– డా. శ్రీ పెరుంబూదూరు శ్రీరంగాచార్య
ప్రముఖ రచయిత, బహు గ్రంథ పరిష్కర్త, సంపాదకులు, సాహితీ పిపాసులు డా. శ్రీ పెరుంబూదూరు శ్రీరంగాచార్య గారితో మయూఖ ముఖాముఖి…
– అరుణ ధూళిపాళ
ఎన్నో గ్రంథాలను పరిష్కరించి, మరెన్నో పుస్తకాలకు సంపాదకత్వం వహించి, అనేకానేక కవులు, రచయితల గ్రంథాలకు పీఠికలు రచించి, తాను స్వయంగా పుస్తకాలు రచించి, తెలుగు సాహిత్య పరిమళాలను వ్యాపింప చేసిన సాహితీ జిజ్ఞాసులు డా. శ్రీ పెరుంబూదూరు రంగాచార్యులు. వారి యొక్క జీవిత విశేషాలను వారి మాటల్లోనే చూద్దాం.
నమస్కారం మాస్టారూ..
1. మీ జన్మస్థలం, మీ బాల్యం గడిచిన తీరు గురించి వివరించండి.
జ: నమస్కారం అమ్మా! నేను నల్లగొండ జిల్లా, నకిరేకల్ మండలం, చందుపట్ల గ్రామంలో అక్టోబరు 23, 1944 లో పుట్టాను. మా అమ్మగారు తాయమ్మ, నాన్నగారు రాఘవాచార్యులు గారు. మా ఊళ్ళో నేను 5వ తరగతి వరకే చదువుకున్నాను. అప్పటికి హైస్కూల్ లేదు ఆ వూళ్ళో. మా నాయనగారు సర్పంచ్ అయిన తర్వాత హైస్కూల్ వచ్చింది ఊరికి. కానీ అప్పటికే మా పాఠశాల విద్యాభ్యాసం పూర్తయింది. మాకొక పది ఊళ్ళ పౌరోహిత్యం ఉండేది. కాబట్టి మా నాయనగారు మా అందరికీ తత్సంబంధమైన వేదాలు, మంత్రాలు, పురాణాలు, శ్రీవైష్ణవానికి సంబంధించిన దివ్య ప్రబంధాలు అన్నీ బాల్యంలోనే నేర్పించారు. అంతే కాకుండా ఊరు పెద్దది కావడం వలన అందరితో స్నేహపూరితమైన ఆత్మీయ భావం ఉండేది. అందరూ ఒకరికొకరు అన్నట్టు ఉండేది.
2. మీ కుటుంబం యొక్క వివరాలు తెలపండి.
జ: మా కుటుంబం అంటే చాలా పెద్దది. మా తల్లిదండ్రులకు మేము 11 మందిమి సంతానం. అన్నదమ్ములం ఐదుగురం, అక్క చెల్లెండ్లు ఆరుగురు.
మా ఇంటి పేరు శ్రీ పెరుంబూదూరు. శ్రీమద్రామానుజుల వారు పుట్టిన ఊరు. మా తాతగారు చెప్పిన విషయమది. ఆయన కంటే పైన 5,6 తరాల వాళ్ళు ఆ ఊర్లో ఉన్నారు. అక్కడ పానుగంటి అని ఇంటి పేరున్న వెలమదొరలు మా పూర్వీకులను ఇక్కడికి (చందుపట్ల) తీసుకొచ్చినారు. వాళ్ళను ఆ ఊర్లో ఉంచి అక్కడ ఒక రామాలయం కట్టించి వీళ్ళను అర్చకులుగా, స్థానాచార్యులుగా నియమించినారు. అంటే దాదాపు పానుగంటి వారంతా మావాళ్ళకు శిష్యులు (మా వరకు కూడా). అంటే మేము మా ఊరు నుంచి ఎట్లా వచ్చినమో పానుగంటివారు కూడా అట్లాగే వెళ్ళిపోయినారు. కాబట్టి బాంధవ్యాలు అనేవి తగ్గిపోయినవి. అట్లా మా ఊళ్ళో 4,5 శ్రీవైష్ణవుల కుటుంబాలు, ఒక వైదిక కుటుంబం, శైవుడైన ఒక కరణాల కుటుంబం ( గుండ్లపల్లి వారు) ఉండేది. అంతేగాక కోమట్లు, రెడ్లు, వెలమలు ఇలా అనేక కులాల వారు ( ఒక్క సాతాని వాళ్ళు తప్ప) ఉన్నారు. అట్లా కళకళ లాడుతూ సస్య శ్యామలోపేతంగా ఉండేది. మా ఆటపాటలన్నీ అక్కడే సాగినవి. ఆవూళ్ళోనే పుట్టి పెరిగినాము.
3. మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ ఎలా జరిగింది?
జ: ముందే విన్నవించుకున్నట్టు మా ఊళ్ళో 5వ తరగతి వరకు చదువుకొని మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చిన. హైదరాబాద్ లో అప్పటికే అప్పటికే సంస్కృతంలో ఎమ్.ఏ చేస్తున్న మా అన్నయ్య లక్ష్మణ మూర్తిగారు ( కాకతీయ యూనివర్సిటీలో రిటైర్ అయినాడు ) వచ్చి “ఈ చదువు చదువు కాదు. కులవృత్తులు ఇవన్నీ కొన్నాళ్ళకు ఏం నిలుస్తాయో, ఏం పోతాయో ఎవరికి తెలుస్తుందని” నన్ను ఓరియంటల్ విద్యలో ప్రవేశపెట్టిండు. అప్పుడు 1962లో ఉస్మానియా యూనివర్సిటీలో ఓరియంటల్ తెలుగు ఎంట్రన్స్ లో అత్యధిక మార్కులతో ఉతీర్ణుడనయ్యాను (ప్రైవేట్ నుంచి). లక్ష్మీ రంజనం గారు, నిడదవోలు వెంకటరావుగారు, చలమచర్ల రంగాచార్యులు గారు వీళ్ళంతా మా గురువులు. నల్లకుంటలో ఒక ఓరియంటల్ కాలేజీ ఉండేది. ఆంధ్ర ప్రాచ్య కళాశాల అని దాని పేరు. తర్వాత ప్రభుత్వ వశమైంది. దాంట్లో డిప్ ఓ ఎల్. మొదటి సంవత్సరంలో చేరినప్పుడు డిప్ఓఎల్ , బిఓఎల్ రెండేళ్లు అంటే ప్రతి సంవత్సరం పరీక్ష ఉండకపోయేది. డిప్ ఓ ఎల్. రెండవ సంవత్సరంలో, బిఓఎల్ రెండవ సంవత్సరంలో పరీక్ష ఉండేది. అట్లా మాకు ఖండవల్లి లక్ష్మీరంజనం గారు, నిడదవోలు వెంకట్రావు గారు, చలమచర్ల రంగాచార్యుల వారు, ఆదిరాజు వీరభద్ర రావుగారు, నేలటూరి వెంకట రమణయ్య గారు ఈ పెద్దలంతా మాకు చదువు చెప్పిన గురువులు. అంటే వీళ్ళు అంత గొప్ప వాళ్ళని మాకు అప్పుడు ఊహ కూడా లేదు. కానీ మేము వాళ్ళు చెప్పిందంతా శ్రద్ధగా చదువుకున్నాం. శాసనాలు చెబితే వాటికి సంబంధించిన పాఠాలు కంఠపాఠం చేసే వాళ్ళం. కరీంనగర్ శాసనం, వేయి స్తంభాల గుడి శాసనం అన్నీ చదివి అప్పచెప్పేవాళ్ళం. అంటే ఆ రోజుల్లో మరి వేదం చదివిన గుర్తు ఏమో కానీ సంస్కృతం శ్లోకాలు, లఘు సిద్ధాంత కౌముది ఏదైనా పాఠం చెప్పిన తెల్లవారి కంఠపాఠం చేసేవాళ్ళం. ఇప్పటికి ఆ సూత్రాలు, శ్లోకాలు జిహ్వాగ్రంలో ఉన్నాయి. అందుకొరకు మా గురువులందరికీ మేము ప్రశంసా పాత్రులుగా ఉండేవాళ్ళం. నిడదవోలు వెంకట్రావు గారు అంటే అద్భుతమైన మేధావి. అప్పటికి ఆయన మద్రాసు యూనివర్సిటీ నుండి రిటైరై వచ్చి ఉస్మానియాలో యుజిసి ప్రొఫెసర్ గా ఉన్నారు. అప్పుడప్పుడే మన తెలుగు వాళ్లకు మంచి పరిష్కరణలతో మహాభారతం తయారవుతోంది. ఈయన, లక్ష్మీనారాయణ గారు, రామరాజు గారు వీళ్లంతా దాంట్లో పనిచేశారు. వీళ్ళతో మేము కలిసి తిరిగే వాళ్ళమే కాక మహాభారతం ప్రాజెక్టులో కూడా పనిచేశాం. అయినా చిన్నపిల్లల్లాగానే ఉండేవాళ్ళం. మా నామరూపాలు లేవు అక్కడ. వీళ్ళందరితో కలిసి తిరిగినామని తృప్తి ఇప్పుడు అనిపిస్తుంది. ఇంకోటి ఏమిటంటే హైదరాబాదులో నల్లకుంటలో ఎక్కువగా ఉన్నాం. నల్లకుంట నుండి ఉస్మానియా యూనివర్సిటీకి నడిచిపోవడమే మాకలవాటు. బాగా చెట్లు ఉండేవి దారంతా. ఆ చెట్ల నీడన వెళ్లేవాళ్ళం. అప్పుడు సైకిల్, రిక్షాలు తప్ప ఏమీ కనబడకపోయేవి. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్, కామర్స్, సైన్స్ ఉండేవి. ఆ ప్రిన్సిపాల్ లక్ష్మీ రంజనం గారు ఇంకో ఇద్దరు మొత్తం ముగ్గురు కార్లు స్టేట్ బ్యాంక్ పక్కన కారు షెడ్డులో పెట్టేవాళ్ళు. కింది అంతస్తులో ఆఫీసు పై అంతస్తులో క్లాసులు జరుగుతుండేవి. ఈ పెద్ద మనుషులంతా అక్కడే కనిపిస్తూ ఉండేవారు.
4. మీలో సాహితీ బీజం అంకురించడానికి, మీ సాహితీ పరిశోధనలకు సంబంధించిన నేపథ్యం ఎటువంటింది?
జ: నేను ఓరియంటల్ కాలేజీలో చదువుతున్నప్పుడు మంచి మంచి గురువులు ఉండే వారిని చెప్పిన కదా! వాళ్ళు ఎప్పుడూ పత్రికల గురించి, శాసనాల గురించి, చరిత్ర గురించి ఏవేవో చెప్తుండేవారు. మనం డిగ్రీ అయిన తర్వాత ఏదైనా ఒక పని చేయాలి. గతానుగతికంగా పనిచేయడం కాదు. అనే ఊహ ఒకటి ఉంటుండేది మాకు. అట్లా ఆ పెద్ద మనుషుల వాసన ఒకటి. ఇంకోటి నేను చదువుకునే రోజుల్లోనే నారాయణగూడలో మా మిత్రుడు బిఎన్. శాస్త్రి గారు ఉండేవారు.ఆయన ఒక పుస్తకాల దుకాణం పెట్టిండు. దాని ఎదురుగా స్వామిరెడ్డి ‘త్రిలింగ’ అని ఒక ప్రింటింగ్ ప్రెస్ నడిపేవాడు. మేము శాస్త్రి గారి దుకాణంలో కూర్చునేవారం. పుస్తకాలు చాలా రకాలు ఉండేవి అక్కడ. పుస్తకాలు కొనే శక్తి లేక అక్కడ చదువుకునేవాళ్లం. చాలా పుస్తకాలకు వ్యాసాలకు ప్రూఫ్ రీడింగ్ చేసేవాళ్లం. (అప్పుడు అంతా కాగితాల్లో రఫ్ గా రాసుకునే వాళ్ళు). ప్రూఫ్ రీడింగ్ ఎలా చేయాలో కూడా శాస్త్రి గారే నేర్పించారు. పెద్దవాళ్లు చాలామంది అక్కడికి వచ్చేవారు. దాశరథి, పల్లా దుర్గయ్య, రామరాజు మొదలగు వాళ్లందర్నీ అక్కడే చూసిన నేను. వేరు వేరు కమ్యూనిస్టు నాయకులు రావి నారాయణరెడ్డి, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ఇలాంటి వాళ్ళందరినీ ఆ షాపులో చూసిన. అట్లా శాస్త్రి గారితో సన్నిహితంగా ఉండడం వల్ల వాళ్ళంతా నన్ను కూడా ప్రేమగా చూసేవారు. అలా వాళ్ళందరి సాన్నిహిత్యంలో సాహిత్యాభిలాష పెంపొందింది. అప్పటికే శాస్త్రి గారు రచనా ధోరణిలో ఉన్నారు. సాంఘిక చరిత్ర రాస్తున్నారు. దానికి మొట్టమొదట ప్రూఫ్స్ చూసింది నేనే. అంటే సురవరం ప్రతాపరెడ్డి గారు రాయటానికి ముందు భాగాలన్నీ ఈయన “ఆంధ్రుల సాంఘిక చరిత్ర” పేరుతో రాశారు (సురవరం ప్రతాపరెడ్డి గారు చాళుక్యుల నుండి సాహిత్యం ఆధారంగా ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాస్తే బిఎన్. శాస్త్రి గారు శాసనాల ఆధారంగా చాళుక్యులకు పూర్వం చరిత్ర రాశారు).దాన్ని మొట్టమొదటగా ‘త్రిలింగ’ ప్రింటర్స్ లో చూసినం. ఆ సమయంలో కవి దాశరథి మా పక్కన వచ్చి కూర్చుండేవారు. శాస్త్రి గారు, నేను ఒక్క కుటుంబంలోని వాళ్లుగా మెలిగే వాళ్ళం. ఇప్పటికీ ఆ కుటుంబంతో మా కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి.
5. మరింగంటి సింగరాచార్యుల సాహిత్య సేవపై పరిశోధన చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా?
జ: మరింగంటి సింగరాచార్యులనే కాదు. మరింగంటి కవుల మీద పరిశోధన చేశాను నేను. అది ఎందుకు చేయవలసి వచ్చింది అంటే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి తెలంగాణ ప్రాంతంలో అత్యద్భుతమైన కవితా సృష్టి చేసి గోలకొండ సుల్తానుల ప్రశంసలు పొంది వాళ్ళ నుండి స్వర్ణాభిషేకాలు కూడా పొందినటువంటి కవులు మరింగంటి వారు. శ్రీ వైష్ణవ తత్వాన్ని, విశిష్టాద్వైత తత్వాన్ని తమ రచనల్లో అంతర్లీనంగా, జాగ్రత్తగా చెప్పినవారు. అన్నీ కూడా విశిష్టాద్వైత సంబంధమైన భావనతో వచ్చిన రచనలు. వీటిని గమనించి వాటి మీద పరిశోధన చేయాలని ఊహ చేసిన. అప్పటికే నేను భారతిలో, మూసీ పత్రికలో వ్యాసాలు రాసిన. కాకతీయ యూనివర్సిటీ వారు ఈ అంశంపైన నా పి హెచ్ డి కొరకు ఎంతో ఆలోచించి ఒక సంవత్సరం రిజెక్ట్ చేసి మరో సంవత్సరం నాకు పర్మిషన్ ఇచ్చారు. వారు మూడున్నర ఏళ్ళు గడువు పెడితే నేను రెండున్నర ఏళ్లలో పూర్తిచేసిన. కానీ యూనివర్సిటీ వాళ్ళు నా థీసిస్ ను తీసుకోలేదు. “ఇంకా గడువున్నది మీరు ఇయ్యకూడదంటే” కంట్రోలర్ రూమ్ లోనే ఒక బీరువాలో పెట్టి వచ్చిన. ఆ పరిశోధనలో భాగంగా 60, 70 గ్రామాలు తిరిగిన. 110 తాళపత్ర గ్రంథాలను పరిశోధించిన. 200 ముద్రిత గ్రంథాలను పరిశోధించిన. నల్లగొండ, సూర్యాపేట, వరంగల్ ఇలా అనేక ప్రాంతాలకు వెళ్ళిన. మా శాస్త్రి గారు నాకు ఆయుధంగా ఉండేవాడు. నల్లగొండ దగ్గర ‘కనగల్లు’) అనే ఒక ఊరు ఉన్నది. అక్కడ ఒక పెద్ద మనిషి ఉండేవాడు. మా శాస్త్రి గారికి కూడా ఆయన ఎరికే. అక్కడ తాళపత్రాలు లభ్యం అవుతాయని నాకు అనుమానం. ఆయన ఇంట్లో చాలా తాళపత్ర గ్రంథాలు ఉండేవి. కొంతమంది తెచ్చుకున్నారు కూడా. ఆయన ఇల్లంతా కూలిపోయింది. ఒకసారి నేను ఆ ఊరికి వెళ్ళి, ఒక పెద్దమనిషిని అడిగితే చూపించిండు. “కట్టెల తోటి ఒక స్టాండ్ కట్టించి దాంట్లో పుస్తకాలు పెట్టేది అయ్యగారు” అని అన్నాడు. మూడు రూపాయలకు ఒక మనిషిని కూలీ మాట్లాడి మట్టి తీయించిన. ఒక తోలు తిత్తి లో వరిపొట్టులో భద్రపరిచిన 25 తాళ పత్రాలు దొరికినయి. అవి నేను తెచ్చుకున్న (వరిపొట్టు పోసి పెట్టడం వల్ల చెదలు రాదు. తొందరగా చెడిపోవు. తోలును భూమి తొందరగా తినేయదు). ఆ పుస్తకాలు మొత్తం రాసినది మరింగంటి వేంకట నరసింహాచార్యులు అని గొప్పకవి. వాటిని తెచ్చి నేను పనిచేసే పాలెంలో కూర్చొని మూడు నెలలు కష్టపడి రీ-రైట్ చేసిన. నేను రాసిపెట్టిన పుస్తకాలు ఇప్పటికీ మా ఇంట్లో ఉన్నవి. వాటి ఆధారంగానే పీహెచ్ డి కి పర్మిషన్ దొరికింది. నా పిహెచ్ డి లో వీటికి సంబంధించిన భాగమే ఎక్కువ ఉంటుంది. ఆయన దాదాపు 18 ప్రబంధాలను రాశాడు. దాంట్లో నాకు 16 దొరికినయి. అట్లా మరింగంటి వారి కవిత్వ వైశిష్టాన్ని లోకానికి తెలపాలి అనేది నా మనసులో ఉన్న ఊహ. అలాగే నా గైడ్ కోవెల సంపత్కుమారాచార్య గారు ఎంతో పరిణతి కలిగిన వ్యక్తి. సాహిత్యంలో మంచి శక్తి కలవాడు. అందుకే ఆయనను గైడుగా పెట్టుకున్నా. అట్లా నా పరిశోధన సాగింది. దీనికన్నా ముందు 1971 లో “నిరోష్ఠ్య రామాయణం” అని సింగరాచార్యుల వారు ( మీరు ముందు వారి గురించి ప్రస్తావించారు కాబట్టి అక్కడి నుండి చెప్తాను ) రచించిన పుస్తకం నా పీఠికతో “ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ” వారు ప్రచురించారు. “ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ” ఉండేది. దాంట్లో దేవులపల్లి రామానుజరావుగారు, రామరాజు గారు, ఎస్వీ జోగారావు వీళ్ళందరూ నాకు ఎడిటింగ్ బాధ్యతలు అప్పజెప్పినారు. సాహిత్యకృషిలో అది నా మొట్టమొదటి పుస్తకం. దానికి నిడదవోలు వెంకట్రావు గారు ఎంతో సహకరించినారు. ఒక ఆరు నెలల్లో ఆ పుస్తకానికి రూపం తీసుకువచ్చిన. అందులో ఉన్న టెక్స్ట్ 120 పేజీలు అయితే నేను రాసిన పీఠిక 80 పేజీలు (గట్టిగా నవ్వుతూ) అసలు నిరోష్ఠ్యం అంటే ఏమిటి? తెలుగు, సంస్కృతంలో ఎట్లా ఉంటుంది? పుస్తకాలు ఎట్లా వచ్చాయి? ఆ వివరణలన్నీ దాంట్లో ఇచ్చిన .తర్వాత ఏమైంది అంటే 1975 -76 ప్రాంతంలో ఆ పుస్తకంలోని ఒక ఆశ్వాసాన్ని పాఠ్యాంశంగా ఓరియంటల్ విద్యార్థులకు పెట్టడం జరిగింది. అది మూడు ఎడిషన్స్ అయింది. పుస్తకం అలా వ్యాప్తి చెందింది. ఒక ముస్లిం రాజుల ఆస్థానంలో ఉండి కూడా గొప్ప పేరు తెచ్చుకున్న కవి మరింగంటి సింగరాచార్యులు. పొన్నిగంటి తెలగనాచార్యులను కుతుబ్షాహీలకు పరిచయం చేసింది మరింగంటి అప్పన్న గారు. స్వయంగా తెలగనార్యుడే ఈ విషయాన్ని తన రచనల్లో చెప్పుకున్నారు. అంత గొప్ప వాళ్ళు కాబట్టి నాకు ఆ రచనల మీద పరిశోధన చేయాలని మిక్కుటమైన కాంక్ష వచ్చింది. సింగరాచార్యుల కన్నా పెద్దవారు మరింగంటి జగన్నాథాచార్యులని ఉన్నారు. ఆయన ఆ రోజుల్లోనే అవధానాలు చేశాడు. ఆయన తన గురించి “కర్ణాట క్షమాభృత్సభాంతర పూజ్యున్ మరింగంటి వేంకట జగన్నాథాచార్యు” అంటూ ఇక్కడ గోల్కొండ రాజుల చేతనే కాక విజయనగర రాజుల చేత కూడా సన్మానం పొందానని చెప్పుకుంటాడు.ఆయన విజయనగర సంస్థానంలో అళియ రామరాజు చేత స్వర్ణాభిషేక సత్కారాన్ని పొందారు. ఆయన అక్కడ అవధానాలు చేశాడు. అంతటి గొప్ప కవుల వంశ చరిత్రను తెలపాలని నేను మరింగంటి కవులను అప్ టు డేట్ ఒక 83 మంది కవులను వాళ్ళ రచనలతో పరిచయం చేసిన. అవధానాలలో “తెరలను, నీటి లోపలను, దీపపు కాంతి” అని చెప్పుకున్నారు. అంటే ఎదురుగా ఒక వ్యక్తి కూర్చుని బట్ట పైన అక్షరాలను రాస్తే చెప్పడం, దీపపు కాంతిలో నీటి పైన రాసే అక్షరాలను గుర్తించడం ఇలాంటి విధంగా అవధానాలు చేసేవారు. ఆధునిక కాలంలో మాడభూషి వేంకటాచార్యుల వారు ‘కలశధ్వని’ అనే పద్ధతి ప్రవేశపెట్టినాడు. తిరుపతి వేంకట కవులు కూడా దాన్ని కష్టతరమని విరమించు కున్నారు. ఆ పద్ధతిని మరింగంటి జగన్నాథాచార్యుల వారు చేసినారు.అదేమిటంటే అవధాని ముందు 50 గాని వంద గాని చెంబులు పెట్టి వాటిల్లో నీళ్లు పోసి, వాటిపైన, ఒక్కొక్క దానిపైన నంబర్లు రాసి అవధానికి ఎదురుగా ఒక్కొక్క కలశం మీద కర్రతో గాని, ఇనుప కమ్మీతో గాని శబ్దం చేసేవారు. ఆ తర్వాత వాటిని చాటుగా పెట్టి అవధానం మధ్యలో ఏదో ఒక దానిపైన శబ్దం చేసేవారు. ధ్వనిని బట్టి అది ఏ నెంబర్ అయి ఉంటుందో అవధాని చెప్పాల్సి ఉంటుంది. ఎంతో క్లిష్టమైన ప్రక్రియ అది. దీనికి తోడు వారికి నాలుగు, ఐదు భాషలు వచ్చు. తెలుగు, సంస్కృతం, అరబీ, ఉర్దూ ద్రావిడ మొదలైనవి. ఇంకా మనకు దొరకలేదు కానీ అబ్దుల్ కరీం సభావర్ణనను సీస మాలికలో చెప్పినాడట. నేను చాలా ప్రయత్నించిన ఇప్పటికీ ప్రయత్నిస్తున్న ఎక్కడన్నా దొరుకుతుందని ఆశతో. అందుకే అంత గొప్ప వాళ్ళ చరిత్ర మీద ఆసక్తితో పరిశోధన చేసిన. ఇప్పటికీ రెండు ప్రింట్లు అయింది ఆ గ్రంథం.
6. పాలెం కాలేజీలో ఉద్యోగం మొదలు పెట్టిన నాటినుండి రిటైర్మెంట్ వరకు ఏ ట్రాన్స్ ఫర్ లేకుండా అదే కాలేజీలో కొనసాగడం చాలా ఆశ్చర్యకరం. అది ఎలా జరిగిందో తెలుసుకోవచ్చా?
జ. నిజంగా ఇది చాలా ఆశ్చర్య కరమైన విషయమే. ఎవరి జీవితంలో ఇలా జరిగి ఉండకపోవచ్చు. నేను 1966 ఆగస్ట్ 3వ తేదీన ఉద్యోగంలో చేరినానమ్మా.. అప్పటికి పి.జి. చేయలేదు నేను. ఓరియంటల్ లో పి.జి.లేదప్పుడు. అక్కడ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రిగారు మొదలైన వారు నీవు ఓరియంటల్ కాలేజీలో చదివినవు కాబట్టి ఓరియంటల్ కాలేజీల్లోనే ఉద్యోగం ఇస్తారని చెప్పారు. పాలమూరు పేరు వినడమే కానీ చూడలేదు, తెల్వదు నాకు. అప్పుడు 2రూ.80పై. బస్సు ఛార్జీ. రాసిపెట్టుకున్న. నా మిత్రునితో కలిసి పాలమూరు వెళ్లిన. ఇంటర్వ్యూ కైతే ఎవరూ రాలేదు. నేనొక్కణ్ణే మిగిలిన. ఆ వెళ్లిన విశేషం ఏమోగానీ 1966 ఆగస్ట్ 3వ తేదీ నుండి 2002 అక్టోబర్ దాకా అక్కడే ఉన్నా. మధ్యలో ఒకసారి ట్రాన్స్ ఫర్ అయింది నాకు. ఎందుకో అదేరోజు హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసులో ఒక డైరెక్టర్ ని కలవడానికి వెళ్ళిన. ” నిన్ను ట్రాన్స్ఫర్ జేసినమయ్యా నల్గొండ కాలేజీకి” అన్నారు. “మంచిది సార్ వెళ్తా గానీ నన్ను మళ్లీ అక్కడి నుండి డిస్టర్బ్ చేయొద్దు” అన్నా. ఎందుకు? అన్నారాయన. (అప్పుడు ఎన్ టి రామారావు గారి జీవో ఒకటి ఉండేది. గెజిటెడ్ ఆఫీసర్లు సొంత జిల్లాల్లో పనిచేయకూడదని) “నేను గెజిటెడ్ ఆఫీసర్ ను, మాది నల్గొండ జిల్లా. మీరు నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిన్రు. మరి నేనెట్లా ఉద్యోగం చేయను”అన్నాను. అపుడు ఆయన సెక్షన్ క్లర్క్ ను పిలిచి, నా సర్వీసు పర్టీ క్యులర్స్ తెప్పించుకొని చూసి ‘నీ ట్రాన్స్ ఫర్ క్యాన్సల్ చేసుకుంటున్నా’ అన్నాడు. అప్పుడది ప్రైవేటుగా ఉండింది. తర్వాత 1981లో ప్రభుత్వ స్వాధీనం అయింది. ఎంతోమంది లెక్చరర్లు ట్రాన్స్ ఫర్ అయి వెళ్ళి పోయినారు. ఆయినా ఎందుకో హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు నాపైన దృష్టి పెట్టలేదు. ఒకసారి పోయి అడిగిన. గవర్నమెంట్ అయింది కదా! రంగారెడ్డికో, ఎక్కడికో ట్రాన్స్ ఫర్ చేయుమని.”పాలెంలో మీకు ఏంతక్కువైంది” అన్నారు. అంతే అట్లా విచిత్రంగా గడిచిపోయింది.
7. మీ సంపాదకత్వంలో వెలువడిన మీ తండ్రిగారి “పాంచరాత్రాగమోక్త- భగవత్ప్రతిష్ఠా విధానం” గురించి మాకు అర్థమయ్యేలా వివరించండి.
జ: మా నాయనగారు ఇటు ద్రావిడ ప్రబంధాలు పౌరోహిత సంబంధమైనవి, పాంచారాత్రాగమ సంబంధ ప్రతిష్ఠా ఉత్సవాలు పుస్తక నిరపేక్షంగా కంఠోపాఠంగా చేయించేవాడు. సంస్కృతంలో ఒక సామెత ఉందమ్మా.. ” వివాహాదీని కార్యాణి గ్రంథం దృష్ట్వా న కారయేత్” వివాహం, ఉపనయనం మొదలగు ఎలాంటి కార్యాలు జరిగినా పుస్తకం చూసి మంత్రం చెప్పకూడదు. అయితే మరణాది కార్యక్రమాలకు తప్పనిసరిగా తనకు నోటికి వచ్చినా తొడపైన పుస్తకం పెట్టుకొని చూస్తూ చదవాలి. అందుకే మా నాన్నగారికి పాంచరాత్రం పూర్తిగా కంఠపాఠంగా ఉండేది. ఉత్సవాలు గానీ, ప్రతిష్ఠాంతం గానీ, బీజాక్షరాలు, యంత్రాలు ఇవన్నీ నోటికి ఉండేవి. ఇవన్నీ అందుబాటులోకి రావడం కోసం వీటన్నిటినీ పల్లెటూళ్ళో కూర్చొని చాలా జాగ్రత్తగా వివరంగా 1970 వరకే మొత్తం వాల్యూమ్స్ రాసి పెట్టారు. చాలా అందమైన రాత ఆయనది. 1995లో ఆయన అస్తమించిండు. అప్పటికే ఆయన నల్గొండ జిల్లాలో ప్రసిద్ధి పొందిన దేవ యాజ్ఞీకుడు. ఎన్నో దేవాలయాల్లో ప్రతిష్ఠాదులు చేయించిండు. తర్వాత నేను 2008లో ఆయన శతజయంతి సందర్భంగా ఆయన రాసిన “మహోత్సవవిధి”, “ప్రతిష్ఠావిధానం” రెండూ విడదీసి రెండు వాల్యూమ్స్ గా మొట్టమొదటగా ప్రచురింపజేశాను. దిల్ సుఖ్ నగర్ లో పెద్ద సభ జరిగింది. అప్పుడు కె.వి. రమణాచారి గారు తిరుపతి ఈవోగా ఉండేవాడు. ఈ పుస్తకాలు బయటకు రావడానికి ఆయన చాలా సహాయం చేసిండు నాకు. ఆయన అధ్యక్షతనే వీటిని ఆవిష్కరింపజేసినం. అక్కడ పుస్తకాలు దగ్గర పెట్టుకొని దేవ యాజ్ఞీకం, ప్రతిష్ఠా విధానం పట్ల అభిమానం ఉన్నవారు, చదవగలిగిన వాళ్ళు ఉచితంగా తీసుకుపోవచ్చు అని చెప్పిన. ఆరోజు అవి ఒక 370, ఇవి ఒక 370 పుస్తకాలు పోయినయి నాకు బాగా గుర్తు. విద్యావ్యాప్తి కావాలనేదే నా ఉద్దేశ్యం. అట్లా ఆ పుస్తకాలు 5 ఎడిషన్లు అయినాయి.
ఒకసారి నేను శ్రీరంగం పోయినప్పుడు మహోత్సవ విధి పుస్తకాన్ని పూజరితో పూజ చేయించి, వీటిని మీదగ్గరే ఉంచండి అన్నాను. ఆప్పుడాయన “ఈ పుస్తకాలు మా విద్యార్థులకు పాఠ్యగ్రంథమండి. మేము కాకినాడలో రాజారామమోహన్ రాయ్ లైబ్రరీ నుండి 60 పుస్తకాలు తెచ్చుకున్నాం. మాదగ్గర 40 మంది విద్యార్థులు వున్నారు. ఇంకా ఇరవై పుస్తకాలు మా లైబ్రరీలో ఉన్నాయి” అన్నాడు. పాంచరాత్ర పాఠశాల వాళ్ళది. (మేము కొన్ని పుస్తకాలను లైబ్రరీలకు ఇచ్చినం). ఇవి కూడా ఉంచండి. అని నా దగ్గరున్న పుస్తకాలు కూడా ఇచ్చిన. తిరుపతి, శ్రీరంగం, సింహాచలం ఇట్లా పాంచరాత్ర పాఠశాలల్లో ఈ పుస్తకమే ప్రామాణిక పాఠ్యగ్రంథం. ఇప్పటికి కూడా తెలంగాణాలో జరిగే భగవదుత్సవాల్లో (వైష్ణవ ఆలయాలు) మా నాయన గారి పుస్తకమే ప్రామాణికం. అది నేను ఘంటాపథంగా చెప్తాను. మరొక విశేషం ఏమిటంటే జీయర్ స్వామి వారు “భగవత్ప్రతిష్ఠావిధానం” పుస్తకం వేతామని ఒక కమిటీ వేశారు. సముద్రాల రమాకాంతాచార్యులు గారని పెద్ద యాజ్ఞీకుడు, నా క్లాస్ మేట్, మా నాయన గారి పేరు చెప్పి, మనం కొద్దిరోజులు ఆగి ఆ పుస్తకం చూసాక వేద్దాం అన్నారట. అంతేకాదు మా ఇంటికి స్వయంగా వచ్చి పుస్తకాలు తీసుకువెళ్ళి స్వామివారికి చూపించారట. అవి చూసిన జీయరుస్వామి గారు మనం పుస్తకం వేయాల్సిన పనిలేదు. ఆచార్యులవారి పుస్తకమే చాలు అన్నారట. అంటే మానాయన అంత ప్రామాణికంగా, పల్లెటూళ్ళో ఉండి అనేక పురాణాలు, సంహితలు మొదలగునవన్నీ చూసి ఒక ప్రామాణికమైన గ్రంథాన్ని రాయడం ఆయన మేధాశక్తికి నిదర్శనం.
8. “శ్రీ సారంగశైల మాహాత్మ్యం” …మీరు రాసినదా? అందులోని క్షేత్రం గురించి చెప్పండి.
జ: అది నేను రాసినది కాదు. అయితే నేను మా ఊరు చందుపట్ల అని చెప్పిన కదా! దానికి తూర్పు వైపు బండపాలెం అనే ఊరు ఉంది. దానికి దగ్గర్లో ఒక గుట్ట ఉంది. ఆ గుట్ట పేరు సారంగాచలం. పూర్వం అక్కడ జింకలు బాగా తిరిగేవట. ఒక రామాలయం ఉంది అక్కడ. స్వయంవ్యక్త రామస్వామి. గోవర్దనం వేంకట నరసింహాచార్యులనే మహానుభావుడు. ఆయన మిర్యాలగూడ దగ్గర ఉండే అలియా మండలంలో ఇబ్రహీంపేట అనే ఊరులో ఉండేవాడు. ఆయన ఈ రాముని చరిత్రను మూడు ఆశ్వాసాల ప్రబంధం చెప్పినాడు. ఆయన మా తాతగారికి మామగారు. అంటే మా నాయనమ్మ ఆమె బిడ్డ. అప్పుడప్పుడూ మా ఊరికి బిడ్డను చూడడానికి వచ్చేవాడు. ఒకసారి అలా వచ్చినపుడు ఆ రామాలయ ఉత్సవాలు, విశేషాలతో రెండేరోజుల్లో ఆ ప్రబంధం చెప్పిండు. బ్రహ్మాండమైన కవి అతను. ఎన్నో మంగళహారతులు కూడా రాసిండు. “శ్రీసారంగ శైల మాహాత్మ్యం” అముద్రితగ్రంథం. నేను దానికొక పీఠిక రాశాను.
9. శేషభట్టర్ గారి గొప్పతనం ఎలాంటిదో మాకు వివరించండి.
జ: మా నల్లగొండ జిల్లాలో శేషభట్టర్ వెంకట రామానుజాచార్యులు అని ఉన్నారు. ఆయన పుస్తకాల సంకలనం వేసినం. ఆయన ఎంత గొప్పవాడు అంటే చిన్న వయసులోనే మరణించాడు (40 ఏళ్లకు) అప్పటికే ఆయన నాలుగు భాషల్లో ప్రావీణ్యత కలవాడు. మంచి లాయర్ కూడా. ఆయన రుక్మిణీదేవి కథను ‘రుక్మిణి’ అనే పుస్తకంగా రాశాడు.నిజాం రోజుల్లో ఆ పుస్తకాన్ని టెక్స్ట్ గా పెట్టినారు. అంటే ఆయన గొప్పతనం చూడండి. “తెలుగు పఢ్ నే వాలోంకో రుక్మిణి” అని ఉండేది. ఆయన ‘లోకజ్ఞుడు’ అనే పేరుతో చాలా పద్యాలు రాశారు. అకినేపల్లి జానకి రామారావు గారని కొండగడప జమీందారు ఉండేవాడు. ఆయన అడవి బాపిరాజు, తిరుమల రామచంద్ర ప్గార్లకు ‘మీజాన్’ పత్రిక నడపడానికి డబ్బు సహాయం చేసిండు. శేషభట్టర్ వెంకట రామానుజాచార్యుల వారు రాసుకున్న పుస్తకాల ముద్రణకు కూడా జానకి రామారావు గారు ఆర్థిక సాయం అందించారు. కొండగడప జమీందారు జానకి రామారావు ద్రవ్య సహాయంతో ముద్రింప బడిందని ఆయన ప్రతి పుస్తకం మీద రాసుకున్నారు. నల్లగొండ చరిత్ర రాసిండు. నల్లగొండ చరిత్ర రాసిన వాళ్లలో మొదటివాడు ఆయనే. అయితే మేము నల్లగొండ జిల్లా సర్వస్వం వేసేటప్పుడు నేను, బిఎన్. శాస్త్రి గారు ఆ పుస్తకం కొరకు చాలా వెతికినం మాకు దొరకలే. అసలు వారి వంశజులకు ఆయన రచయిత అన్న విషయమే తెలియదు. తర్వాత నేను వీరి పుస్తకాలు వేయించాలన్న ఆలోచన వచ్చినప్పుడు “వేమన భాషా నిలయం”లో పాత పేపర్ల కట్టలు వెతుకుతున్నప్పుడు నాలుగు కాయితాలు దొరికినాయి. దాంట్లో నల్లగొండ చరిత్ర దొరికింది. దొరికినంత వరకు నేను పుస్తకంలో వేసిన. ఆయన కొడుకుల్లో ఒకాయన ఎమ్మార్వోగా రిటైర్ అయినాడు నిజామాబాద్ లో. ఇక్కడే ఉండేవాడు ఎల్బీనగర్లో. ఆయన ఒకసారి నా దగ్గరికి వచ్చి మా నాయన గారి కాగితాలు ఉన్నాయని, వాటిని చూడమని ఒక పాతపెట్టె తెచ్చి ఇప్పుడు మీరు కూర్చున్న స్థలంలోనే పెట్టిండు. నేనొక పది రోజులు కష్టపడి వాటన్నింటినీ సవరించిన. పుస్తకాలు వేయించిన.
10. “నల్లగొండ జిల్లా కవులు – పండితులు” అనే పేరుతో కూర్చిన రచనలో ఎవరెవరి గురించి రాశారు?
జ: “నల్లగొండ జిల్లా కవులు – పండితులు” రచన చేయాలని ఊహ వచ్చింది. బిఎన్. శాస్త్రిగారు, ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు సహాయం చేశారు. కూరెళ్ళ విఠలాచార్య నేను ఆ పనిలో ఉన్నప్పుడు మనోహరి (నా స్టూడెంట్. బిఎన్. శాస్త్రిగారి కూతురు) మాకు అన్నీ రాసి పెట్టేది. ప్రూఫ్స్ కూడా చూసేది. ఇప్పుడు నల్లగొండ జిల్లా ప్రత్యేక విభాగం అయింది కదా! అయినా భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఎవరు సాహిత్య చరిత్ర రాసినా వారికి ఈ పుస్తకం కరదీపికలా ఉపయోగ పడుతుంది. నా పేరు చెప్పి కొందరు, చెప్పక కొందరు దానిలోని విషయాన్ని తీసుకుంటారు. ఇందులో పూర్వం నుంచి 1993 వరకు (1993లో పుస్తకం వేసిన) అప్పుడప్పుడే రచనలు చేస్తున్న కొత్త రచయితలను కూడా దాంట్లో తీసుకున్న. అందులో రకరకాల ప్రక్రియల్లో మొదటగా ఎవరెవరు ఉన్నారు? అన్న దృష్టితో కాలాన్ని అనుసరించి దరఖాస్తు తయారు చేశాము. దాన్ని నల్లగొండ జిల్లాలో తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళకు తెలిసిన సమాచారాన్ని ఫోటో ఉంటే దానితో సహా పేరు, ఊరు, మండలం విద్య, వారు చేసిన రచనలు, ముద్రితాలు, అముద్రితాలు, ఇంకా చేస్తున్న రచనలు, పొందిన పురస్కారాలు ఇలాంటి సమాచారం సేకరించిన.దాదాపు 40 శాతం మంది మాకు రిప్లై ఇచ్చినారు. కొంతమంది మౌనంగా ఉన్నారు. (వాళ్ళకి ఇష్టం లేక) ఆ తర్వాత చాలా కష్టపడి 370 మంది కవులు, పండితులను దొరికినంతవరకు ఫోటోలతో సహా దాంట్లో వేసిన. దానిని నల్లగొండలో అప్పుడు మినిస్టర్ గా ఉన్న కుందూరు జానారెడ్డి గారు ఆవిష్కరించారు. రవ్వా శ్రీహరి గారు, ప్రొఫెసర్ గోపి, రావి భారతి, పులిజాల రంగారావు మొదలైన వారంతా ఆ సభకు వచ్చారు. చాలా శోభాయమానంగా మా శాస్త్రి గారు ఆ సభా ఏర్పాట్లు చేశారు. ఆ విధంగా “నల్లగొండ జిల్లా కవులు-పండితులు’ పుస్తకం తయారయింది.
11. మీరు రాసిన పుస్తకాల గురించి చెప్పండి. అలాగే సంపాదకత్వం, పీఠికలు వీటిపై ఎక్కువగా మీదృష్టి నిల్పడానికి కారణం ఏమిటి?
జ: నేను దాదాపు 40 పుస్తకాలు ప్రింట్ చేశానమ్మ. అన్ ప్రింటెడ్ బుక్స్ 30,35 దాకా ఉంటాయి. కొన్ని రీ-ప్రింట్ అయినాయి. కొన్ని మూడు, నాలుగు ముద్రణలు కూడా అయినాయి. మొత్తం 46 పుస్తకాలు నేను ఎడిట్ చేసిన అన్ని ప్రక్రియల్లో. అన్నీ పద్యాలే. పుస్తకాలెన్నో పరిష్కరించాను కాబట్టి వాటిని వెలువరించడానికి పూనుకున్నాను. పీఠికలు రాయడంలో నిడదవోలు వెంకట్రావు గారు, ఇవివి.రాఘవాచార్యులు గారి ప్రభావం నాపై ఉండేది. అందువల్ల మొదట్లో పీఠికలు ఎట్లా ఉంటాయి? తర్వాత వచ్చిన పీఠికలు ఎట్లా ఉన్నాయి? ఇట్లా ఒక స్ఫురణతో రాస్తూ పోయిన. ఆ తర్వాత నాకే అనిపించింది. ఇట్లా పేజీలు పెంచడమే తప్ప ఉపయోగం లేదని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చిన. దాదాపు 40 పుస్తకాలకు పీఠికలు రాసిన. అవన్నీ కలిపి ఒక వాల్యూమ్ వేసిన (నవ్వుతూ..అవి ఎక్కడికైనా పోతాయేమోనని). పీఠిక అంటే ఏమిటి? పీఠికలు ఎందుకు అవసరం? వాటిని ఎట్లా చదవాలి? అనే సమాచారం ఇస్తూ మొట్టమొదట విమర్శ గురించి పరిశోధన చేసిన ఎస్వీ రామారావు గారితోను, ఉస్మానియాలో పీఠికల గురించి పరిశోధన చేసిన చంద్రశేఖర్ రెడ్డి గారి తోను (ఇప్పుడు ఆయన ఎమెస్కో లో వున్నారు) నేను ఈ పుస్తకంలో అభిప్రాయాలు రాయించిన. దాన్ని నా విద్యార్థి ఒకడు సొంత ఖర్చులు పెట్టుకొని ఆవిష్కరణకు నన్ను ఒక్క రూపాయి అడగకుండా పుస్తకాన్ని ముద్రింప చేశాడు. నల్లగొండ జిల్లా వాడే. ఇంటికి దగ్గరగా ఉండేవాడు. అర్జున్ రావు అని వెలమ పిల్లవాడు. నా దగ్గర చదువుకున్నాడు. బీదవాడు. ఇప్పుడు వనస్థలిపురంలో స్కూల్స్ పెట్టి నడుపుతున్నాడు. నా దగ్గరకు వచ్చి, “సార్! ఈ పుస్తకాన్ని నేను ప్రింట్ చేయిస్తాను” అన్నాడు. ఆవిష్కరణలో కూడా భోజనాలు పెట్టి చాలా బాగా చేసిండు. నేను ఒక్కటే చెప్పిన “ఈ పుస్తకం ముద్రించి ఇంట్లో పెట్టుకుంటే ఎవరూ చదవరు అవసరం లేదు” అని. ఎందుకంటే ఈ రోజుల్లో సాహిత్య గ్రంథాలు ఎవ్వరూ చదవడం లేదు. “ఒక హితుడైన శత్రువుని నీ ఎదురుగా చూసినట్లు ఉంటుంది” అన్నాను. అయినా సరే పట్టు వదలకుండా వేయించాడు.
12. ఈ తరం సంపాదకులకు మీరిచ్చే సలహాలు ఏవి?
జ: ఈరోజుల్లో సంపాదకులు ఉన్నారు. తప్ప గ్రంథ సంపాదకులు లేరు. మా బిఎన్.శాస్త్రి గారు పత్రికా సంపాదకులు. ఆయన ఎలా అంటే తన ఇంట్లో ఉన్న బంగారం, వెండి కూడా అమ్మి పత్రికకు డబ్బులు పెట్టిండు. ఇప్పుడు పత్రికా సంపాదకులు ఉన్నారు. పత్రిక పేరు మీద డబ్బులు సంపాదిస్తారు. కానీ ఈ రోజుల్లో ఒక క్లాసిక్ పుస్తకాన్ని గాని, ప్రాచీన గ్రంథాన్ని చదివి పరిష్కరించి దాన్ని వేసే బహుభాషాంతర విపుల విషయ పరిష్కార పీఠికాయుతంగా ప్రచురించే వాళ్ళు ఎవరూ లేరు. అటువంటప్పుడు వాళ్ల గురించి ఆలోచించేది లేదు. మన మార్గమేదో మనం పోవాలి. మనం చెప్పినా ఎవరు పాటిస్తరు? అందుకని రెండు సంవత్సరాల నుంచి నేనవన్నీ చాలించుకున్న. ప్రశాంతంగా చదువుకుంటూ కూర్చున్న. తెలంగాణ సాహిత్య అకాడమీ పెట్టినప్పుడు ఆ సెక్రెటరీ, ప్రెసిడెంట్ నాకు తెలిసిన వాళ్ళు (నందిని సిధారెడ్డి, వెంకట నరసింహారెడ్డి) సర్వజ్ఞ సింగభూపాలుడు రచించిన “రసార్ణవ సుధాకరం” వేసిన పెద్ద పీఠికతో. అప్పకవికి సంబంధించిన చాలా సంస్కారమైన ప్రచురణలు వేసినం. ఒక దేవాలయ చరిత్ర (గంగాపురం మాహాత్మ్యం వేసినం) ఆ విధంగా సహృదయుడు అనేటటువంటివాడు, విలువ తెలిసినవాడు ఇది చేయండి. అని చెప్తే చేస్తామ కానీ విలువ తెలియని వాళ్ళతో ఏముంది? వెనుకట తిరుపతి వెంకట కవులు ఒక పద్యం చెప్పారట “ఏ భూమీశున్ చూడబోయినను నీవే పద్యం చెప్పి, నీవే భావమ్ములు చెప్పుకోవలె”. రాజు గారి దగ్గరికి పోతే పద్యం చెప్పాలి. దాని భావం చెప్పాలి. అంత చెప్పినా అర్థమవుతుందో కాదో ! అందుకే నేను కూడా ఇవన్నీ ఎందుకు అనుకొని ఊరుకున్నా. సాహిత్య అకాడమీ వాళ్లు ఏవో కొన్ని పనులు చెప్పినారు. చేసినం అయిపోయింది. ఇప్పుడు అడిగేవాళ్లు లేరు, చేసే వాళ్ళు లేరు. ఇప్పుడు నాకు ఇష్టమైన మూసీ పత్రిక ఒకటి ఉంది. బిఎన్.శాస్త్రి గారు ఉన్నప్పుడు భారతికి దీటుగా ఒకటి ఉండాలని పత్రిక వేసుకున్నం. దాన్ని మనోహరీ, మా కమలాకర్ కష్టపడి నడుపుతున్నరు. అప్పుడప్పుడు సమీక్షలో, వ్యాసాలో దాంట్లో రాస్తూ ఉంటా. అట్లా కాలాన్ని గడుపుతున్న.
13. తాళపత్ర గ్రంథ పరిష్కరణలో ఒకే అంశానికి సంబంధించి ఉండి, మీకు ఇబ్బంది కలిగిన సందర్భాలు ఉన్నాయా?
జ: మొట్టమొదటిసారిగా 1971లో, 1973లో ప్రచురించిన నిరోష్ఠ్య రామాయణం (దశరథ రాజ నందన చరిత్ర) అదొక ప్రింటెడ్ కాపీ దొరికింది నాకు. అది 1910-20 ప్రాంతంలో ఏలూరులో ప్రింట్ అయింది తర్వాత నేను అన్వేషిస్తే నాకు దానికి సంబంధించి మూడు తాళపత్ర గ్రంథాలు దొరికినయి (ఒకటి విజయవాడ ఒకటి ఖమ్మం ఒకటి మహబూబ్ నగర్) ఆ మూడింటిలో ఏది సమగ్రం కాదు. వాటన్నిటినీ పట్టుకొని నేనే ఎడిట్ చేసిన. “దశరథ రాజనందన చరిత్ర”కు చాలా పాఠాంతరాలు వచ్చినై. అవన్నీ చూసి నేను పూర్తి చేయగలిగాను. ఇటువంటిదే మరొకటి మరింగంటి సింగరాచార్యుల శుద్ధాంధ్ర నిరోష్ఠ్య సీతా కళ్యాణం 1971లో వేశాను. అది అచ్చ తెలుగు నిరోష్ఠ్యం, సీతాకళ్యాణం కథ. చిన్న పుస్తకం. దాన్ని వేసినప్పుడు నాకు రెండు పుస్తకాలు దొరికినయి. అందులో ఒకటి తిరుపతిలో దొరికిన తాళపత్ర గ్రంథం. తర్వాత మా నాయన గారు సంపాదించిన పుస్తకాల్లో చాలా పాతది. కనగల్లు వాళ్ళ బంధువు పురుషోత్తమాచార్య గారని సూర్యాపేటలో ఉండేవారు. ఆయన ఇంట్లో పాత పుస్తకాలన్నీ కట్టగట్టి పెట్టుకున్నారు. మేమిద్దరం కలిసి వెతికితే దాంట్లో ఒక పుస్తకం దొరికింది. ఇవన్నిటిని పెట్టుకుని నేను మంచి పార్ట్ ఏది ఉంటే అది తీసుకొని వేసేవాణ్ణి. అట్లా పుస్తకాలు ఎడిట్ చేయవలసి వచ్చింది.
14. ఒకే కవి రాసిన అంశానికి భిన్నమైన పాఠాంతరాలు ఎందుకుంటాయి?
జ: ఎందుకంటే ఒక కవి రాసిన అంశాన్ని ప్రత్యంతరాలు రాసుకున్న వాళ్ళుంటారు కదా! ప్రత్యంతరాలు రాసే వాళ్ళల్లో అనేక తేడాలుంటాయి. ఉదా: ఒకరు వశము అని రాస్తే, మరొకరు దశము అని రాస్తారు. ఇక్కడ పదం ఏది అనేది కాదు. దాంట్లో ఉన్న ప్రామాణికత ముఖ్యం. ఇలా వివిధములైన పాఠాంతరాలను పరిశీలించి దాన్ని పరిష్కరించాలి. అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. కొంతమంది తాళపత్ర గ్రంథాలు సంపాదించి, తమ కుటుంబ పోషణకు తనపేరు చేర్చుకొని, ఎవరో ఒక రాజుకిచ్చి డబ్బులు సంపాదించి పూట గడుపుకున్నారు. ఈ విషయం అల్లసాని పెద్దన మనుచరిత్రలో కూడా చెప్పబడింది. అప్పకవి రోజుల్లో కూడా ఇలాంటి విషయాలు జరిగినై. ఆయన (మహబూబ్ నగర్ జిల్లా వాడు) కొన్ని వందల పుస్తకాలు సేకరించినాడు ఆరోజుల్లో. అముద్రిత గ్రంథాల లైబ్రరీ అప్పకవి దగ్గర ఉండేది. ఒట్టెం అనే ఒక ఊరుంది. అక్కడ ఉండేవాడు. అన్ని పుస్తకాలను సేకరించి “అప్పకవీయం” గొప్ప ఛందోగ్రంథాన్ని రాసిండు. ఒక శపథం చేస్తాడాయన. “ఇది చదివిన పిమ్మట మరి యదియేనియు చదువబుద్ధి ఏలా పొడమున్? పదపడి గ్రంథములన్నియు వెదకి వెదకి సారమెల్ల వివరింపంగన్” నా పుస్తకం ఒక్కటి గనుక మీరు చదివితే వందల పుస్తకాలు చదివినట్టు..అంటాడు. నేను కాలేజీలో పని చేసినంతసేపు ఒకటే సిద్ధాంతం ఉండేది నాకు. నా విద్యార్థులు అందరితో కూడా “అప్పకవీయం” రెండు ఆశ్వాసాలు కంఠపాఠం చేయించిన.(తృతీయ, చతుర్థ) వాళ్లకు అప్పుడు నేను ఒకటే చెప్పేది. మీరు ఇప్పుడు నన్ను తిట్టుకుంటారు కానీ ఈ పద్యాలు మీరు గనక కంఠపాఠం చేస్తే మీరు వందల ప్రబంధాలు చదివిన తెలివి వస్తదని. ఉదాహరణకు “మరున్నందన శతకం” అని వస్తుంది. ఎక్కడ దొరకాలి అది? అట్లనే మా కసిరెడ్డి వెంకటరెడ్డి, గిరిజా మనోహర్ వీళ్ళందరికీ ఆ పద్యాలు నేర్పించిన. వాళ్ళు అలా ధారణ చేయడం వలన పద్యం నడక తెలిసింది. పద్యం ఒక్కసారి మనిషికి అబ్బిందంటే ఎక్కడా పోదు. అప్పుడు సాహిత్యం గురించిన అప్రతిహతమైన శైలి ఏర్పడుతుంది. వచన కవిత్వం రాసే వాడిని ఒక కవిత చదవమంటే పుస్తకం తీసి చదవాలి. పద్య కవిత్వం చదివిన వాడిని చదవమంటే పది పద్యాలు అవలీలగా చదవగలడు. పద్యంలో ఒక శక్తి ఉంది. యతి, ప్రాస, భావం మనిషిని పట్టేస్తుంది. అందుకొరకు పద్యం నిలుస్తుంది. ఎవడేం చేసినా పద్యం పోదు. అందుకే పుస్తకాలను రక్షించుకోవడం మన బాధ్యత. తెలంగాణ వారంతా అప్పకవీయాన్ని ఆదర్శంగా పెట్టుకోవాలి గ్రంథ రచనకు.
15. “మావూరు చందుపట్ల” అనే కైఫీయతు రాశారు. అసలు ‘కైఫీయత్’ అంటే ఏమిటి ? మీరు రాసిన దాంట్లోని విశేషాలు ఏవి?
జ: నేను దాన్ని కైఫీయతుగా రాసుకోలేదమ్మా ! మా ఊరు చారిత్రకమైనది. దాని గురించి ఎందుకో రాయాలనిపించింది. ఆంగ్లేయులు మన గ్రామ చరిత్రలను రాయించారు. వాటికే కైఫీయతు అని పేరు. కైఫీయతు అంటే స్థానిక చరిత్ర. అయితే మా ఊరికి బాట ఎట్లుండేది? శివాలయాలు ఎట్లుండేవి? శాసనాలు ఎట్లున్నయి? ఆ ఊళ్ళో కుటుంబాలు ఎన్ని ఉన్నయి? ఎన్ని కులాలు ఉన్నయి? అప్పటి సాంఘిక పరిస్థితులెట్లు న్నయి? మా కుటుంబము ఆ రోజుల్లో ఎట్లా ఉన్నది? వారి విద్యా వైదుష్యాలు ఎట్లున్నయి? అవన్నీ మనసులో మెదిలి ఐదు రోజుల్లో పుస్తకం రాసిన. కారణమేంటంటే ఆ ఊర్లో కాకతి రుద్రమదేవి శాసనం ఒకటుంది. దానిలో విశేషమేంటంటే రుద్రమదేవి వీర స్వర్గ మలంకరించిన విషయం ఆ శాసనంలో ఉంది కాకతీయ చరిత్రకు ఇది చాలా అమూల్యమైనది. నేను 1966 ‘భారతి’ సెప్టెంబర్ పత్రికలో ఆ శాసనం గురించి ఢిల్లీ పత్రికల వాళ్లకు సమాచారం ఇచ్చిన. ఎవరూ స్పందించలేదు.తర్వాత ఆదిరాజు వీరభద్ర రావు గారు, నేను బి.ఎన్.శాస్త్రి గారు, పరబ్రహ్మ శాస్త్రి గారితో మొర పెడితే వాళ్లు ఆ శాసనాన్ని పరిశీలించారు. దాని గురించి భారతిలో మేము చర్చలు చేసినం. రుద్రమదేవి వీర స్వర్గ మలంకరించెనా? అని ఒకటి, కాకతీయుల చరిత్రకు అమూల్య శాసనం అని ఒకటి, రుద్రమదేవి స్థితిని తెలిపే చందుపట్ల అని ఒకటి ఇట్లా పత్రికల్లో చాలా వ్యాసాలు వచ్చినయి. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆ ఊరి గురించి రాయాలి అని నేను ఆ పుస్తకంలో చందుపట్ల శాసనం గురించి కాపీ కూడా ఇచ్చిన. శాసనస్తంభం మీద 150 ఏళ్ల పూర్వానికి సంబంధించిన శాసనం ఒకటి ఉంది అది ఉంటే ఒకే స్తంభం మీద రెండు శాసనాలు భిన్న కాలాలకు చెందినవి చెక్కడం విచిత్రం.ఆ ఊరి చెరువు కూడా చాలా పాతది. ‘రా చెరువు’ అని దాని పేరు. మిషన్ కాకతీయ ప్రారంభించినప్పుడు కేసీఆర్ మా ఊరి చెరువుతోనే ప్రారంభించిండు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా ఊరి గురించి పుస్తకం వేసిన అయితే నల్లగొండ జిల్లాకు ఎన్. ముక్తేశ్వర రావు అని ఒక కలెక్టర్ వచ్చిండు. చాలా గొప్పవాడు. సంస్కృతం, వేదం, తెలుగు, ఇంగ్లీష్ బాగా చదివినవాడు. ఆయన్ని ఒక సారి కలిసి ఒక సహాయం చేయమని అడిగిన రోడ్డుపైన పడిపోయినటువంటి శాసన స్తంభాన్ని తీసి అరుగు మీద పాతి పెట్టడం, రుద్రమదేవి కాంస్య విగ్రహం చేయించడం. ఆయన ఒకసారి ఊరికి వచ్చి చూసి అక్కడ ఉన్న అధికారులకు చెప్పి పడిపోయిన ఆ స్తంభాన్ని అనామతు అరుగు మీద పాతించారు.ఆ తర్వాత ఇంకో స్తంభం మీద కూడా ఆ శాసనాన్ని చెక్కించి దాని పక్కనే పాతి పెట్టించినం. ఇప్పుడు రెండు స్తంభాలు ఉంటాయి అక్కడ. అంతేకాక అక్కడ సూర్యాలయం, శివాలయం రెండు ఉన్నాయి బాటకు రెండు వైపులా. శివాలయంలో చిన్న చిన్న ప్రాణవట్టాలు, శివలింగాలు ఉన్నాయి. సూర్య దేవాలయం ఆ జిల్లాలోని పెద్దది. ‘ఆకవరం’ అని నకిరేకల్ దగ్గర ఒక ఊరిలో పెద్ద సూర్యదేవాలయం ఉంది. ‘అర్కవరం’ అసలు దాని పేరు. కానీ క్రమంగా ఆకవరం అయిందది. పెద్ద శాసనాలు కూడా ఉన్నాయి. అయితే కలెక్టర్ ముక్తేశ్వర రావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు రోజు రిటైర్ అయినారు. నేను అడిగిన విధంగా రుద్రమదేవి కాంస్య విగ్రహానికి డబ్బులు సాంక్షన్ చేయించిండు (ఆ రోజుల్లో ఒక లక్ష పదివేల రూపాయలు) ఆ రుద్రమదేవి విగ్రహాన్ని చూస్తే అద్భుతంగా ఉంటుంది. దాని చుట్టూ అరుగులు కట్టి సీకులు పెట్టించారు. రాజకీయ నాయకులు వచ్చి రోడ్డు వెడల్పు చేయడానికి ఆ విగ్రహాన్ని కూలగొడతామన్నారు. కానీ నేను దాన్ని అడ్డుకొని కావాలంటే మరోవైపు భూమిని ఇప్పిస్తానని చెప్పాను. అలా ఆ కలెక్టర్ పుణ్యం వల్ల రుద్రమ దేవి విగ్రహం, శాసన స్తంభాలు ఏర్పడ్డాయి.
16. ‘లాలి ప్రహరి’ అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? దాన్ని రాసిన వారెవరు?
జ. నకిరేకల్లు దగ్గర నోములపాలెం నరసింహస్వామి దేవాలయం చాలా ప్రాచీనమైనది. నేను ఇంతకుముందు గోవర్ధన వెంకట నరసింహచార్యులు గారని కవి గురించి చెప్పాను కదా! ఆయన నరసింహస్వామి గురించి ఒక ప్రహరీ చెప్పినాడు. దాదాపు 1900 ప్రాంతంలో గుండంరాజు వాళ్ళనే కరణాలు ఆ దేవాలయాన్ని చూస్తూ ఉండేవారు. ప్రహరీ ఎట్లుంటది అంటే మొదలు ఒక శ్లోకం, తర్వాత ఒక పద్యం, తర్వాత అష్టదిక్పాలకులు ఆ స్వామిని రక్షిస్తున్నట్టు ఎనమండుగురికి ఎనిమిది శ్లోకాలు, ఎనిమిది వచనాలు, ఎనిమిది మంగళ హారతులు. ఇట్లా చేసి దాన్ని అందరూ అనుసరిస్తున్నట్లుగా స్వామిని కొలుస్తున్నట్లుగా చెప్పడం. ప్రహరీ అనేది నల్లగొండ జిల్లాలోనే మొట్టమొదటగా వచ్చింది. ఆయనకు అది ఎక్కడ నుండి వచ్చిందో, దాని ప్రేరణ ఏంటో ఎవరికీ తెలియదు. ఆ ప్రహరీ అనేది ఆయన పుస్తకం వచ్చిన తర్వాతనే తెలుగు సాహిత్యంలో పది పదిహేను ప్రహరీలు వచ్చినాయి. తిరుమల బుక్కపట్నం వారు అని ఆత్మకూరులో ఒక కవి ఉండేవాడు ఆయన ప్రహరీ అనే తెలుగు ప్రక్రియను సంస్కృతంలో చెప్పిండు. అంతటి గొప్ప ప్రక్రియ మా నల్లగొండ జిల్లాలో వచ్చింది. నల్లగొండ జిల్లాలో నిరోష్ఠ్య రామాయణం, అచ్చ తెలుగు నిరోష్ఠ్యం, ప్రహరీ, చక్కని ప్రబంధాలు చంద్రికా పరిణయం మొదలైనవి, వసుచరిత్రకు దీటుగా తాలాంక నందినీ పరిణయం లాంటి ప్రబంధాలు వచ్చినయి. కల్పిత కథాకావ్యాలను ప్రబంధాలుగా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా విశిష్టమైన విశిష్టా ద్వైత సిద్ధాంతాన్ని తమ రచనల ద్వారా ఉపదేశాత్మకంగా చెప్పినటువంటి మరింగంటి కవులు పుట్టినది నల్గొండ జిల్లానే. ఆధునిక కాలంలో మా బి.ఎన్ శాస్త్రి లాంటి పరిశోధకుడు రావడం.. ఇట్లా అనేకులు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.
17. మీ ఆత్మకథ “జీవనపర్వం” మీ పూర్తి జీవితానికి సంబంధించినదా? కేవలం మీ అనుభవాలు మాత్రమే రాశారా?
జ: నేను పూర్తిగా జీవితాన్ని రాయాలని ఊహతో ఆత్మ కథ రాసుకోలేదు. చాలా విషయాలు చెప్పకుండానే వదిలిపెట్టిన. ఎందుకంటే యదార్థాలు రాస్తే బాధపడే జనం కూడా ఉంటారు కదా! “యదార్థవాది లోక విరోధి” అని తెలిసిందే కదా! ( నవ్వుతూ) అందుకే అది మనసులో పెట్టుకొని ముఖ్యమైన విషయాలను మాత్రమే రాసిన. దాంట్లో ప్రారంభం నుంచీ మా ఊరు, మేము, మా వంశం, నా చదువు, నా ఉద్యోగం, ఎన్ని బాధలు పడింది? పాలెంలో ఉన్నప్పుడు నేను చేసిన పనులు ఎట్లా ఉండేవి? రిటైర్మెంట్ తర్వాత ఎట్లా ఉండింది? ఇలా అన్నీ రాసిన. అయితే చివర్లో ఏం చేసిన అంటే మనం ఉన్నా, పోయినా నా సాహిత్యాన్ని గురించి, నా వ్యాసాల గురించి తెలుసుకోవాలని బుద్ధి పుడితే చూడడానికి లిస్ట్ అంతా ఇచ్చిన. నా రచనలు అధిక భాగం మూసీ, భారతి పత్రికల్లో వచ్చినాయి. ఇప్పటికి కూడా మూసీకి రాస్తున్నానని చెప్పిన కదా! ఎందుకంటే పత్రిక ప్రారంభించినప్పటి నుండీ నేను, శాస్త్రి గారు దాన్ని బిడ్డలాగా భావించుకున్నాం. మన రచనలతోనైనా దాని అభివృద్ధి చేతామనే ఊహ నాకు ఉంటది. అట్లా “జీవనపర్వం” రాసుకున్నా.
18. ఏ ప్రక్రియలోనైనా ‘మంచి రచన’ అని చెప్పడానికి ఉండాల్సిన లక్షణాలు ఏవి?
జ: మంచి రచన అనడానికి రెండు కారణాలుంటాయి. ప్రతిభావంతుడైన రచయిత కావడం ఒకటి. ఎంచుకున్న వస్తువు శ్రేష్ఠమైనదై ఉండాలి. ఉదా: విశ్వనాథ సత్యనారాయణ ఉన్నాడు. ఎంతోమంది రామాయణం రాసినారు. ఆయనే ఒకే ప్రశ్న వేసిండు.”మరల ఇదేల రామాయణంబన్నచో” అని. వావిలి కొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగు చేసి దానికి వ్యాఖ్య రాసిండు. అట్లే చాలామంది రామాయణాన్ని రాసినారు. కానీ విశ్వనాథ సత్యనారాయణ రాసిన శ్రీమద్రామాయణ కల్పవృక్షానికి కీర్తి వచ్చింది. కారణం ప్రతిభావంతుడు కావడం. ప్రతిభావంతుడైన వాడు ఒక శ్రేష్ఠమైన వస్తువును తీసుకొని దాన్ని పరిపూర్ణంగా చిత్రించినట్లయితే అది లోకంలో వ్యాప్తి చెందుతుంది. అంటే బీజ,క్షేత్ర న్యాయమది. మనం చవిటి నేలలో బలమైన విత్తనం వేసినా నిలువదు. బలమైన భూమిలో పుచ్చిపోయిన విత్తనాలు వేసినా లాభం లేదు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన రామాయణాన్ని మించింది మరొకటి లేదు. ఒక్క బాలకాండ కృత్యాది గనక చదివితే విశ్వనాథ వారి విశ్వరూప సందర్శనమవుతది. అది కవి యొక్క ప్రతిభ. ” కవి ప్రతిభలోన నుండును కావ్య గత శతాంశముల యందు తొంబదియైన పాళ్ళు, ప్రాగ్వి పశ్చిన్మతమ్మున రసమ్ము వేయిరెట్లు గొప్పది. నవ కథాధృతిని మించి” అంటాడు. అందుకే రామాయణ కల్ప వృక్షం మీద నాలుగైదు పీహెచ్డీలు వచ్చినయి. కేవలం దాంట్లోని రాక్షసపాత్రల గురించి ఒకరు, స్త్రీ పాత్రల గురించి ఒకరు కవిత్వాన్ని, కవితా లక్షణాన్ని గురించి ఒకరు ఇలా ఒక్కొక్కరు ఒక్కో ఆలోచనతో చేసినారు. అట్లాంటి పుస్తకం నిలుస్తుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు “కృష్ణపక్షం” రాసిండు. చిన్న పుస్తకమది. మనం చదువుకుంటూ పోతుంటే చిత్రంగా అనిపిస్తది. నాయని సుబ్బారావు గారి “వేదనా వాసుదేవం” మొదలైనవి చదువుతుంటే లీనమైపోతాం. వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి “దీపావళి” పుట్టపర్తి సత్యనారాయణ శాస్త్రి గారి “శివతాండవం” ఇలా ఎన్నో గొప్ప పుస్తకాలు ఉన్నాయి. అక్కడ శివుడా, విష్ణువా అన్నది కాదు. దాంట్లో లీనమయ్యే శక్తి కవిత్వానికి ఉండాలి. అది మనం సాహిత్యం లో అనుసరించాల్సిన పద్ధతి.
19. రచనా వ్యాసంగంలో ఇప్పుడొచ్చిన మార్పులపై మీ అభిప్రాయం ఏమిటి? ఆధునిక కవులకు మీరిచ్చే సూచనలు ఎటువంటివి?
జ: ఇప్పుడొచ్చే రచయితలు అంటే ఎమ్,ఏలు పీహెచ్ డి లు చేసిన వర్ధమాన రచయితలను చూస్తుంటాం. అది ఎట్లా ఉంటుందంటే శక్తి లేని పోట్లాట. మల్ల యుద్ధం చేసేవానికి శక్తి ఉండాలి. ఎదుటివారితో పోట్లాడాలి. ఇటు మేధాశక్తి లేదు. పరిచయం లేదు. బహు గ్రంథ పరిశీలన లేదు. ఇవేమీ లేకుండా ఏవేవో గొప్ప విద్యార్హతలు సాధించామంటారు. రచనలు చేస్తున్నామంటారు. అట్లా కాదు. మనం పరిశోధన చేయాలి. సాహిత్యంలో రకరకాల ప్రక్రియలు వస్తున్నాయి.ఇవాళ ఎవరికి వారు వాళ్లకు తోచినట్టు రాస్తున్నారు. అయితే పద్యం రాసే వాళ్ళు ఉన్నారు. పద్య కవిత్వాన్ని అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా సరే, ఎవరైనా సరే నేను ఒకటే చెప్తాను. పది పుస్తకాలు చదివి ఒక్క పుస్తకాన్ని రాయటానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప నువ్వు ఒక పుస్తకం సగం చదివి పది పుస్తకాలు రాయకు. అది నేను కోరుకునేది. సాహిత్యంలో ఎవ్వరైనా అతీతులు కావాలి. మన పూర్వులు సాహిత్యానికి అధీతి, బోధ, ఆచరణ, ప్రచారం అని నాలుగు లక్షణాలు చెప్పినారు..అధీతి అంటే నేర్చుకోవడం, బోధ అంటే నేర్చుకున్నది మరొకరికి చెప్పడం, ఆచరణం అంటే నువ్వు ఒక ధర్మ శాస్త్రాన్ని చదువుకుంటే ఆ ధర్మాన్ని ఆచరణ చేసి చూపడం, వీటిని ప్రచారం చేయడం. దాన్నే విద్యా ప్రచారం అంటారు. పూర్వులు దీన్ని ఎట్లా చేశారంటే మీరు తాళపత్ర గ్రంథాలు పరిశీలిస్తే దాంట్లో కింద రాసి ఉంటుంది. ఉదా: “ఐదు మానికల జొన్నలకు ఈ పుస్తకం రాసి ఈయనైనది” అని. అంటే వీరికి కుటుంబం గడవాలి. కావాలనుకున్నవారికి పుస్తకం రావాలి. అంటే సాహిత్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎవరెవరినో సంపాదించి వాళ్ళ ద్వారా పుస్తకాలు రాయించుకొని వ్యాప్తి చేసుకున్నారు. అందుకే గ్రంథ వితరణ అన్నది గొప్పనైనటువంటిది. నేను నాగుర్తులో ఆదిరాజు వీరభద్ర రావు గారిని చూసిన. ఆయన తన చాలా పుస్తకాలను అందమైన రాతతో రాసుకున్నారు. ఎందరికో రాసి ఇచ్చేవాడు కూడా. ఇప్పుడు ఆ శక్తి లేదు. మీరు చూడండి. ఇప్పుడు ఎవరైనా పరిశోధన చేయాలనుకుంటే కంప్యూటర్ ముందు కూర్చుంటే ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి. లైబ్రరీలు వస్తున్నాయి. అలాంటి సౌకర్యం ఉంది ఇవ్వాళ. నేను దాదాపు 200 గ్రామాలు తిరిగినానమ్మ. ఒక మూడు, నాలుగు వందల పుస్తకాలు చదివిన. బస్సులో, సైకిల్ మీద, కెమెరా పట్టుకొని తిరుగుతూ పరిశోధన చేసిన. అప్పుడు ఒక రచన చేయాలంటే విషయాన్ని గూర్చి పూర్తి సమాచారం సేకరించేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది రాస్తున్న వ్యాసాలు, పుస్తకాలు చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. ప్రేక్షక పాత్ర వహించడం తప్ప ఏం చేయగలం? అది చేయడమంటే మూసీ నదిని శుద్ధి చేయడమే (నవ్వేస్తూ).
20. పాలెంలో సుదీర్ఘమైన ఉద్యోగ ప్రస్థానం చేసిన మీరు ప్రాచ్య కళాశాలలను ప్రభుత్వం తీసివేసినప్పుడు పొందిన బాధ ఎటువంటిది?
జ: చాలా బాధ కలిగిందమ్మా ! ఎందుకంటే మీరు నమ్మండి, నమ్మకపొండి. మేము పాలెం కళాశాలలో సమిష్టి కృషి చేసినం. నేను రిటైర్ అయ్యే సమయానికి లైబ్రరీలో 80 వేల పుస్తకాలున్నాయి. కల్హణుని “రాజ తరంగిణి” జవహర్ లాల్ నెహ్రూ సంతకంతో వుంటుంది. డిస్కవరీ ఆఫ్ ఇండియా 5 ప్రతులు ఉంటాయి. విజ్ఞాన సర్వస్వాలు ఒక్కొక్క దానికి ఐదు కాపీలు ఉంటాయి (నల్లగొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ మొదలైనవి). నేను రిటైర్ అయ్యేవరకు వచ్చిన అన్ని యూనివర్సిటీల తెలుగు, సంస్కృతం థీసిస్ లన్నీ కొనిపెట్టిన. అష్టాదశపురాణాలు, రాతప్రతులు ఇలా ఎన్నో. నా ఆధ్వర్యంలో ఓరియంటల్ కళాశాల యుజిసి గుర్తింపు పొంది, రాష్ట్రస్థాయిలో పేరు పొందింది. యుజిసి ద్వారా వచ్చిన డబ్బుతో కంప్యూటర్లు కొన్ని పెట్టినం జనరేటర్లతో సహా. ప్రొజెక్టర్ కూడా ఏర్పాటు చేసినం. ఫ్యాన్లు తిరగనప్పుడు గ్రౌండ్లో చెట్ల కింద కంఠపాఠంగా పాఠాలు చెప్పేవాడిని. మీరు అతిశయోక్తిగా భావించకపోతే, నా సర్వీసులో ఎప్పుడూ నేను పుస్తకం చూసి పాఠం చెప్పలేదు. ఇంకొకటి క్లాసులో ఇద్దరు విద్యార్థులు ఉన్నా సరే కూర్చుని పాఠం చెప్పలేదు నిలబడే చెప్పేవాడిని. నా పిల్లల కంటే నా విద్యార్థుల అభివృద్ధిని చూసి ఆనందించిన. అయితే నేను ఒకటి రెండు సార్లు ప్రాచ్య కళాశాలల గురించి రాసిన కూడా. తెలంగాణా ప్రభుత్వం ఏర్పడితే తెలుగు సాహిత్యానికి మేలు జరుగుతుందనుకున్నాం. ఓరియంటల్ కాలేజీలు అభివృద్ధి చెందుతాయని అను కున్నాం. అది వ్యతిక్రమమైంది. ఎలాగంటే గవర్నమెంట్ లో ఖాళీలుంటే, ఓరియంటల్ కాలేజీలో నలుగురు అధ్యాపకులున్నారు. అందువల్ల ఇక్కడి నుండి అక్కడికి పంపేవారు. దాంతో చేసేది లేక మేనేజ్ మెంట్ వాళ్ళు మూసేసుకుంటారు అంతే! ఉన్నతస్థాయి అధికారులు ముఖ్యమంత్రి గారికి ఇచ్చే సలహాలలో లోపం దీనికి ఒక కారణం. ఏదేమైనా చేసేదేం లేదు. ఒక్కటేనమ్మా! మొదటినుండీ సాహిత్యాన్ని నమ్ముకున్నా. సాహిత్యంతోనే ప్రయాణం చేస్తున్నా. దాంతోనే ముగింపు పలుకుతా అని ఆశ.
ఈరోజు ఒక సాహితీ ప్రస్థానం తీరు తెన్నులు దర్శించగలిగాం. చాలా సంతోషం. సహృదయంతో ఎన్నో విషయాలు మాకు వివరించినందుకు మీకు మా తరఫున, మా పాఠకుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
నమస్కారాలు. సెలవు.
1 comment
నమస్కారములు
ధూళిపాళ అరుణ గారు ఇటీవలి కాలంలో సముచితమైన ప్రశ్నావళితో తలపండిన సాహితీవేత్తలను కలిసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. భావి పరిశోధకులకు ఇవి కరదీపికలే. అరుణ గారికి అభినందనలు. శుభాకాంక్షలు.
మయూఖ పత్రిక సాహిత్యసేవ అభినందనీయం.