ఆ అరుణోదయం..తప్పక వస్తుంది..! (ఓ శుభహ్ కభీ తో ఆయేగి !- ) –సాహిర్ లూథియాన్వి ఉర్దూ కవిత.
స్వేచ్చానువాదం–గీతాంజలి.
–––––—————————–
ఇన్ని చీకటి యుగాల నిరీక్షణ తరువాత…రాత్రి పరదాలు కూడా తొలిగాక..
దుఃఖపు మేఘాలు సాంతం కరిగిపోయాక.. అప్పుడు సంతోషపు సముద్రాలు పొంగిపొర్లుతాయి.
ఆకాశం నృత్యం చేస్తుంది.. ఈ భూమి పాటలు పాడుతుంది…
ఇక చూడు..ఆ ఉదయం తప్పక వస్తుంది.
ఏ రోజు కోసమైతే మనం క్షణం క్షణం మరణిస్తూ బతికామో.. ఏ రోజు కోసం..అమృతం లాంటి కాలాల్లో కూడా విషాన్ని గుక్కలు గుక్కలుగా గుటకలు వేశామో..
ఆ రోజు..
ఆకలి..దాహం గొన్న మన ముంగిళ్లలో మనం కోరుకున్న ఉదయం మెరిసిపోతూ నిలుస్తుంది !
నిరాశ పడకు మిత్రమా..
ఇప్పుడు కనీసం భూమికున్న విలువైనా రక్తమాంసాలున్న మనిషికి లేకపోవచ్చు గాక !
మన ఆకాంక్షలకూ కనీస గుర్తింపు లేకపోవచ్చు.
కానీ ఏదో ఒకనాడు ఈ భూమ్మీద..మనిషి గౌరవాన్ని అబద్ధపు ధనంతో కొలవని రోజు మాత్రం తప్పక వస్తుంది.
ఎప్పుడైతే… పాపపు డబ్బు కోసం ఆడదాని శరీరం అమ్మ బడదో..
ఎన్నడైతే ఆమె ఆకాంక్షలు నలిచి వేయ బడవో…
ఆరోజు వచ్చినప్పుడు.. ఈ నిస్సిగ్గు సమాజం సిగ్గుతో చితికిపోతుంది.
ఆ ఉదయం ఎప్పటికైనా వచ్చి తీరుతుంది.
అయితే వినండి .,
ఆ ఉదయాల్ని మేమే తెస్తాం !
తెచ్చి తీరుతాం..
అది మా వల్లే సాధ్యం అవుతుంది !
ఏ రోజైతే భూమి తిరగ బడి ప్రతిజ్ఞ చేస్తుందో..నిరపరాధులు జైళ్ల నుంచి విముక్తమవుతారో..
పాపపు గృహాలు బద్దలు అవుతాయో.. అన్యాయపు శృంఖలాలు తెగిపోతాయో..
ఆ ఉదయాల్ని మేమే తెస్తాము!
ఏ సమాజంలో అయితే నేరస్థులు పోషింపబడరో…
ఎక్కడైతే పిడికిలి బిగించి నినదించే
చేతులు ఖండించబడవో.. ఎక్కడ ఆత్మ గౌరవంతో నిటారున నిలబడ్డ శిరస్సులు అణిచివేయబడవో..
ఎప్పుడైతే ..జైళ్లు..బందీలు లేని ప్రజా స్వామిక పరిపాలనలో ఉంటామో..
ఆ ఉదయాన్ని మేమే తెస్తాం.
ఏ రోజైతే …. పొలాల్లోంచి రైతుల.. మిల్లుల నుంచి కార్మికుల శ్రమకు సమాజంలో సరైన విలువ కట్టబడుతుందో ..
నిస్సహాయులైన..గూడు లేని బీద జనం అంతా ఉపిరాడని బిలాల్లాంటి ఇరుకు ఇళ్ళల్లోంచి బయట పడతారో ..
అప్పుడు… నిజంగానే ఆ క్షణాల్లో.. లోకం అంతా శాంతీ..సంతోషాలనే పుష్పాలతో అలంకరించుకుని హర్షాతిరేకలతో మునిగిపోతుంది.. ఆ అరుణోదయాల్ని మేమే తెస్తాం!
ఖచ్చితంగా
తెచ్చి తీరుతాం.!
ఇది రేపటి లోకానికి మా వాదా!
స్వేచ్చానువాదం-గీతాంజలి
———-స్వేచ్చానువాదం- – గీతాంజలి
ఇలాంటి లోకం దొరక్కపోయినా నష్టం లేదు !(ఏ దునియా అగర్ మిల్ భి జాయే తో క్యా హై?)- సాహిర్ లూథియాన్వి ఉర్దూ కవిత.
స్వేచ్చానువాదం- గీతాంజలి.
–—————————————
ఒక్క రాజ ప్రసాదాలు..సింహాసనాలు… వజ్రాల కిరీటాలు మాత్రమే కనిపించే లోకం., హృదయం ఉన్న మనుషులే కనిపించని లోకం ..
దొరికితేనేం.. దొరక్కపోతే నేఁ?
మనిషికే శత్రువుగా మారిన ఈ సమాజం..
ఈ డబ్బు పిచ్చి ఉన్న మనుషులు మాత్రమే నిండిన ఈ లోకం..దొరికితేనేం..
దొరక్కపోతేనేఁ?
వాళ్ళ మొఖాల్లోకి చూడండి ఒకసారి..
ఇక్కడ ప్రతి ఒక్కరూ గాయపడి ఉన్నారు.. దాహం గొని ఉన్నారు.
కళ్ళలో అయోమయం..గుండెల్లో విషాదం నిండిపోయి ఉన్నారు.
ఓహ్హ్..ఇది మనుషులు ఉంటున్న స్థలమేనా ..? లేక
దుఃఖం ఒక్కటే పొంగి పోరాలుతున్న శోక మందిరమా ?
అసలు.. దయేలేని ఈ లోకం..
దొరికితేనేం… దొరక్క పోతేనేం?
మనిషి అస్థిత్వమే ఇక్కడ ఒక ఆటబొమ్మ అయి పోయి..
ఈ దునియా అంతా… ఈ రోజు శవాలు తిరగాడే బస్తీగా మారిపోయింది.
మీకు తెలుసా…ఇప్పుడు ఇక్కడ మనిషి జీవితం కంటే మరణమే చవకగా దొరుకుతుంది.
ఈ లోకం..ఇలాంటి కరడు గట్టిన లోకం..కారుణ్యమే లేని లోకం ..
దొరక్క పోతేనేం?
దొరక్క పోతేనేం?
మనిషికి విలువే ఇవ్వని
లోకం దొరికితేనేం.. అసలు దొరక్కపోతేనేఁ?
స్త్రీ పురుషుడికి జన్మ నిస్తుంది కానీ-(ఔరత్ నే జనమ్ దియా మర్ధో కో…)సాహిర్ లూథియాన్వి ఉర్దూ కవిత.
స్వేచ్చానువాదం-గీతాంజలి
ఈ పురుషులు ఎలాంటి వాళ్ళో చూడండి…
స్త్రీలు వాళ్ళకి జన్మ నిస్తే..వాళ్ళు మాత్రం
ఆ మాతృమూర్తులను
కృతజ్ఞతే లేకుండా ఎప్పుడంటే అప్పుడు
ఇష్టం వచ్చినట్లు
నలిచి .. నాశనం చేసి., బాజారులో డబ్బుల కోసం తూకం వేసి మరీ అమ్మకానికి కూర్చోబెడతారు.
హృదయంలో పెట్టుకొని పూజించాల్సిన ఆమెతో..విలాసవంతుల దర్బారుల్లో నగ్నంగా నాట్యం చేయిస్తారు.
చెప్పు కోవడానికి కూడా.. ఎంత సిగ్గుచేటంటే., ఆమె మర్యాదస్తులనబడే వాళ్ళకే పంచ బడుతుంది.
ఎంత వివక్షో చూడండి..
పురుషులేమో ఎంత నేరాలనైనా బాహాటంగా చేయచ్చు కానీ ..స్త్రీకి ఏడవడం కూడా నిషిద్ధమే !
మగవాడికి పడుకోవడానికి లక్ష పరుపులు… స్త్రీకి మాత్రం ఒకటే చితి !
మగవాడికి ఉల్లాసంగా ఉండడమే హక్కు అయితే స్త్రీకి జీవించడమే ఒక శిక్ష..
మగవాడి విలాసాలకు ఆకాంక్షలనే పేరైతే .,
స్త్రీలు సజీవంగా అగ్నికీలల్లో దహించుకుపోవడాన్ని ఆమె త్యాగం అన్నారు !
ఆమె ఏ పెదవులతో అయితే ప్రేమించిందో..ఆ పెదవులతోనే పురుషుడు వ్యాపారం చేస్తున్నాడు !
ఆమె ప్రేమను పొందే అర్హతే లేని వాడు !
వాడికి..
ఏ స్త్రీ గర్భం అయితే ప్రాణం పోసిందో ..ఆ గర్భాన్నే సరుకుగా మార్చాడు కృతజ్ఞతా హీనుడు!
ఏ దేహం నుంచి చిగురై మొలిచాడో…ఆ దేహాన్నే అగౌరవ పరిచాడు !
ఆఖరికి…
ఆమె మొఖాన్నో రొట్టె ముక్క విసిరేసి..దానికే కృతజ్ఞత చూపమన్నాడు.
అసలు ఈ లోకంలోని ప్రతి నిస్సిగ్గు మగవాడు..ఆ దేవత ఒడిలోనే పెరుగుతాడు..
అది అర్థం కాని పురుషుడు
వికృతమైన మైదానాల గుండా నడిచి..ఎడారి దారుల్లోకి నడుస్తాడు.
తప్పులు చేస్తూనే పోతాడు.
చివరాఖరికి వాడి ధూర్తపు కోరికలన్నీ ఆడవాళ్లు చేసే పాపాలుగా మారిపోతుంటాయి.
ఎంత వైచిత్రి అంటే… స్త్రీని లోకంలో కారణజన్మురాలిగా భావిస్తారు..
వెలుగులు చిమ్మే
దేవతగా కొలుస్తారు
అయినా ఆమె పాపాత్మురాలిగానే చూడ బడుతుంది.!
ఆమె ఎంతటి దూరదృష్టవంతురాలైన తల్లి అంటే… ఓపిక నశించి ఓడిపోయి., కొడుకుల దయా భిక్ష అనే శయ్య మీద ఒరిగిపోతుంది…
ఎంత కఠినాత్ముడు ఈ మగవాడు?
జన్మనిచ్చిన స్త్రీని .. బాజారులో నిలబెట్టాడు
ఇష్టమొచ్చినట్లు కాలితో నలిచి..నాశనం చేసి., చివరికి తృణీకరిస్తాడు
నీచ పరుస్తాడు !
జీవితంలో.. స్త్రీ ప్రేమకి ఎన్నటికీ పాత్రుడు కాలేని వాడు కదా ఈ మగవాడు?
పద ప్రియా.. అపరిచితులం అయిపోదాం !-
(— *చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్ఞబీ బంజాయే హం దోనో *…సాహిర్ లూథియాన్వి ఉర్దూ కవిత) తెలుగు స్వేచ్చానువాదం – గీతాంజలి.
::::::::::::::::::::::::::::::::::::::
ప్రియా..పద ..ఒక్కసారిగా నువ్వూ., నేనూ అపరిచితులం అయిపోదాం.!
మళ్ళీ గుర్తు పట్టుకోలేనంతగా పరాయి వాళ్ళమైపోదాం!
ఇక అప్పుడు.. నీ నుంచి నేను హృదయ సంబంధమైన ..
ఒక్క ఆశ కూడా పెట్టుకోబోను.
నువ్వు కూడా నా వైపు ఇష్టం గా చూడకు మరి!
ఇద్దరం అపరిచితులం అయిపోయామనుకో…. నా మాటల్లో పొరబాటున కూడా నా మనసులో నీ మీద ఎంత మోహబ్బాత్ ఉందో., దొర్లకుండా జాగ్రత్త పడతాను.
నా కళ్లల్లో.. పొరబాటున కూడా నా హృదయంలో గౌరవంగా..ఎంతో ప్రియంగా దాచుకున్న మన ప్రణయ రహస్యాన్ని బయటపడనీయను.
పద.. ప్రియా అందుకే
ఒక్కసారిగా …అపరిచితులం అయిపోదాం !
నాకు తెలుసులే… నాతో కలిసి ముందడుగు వేయడానికి బహుశా..నిన్ను కూడా ఏదో చిక్కుముడి ఆపుతూ ఉండి ఉంటుంది.
కులమో.,మతమో., ఏదో ఒకటి. బాధ పడకు! నాతో కూడా ఈ పాడు లోకం
నువ్వు నాకు పరాయి దానివనే చెప్తున్నది.
నీ నుంచి దూరంగా తరిమి కొడుతున్నది.
ఇక ..నాకు నీతో గడిపిన దివారాత్రుళ్ల జ్ఞాపకాల తోడు తప్ప ఏం మిగిలిందని చెప్పు?
అందుకే ప్రియా .,పద ఒక్కసారిగా అపరిచితులం అయిపోదాం!
ఎందుకంటే ..మన పరిచయమే
ఒక మనోవ్యాధిలా మారినప్పుడు.. దాన్ని మరిచిపోవడమే ఉత్తమం కదా.,?
బంధం భారంగా మిగిలినప్పుడు .. దాన్ని తెంచుకోవడమే మంచిదేమో ?
అసలు..ఇన్ని యుగాలు గడిచిపోయినా .. మన ప్రేమ కథను కలయిక అనే ముగింపు దాకా కూడా తీసుకెళ్లలేక పోతే…
పద ప్రియా.. కనీసం ఒక అందమైన మలుపైనా ఇచ్చి… ఇద్దరం కలిసి దాన్ని సాగనంపుదాం !
అందుకే నా ప్రియురాలా…
పద ఇద్దరం ఒక్కసారిగా అపరిచితులం అయిపోదాం !
మళ్లీ .. ఎప్పుడైనా ..ఎక్కడైనా ఎదురుపడినా గుర్తు పట్టలేనంత పరాయి వాళ్ల మైపోదాం !!
ప్రముఖ ఉర్దూ కవి సాహిర్ లూథియాన్వి అసలు పేరు అబ్దుల్ హయీ. 1921 మార్చ్ 8 న జన్మించి అక్టోబర్ 25 1980 లో మరణించారు.
పంజాబ్ లోని లూథియానా లో ముస్లిం గుజ్జర్ భూస్వామి కుటుంబంలో జన్మించారు.
లూథియానా ప్రభుత్వ కళాశాల లో చదువుకున్నారు. సాహిర్ ఉర్దూలో గజల్స్,నజమ్స్ అంటే ఉర్దూలో కవిత్వం రాయసాగారు.1943లో సాహిర్ లాహోర్ లో స్థిరపడ్డాక 1945 లో ఉర్దూ భాషలో తన తొలి గ్రంధం “తల్కియా ” ముద్రించారు. సాహిర్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ , ప్రగతిశీల ఉద్యార్థి సంఘాల్లో సభ్యుడు గా ఉంటూ ప్రగతిశీల కవిత్వం రాసారు. ఆదాబ్-ఎ-లతీఫ్,సాకార్,ప్రితలరి,సవేరా లాంటి పత్రికల కు సంపాదకులుగా పనిచేశారు.
కమ్యూనిజం మీద తన ఖచ్చితమైన అభిప్రాయాలను వెల్లడించినందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఆయన మీద అరెస్ట్ వాఁరెంట్ పంపింది.
1949లో దేశవిభజన తరువాత సాహిర్ లాహోర్ నుంచి ఢిల్లీ కి వలస వచ్చేసి., తరువాత బొంబాయి కి మారిపోయి అంధేరి లో ఉంటూ అక్కడే సినిమాల్లో పాటలు ..బయట ప్రగతిశీల కవిత్వం రాయసాగారు. గుల్జార్,కృషన్ చందర్ లాంటి ప్రముఖ ఉర్దూ కవులు పరిచయం అయ్యారు.ప్యాసా,అజాది కి జిందగి, బాజి, నౌజవాన్,ఇజాత్,మన్ కి ఆంకే, దాస్థాన్, దాగ్, ఫిర్ శుభహ్ హోగి,ఇన్సాఫ్ కా తరాజు, లాంటి సినిమాల్లో గొప్ప పాటలు రాశారు సాహిర్. ఆయన పుస్తకాలు — పర్చాయియా, కలాం -నేను సాహిర్ లూథియాన్వి, గాతా జాయే బంజారా,తలకియా.
మెహముద్.కె.టీ, అబ్బాస్ కె.ఏ, హసన్,లాంటి రచయితలు సాహిర్ కవిత్వం,షాయరీలు,గజల్స్ మీద .,ఆయన వ్యక్తిత్వం జీవితం, ప్రేమ వ్యవహారాల మీద (ప్రముఖ పంజాబీ రచయిత్రి అమృతా ప్రీతం సాహిర్ల సఫలం కానీ ప్రేమ జీవితము )చాలా పుస్తకాలు రాసారు .అమృతా ప్రీతంతో విఫలం అయిన ప్రేమ సాహిర్ తో గొప్ప ప్రేమ,వియోగ కవితల్ని రాయించింది.
సాహిర్..జాతీయ ఉద్యమం మీద..పాకిస్థాన్ లో ఆటంకావాదులు చెందిన దాడులు,హత్యాకాండలను ఖండిస్తూ .,దేశవిభజన ముందు..తరువాత రెండుదేశాల్లో చెలరేగిన హింసాకాండల మీదా.. స్త్రీల మీద జరిగిన అత్యాచారాల మీద..యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టం,రక్తపాతం చూసి చలించిపోతు అనేక కవితలు రాసారు.రక్తం నాడైతేనేమి,పరాయి వారిదైతేనేమి?యుద్ధం వద్దు, పర్చాయియా అనే కవితలు యుద్ధ వ్యతిరేక కవితలు రాసారు . తల్లిని వదిలేసి ఒంటరీదాన్ని చేసిన తండ్రి మీద ద్వేషం ఆయన్ని భారత దేశంలో స్త్రీల దుర్భర స్థితులు అర్థం చేసుకునేలా చేసింది.అందుకే..పితృస్వామ్యాన్ని వ్యతిరేకిస్తూ.. దుర్భరమైన వేశ్యల జీవితాలకు చలించి పోతూ చాలా కవితలు (ప్యాసా సినిమాలో) రాసారు. కమ్యూనిజం కు అనుకూల ప్రకటనలు.. కవిత్వం కూడా రాసి వివాదాస్పద సందర్భాల్లోకి వెళ్లారు. ఆకలిమీద..పీడితవర్గ పక్షాన నిలబడి అనేక కవితలు రాసారు.(తాజ్ మహల్) 1980 అక్టోబర్ 25 సాహిర్ హార్ట్ ఎటాక్ తో మరణించారు.