Home ఇంట‌ర్వ్యూలు సామాజిక మార్పు ప్రతి సృజనకారుడి పైనా వుంటుంది

సామాజిక మార్పు ప్రతి సృజనకారుడి పైనా వుంటుంది

by Ananthaacharaya K.S.


నమస్తే ఆనంద్ సార్.

మీరన్న అన్నిప్రక్రియాల్లో వున్నవి రూప బేధాలే తప్ప మౌలికంగా అన్నీ కళాత్మక సృజన రూపాలే.  
సృజనకారుడనేవాడు తనను తాను వ్యక్తం చేసుకోవాలనుకున్నప్పుడు ఇదిమిద్దంగా ప్రత్యేకంగా ఒక ప్రక్రియలోనే రాయాలని అనుకోడు. ఆయా సందర్భంలో పెల్లుబికిన భావ పరంపరకు అనుగుణంగా వ్యక్తీకరణ రూపాన్ని ఎంచుకుంటాడు. తాను అనుకున్న, తాను చెప్పదలుచుకున్న భావం ఏమేరకు పాఠకుడుకి అందిచగలిగానా అన్నది మాత్రమే చూస్తాడు. నిజానికి నేను కవిత్వంలో దృశ్యాన్ని, దృశ్యం లో కవిత్వాన్ని చూస్తాను. కవిత్వంలో భావ లయ, దృశ్య మాధ్యమంలో దృశ్య లయ నన్ను ప్రధానంగా ఆకర్శిస్తాయి. ఆ దిశలోనే నా రచనలూ సాగాయి. ఏదీ ప్రణాలికా బద్దంగా ఆ రూపంలో రాయాలని రాయలేదు. ఇన్ని ప్రక్రియలలో రాయాలని కూడా అనుకోలేదు. మంచి సినిమాకు మంచి కవిత్వానికి నడుమ పెద్ద తేడా వుందని నేనుకోను. పథేర్ పాంచాలి, దాసి, రాషోమాన్ లాంటి ఓ మంచి సినిమా చూసినప్పుడు మంచి కవిత్వం చదివినట్టే వుంటుంది. అట్లే మంచి కవిత చదివినప్పుడు గొప్ప దృశ్య భావన కలుగుతుంది. కేవలం సినిమా, కవిత్వాలే కాదు పెయింటింగ్ సంగీతం ఇట్లా అన్ని కళల్లో రూపాలు మాత్రమే  భిన్నమయినవి. కానీ మనసున్న మనుషులపై వాటి ప్రభావం ఒకేలా వుంటుంది. నేను సమాంతర సినిమా ఉద్యమంలో ప్రధానంగా వున్నప్పుడు వివిధ భారతీయ భాషల్లో వస్తున్న సినిమాల్ని చూడడం సత్యజిత్ రే, మృణాల్ సేన్, రిత్విక్ ఘటక్ లు ఏం తీసారు, అదూర్ , అరవిందన్ సినిమాలు ఎట్లా వున్నాయి అని చూసేవాన్ని. అంతేకాదు అకిర కురుసువా, ఇజెన్ స్టీన్ లాంటి అనేక మంది విదేశీ దర్శకుల సినిమాలూ చూశాను వాటినన్నింటినీ  ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూస్తూ అనువదించుకుని సంభాషణల్నీ అర్థం చేసుకునే వాణ్ని. అట్లే కవిత్వం పై ప్రధానంగా దృష్టి పెట్టినప్పుడు వివిధ భారతీయ భాషల్లో వస్తున్న కవిత్వం చదవడం ఆరంభించాను. నిజానికి నా చిన్నప్పుడు నేనో  పెద్ద అంతర్ముఖున్ని. మాట్లాడడం సరిగ్గా వచ్చీ రాక చాలా పెద్ద కుటుంబంలో ఒంటరిగా గడిపేవాన్ని. కరీంనగర్ లో మా నానమ్మ తాతలది మిఠాయి దుకాణం. ముఖ్యంగా వ్యాపార నేపధ్యంవున్న కుటుంబం. మా ఇంట్లో సాహిత్య వాతావరణం అసలు లేదు. కానీ నా చిన్నప్పుడు మా నాన్న ఉర్దూలో అనేక పుస్తకాలు చదివేవారు. మా ఇంటి క్లాక్ టవర్ దగ్గరలో పుస్తకాలు అద్దెకు ఇచ్చే శ్రీ కృష్ణా బుక్ స్టాల్ అనే ఓ షాపు వుండేది. చిన్నప్పటినుంచే అందులోంచి డిటెక్టివ్ పుస్తకాలు తెచ్చుకుని చదవడంతో నాకు టెక్స్ట్ బుక్స్ కు అదనంగా ఇతర పుస్తకాలు చదివే అలవాటయింది. తర్వాత యద్దనపూడి, అరికెపూడి, మాదిరెడ్డి లాంటి మహిళా రచయిత్రుల నవలలూ చదివాను. డిగ్రీ అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత నా చదివే ఒరవడి మారింది. శ్రీశ్రీ కవిత్వం, చివరకు మిగిలేది, అసమర్థుని జీవ యాత్ర, మైదానం, అంపశయ్య లాంటి నవలలు చదవడం మొదలయింది. రాయాలనే కోరికా శురూ అయింది. ఆ కోరికతో మినీ కవిత్వం, చిన్న కథలు రాయడం ఆరంభించాను. అట్లా మొదటికథ ‘చిత్రిక’ వార పత్రికలో అచ్చయింది. కవిత్వంలో మొదటి ప్రయత్నంగా అలిశెట్టి ప్రభాకర్, వజ్జల శివకుమార్, జింబో, పీ.ఎస్.రవీంద్ర లతో కలిసి ‘‘లయ”’ మినీ కవితా సంకలం తెచ్చాం. తర్వాత కరీంనగర్ ఫిలిం సొసైటీ లో చేరాను. అర్థవంతమయిన సమాంతర సినిమాల వైపు నా దృష్టి మరలింది. 1981 లోనే వేములవాడ ఫిలిం సొసైటీ ప్రారంభించాను. అప్పుడే సత్యజిత్ రె మృణాల్ సేన్, శ్యాం బెనెగల్, సత్యు, చార్లీ చాప్లిన్ ఇట్లా అనేక మంది గొప్ప దర్శకులు రూపొందించిన సినిమాలని మేము చూడడంతో పాటు సభ్యులకు చూపించాము. దృశ్య శ్రవణ మాధ్యమంయిన సినిమా చాలా ప్రభావ  వంతమయిన మాధ్యమమని గొప్ప సినిమాల్ని సామాన్య ప్రజలకు, విద్యార్థుల దగ్గరికి తీసుకెళ్లాలని  చూపించాలని ఫిలిం సొసైటీ ఉద్యమంలో ప్రధాన బాధ్యతను తీసుకున్నాను. ఆట్లా అర్థవంతమయిన సమాంతర సినిమాల్ని ప్రదర్శించడమే కాకుండా వాటి పైన రాయడమూ అప్పుడే ఆరంభమయింది. కానీ సాహిత్య అధ్యయనం మాత్రం నిరంతరం కొనసాగింది. కవిత్వం, కథలు, పిల్లలకోసం కథలు, సినిమాలు, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ తీయడం, విమర్శ, అనువాదాలు, కొంతకాలం జర్నలిజం ఇట్లా ‘సాహిత్య బంజారా’ లాగా తిరుగుతూ వచ్చాను. ఎదో తెలుసుకోవాలననీ, తెలుసుకున్నది తెలియజెప్పాలన్న నా ఈ చిన్న యాత్ర కొనసాగుతూ వున్నది. ప్రభావాల విషయానికి వస్తే ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రభావితం చేసారు. కవిత్వం లో శ్రీ శ్రీ, తిలక్, వీవీ, వచనంలో బుచ్చిబాబు, రావి శాస్త్రి, అంపశయ్య నవీన్ ఇట్లా ఒకరేమిటి అనేకమందిని విస్తృతంగా చదివాను. వారి రచనలతో ప్రభావితున్ని అయ్యాను. కానీ ఎవరినీ అనుకరించాలని వారిలా రాయాలని అనుకోలేదు. ఆ గొప్ప వారందిరి రచనల వాతావరణంలో నా స్వీయ గొంతుక కోసం ప్రయత్నం చేస్తూ వచ్చాను..


మూడేళ్ళ క్రితం మా కరీంనగర్ ఇంట్లో నేను జరిపిన తవ్వకాల్లో బయట పడ్డ ఒక చిన్న ఫోటో ఓ నాలుగు వాక్యాలు రాసేందుకు కారణమయింది. చారిత్రకంగా రికార్డ్ చేయాల్సిన విషయమనిపించి ఈ జ్ఞాపకాల్ని పంచుకున్నాను. అదిచూసి  నా సహచరి ఇందిర చాలా బాగున్నాయి అప్పటి విషయాల్ని రాయకూడదూ అంది అంతే కాదు. ఒక రకంగా ఒత్తిడి తెచ్చింది. చిన్నప్పటినుండీ విషయాల్ని రాస్తే అది ఆత్మకథ అవుతుంది, మనం అంత పెద్ద వాళ్ళం కాదులే అన్నాను. కాని తను ఊరుకోలేదు. అన్ని వివరాల్ని రాయండి చదివేవాళ్ళు చదువుతారు. ఏముంది అన్నది తను. ఇంకేముంది నాలో కూడా రాయాలనే కోరిక పెరిగింది. ఎప్పుడో ఇంటర్ లో వున్నప్పుడు చూసిన హిందీ సినిమా పేరు ‘యాదొంకీ బారాత్’ గుర్తొచ్చింది. ఆ పేరు మీదే వరం వారం రాయడం మొదలు పెట్టాను. సామాజిక మాధ్యమాలయిన ఫేస్బుక్,వాట్స్ అప్, నా word press పేజీల్లో రాయడం మొదలు పెట్టాను.  మిత్రులు బాగుంది కొనసాగిన్చామన్నారు. అట్లా సాగుతూ వచ్చింది.  ఎవరయినా డైరీ రాయడం వేరు జ్ఞాపకాల్ని రాయడం వేరు. తేదీల వారిగా రాయడం కష్టమే అయినా మొత్తానికి క్రమంగా రాయడం మొదలు పెట్టాను.
‘లోపల జ్ఞాపకాల జాతర నేనేమో వర్తమాన జెండా పట్టుకుని ముందు నడుస్తున్నా’  అనుకుంటూ రాస్తూ వచ్చాను. “ఆత్మకథలు ఎప్పుడయితే భేషజాలు లేకుండా నిజాయితీగా శ్వేత పత్రాలుగా రాస్తారో అవి గొప్ప ప్రేరణ నిస్తాయి”. అందుకే యాదొంకీ బారాత్ లో నా విజయాలే కాదు నా ఓటములు, నేను ఎదుర్కొన్న అవమానాలు అన్నీ రాసాను. చీకటి వెల్తురు అన్నింటినీ చిత్రించాను.ఇప్పటి వరకు 113 వారాలు రాసాను. 1958 లో నేను పుట్టినప్పటి నుండి 2014 లో తీవ్రమయిన అనారోగ్యానికి గురయి విజయవంతంగా పునర్జన్మ పొందిన కాలం దాకా రాసిన యాదొంకి బారాత్ ను పుస్తకంగా తెస్తున్నాను. మిగతా కాలాన్ని కూడా క్రమం తప్పకుండా రాసే ప్రయత్నం చేస్తున్నాను.

ఇంతకు ముందే  నేను చెప్పినట్టు నా చిన్నప్పుడు నేను పెద్ద అంతర్ముఖున్ని. మాట్లాడడం సరిగ్గా వచ్చీ రాక ఇబ్బందికి గురయ్యేవాన్ని. చాలా పెద్ద కుటుంబంలో ఒంటరిగా గడిపేవాన్ని. కరీమంగర్ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో డిగ్రీ చదువు అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత నా చదివే ఒరవడి మారింది. రాయాలనే తపనా పెరిగింది. శ్రీశ్రీ కవిత్వంతో పాటు, చివరకు మిగిలేది, అసమర్థుని జీవ యాత్ర, మైదానం, అంపశయ్య లాంటి నవలలు చదవడం మొదలయింది. తప్పకుండా రాయాలనే కోరికా శురూ అయింది. ఆ కోరికతో మినీ కవిత్వం, చిన్న కథలు రాయడం ఆరంభించాను. అట్లా మొదటి ప్రయత్నంగా అలిశెట్టి ప్రభాకర్, వజ్జల శివకుమార్, జింబో,పీ.ఎస్.రవీంద్ర లతో కలిసి ‘లయ” మినీ కవితా సంకలం తెచ్చాం. తర్వాత కరీంనగర్ ఫిలిం సొసైటీ లో చేరాను. అర్థవంతమయిన సమాంతర సినిమాల వైపు నా దృష్టి మరలింది. సినిమా చాలా ప్రభావ వంతమయిన మాధ్యమమని గొప్ప సినిమాల్ని సామాన్య ప్రజలకు, విద్యార్థుల దగ్గరికి తీసుకెళ్లాలని చూపించాలని ఫిలిం సొసైటీ ఉద్యమంలో ప్రధాన బాధ్యతను తీసుకున్నాను. కానీ సాహిత్య అధ్యయనం మాత్రం నిరంతరం కొనసాగింది. కవిత్వం, కథలు, పిల్లలకోసం కథలు, సినిమాలు, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ తీయడం, విమర్శ, అనువాదాలు, కొంతకాలం జర్నలిజం ఇట్లా ‘సాహిత్య బంజారా’ లాగా తిరుగుతూ వచ్చాను. ఎదో తెలుసుకోవాలననీ, తెలుసుకున్నది తెలియజెప్పాలన్న నా ఈ చిన్న యాత్ర కొనసాగుతూ వున్నది.    

“ నాకు కవిత్వం కేవలం కవిత్వం కాదు
సగం శబ్దం సగం నిశబ్దం
శబ్దమేమో బతుకు ఏడుపులోంచి ఎగిసిపడుతున్నఎక్కిళ్ళు
 నిశబ్దమేమో బతుకు చేతగానితనం లోంచి వ్యక్తమవుతున్న మౌనం.”.  
అంతే కాదు
“కవిత్వం సంక్షోభ కాల ప్రవాహంలో నన్ను ఒడ్డుకు చేర్చే తెరచాప
బతుకు సమరంలో నిలబెట్టే లంగరు” అని కూడా రాసుకున్నాను. కవిత్వాన్ని ఎప్పుడూ నేను కారీర్ గా తీసుకోలేదు. అది నా ‘లైఫ్ లైన్’.
సాహిత్య పరంగా నాపైన మొదట ప్రభావం కలిగించిన సంస్థలు వేములవాడలోని నటరాజ కళానికేతన్, ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఉస్మానియా రైటర్స్ సర్కిల్. ఈ రెండు సంస్థలూ నా అధ్యయనాన్ని ఆలోచన రీతినీ మార్చాయి. వేములవాడలో శ్రీ చొప్పకట్ల చంద్రమౌళి సలహాదారుగా ఏర్పడ్డ సంస్థ నటరాజ కళానికేతన్ సమయంలోనే ప్రముఖ కవులు కే.శివారెడ్డి, దేవి ప్రియ, జ్వాలాముఖి, కుందుర్తి లాంటి ఎందరినో దగ్గరినుంచి చూసే అవకాశం కలిగింది. అప్పుడు వజ్జల శివకుమార్, పీ.ఎస్.రవీంద్ర, జింబో లాంటి కవి మిత్రుల సహచర్యం సాహిత్యం వైపునకు నన్ను నడిపించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నందిని సిద్దారెడ్డి, సుంకి రెడ్డి నారాయణ రెడ్డి, మర్రి విజయ రావు, నందిగం కృష్ణారావు లతో సన్నిహితంగా వున్నాను. ఈ అందరి మిత్రుల స్నేహం సాహిత్యం రచనల వైపునకు దారి తీసింది. తర్వాత జూకంటి జగన్నాదం, అలిశెట్టి ప్రభాకర్ ల కవిత్వమూ ఆకట్టుకుంది. వాళ్ళతో స్నేహాన్నీ కలిపింది.అట్లా రాయాలనే కోరికా శురూ అయి రాయడం మొదలు పెట్టాను. ఆ క్రమంలో మినీ కవిత్వం, చిన్న కథలు రాయడం ఆరంభించాను. అది ముందుకు సాగి మొదటి పుస్తక ప్రయత్నంగా అలిశెట్టి ప్రభాకర్, వజ్జల శివకుమార్, జింబో,పీ.ఎస్.రవీంద్ర లతో కలిసి ‘లయ” మినీ కవితా సంకలనం తెచ్చాం.

డిగ్రీ చదువులు పూర్తి అయి ఒస్మానియాలో చేరే సమయానికి సిరిసిల్లా జగిత్యాల అంటేనే ఒక గొప్ప ఉద్వేగం, ఉత్సాహం. అప్పుడు మేమే కాదు యవ్వనంలో వున్న వాళ్ళందరి పైనా ఆ ఉద్యమాల ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో అమితంగా వుండేది. రగులుతున్న పల్లెలు ఒక పక్క, మరోపక్క అణచివేత ఎన్కౌంటర్లు అంతా ఒక సంఘర్షనాత్మక స్థితి. ఎప్పుడే భీభత్సం జరుగుతుందో నన్న స్థితి నెలకొని వుండేది. ఆ నేపధ్యంలో ఆ ఉద్యమ ప్రభావం నాపైనా, నా మిత్రుల పైనా స్పష్టంగా వుండేది. ఆనాటి  మా రచనల్లో ప్రతిభింబించేది, ప్రతిధ్వనించేది. అయితే కవితల్లో కవిత్వంతో పాటు అంతర్లయగా ఉద్యమం ధ్వనించేది. ఆ కాలంలోనే చాలా సాహిత్యం చదివాము. సామాజిక రాజకీయ దృక్పధాన్ని ఏర్పరుచుకున్నాం. సాటి మనిషిని ప్రేమించడం, వారి జీవితాల్ని మా సృజనలో ప్రతిఫలించడం అప్పుడే మొదలయింది. మధ్యతరగతి కుటుంబాల్లోంచి వచ్చాను కనుక ఆ నాటి ఉద్యమ రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదు కాని ప్రతి సంఘటననీ సందర్భాన్నీ దగ్గరగా చూసాను వాటిని  లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసాను. సృజనాత్మక జీవితంతో పాటు సమాంతర సినిమాను కూడా కళా చైతన్య రంగంలో ప్రధానంగా తీసుకున్నాను. అందుకే ఫిలిం సొసైటీ ఉద్యమంలో దశాబ్దాల పాటు పనిచేసాను.

‘మానేరు తీరం”, ‘మనిషి లోపల’, ‘అక్షరాల చెలిమె’,’సొంతవూరు’, ’ముక్తకాలు’, చిన్నోడి ముక్తకాలు’ వెలువడ్డాయి. ‘మనిషి లోపల’ సంకలనాన్ని అనురాధ బొడ్ల ‘సిగ్నేచర్ ఆఫ్ లవ్’  పేర ఇంగ్లీషులోకి, మనోహరన్ తమిళం లోకి, ఎస్డీ కుమార్ కన్నడంలోకి అనువదించారు. ఇక అనువాదం లో గుల్జార్ GREEN POEMS ని ‘ఆకుపచ్చ కవితలు’ పేర అనువదించాను. కే.సచ్చిదానందన్ ‘వైల్ ఐ రైట్’, జావేద్ అఖ్తర్ ‘ ఇన్ ఆదర్ వర్డ్స్’ కు అనువాదాలు చేసాను. ఇంకా 29 భారతీయ భాషల్లోంచి 90 మంది కవులు రాసిన 152 కవితల్ని తెలుగులోకి అనువదించి ‘ ఇరుగు పొరుగు’ పేరా సంకలనం తెచ్చాను. ప్రస్తుతం ఇరుగు పొరుగు రెండవ సంపుటికోసం అనువాదాలు చేస్తున్నాను.

ఆయాకాలాల్లో పెళ్ళుబికిన సామాజిక సంఘర్షణ, సామాజిక మార్పు ప్రతి సృజనకారుడి పైనా వుంటుంది. ప్రతిస్పందన మాత్రం ఆ సృజనకారుడి మానసిక స్థితి, స్వీకరించి ప్రతిస్పందించే లక్షణం మీద ఆధారపడి వుంటుంది. నా మట్టుకు నేను అన్నివాదాలనీ దగ్గరి నుంచి చూసాను. కలిసి నడిచాను. జీవితమూ రాజకీయమూ వేర్వేరు అని ఎప్పుడూ అనుకోలేదు. జీవీతంలో రాజకీయం ఒక భాగమే అయినప్పటికీ ఆ భాగమే మిగతా మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నమ్మాను. అది నిజం కూడా. అయితే కళాత్మకం కాని ఏ సృజన అయినా అది సాహిత్యమయినా సినిమా అయినా పొడి పొడిగానే వుంటుంది అన్నది నా అభిప్రాయం. అందుకే సమాజంలో వున్న మనిషి వాడి మనసుతో పాటు సమాజంలో వున్న అనేక పొరల్ని నా రచనల్లో ప్రతిబింబించే ప్రయత్నం చేస్తున్నాను. వివిధ భాషల కవిత్వాన్ని మనవాళ్ళకు అందించడం వివిధ సినిమాల్ని పరిచయం చేయడం అందులో భాగమే.v
నేనెప్పుడో రాసుకున్నట్టు
“ ఈ సమాజం అచ్చుతప్పులున్న గొప్ప పుస్తకం, ఇప్పుడు కావలసింది తప్పొప్పుల పట్టిక తయారు చేయడం కాదు, ఆ పుస్తకాన్ని పునర్ముద్రించాలి” అన్న భావనలోనే వున్నాను.

నేనిందాకే చెప్పినట్టు సినిమా కవిత్వం రెండూ కళాత్మక వ్యక్తీకరణలే. కానీ కవిత్వం వ్యక్తిగత వ్యక్తీకరణ, సినిమా సమిష్టి కళల వ్యక్తీకరణ. అర్థవంతమయిన భావయుక్తమయిన ఆ రెంటినీ ఇష్టపడతాను. మనిషినీ సమాజాన్నీ పట్టించుకునే ఆ రెండూ నాకు వూపిరుల్లాంటివి. అందుకే  తెలంగాణ సాహితీమూర్తుల సృజన జీవితాల పైన దృశ్య మాధ్యమంలో ఫిలిమ్స్ చేద్దామని సంకల్పించాను. వాటికోసం ‘ముద్దసాని రామిరెడ్డి’,యాది సదాశివ’ ల  పైన ఫిలిమ్స్ చేసాను. తర్వాత తెలంగాణ జీవన సంస్కృతిలో భాగమయిన ‘శివ పార్వతులపైన’ ఫిలిం చేసాను. ఇంకా పలు ప్రయత్నాలు చేసాను. సాహితీ మూర్తుల డాక్యుమెంటరీలు మరిన్ని చేయలేకపోయాను. ప్రభుత్వాలూ సంస్థలూ సహకరించలేదు. చేసినకాడికి శక్తి మేరకు చేసాను అని అనుకున్నాను.

వేములవాడ లాంటి మామూలు గ్రామంతో పాటు సిరిసిల్ల, జగిత్యాల,గోదావరిఖని, కోరుట్ల తాడిత ప్రాంతాల్లో సొసైటీల ఏర్పాటులో నిర్వహనల్లో పాలు పంచుకున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి, ఒంగోల్ దాకా వైజాగ్,టెక్కలి లాంటి చోట్ల కాంపస్ ఫిలిం క్లబ్స్ ఏర్పాటు చేయడంలో ప్రహాన భూమికను పోషించాను. ఇక కరీంనగర్ ఫిలిం సొసైటీ నా ప్రధాన వేదిక. కరీంనగర్ లో ‘ఫిలిం భవన్’ ఆలోచనలో నిర్మాణంలో మున్డున్నాను. అప్పటి కలెక్టర్ పాతసారధి గారి ప్రోత్సాహంతో ఫిలిం బవన్ రూపుదిద్దుకుంది. 2010 దాకా జాతీయ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించాము. నేను పనిచేసిన ఎస్.ఆర్.ఆర్.డిగ్రీ పేజీ కాలేజీలో ఫిలిం క్లబ్ తో పాటు ఫిలిం మేకింగ్ కోర్సు నిర్వహించాను. పలు వార్క్షాప్స్ నిర్వహించాము.

ముఖ్యంగా ఈనాడులో సాంస్కృతిక విలెఖరిగానూ, సుప్రభాతం మగజైన్ లో ఉత్తర తెలంగాణ ప్రతినిదిగాను, మాభూమిలో కూడా ప్రతినిధిగా పని చేసాను. మా కాలేజీలో జర్నలిజం లో ఆర్నెల్ల కోర్సును 13  బాచులు నిర్వహించాను. ఉత్తమ శిక్షణ నిచ్చాము.v ఇక కరీంనగర్ నుంచి కీ.శే.v.విజయకుమార్ సంపాదకత్వంలో వచ్చిన “జీవగడ్డ” లో కే.ఎన్.చారి, అల్లం నారాయణ ళ సహచర్యం తో “వారానందం” కాలం రాసాను, ఇంకా పొన్నం రవిచంద్ర సంపాదకత్వంలో వచ్చిన మానేర్ టైమ్స్ లో ‘మానేరు తీరం’రాసాను,

ప్రపంచీకరణ మొత్తంగా ప్రపంచంలోని దేశాల మధ్య మనుషుల మధ్య హద్దుల్నీ సరిహద్దుల్నీ చెరిపేసిందనే చెప్పాలి. పెరుగుతున్న సాంకేతికత దూరాల్ని చెరిపేస్తున్నది. అనేక సంస్కృతులు వేలాది భాషలు వున్న ప్రపంచంలో సమాచారప్రసారం ముఖ్యమయింది. ముఖ్యంగా ఇంటర్నెట్ లో ఇంగ్లీష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న తరుణంలో అనేక చిన్న భాషలు ప్రభావితమవుతున్నాయి. కొన్ని భాషలు అంతరించిపోయే స్థితి ఏర్పడుతున్నది. ఈ నేపధ్యంలో తెలుగు కూడా ఎంతోకొంత ప్రభావితం అవుతుంది. తప్పదు. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు కాలేజీల ప్రభావం తెలుగుపై కనిపిస్తూనే వున్నది. కంప్యూటర్ నేర్చుకోవడానికి, అమెరికా వెళ్లడానికి ఇంగ్లీష్ కావాలి కనుక రానున్న తరాల్లో తెలుగు ఉపయోగం తగ్గిపోయే అవకాశం వుంది. మాతృభాషా పరిరక్షణ ఉద్యమం రావాల్సిన అవసరం కూడా వుంది. ఇక ప్రపంచీకరణ నేపధ్యంలో అనువాదం ఒక పరిశ్రమగా అభివృద్ది చెందే అవాకాశం కనిపిస్తున్నది. సాహిత్య అనువాదం మాత్రమే కాకుండా విద్యా, శాస్త్ర సాంకేతిక రంగాలు, మీడియా, వ్యాపార రంగాల్లో అనువాద అవకాశాలు పెరిగే అవకాశం వుంది పెరుగుతున్నాయి కూడా. సాహిత్యానువాదమప్పుడూ ఇప్పుడూ అత్యంత ప్రధానమయింది అని నేననుకుంటాను.

ఇవ్వాల్టి యువత చాలా ప్రతిభావంతులు. పెరిగిన శాస్త్ర సాంకేతికాభివ్రుద్ది వారిని కోత్హ పుంతలు తొక్కిస్తోంది. అయితే నేల విడిచి సాము చేయొద్దని మాత్రం  నేను చెబుతాను. పుట్టిన ఇల్లు వూరు దేశాలను మరువవోద్దంటాను. సాటి మనుషులపట్ల ప్రేమతో స్నేహంతో మెలగాలని కోరుకుంటాను. యువతీ యువకులు తమకు ఇష్టమయినవి బాగా చదవండి అధ్యయనం చేయండి అని మనసారా కోరుకుంటాను.    
++++

అనంతా చార్య: చాల సమయమిచ్చి వివరంగా సమాధానాలిచ్చారు. థాంక్స్ ఆనంద్ సార్.
ఆనంద్: మీక్కూడా ధన్యవాదాలు. మయూఖ సంపాదకులక్కూడా ధన్యవాదాలు.

You may also like

2 comments

Dr. Chenna Anantham, Retd Principal, GD&PGC for Women, Knr. August 1, 2024 - 4:53 am

Your ambitions to bring total change in the society around you has been fulfilled,Varala Anand ji, my dear friend.

Reply
Dr. Chenna Anantham, Retd Principal, GD&PGC for Women, Knr. August 1, 2024 - 4:57 am

To sum up in a nutshell, Your ambitions to bring total change through your excellent Telugu poetry in the society around you has been fulfilled,
Varala Anand ji, my dear friend.

Reply

Leave a Comment