Home ఇంద్రధనుస్సు సామాజిక భిన్న పార్శ్వాల కవిత్వం

సామాజిక భిన్న పార్శ్వాల కవిత్వం

తెలుగు సాహిత్యంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకొని రచనలు చేస్తూ తెలుగు సాహితీ వనం ఫేస్ బుక్ సమూహాన్ని క్రమీకరిస్తూ సాహితీ పోటీల ద్వారా యువ కవులను ప్రోత్సహిస్తూ తనవంతు సాహిత్య సేవ చేస్తున్నారు శాంతి కృష్ణ. పచ్చని ప్రకృతిని చూసి తన భావాలన్నీ మునివేళ్ల లోని కలం నుండి జారి అక్షర రూపం పొంది మన కళ్ళముందుకు వచ్చి కనువిందు చేస్తున్నాయి. ఆ అక్షర ప్రవాహపు ఝరి నుండి వెలువడిందే శాంతి కృష్ణగారి మొదటి కవితా సంపుటి “చినుకు తాకిన నేల” సున్నితమైన భావాలతో సమాజంలోని విభిన్న పార్శ్వాలను స్పర్శించి తన అక్షరాలతో సంధించిన 70 కవితల సమాహారం చినుకు తాకిన నేల. మొదటి కవిత గురువంటే నాన్నే, చివరి కవిత తెలుగంటే వెలుగు.

నేస్తమా ……/వసివాడిన పువ్వుల్లాంటి/ అనాధ బాలలను ఎపుడైనా చూశారా ……/……/సమాజం ముందు ఖాళీ విస్తరిలా/ జవాబు కోరే ప్రశ్నలుగా/ ఎలా దరినమిస్తారో/…../ కాసింత నీ సాయానికే/చిగురించిన కొమ్మల్లా/ పచ్చదనాన్ని రాసుకొని /పసిడి మొక్కలవుతారు (చినుకు తాకిన నేల )తల్లిదండ్రులు లేక ఆదరణ కరువైన అనాధ చిన్నారులకు వీలైనంత ఆదరువు కమ్మని అదే దేశాన్ని ప్రేమించడం అంటారు కవయిత్రి. ఈ కవిత చదువుతూంటే కవయిత్రి హృదయం ఎంత సున్నితమో తేటతెల్లమైంది. *ఏడబోయిందో నా పల్లె కానరాకుంది /పండువెన్నెల్లో మెరిసేటి ఇసుక తిన్నోలే/ కలనేత చీరలో కులికేటి నాయుడు ఎంకల్లే (నా పల్లె ) పచ్చని ప్రకృతి మధ్య ఆప్యాయతానురాగాలు పంచేటి ఆ నాటి పల్లె ….సంక్రాంతి వేళల్లో రంగుల ముగ్గులతో భోగిమంటలతో సందడిగా ఉండేది. పచ్చదనం మాయమై పంటలు లేక గుండె బరువెక్కిన రైతన్న దీనావస్థ లో నీరసించింది. అంటూ ఆనాటి పల్లె చిత్రాన్ని హృదయం లో ఆవిష్కరించి అది ఎక్కడుంది అని తనను తాను ప్రశ్నించుకుంటుంది. *ఆకలి చేసే పేగుల సంగ్రామంలో /యాచకులమై తిరిగే అనామకులం/ మీరు వేసే ఛీత్కారపు దానాలను ఆశీర్వదిస్తూ తీసుకుంటాం …….(మొగలిరేకులం) అనాధగా మిగిలిన అభాగ్య చిన్నారుల పక్షాన నిలబడి వారి ఆర్తిని తన కవితలో అక్షరీకరించారు.

*చీకటి మరకల్ని /తుడిచే పువ్వొకటి /తూరుపు కొండల్లో /పుష్పించేవేళ/ / గుడ్డి దీపపు వెలుగులో /……/ముడుచుకున్న పసికందులెన్నో (రేపటి పువ్వు )వసివాడని పసిబాలలు దిక్కు లేని వారుగా వీధుల్లో తిరుగుతూ ఆకలి ప్రేగులను చల్లార్చుకునేందుకు ఎన్ని పరుగు లో రేపటి రోజు బాగుంటుందని ఆశతో వారు బతుకీడుస్తున్నారు. అంటూ కవయిత్రి వీధిలోని అనాధ బాలల భవితవ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. *……./మంగళకరమై తిరగాల్సిన మా లక్ష్మి/ తాచు పామై బుస కొట్టిన ఏ మగతనానికి/మతి కోల్పోతుందో…../……/…..ఉరికొయ్య కూడా మరణిస్తుందేమో) వాడి దేహాన్ని మోసిన పాపానికి( మృగాడు ) నేటి సమాజంలో స్త్రీల మనుగడ ఎంత కష్టతరంగా ఉందో పసిపిల్లలు మొదలు వయసుతో తారతమ్యం లేకుండా మృగాళ్ళకు ఎలా బలవుతున్నారో హృదయ విదారక మైన పరిస్థితిని ఎండగడుతుంది. ఇంకా, రావణున్నే గొప్పవాడు గా కీర్తిస్తూ…. సీత అనుమతి లేనిదే తాకనైనా తాకలేదు అని అంటుంది. నేటి కొంతమంది పురుషులను మృగాలు అనడానికి అయినా నోరు రావటం లేదని మృగాలు కూడా వాళ్లకు తమ పేరును ఆపాదిస్తే తిరగబడతాయని అంటున్నారు కవయిత్రి . *…….చెక్కుచెదరని ఆత్మవిశ్వాసానికి/ చిరునామా ఆమె …/ చెక్కిన నిలువెత్తు శ్రమజీవి ఆమె /……/ఆరు పదుల వృద్ధ వనిత ఆమె /……./(ఓ అమ్మ) కవితలో రోడ్డు పక్కన తెగిపోయిన చెప్పులు కుట్టి పొట్ట పోసుకునే ఒక దీనస్థితిలో కూర్చుని గిరాకీ కోసం చూస్తున్న ఒక వృద్ద మహిళ స్థితిని తనను ఎవరూ పట్టించుకోక షో రూమ్ వైపు పరుగు తీసే జనాల ఉన్న తనాన్ని తన కవితలో వర్ణించారు. ప్రస్తుతం ఆ స్త్రీ కవయిత్రి కంటికి మేరునగములా కనిపిస్తుందని అబ్బుర పడుతున్నారు . *అక్క పంపే రాఖీలన్నీ / లెక్కకు మించుతున్నాయి/ అవి నీ పక్కన చేరేందుకు/ చుక్కల వుతున్నాయి( రాఖీ)పేగు పంచుకుని పుట్టిన తోడు …ఎన్నో అల్లర్లు రాఖీ పండుగ సంబరాలు ఎన్ని జ్ఞాపకాల దొంతర్లో మిగిల్చి కనిపించకుండా మబ్బుల్లో చందమామ లా మారిపోయి .అక్క పంపే రాఖీల నీ చుక్కలు అయ్యాయని తన వేదనలో తన తమ్ముడిని యాది చేసుకుని మూగగా రోదిస్తోంది. *………/…../నిన్ను మోసే భూమికి/ నిప్పుపెట్టి నిలుచున్నావు/ పరుగెత్తే మేఘానికి /కళ్లెం వేయాలని చూస్తున్నావు( ఆహ్వానం)

ఒక అతీతమైన శక్తి కొత్త ఆవిష్కరణలు ఎన్నో చేస్తూ తన గొప్పతనానికి తానే మురిసి మైమరచిపోతున్నాడు. అభివృద్ధి పేరుతో దాదాపు అదఃపాతాళానికి పోతుంటాడు. సాంప్రదాయ పద్ధతులను విడిచి ఫ్యాషన్ పేరిట నూతన ఆవిష్కరణలు చేస్తుంటారు. ప్లాస్టిక్ కవర్ల వాడకం తో కలుషితం పెరిగిపోతుందని మన పర్యావరణం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుందని జ్ఞానబోధ చేస్తున్నారు కవయిత్రి . *……./ఆ గోడలకుఎప్పుడూ అలవాటే /ఆ నవ్వుల చప్పుడు మోయడం/ ఆ నవ్వు వాళ్ళది కాదు /పసికూనల్లా మారాం చేస్తున్నాయి ….(పగిలిన మనసుల నవ్వులు ) *పసిపాప లూ, పువ్వుల నవ్వులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయి …..!చూసేవారికి మనసు హాయిగా సేద తీరుతుంది.అదే పశుత్వానికి గురైన స్త్రీ అదేపనిగా నవ్వుతుంది. ఇదీ నవ్వే కాని ఇందులో స్వచ్ఛత లేదు విరిగిన గుండె ఘోష పెదాలపై పూస్తుంది విచక్షణ కోల్పోయింది అంటున్నారు కవయిత్రి . ……/మబ్బులన్నీ రేయికి/ మేలి ముసుగుతో ముస్తాబు చేస్తుంటే /చుక్కలన్నీ నింగినెక్కి /చిన్ని వెలుగును /చీకటికి అద్దుతున్నాయి( చీకటి రేయి) చుక్కలు ఆకాశంలోకి వెళ్లి వెలుగును చీకటికి అద్దుతాయట ఎంత చక్కటి భావన …! *……./హృదయమా /నువ్వు పదిలమే కదా…..!./ కాసింత మనసు నలత పడితే /నీ వేగం తగ్గించకు/అవధులు దాటిన ఆనంద క్షణాలలో నీ వేగం పెంచకు ….‌(హృదయమా!) హృదయానికి జాగ్రత్తలు చెప్తున్నారు కవయిత్రి. ఎంత సున్నిత హృదయం తనది అనిపిస్తుంది. *….. /తేనెలూరు కొమ్మకు పూసిన/ తీయనైన పువ్వులా/ మాతృభాష నాతోనే ఎదిగి /నాముందిపుడు ప్రతిబింబమై నిలిచింది /……/నేర్చుకో వేలవేల భాషలు/ కానీ దాచుకో గుండెలో/ నీ తెలుగు భాషపై ప్రేమలు /(తెలుగు సవ్వడి)అన్యభాషలు ఎన్నైనా నేర్చుకోండి మన మాతృభాష ను మాత్రం మరవకండని హితవు చెబుతున్నారు. *నన్ను నేను మరచి పోతుంటా…../ పుస్తకం లో దూరి మమేకమై పోయినప్పుడు/……/ ప్రేమిస్తూ ఉంటా /జారే కన్నీటి చుక్కను /అది స్నేహంగా ఒడిసి పట్టుకున్నప్పుడు (మరో ప్రపంచం) అనే కవితలో పుస్తకం ఎంత మంచి స్నేహితుడు అనుక్షణం మనల్ని కనిపెట్టుకుని ఓదార్పు నిస్తుంది అని చెప్తుంది. * రక్తపాతాలేడున్నాయ్ మా రాయలసీమలో /మీరు సృష్టించిన చిత్రాలలో తప్పా/….. / కన్నీళ్లతో సీమను వదిలి /ఎడారి దేశాలకు గులాము చేయనుపోతున్న/గరీబు నేల మాది (రగిలే హృదయం ) రాయలసీమ అంటేనే రక్తపుటేరులు పారే ప్రాంతమని సినిమాల్లో పాశవికంగా చూపించి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని తినడానికి తిండి లేక నిరక్షరాస్యతతో పేదరికం అనుభవిస్తున్న ప్రజలపై కనికరించి వారి జీవితాలను ప్రతిబింబించేలా సమాజానికి తెలియజేయాలని ఆ ప్రాంతపు ప్రజలకు చేయూతనివ్వాలని వేడుకుంటున్నారు కవయిత్రి.

*ఎన్ని సొబగులో చీరకట్టు లో /ఎంత జాణతనమో ఆకనికట్టులో /ఎంత మాతృత్వమో ఆచీరకొంగులో /ఎన్ని వర్ణాలో ఆ సౌభాగ్యం లో (ఎన్ని సొబగులి) మన భారతీయ సంస్కృతిలో చీరకట్టు కోవడం సంప్రదాయం అందులోనే గౌరవం దైవత్వం కనిపిస్తాయి .అదంతా ఎంత అద్భుతంగా ఉంటుందో కదా అని అంటున్నారు . *ఒక్కోసారి భరించలేని /వర్తమానపు క్షణాల నుండి/ పరుగులు తీస్తుంది మనసెందుకో /బాల్యపు పరదాలు తీసి /బంగారు లోకం లోకి(మరలి రాని స్వప్నం ) *బాల్యపు స్మృతుల వెంట పరుగులు తీస్తుంటే చిన్నతనంలో కి ఒక్కసారైనా వెళ్లి రావాలని అనిపిస్తోంది. పక్షిలా రెక్కలు కట్టుకొని ఎగరాలని అనిపిస్తుంది. అమ్మా నాన్నలతో గారాలు పోవాలనిపిస్తుంది. కానీ అదంతా తిరిగి రాని గతం అనే సత్యం తెలిశాక ఆనందం ఆవిరైపోతుంది. ఉద్యమానికి పరాకాష్ఠ/ ఊపిరి తీసుకోవడమే నా/……/కన్నీటి సంద్రమవదా నీ కుటుంబం …./…../(నీ విజయం ) ఆర్టీసీ కార్మికులు సమ్మె కాలంలో చేసుకున్న ప్రాణ త్యాగాలను చూసి చలించి …..ప్రాణత్యాగం చేసుకున్నంత మాత్రాన సరిపోదు ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తే సాధించిన విజయాన్ని కళ్ళతో చూడొచ్చు అంటూ హితవు చెబుతున్నారు. *ఉగ్రవాద చర్యలకు ఊతమివ్వకుంటే/ ఊరికి వచ్చే జలపాతపు/సవ్వడే కదా శాంతి( ప్రపంచ శాంతి ) నాగరికత సమాజంలో ఈ అనాగరిక చేష్టలు మానాలని ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని కులమతాల భేదభావాలు మరిచిపోయి శాంతి మంత్రం జపించాలని అందువల్ల ప్రపంచ శాంతి చేకూరుతుందని హితవు చెబుతున్నారు కవయిత్రి. వినీల ఆకాశంలో /ఎగిరే విహంగాలు/ విశ్వకవి రవీంద్రుని/ ఎదలోని భావాలు /(అక్షర సుమాంజలి) విశ్వకవి రవీంద్రుని పై రాసిన కవితలో వారిని అద్భుతంగా ఆవిష్కరించారు. *ఇలా చినుకు తాకిన నేల కవితా సంపుటిలోని ప్రతి కవితా పూల సుగంధాలను వెదజల్లినట్లు అలతి పదాలతో చక్కగా ఆవిష్కరించారు.కవిత్వమే కాక గజల్స్ ,రుబాయీలు, బాలలగేయాలు ,మినీకవితలు ,పుస్తక సమీక్షలు ,కథలు మొదలైనవి శాంతి కృష్ణ గారి రచనలు. ఇప్పటి వరకు ఎన్నో పురస్కారాలు పొందారు.” చినుకు తాకిన నేల” కవితా సంపుటికి “గిడుగు రామ్మూర్తి సాహిత్య పురస్కారం 2021 “అందుకోవడం జరిగింది.నిరంతరం సాహితీ సృజన చెయ్యాలని తపించే శాంతి కృష్ణ గారికి మున్ముందు తననుకున్న ఆశయం సిద్ధించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.

-జయంతి వాసరచెట్ల
ఎంఏ.బిఇడి
వృత్తి: తెలుగు ఉపాధ్యాయిని
ప్రవృత్తి: కవిత్వం, కథలు, పుస్తక సమీక్షలు
పుట్టిన స్థలం: మహబూబ్ నగర్ జిల్లా
నివాసం: హైదరాబాద్
తొలి కవితా సంపుటి: నేల విమానం 2020 లో ముద్రితం
+91-9985525355

You may also like

Leave a Comment