సృష్టికి అదిమూలం
మథనమైతే
సునిశిత దృష్టికి ఆలవాలం
మననం
ఆద్యంతాలు లేని శూన్య మథనం వల్లనే సమస్త సృష్టి ఆవిర్భవించిందని మళ్లీ మళ్లీ మథనం అన్న కవితలో అన్నారు డా, సి. నారాయణరెడ్డి. తిరుగు లేని పురోగమన శీలానికి సజీవ ప్రతీకలుగా నిలిచే కవితలను ఆయన లేఖిని వెలువరించింది.
చినుకును రమ్మని చిటికేశాను
అది జల్లై వచ్చి కురిసిపోయింది
చిగురును చేత్తో నిమిరి చూశాను
అది నూరు రేకుల పువ్వై విచ్చుకుంది
తారను ధగధగ వెలిగిపో అన్నాను
అది మధ్యాహ్న సూర్యబింబంలా
ఉజ్వలించింది
అని సముచిత సమయంలో వ్యాప్తి పొందినప్పుడే వాటి అస్తిత్వం ప్రస్ఫుటిస్తుందని చెప్పారు. విశ్వవ్యాప్తంగా జరిగే అద్భుత పరిణామాల మూలాలు చిన్నవే అని చెప్పారు. మానవుల మెదళ్ల మొదళ్ల స్తబ్ధత పేరుకుపోకూడదని అన్నారు. చూపులతో కొలవలేని ఎత్తుకు ఎదిగిన మనిషి సమున్నత వ్యక్తిత్వానికి నిదర్శనంగా మారుతాడని అంటారు. ఏకాంతానికి, సామూహిక జీవితానికి తీరాలను గమనించి పరిస్థితులను బట్టి కుదించుకొని, విస్తరించుకొని పోవాలని సూచిస్తారు. పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటూ సాగిపోతే శ్వాసలు అలలెత్తినట్టు, అడుగులకు రెక్కలొచ్చినట్టు ఉంటుందని తెలిపారు. మనసు మీద పేరుకున్న నిరాశ తాత్కాలికమని అది ఉత్తేజంగా మారుతుందని ధీమా వెలిబుచ్చారు. గతం ఇంకిపోయిన బావి వంటిదని అన్నారు. పూలు అదృశ్యం అవ్వడం ఫలాలై అంతరించడానికేనని చెప్పారు.
జీవిస్తున్నాను
మృత్యువుకు జోల పాడడానికి
పోగొట్టుకుంటున్నాను
నన్ను నేను పొందడానికి
అని ఎదుట పూలదారి ఎదురు చూడదని తెలిసి భవిష్యత్తును పట్టితేవడానికి ముళ్లమీద నడిచిపోతున్నానని తెలిపారు. నిరీక్షించడమంటే అక్షక్తత కాదు అది ఆరిపోని ఆశల కొలమానమై మనుగడలు సంతృప్తితో ఊపిరిలు పీల్చుకోవాలని చెప్పారు. కాల కల్లోలానికి ఎదురీదుతూ కడ ఊపిరి వరకు పోరాడాలని సూచించారు. ఉదయించిన సత్యమే ఆశయంగా మారాలని అన్నారు. జాగృత చైతన్యంతో విజయం అందివస్తుందని అన్నారు. ఆకు మీద రాలిన మంచు బిందువు తలతల మెరిసి పోవాలని ఆరాటపడుతుందని తెలిపారు. నేలమీదే సరిగ్గా నిలబడలేని మనిషి కన్న ఎగిరే పక్షి నయమనిపిస్తుందని తెలిపారు. ప్రయోగ శీలం పదను తగ్గితే ప్రసంగమవుతుందని, ప్రవాహ పాదం సడలిపోతే పడియలోకి దూరిపోతుందని హెచ్చరించారు. సూర్యకాంతిలో మౌళిక చింతన తెలుస్తుందని అన్నారు. సహజత్వం సమస్యలను మనిషి దరిచేరనీవవని అంటారు. ఎంతవేగంగా ఈదుతూ పోతే అంతే త్వరగా తీరం ఎదుట నిలుస్తుందని, వెనుదిరగని సంకల్పానికి అది సజీవ ఉదాహరణ అని అన్నారు. ఆత్మీయ సంభాషణంతో స్ఫూర్తిని పొందవచ్చని చెప్పారు.
అవ్యక్తత లోకి
వ్యక్తత చొరబడి
వ్యక్తావ్యక్త స్థితిలో
నా మసనును
వేలాడదీస్తున్నది
అన్న నారాయణరెడ్డి నిశ్చల స్థితిలో కలిగే అనుభూతిని మనసుతో నిర్వచించమన్నారు. వక్రగతి సమాజాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు. అక్షరావనిలో సృజన యాత్ర నిరంతరంగా విక్రమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నైరాశ్యాన్ని కొనగోటితో చిమ్మేసి జీవితం పట్ల సరికొత్త ఆశలను అంకురింపజేసుకోవాలని చెప్పారు. సరికొత్త జీవధాతువులతో చైతన్యమాధ్యమంగా జీవితం పరిణామశీలతను అందుకోవాలని నారాయణరెడ్డి ఆకాంక్షించారు.
సజీవతకు ప్రతిరూపం సినారె కవిత్వం…
previous post