారి బోధనలో విద్యార్థులు మైమరచిపోయారన్నది వాస్తవం.
రాష్ట్ర ప్రభుత్వం వారు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందినారు. కళాశాల అభ్యుదయానికి, అస్థిత్వానికి వెన్నెముకగా నిల్చిన అనుపాలన దక్షత వీరిది. లెక్కకు మిక్కిలి బిరుదులు, సత్కారాలు, సన్మానాలు పొందినా సాదాసీదా వ్యక్తిత్వం కలిగిన మహోన్నతులు. ఏ కార్యం చేపట్టినా విజయవంతం చేసేదాకా నిద్రపోని కర్తవ్య పరాయులు శ్రీ భాష్యం విజయసారథిగారు. ఏ పురస్కారమైనా వీరిని వెతుక్కుంటూ వచ్చిందే తప్ప వాటి కొరకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. సర్వ వైదిక సంస్థానమ్ కరీంనగరంలో స్థాపించినారు. ప్రస్తుత సమాజ అవకతవకల సవరించడానికి, వైదిక ధర్మంవైపు మళ్ళించడానికి దీనిని వేదికగా చేసినారు. వీటి ద్వారా పుస్తక ప్రచురణలు, సంస్కృత భాషా పరివ్యాప్తి, ధర్మ నిరతి పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. ధర్మనిధిని ఏర్పాటుచేసి ప్రతీసంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా వేద పండితులను, కవులను, కళాకారులను సత్కరించే ఒక బృహత్ యజ్ఞం కొనసాగిస్తున్నారు. స్వయంగా శ్రీ భాష్యం వారు ఒక సంస్కృత పండితులకు ప్రతీ సంవత్సరం ఇరువది ఐదువేల నగదు విలువతో గత మూడు సంవత్సరాలుగా పురస్కారం అందిస్తున్నారు. యజ్ఞవరాహ క్షేత్రం కేంద్రంగా ఒకవైపు ఆధ్యాత్మికతతోపాటుగా సాహితీ కార్యక్రమాలు, చర్చాగోష్టులు, అవధానాలు, సంగీత కచేరీలు నృత్యోపహారాలు ఎన్నింటినో నిర్వహింప జేస్తున్న ఘనత వీరిది. వీరి సమగ్ర వ్యక్తిత్వము, రచనలు, అధ్యాపకత్వం, విశేష కృషిని ఒకచోట చేర్చి డా. మాదిరాజు బ్రహ్మానందరావుగారు జీవన సారిణి పేరిట ఒక గ్రంథం వెలువరించినారు.
కాళిదాసు అంతటి ఈ మహానభావులున్న సమయంలో వారితోపాటు మనం ఉండటం గొప్పతనంగా మనం భావించవచ్చును. ఇటీవలె వీరికి అజో – విభో – కందాళం – 2021 ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని శ్రీ భాష్యం విజయసారథిగారికి హైదరాబాదులో అందించి సగౌరవంగా సన్మానం అందించింది. వీరిని గురించి రాసే ప్రతి అక్షరం అందరినీ కదిలిస్తుంది. సర్వ వైదిక సంస్థానమ్ అదొక ఆధ్యాత్మిక ప్రకారం అడుగులు వేయాలనిపిస్తుంది. భక్తిభావ తరంగిణిలో ఓలలాడాలనిపిస్తుంది. అదొక సాహిత్య క్షేత్రం. అక్కడి నుండి వచ్చే ప్రతి అక్షర పంటను అనుభవించాలనిపిస్తుంది. అదొక సంగీత ధామం. అందులో ఓలలాడాలనిపిస్తుంది. సాహితీ శిఖరం శ్రీ భాష్యం విజయసారథిగారిని ఇంటర్వ్యూ చేసే భాగ్యం నాకు కలిగినందుకు మిక్కిలి సంతోషిస్తూ ఇంటర్వ్యూలోకి….
జాతీయ భావాన్ని నేపథ్యంగా, భారతీయ ధర్మాన్ని ఆదర్శంగా స్వీకరించి ఆధునిక సామాజికాంశాలను వస్తువుగా తమ రచనల ద్వారా జాతిని మేల్కొల్పిన మహాకవి, మహా మహోపాధ్యాయ పద్మశ్రీ శ్రీ భాష్యం విజయసారధిగారిని కలిసి మయూఖ కోసం సల్పిన ముఖాముఖి.
మీ సంస్కృత అభ్యసనానికి ప్రేరణ ఏమిటి?
తర్క పండితులు మాతామహులు లక్ష్మణశాస్త్రిగారు సంస్కృత సాహిత్యాన్ని సంగీతశాస్త్రాల మర్మాలు ఎరిగిన మాతామహి లలితమ్మగారి ప్రభావం ఎంతైనా ఉంది. మాతృమూర్తి గోపమాంబ, మాతామహిగారల ప్రోత్సాహం సంస్కృత భాషాధ్యయనం వైపుకు అడుగులు పడినాయి. అన్నగారు వెంకటాచార్యుల గారి చలువ అధ్యయనానికి దోహదం చేసినాయి. మాతామహుల దగ్గరికి వచ్చే ఉత్తరభారత సంస్కృత పండితుల కవిత్వం వెరసి సంస్కృత భాషాభ్యసనానికి ప్రేరణలుగా నిలిచినాయి.
మీ విద్యాభ్యాసం ఎలా జరిగింది?
వరంగల్లు జిల్లాలోని పాలకుర్తిలో శ్రీ సోమనారసింహ వేదపాఠశాలలో సంస్కృత విద్యార్థిగా చేరినాను. అంతకుపూర్వమే మాతామహుల వద్ద న్యాయబోధినీ సహిత తర్క సంగ్రహం, న్యాయమీమాంసాది షట్ శాస్త్రాలను నేర్చుకొనడం, బాసర అమ్మవారి మీద ‘శారద పదకింకణ్” పదకొండవ ఏటనే వచ్చిన రచన. అక్కడ మహా విద్వాంసులైన బ్రహ్మశ్రీ బొడ్డుపల్లి నరసింహశాస్త్రులు శ్రీమాన్ మరింగంటి విజయసారధిగారల సహకారంతో ‘కాదంబరి’ క్షుణ్ణంగ అధ్యయనం చేశాను. దీని ప్రభావంతోనే ‘మనోరమ’ వెయిపుటల సముద్ర గుప్తుని కాలానికి సంబంధించిన రాజకీయ, సాంఘిక పరిస్థితులను తెలిపీ నవల రాయటం జరిగింది. 1948లో నైజాం వ్యతిరేక కార్యకలాపాలతో రజాకార్లు పాలకుర్తి పాఠశాలను మూసివేశారు. ఆ బాధతో ‘విషాదలహరి’ కావ్యం పూర్తి చేయటం జరిగింది. 1953లో వరంగల్లులోని శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో అన్నగారు గోపాలాచార్యులు చేర్పించారు. మేఘదూతం, కిరాతార్జునీయం శృంగార నైషధం, కాదంబరి లాంటివి పూర్తి చేసుకొని, తదుపరి మద్రాసు విశ్వవిద్యాలయం ద్వారా ‘విద్యాప్రవీణ’ పరీక్ష ఉత్తీర్ణులయ్యాను. ప్రతిభను గుర్తించి పాలకమండలి వారు అదే కళాశాలలో అధ్యాపకునిగా నియమింపబడటం జరిగింది.
మీ రచనలకు ప్రేరణ ఏమిటి?
గృహ వాతావరణం, ఆనాటి సమాజ స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థ, నైజాం ప్రభుత్వంపై వ్యతిరేకత, వెరసి నా కవిత్వానికి ఊనికలుగా నిల్చినాయి. ఏడేళ్ళ వయసులోనే అమ్మగారి ప్తోత్సాహం మొదటి కవిత్వం బయల్పడింది. చిన్ననాడు పాలలో నీళ్ళు కలిపి పోసే మల్లక్క సరిజేసే కవిత్వం రాసి మార్గాన్ని మళ్ళించినాను. అనేక సంఘటనలు కూడా రచనలకు శీర్షికలుగా నిలిచినాయి.
మీ అభిమాన కవులు ఎవరు? వారి ప్రభావం మీపై ఎలా ఉంది?
భవభూతి, జగన్నాథ పండితరాయలు, బాణభట్టు, కుంతకుని వక్రోక్షి జీవితం అనే గ్రంథంలో ఆయన పదప్రయోగానికి ముగ్దుడినై బాసర సరస్వతీ దేవి స్తుతిలో ఈ పద్ధతిలో కవితా నిర్మాణం జరిగింది. ప్రాచీన కవుల నుండి వచ్చిన సంప్రదాయాలు, ప్రయోగాలు జీర్ణించుకొని నా రచనలో తాత్త్విక చింతన, సర్వమత సమన్వయం వంటివి విషయపరంగా అనేక అంశాలు కన్పిస్తాయి. రచనలు అన్నీ దైవభక్తి ప్రపూరితాలైనా అంతసూత్రంగా సమాజ చిత్రీకరణ ఉంటుంది. దేవతా స్తుతుల్లోనూ దైవభక్తి – మోక్షసాధన పైకి కన్పించినా దేశభక్తి, స్వాతంత్ర్య సమరభావనలు అంతర్లీనంగా ఉంటాయి.
వర్తమాన సామాజిక అంశాల్ని చెప్పడానికి వైదికమైన సూక్త ప్రక్రియను ఎంచుకోవడానికి విశేష కారణం ఏదైనా ఉందా?
సంస్కృత భాష పురాణేతిహాసాల కథలకు, స్తోత్రాలకు మాత్రమే పరిమతమైతావనే అపప్రథమ తొలగించడానికి, నూతనత్వాన్ని, వాటి రూపాన్ని విషయాన్ని మార్చి ఆధునిక సమాజ చిత్రీకరణకు వినియోగించినాను. ఉదాహరణ లేఖా, మాలికా ప్రక్రియలకు సైతం నవీనత్వాన్ని చేకూరుస్తూ సంస్కృత సాహిత్యానికి పరిచయం చేశాను. ప్రస్తుతం అంతః బహిశ్శత్రువులనేకులు దేశ వినాశనానికి కాచుకొని కూర్చున్న పరిస్థితుల ప్రబోధిస్తూ రాసింది ఉషస్సూక్తమ్ అన్నారు. రూపాయికి ధర్మం వదులుకోవద్దని రూపసూక్తమ్ ద్వారా తెల్సడేసాను. సూక్తాలలోని అంతరార్థం గ్రహించడమే ప్రస్తుతం అవసరంగా భావించి ఈ ప్ర్రకియను ముందుకు తీసుకొని వెళ్ళాను.
భారత జాతి యొక్క ముఖ్యోద్దేశ్యం ఏమిటి?
ప్రతీ భారతీయుడు కులమతాలకతీతంగా తన దేశాన్ని, దేశ సంపదను సంస్కృతినీ పరిరక్షించాలని, ప్రాచీనవైభవ పునరుద్ధరణకు పూనుకోవాలని అరువది శ్లోకాలతో సాగిందీ ఖండకావ్యం, జాతీయత, జాతీయ సమైక్యత దేశభక్తి. ఈ కావ్యంలోని మూల అంశాలు, భారతీయత అనే భావన ప్రజల నిండా నిండుకొని, దేశ పురోగతి సాధించాలంటే స్వధర్మ కౌశలం, స్వశక్తి యుక్తి తో అందరూ తోడ్పడాలన్నదే దీని సారాంశం. ఈ కావ్యంలో భారతభూమి ఔన్నత్యం ప్రస్తుతించినారు.
రాసకేళి గురించి చెప్పండి.
రాధాకృష్ణులు నాయకులుగా శృంగార పరంగా మాత్రా ఛందస్సులో సాగుతుది రాసకేళి కావ్యం. సంగీత నృత్య రూపకంగా ఆయా ఖండలకు ……. నిర్ణయం చేస్తూ రాయటం జరిగింది. శ్రీ కృష్ణుని యందు గోపికల ప్రేమకు లక్ష్యల క్షణంగా మానవ రూపంలో ఉన్న పరమేశ్వరుని యందు ఐక్యం కావటం ఈ కావ్య పరమార్థం. 108 ఖండికలతో రాసకేళి సాగింది. ప్రతీ ఖండిక యందు ఒక్కొక్క భంగిమను, ఒక్కొక్క లీలను వర్ణించి ప్రదర్శన యోగ్యంగా ఉంచడం జరిగింది. వేణుగాన విశ్వాసాలను తెల్పి సంగీత నాట్య యోగ తాత్త్విక శాస్త్ర సమ్మేళనం కావ్యం. జయదేవుని అష్టపదుల్లాగా అగుపిస్తాయి. అలాగే సంగీత ప్రధానంగా సాగింది సంగీత మాధవమం.
ప్రహేళికలపై చాలా కృషి చేశారు కదా కారణం ఏమిటి?
నేటితరం పిల్లలకు పజిల్స్ అంటే చాలా ఇష్టపడుతారు. అలాగే సంస్కృత భాషలోని పొడుపు కథలు ప్రహేళికలను సేకరించి సంస్కృతభాష చమక్కులను గమ్మత్తులను తెల్సుకొని జీవితానికి అన్వయించుకుంటూ, మేధోశక్తిని పదను పెట్టుకోవడానికి చాలా ఉపకరిస్తాయి. రెండువేల ప్రహేళికలు సేకరించి ఎనిమిది గ్రంథాలుగా ప్రకటించి రెండు భాగాలు మాత్రమే అచ్చులో దొరుకుతాయి. యక్ష ప్రశ్నలలాంటి ప్రహేళికల సేకరించి వాటికి జవాబులు అందజేశాం.
రవీంద్రుని గీతాంజలి అనువాదం చేయటానికి కారణం ఏమిటి?
1954-55 ప్రాంతంలో బెంగాలు నుండి శ్రీ సురేంద్రమోహన్ గారు వరంగల్ కు కాకతీయ శిల్పంపై పరిశోధనకు విచ్చేశారు. వారి ప్రోత్సాహంతోనే బెంగాలులోని విశ్వకవి రవీంద్రనాథ ఠాగోర్ రాసిన గీతాంజలి అనువదించాను. గొప్ప రచనను సంస్కృతీకరించటం ఆనందంగా ఉంది. అయితే ఇది రాసి పక్కన పెడితే అమ్మవారు పాడవకుండా గుళ్ళలో కట్టి జీడి గింజలను వేసి కాపాడిన తల్లి. ఇటీవల చెత్తలోంచి దొరికిన మాణిక్యం ఇది. దీనిని సంస్కృతభాషా నిర్దేశకులు ఆచార్య నీలకంఠంగారి ఆధ్వర్యంలో దీనిని ఇటీవలే ముద్రించాము.
పద్మశ్రీ, మహామహోపాధ్యాయ, బిర్లా ఫౌండేషన్ అవార్డు ఇటీవల అభో – విభో కందాళం పురస్కారం అందుకున్నారు కదా. మీకు ఎలా అనిపించింది?
పురస్కారాలు, ప్రేరణలు. అయితే వీటి కోసం ఎదిరి చూడకుండా పరిశ్రమ చేసుకుంటూ వెళ్ళాను. ఇటీవల అభో-విభో కందాళం పురస్కారంలో ప్రత్యేక సంచికను రచనల విశ్లేషణ రాయించి వీటితోపాటు జీవన సాఫల్య పురస్కారం అందించటఁ వలన ఆనందం కలిగింది. ప్రముఖులు పూర్వ ప్రధానమంత్రి పి.వి.నర్సింహారావుగారు, నాటి గవర్నరు శ్రీ కృష్ణకాంతంగారు నాటి వ్యవసాయ శాఖామాత్యుల శ్రీ జువ్వాడి చొక్కారావుగారి నుండి నేటి తెలంగాణా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరంరావుగారు, ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్యనాయుడుగారలు ప్రోత్సాహాన్నిస్తూ, గ్రంథావిష్కరణలు, సత్కారాలు అందించిన విషయం మరిచిపోలేని అనుభవం. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు అందిఁచి ప్రోత్సాహం అందించడం చాలా సంతోషం.
సర్వవైదిక సంస్థానమ్ స్థాపనలో మీ ఉద్దేశ్యం ఏమిటి?
వేద వాఙ్మయాన్ని తరాలకు అందజేస్తూ, ధర్మాన్ని నిలబెట్టి, సంస్కృతభాషా వికాసానికి దోహదం చేయడం ముఖ్యోద్దేశ్యం. యజ్ఞవరాహ క్షేత్రం కేంద్రంలో ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ధర్మనిధిని ఏర్పాటుచేసి వేదపండితులు కవులు, కళాకరులను ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి ఎంపిక చేసి ప్రతీ సంవత్సరం గత 30 ఏళ్ళుగా పురస్కారాలు అందించటం జరుగుతుంది. అలాగే ఒక సంస్కృతి పండితునికి ప్రతీ సంవత్సరం నా స్వంత ఖర్చులతో 25000/- రూ.లు శాలువా, జ్ఞాపికాతో పురస్కారాలు అందజేస్తున్నాం. గత మూడు వత్సరాలుగా ఇది కొనసాగుతుంది.
కె.ఎస్.అనంతచార్య, కరీంనగర్
9441195765
1 comment
నమస్కారం
నీహారిణి గారికి అభినందనలు. మంచి ప్రయత్నం.
అనంతాచార్య గారి ఇంటర్వ్యూ బాగుంది.