Home వ్యాసాలు సాహితీ సిరిమల్లి మన వడ్డేపల్లి

సాహితీ సిరిమల్లి మన వడ్డేపల్లి

by Dr. chitikena Kirankumar

డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ 1948 సంవత్సరంలో సిరిసిల్ల లో చేనేత వృత్తిగా కలిగిన ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. తన తల్లిదండ్రులు లక్ష్మమ్మ, లింగయ్య. ఇతనికి బాల్యం నుండే సినారె స్ఫూర్తితో సాహిత్యం పట్ల ఎక్కువ అభిరుచి కలిగింది. ఒకవైపు తపాలా శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ మరోవైపు సాహిత్యంలో తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఉద్యోగ విరమణ తర్వాత నుండి తన తుది శ్వాస విడిచేంతవరకు రచనలు కొనసాగించారు.
డా. సి.నా.రె. గారి ఆశీస్సులతో తెలుగు సాహితీ రంగంలో తన ముద్రను నిలుపుకున్నారు. ఆరు దశాబ్దాలుగా సాహితీ రంగంలో విశిష్ట సేవలు అందించారు. ఇటీవల సెప్టెంబర్ 6న అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు. వడ్డేపల్లికి భార్య మణెమ్మ, ఒక కూతురు ఇద్దరు కుమారుల సంతానం కలరు. కుమారులు ఇద్దరు అమెరికాలో స్థిరపడినారు.
ఆనాడు సాహిత్యరంగంలో డా. భానుమతి, అక్కినేని గార్ల ప్రోత్సాహంతో సినీ సాహిత్యరంగంలో, ప్రకాశించిన డా.వడ్డేపల్లి కృష్ణ 1968 నుంచి పలు పత్రికల ద్వారా కవితల్ని, 1969 నుంచి ఆకాశవాణి ద్వారా, 1979 నుంచి దూరదర్శన్/ సినిమాల ద్వారా లలిత / సినీ గీతాల్ని నిరంతరంగా రచిస్తూ నిగ్గుదేరిన రచయిత. 1995 సెప్టెంబర్ మాసమంతా ఆకాశవాణి ద్వారా వీరి లలితగీతం అన్ని రాష్ట్రాలలో ఆయా భాషల అనువాదాలతో ప్రసారం కాగా జాతీయ కవిగా, లండన్ పార్లమెంటు అమెరికా న్యూజెర్సీ ప్రభుత్వ కవి సత్కారాల్ని పొంది; మలేషియా, ఆస్ట్రేలియా ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొని అంతర్జాతీయ కవిగా ఖ్యాతి గాంచారు.
తను మొట్టమొదటిగా 1971లో “కనరా నీ దేశం” గేయ సంపుటిని వెలువరించి తదుపరి “అంతర్మథనం” వచన కవితా సంపుటిని తన గురువర్యులు అయిన సినారే గారికి అంకితం ఇచ్చారు. అంతర్మథనం కవితా సంపుటికి ‘ చుట్టు కుదురు’ పేరుతో ఆరుద్ర పీఠిక సమకూర్చారు. తను రచించిన హాలాహలం కవితా సంపుటికి దేవులపల్లి స్మారక పురస్కారాన్ని అందుకుంది. వడ్డేపల్లి గేయవల్లి కవిత, వడ్డేపల్లి గేయవల్లి సంపుటికి కరీంనగర్ సాహితీ గౌతమీ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ గేయ సాహిత్య పురస్కారం లభించినది.
వడ్డేపల్లి వెయ్యికిపైగా రాసిన ‘లలితగీతాలు సమకాలీన సమాజంలో తెలుగు శ్రోతల్ని ఎంతగానో ఆకట్టుకున్న ఇది ఒక గొప్ప రికార్డు అని చెప్పక తప్పదు. ఆకాశవాణి ద్వారా వడ్డేపల్లి కృష్ణ లలితగీతాలు ప్రక్రియకు వన్నెతెచ్చిన “ఈమానపు పాట’కు పెద్దదిక్కుగా నిలిచినవారు. వడ్డేపల్లి కృష్ణ లలితగీతాలపై, లలితగీతాల పుట్టు పూర్వోత్తరాలపై, ప్రారంభ వికాసాలపై, వస్తు శిల్ప వైవిధ్యంపై పిహెచ్.డి చేసి డాక్టరేట్ పొందిన సిద్ధాంతవేత్త సినిమా పాటలు రాయడంలో తనదైన శైలి, రంగస్థల సాంఘిక నాటకాలు రాసి, ప్రదర్శింపజేసి ప్రసిద్ధులైనవారి మెప్పు పొందిన నాటక కర్త వడ్డేపల్లి కృష్ణ వీరి సంగీత, నృత్య రూపకాలు, నృత్య రీతులకు, కళాకారులకు గొప్ప సామగ్రి అందించారు. వాటిని సంగీత రూపకాలుగా రంగస్థలంపై ప్రదర్శించినప్పుడు వీక్షించితే అప్పుడే వడ్డేపల్లి కృష్ణ సాహిత్య ప్రజ్ఞ అనుభూతిలోకి వస్తుంది.
స్వదేశ, విదేశాలలో ప్రదర్శించిన అసంఖ్యాక సంగీత నృత్య రూపకాలు, వివిధ ముక్తకాలు, నాటకాలకు మరియు డాక్యుమెంటరీలతో పాటు అనేక టి.వి. ధారావాహికలకు, చలన చిత్రాలకు కథ మాటలు పాటలు రచించడమేగాక దర్శకత్వం వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి! “పాట వెలదులు” అనెడు నవీన పద్యాలను సృష్టించిన ప్రతిభాశాలి!

“బలగం” సినిమాలో

వడ్డేపల్లి రచించిన పుస్తకాలకు ప్రముఖుల ముందుమాటలలో తన సాహిత్య ప్రతిభను, కృషిని అక్షర బద్దం చేశారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా. కె. శివారెడ్డి గారు వడ్డేపల్లి రాగ రామాయణం – బాలల గేయ కథ పుస్తకానికి ముందుమాట వ్రాసిన మాటల్లో … కృష్ణగారు- యింత సాహిత్య సృజన తర్వాత – మళ్ళీ రామాయణం దగ్గరకి రావటం యాదృచ్ఛిక మనుకోను – ఒక విలువని చిన్న పిల్లల మనస్సుల్లో నాటడానికి ఈ రూపాన నడుం కట్టారు. విజయం సాధించారు. ఎవరయినా గొంతెత్తి హాయిగా గానం చేయవచ్చు. చాలా మనోహరంగా వుంటుంది. చాలా క్లుప్తంగా కథ చెప్పినా – దేన్నీ వదలలేదు. మొత్తం వాల్మీకి రామాయణాన్ని చదివితే ఏ అనుభూతి వస్తుందో ఈ బాల రామాయణాన్ని చదివినా అదే కలుగుతుంది. హాయిగా ఏ నట్టూ కొట్టకుండా, ఏకబిగిని చదివించారు వడ్డేపల్లివారు. డా. వడ్డేపల్లి వారితో నేను విన్నవించాను, నేను ముందుమాటకు తగినవాణ్ణి కాదు అని. కాని ఆయన వినలేదు.
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం,సుప్రసిద్ధ సినీ గాయకులు వడ్డేపల్లి రాగ రామాయణం – బాలల గేయ కథ పుస్తకానికి వ్రాసిన ముందుమాటలో… రామాయణం భారతీయ జీవనవిధానం మన సంస్కృతికీ, సంప్రదాయానికి మూలం. ఇది కథ కాదు – జీవితం – మన ధర్మ సంపద. ప్రస్తుతం ఇది చాలా అవసరం తరువాతి తరానికి అత్యవసరం ఈ ప్రక్రియ. రాముడికి భరతుడేమౌతాడో, విభీషణుడికి మండోదరి ఎవరో, ఆంజనేయుడికి తలిదండ్రులెవరో కూడా తెలియని దుర్భరమైన సందర్భంలో ఈ కావ్యసృష్టి కొంతైనా అవగాహనారాహిత్యాంధకారాన్ని వెలుగులో నింపే కరదీపిక కాగలదని ఆశిస్తున్నాను. భావాక్షర ప్రజ్ఞ గల కవి శ్రీ వడ్డేపల్లి కృష్ణ. ఆయనకు రావలసిన గుర్తింపు రాలేదన్న దుగ్ధ ఉన్న కొద్దిమందిలో నేనూ ఒకణ్ణి. ఈ సత్కవికి, సన్మిత్రునికి అభినందనలు తెలియజేస్తున్నాను.

వడ్డేపల్లి కృష్ణ గారితో రచయిత

ప్రభుత్వ టి.వి. నంది అవార్డుల కమిటీలకు (2006 / 2009) చైర్మన్ గా, అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవానికి (2003) న్యాయనిర్ణేతగా, నిజాయితీగా వ్యవహరించిన నిష్పక్ష ధీశాలి!
36 కావ్యాలను, 60 ఆడియో ఆల్బమ్లను, 15 డాక్యుమెంటరీలను వెలువరించారు. 96 ధారా వాహికలకు, 2 చలన చిత్రాలకు కథ – మాటలు పాటల రచనతో పాటు దర్శకత్వం కూడా నిర్వహించారు.
ఇటీవల బలగం సినిమాలో ఆచారి పాత్ర నటుడిగా నటించినారు. ఈయన రచించిన కొన్ని పాటలను “బాల భారతి” (పూనె) 3, 4వ తరగతుల తెలుగు వాచకాల్లో పాఠాలుగా పెట్టడం విశేషం!
నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1987 నుండి నేటి వరకు అందరు ముఖ్యమంత్రులచే రాష్ట్ర కవిగా, మాజీ ప్రధాని వాజ్ పేయి లచే దేశభక్తి గీత రచయితగా సన్మానాలను పొందినారు.అంతర్జాతీయ అనేక తెలుగు సంఘాలకు స్వాగత గీతాలను వ్రాసి తెలుగు వెలుగులను విశ్వవ్యాప్తం చేయుటలో సాహితీ మూర్తిగా తన పాత్రను నిర్వర్తించారు. సాహిత్యంతో సంబంధం ఉన్న మరెన్నో ప్రక్రియలలో తన ముద్రను వేసిన అలుపెరుగని తెలుగు సాహిత్య సారధి డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారికి అక్షర నివాళులర్పిస్తూ…

You may also like

2 comments

Satyanarayana poosala October 1, 2024 - 1:29 am

అద్భుత ముగా చిత్రీక రించారు.వడ్డేపల్లి వ్యక్తిత్వం వారి రచనా శైలి సుగంధాలు.ఆయనది ఆకాశమంత మనసు.అన్ని ప్రక్రియల లో అందే వేసిన చెయ్యి.ఆయన భావాలు మాటలకందని సాహిత్య మధుర రాగాలు. చిటికెన వ్యాసం చిటికేసి చిందు లేసిన అందం

Reply
Dr. P.Subramanyachary October 1, 2024 - 4:07 am

చాలా బాగుంది. సంతోషం. అభినందనలు

Reply

Leave a Comment