1960లో వచ్చిన ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’లో ఆత్రేయ వ్రాసిన ‘ఎవరో అతడెవరో’ పాట ఒక రసాత్మక గీతం. బృందావన సారంగ రాగంలో పెండ్యాల నాగేశ్వరరావు దీనిని స్వరపరచారు. ఘంటసాల, సుశీల పాడిన యీ పాటను ఎన్టీఆర్, సావిత్రి లపై చిత్రీకరించారు దర్శకులు పి.పుల్లయ్య.
పల్లవి : ఎవరో అతడెవరో, ఆ నవ మోహను డెవరో, నా మానస చోరుడెవరో, ||ఎవరో||
తొలి చూపులలో వలపులు చిలికి దోచిన మగసిరి దొర ఎవరో ||తొలి||
అరయక హృదయమునర్పించితినని, ఆదరించునో ఆదమరచునో ||ఎవరో||
వల రాజా? కలువల రాజా? కాడే కన్నుల కగుపడినాడే!
అకలంకుడే…. హరిణాంకుడు కాడే ||అక||
మరి ఎవరో ఏమరినానో ||ఎవరో||
శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా లక్ష్మిదేవి పద్మావతిగా అవతరించారు. పద్మావతి శ్రీనివాసుని చూచినప్పటి నుండి తన హృదయాన్ని అర్పించింది. శ్రీనివాసుడే శ్రీ మహావిష్ణువని తెలియక ‘ఎవరో అతడెవరో’ అని పాడుకున్నదని ఆత్రేయగారి వాదన. అంటే మానవ రూపంలో అవతరించిన లక్ష్మీదేవికి శ్రీనివాసుడు నవమోహనుడిగా, తన మానస చోరుడిగా అగుపించాడు. తన హృదయాన్ని అర్పించినది. అతడు కూడా తన కోరికను మన్నిస్తాడో లేదో అని బాధపడుతుంది. పైగా తాను ఇష్టపడిన శ్రీనివాసుడు మన్మథుడా (వలరాజా) దేహం లేని మన్మథుడైతే మరి తన కళ్ళకు కనపడుతున్నాడే! చంద్రుడా (కలువల రాజా), జింక చిహ్నం మచ్చగా గల చంద్రుని (హరిణాంకుడు) లాంటివాడు కాదే, మచ్చలేనివాడు (అకలంకుడు) (హరిణాంకుడు) లాంటి వాడు కాదే, మచ్చలేనివాడు (అకలంకుడు) కదా తాను ఇష్టపడినవాడని పద్మావతి ఊహించుకొన్నదని భావుకుడైన ఆ్రతేయగారి ఆలోచన. కాని ఆలోచిస్తే శ్రీ మహావిష్ణువుని ఆత్రేయగారు అతని కంటె స్థాయిలో చిన్నవారైన మన్మథునితోను, చంద్రునితోను పోల్చడం, విష్ణువు గుండెలపై ఉన్న శ్రీవత్స చిహ్నం(మచ్చ) గురించి ఆమె మరచిపోయి అకలంకుడు అని భావించడం, ఇతరులు విమర్శించడానికి అవకాశం ఇస్తుంది.
‘చలువలు కురిసే జాబిలి !
చెలి కలతను తెలిసీ కలుగద జాలి
కరుణ చూపి కబురు తెలిపి రమ్మనవా నను చే కొమ్మనవా’
తన మనోగతాన్ని చందమామకు తెలిపి, నీవు చల్లని వెన్నెల కురిపించే వాడివి– “ఆతడు నా బావని నీకు తెలిసినప్పటికి నా మీద జాలి కలగడం లేదా ? నాపై దయ చూపి, శ్రీనివాసుని నేను ప్రేమిస్తున్నాననే కబురు ఆయనకు చెప్పి ” తనను పెళ్ళి చేసుకొమ్మని చెప్పమని రాయబారిగా వెళ్ళమని చంద్రుణ్ణి, పద్మావతి బ్రతిమాలుతుంది.
‘కరుణ చూపి కబురు తెలిపి’
చరణంలో ఉర్దూ పరమైన
‘ కబురు ’ _ తాను ఉపయోగించినందుకు ఈ పాట రికార్డింగు పూర్తయ్యాక, ఆత్రేయగారికి గుర్తొచ్చి, బాగా బాధపడ్డారట. వెంటనే తనకు గురు సమానుడైన రచయిత మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి వద్దకు వెళ్ళి, తన మనసులోని బాధను చెప్పారట ఆత్రేయ. అందుకు మల్లాదివారు ‘ఏం ఫర్వాలేదు. ఆ కాలంలో బీబీ నాంచారి కూడా ఉన్నది. ఆమె ముస్లిం కదా, బాధపడవద్దని ఆత్రేయగారిని ఊరడించారట. అంటే ఎవరూ కూడ పసిగట్టలేనటువంటి ప్రయోగాన్ని ఉపయోగించినందుకు ఆత్రేయగారు బాధపడిన తీరు చూస్తుంటే ఆయన నిజాయితీ తెలుస్తుంది. ఇక్కడ ఊరడించిన మల్లాది వారి ప్రతిభ , సాహిత్య విశ్లేషణ శక్తి , ఆ రోజుల్లో ఎందరికో ఆయన పెద్ద దిక్కైన గొప్పతనమూ గమనించవచ్చు.
పద్మావతి తన బాధను చందమామతో వెల్లడించిన సమయంలోనే శ్రీనివాసుడు కూడ
‘ఎవరో తానెవరో ఆ నవమోహిని ఎవరో నా మానస హారిణి ఎవరో ||ఎవరో||
నందన వనమున నానందములో తొలిసారిగ పూచిన పూవో
||నందన||
తొలకరి యవ్వన మొలికిన నవ్వో మనసిచ్చినదో నను మెచ్చినదో
ఆ జవ్వని ఎవరో తానెవరో ఆ నవ మోహిని ఎవరో నా మానస హారిణి
ఎవరో ఎవరో తానెవరో ’ అని తన మనో గతాన్ని వ్యక్తపరచాడు. ఆత్రేయగారి భావనలో పద్మావతి, శ్రీనివాసుడు ఇద్దరు కూడా ‘Both are Sailing in the same boat’ ఒకే విధమైన అనుమానంతో ఆందోళన తో ఉన్నారు.
పద్మావతి : నవ మోహనుడు అంటే శ్రీనివాసుడు : నవమోహిని అంటున్నాడు. ఇంకా ఇంకా
మానస చోరుడు : మానస హారిణి
తొలి చూపులలో : నందన వనముననానందములో తొలి పూవో …
వలపులు చిలికి దోచిన తొలిసారిగ పూచిన పూవు
మగసిరి దొర : మనసిచ్చినదో,
నను నర్పించితినె : ఆదరించునో
మెచ్చినదో : ఆదమరచునో
ఆత్రేయగారి ఆలోచన, అంతర్మథనం, అంతర్ముఖత్వం మనకు ఈ పాటలో స్ఫురిస్తున్నాయి. కనుకనే 60 స.లు గడిచిపోయినప్పటికి ఈ పాట సాహితీ మర్యాదను అందుకుంటున్నది.
– ఏలూరు అశోక్ కుమార్ రావు, హైదరాబాద్
ఆచార్య ఆత్రేయ (కిళాంబి వేంకట నరసింహాచార్యులు)
తన గోత్రాన్ని కలం పేరుగా పెట్టుకొని సినీరంగ ప్రవేశం చేశాడు ఆత్రేయ . నాటక రచయిత, సినిమా మాటల, పాటల రచయిత, దర్శకుడు 1961 సంవత్సరంలో వాగ్దానం సినిమాను నిర్మించారు. తెలంగాణ మహాకవి దాశరథి ని మద్రాసు పిలిపించుకొని
“నా కంటిపాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా “పాటను వ్రాయించుకున్న కవిప…
4 comments
“కాని ఆలోచిస్తే శ్రీ మహావిష్ణువుని ఆత్రేయగారు అతని కంటె స్థాయిలో చిన్నవారైన మన్మథునితోను, చంద్రునితోను పోల్చడం, విష్ణువు గుండెలపై ఉన్న శ్రీవత్స చిహ్నం(మచ్చ) గురించి ఆమె మరచిపోయి అకలంకుడు అని భావించడం, ఇతరులు విమర్శించడానికి అవకాశం ఇస్తుంది.” అన్నారు.
బాగున్నది.
కానీ పద్మావతికి ఆయన శ్రీమహావిష్ణువు అని తెలియదుగా!
పోనీ తెలుసు అనుకొందాం.
ఏ ఉపమానాలైనా వాడి విష్ణువును పోలుద్దామంటే ఆయనను మించిన వారెవరున్నారని పోల్చడానికి?
రామరావణయుద్ధానికి ఉపమానం దొరక్క ఆదికవే రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ అన్నారుగా!
పాపం ఆత్రేయ గారెంత?
అందువల్ల నాయకుని పోల్చాలంటే చంద్రుడు మరుడు ఇంద్రుడు మొదలైన వీళ్లే దిక్కని మీకు తెలియంది కాదు.
ఏమంటారు?
తప్పులుంటే మన్నించండి
RAO MSRL గారు, మీ విశ్లేషణ చాలా బాగున్నదండీ. ప్రతి విషయాన్ని ప్రశంసిస్తూ వ్రాస్తే , మీ లాంటి సాహిత్య పిపాసకులతో ఇలా చర్చించే అవకాశం ఉండేది కాదు.
“సహృదయులై”న
ఏలూరు అశోక్ కుమార్ రావు గారూ!
మీకు నా కృతజ్ఞతలు. నమోవాకాలు.
శ్రీ ఏలూరు అశోక్ కుమార్ రావు గారు ఆత్రేయగారి కవిహృదయాన్ని చక్కగా ఆవిష్కరింపజేశారు. నమస్కారపూర్వక అభినందనలు.